01-07-2023 UJJAIN, MP
అవినీతిపరునికి సుఖం ఉండదు
ఏదో ఒక గందరగోళం ఉండే ఉంటుంది. బాబూజీ మహరాజ్ కోర్టులో పనిచేసేవారు. నిజాయితీపరులను వెనుకకు లాగడానికి, ఇబ్బంది పెట్టడానికి కొందరు ఉంటూనే ఉంటారు. వారు ముందుకు వెళ్ళనీయరు. అయితే మరి నిజాయితీ లేకుండా ఉండాలా? ‘మీరు కూడా నిజాయితీగా ఉండకండి’ అని నేను సమాధానం చెప్పాలని కనుక మీరు ఆశిస్తే, మీరూ అందరిలాగే అవినీతిపరులు అవుతారు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సిందే. అవినీతిపరులు కూడా మూల్యం చెల్లిస్తారు. వారిలో ఉన్నంత అంధకారం ఇంకెక్కడా కనిపించదు. కొన్నిసార్లు ప్రజలు అడుగుతారు, అవినీతిపరులైన వారందరూ ప్రగతి సాధిస్తున్నారు, నేను సత్యాన్ని నమ్ముకుని వెనుకబడిపోయాను అని. అంటే దీని వెనుక కూడా నేను ఆ విధంగా చేయాలి అనే కోరిక ఉన్నట్లు. మీలో నిజాయితీగా పనిచేస్తున్నానని నమ్మకం ఉంటే ఎందుకు ఆందోళన చెందుతారు? అది మీకు భగవంతుడు ఇచ్చిన ఒక కానుక. దానితో రాజీ పడొద్దు. మీరు వారిని లోతుగా పరిశీలిస్తే కనుక వారిపై మీకు దయ కలుగుతుంది. వారిలో ఎంతటి అంధకారం ఉందో! ఎంత బాధ ఉందో! అని. ఎవరైతే లంచం తీసుకుంటారో, అవినీతి చేస్తారో, వారి అంతరంగంలో ప్రేమా, శాంతి ఉండవు. బయటికి మాత్రం అతనికి ఇన్ని కార్లు ఉన్నాయి. అన్ని కార్లు ఉన్నాయి. అతనికి ఇన్ని ఇళ్లు ఉన్నాయి అని అనుకుంటాం. కానీ అదంతా శూన్యమే. అతని హృదయమే ఖాళీగా ఉంది. అక్కడ సుఖం లేదు. అక్కడ ఉన్నదంతా నరకమే. మీరు వారి పట్ల అసూయ చెందకండి. వారు సుఖంగా ఉన్నారు. నేను నిజాయితీగా ఉండి వెనుకబడిపోయాను అని అనుకోకండి. వారి అంతరంగంలోకి చూడండి. వారు విచారంలో మునిగిపోయి ఉంటారు. అవి విచారగ్రస్తమైన విషయాలని మీరు అర్థం చేసుకుంటారు.
భయం నుండి విముక్తి
లోపల భయం…భయం ఎందుకు కలుగుతుంది? భయం అన్నది లేకపోతే మీరు చేయకూడని పనులను కూడా చేసేస్తూ ఉంటారు. ఒక చక్కని సమతుల్యత ఉంటుంది. జల చక్రం, అగ్ని చక్రం దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. జల చక్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ధైర్యాన్ని కలుగచేయడం లేదా భయం పుట్టించడం. జల చక్రం ఇక్కడ ఉంటుంది. నేటి రాజకీయ నాయకుల్లో బహుశా భయం అన్న పదమే లేకుండా పోయింది. వారు ఇతరుల గురించి పట్టించుకోకుండా, తాము చేయదలచుకొన్నది, ఎటువంటి భయం లేకుండా చేసేస్తూ ఉంటారు. భయం అనేది ఉంటుంది. అది మనకు భగవంతుడు ప్రసాదించినది. మన హృదయంలో భయం వంటి భావన ఏర్పడినప్పుడు ‘ఇది ఎందుకు కలిగింది?’ అని హృదయం చెప్పేది వినండి. ఏదైనా మంచి కార్యం చేయాలి అనుకున్నప్పుడు భయం అనేది కలగదు. భయం ‘ఈ పని చేయవద్దు’ అనే సంకేతాన్ని మనకు ఇస్తుంది. మనం చేసే పని మంచిది అయితే మనకు ప్రకృతి నుండి ఆ పని చేయడానికి కావలసిన ఒక విధమైన శక్తి లభిస్తుంది.
02-07-2023 Daaji Talk- Kanha
గురు పౌర్ణమి దాజి ప్రసంగం
గౌరవనీయులు, నేను ‘బడేభయ్యా’ గా పిలిచే డా. దీపక్ చోప్రా, మీ అంతర్దృష్టితో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు! అలాగే మీరు సరిగ్గా, దృఢంగా మీ సందేశంలో చైతన్యంపై ప్రసంగించారు. మన అందరికీ ఏదో ఒక మానసిక స్థాయిలో చైతన్యం ఉందనేది అర్థమవుతుంది… అది రెండు మహాసముద్రాల మధ్య ఉండే ఒక పలుచని నీటిపొర వలే ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల మధ్య ఉన్నట్లు చాలా ఇబ్బందికరంగా ఈ చైతన్యమనే సన్నని నీటి పొర ఉంటుంది. మనం అధిచైతన్యంలోకి (సూపర్ కాన్షియస్) ఎగరవలసి ఉంది… అలాగే ఉపచైతన్యం లోకి (సబ్ కాన్షియస్) మునక వేయవలసి ఉంది. అలా మనకు లభ్యమయ్యే చైతన్యాన్ని విస్తరింప చేసుకోవాలి. నిత్య జీవితంలో మనం ‘బ్రాడ్ బ్యాండ్’ అని పిలిచే విశ్వచైతన్యంతో మార్పిడి చేయగలగాలి. మనకున్న ఈ వ్యక్తిగత చైతన్యంతో, మనసు, బుద్ధి, అహం లను ఎలా సూక్ష్మీకరించగలం? ఎలా పరిణతి చెందగలం? అనేదే మన హార్ట్ఫుల్నెస్ విధానం. మనసును ఎలా సూక్ష్మీకరించుకోవాలో
