17-06-2023 DAAJI RAIPUR EVENING
యువత - మంచి అలవాట్లు
ఈ ప్రశ్న చాలా ఆచరణ యోగ్యమైనది. ఈ ప్రశ్నకు, మీకు గనుక జవాబు దొరికితే నాకూ తెలుపగలరు. దీనికి సమాధానం నా వద్ద లేదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈనాడు ఫోన్ వాడకం అలవాటయింది, తల్లిదండ్రులు కూడా తినేటపుడు… నిద్రపోయే ముందు కూడా వారి ఫోన్ వాడకం కొనసాగుతోంది, ఇక పిల్లవాడేం నేర్చుకుంటాడు? మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు సరైన సమయంలో, సరైన విధంగా ధ్యానం చేయరు. అది కూడా పిల్లలు గమనిస్తారు. ధ్యాన సమయంలో ఫోన్లు వస్తే చూస్తారు. ఇలాంటివి మొదట మీరు మానేసి, ఫోను అలవాటు తగ్గించటం ఆరంభిస్తే పిల్లలు వారంతట వారే నేర్చుకుంటారు.
పునర్జన్మ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా కష్టపడడం ఎందుకు?
చెయ్యకపోతే చెయ్యకండి. మీరు ఆ స్థితికి చేరిపోయారా? ‘ఇది చేస్తే, ఇది పొందుతాను’ అని లెక్కలు వేసుకుని చెయ్యాలనుకుంటే చెయ్యకండి. ఆధ్యాత్మికతలో మనం వ్యాపారం చెయ్యటం లేదు. ఒకవేళ ఆధ్యాత్మికతలో పరాకాష్ట స్థితికి చేరారే అనుకుందాం. అప్పుడు అసలు ఆ ప్రశ్నే తలెత్తదు. ఫ్రీడమ్ అని దేన్ని అంటారో, మోక్షం అని దేన్ని అంటామో… మోక్షం యొక్క అర్ధం ఏమిటి? ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడైతే అధిగమించి వెళతామో అప్పుడు లభిస్తుంది. అప్పుడు తిరిగి రావలసిన అవసరమే ఉండదు. కానీ మీ గురువు యొక్క ఆదేశం అయితే, ‘నాయనా! నువ్వు తిరిగి వెళ్లి కొంచెం పనిచేసి రా’ అని… అపుడు ఆ పనిచేయటానికి కావలసిన శక్తిని కూడా ఆయనే ఇస్తారు. ఇంక మనకు భయం ఎందుకు? మోక్షం యొక్క అర్ధం ఏమిటంటే మనకు సెలవు దొరికినట్లు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావొచ్చు, ఎప్పుడు వెళ్లాలనుకుంటే అప్పుడు వెళ్లొచ్చు. అందులో ఎటువంటి బంధనం ఉండదు. రావాల్సి వస్తే చాలా సంతోషంతో తిరిగి వస్తారు. మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నదా? అటువంటప్పుడు ఎందుకు రాకూడదు? కొంచెం ఆలోచించండి. ఈశ్వరుడు మనల్ని ఏం చెయ్యటం కోసం పంపించాడో అని మీ అంతరంగంలో పరిశీలించుకోండి. నేను ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను? ఏ పని నిర్వచించబడిందో ఆ పని చెయ్యటానికి ఏమైనా చేస్తున్నానా లేక ఇందులో చిక్కుబడిపోతున్నానా? ఇంకా నేను వచ్చిన పని చెయ్యటానికి ఏ వస్తువులు నాకు సహాయపడతాయి? వాటిని పట్టుకోండి. ఏవైతే మిమ్మల్ని అక్కడికి చేర్చటానికి ప్రతిబంధకమవుతాయో వాటిని వదిలెయ్యండి. జీవితం ఇంతే! సింపుల్! మనం ఉదయం ధ్యానం చేసిన తర్వాత ఆ రోజు మొత్తంలో మనం చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ ఒకటి తరువాత ఒకటి గుర్తుకువస్తాయి. ఈ పని చెయ్యాలి, ఇది చెయ్యద్దు, అని. సాయంత్రం నిర్మలీకరణ చేసుకున్నప్పుడు దాని ప్రభావంతో ముద్రలు తొలగిపోతాయి. చివరిగా రాత్రి పడుకోబోయే ముందు సూచన చేసుకుంటాం. క్షమాపణ కోరుతాం. తెలిసీ తెలియక ఏమైతే చేశామో అవి మళ్ళీ చెయ్యను, అని భగవంతుని ముందు వాగ్దానం చేస్తాము. ఇంతే కదా! ఒకవేళ మనం చేస్తూనే ఉంటాం అంటే ఇక మనం ప్రార్ధన చెయ్యటం ఎందుకు? మనకు అసలు కోరికలే లేవనుకోండి… మన ప్రార్ధనలో ఏమని ఉంది? ఓ ప్రభూ! మానవ జీవితమునకు ఏకైక లక్ష్యము నీవే! మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట, మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది అని. కొంచెం ఆలోచించండి. ఒకవేళ కోరికలే లేవనుకోండి. అప్పుడు ప్రార్ధన ఎందుకు చెయ్యాలి? అవసరమే లేదు కదా? నమస్తే!
18-06-2023 DAAJI RAIPUR SUNDAY MORNING
వరుస వైఫల్యాలు ఎదురైనప్పుడు...
నిష్ఫలంగా అనిపించినప్పుడు సహజంగానే జీవితంలో ఉత్సాహం నశించిపోతుంది. ఈశ్వరునిపై పూర్తి నమ్మకం ఉంచండి. ఆయనపై శ్రద్ధ ఉంచడం వలన నష్టం ఏమీ జరగదు. ఈశ్వర ప్రణిధాన్. ఆయన ఏ స్థితిలో ఉంచితే, ఆ స్థితిలో ఉండండి. దానితో పాటు మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. జీవితంలో అన్నీ లభించినప్పటికీ ఏదో ఒక లోటు ఉండనే ఉంటుంది. ఎవరైనా ఒక ధనవంతుని గానీ లేదా అతని భార్యను గానీ నిజంగా మీరు సుఖంగా ఉన్నారా? అని ప్రశ్నించి చూడండి. బాహ్యంగా చూసినప్పుడు వారు జీవితంలో చాలా సాధించినట్లే అనిపిస్తుంది… ఎంత కష్టపడ్డా విజయం లభించడం లేదు అని మీరు అంటారు. జీవితసారం పరంగా చూస్తే, మీ ఇద్దరిలో నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు మన ధ్యేయం ఏమిటి? ఈశ్వర ప్రాప్తి… భౌతిక రూపంలో విజయం సాధించినా, సాధించక పోయినా ఇద్దరు ఈశ్వర ప్రాప్తికి అర్హులే. విజయం సాధించలేక పోతున్నామని బాధ పడేవారు ఈశ్వరుని పై భారం వేసి ఆ పనిని చేస్తే వారి కార్యం శీఘ్రంగా ముగుస్తుంది. ధనికులు, సఫలీకృతం అయ్యాము అనుకొనే వారిలో కొంత అహం, గర్వం ఉంటుంది. ఆ అహం ఈశ్వరుని పొందడంలో వారికి అడ్డంకిగా మారుతుంది. అసఫలుడైన వ్యక్తి మార్గంలో కూడా అడ్డంకులు ఉంటాయి… కానీ అతనిలో అహం ఉండదు కాబట్టి అతని మార్గం లోని అడ్డంకులను సులభంగా తొలగించవచ్చు. ‘మీరు లేకుండా భౌతికంగా, ఆధ్యాత్మికంగా నేను సఫలత చెందలేను’ అన్న శరణాగత భావన వారిలో ఏర్పడుతుంది. ఎవరి దగ్గర అయితే ఏమీ ఉండదో, వారు ఈశ్వర ప్రాప్తి అనండి లేదా శరణాగతి అనండి, ఆ స్థితికి త్వరగా చేరుకొంటారు.
జీవితంలో మౌలిక పురోగతి -
లాలాజీ చెప్పిందేమిటంటే మన మౌలిక జీవితం లేదా వ్యక్తిత్వ ఆధారిత జీవితమనేది ప్రాథమికమైనది. మనం దాన్ని విడిచిపెట్టలేం. కానీ దాని ద్వారా మాత్రమే మన ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుందా? దానితో మాత్రమే జరగదు. ఆధ్యాత్మికతకై దానితో పాటు ధ్యానం కూడా చేసుకోవలసి వస్తుంది. అది మామూలు విషయం కాదు. నిన్న పిల్లలు, యువకులు మాతో భోజనం చేస్తున్నారు. అప్పుడు నేను ‘మీరు ఆదివారం సత్సంగానికి వెళతారా?’ అని అడిగాను. వెళ్లమని చాలా ఆనందంతో, నవ్వుకుంటూ చెప్పారు. ఒకరోజు నిద్రపోవాలి కదా అని… ఆరు రోజులు పని చేస్తాము, ఒకరోజు 10 గంటల వరకు నిద్రపోతాం అని చాలా గర్వంగా చెప్పారు. అలా అయితే లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు? లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం… లక్ష్యాన్ని సాధించడం అనేవి రెండు అంశాలు. ముందు లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. అదే మనకు సర్వస్వం అయితే, అన్నీ వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 6 రోజులు వదిలేసి ఆదివారం ఒకరోజు మాత్రమే పని చేయడం మంచిది. ధ్యానంలోకి ప్రవేశించండి. అది మీ జీవితంలో మంచి చేస్తుంది. నేను ఇదే మాట్లాడుతున్నాను, ఇంతకు ముందు ప్రశ్న… విజయం సాధించిన వారితో ఇదే పెద్ద జబ్బు. ఇంత ఇంట్రెస్ట్ రాదు వీళ్ళకి. అంతా అలాగే ఉంటుంది, తోచినప్పుడు చేస్తారు, ఇష్టం లేనప్పుడు చేయరు. పై నుండి కొరడా దెబ్బ పడినప్పుడు, దేవుడు గుర్తుకు వస్తాడు. మనుష్యులకు కొరడా దెబ్బలూ పడతాయి, కష్టాలు కూడా వస్తాయి, అయినప్పటికీ బుద్ధి రాదు. బాబూజీ మహరాజ్ ఇచ్చిన 1983 సూరత్ సందేశం, ఇది చాలా ప్రసిద్ధి చెందింది. వారంటారూ, దేహధారికి బాధలే బాధలు… అయినప్పటికీ… వారి మనస్సు అటువైపు మళ్ళదు. ఇలా రెండు వైపులా! సుఖం లోనూ ఆ వైపుకు వెళ్ళరు. సుఖంలో మునిగి పోతారు. దుఃఖంలో కూడా వెళ్లరు. దుఃఖంలో ఉండి ఇది ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పోతుందో అని ఆలోచిస్తూనే ఉంటారు. మరి జీవితం ఇలాగే తెల్లారిపోతుంది. మౌలిక జీవితం ఉన్నత స్థాయిలో ఉంటే మంచిదే, కానీ దానితో పాటు ఆధ్యాత్మిక సాధన అయితే చేయాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధ్యాత్మికతపై మద్యం, ఆహారపు అలవాట్ల ప్రభావం
చేసి చూడు… ప్రయోగం చేయి. మద్య పానం చేసి ధ్యానంలో కూర్చుని ఏం జరుగుతుందో చూడు. నా జీవితంలో జరిగిన ఒక చిన్న కథను నేను మీతో పంచుకుంటాను. బహుశా నేను ఎనిమిది లేక తొమ్మిది సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. నాకు ఒక ముస్లిం స్నేహితుడు ఉండేవాడు. అతని వద్ద ఒక మేక పిల్ల ఉండేది. అది చాలా చిన్నది. అతడు ఎక్కడికి వెళ్లినా దాన్ని తన వెంట తీసుకుని వెళ్ళేవాడు. రంజాన్ పండుగ వచ్చింది. అతని తండ్రి ఆ మేక పిల్లను వధించడం అతను చూశాడు. ఆ తర్వాత అతడు ఒక నెల రోజులపాటు భోజనం చేయలేదు. అతను ఇప్పటికి కూడా శాకాహారిగానే ఉన్నాడు. తన స్నేహితుడిని చంపివేసినట్టుగా అతడు భావించాడు. మీకు చికెన్ తినాలనే ఆలోచన కలిగితే మీరు అక్కడికి వెళ్లి చూడండి. దాన్ని ఏ విధంగా చంపుతున్నారు, దాని రెక్కలు ఏ విధంగా ఒక దాని తర్వాత ఒకటి విరిచేస్తున్నారు. అదంతా చూసిన తర్వాత మీరు దాన్ని తినలేరు. