చారీజీ మహారాజ్
1927 – 2014
చారీజీ అని పిలువబడే శ్రీ పార్థసారథి రాజగోపాలాచారి, దక్షిణ భారతదేశంలోని (చెన్నై సమీపంలో) వాయలూర్ లో జన్మించారు.
పద్దెనిమిదేళ్ల వయసులో భగవద్గీతపై ఉపన్యాసం విన్నప్పుడు చారిజీగారి ఆధ్యాత్మిక స్పృహతో కూడిన ఆకాంక్షలు మేల్కొన్నాయి, కానీ ఆయన తన చదువును కొనసాగించి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పట్టభద్రులయ్యారు. ఆయన మొదటి ఉద్యోగం కెమికల్ ఇంజనీరింగ్‌లో చేసి, తరువాత యుగోస్లేవియాలో ప్లాస్టిక్ తయారీ పద్ధతులను అధ్యయనం చేస్తూ రెండు సంవత్సరాలు గడిపారు.
1955 లో వివాహం చేసుకుని, అదే సంవత్సరం T. T. కృష్ణమాచారి గ్రూప్ ఆఫ్ కంపెనీలలో చేరారు, త్వరలోనే ఆ గ్రూప్‌లోని ఒక కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన ఉద్యోగరీత్యా భారతదేశం, విదేశాలలో విస్తృతంగా పర్యటించాల్సిన అవసరం ఉండేది. వృత్తిపరంగా, ఆ తరువాత హార్ట్‌ఫుల్‌నెస్ మార్గదర్శకులుగా కూడా జీవితాంతం కొనసాగించిన ప్రయాణాలతో ఆయన ఒక ప్రపంచ ప్రయాణ నమూనాను స్థాపించారు.
1964లో చారిజీకి హార్ట్‌ఫుల్‌నెస్ పద్ధతి పరిచయం చేయబడింది, చాలా నెలల తర్వాత ఆయన బాబూజీని కలిశారు. బాబూజీతో తన మొదటి సమావేశం నుండి, తన పుస్తకం, 'నా గురువర్యులు' లో, " నా గురువును, నన్ను నా లక్ష్యం దిశగా నడిపించే ఏకైక వ్యక్తిని నేను కనుగొన్నానని నాకు వెంటనే, చూడగానే, సహజసిద్ధంగా తెలిసిపోయింది", అని వ్రాసారు.
తన కుటుంబ, వ్యాపార బాధ్యతలను నిర్వర్తిస్తూనే, చారీజీ పట్టుదలతో తన ఆధ్యాత్మిక సాధన చేస్తూ, బాబూజీ యెడల తీవ్రమైన భక్తిభావం కలిగి ఉన్నారు. మానవత్వం పట్ల బాబూజీ భవిష్యదృష్టిని సాకారం చేసుకోనే దిశగా ఆయనకు సహాయం చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నారు.
భారతదేశం అంతటా విస్తృత పర్యటనలలో బాబూజీతో పాటు చారీజీ వెళ్లారు. బాబూజీ, ఆయన బోధనల పట్ల ఆకర్షితులైన యూరోపియన్లు భారతదేశానికి రావడంతో, 1972లో బాబూజీ చేసిన యూరప్, అమెరికాలకు మొదటి విదేశీ పర్యటనల పరంపరలో చారీజీ అనుసరించారు. వారు ఆధ్యాత్మిక అభిలాషులను కలుసుకున్నారు, ధ్యానం నిర్వహించారు, ప్రసంగాలు ఇచ్చారు, ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వారి మధ్య ప్రేమపూర్వకమైన పరస్పర అనుబంధం పెరిగింది.
తన జీవితకాలంలోనే, బాబూజీ చారిజీని తన వారసునిగా పేర్కొన్నారు. 1983లో బాబూజీ మరణించినప్పుడు, చారీజీ ఆయన ఆధ్యాత్మిక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. బాబూజీ ప్రారంభించిన పనిని కొనసాగించడానికి, మానవత్వం కోసం ఆయన భవిష్యదృష్టిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన నాయకత్వంలో బాబూజీ స్థాపించిన సంస్థ భారతదేశంలో, వందకు పైగా ఇతర దేశాలకు విస్తరించింది. చారీజీ మరణించే సమయంలో సభ్యత్వం - బాబూజీ కాలంలో ఉన్న 5,000 నుండి 500,000 కు పెరిగింది. ఇది ఎల్లప్పుడూ స్వచ్ఛంద సేవపై ఆధారపడి ఉంది, విరాళాల ద్వారానే నిధులు సమకూర్చబడతాయి.
బాబూజీ నిర్వచించిన ఆదర్శ మానవుడిగా - ప్రాచ్య (భారతీయ) హృదయంతో కూడిన పాశ్చాత్య మనస్సుగా - చారిజీ తనను తాను నిరూపించుకున్నారు.
అద్భుతమైన వక్తగా మాత్రమే కాకుండా, ఆయన పని చేసే సామర్థ్యం దాదాపు మానవాతీతంగా అనిపించేది. ఆయనను చూడటానికి అసంఖ్యాకంగా వచ్చేవారిని, తన ప్రయాణాలలో కలుసుకున్న అసంఖ్యాకమైన వారిని, స్వేచ్ఛగా తన వద్దకు వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడడంలో ఆయన ప్రసిద్ధి చెందారు.
ఆయనను వ్యక్తిగతంగా కలుసుకున్న సమావేశాలు వారి జీవితాలను మార్చివేశాయో కథలుగా కథలుగా కొన్ని వేలమంది వ్యక్తులు చెబుతుంటారు.
ఆయన వందకు పైగా పుస్తకాలు వ్రాసి ప్రచురించారు. తన ప్రియమైన బాబూజీకి నివాళిగా ఆయన వ్రాసిన 'మై మాస్టర్' ( నా గురువర్యులు) పుస్తకం 20 భాషల్లోకి అనువదించబడింది. ఇతర పుస్తకాలలో బాబూజీతో ఆయన చేసిన విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డైరీలు, స్వీయచరిత్ర, భారతదేశం, విదేశాలలో తన మాస్టర్ బోధనను సూచిస్తూ, వాటిని విస్తృతపరుస్తూ ఆయన చేసిన చర్చలకు సంబంధించిన అనేక సంపుటాలు ఉన్నాయి.
2008 నుండి చారిజీ ఆరోగ్యం క్షీణించింది. 2010లో, చారిజీ తన అనుచరులందరికీ తన మరణానంతరం కమలేష్ డి. పటేల్ తన వారసుడు అని తెలియజేయడానికి ఆనాటి సాంకేతికతను ఉపయోగించారు. మొదటి నుండే, ఎలాంటి సందిగ్ధత లేకుండా పూర్తి సహకారం ఉండేలా నిర్ధారించుకోవడానికి ఆయన మార్గం సుగమం చేసారు. ఆ రోజు నుండి, ఆయన కడపటి రోజుల వరకు, వారిద్దరూ దాదాపు ఎప్పుడూ కలిసే ఉన్నారు.
20 డిసెంబర్ 2014న చారిజీ మరణించారు. 'దాజీ' అని ఆప్యాయంగా పిలుచుకునే శ్రీ కమలేష్ డి. పటేల్‌కు గ్లోబల్ హార్ట్‌ఫుల్‌నెస్ మార్గదర్శక బాధ్యతను అందించారు.