చాలాసార్లు వివరించడం జరిగింది. అలాగే బుద్ధి, అహం కూడా ఎలా చక్కగా శృతి చేసుకోవాలో, క్రమానుగత పరిణామ ఫలితంగా అవి ఎలా రూపాంతరం చెందుతాయో వివరించడం జరిగింది. వికాస ఫలితంగా మనసు, బుద్ధి, అహం ల పనితీరు పరిణామం చెందుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఈ చైతన్య వికాసంలోని నిరంతర మార్పులను అనుభూతి చెందుతాం. ఈ మూడు ప్రాథమిక కారకాల వల్ల చైతన్యం ప్రభావితం చెందుతుంది. మీరు తప్పుగా ఆలోచిస్తే, తప్పుగా వివేకాన్ని ఉపయోగిస్తే… అలాగే ‘నా ఇష్టం’ అని అంటే, అప్పుడు మీ చైతన్యానికి ఏమవుతుంది? అది కుచించుకుపోతుంది. ప్రేమైక హృదయాలు దేన్నైనా వదిలేయడానికి సిద్ధమవుతాయి. ఎప్పుడూ లేదు, కాదు అని చెప్పని హృదయాలు… ధ్యానం ద్వారా నిరంతరం విస్తరిస్తాయి. మనసు ఆలోచన స్థాయి నుండి మరింత లోతైన స్థాయి అయిన అనుభూతికి పరిణామం చెందుతుంది. బుద్ధి క్రమంగా తెలివితేటలు, అంతర్దృష్టి ద్వారా, వివేకంగా పరిణామం చెందుతుంది. ఇది హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ద్వారా జరుగుతుంది. ప్రతిరోజు క్లీనింగ్ చేసుకుంటూ పొరలు పొరలుగా మన గతం తాలూకు సంస్కారాలని, ముద్రలని తొలగించుకున్నప్పుడు… మనం ఉపచేతనలోకి లోతుగా మునక వేయగలుగుతాం. అదే సమయంలో అహాన్ని ఉపయోగించుకుంటూ మనల్ని మరింత ఉన్నతీకరించుకుంటాం. అహం కూడా మనల్ని నిరోధిస్తుంది. దానికి ఎన్నో ముఖాలు, పార్శ్వాలు ఉన్నాయి. మన స్వీయ చైతన్యాన్ని, విశ్వ చైతన్యంతో ముడి వేసినప్పుడు, అహాన్ని మన స్వీయ అభివృద్ధికి ఉపయోగించవచ్చు. మన ప్రియతమ గురువర్యులు బాబూజీ మహరాజ్ మన అందరిలో ఇలా ఆలోచన రేకెత్తిస్తారు. చిన్నతనంలో పిల్లలు బొమ్మలతో ఆడుతూ ఆనందిస్తారు. అది వారికి ఆటవిడుపు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యుక్త వయస్సు, యువత ప్రణయ కలాపాలలో మునిగి తేలతారు. దాంట్లో తప్పేమీ లేదు. పిల్లలకు బొమ్మలు, పెద్దలకు ప్రణయం, కుటుంబాలను ఏర్పరచుకోవడం. శృంగారం ప్రేమగా రూపాంతరం చెందుతుంది. ఆటల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మహర్షులు, యోగులు, వారి వారి చైతన్యంతో ఆటలాడుతారు. వారికి వారి చైతన్యమే ఆటవస్తువు. వారు చైతన్యంతో ఆడుకుంటారు. బాబూజీ మహరాజ్ ఒక ప్రాథమిక ప్రశ్నపై మనల్ని ఆలోచించమని సవాల్ విసురుతున్నారు. చైతన్యానికి ఆధార భూతమైనది ఏది? ధ్యానంలో లోతుగా మునిగి, చైతన్యానికి మూలం ఏమిటో మనల్ని కనుగొనమంటున్నారు. చైతన్యానికి మూలాధారాన్ని అనుభూతి చెందమని కోరుతున్నారు. శాస్త్రపరంగా చైతన్యం అంటే, మన అవగాహన. సరళంగా నిర్వచించాలంటే మన ఎరుక, మన అవగాహనా స్థాయి. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయనప్పుడు మన అవగాహన తగ్గుముఖం పడుతుంది. అయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఒక చిన్న పిల్లవాడు అంతర్దృష్టితో విషయాలను ఎలా తెలుసుకోగలుగుతున్నాడు? దేన్నీ ముట్టుకోకుండా, వినకుండా లేదా ఏమీ చేయకుండా కేవలం కళ్ళు మూసుకొని చుట్టుపక్కల జరిగేవి ఎలా గ్రహించగలుగుతున్నాడు? ఇంద్రియాలకు అతీతంగా ఎలా చక్కగా గ్రహించగలుగుతున్నాడు? అదే మన బ్రైటర్ మైండ్స్ సాధన! అదృష్టవశాత్తూ మనం ఆ సామర్ధ్యాలను 15 సంవత్సరాల వయసు వరకే ఉపయోగించగలుగుతున్నాం.15 ఏళ్ల పైన మనం ఆ శక్తిని కోల్పోతాం. పనిచేయని నాడులు క్రమంగా తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి కదా! ‘ఉపయోగించనివి పోగొట్టుకుంటాం’ అనే నానుడి ఉంది కదా! కనుక మన పిల్లలకు 15 సంవత్సరాలు దాటకముందే శిక్షణను ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. దానివల్ల అంతర్దృష్టి పెంపొందుతుంది. మన సోదరి ఏకాత్మ అభియాన్ గురించి మాట్లాడింది. కొన్ని నెలల క్రితం ఇది ప్రారంభించబడింది. మన వాలంటీర్లు, ప్రిసెప్టర్లు… ప్రియమైన సోదరి సులోచన గారు దయచేసి నిలబడండి… ఆమెకు 80 సంవత్సరాలు. ఆమె హైదరాబాద్ నుండి స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ, మధ్యప్రదేశ్ లోని ఎన్నో గ్రామాలకు ప్రయాణించారు. ఆమె ఏ గ్రామానికి వెళ్లినా, ’80 సంవత్సరాల అమ్మమ్మ, వాళ్లకు ధ్యానాన్ని