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా ఉద్యోగులందరమూ కలసి కూర్చుని భుజించేవాళ్ళం. అప్పుడప్పుడు వారు అటువంటివి తమతో తెచ్చుకునేవారు. మాంసం, గుడ్లు తెచ్చేవారు. అలాగే గుడ్డు కూడా ఒక పిండం లాంటిదే. చాలామంది ఆ గుడ్డు పిల్లగా మారదు అని అంటారు. కానీ ఆ విషయం ఆ తల్లికి తెలియదు కదా అన్నాను. ఆ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలో భాగంగా మారుతాయి. మన ధ్యేయం ఏమిటి? ఈ మానవ జీవితం ఏదైతే ఉందో అది జంతువులతో సమానమైనది. పశు ప్రవృత్తి కలది. దాని నుండి కొంచెం పురోగతి చెందాలి. మానవత్వం కలవారిగా మారాలి. కరుణ, ప్రేమ పెంపొందించుకోవాలి. ఇంకా ప్రగతి చెంది దివ్య మానవునిగా పరిణతి చెందాలని బాబూజీ ఆశిస్తున్నారు. జంతువు నుండి మనిషిగా, మనిషి నుండి దివ్యత్వం వైపుగా కదలాలి. వెనుకకు వెళితే ఉపయోగం లేదు. మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తారు కానీ విరామాలతో చేస్తారు. భార్య లేదా భర్త మంచివారైతే మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తారు. స్నేహం కూడా ఒక నిర్ణయించే కారకమే అవుతుంది. వారిలో ఎవరైనా ఒకరికి ఏదైనా సరదా ఉంటే దాన్ని సంతోషపరచడానికి మీరు కూడా తాగవలసి, తినవలసి ఉంటుంది. మన దేశంలో స్త్రీలు ఎప్పుడూ మద్యం సేవించేవారు కాదు. కానీ ఇప్పుడు భర్తకు సహాయంగా వారు కూడా మద్యంలో మునిగిపోతున్నారు. ఇది పిచ్చి పని. ధర్మపత్ని అంటే తన భర్తని ధర్మ మార్గంలో ఉంచేది. అన్ని ధర్మాలూ క్రిస్టియానిటీ, ఇస్లాం లేదా హిందూ మతం అన్నీ చెప్పేది ఒకటే. హింస అనేది ఎక్కడా ఉండకూడదు అనే. కానీ అందరూ హింసను అవలంబిస్తారు. ఈద్ పండుగను ఎంతో ఉత్సవంగా జరుపుకుంటారు. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. ఇబ్రహీంకు రాత్రి కలలో భగవంతుడు కనిపించి నీకు అన్నిటికన్నా ప్రియమైన దాన్ని నాకు బలి ఇవ్వు, అని అంటాడు. ఆ కల నిజమైనా, కాకపోయినా తనకు ప్రియమైన వస్తువు ఏది అని అతను ఆలోచించాడు. తన కుమారుడే అని గ్రహించి అతడిని పర్వతం పైకి తీసుకుని వెళ్లి బలివ్వడానికి సిద్ధమవ్వగానే… అతడిని ఆపమని పైనుండి స్వరం వినబడింది. దానికి బదులుగా ఇంకేదైనా ఇవ్వమని. ఆరోజు నుండి ఏం జరిగిందంటే, మా నాన్నగారు తన ముస్లిమ్ స్నేహితునితో వేళాకోళం చేస్తూ ఉండేవారు… “నీకు గొర్రె అన్నిటికన్నా ఇష్టమైందా? ఇంటిలో ఇంకేం దొరకలేదా… దాన్ని బలిస్తున్నావు, చూద్దాం ఇబ్రహీంను ఆపినట్టు, నిన్ను కూడా ఆపుతారో లేదో” అని. కానీ ఇది చాలా తీవ్రమైన విషయం. ఒకరికి కలలో వచ్చింది. వేలమంది దాన్ని అనుసరిస్తున్నారు. ఇతరుల ప్రాణం తీసి మనం సంతోషంగా ఉండడం కన్నా, మనమే దానికోసం మరణించడం మంచిది. కోరిక (ప్యాషన్), కరుణ (కంపాషన్). కోరికలో ప్రజలు తమ ఆనందం కోసం అత్యాచారాలు చేయడం వంటి పనులు చేసి ఇతరులను ఇబ్బంది పెడతారు. తమ ఉత్సాహాన్ని ఇతరులపై చూపుతారు. బలాత్కారం అంటే తమ బలంతో ఇతరులను ఆక్రమించడం. అది కోరిక. కరుణ అని దేన్ని అంటామంటే ఇతరుల కోసం తాము మరణించినప్పుడు. మద్యం సేవించినప్పుడు వివేకం కోల్పోతాం. ఏమి చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎలా నడుస్తున్నాడో అతనికి తెలియదు. నేను మిమ్మల్ని ఒకసారే మహాత్ములు అవమనడం లేదు. కానీ ఒక కోరిక ఉంచుకోండి. కనీసం ఇది నాకు మంచిది కాదనే విషయాన్ని తెలుసుకోండి. ఇది మీ అలవాటే! అది నాకు తెలుసు. కానీ అది చెడు అలవాటని తెలుసుకోవడం మొదటి మెట్టు. మిగతా పని మాస్టర్ కృప వల్ల ఎలాగూ జరుగుతుంది.
19-06-23, Faith On God
భగవంతుని పై విశ్వాసం
అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ అశ్విన్ లడ్డా, మేనేజింగ్ డైరెక్టర్, ఓరియంట్ పేపర్ మిల్స్ గారికి… ఆశా ఫౌండేషన్ కి చెందిన ఆశిష్ గారికి మరియు ఓపియం యొక్క పరిపాలనా కార్యవర్గ సభ్యులకు… గ్రామగ్రామాల నుండి వచ్చిన సోదర, సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఇవాల్టి విషయం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏమిటి? మొదట మనం ఆధ్యాత్మికత అంటే ఏం అర్థం చేసుకున్నామో తెలియాలి. ధర్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? రెండింటి మధ్య తేడా ఏమిటి? ధర్మం, ఈశ్వరుడు ఉన్నాడనే అంటుంది. మనం ఈశ్వరుడు ఉన్నాడు అని విశ్వసిస్తాము కూడా! తల్లిదండ్రులను అడగండి, అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్య లను “మీరు భగవంతుడిని నమ్ముతున్నారా” అని అడగండి. వారు అలా ఎందుకు అడుగుతున్నావు? అని అంటారు. కానీ వారిని, ‘మీరు ఎందుకు నమ్ముతారు,’ అని అడిగితే… “మా అమ్మ అలా నేర్పించింది, మన ధర్మం అలా నేర్పిస్తుంది, మన శాస్త్రాలు ఇలా నేర్పిస్తాయి” అని సమాధానం చెబుతారు. అదే మనం ‘మీరేమి చెబుతారు?’ అని అడిగితే వారు నిశ్శబ్దంగా ఉంటారు. “నేనేమీ చెప్పను, ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం, నేను భగవంతుని మీద విశ్వాసం ఉంచుతాను” అని అంటారు. ఇది ధర్మం యొక్క విషయం. ఆధ్యాత్మికతలో ఏముంటుంది? ఆధ్యాత్మికతలో మొదట అనుభూతి కలుగుతుంది “అవును నేను ఈశ్వరీయ తత్వాన్ని అనుభూతి చెందాను… కాబట్టి నేను భగవంతుణ్ణి నమ్ముతాను” అని భావిస్తాము. రెండింటికి మధ్య ఇలా చాలా తేడా ఉంటుంది… కాబట్టి మనకు ధ్యాన పద్ధతిలో భగవంతుని యొక్క అనుభూతి కల్గుతుంది. రెండవ ప్రశ్న మీ ముందు ఉంచుతాను… భగవంతుని కోసం మనం ఎక్కడ వెతకాలి? ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడ వెతకాలి? శాస్త్రాలు ఈశ్వరుడు అన్నిచోట్ల ఉంటాడు, అని చెబుతాయి. మీకు ఉదాహరణగా నేను ఒక పరిస్థితిని వివరిస్తాను… తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు… బిడ్డ తల్లి నుండి వేరుపడగానే ఏడుస్తాడు. బిడ్డ ఏడవడం తల్లికి చాలా ఆనందం కలిగిస్తుంది. తర్వాత ఎప్పుడైనా బిడ్డ ఏడిస్తే తల్లి కూడా ఏడుస్తుంది… కానీ ఈ జన్మనిచ్చే సమయంలో మాత్రమే బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి మొహంలో నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే బిడ్డతో ఏదైతే రావలసి ఉందో అది వచ్చింది. దాన్ని మనం ఆత్మ, జీవశక్తి, జీవన దాత లేదా ఇంగ్లీషులో సోల్ అంటాం. శాస్త్రాలు చదివిన వారు ఆత్మ లేదా జీవాత్మ అంటారు. ఏ పేరైనా పెట్టండి, తేడా ఏమీ ఉండదు. మనకు జీవాన్నిచ్చేది మన లోపల ఉందా? లోపలే ఉంది కదా! బయట లేదు కదా! అది లేకుండా మనం ప్రార్థించలేము. ధ్యానం కూడా చేయలేము. అది లేకుండా మనం ద్వారక కూడా వెళ్లలేం. ఏదైతే మన లోపల ఉందో, దేని అనుభూతి లోపలే పొందాలో… దాని దర్శనం కోసం మనం బయటకు పరిగెడితే దర్శనం ఎలా జరుగుతుంది? మీరు కొంచెం ఆలోచించండి. ఇప్పుడు అనుభూతి చెందవలసినది బయట ఎప్పటికీ లభించదు. బయట అనుభూతి ఎలా అవుతుంది? ఉదాహరణకు నేను సెంటు రాసుకున్నా, అత్తరు పూసుకున్నా ముక్కు ద్వారా దాని సుగంధం వస్తుంది. ఏదైనా తిన్నప్పుడు అది కడుపులో పడుతుంది. శాంతి అనుభవం పొందాలంటే, అది హృదయం ద్వారానే అనుభూతి చెందబడుతుంది. శ్రీకృష్ణ భగవానునితో అర్జునుడు, “శ్రీకృష్ణా! మీరు నా స్నేహితులు. నాకు మీ విశ్వరూపాన్ని చూపించారు… దయచేసి మీ నిజరూపంలోకి రండి. ఈ రూపం నన్ను గాభరా పెడుతున్నది, భయపెడుతున్నది.. రాబోయే తరాల వారు మీ దర్శనం ఎలా చేసుకుంటారు?” అని అడిగాడు. ‘హృదయమే పశ్యసి’ అని శ్రీకృష్ణుడు అంటారు. “మీ హృదయంలో మీరు నన్ను అనుభూతి చెందండి”. “ద్వారకకు వెళ్లి లేదా కైలాసంలో అనుభూతి చెందండి అని చెప్పలేదు… ‘హృదయమే పశ్యసి’ అంటే ప్రతి హృదయంలో నేనున్నాను”, అన్నారు. అయినప్పటికీ మనం తప్పు చేస్తూనే ఉంటే, దానికి పరిష్కారం ఎలా లభిస్తుంది? తప్పు చేస్తూ ఉంటే మంచి పరిష్కారం లభించదు. అలాగని నేను ఈశ్వరుని అంగీకరించనని అర్థం కాదు. నేను మీకు, మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి, ఒక విధంగా సరైన మార్గాన్ని చూపించడానికే ప్రయత్నిస్తున్నాను. అందుకే మన వేదాలలో, ఉపనిషత్తులలో ఆయనను ‘అంతర్యామిన్’ అని చెప్పబడింది. అంటే లోపల ఉండేది, బయట లేదని అర్థం. ఆయన అనుభూతి లోపలే కలుగుతుంది. ఈరోజు మనం అనుభూతి చెందడానికి ప్రయత్నిద్దాం. మీలో ఎంతమంది హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో ఈ ఉదయం ధ్యానం చేశారు? ఓహ్! చాలామంది ఉన్నారు. ఇంకా ఎక్కువగా చెప్పే అవసరం లేదనిపిస్తుంది. మరి నేను ఎందుకు చెప్తున్నాను? నేరుగా మనం ధ్యానం చేద్దాం. సోదరి జర్శ్వీందర్ ఇక్కడ ఉన్నట్లయితే, దయచేసి మాతో రిలాక్సేషన్ చేయించమని మనవి చేస్తున్నాను. వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు ఒక కార్యక్రమం ఉంది… ఆశా ఫౌండేషన్, ఓరియంట్ పేపర్ మిల్స్ మరియు హార్ట్ఫుల్నెస్ ఏకమైతే ఫలితం ఏమై ఉంటుంది? ఆధ్యాత్మికంలో ఉన్నతి అయితే కలగాలి కదా! భౌతిక జీవితంలో కూడా ఉన్నతి కలుగుతుంది. భౌతిక జీవితంలో, విద్యలో, సామాజిక జీవితంలో, మన ఉద్వేగపరమైన జీవితంలో అన్నింటిలో అభివృద్ధి జరుగుతుంది. ఒక ఉదాహరణను చూద్దాం. కాగితం కోసం యూకలిప్టస్ పెంచుతాం… అలాగే ప్రతి గ్రామంలో బంజరు భూమి ఉన్న చోట ఒక ఎకరం, 10 ఎకరాల స్థలంలో… గ్రామస్తులు అందరితో కలిసి తెల్లచందనం, ఎర్రచందనం మొక్కలను నాటుదాం. మీరు ఏమీ చేయనవసరం లేదు. మేమే నాటుతాం. ప్రతి ఉదయం అక్కడికి వెళ్లి ఒక మగ్గు నీళ్లను పోయడం మీ పని. ఇంతకంటే ఏమీ చేసేది లేదు. పది సంవత్సరాల దాకా మీ గ్రామస్తులు అందరూ కలిసి వాటి సంరక్షణ చేయాలి. చాలామంది వాటిని దొంగతనంగా ఎత్తుకొని పోతారు. ఒక మొక్క ఖరీదు నల్ల బజారులో ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఐదు లక్షల రూపాయలు! మనం కావాలనుకుంటే వెయ్యి, పది వేలు మొక్కలను నాటితే ఎంత అవుతుందో లెక్క వేయండి. 500 కోట్లు అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఆ 500 కోట్ల రూపాయలను గ్రామస్తులందరికీ పంచండి. మీ నుండి మేం ఏమీ తీసుకోము. ఆశా వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారు కదా! వారు కూడా మీ నుండి ఏమి తీసుకోవాలనుకోరు. ఆలోచించండి. వీళ్లు ఇంత దూరం నుండి వస్తారు. వారికి ఏ స్వార్థమూ లేదు. మాకు ఏమీ అవసరం లేదని వారు మనకు గ్యారెంటీ వ్రాసిస్తారు. మీరు ఉదయం, సాయంత్రం కళ్ళు మూసుకుని ఈశ్వరుని ధ్యానించండి. అంతే!