బోధించడానికి వచ్చిందని’ అక్కడి ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్కడివాళ్ళు బాబూజీ కోసమో, హార్ట్ఫుల్నెస్ కోసమో కాకుండా… ఒక 80 సంవత్సరాల స్త్రీ హైదరాబాద్ నుండి కారును స్వయంగా నడుపుతూ మధ్యప్రదేశ్ కు వచ్చిందని… ఆ తరువాతి గ్రామ ప్రజలు కూడా ఆమె కోసం వేచి ఉండేవారు. ధన్యవాదాలు… నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది. సులోచన ఆంటీయే కాకుండా ఎంతోమంది యువత కూడా ఇందులో పాల్గొన్నారు. ఎటువంటి వసతులు లేని చోట – భారతీయ గ్రామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా! వాళ్లు అక్కడ సర్దుకుపోయారు. వాళ్లంతా ఎంతో అద్భుతంగా పనిచేసి 12 మిలియన్ల మందికి, అంటే 1.2 కోట్ల మందికి మన పద్ధతిని పరిచయం చేశారు. కేవలం ఒక్కసారి కాదు, వాళ్లు ఆ గ్రామంలో గడిపిన మూడు రోజుల్లో అక్కడి ప్రజలచే కనీసం 3 నుండి 4 సార్లు ధ్యానం చేయించారు. ఇక ఇప్పుడు వాళ్లకు వాట్స్అప్ సమూహాలు ఏర్పడ్డాయి. సాంకేతికత పుణ్యమా అని ఇప్పుడు దూరం నుండి కూడా సత్సంగ్ నిర్వహించే అవకాశం ఏర్పడింది. ఇది ఇంతటితో అయిపోలేదు. 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, మన హార్ట్ఫుల్నెస్ సంస్థ ఎంతోమందిచే ప్రశంసించబడింది. మరీ ముఖ్యంగా మన ఉపరాష్ట్రపతి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి మనపై ఎన్నో, ఎన్నెన్నో ప్రశంసలను, గుర్తింపును కుమ్మరించారు. అంతర్జాతీయ సమాజం కూడా హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ ఒకటి ఉందని, ఇక్కడ శిక్షణ ఉచితమని అర్థం చేసుకుందని విశ్వసిస్తున్నాను. చోప్రా ఫౌండేషన్ లాగే మన సంస్థ కూడా ఒక లాభాపేక్ష లేని సంస్థ కనుక మనం ధ్యానం నేర్పడానికి ఎటువంటి రుసుము వసూలు చేయము. మన ప్రాచీన సంప్రదాయం ఎంతో సరళం. బ్రహ్మవిద్యకు ఎవరమూ వెలకట్టలేం. వెలకట్టి చెల్లించగలిగితే ఇక మీకు భగవంతుని అవసరం ఏముంది? భగవాన్ శ్రీకృష్ణుని జయంతి రోజున, అంటే సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమిగా జరుపుకునే వేళ… మేము ఇదే ఏకాత్మ అభియాన్ కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్రంలో, అలాగే ఉత్తరప్రదేశ్ లోని బులంద్ ఖండ్ ప్రాంతంలో ప్రారంభిస్తున్నాం. మన ఈ తదుపరి కార్యక్రమం మరింత ఉత్సాహంగా మొదలుపెట్టడానికి, వింటున్న మీ అందరినీ దయచేసి సిద్ధంగా ఉండమని కోరుతున్నాను. అయితే మధ్యప్రదేశ్ ను మరువకండి. మనం ప్రారంభించిన దాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాలి. అక్కడి గ్రామీణులతో టచ్ లో ఉండి, వారి జీవనశైలిని ధ్యానం ద్వారా మెరుగుపరచడానికి సహాయం చేయండి. వారి ఆర్థిక సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి తోడ్పడండి. నూతన వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ఇష్టపడే వారిని… వారి పొలాలలో మరింత దిగుబడి పెంచడానికి సరిపడే మెలకువలను నేర్చుకోవడానికి, మనం వారిని కాన్హాకు స్వాగతించాలి. ఆధ్యాత్మికమే కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళ స్థాయి మెరుగు పడేందుకు మనం కృషి చేయాలి.
DAAJI AT TANA ON 09-07-2023
చక్రాలు - వాటి ఉనికి, విశిష్టత
మనం ధ్యానించినప్పుడు మీరు ఇవన్నీ అనుభూతి చెందుతారు. నిజానికి 16 మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ 16 ముఖ్యమైనవి. బౌద్ధ ధర్మం ప్రకారం కూడా కొన్ని ఉంటాయి. హిందూ ధర్మం, చక్రాలు ఏడు అంటుంది. సాధారణంగా ఏం జరుగుతుందంటే, సహస్ర దళ కమలం కు చేరినప్పుడు… అది ఈ ప్రాంతంలో నడి నెత్తిపై ఉంటుంది. దీన్నెలా గుర్తించాలంటే, మీ రెండు చెవుల కొనల నుండి పైకి ఒక గీత అర్థగోళాకారంగా గీస్తే…. అవి కలిసే ప్రాంతంలో నడి నెత్తిన మధ్యలో ఈ ఎస్ డి కే ఉంటుంది. అక్కడి నుండి ముందుకు రెండు వేళ్ళు వెడల్పుతో ఇంకొక చక్రం ఉంటుంది. ఇంకొక రెండు వేళ్ళ వెడల్పుతో ముందుకు 9వ చక్రం ఉంటుంది. ఇదంతా కూడా మనలో వినమ్రతను పెంచడం కోసమే. అదే సహస్ర దళ కమలానికి వెనుకకు రెండు వేళ్ళ వెడల్పుతో 11వ చక్రం, అలాగే ఇంకో రెండు వేళ్ళు వెనక్కి, దీన్నే బ్రహ్మ రంధ్రం అంటారు. కాబట్టి దీని వెనుక కూడా చక్రాలు ఉంటాయి. మన సాహిత్యం ఇంచుమించు అన్నింటిలో సైతం, బ్రహ్మ రంధ్రం గురించి ప్రస్తావన ఉంది. మన పెద్దవాళ్ళు చాలామంది ఈ ప్రాంతంలో పిలకను ధరించేవారు. ఒకవేళ ఆత్మ మోక్షస్థితిని పొందగలిగితే, సరిగ్గా ఈ ప్రదేశం నుండే ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది. లేకపోతే ఆత్మ ఏ రంధ్రం నుండైనా కళ్ళు, ముక్కు, నోరు లేదా మలమూత్ర రంధ్రాల నుండైనా బయటకు వెళ్ళిపోతుంది. కనుక శరీరంలో ప్రాథమికంగా ఏడు చక్రాలు ఉంటాయి. అయితే మీరు మరింత గాఢంగా లోనికి అన్వేషించినప్పుడు, ఉదాహరణకు హృదయ చక్రం పంచభూతాలతో నిర్మించబడి ఉంది. మన ఎడమ చనుమొన నుండి నాలుగు వేళ్ళ వెడల్పున క్రింద, పైన, అలాగే కుడి చనుమొన క్రింద, పైన ఈ చక్రాలు ఉంటాయి. ఆ విధంగా మనం వాటిని కొలిచి, గుర్తించి, అనుభూతి కూడా చెందవచ్చు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నాలుగవ చక్రం లేదా ప్రారంభం నుండి ఏడవ చక్రం…. కుడివైపు ఛాతీ పై భాగంలో – అక్కడ మన ప్రాణాహుతి సహాయంతో మీరు ధ్యానించినప్పుడు….. సహజంగానే ఆ చక్రం వద్దకు చేరినప్పుడు, మీకు చాలా అంధకారం అనుభవమవుతుంది. అక్కడ మీ అంతరంగంలో ధైర్యం అనే గుణం వ్యక్తం అవుతుంది. అలాగే అగ్ని చక్రం వద్ద అంటే ఎడమ చనుమొన నుండి నాలుగు వేళ్ళు పైకి మీరు ప్రాణాహుతి సహాయంతో అనుభూతి చెందినప్పుడు… మీ హృదయంలో ఎంతో కరుణ, ప్రేమ వ్యక్తమవుతాయి. అదే ఈ చక్రం వద్ద రాజీ పడితే, అంటే శుద్ధి జరగకపోతే వ్యక్తులంటే అయిష్టత అలాంటివి ఏర్పడతాయి. కాబట్టి ఒక చక్రం స్వభావాన్ని ఎలా గుర్తిస్తాం? సంవత్సరాల తరబడి ధ్యానిస్తున్న వాళ్లు, అభ్యాసీల ద్వారా ఈ సమాచారాన్ని సంగ్రహించి అనుసంధానిస్తాం. ఈ చక్రం వద్ద ఇలా అనుభూతి కలుగుతుంది, ఇక్కడ ఇలా, ఈ రంగు, ఈ స్వభావం… ఆ చక్రం వికసించనప్పుడు దానికి సరిగ్గా వ్యతిరేకమైన స్వభావం ఏర్పడుతుంది. కనుక జీవితమంతా ఈ ద్వంద్వాల గురించే! శాంతి ఉన్నప్పుడు అశాంతి కూడా ఉంటుంది. అందుకే మనం జీవితంలో యోయో లాంటి అసమానతలు ఉంటాయి. ఒకసారి ఆనందం, ఇంకోసారి విచారం, మంచిగా, చెడ్డగా, ఇష్టాలు, అయిష్టాలు అలా…ఈ చక్రాలన్నీ మనం గుర్తించవచ్చు. అలాగే ప్రతి చక్రాన్ని కొలవవచ్చు కూడా! స్పిరిచువల్ అనాటమీ గురించి రాబోయే నా పుస్తకంలో ఇవన్నీ ప్రస్తావించబడ్డాయి. విషయపరిజ్ఞాన పరంగా ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు అనుభూతి పరంగా మనం ముందుకు వెళ్లాలి. జ్ఞానం మనకు పుస్తకాల ద్వారా లభిస్తుంది. అది మంచిదే అయితే ఒక యోగి అనుభూతికై తపించాలి. మరి అనుభూతి కూడా సరిపోతుందా? నేను ఎన్నోసార్లు చెప్పినట్లు మీరు ఒక మూడు నెలలు ఒక సంపన్నుడైన వ్యక్తి ఆతిథ్యంలో గడిపి తిరిగి మీ ఇంటికి వస్తే…. మీకు ‘అంత సంపద ఉంటే బాగుండు’ అని అనిపిస్తుంది కదా! మీ స్నేహితులతో అక్కడ మీరు గడిపిన సమయాన్ని వర్ణిస్తారు కదా, ‘నా స్నేహితునికి ఎంతో సంపద ఉంది’ అని. అటువంటి అద్భుత ఆతిథ్యాన్ని మీరు అనుభూతి చెందారు కదా! మీ హృదయాంతరాళాలలో మీకు, నేను కూడా అంత ఐశ్వర్యవంతుడిని అవ్వాలి అని అనిపిస్తుంది. అలాగే ధ్యానంలో మనకు ఎన్నో స్పురిస్తాయి. కొంత సమయం గడిచాక, దివ్యానుభూతులను అనుభవించడమే కాక తానే దివ్యంగా మారాలని అనిపిస్తుంది. సాధారణంగా జరిగేది ఏమిటంటే యోగమార్గంలో నడిచే ఎక్కువమంది, వారు ఎస్ డి కె ను చేరిన పిమ్మట… అక్కడ ఉండే అత్యంత అందమైన సుగుణం, అలాగే ఆత్మహత్యా సదృశ్య, భయంకర లక్షణం అదే సత్ చిత్ ఆనందం – సచ్చిదానందం అనే లక్షణం! ఇది ఆత్మహత్యా సదృశ్యమని ఎందుకన్నానంటే, యోగి అన్నవాడు నిరంతరం పరిణామం చెందాలి. అతను బంధించబడకూడదు. హనీ ట్రాప్ అనేది మంచిది కాదు. ఆనందం మీ ప్రయాణంలో అడ్డుపడకూడదు. మీరక్కడ ఆగిపోతారు. అప్పుడు మీరు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు. కనుక చాలామంది యోగులు అక్కడే చిక్కుబడి నందువల్ల మరింత ముందుకు, తర్వాత చక్రానికి వెళ్ళలేక పోయారు.