22-06-23, Use Ashrams Properly
ఆశ్రమ స్థలాన్ని ప్రేమతో ఉపయోగించుకోండి -
22-06-2023, పూజ & ధ్యానం
పూజ, ధ్యానం
నా ఉద్దేశంలో దీపం, అగరబత్తీలు, హారతి, భజనలు ఇవన్నీ కలిపి పూజ అంటాం. ధ్యానం కూడా ఒక విధమైన పూజనే. ఒకటి బాహ్య పూజ అయితే ఒకటి అంతరంగిక పూజ. బాహ్య పూజ మనం ఒక విధమైన శ్రద్ధతో చేస్తాం. అలాగే అంతరంగిక పూజ కూడా శ్రద్ధతో చేస్తాం. బాహ్య పూజలో మనం ఒక విశ్వాసంతో అంటే ఇదే నా సర్వస్వం అని భావిస్తూ ఉంటాం. కానీ అది ఎప్పటికీ బాహ్యంగానే ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు, వారిని మనం పూజిస్తున్నాం అని భావిస్తాం… కానీ మనం ధ్యానం ద్వారా అంతరంగిక పూజ చేసేటప్పుడు… మనం వారిని dఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకుంటాం. మనం భగవంతుడు అని భావించే వారిని ఎప్పటికీ మన హృదయంలో ఉంచుకుంటాం. విశ్వాసం వలన ఏం జరుగుతుంది? మీరు మీ పెద్దవారిని తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ లను “భగవంతుడు ఉన్నాడని అంగీకరిస్తున్నారా” అని అడగండి. అమ్మ ఒకసారి కోపంగా “అలా ఎందుకు అడుగుతున్నావు నాకు విశ్వాసం ఉన్నట్లుగా నీకు అనిపించడం లేదా” అని అడుగుతుంది. కానీ మీరు వారిని ఎందుకు అంగీకరిస్తున్నారు అని ఒత్తిడి పెంచితే వారు “మన శాస్త్రాలు చెబుతున్నాయి… మా పెద్దవారు అలా చెప్పేవారు, మన ధర్మం అలా చెబుతుంది” అని అంటారు. “కానీ అమ్మా! నీవెందుకు విశ్వసిస్తున్నావు? అవి చెప్పాయి… వారు చెప్పారు, వీరు చెప్పారు అని కాదు, నీవు ఏమి చెప్తావు? నీవు భగవంతుని అనుభూతి చెందావా?” ఈరోజుల్లో పిల్లలు ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు… కానీ మన వద్ద సమాధానం ఉండడం లేదు. అందువలన వారు ధార్మికతకు దూరంగా వెళుతున్నారు. కానీ మనం, ‘నేను అనుభూతి చెందాను కాబట్టి విశ్వసిస్తున్నాను’ అని చెబితే తర్వాత ఇక ప్రశ్నలు ఏమీ ఉండవు. ఎలాగైతే సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నీరు ఉన్నాయో… వాటిని మనం విశ్వసించట్లేదు. ఎందుకంటే మనం వాటిని చూస్తున్నాము కనుక. భగవంతుని మనం చూడలేదు, అనుభూతి చెందలేదు. అందుకని మనం విశ్వాసం ఉంచుకొని సంతోషిస్తున్నాము. ఒక విధమైన పూజ చేస్తే సంతోషంగా ఉంటుంది. ఏరోజైనా మనం పూజ చేయకపోతే ఏమవుతుందో అని భయం కలుగుతుంది. చాలామంది వ్యాపారవేత్తలను నేను చూశాను… అప్పుడప్పుడు మర్చిపోయి వారు కారులో కూర్చుంటారు. హఠాత్తుగా ఇవాళ దేవునికి నమస్కరించలేదు అని గుర్తుకు వస్తుంది. కారుని తిప్పి వెనక్కు వస్తారు. ఈరోజు నేను భగవంతునికి నమస్కరించలేదు కాబట్టి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అని లోపల ఆందోళనగా ఉంటుంది. భగవంతుని మీద ఎటువంటి విశ్వాసం ఉంది? భగవంతుడు మన నమస్కారం కోసం ఎదురుచూడట్లేదు. మనం లోభం, దురాశల వలలో చిక్కుకున్నాం. దాని వల్ల భగవంతుని విశ్వసిస్తున్నాం. లేకపోతే ఎవరు విశ్వసిస్తారు? అన్ని ధర్మాలు, పూజ పునస్కారాలు, కేవలం రెండు కారణాల వల్లనే మనం చేస్తున్నాం. హృదయంపై చేయి పెట్టి ఈ పూజలు నేను ఎందుకు చేస్తున్నాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకటి భయం, రెండవది లోకుల కోసం తప్ప వేరే కారణం అంటూ ఏమీ ఉండదు. ఈశ్వరుని ప్రాప్తి కోసం, ఈశ్వరుని అనుభూతి చెందడం కోసం ప్రేమతో, తపనతో మనం ధ్యానం చేస్తాం. ధ్యానం వలన మన హృదయం మెల్లమెల్లగా శుద్ధం, పవిత్రం అవుతూ ఉన్నకొద్దీ… మనం ఆయనను అనుభూతి చెందడం మొదలు పెడతాం. మనం కళ్ళజోడు ధరిస్తాం. అయితే కంటి అద్దం మీద ధూళి… నూనె మరకలు పడినట్లైతే ఏమవుతుంది? అంతా మసక మసకగా కనపడుతుంది. ఒక్కొక్కసారి అసలు ఏమీ కనపడదు కూడా! మనం ఆ అద్దాలను శుభ్రంగా తుడిచిన తర్వాత మాత్రమే, మన దృష్టిలో స్పష్టత వస్తుంది. మనం ఎంత బాగా అద్దాలను తుడిస్తే, మన దృష్టి కూడా అంత స్పష్టంగా మారుతుంది. హృదయంలో పవిత్రత పెరుగుతూ ఉన్న కొద్దీ… మనలోని అహంకార ధోరణులు తగ్గిపోతూ ఉన్న కొద్దీ భగవంతుని అనుభూతి చెందడంలో మన దృష్టిలో స్పష్టత ఏర్పడుతుంది. ఇది కేవలం ధ్యానం వల్లనే సాధ్య పడుతుంది. జీవితాంతం ఎన్ని పూజలు చేసినప్పటికీ పరివర్తన అనేది మనలో సాధ్యం కాదు. ఈశ్వరమయం అవ్వాలి అనుకొంటే మనం పరివర్తన చెందవలసిందే. సంక్లిష్టతలు, మలినాలు వీటిని తొలగించవలసిందే! నీటిని నీటితో కలపవచ్చు. నూనెను నూనెతో కలప వచ్చు. కానీ శుద్ధమైన నీరు, శుద్ధమైన నూనె రెండూ శుద్ధమయినవే అయినప్పటికీ, మనం ఆ రెంటినీ కలపలేం. ఈశ్వరమయం అవాలంటే ఈశ్వరుని యొక్క గుణాలను మనలో తీసుకురావాలి. ఇది కేవలం ధ్యానం ద్వారానే సాధ్య పడుతుంది. పూజా పునస్కారాల సహాయంతో నేటి వరకు ఎవరూ సద్గతి పొందిన దాఖలాలు లేవు. నేను ఈ పూజ చేశాను, ఆ పూజ చేశాను అని మీరు సంతోషపడుతూ ఉండవచ్చు. కానీ మీ హృదయంపై చేయి ఉంచుకొని, ఈ పూజల వలన నాలో ఏదైనా పరివర్తన ఏర్పడిందా? అని మీకై మీరు ప్రశ్నించుకోండి. పరివర్తన తీసుకురాలేని పూజలు ఎందుకు? ఎవరి కోసం? ధ్యానం విషయం కూడా అంతే. ఇన్ని రోజుల నుండి ధ్యానం చేస్తూ ఉన్నా, పరివర్తన రాలేదు అంటే, మీరు చేస్తున్న ధ్యానంలో ఏదో లోటు ఉంది. సమస్య ఉంది. ధ్యానంతో పాటుగా అంతరంగం పరిశుభ్రం చెందాలి. ఈ అంతరంగ శుభ్రత ఎలా చేసుకోవాలన్న విషయం సహజ మార్గంలో చెప్పబడింది. చాలా కాలంగా ధ్యానం చేస్తున్న వాళ్ళందరికీ దీన్ని గురించిన అవగాహన ఉంది. కొత్తగా ధ్యానం మొదలు పెట్టినవారు, మన ప్రిసెప్టర్ల ద్వారా దీనిని గురించి తెలుసుకోగలరు.
ధ్యానానంతర స్థితిని అంటిపెట్టుకొని ఉండడం ఎలా?
ధ్యానం తర్వాత మనం పొందిన ఆ స్థితిని మర్చిపోతాం. ధ్యానం తర్వాత మీ స్థితి ఏమిటో మీకు తెలుస్తుంది. దాన్ని అనుభూతి చెందుతారు కదా! దాన్ని పట్టుకుని ఉండాలి. అలవాటు చేసుకోవాలి. ధ్యానం పూర్తయిన తర్వాత వెంటనే కళ్ళు తెరవకూడదు. ధ్యానం తర్వాత కొంతసేపు, నాలుగైదు నిమిషాల పాటు కళ్ళు మూసుకుని కూర్చుని ఉండాలని నా గురువు గారు చెప్తుండేవారు. లోపల ఉద్భవించిన స్థితితో ఏకమవ్వండి. ఈ స్థితి ఈ దినమంతా నాలోనే ఉండిపోతుందని సంకల్పం చేసుకోండి. తర్వాత క్రమంగా అనుభవమవుతుంది. లభించిన స్థితిని మరింత పెంచుకోవడానికి ఆ రోజు మనం కళ్ళు తెరిచి ఉంచి ప్రయత్నం చేస్తాం. ఇలా నేను నా ఫార్మాస్యూటికల్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఉదయం ధ్యానం చేసుకుని వెళ్లేవాడిని. కారులో అప్పుడప్పుడు గురువుగారి ఉపన్యాసాలు పెట్టుకుని వినేవాడిని. కొన్ని ఆడియోలను పెట్టుకునే వాడిని… ఆ విధంగా ప్రయాణించేటప్పుడు కూడా మనసును లగ్నం చేయగలుగుతాం. తరువాత ఆఫీస్ కి వెళ్ళాకా, పని ప్రారంభించే ముందు ఒక నిమిషం కళ్ళు మూసుకుని ధ్యానించి… ఉదయపు ధ్యానస్థితిని గుర్తుకు తెచ్చుకుని పని ప్రారంభించే వాడిని. అప్పుడప్పుడు ఆ స్థితి దూరమవుతుంది. మళ్లీ గుర్తుకు తెచ్చుకోవాలి. మళ్లీ దూరమైతే మళ్లీ గుర్తుకు తెచ్చుకోవాలి. చిన్నపిల్లలకు సైకిల్ తొక్కడం నేర్పడానికి నాలుగు చక్రాలు ఉన్న సైకిల్ని కొంటాం. తర్వాత రెండు చక్రాలను తీసేస్తాం. తరువాత మనం చేతితో పట్టుకుని నేర్పిస్తాం. రెండు చక్రాల సైకిల్ కూడా నడపగలుగుతారు. సైకిల్ పై స్కూల్ కి స్నేహితులతో పాటు వెళ్తారు. చేతులు కూడా వదిలేస్తారు. పాటలు కూడా పాడతారు. అటు ఇటు ట్రాఫిక్ లో చూస్తారు. అయినప్పటికీ పెడల్ తొక్కుతూనే ఉంటారు. అలా మన అంతరంగ స్థితిని పట్టుకుని ఉండాలి. అటు ఇటు చూస్తున్నప్పటికీ ధ్యానం లోపలే ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా, సాక్షి భావమును కలిగి ఉండాలి. బయట ప్రపంచంలో సాక్షిగా ఉండడంలా కాదు. లోపల ఏం జరుగుతుందో దానికి సాక్షిగా ఉండాలి. విషయాలను మనం సాక్షీ భావంగా చూడాలి అంటే ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. బయటి ప్రపంచం పట్ల తక్కువ శ్రద్ధ వహించి, పూర్తి ధ్యాస లోపలి వైపు పెట్టాలి. మీకు నేను పది కోట్ల రూపాయల నగదు ఇచ్చాను అనుకోండి. ట్రైన్ లో మీరు వాటిని అహ్మదాబాద్ వరకు ఎలా తీసుకెళ్తారు? ఒక్కరే వెళ్తున్నారు. మీరు కనీసం టాయిలెట్ లోకి కూడా వెళ్ళరు. ఎందుకంటే 10 కోట్లు బ్యాగులో ఉన్నాయి. వాటి పైనుండి చూపును ప్రక్కకు జరగనివ్వరు. దేనికి ఎక్కువ విలువ ఉంటుందో దాని కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఈ విషయంలో ప్రశంసించుకోవాలి. ఈశ్వరునికై చేసే ధ్యానానికి విలువ ఇవ్వండి, గౌరవం ఉంచండి. మరిచిపోతే తిరిగి గుర్తుకు తెచ్చుకోండి, ఆ స్థితి తిరిగి వస్తుంది. మరొక ఉదాహరణను ఇస్తాను. క్రొత్తగా మనం ఏదైనా కాంక్రీట్ వేస్తాం కదా! నా ప్రిసెప్టర్ శ్రీమతి ద్రౌపదీ దేవి అగర్వాల్ ఇలా చెప్పేవారు. మనం కొత్తగా కాంక్రీట్ వేసినప్పుడు… 24 గంటల పాటు దాన్ని నీళ్లతో తడిపి స్థిరపడనిస్తాం. ఆ కాంక్రీటు స్థిరపడక ముందే దాని ఉపయోగిస్తే ఏమవుతుంది? ముద్రలు పడతాయి. పాదాల అచ్చులు, కుక్కల అడుగులు పడతాయి. కొంతమంది కావాలనే దానిపై ఏదో వ్రాస్తుంటారు. కాంక్రీటు స్థిరపడడానికి కొంత సమయం పడుతుంది. మన లోపల స్థితి కూడా స్థిరపడడానికి కొంత సమయం కావాలి. స్థిరపడిన తర్వాత ఉపయోగించుకోండి. ధ్యానం పూర్తయిన తర్వాత ఐదు, పది నిమిషాలు కూర్చోండి. అది స్థిరపడే సమయం. డైరీ వ్రాస్తున్నప్పుడు ఇంకొంత ఎక్కువగా స్థిరపడుతుంది. ధ్యానం తర్వాత టీ తాగినా, టిఫిన్ చేసినా… ఈశ్వరుని ధ్యాసలో సాత్విక భావంతో చేసినట్లయితే స్థితి మరింత ఎక్కువగా లోపలే ఉంటుంది. ధ్యానం పూర్తయింది, ఆఫీసుకు వెళ్లాలి అని, ఇంకా టీ తేలేదని భార్యపై హడావుడిగా అరిస్తే స్థితి పోతుంది.
నిరంతర స్మరణ
మీరు రోజులో ఎవరిని ప్రతిసారీ జ్ఞప్తికి తెచ్చుకుంటారు? హృదయంలో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉన్నదో, ఎవరితో ఎక్కువ అనుబంధం ఉందో వారినే కదా! ఈశ్వరునితో అనుబంధం లేనే లేదు. ఆయన ఎవరో తెలీదు. అపరిచితుడు, నిరాకారుడు, ఆకారానికి అందనివాడు. ఆయనను ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటారు? పెళ్లికాని చిన్న పాపతో నీ భర్తను జ్ఞప్తికి తెచ్చుకోమ్మా అని చెప్పినట్లుగా… ఆ పాప ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించను కూడా లేదు… మనందరి పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఈశ్వరునితో మన వివాహం ఇప్పటివరకూ అవనే లేదు. ఆయన్ను గుర్తించను కూడా లేదు. ఆయన్ను ఎలా జ్ఞప్తికి తెచ్చుకోగలం? అందుకని తేలికైన విషయం ఏమిటంటే ధ్యానం చెయ్యండి. మీరు ధ్యానం ఎలా చెయ్యాలంటే, ఆ ధ్యానంలో మీ స్థితి ఎంత లోతైనది అయి ఉండాలంటే… అందులో దాని ప్రేమలో దాని లోతులో మీరు మునిగిపోవాలి. ఆ స్థితిని అలాగే ఉంచుకోండి. తర్వాత ఏమవుతుందంటే… మన పరిస్థితి చాలా భవ్యంగా తయారవుతుంది. ఎవరైనా మనకు నాలుగు కారెట్ల డైమండ్ కానుకగా ఇచ్చారనుకోండి. మీరు ఆ కానుక ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞులవుతారు కదా! అంటే మనం మనకు అంతరంగంలో కలిగిన స్థితిని ఆనందించటం ఎప్పుడైతే మొదలు పెడతామో, దానితో ఐక్యమైపోతాం. అప్పుడు ఆ స్థితిని మనకు ప్రసాదించిన వారి పట్ల ఎవరినైతే మనం చూడను కూడా చూడలేదో… చూడకుండానే ఆయన మనకు ఇంతటి స్థితిని ఇచ్చారు అని వారి పట్ల మనకు కృతజ్ఞతా భావం కలుగుతుంది. తర్వాత ఆ స్థితి లోతుల్లోకి తిరిగి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రేమ అధికమవుతుంది. మన హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళనే వెళ్లదో అటువంటి స్థితిని నిరంతర స్మరణ అని నేను అంటాను. రాధాకృష్ణుల ప్రేమలా నిరంతరం ఉంటుంది. రాధ యొక్క భాగస్వామ్యం ఎటువంటిది? ఆమె ఎల్లప్పుడూ ఆయనతో అనుబంధం కలిగి ఉండేది. స్మరణ ఎల్లప్పుడూ ఉంటూ ఉండేది. ఆ స్మరణ ఎలా ఉండేది అంటే ఒకసారి ఆమె పరిస్థితి ఎలా అయిందంటే… ఆమె కృష్ణుని నామం ”కృష్ణా, కృష్ణా” అని తనలో తానే జపిస్తూ ఉండేది. ఆ స్మరణ తరువాత తానే ”రాధా, రాధా” అని అనటం ప్రారంభించింది. ప్రజలు ఆమెను పిచ్చిది అయిపోయింది, తన నామస్మరణ తానే చేసుకుంటోంది అనేవారు. కానీ ఆమె తన నామం తాను స్మరించడం లేదు. ఆమె స్వయంగా కృష్ణునిగా తయారైపోయింది. అలా కృష్ణునిలా అయిపోయిన తర్వాత ఆమె ”రాధా, రాధా” అని స్మరించడం మొదలుపెట్టింది. ఇంకొక చోట కూడా చెప్పబడింది ఏమంటే, మీరు ఎటువంటి స్మరణలో ఉండాలంటే… “భగవంతుడే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకోవాలి’’. మీ గురువు మిమ్మలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారా? అటువంటి స్మరణ ఉండాలి. మమేకమైపోవాలి.
అనారోగ్య స్థితిలో ధ్యానం చేయవచ్చా?
సరే, చివరి ప్రశ్నతో ప్రారంభిద్దాం… ఏదైనా జబ్బు చేస్తే, అది సెలవు రోజే! ధ్యానం చేయవద్దు. ధ్యానం చేయలేనప్పుడు కళ్లు మూసుకోవడం ఎందుకు? అనారోగ్యంతో ఉంటే, ఆ సమయంలో ధ్యానం చేయడం సరికాదు. మీ మనసుకు చేయాలనిపిస్తేనే చేయండి, చేయవద్దనిపిస్తే చేయకండి. బంధనం ఏమీ లేదు. మీరు బాగా ఉన్నప్పుడు కూడా దాటవేస్తారు కదా! చాలా రోజులు, నెలలు గడిచిపోతాయి. మీకప్పుడు బాధ కలగదు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు ఆందోళన? వ్యాధిని బాగా ఆస్వాదించండి. ధ్యానంతో దాన్ని పాడు చేయకండి. ధ్యానంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది వస్తూ పోతూ ఉంటుంది. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, డిస్టర్బ్ అయినప్పుడల్లా చాలాసార్లు అనవసరమైన ఆలోచనలు వచ్చేవి. అప్పుడు, ‘ఈరోజు మాకు సిట్టింగ్ ఇవ్వండి’ అంటూ ప్రిసెప్టర్ల వద్దకు వెళ్లేవాళ్లం. తర్వాత కొన్ని రోజులు ఈ ఛార్జ్ పని చేస్తుంది. మన ఫోన్ బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్లే, మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు పదే పదే సిట్టింగ్ తీసుకోండి. తద్వారా మనస్సు నియంత్రించబడుతుంది. ఎక్కువగా భగవంతుని ధ్యాసలో ఉంటే, దాని వలన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా, ధ్యానంలో ఏ ఆలోచనలు మిమ్మల్ని బాధపెడతాయో వాటిని విశ్లేషించండి. ఒక సాధారణ లింక్ ఉంటుంది. మనం పూర్తి చేయని పని, తప్పిపోయిన పని, మనపై ముద్ర వేసే పని… ఎందుకు చేసాం అనే అపరాధ భావపు ఆలోచనలు…ఇదంతా అసంపూర్తి వ్యవహారం. ఇది సగం చేసి వదిలేశాం. ఇది చేయాల్సింది, చేయలేదు. మీరు పనిని పూర్తి చేసినప్పుడు కూడా, దాని గురించి ఆలోచనలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. కాబట్టి ఎప్పుడూ, ఈ పని చెయ్యవలసింది, పూర్తి కాలేదు. కృతజ్ఞతలు చెప్పాల్సినప్పుడు చెప్పలేదు, ఆర్డరు ఇవ్వవలసింది, కానీ మరచిపోయాం. బంధువులొస్తారని భార్యకు చెప్పటం మర్చిపోతాం…ఇవి తర్వాత తగవులౌతాయి. ఎందుకంటే మీరు చెప్పనే లేదు. మరి ఇంటికి 10 మంది వచ్చేశారు. కనుక అసంపూర్ణత జీవితంలో బాధిస్తుంది. అలాగే మన ధ్యానంలో, భగవంతుని ధ్యానం లో కూడా. ఇప్పుడే మోడీజీ సందేశం వచ్చింది “యోగ: కర్మసు కౌశలం”… దానికి రెండు అర్థాలు వస్తాయి. యోగా వలన అన్నీ నైపుణ్యంతో అవుతాయి. మరియు మనం నైపుణ్యంతో చేసే ఏ పని అయినా యోగం అవుతుంది. సమర్ధవంతంగా ప్రతిదీ చేయాలి. అసంపూర్తిగా వదిలివేయకూడదు. మొత్తం పూర్తి చేయాలి. ఏ పనిలో మనకు అనుబంధం, ప్రేమ, భక్తి అనేవి ఉండవో, ఆ పని ‘శ్రమ్’ అవుతుంది. అది శ్రమ అవుతుంది. అలాగే భక్తితో చేసే పని, అది ఒక రకమైన పూజ అవుతుంది. ఇంట్లో వంట చేసినప్పుడు కూడా అనుబంధం, ప్రేమ ఉండకుండా… ఈరోజు వండాలి, ఈరోజు వండాలి అని ఆస్వాదించకుండా పనిచేస్తే అది విషపూరితం అవుతుంది. అందుకే వంట మనుషుల్ని పెట్టుకుంటారు. సహాయకులను పెట్టుకుంటారు… అయితే అంతా వ్యర్థమే! ఆ వ్యక్తులు చేస్తారు కానీ, మీరు గుర్తుంచుకోండి, గతి లేక చేస్తారు. అందులో ప్రేమ ఉండదు. ఇది కూడా చాలా సుదీర్ఘమైన అంశం. మీరు ఒక్క వాక్యంలో అర్థం చేసుకోండి. థాంక్యూ!
చైతన్య వికాసాన్ని కొలవగలమా?
దయచేసి బాబూజీ స్వీయ ఆత్మకథ మొదటి సంపుటిని చదవమని నేను సిఫార్సు చేస్తాను. ఆయన అభ్యాసీగా ఉన్నప్పటి ఆయన డైరీ. యాత్ర ఎలా ప్రారంభం అవుతుంది? అది ఎలా ముందుకు వెళుతుంది? ప్రతి దశలోనూ బిందువు వద్ద మన చైతన్యం ఎలా మార్పు చెందుతుంది? అనేవి ఇందులో సవివరంగా తెలియ చెప్పబడ్డాయి. చైతన్య పరిణామంలో మీ అవగాహన కూడా మార్పు చెందుతుంది. మీ అవగాహన లో మార్పుపై ఆధారపడి, మీరు పరోక్షంగా ఎక్కడ ఉన్నదీ తెలుసుకోగలుగుతారు. చాలామంది అదంత ముఖ్యం కాదని అంటారు. అయితే నేను బలంగా భావించేదేమంటే, ఈ విషయాలన్నీ గ్రహించగలిగినప్పుడు… అది మీ అంతరంగంలో నుండి ప్రేరణను, స్ఫూర్తిని కలిగిస్తుంది. మీలో రోజువారీ మార్పులను గమనిస్తే, రోజూ కాకపోయినా తరచుగా మీలో మీరు మార్పును గమనించినప్పుడు… అది మనల్ని మరింత ధ్యానం చేయడానికి, మరింత క్లీనింగ్ కు ప్రేరణ కలిగిస్తుంది. అలాగే మనలో స్వచ్ఛత మెరుగుపడే కొలదీ, మనం నిరంతరం అభివృద్ధి చెందుతాం. ఇలా సాధనకి, అంతరంగ స్వచ్ఛతకి, మనలో చైతన్య పరిణామానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. థాంక్యూ!
మీలా తయారవడం ఎలా?