ప్రాణాహుతి ద్వారా మనిషిలో మార్పు
దానికన్నా మొదట ప్రాణాహుతి అంటే ఏమిటనేది అర్థం చేసుకోవాలి. అలాగే ధ్యానం అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోవాలి. ధ్యానం అంటే మనసుకు అతీతంగా వెళ్లడం. ఒక సాధారణ మానవుని పరిభాషలో చెప్పాలంటే, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం మెడిటేషన్ అంటే ఒకే ఆలోచనపై దృష్టిని కేంద్రీకరించడం. కానీ ధ్యానం అంటే మనసుకు అతీతంగా వెళ్లడం. ఆలోచన అనే క్రియను దాటి ముందుకు వెళ్లడం. కనుక మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఆలోచనతో ప్రారంభించినా, దాన్ని దాటి ముందుకెలా వెళ్లాలి? ఇది మొదటిది. రెండవది ప్రాణాహుతిని సంస్కృతంలో ప్రాణస్య ప్రాణః అని నిర్వచిస్తారు. అంటే ఏమిటి? అన్నస్య అన్నః – అన్నమయ కోశం సంతులన ఆహారం ద్వారా పోషింప బడుతుంది. మరి ఆత్మకు పోషణ ఎలా? మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఇవన్నీ జ్ఞానం, మననం, చింతనం ద్వారా పరిపుష్టం కావించబడతాయి. మీరు ధ్యానించవచ్చు! కానీ ఆధ్యాత్మిక బీజం పడకుండా, మొక్కగా అభివృద్ధి చెందడం… నీరు లేకుండా విత్తనం నుండి మొక్క పెరగదు కదా! ప్రాణస్య ప్రాణః! ఆ ఆధ్యాత్మిక బీజానికి పోషణనిచ్చే నీటిలా పనిచేస్తుంది. అది గురు కృప ద్వారా ఆత్మను కప్పి ఉంటుంది. ఇప్పుడు మనం నాటిన బీజం పెరిగి చైతన్యం అనే ఒక పెద్ద వృక్షంగా ఎదిగినప్పుడు, వ్యక్తిలో వచ్చిన మార్పుని అందరూ ప్రశంసిస్తారు. ఉదాహరణకు, మన పాత నమ్మకాలు… ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు, ఆ సంఘం/ జాతి వ్యక్తులు అలా ప్రవర్తిస్తారు. లేకపోతే దేవతలు…ఇలా ఈ నమ్మకాలన్నీ కరిగి పోయినప్పుడు మీరు ఒక నూతన దృక్పథంలో గమనించగలుగుతారు. ఇది ఎలాగంటే మీరు కళ్లద్దాలు ధరించినప్పుడు అవి మురికిగా ఉన్నప్పుడు మీరు స్పష్టంగా వస్తువులను చూడలేరు. అలాగే మన ఇష్టాలు, జ్ఞానం, భావాలు, దృష్టి అన్నీ ఆత్మనుండే వ్యక్తమవుతాయి. ఆత్మ ఇటువంటి పరిమితులతో మసకగా అస్పష్టంగా ఉన్నప్పుడు…. విక్షేపాలని మనం పిలిచే మాలిన్యాలు, సంక్లిష్టతలు ఈ ప్రాణాహుతి ప్రసరణ ద్వారా సులభంగా తొలగించుకోగలుగుతాం. కాబట్టి ప్రాణాహుతి రెండు విధులను నిర్వహిస్తుంది. ఒకటి మనం పోగుచేసుకునే మాలిన్యాలను, సంక్లిష్టతలను శుద్ధీకరించడం. రెండవది మనకి లభించిన ఆధ్యాత్మిక బీజానికి పోషణ ఇవ్వడం. మనం శరీరానికి పోషణ ఇవ్వగలం. మనసుకి పోషణను ఇవ్వగలం. మన హృదయాన్ని సంతృప్తి పరచగలం. మరి ఆత్మకు పోషణ సంగతి? అదే ప్రాణస్య ప్రాణః కాబట్టి ప్రాణ ప్రవాహం అనేది ఆత్మకు స్వయంగా పోషణ ఇవ్వడం.
అపరాధ భావాన్ని ఎలా తొలగించుకోవాలి?
ఏ భగవంతుడు కూడా మన అపరాధ భావాన్ని తొలగించలేడు. అపరాధ భావనకు కారణం మీరే. ‘ఇది చేయాల్సింది, అది చేయవలసింది, ఫలానా వాళ్లు జీవించి ఉండగా ఇది చేసి ఉండాల్సింది….. నేను నా తల్లి జీవించి ఉండగా ఆమె కాళ్లు ఒత్తాల్సింది’ అని ఆమె మరణించాక మీలో సహజంగానే అపరాధ భావం కలుగుతుంది. మనం ఎప్పుడైతే చేయవలసింది చేయకపోవడం వలన ‘చేసి ఉండాల్సింది’ అని భావిస్తామో…. అది మీ వ్యక్తిగత బాధ్యత. దాన్ని ఎవరూ తీసివేయలేరు. మీరే దానిపై పని చేసుకోవాలి. మీ గుండెలవిసేలా ఏడ్చి ‘నన్ను క్షమించు’ అని భగవంతుడిని ప్రాధేయపడినప్పుడే అది జరుగుతుంది. కేవలం కన్నీళ్ళ ద్వారా మాత్రమే మీ అపరాధ భావాన్ని కరిగించి వేసుకోగలరు. రాత్రి నిద్రించేముందు భగవంతుడిని ఆ విషయానికి క్షమించమని, తిరిగి ఆ పొరపాటు చేయనని ప్రార్థించాలి.
ఆధ్యాత్మిక ప్రగతిలో వివిధ గురువుల అవసరం ఉందా?
మీరు జోడు గుర్రాల స్వారీ చేయగలరా? లేదు. అయితే మీకు సమాధానం దొరికింది. ఒక వ్యక్తి సమర్ధుడైతే మీరు సంతోషంగా ఉండండి. మీరు పదిమంది గురువులను పొంది ఉండి, ఎవరో ఒకరు నన్ను తీసుకువెళ్తారు అనటానికి వీలు లేదు. ఇదంతా సంపూర్ణ శ్రద్ధ గురించి. మీకు ఒకరి పట్ల శ్రద్ధ లేకపోతే పదిమందీ మీకు సహాయం చేయలేరు. మీరు పూర్తిగా విశ్వసించిన ఒక్కరిని మాత్రమే ఎంచుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు ఆ వ్యక్తి మీ గురువుగా అవుతాడు. ఆ వ్యక్తి మీ శ్రద్ధను ఆకర్షించగలిగాడా? ఆ వ్యక్తి మీకు సహాయం చేయగలడని కనీసం శాంతిస్థాయి, మోక్షస్థాయినీ లభించేలా చేయగలడని మీ హృదయానికి నమ్మకం కలిగించగలిగాడా? మోక్షానికి అతీతంగా ఇంకా చాలా ఉంది. మీరు ఈ గురువు సరియైన వాడా, కాదా అనేది పరీక్షించవలసి ఉంది. కనీసం మూడుసార్లు ఆ గురువును పరీక్షించుకొని మీరు అప్పుడు నిర్ణయించుకోండి, ఇది సరైన నిర్ణయమా కాదా అని. ఆ వ్యక్తి సరి అయిన వాడని మీరు నిర్ధారించుకున్నాక, మీ శక్తులన్నీ అక్కడే పెట్టుబడిగా పెట్టండి.