భగవంతుని సామ్రాజ్యంలో నకిలీలు ఉండకూడదు. ఎందుకంటే పరమాత్మ మనందరినీ విశిష్టంగానే సృష్టించారు. మీకు మీదైన ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది. అలాగే ప్రత్యేకమైన విధి కూడా! అది వేరే వ్యక్తి తరహాలో ఉండదు. మీరు మీలాగే ఉండండి. అన్ని పరిస్థితుల్లోనూ మీ హృదయాన్ని అనుసరించండి. బాబూజీ మహరాజ్, వివేకానంద స్వామి వంటి ఉన్నతాత్మలు, అలాగే భగవాన్ శ్రీకృష్ణుడు మనకి ప్రేరణ ఇస్తారు. అలాగే మనం వాళ్ళ కన్నా అభివృద్ధి చెందాలని ఆశిస్తారు. కొందరు ఇది నమ్మలేకపోవచ్చు, కానీ ప్రతి తల్లి, తండ్రి వాళ్ళ పిల్లలు వారిని అధిగమించాలని కోరుకుంటారు కదా! కాదా? మరి శ్రీకృష్ణుడు, బాబూజీ అలా ఎందుకు అనుకోరు? కనుక బాబూజీ మిమ్మల్ని తనలాగే తయారవ్వాలని ఆశించరు. మీరు తన కన్నా బాగా తయారవ్వాలని కోరుకుంటారు. సరేనా… శుభాకాంక్షలు!
ధ్యానానుభవాలు
అలా ఎందుకు జరుగుతుంది అంటే నా దగ్గర సమాధానం లేదు. జరుగుతోంది కనుక దాన్ని డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇతర సిట్టింగ్‌లలో ఏం జరుగుతుందో చూడండి. ప్రతీసారీ మనం లోతుల్లోకి వెళ్తాం. అయితే ప్రతీ సిట్టింగ్ లోతులో చాలా తేడా ఉంటుంది. మనం శాంతిని అనుభూతి చెందుతాం. ఒక్కో సిట్టింగ్ శాంతి ఒక్కోలా అనిపిస్తుంది. రెండవ సిట్టింగ్‌లో, మనకు శాంతి వేరే విధంగా అనుభవం లోకి వస్తుంది. అందులో కూడా తేడా ఉంది. మనం దేవుని ప్రేమలో మునిగి పోయినప్పుడు, ఈ రోజు ప్రేమ ఒక రకంగా ఉంది. రేపు మరో రకమైన ప్రేమగా కనిపిస్తుంది. ఎంత గాఢంగా ఉంటుందంటే అది లేకుండా మనం జీవించడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇవన్నీ సాధ్యమే. ఇలా జరుగుతూ ఉండే ఈ అనుభవాలను మనం నోట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల, మన పథం ఎలా సాగుతోందో, మన ప్రయాణం ఎలా సాగుతోందో కూడా తెలుస్తుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత చదువుకుంటే, ఎలా ముందుకు ప్రయాణించారో మీకు ఒక మ్యాప్ కనిపిస్తుంది.
సరియైన గురువుని, మార్గాన్ని ఎలా అన్వేషించాలి?
అనేకమంది గురువులు, అంటే అక్కడ సంతుష్టి లేదు, అది చంచలత్వం అని అర్థం. ఎక్కడైనా ఆనందం లభించింది అంటే ఇంక వేరే చోటికి వెళ్లవలసిన అవసరం ఏమిటి? గురువు యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఏమిటంటే… వారు మనల్ని దండించి సరైన దారిలో పెడతారు. ప్రారంభంలో ప్రేమ లభిస్తుంది. తర్వాత ఆయన చేతిలో దెబ్బలు తిన్న తర్వాత… మన అహంకారం అంతం కావడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ మీరు విచ్ఛిన్నమయ్యేంతగా దండించరు. వారి పని చాలా సమతుల్యంగా ఉంటుంది. కోరికలను వదలడం చాలా సులభం. కానీ అహంకారాన్ని వదలడం చాలా కష్టమైన పని. మన సంస్కారాలను, కోరికలను అంతం చేయడమే గురువు యొక్క ముఖ్యమైన పని… రెండవది, అహంకారాన్ని అంతం చేయడం. ఎప్పటి వరకు అయితే అహంకారం ఉంటుందో… నేను సమాధి స్థితిని పొందాను అని, అప్పటివరకు భగవంతుడు లభించడు. నేనిది సంపాదించాను, అది సంపాదించాను… ఇవన్నీ పనికిరాని విషయాలు… యోగులలో కూడా అహంకారం ఉంటుంది. ఈ బిందువు జాగృతమైంది, ఆ బిందువు జాగృతమైంది, ఈ అనుభవం అయింది అని… కానీ మనం అన్నీ భగవంతుని ముందు అర్పణ చేయాలి. మీ కృపవల్లే ఇది లభించింది అని. ‘నేను ధ్యానించాను, నాకు ఈ అనుభవం లభించింది’ అని అనడం అహంకారపు మెట్లపై నడవడం లాంటిది. మనం డైరీలో రాసుకున్నప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, మాకు ధ్యానంలో ఈ అనుభవం కలిగింది లేదా ఆయన నాకు ఈ అనుభవాన్ని కల్పించారు. గురు మహరాజ్ కృప వల్ల అలా జరిగింది అనే భావనతో ఉండాలి. ఎప్పుడైతే ‘నేను ధ్యానం చేసినప్పుడు ఈ అనుభవం కలిగింది’ అని మన మాటలు మొదలవుతాయో… అప్పుడు మనం దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ‘నేను’ మీదకి. మన వైఖరిని మార్చుకోవాలి. భగవంతుడి వైపు మళ్ళించాలి… గురువు చేసే పని ఏమిటంటే నేను నుండి నీవు అనగా భగవంతుని వైపుకు వెళ్లేలా చేయడం వారి పని అదే. వారిని ఎలా ఇష్టపడాలి? అది మీపై ఆధారపడి ఉంది. వారి సన్నిధిలోకి వచ్చినప్పుడు మీకు శాంతి లభిస్తుంది. ఆత్మకి ఒకటే ధ్యేయం! ఈ జీవితం లోనే కనీసం మోక్షం పొందడం… అటువంటి సాధన, గురువు లభించినప్పుడు మీ ఆత్మకు ఒక విధమైన శాంతి, ప్రశాంతత లభిస్తాయి. ఒక రకమైన తేలికదనాన్ని అనుభూతి చెందుతారు. అదే తప్పుదారి అయితే మీ హృదయమే చెబుతుంది, ఇది కాదు అని. రెండవది, మూడవది కూడా వెతకాల్సి ఉంటుంది. హృదయంలో ఇదే సరైనది అనిపించేవరకు. అమ్మ నాన్న చెప్పిన వారిని పెళ్లి చేసుకుంటే సరే! కానీ పదిమంది అబ్బాయిలలో మీరే సొంతంగా నిర్ణయించుకోవాలంటే, ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? థాంక్యూ!
23-06-2024
మెదడు పై ధ్యాన ప్రభావం
మొదటిగా ధ్యానం గురించి తెలుసుకోవాలి అంటే ధ్యానం చేసిన తరువాతే తెలుసుకోగలం.ప్రాశ్చాత్యులు ధ్యానం గురించి వ్రాయడం మొదలు పెట్టినప్పుడు ధ్యానం అనే పదాన్ని ఆంగ్లం లోకి అనువదించారు… మనం ధ్యానం అర్థం పిల్లలకు చెప్పాలి అనుకున్నపుడు ఆంగ్ల నిఘంటువు లో వెదుకుతాం… ధ్యానం అంటే ఆంగ్లంలో “మెడిటేషన్”. ఈ పదానికి ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లోని అర్థం… “ఒక వస్తువు మీద నిర్ధారించిన సమయం పాటు దృష్టి నిలపడం” అని.అదే మన పురాణాలలో చూస్తే ధ్యానం అంటే మనసు పరిధిని దాటి వెళ్ళడం మనసుకి అతీతంగా వెళ్లడం.మెదడులో కుడి వైపు లేక ఎడమ వైపు అనేది వుండనే వుండదు. ధ్యానం యొక్క ప్రభావం మనసుకు అతీతంగా వెళ్ళడం.హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనం హృదయం పైన ధ్యానం చేస్తాం… ‘మన హృదయంలో దివ్యత్వం వుంది’ అనే ఆలోచన మీద మనసు నిలుపుతాం. గణిత సిద్ధాంతాన్ని రుజువు చెయ్యడంలా… ఇది + ఇది = ఈ సిద్ధాంతాన్ని నిరూపించే క్రమంలో ఒక జవాబు అనుకుని ప్రారంభిస్తాం. చివరికి మనం ఆ సిద్ధాంతం సరైనదని లేదా సిద్ధాంతం తప్పని నిరూపిస్తాం. ఇదే విధంగా ధ్యానం కూడా ఆ అనుభవం కొరకు ఒక ప్రయోగంలా చేస్తాం. మీకు ఆ మానసిక అవధి దాటినట్లు అనుభవం కలిగితే ఈ ధ్యాన ప్రయోగం సరైనది. మీరు అనుభూతి చెందకపోతే ఈ ప్రయోగం సరైనది కాదని. ఏది ఏమైనా మనం హృదయంపై ధ్యానం చేసినప్పుడు… శరీరంలో మెదడు కుడి భాగంలో పని మొదట ప్రారంభమవుతుంది.
ధ్యానంలో కొన్ని మెళుకువలు
చాలామంది పడుకున్నారు, అని అనిపించిందా మీకు? కుర్చీలో కూర్చుని ఐదు నిమిషాలలో ఎలా నిద్రపోతారో చెప్పండి? పడుకుని ఉన్నా కూడా నిద్రపోలేము కదా! మేము చేయించే ఈ ధ్యానంలో ఇందాక ఆ సోదరుడు చెప్పినట్లుగా ప్రాణాహుతి పై రీసెర్చ్ చేస్తున్నారు… ప్రాణ అంటే శక్తి… మా పద్ధతిలో ప్రాణాహుతి ప్రయోగించబడుతుంది. అది ఒక యోగశక్తి. దాని వలన ప్రజలు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్తారు. కొంతమంది గురక పెడుతుంటారు. కానీ అది గురక కాదు… వాళ్లు యోగ నిద్ర లోకి వెళ్ళిపోతారు. 10 నుండి 15 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నవారు… మొదటి సత్సంగంలోనే సమాధిలోకి వెళ్తారు… ఇది ప్రాణాహుతి ప్రభావం. రెండవది కళ్ళు తెరచి ధ్యానం చేయవచ్చా లేదా అని. మీకు తెలియదు, మీరు K G లో విద్యార్థిని అన్నారు… ఒక విషయం చెప్తాను, వినండి… యోగశాస్త్రంలో చెప్పబడిన నాల్గవ చైతన్య స్థితి. దానినేమంటారు? చైతన్యపు నాల్గవ స్థితిని ఏమంటారు? మొదటిది మెలుకువ స్థితి, రెండవది స్వప్న స్థితి… మూడవది గాఢ నిద్రా స్థితి, నాల్గవ స్థితిలో లోలోతుల్లోకి వెళ్తారు. కానీ పూర్తి ఎరుకతో ఉంటారు, ఇది తురీయ స్థితి. మనం శాస్త్రీయంగా ప్రయోగం చేసినప్పుడు… ఎలక్ట్రో ఎన్సెఫలో గ్రాఫ్ తో కొలుస్తారు, అది ఎలా చేస్తారంటే తలపై ఎలక్ట్రోడ్స్ బిళ్ళలను తగిలిస్తారు. ఎందుకంటే మనం ఆలోచించినప్పుడు నాడుల్లో విద్యుత్ ప్రసారం (ఎలక్ట్రిక్ కండక్షన్) జరుగుతుంది. విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. శాస్త్రీయ విజ్ఞానంలో దీన్ని విద్యుదయస్కాంత క్షేత్రం (ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్) అంటారు. దాన్ని కొలుస్తారు. ఈ చిన్న అమ్మాయిలో మెదడు చురుకుగా పనిచేస్తుంది. చాలా వేగంగా అంటే చాలా వేగంగా నడుస్తాయి. అంటే విద్యుత్ ప్రవాహం ఒకచోట నుండి మరోచోటికి త్వరితంగా అందించబడుతుంది. అయస్కాంత క్షేత్రం (మ్యాగ్నెటిక్ ఫీల్డ్) పెద్దగా ఏర్పడుతుంది. పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) కూడా చాలా వేగంగా ఉంటుంది. మనం ఆసక్తికరమైన పుస్తకాలు చదివినప్పుడు, దానిలో పూర్తిగా లీనమైనప్పుడు… ఈ అయస్కాంత తరంగాలు ఎత్తు తగ్గి లయగా కదులుతాయి. మనసులో ఆలోచనలు తగ్గుతాయి. ధ్యానంపై చాలా ప్రయోగాలు చేశారు. తమ జీవితంలో ఎక్కువ కాలం అంటే 20వేల లేదా 30వేల గంటల పాటు సాధన చేసిన వ్యక్తుల మెదడులో గామా వేవ్స్ ఏర్పడతాయి. డెల్టా వేవ్స్ ఏర్పడతాయి. కొన్ని నెమ్మదిగా ఉంటే మరికొన్ని చాలా వేగంగా ఏర్పడతాయి. అవి గ్రాఫ్ లో చూపబడతాయి. ఈ సహజ మార్గ ధ్యానంలో మొదటిసారే ఎందుకిలా జరిగింది? వారి మెదడులో అలలు నేరుగా తురీయ స్థితిలోకి వస్తాయి. నాల్గవ చైతన్య స్థాయి అది. దాంతో ఏమవుతుంది? గురకైతే పెడుతున్నారు కానీ పూర్తి మెలుకువ స్థితిలో ఉన్నారు. గాఢనిద్రా స్థితిలో పూర్తి విశ్రాంతి స్థితి మరియు పూర్తి ఎరుక కలిగిన స్థితి ఉంటాయి. ఇది యోగ సాధన తోటే జరుగుతుంది. కళ్ళు తెరిచి కూడా ఈ స్థితిని తెచ్చుకోగలిగితే… ధ్యానం ఉదయం అరగంట చేసిన తర్వాత ఏర్పడిన ధ్యానస్థితి కూడా ఎంత సూక్ష్మంగా సమాధి స్థితిలో ఉంటుందంటే… కళ్ళు తెరిచినప్పుడు కూడా మెదడులోని శూన్యస్థితి సరిగ్గా అలాంటి తురీయ స్థితిలో ఉంటుంది. దీన్ని మేము తురీయాతీత స్థితి అంటాం, అది చైతన్యం యొక్క ఐదవ స్థితి. సైన్స్ ఇప్పటివరకు మూడు స్థితులనే తెలియజేసింది. డాక్టర్ శర్మ గారితో మాట్లాడండి… వారు మూడు స్థితులు మాత్రమే తెలియజేయబడ్డాయని చెప్తారు… నాల్గవ మరియు ఐదవ స్థితులు మన ఋషులకు మాత్రమే తెలుసు. శాస్త్రాల్లో మనం చదువుతాం. కానీ హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో మాత్రమే తురీయ మరియు తురీయాతీత స్థితులను శాస్త్రీయంగా చూపగలం. ఇది ఒప్పుకునే విషయం కాదు. శాస్త్రీయంగా నిరూపించబడింది. మీరు కూడా అందరూ గురక పెడుతున్నారని అన్నారు. అది గురక కాదు. అది తురీయ స్థితి.
చైతన్య స్థితులకి సాక్ష్యం ఉందా?
సాక్ష్యాధారం కొరకు చేసే ప్రయోగానికి కూడా పరిమితి ఉంటుంది. ఉదాహరణకు ధ్వని తరంగాలను మీరెంతవరకు వింటారు? ఒక్కసారిగా అత్యున్నత స్థాయి లేదా అత్యల్ప స్థాయి ధ్వని మనం వినలేం… కానీ కుక్కలు, పిల్లులు ఆ శబ్దాలను గ్రహిస్తాయి. అదే విధంగా చూపుకు సంబంధించిన కాంతి యొక్క వర్ణపటం (స్పెక్ట్రం) లోని అతినీల లోహిత (అల్ట్రావైలెట్) మరియు పరారుణ (ఇన్ఫ్రారెడ్) స్థాయిలను… మనం చూడలేం అంటే దాని అర్ధం తక్కువ/ఎక్కువ ఫ్రీక్వెన్సీలో వెలుగు లేదని కాదు. మన నాడీమండల వ్యవస్థలో ఒక పరిధికి సంబంధించిన చైతన్యాన్ని ఉదాహరణకి సమాధి స్థితి ఏర్పడితే… దాన్ని తీసుకుని విద్యుదయస్కాంత పరిధిలో లెక్కించొచ్చు. దాని కన్నా మించిన స్థాయి దాన్ని కొలవలేం. అటువంటప్పుడు అక్కడ సాక్ష్యాధారం తప్పుతుంది. ఎందుకంటే అక్కడ ఇక ఈ విధమైన నిరూపణ ఉండదు. దీన్ని మీరు వ్యక్తిగతంగా చూపించవచ్చు… ఈ వ్యక్తిగత అనుభవం కూడా ఒక స్థాయి వరకు మాత్రమే చెప్పగలుగుతాం… ఆ తర్వాత చెప్పడానికి, దాన్ని వర్ణించడానికి సరైన పదాలు లేవు. నేను ప్రశాంతగా ఉన్నానని మీకు చెప్పినా కూడా… మీకు ప్రశాంతత అంటే అర్థమైన మేరకు మాత్రమే నేను ప్రశాంతంగా ఉన్నానని అర్ధం చేసుకుంటారు… అంటే మీరు ఎంత ప్రశాంతతను పొందారో అంత మేరకు మాత్రమే నాలోని ప్రశాంతతను అర్ధం చేసుకోగలుగుతారు. కానీ మీరు పొందిన ప్రశాంతత, నేను పొందిన ప్రశాంతత రెండూ సమానం కావు. రెండింటికీ తేడా ఉంటుంది. అందుకనే ఉపనిషత్తులలో కూడా ఇదే చెప్పబడింది. అంతిమ స్థాయికి చేరుకున్న వారు… నేతి నేతి నేతి – అంటే, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో దానితో పోల్చగలిగిన వస్తువు ఏదీ లేదు. ఇది అలా ఉంది అది ఇలా ఉంది అని చెప్పలేం. కాబట్టి ఒక స్థాయికి చేరిన తర్వాత, ఆ చైతన్యానికి సాక్ష్యం అనేది అసాధ్యం.
జన్మరాహిత్యం
నేను ఈ ధ్యాన పద్ధతిని సరదా సరదాగా మొదలు పెట్టాను. జీవితానికి సంబంధించి ఏ లక్ష్యమూ లేదు. కానీ తపన ఉండేది. ఈశ్వరుడు ఎవరు? నేను ఎందుకు ఉన్నాను? ఎక్కడికి వెళ్తాం? ఇలాంటి తపన అయితే ఉండేది. అప్పుడు ఎవరో చెప్పారు… జనన మరణాల చక్రం అంతమై ముక్తిని పొందడం గురించి… ఈ సహజమార్గ పధ్ధతి నాకు నేర్పించిన ఒక సోదరి, ఆమె పేరు ద్రౌపదీ దేవి అగర్వాల్. ఆమె నాకు ఇనీషియేషన్ ఇచ్చారు. ‘ధ్యానం ఎందుకు చెయ్యాలని అనుకుంటున్నావు’ అని ఆమె నన్ను అడిగారు. నేను వివేకానందుని లాగా అవ్వాలను కుంటున్నాను, సన్యాసం తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు ఆమె ఇలా చెప్పారు. సన్యాసం తీసుకోవటం చాలా తేలిక… వివాహం చేసుకోవా? అని అడిగారు. చేసుకోను అని నేను చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారు. “అనవసరంగా లింగ బేధాన్ని సృష్టించడానికి భగవంతుడు ఏమైనా మూర్ఖుడా?… ఒక్కటే అవసరం అయితే, రెండింటిని ఎందుకు సృష్టించాడు?” అని. కాబట్టి ఎవరైతే అసహజమైన జీవితాన్ని సాగిస్తారో, వారు ఈశ్వర ప్రాప్తిని పొందలేరు. ఇది మొదటిది. మీరు భగవంతుని కంటే తెలివైన వారేమీ కాదు. మన ఋషులు, మునులను చూడండి… ప్రతి ఒక్కరూ వివాహితులే, శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు… అవతార పురుషుడు, శ్రీరాముడు కూడా వివాహం చేసుకున్నాడు… ఏ ఋషి పేరైనా మీరు ఇవ్వండి… సంస్కారాలను అంతం చెయ్యాలంటే వాటిని అనుభవించి తీరవలసిందే. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఏ సంస్కారాలను మనం కలిగి ఉంటామో దాన్ని బట్టి… అంటే మంచి సంస్కారాలు అయితే మంచి కుటుంబం లోకి, చెడు సంస్కారాలు అయితే చెడు కుటుంబం లోకి… ఎటువంటి సంస్కారాలు చేసుకొని ఉంటామో దాన్ని బట్టి కుటుంబం లేదా గర్భంలోకి వారికి ప్రవేశం లభిస్తుంది. ఎప్పటివరకు అయితే ఈ సంస్కారాలు అంతం కావో అప్పటివరకూ వారి జనన మరణ చక్రం జరుగుతూనే ఉంటుంది. కానీ ఏ విధంగా మనం ఈ భూమి మీదకు సంస్కారాలను అనుభవించడానికి వచ్చామో… అప్పటినుండి మనం ఇంకా భారం పెంచుకుంటూనే పోతున్నాం. ఎటువంటి జీవితం గడపాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారంటే… బురదలో ఉన్నప్పటికీ తామరాకుపై ఆ ప్రభావం ఏమీ పడదో, అలాంటి జీవితాన్ని గడపాలి అని… కానీ అటువంటి మనస్సు కావాలంటే మీరు ఎలా చేస్తారు? సహజ మార్గంలో చేసే ధ్యాన పధ్ధతి ఏదయితే ఉందో దానిలో అది చాలా తేలిక అవుతుంది. ఈ పద్ధతిలో సాధన వలన సంస్కారాలు తొలగిపోతాయి. దీనికోసమే సాయంకాలం నిర్మలీకరణ చేసుకుంటాం. ఆరోజు ఏవైతే సంస్కారాలు ఏర్పడ్డాయో వాటిని శుభ్రం చేసేసుకుంటాం. పూర్వజన్మ నుండి వచ్చినవి లేదా గడిచిపోయిన కాలానికి సంబంధించిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో… వాటిని ప్రిసెప్టెర్ కు, గురువుకు వదలివేస్తాం. మనకు అనుభూతి కూడా కలుగుతుంది. ‘అవును, నా అలవాట్లను వదలి వేసాను’ అని. ఏ అలవాటైనా ఎలా వస్తుంది? పూర్వజన్మ సంస్కారాల ప్రభావం వల్లనే వస్తుంది… లేదా కొత్త సంస్కారాలు ఏవైతే వస్తున్నాయో అవి మన స్నేహితుల ప్రభావం వల్ల వస్తాయి… కాబట్టి ఈ సంస్కారాలను తొలగించుకోవటం అత్యంత ఆవశ్యకం. ఎప్పటివరకూ మనం ఈ పిండ ప్రదేశంలో ఉంటామో… పిండప్రదేశం అంటే పంచభూతాల నియంత్రణలో ఉన్నంతవరకూ, వెళ్లడం తిరిగి రావటం జరుగుతూనే ఉంటుంది… కానీ యోగ సాధన వల్ల – ముఖ్యంగా హృదయ చక్రం నుండి మొదలు పెట్టే… ఈ మన ఆధ్యాత్మిక యాత్ర, హృదయ చక్రం నుండి మొదలై ఆత్మ చక్రానికి… ఆత్మ చక్రం నుండి అగ్ని చక్రం నుండి జల చక్రానికి అక్కడి నుండి వాయు చక్రానికి జరుగుతుంది. వీటిని అధిగమించిన తరువాత మోక్ష స్థితి కలుగుతుంది. మోక్షం యొక్క అర్ధం మళ్ళీ జన్మ ఉండదు అని కాదు. మోక్ష స్థితి ఎలాంటిదంటే అక్కడ మనకు పూర్తి స్వాతంత్య్రం లభిస్తుంది. ప్రకృతి మనకు పూర్తి స్వాతంత్య్రం ఇస్తుంది. ఏదైనా పని కోసం భూమాత పైకి రావలసి వచ్చినప్పుడు, మీరు సంతోషంగా వస్తారు. ఒకవేళ రావాలనుకోకపోతే మీకు ‘నేను వెళ్ళను’ అనే స్వాతంత్య్రం ఉంటుంది. అది నిజమైన స్వాతంత్య్రం. అది మోక్ష స్థితి. ముక్తి అనేది తాత్కాలికమైనది. ముక్తి మరియు మోక్షం రెండింటికి చాలా తేడా ఉంది. ముక్తి మనకు కాపిటల్, అంటే ఆధ్యాత్మిక ఆస్తి… ఎప్పటివరకూ అయితే మన వద్ద ఈ ఆధ్యాత్మిక ఆస్తి ఉంటుందో, అప్పటివరకూ మనం ముక్తులమై ఉంటాం. ఎప్పుడైతే ఈ ఆస్తి పూర్తయిపోతుందో, అప్పుడు తిరిగి ఇక్కడికి రావాల్సిందే… మోక్షం అనేది కనీస స్థాయి. చాలా చిన్న స్థితి. దానిని దాటి కూడా చాలా విస్తారమైనది ఉన్నది. విస్తారమైన పిండప్రదేశం. దాని తరువాత బ్రహ్మాండం, అనంతరం పరబ్రహ్మాండం… దాని తరువాత కూడా విస్తారమే విస్తారం. తర్వాత శరణాగతి వస్తుంది. దీని గురించి భగవద్గీతలో కూడా చెప్పబడింది. ప్రపన్న స్థితి. ప్రపన్న అంటే పూర్తిగా, ప్రతి ఒక్కటీ ఆయనకు సమర్పించేస్తాం. దాని అర్ధం అందరం రిటైర్ అయిపోయామని కాదు. ఏ విధమైన రిటైర్మెంట్ అవుతామంటే, మనం ఎవరికీ భారం కాము.
23-06-2023 DAAJI Jagdish Swami Town Hall Patna MP EVENING
ధ్యానం ఏ సమయంలో ఎంతసేపు చేయాలి?