ప్రయత్నం ఒకేలా చేసినా ఫలితం భిన్నంగా ఎందుకు?
మనం ప్రతి ఒక్కరికి ఒకే విధమైన ఫలితాలను ఆశిస్తున్నాం. రసాయన శాస్త్రంలో కూడా ‘A’ అనే కెమికల్ ‘B’ అనే కెమికల్ తో కలిసినప్పుడు మనం A, Bల కలయికతో కూడిన దాన్ని ఆశిస్తాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి విభిన్నంగా ఉంటారు. అప్పుడు వారు వారి కృషిని కలిపినప్పుడు ఫలితాలు కూడా విభిన్నంగా ఉంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నేను ఫార్మసీ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు, నా స్నేహితులు కూడా ఫార్మసీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. న్యూయార్క్ సిటీలో ఉన్న మా స్నేహితులందరం ఇంచుమించు ఒకే సమయంలో ఫార్మసీ బిజినెస్ మొదలు పెట్టాం. విజయం విషయానికి వస్తే, నేను వారందరి కంటే భిన్నంగా ఉన్నాను. కాబట్టి దానికి చాలా కారణాలు ఉన్నాయి. వ్యాపారంలో విజయం సాధించటానికి మూడు విషయాలు ముఖ్యం అంటారు. అవి ప్రదేశం, ప్రదేశం, ప్రదేశం. భౌతికంగా ఇదే వ్యాపారానికి విజయాన్నిస్తుంది. ఆధ్యాత్మికతలో మన ప్రయత్నాల గురించి మాట్లాడేటప్పుడు, మీరు ఒక గంట ధ్యానం చేస్తారు. మీ అబ్బాయి ఒక గంట, అమ్మాయి ఒక గంట, మీ భర్త ఒక గంట, మీ అమ్మగారు ఒక గంట ధ్యానం చేస్తారు. కానీ ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా? మీ వైఖరి, మీలో ఉన్న భక్తి! మీ అబ్బాయి ‘ఏమిటి ఇదంతా! నేను మా అమ్మతో కలిసి ధ్యానం చేయాలా? ఓరి భగవంతుడా!’ అనుకోవచ్చు. వారు ధ్యానం చేయవచ్చు కానీ లోపలి నుండి వారు తిట్టుకుంటున్నారు. అటువంటప్పుడు మీరు ఏ విధమైన ఫలితాలను ఆశిస్తారు? కాబట్టి వైఖరి నిర్ణయిస్తుంది. భౌతిక ప్రపంచంలో ప్రదేశం వ్యాపారాన్ని నిర్ణయిస్తే, ఇక్కడ చాలా విషయాలు ప్రభావం చూపిస్తాయి. ఏదో ఒకదాని వలన అని మనం నిర్ణయించటానికి లేదు, చాలా కారణాలు ఉన్నాయి.
శిక్షకుని ఆవశ్యకత
సరే గానీ, మీరేం చదివారు? ఇంజనీర్, డాక్టర్ అయ్యేందుకు ఏదో చదవాలి కదా! ఆయన టీచర్ గా పని చేస్తున్నారు మాస్టర్! సరే, టీచర్ అయితే స్కూల్లో టీచర్ అవసరం ఎంతో ఉంది కదా! లేదా? టీచర్ ఆవశ్యకత ఎంతో ఉంది. విద్యార్థులను అత్యుత్తమంగా తయారు చేయడానికి ఉపాధ్యాయుడు ఎంతో అవసరం. ఏం చేయాలో ఏం చేయకూడదో పిల్లలకు బోధించాలి. అలాగే ఆధ్యాత్మిక విద్యలో సైతం నేను ఇంతకుముందు పంచుకున్నట్లు, భౌతిక శరీరానికి పోషణ అవసరం. చక్కగా తినాలి. పోషకాహారం తీసుకోవాలి. అదే మానసికంగా టీచర్ లైన మీరు, మన తల్లిదండ్రులు మానసిక పోషణ ఇస్తారు. వారు మనకి బోధిస్తారు. మనతో చర్చిస్తారు. మంచి మంచి పుస్తకాలను చదువుతాం. అంతరంగంలోని ఆత్మకు పోషణ, విలువలు ఎలా ఇస్తాం? ఒక సరైన శిక్షకుని ద్వారానే సాధ్యం. చక్రాల గుండా ప్రయాణించడంలో గురువు మనకు సహాయం చేస్తారు. వారు అప్పటికే సాధించిన ఉన్నతుల నుండి చూడడంలో మనకు సహాయపడతారు. ఆధ్యాత్మిక మార్గం గుండా వారు ఇప్పటికే ప్రయాణించారు కనుక ఆ జ్ఞానాన్ని మీతో పంచుకోవడం వారికి తేలిక అవుతుంది. అది లేకుండా మీకు ఇబ్బంది అవుతుంది. కనుక నేను చెప్పదలచుకున్నది ఏమంటే, చిన్న చిన్న విషయాలకు సైతం మనకు మార్గదర్శి, శిక్షకుడు అవసరం. వీటి కోసం ఎంతో మంది ఉన్నారు. అయితే ఆధ్యాత్మిక గురువుని, శిక్షకుని కనుగొనడం ఎంతో కష్టం. మన సహజమార్గంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది శిక్షకులు అందరూ స్వచ్ఛంద సేవకులే! వాళ్లు మీకు హృదయ పూర్వకంగా తమ సేవలను అందిస్తారు. బదులుగా వారు మీ నుండి ధనం గానీ, కనీసం కృతజ్ఞతలు గానీ అస్సలు కోరరు. ఎందుకంటే ఈ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ స్థాపించబడిన ఉద్దేశ్యమే ఎంతో సరళం. బ్రహ్మవిద్య అమ్మేందుకు కాదు. ఒక సీటును 50 లేదా 100 లేదా 1000 డాలర్లకు అమ్మడం అనేది కాదు. బ్రహ్మవిద్యను కొనాలంటే మీరెంత చెల్లించగలరు? మీరు చెల్లించగలిగితే మీకు బ్రహ్మ విద్య అవసరం, ఉపయోగం ఏముంది? శిక్షకులు అవసరమే! అయితే వాళ్ళు నిస్వార్థ శిక్షకులై ఉండాలి. స్వంత లాభం కోసం స్వార్ధపరుడైన శిక్షకులు ప్రవేశిస్తే వారి నుండి పారిపోండి. వారిని అంగీకరించకండి.
సరియైన గురువును ఎంచుకోవడానికి అనుసరించవలసిన పద్థతి
మొట్టమొదటిది మీరు అతని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అపారమైన శాంతిని, మీ స్వగృహంలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఆ వ్యక్తి సరియైన వాడు కానప్పుడు మీ హృదయం ఒప్పుకోదు, భారమౌతుంది. ‘లేదు, ఇక్కడ కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం’ అంటుంది. ఇది మరొక సూచన. ఎప్పుడైతే మీరు పరమానందాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను ఇంకా తేలికదనాన్ని అనుభూతి చెందుతారో ఆ వ్యక్తి సరియైన వాడు. ఇంక రెండో విషయం. ఏ క్షణంలో ఈ ఆర్థిక లావాదేవీలు వస్తాయో ‘నేను నీకిది నేర్పిస్తాను, దీనికింత డబ్బు’ అంటూ……. ఈ క్రియ, ఆ క్రియ నేర్పించడానికి ఫీజు వసూలు చేస్తారో అటువంటి గురువుల నుండి దూరంగా పారిపోండి. ఆధ్యాత్మికతలో ఇది పనిచేయదు. ఇది అలా కాదు. భగవంతుడిని మోసం చేసినట్లవుతుంది. మనం ఎవరో మన తరపున పూజ చేసి మన ప్రేమను భగవంతునికి వ్యక్తపరచుకోవాలను కోలేము. మీకు మీరే చేయాలి. కాబట్టి ఎవరైనా గురువు మీకోసం నేనిది చేస్తానంటే అక్కడనుండి పారిపోండి.
హృదయమే పశ్యసి
మనం హృదయంపై ధ్యానం చేయటం లేదు. దివ్యజ్యోతి మూలం యొక్క ఉనికిని ఊహించుకుంటున్నాము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ‘గీత’ను బోధించినప్పుడు, “నీ విశ్వరూప దర్శనాన్ని చేసుకోగలిగిన నేను అదృష్టవంతుడిని… కానీ భవిష్యత్తులో ప్రజల సంగతేమిటి, వారు నిన్ను ఏ విధంగా అనుభూతి చెందగలుగుతారు?” అని అర్జునుడు అడిగాడు. అప్పుడు ప్రభువు అర్జునునితో చాలా సరళంగా ‘హృదయమే పశ్యసి’ అంటే ‘నన్ను మీ హృదయంలో అనుభూతి చెందండి’ అన్నారు. మనం చూడటానికి ప్రయత్నించటం లేదు. భగవంతుని ఉనికిని మన హృదయంలో అనుభూతి చెందటానికి ప్రయత్నిస్తున్నాం. భావనలు అనేవి అనంతమైనవి. అవి మన స్వంత వైఖరులపై ఆధారపడి ఉంటాయి. ఇక రెండో విషయం, ఆయన ‘నేను అందరి హృదయాలలో ఉన్నాను’ అంటారు. అందువల్లనే మనం మన హృదయంలో భగవంతుణ్ణి అనుభూతి చెందగలమని ఆశిస్తూ ధ్యానం చేస్తాం. మనం హృదయంపై ధ్యానం చేయటం లేదు, ఆ భగవంతుని ఉనికిపై ధ్యానిస్తున్నాం. మనం ‘ప్రభూ! మీరెవరో నాకు తెలియదు కానీ నేను మీ ఉనికిని అనుభూతి చెందాలనుకుంటున్నాను’ అనే భావనతో ధ్యానం చేస్తున్నాం. హిందూ సంస్కృతి ఎంతో సుందరమైనది. మనం పరిమితమైన ఆకారంతో మొదలుపెట్టి పరిమితి లేని నిరాకారం దిశగా కదులుతాం. మనం పరిమితమైన ఒక ఆలోచనతో మొదలుపెట్టి పరిమితి లేని భావనలకు అతీతంగా ముగిస్తాం. కాబట్టి మనం ఆకారం, ఆలోచనతో మొదలుపెట్టినా పరిమితి లేని దానితో ముగిస్తాం. ఎక్కడో ఒకచోట మొదలు పెట్టాలి. అనంతమైన, పరిమితి లేని దానితో ప్రారంభించగలిగితే మీరు ధ్యానించవలసిన అవసరమే లేదు. అర్థం అయిందా? ఇది చాలా మంచి ప్రశ్న. థాంక్యూ!
16-07-2023 Filter the thoughts - Kanha
లోనికి గ్రహించే వాటిని ఫిల్టర్ చేద్దాం!
ప్రణామాలు! నేడు ఒక గొప్ప అతిథి, శ్రీ కార్తికేయన్ గారు, సిబిఐ డైరెక్టర్ మన మధ్య ఉన్నారు. ఆయన ఎన్నో విశిష్టతలు కలిగిన, ఒక అద్భుతమైన వ్యక్తి, అలాగే కేపిఎంజి సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్ కి చెందిన ముఖ్యమైన వ్యక్తులు కూడా మన మధ్య ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ నేను వాళ్లతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. మన యోగా విద్యార్థులు ఈరోజే పట్టభద్రులు అవుతున్నారు. అందరికీ హృదయపూర్వక ప్రణామాలు! ఈ మాస్క్ ను వాడేటప్పుడు ఎంతో ఇబ్బందికరమైన భావన నాలో ఏర్పడుతుంది. ఇది దుమ్మును, క్రిములను, బ్యాక్టీరియాని వడ పోస్తుంది (ఫిల్టర్ చేస్తుంది)… ఇవన్నీ ఎప్పుడూ గాలిలో ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి వీటి ఉనికిని భరించగలుగుతాడు. అనారోగ్య సమస్య గల వ్యక్తి వీటివల్ల ఇబ్బంది పడతాడు. ఇదొక రక్షణాత్మక చర్య. ఇటువంటి ప్రాపంచిక విషయాన్ని నేనెందుకు ఇక్కడ పంచుకుంటున్నాను? శ్వాస కోసమే కాకుండా, మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో మన విచక్షణా శక్తుల ద్వారా, ఆలోచించే ప్రక్రియ ద్వారా… మనం లోనికి గ్రహించే అన్నిటినీ వడపోత పోయాల్సిన అవసరం ఉందని మీకందరికీ తెలుసు. మన లోనికి