సూర్యోదయానికి ముందు చంద్రనాడి చురుకుగా పని చేస్తుంది. మన గ్రహించే శక్తి ఎక్కువగా వుంటుంది. చంద్రనాడి వల్ల శక్తులను త్వరగా గ్రహించటం జరుగుతుంది. ప్రాణాహుతి శక్తి, విశ్వ శక్తి రెండూ ఏకమయ్యే సమయమిది. అందుచేత సూర్యోదయానికి ముందు చేసే ధ్యానం మంచిది. కాని కొంతమందికి, ఉద్యోగ రీత్యా రాత్రి పొద్దుపోయే వరకు పనిచేసే వారికి, ఆ సమయంలో నిద్ర వస్తున్నట్లైతే… ఒక సమయాన్ని నిర్ధారణ చేసుకుని ఒక గంట ధ్యానం చేసుకోవచ్చు. ఉదయం 9 గంటలకు గానీ 10 గంటలకు గానీ నిద్ర లేచేటట్లైతే… 15 నిమిషాల పాటు ధ్యానం చేయటంతో మొదలుపెట్టి, ఒక గంట వరకు చేయవచ్చు. గంట కంటే ఎక్కువ సేపు అవసరం లేదు. ఇష్టమైతే, సెలవు రోజు గంట కంటే ఎక్కువ సేపు చేయవచ్చు. గంటసేపు చేసిన తరువాత ఐదు, పది నిమిషాలు విరామం తీసుకోండి. ఆసక్తి ఉన్నప్పుడు మధ్య మధ్య చిన్న విరామాలతో ధ్యానం కొనసాగించవచ్చు.
24-06-2023 – Daaji Speech at Chhattarpur Morning
ధ్యానమా? మంత్రోచ్ఛారణా? ఏది మంచిది?
ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి అనేది మొదట మనం అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నను సరిగా అర్థం చేసుకుంటాము. ఈశ్వరునితో మన చైతన్యాన్ని అనుసంధానించడమే ధ్యానం యొక్క లక్ష్యం. ఈశ్వరుడు మనలో ఉన్నాడు. కాని మన చైతన్యం బయట ప్రపంచంతో ఎక్కువ ముడిపడి ఉంది. దాన్ని మనం ఈశ్వరమయం చేయాలి. దానికి అడ్డంకి కలిగిస్తున్నది ఏమిటి? గురువుగారు ఏమంటారంటే, మన మనసు లేదా మన మెదడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అది మన శత్రువు, అలాగే మన మిత్రుడు కూడా! దానికి మనం సరిగ్గా శిక్షణ ఇస్తే మనలను ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. అలాగే మనసుతో పాటు అహంకారం కూడా ఉంటుంది. అది చాలా అల్లకల్లోలం సృష్టిస్తుంది. మనకు ఆ భగవంతునికి మధ్య దూరం, అహంకారం వల్లనే పెరుగుతుంది. ఎలాగైతే మనసు యొక్క ఆలోచనల వలన మన దూరం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుందో, అహంకారం వలన కూడా దూరం పెరుగుతూ ఉంటుంది. ఈ బుద్ధి లేదా వివేకం అనేది ఈ రెండింటితో కూడి ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యం మనసు, బుద్ధి, అహంకారంతో కలిసి భ్రమిస్తూ ఉంటుంది. ఈ చైతన్యం ఒక్కోసారి భౌతిక ప్రపంచంలోకి వస్తుంది. అలాగే చాలాసార్లు ఈశ్వరమయం అవుతుంది. మన ధ్యేయం మన చైతన్యాన్ని ఈశ్వరమయం చేసుకోవడమే! మనం మంత్రోచ్ఛారణ చేసేటప్పుడు… కానీ ధ్యానం చేసేటప్పుడు మంత్రోచ్ఛారణ వలన మిమ్మల్ని మీరే ఆటంక పరచుకుంటున్నారు. మీరే గమనించండి! నేను చెప్పానని నమ్మవద్దు. మీరు పది రోజులు మంత్రం లేకుండా ధ్యానం చేయండి. అలాగే పది రోజులు మంత్రంతో పాటు ధ్యానించండి. రెండింటిని పోల్చి చూడండి. దేనివలన మనం ఎక్కువగా ధ్యానంలో నిమగ్నం అవుతామో మీకే అర్థం అవుతుంది. ధ్యానం నుండి సమాధి వైపు ప్రయాణించడం మన లక్ష్యం. శూన్యం వైపు ప్రయాణించడం. మంత్రోచ్ఛారణ వలన ఇంకో సమస్య ఏమిటంటే, చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కానీ మనం ఏం చెబుతున్నామో మనకే తెలియదు. ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి? మరి దాని అంతరార్థం ఏమిటి? ప్రజలకు దాని గురించి సరిగా తెలియదు. మనం “అహం బ్రహ్మాస్మి”… అని చెబుతూ ఉంటాము. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెబుతూ ఉంటారు. “నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును… నేను బ్రహ్మమును” అని. కానీ దాని అంతరార్థం ఏమిటి? చెప్పినంత మాత్రాన మనం బ్రహ్మ అయిపోతామా? బ్రహ్మ అనే స్థితిని మనం కేవలం అనుభూతి మాత్రం చెందగలం. ఆ స్థితిని అనుభూతి చెందాలి. అంతే కానీ నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అనుకున్నంత మాత్రాన జరిగేది ఏమీ ఉండదు. మన అందరం బ్రహ్మమే. నేనూ బ్రహ్మమే, మీరందరూ బ్రహ్మమే అని నేను అనుకుంటే, అది ఒక అత్యున్నత స్థితి. నాలో పరమాత్మ ఉన్నాడు అనేది ఒక అనుభూతి. ధ్యానంలో మనం క్రమేణా వికాసం చెందుతూ ఉన్న కొలదీ ఈశ్వరుడు అందరిలోనూ ఉన్నాడనే భావం ఏర్పడుతుంది. తర్వాత స్థితిలో ఈశ్వరుడే మన సర్వస్వం అన్న భావన కలుగుతుంది. దీని గురించి మీరు కొంత ఆలోచించి చూడండి. ఆలోచన మంచిదే కానీ అదే ఆలోచనను పునరావృతం చేయడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. నాలో పరమాత్మ ఉన్నాడు. అందరి లోనూ పరమాత్మ ఉన్నాడు. ఆయన వలననే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఇలా చెప్పుకొంటూ వెళ్ళడం వలన ఒరిగేదేమీ లేదు. ఇలా చెప్పుకొంటూ వెళ్ళడం వలన ఒరిగేదేమీ లేదు. యోగసాధన ఫలితంగా సహస్రదళ కమల స్థితికి చేరుకున్నప్పుడు… సచ్చిదానందాన్ని పొందాము అని ప్రజలు చెప్తూ ఉంటారు. సచ్చిదానందం, సచ్చిదానందం అంటూ జపమాలను తిప్పుతునే ఉంటారు. వేదాలు, ఉపనిషత్ ల ద్వారా మనకు లభించే సందేశం లభిస్తుంది. తాతలు, ఇంట్లో పెద్దవారు చనిపోయే సమయంలో ఇంట్లో వారికి పొలంలో ఈ మూల ఇది ఉంది అంటూ ఏదో చెప్తుంటారు. వినేవారు అర్ధం చేసుకోలేకపోతే వారు మాత్రం ఏమి చేయగలరు? వినేవారు అర్ధం చేసుకోలేకపోతే వారు మాత్రం ఏమి చేయగలరు? సత్, చిత్, ఆనంద్ దీని ద్వారా ఏం సందేశం లభిస్తుంది? దాన్ని మననం చేసుకొంటూ ఉండడం వలన, మనం ఆ ఆనంద స్థితిని పొందుతూ ఉన్నామా? లేదు. కేవలం మాటల వలన ఏమీ ఒరగదు. మన సాధన తీవ్రతరం అవుతూ ఉన్న కొద్దీ మనం పంచభూతాలను అధిగమించి బ్రహ్మాండ స్థితిని పొందుతాం. ఆ తరువాత పర బ్రహ్మండ స్థితికి చేరుకుంటాం. అప్పుడు మనం స్వయంగా అహంకారాన్ని నాశనం చేయవలసిన అవసరం ఉండదు. అహంకారం దానంతట అదే తొలగిపోతుంది. ప్రతి సాయంత్రం చేసుకొనే నిర్మలీకరణ ప్రక్రియ ఫలితంగా హృదయం మరింత పవిత్రం అవుతూ ఉంటుంది. దానితోపాటు అహంకారం ‘నేను ఇది చేస్తున్నాను’ అని అంటుంది. ఇది ఒక విషయం. మరొక విషయం ఏమిటంటే, ఈ పనిని ఈశ్వరుడు నాచే చేయిస్తున్నాడు అంటారు. అప్పుడు చేస్తున్నాననే భావం తగ్గుతుంది, ఈశ్వరుడే చేస్తున్నారనే భావం కలుగుతుంది. అప్పుడు అహంకారం ఏర్పడదు. లేకపోతే మూడవ భావం కూడా పెట్టొచ్చు, నేను ఆయన కోసం చేస్తున్నాను అని. ఇలా చేయడం వలన సంస్కారాలు ఏర్పడవు. లేకపోతే సంస్కారాలు మంచివి, చెడువి పదేపదే ఏర్పడుతూ ఉంటాయి. వాటి వల్ల మనం మళ్లీ మళ్లీ జన్మించాల్సి వస్తుంది. అందువల్ల ఈశ్వరుని మన స్నేహితునిగా భావించి ఆయనకి అన్నీ సమర్పించాలి. సమర్పణలో కూడా ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన’ అని ప్రజలు అంటారు. అయితే ఈ శ్లోకాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ‘కర్మను చేయి కానీ ఫలితాన్ని ఆశించకు’ అని చెప్పడంలో శ్రీకృష్ణ భగవానుడు మూర్ఖుడు కాడు కదా! మనల్ని పొలంలో వ్యవసాయం చేయమంటారు. దాని ఫలితాన్ని ఆశించవద్దు. ఇది అవుతుందా, కాదా అని ఆలోచించం. శ్రమ చేస్తాము… గోధుమలు పండుతాయి అని ఆలోచన పెడతాం. దీనిలో ఎలాంటి తప్పులేదు. మనం శ్రమిస్తాము కాబట్టి ఫలం గురించిన ఆశ మనకు ఉంటుంది. శ్రమ, కర్మ – రెండూ వేరు వేరు శబ్దాలు, వాటికి వేరు వేరు అర్థాలు ఉంటాయి. మీ ప్రాంతం నుండి మీరు ఇక్కడికి వచ్చారు. కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు కదా! ఇక్కడికి రావడం కర్మఫలం. కర్మఫలం ముందు నుండే వస్తూ ఉంటుంది. మరి శ్రీకృష్ణ భగవానుడు ‘కర్మ చేయి కానీ ఫలితాన్ని ఆశించకు’ అని ఎందుకన్నాడు? ఈ ప్రపంచం కూడా శ్రమ గురించి మాట్లాడదు. ఈశ్వరుని కోసం, ఈశ్వర ప్రాప్తి కోసం, సత్యప్రాప్తి కోసం, బ్రహ్మవిద్య కోసం ఎవరైనా ఏదైనా కర్మ చేసినప్పుడు దానిపై ఆశ పెట్టుకోకూడదు. దాని పరిణామం ఆయన చేతుల్లో ఉంది. వారు తలుచుకుంటే అది అవుతుంది. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అని ఆలోచించడం మన పని. శ్రమ భావాన్ని దానికి జోడించలేము. సంక్షిప్తంగా చెప్పాలంటే ధ్యాన లక్ష్యం మన మనసు, బుద్ధి, అహంకారాల నుండి దూరంగా వెళ్లడం. మనం ఆలోచనలో ఉండి ఏదైనా చెబుతూ ఉంటే మన ఆలోచనలు మెదడులో నిక్షిప్తం అవుతాయి. సమాధిలోకి వెళ్ళినప్పుడు నిలిచిపోయిన ఆలోచనలు పైకి వస్తాయి. నేను చెప్పిందే వినకండి. మీకై మీరు ప్రయత్నించండి. 8 రోజులు మౌనంగా ధ్యానించండి. 8 రోజులు మంత్రోచ్ఛారణతో ధ్యానం చేయండి. రెండింటి మధ్య గల వ్యత్యాసాన్ని మీరే అర్థం చేసుకుంటారు.
ధ్యానం చేస్తున్నా ఆలోచనలు వెంటాడుతుంటే...?
ఏదైనా పని అసంపూర్తిగా వున్నపుడు చింత సహజంగా కలుగుతుంది. ఒక్కొక్కసారి పని మొదలు పెట్టకముందే చింత పీడించడం అరంభిస్తుంది. ఎందుకంటే ఏ పనిని మనం ప్రారంభిస్తున్నామో ఆ పనికి మనం సిద్ధంగా లేము. పరీక్షలకు వెళ్ళేముందు పిల్లలు చాలా భయపడుతుంటారు. ఈ భయానికి కారణం వారు పరీక్ష కోసం సరిగా చదివి తయారుగా లేకపోవడం. బాగా చదివి వుంటే పరీక్షకు సంతోషంగా వెళతారు. మన జీవితంలో అనుక్షణం ఒక పరీక్షే. అందుకే మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ధ్యానంలో ఏదైనా ఆలోచన కలిగితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి… ఎలా పరిష్కరించాలి అని మన మనసంతా ఆ ఆలోచన చుట్టూ తిరుగుతూ వుంటుంది. ఈ పరిస్థితిలో ఏమి చెయ్యగలం? సమస్యని దేవునికి లేదా మీ గురువుకి సమర్పించి చూడండి. ఇది నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. చింతించడం వలన ప్రయోజనం లేదు. సమస్యని ‘ప్రభూ! ఈ భారం మీదే’… అని గురువుకి సమర్పించి అందుకు సమాధానం కోసం ఎదురు చూడండి. ఇది గురువుకీ ఒక రకంగా పరీక్షే. ఎవరినైనా గురువుగా స్వీకరించే ముందు పరీక్షించడం మంచిది. మూడుసార్లు కంటే ఎక్కువగా పరీక్షించకూడదు.
పిల్లలకు ధ్యానం ఎలా నేర్పించాలి?