గ్రహించిన, మన హృదయపు లోతుల్లో వ్యాపింపజేసిన విషయాలను మనం వడ కడుతున్నామా? మనం అన్ని విషయాల గురించి స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నాం. మన ప్రియమైన వ్యక్తులతో ‘ఐ లవ్ యు’ అని చెప్పినప్పుడు కూడా, నిజంగా ఆ మాటకు అర్థం ఏమిటి? అది కేవలం ‘నేను నీతో పడక సుఖం కోరుతున్నాను’… అనా? హృదయంలోని భావాలను ప్రేరేపించే ఎన్నో విషయాలను, నిజంగా వాటి పర్యవసానాలు… అర్థం చేసుకోకుండానే, బయటకు వెళ్ళగ్రక్కే విధంగా ఎన్నో మాటలను మనం మాట్లాడేస్తుంటాం. భావోద్వేగాల విలువను కోల్పోతున్నాం. వాటి పర్యవసానాలను సరిగా అర్థం చేసుకోకుండా మనం పదాలను ఇష్టారీతిగా వాడేస్తుంటాం. ‘ఐ హేట్ యు’… ‘నేను నిన్ను అసహ్యించు కుంటున్నాను’ అని ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ‘ఐ హేట్ యు సో మచ్’ అంటున్నారు. వాళ్లు అంటున్నది నిజంగా వాళ్లకి అర్థం అవుతోందా? కనుక మనం ఈ వడబోతలను మన హృదయంలో, మనసులో వాడనంతవరకు… మన తెలివైన మనసు, గ్రహించగలిగే హృదయం మామూలుగా ప్రతిస్పందిస్తాయి. అయితే ఈ రోజుల్లో వాటి విధులు మారిపోయాయి. హృదయం ప్రతిచర్యను (రియాక్షన్) చూపుతోంది. ప్రతిస్పందనకి, ప్రతిచర్యకి ఎంతో తారతమ్యం ఉంది. బాహ్యంగా కనపడే ఈ ప్రతిస్పందనలు, ప్రతిచర్యలు మనకు కలిగే భావోద్వేగాలు… మనం గ్రహించే ఆలోచనలు ఈ ప్రక్రియలన్నీ ఎటువంటి వడబోత లేకుండానే ఉంటాయి. మాటల ద్వారా మనం బయటకు పంపేవన్నీ ప్రతిచర్యలు… ప్రతిస్పందనలు, శరీర భాష (బాడీ లాంగ్వేజ్) ఇవన్నీ వడపోత లేనివే! మీరు మీ బాస్ ముందున్నప్పుడు తప్ప, మిగిలిన సమయాల్లో ఎటువంటి ఎరుక, ప్రయత్నం లేకుండానే మాట్లాడతారు. అయితే ఒక్కోసారి ఆయన ముందు కూడా విచక్షణ కోల్పోయి మాటలను వదిలి మరుక్షణంలో ఉద్యోగం కోల్పోవడం కూడా జరుగుతుంది. అనాలోచిత మనస్సు యొక్క పర్యవసానాలే ఇవన్నీ – వడపోతలు లేని మనసు, హృదయం! ధ్యానం, హార్ట్ఫుల్నెస్ సాధనా పద్ధతులు, భగవంతునికై కాకపోయినా, కనీసం ఇవి మానవ పరిణామం కోసమే… మన దైనందిన కార్యక్రమాలను సహజంగా కొన్ని నిమిషాల ధ్యానంతో… మన హృదయం మనసులను సూక్ష్మీకరింపచేసుకుంటూ జీవితాన్ని నిర్వహించుకోగలగాలి. ఇవి నిజాయితీగా, నిబద్ధతతో కనుక చేసినప్పుడు, ఎంతో ప్రభావశీలంగా ఉంటుంది. నిజాయితీ అవసరం. ‘భగవంతుడు’ అని నేను అన్నప్పుడు మీ హృదయంలో ఆ భగవంతుడు అనే పదం ఎటువంటి స్పందనను రేకెత్తిస్తుంది? మీ మనసులో దాని గురించి ఏమి ఆలోచిస్తారు? ఇంటికి వెళ్ళాకా ఈ పని చేయండి. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు భగవంతుడు అనే ఈ పదం పలికి మీ హృదయంలో కలిగే భావాలను గమనించండి. అల్లాహ్, జీసస్, నా ప్రియతమ శ్రీకృష్ణా… ఇలా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, ఇలా పలికినప్పుడు అది మీలో ఏదైనా భావోద్వేగాన్ని కలిగించిందా? అవి మీలో ఎటువంటి భావాలను రేకెత్తించ లేకపోతే, ఎటువంటి అనుభూతి లేకుండా… మన ప్రియతములతో అర్థంపర్థం లేని ‘ఐ లవ్ యు’ చెప్పినట్లుగానే ఉంటుంది. అలా జీవితం శూన్యంగా ఎటువంటి విలువలు లేకుండా కొనసాగిపోతూనే ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా మీరు మీ హృదయాన్ని స్పృశించగలిగితే… అది సరిపోతుంది. అప్పుడు అది అలవాటుగా మారుతుంది. హృదయాన్ని ఒకసారి స్పృశించగలగడమే మనకు కావలసింది. ఒక నిజాయితీతో కూడిన స్పర్శ! అది కేవలం, కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం! దానికి ఇక వేరే మార్గం లేదు. దగ్గరి దారులు లేవు. అయితే దాన్ని సక్రమంగా అనుసరించగలగాలి. ఒక మంచి, సరైన సాధనా పద్ధతి ఉండొచ్చు… అయితే తప్పుడు వైఖరి మొత్తం ప్రక్రియను పాడు చేస్తుంది. వివాహం సక్రమంగానే జరిగి ఉండొచ్చు, కానీ భాగస్వామితో తప్పుడు వైఖరి జీవితానికి హాని చేస్తుంది. పూర్తి జీవితం నాశనం అవుతుంది. వివాహ సంబంధమైన కర్మకాండ అంతా అనుసరించి ఉండవచ్చు గాక! మిగిలిన దాని సంగతి? కనుక వైఖరి అనేది ఎంతో ప్రాముఖ్యమైంది… అలాగే మన స్వీయ అంతరంగంతో మన సంబంధాలు కూడా. నా మాటలు నా భావాలకనుగుణంగా ఉండాలి. అందుకే పెద్దవాళ్లు, ‘మనం చెప్పినదే మన భావనగా ఉండాలి, భావానికి అనుగుణంగానే మాట్లాడాలి’ అనేవారు. అప్పుడు గొప్ప పరిణామాలు ఉంటాయి. ఇతరుల వైపుకు కాకుండా, మన స్వీయ అంతరంగంలోనికి మరలుదాం!