పిల్లలందరూ మనలను అనుకరిస్తారు. తల్లిని గాని, తండ్రిని గాని అనుకరణ చేయని పిల్లలుండరు. మీరు నమస్కారం పెడితే వాడూ నమస్కరిస్తాడు. మీరు ధ్యానానికి కూర్చుంటే వాడు కూడా చేతులు కట్టుకుని ధాన్యంలో కూర్చుంటాడు. ధ్యానం అంటే ఏమిటో తెలియకపోయినా కూర్చుంటాడు. మీరు అతడిని ధ్యానం చేస్తూ వుండగా ఫొటో తీయండి. తరువాత అతను కొంచెం పెద్దవాడయిన తరువాత అప్పుడు చూపించండి. “బాబూ! నీవు చిన్న పిల్లవాడిగా వున్నప్పుడు నీవు ధ్యానం చేసేవాడివి” అని చెప్పి, ఆ ధ్యానం చేస్తున్న ఫొటో చూపించండి. అప్పుడు అతనికి దీనిపై ఆసక్తి కలుగుతుంది. “పద! చేద్దాం” అంటాడు. అప్పుడు ధ్యానానికి ముందు మీకు చెప్పిన రిలాక్సేషన్, అది అతనికి నేర్పండి. అది చాలు. అతనికి 15 సంవత్సరాలు వచ్చిన తరువాత అప్పుడు అతనిచే ధ్యానం చేయించటం మొదలు పెట్టండి. దానికన్నా ముందు అసలు ధ్యాన తత్వం ఏమిటి? మనం ధ్యానం ఎందుకు చేస్తాం? నిర్మలీకరణ అంటే ఏమిటి? సంస్కారం అంటే ఏమిటి? గురువు అంటే ఎవరు? ఎటువంటి వారు? శిష్యుడి బాధ్యత ఏమిటి? అతని కర్తవ్యం ఏమిటి? ఇవన్నీ అతనికి నేర్పండి. మీరు ఏదో ఒకటి చదివించండి. మధ్యప్రదేశ్ అంతటికీ వారానికి రెండు పర్యాయాలు హిందీలో సందేశాలు పంపాలని భావిస్తున్నాను. అవి కథలు కావచ్చు లేదా గురువు చెప్పిన విషయాలు కావచ్చు. భగవద్గీత, అష్టావక్రగీత, రామాయణం… అన్నీ చదివించండి. లేకపోతే మీరే చదవండి. వాడు వింటాడు. ఒకటి లేదా రెండు పేజీలు చదివించండి. చాలు. మొత్తం రామాయణం ఒక నెలలోనే పూర్తి చేయలేం. కొద్ది కొద్దిగా… తరువాత రెండో పుస్తకం. పిల్లలకు అదొక అలవాటుగా చేయాలి. ఉదాహరణకు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటిలోని వారందరూ ఒకేచోట సమావేశం కావాలి. లేదా మీ ఇరుగు పొరుగు అయితే మంచిది. మీ బంధువులు, స్నేహితులు అందరూ సమావేశం కండి. అందరూ కలసి సత్సంగ్ జరపండి. ఏదో ఒకటి చదవండి. వీలుగా వుంటే చదవటం అయిన తరువాత, అందరూ కలసి కొద్దిసేపు ధ్యానం కూడా చేయండి. పిల్లలను ఆ సమయంలో రిలాక్స్ అవ్వాలని చెప్పండి. ఒక ఆధ్యాత్మిక స్థితి ఏర్పడుతుంది. మీ వీధిలోని వారంతా ఒక చోట సమావేశమై ధ్యానం చేసుకోవచ్చు. దాని ప్రభావాన్ని పిల్లలు స్వయంగా గమనిస్తారు. త్వరగా గ్రహిస్తారు. పిల్లలకు వారి శిక్షణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆధ్యాత్మిక శిక్షణ… తల్లి గర్భవతి కావటానికి ముందే ప్రారంభం అవుతుంది. తల్లి, తండ్రి ఆధ్యాత్మికంగా సంసిద్ధులై వుండకపోతే, పిల్లలు అదే లక్షణం కలిగి వుంటారు. మీ లక్షణాల్ని, మీలో నాణ్యతను పెంచుకున్నట్లయితే… ఉన్నతమైన నాణ్యతతో కూడిన పిల్లలు వస్తారు. అటువంటి ఆత్మలు కలిగిన పిల్లలకు శిక్షణ ఇవ్వటానికి ఎక్కువ సమయం పట్టదు.
సమయోచితంగా ఆలోచించడం ఎలా?
మూడు రకాల మనుష్యులు ఉంటారు. అందరికీ తెలుసు కదా! జరగాల్సింది జరిగిపోయింది. కానీ వాళ్ళు ఎంత మూర్ఖులంటే తాము పని మంచిగా చేశామా లేక పాడు చేశామా అని కూడా వాళ్లకి తెలీదు. ఎవరైనా వాళ్లకి వాళ్ళు చేసిన తప్పును తెలియచేసినా కూడా ఒప్పుకోరు. ఆ చెప్పిన వాళ్లతో పోట్లాటకు దిగుతారు. ఇలాంటివారిని మీరేమి చెయ్యగలరు? ఈ ప్రశ్న అడిగిన వారు చాలా ప్రామాణికమైన వారు. ఏదైనా తప్పు జరిగింది… సరే! జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఒక ధ్యానికి ఒక పని చెయ్యబోయే ముందుగానే దాని పరిణామం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ధ్యానమయి అయిన మనస్సుతో మనం ముందుగానే చైతన్యవంతులం అవుతాం. కానీ చాలాసార్లు ఏమవుతుంది? ధ్యానమయి అయిన హృదయం… ‘ఇది చెయ్యద్దు, ఇది చెయ్యద్దు’ అని చెబుతుంది. అయినా మనం చేసి తీరుతాం. అప్పుడు దాని పరిణామం చాలా తప్పుతో కూడినదై ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా మన హృదయం ‘ఇది తప్పు’ అని చెప్పినపుడు, మనం చైతన్యవంతులం అవ్వాలి. ముఖ్యంగా… ఒకవేళ మీకు ఫోన్ లో సంభాషణ జరిగింది. దూరంగా ఉన్న స్నేహితునితో కానీ, ఇంట్లో భార్య లేక భర్తతో గానీ ఫోన్ లో మాటలు, వాదనలు జరిగాయి. అప్పుడు ఆ భర్త ఏమంటాడు? ఇవాళ నీ సంగతి చూస్తాను… అని చాలా కోపంతో భార్యతో అంటాడు. దూరంనుంచే చాలా కోపంతో మండిపడుతూ వస్తాడు. “ఏమన్నావు ఫోన్ లో” అంటూ పోట్లాటకు దిగుతాడు. అదే స్నేహితుడితో అయితే, వాళ్ళ ఇంటికి వెళ్లి పోట్లాడుతాడు. కానీ ధ్యానమయి అయిన మనస్సు ఏం చెబుతుందో తెలుసా? శాంతంగా ఉండు, శాంతంగా ఉండు, అని చెబుతుంది. తన అహంకారాన్ని మింగేయమంటుంది. కోపం రాకముందే కొంచెంసేపు ఆగి ఆలోచిస్తాం. నేనెందుకు వీళ్ళపై కోపం తెచ్చుకోవాలి? వదిలేయ్ పాపం! మీకు వారి మీద దయ కలుగుతుంది. కోపం తెచ్చుకోవటం వలన ఏమీ లాభం లేదు. తప్పు చేసేటప్పుడు కూడా మన హృదయం చెబుతూనే ఉంటుంది ‘చెయ్యద్దు, చెయ్యద్దు’ అని. అప్పుడు మనం అది చెయ్యకూడదు. అలా ఉండాలంటే మనకు ధైర్యం కావాలి. భగవంతుణ్ణి పొందాలి అంటే ధైర్యం కావాలి, అని చాలా చోట్ల చెబుతూ ఉంటారు. భగవంతుణ్ణి పొందాలి అంటే ధైర్యం ఎందుకు కావాలి? ఎవరైతే ప్రతి పనిని సరైన పద్ధతిలో, ప్రేమతో చేస్తారో వారికే భగవంతుడు లభ్యం అవుతాడు. కోపగించుకోకుండా ఉండటం, ఈర్ష్య లేకుండా ఉండటం… ఎవరితోనూ పోట్లాడకుండా ఉండడం, వీటికి ధైర్యం కావాలి. పోట్లాడటానికి ధైర్యం కావాలి అని జనం అంటారు. కానీ పోట్లాడకుండా ఉండటానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. తన మీద తనకు విశ్వాసం ఉండాలి. భగవంతుని పైన విశ్వాసం ఉండాలి. అందుకని, ధైర్యం, సాహసం చాలా అవసరం. బ్రహ్మవిద్యను పొందాలి అంటే, ఇవి చాలా ఆవశ్యకం. ధ్యానం మనకు ధైర్యాన్ని నేర్పుతుంది. మనం శాంతితో ధ్యానంలో కూర్చుంటాం. నిరీక్షిస్తూ, నిరీక్షిస్తూ, నిరీక్షిస్తూ, ప్రేమతో… ఏ పనైనా సరే అది చిన్నదైనా, పెద్దదైనా నైపుణ్యంతో చేయండి. దాని ద్వారానే ఆ పని కర్మయోగం అవుతుంది. యోగి అయిన వారు తన పనిని నైపుణ్యంతోనే చేస్తారు. ఎందుకంటే అతడు భగవంతునిలా తయారవ్వాలనుకుంటున్నాడు… తయారయ్యాడు కూడా. మీరు భగవంతునిలా మారినప్పుడు కనీసం తెలియను కూడా తెలియదు. ప్రజలంటారు, భగవంతునిలా అయితే మీకు తెలుస్తుందని. కానీ తెలియదు. భగవంతుని నుండి దూరమైతేనే తెలుస్తుంది. నేను భగవంతుని నుండి దూరమయ్యాను అని. ఎందుకంటే అది అసహజమైనది. ఎందుకంటే అది అసహజమైనది. సహజమైనది కాదు. ఏదైతే ప్రకృతి సహజంగా ఉందో దాని గురించి మనకు ఎప్పుడూ తెలియదు. ఉదాహరణతో చెప్పాలంటే మీరు మీ కళ్ళతో చక్కగా చూస్తున్నారు. చెవులతో సరిగ్గా వింటున్నారు. ముక్కుతో గాలి పీల్చుతున్నారు. కానీ ఏదైనా కొద్దిగా తేడా వస్తే అప్పుడు ఏదో ఇబ్బంది ఉంది అని అనుకుంటాం. ఏదైతే సహజమైనదో దాని పట్ల ఏ విధమైన కృతజ్ఞతతో ఎప్పుడూ ఉండరు. మన కళ్ళు సరిగా పని చేస్తే దానికి ధన్యవాదాలు చెప్పం కదా. ఒకవేళ కళ్ళు పాడైతే, డాక్టర్ కు ధన్యవాదాలు అని చెప్పాల్సివస్తుంది. ఎవరయితే మనకు జీవనాన్ని ఇస్తున్నారో మన లోపల ఉన్న అంతర్యామి… అది లేకుండా మనం జీవించలేం. దానికి ఎప్పుడైనా మీ కృతజ్ఞతను వ్యక్తం చేశారా? ధ్యానం ఎటువంటిది అంటే, అది అంతరంగం నుండి మన జీవన ప్రదాత అయి ముందుకు తీసుకుని వెళుతుంది. మనం ఎప్పుడైతే బయట వెతుకుతామో అప్పుడు అది లోపల నుండి అవిశ్రాంతంగా మారుతుంది. నేను నీ లోపలే ఉన్నాను, ఎందుకు నా గురించి బయట వెతుకుతున్నావు అని. బయట కాలక్షేపం ఉంది. ఒక మతపరమైన కార్యక్రమం ఉంది. గుడికి వెళ్ళండి. ఆనందించండి. భోజనం చేయండి. అక్కడ మీకు భగవంతుడు లభిస్తాడా? ఇప్పుడు ఆలోచించండి. శివుడు ధ్యానం చేస్తాడు. యోగ పురుషుడైన శ్రీకృష్ణుడు కూడా మహాభారత యుద్ధానికి ముందు ధ్యానంలో కూర్చున్నాడు. సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయుల చిత్రాలు చూసినట్లయితే, వారందరూ కూడా ధ్యానంలో ఉన్నట్లుగానే ఉంటారు. వీరందరూ అవతార పురుషులు. వారికి ధ్యానం ఎందుకు అవసరం అయ్యింది? మనం మనుషులం. ఈ మానవులనే శబ్దం కూడా చాలా విశిష్టమైనది. మనసు ఎవరి వద్ద ఉందో వారే మనుషులు. భగవంతుడు ఇచ్చిన మనసుని నియంత్రణలో ఉంచుకోండి. అది ఎప్పుడు అవుతుందంటే, ధ్యానం ద్వారా మనం మనసుకు శిక్షణ ఇచ్చినప్పుడే. ఇంకో దారి లేదు. ఓ మానవుడా! నీవు ముందు మనిషిగా తయారవు. తరువాత దైవత్వాన్ని పొందు. అందువల్ల మీరు సరిగ్గా ధ్యానించండి. మీకు ఒక రకమైన ధైర్యం, నమ్మకం వస్తాయి. ఏదైనా పని చేయాలా, వద్దా అనే స్పష్టత కూడా వస్తుంది. ఇది మంచిదా, కాదా అనే వివేకం, బుద్ధి కూడా అందరికీ ధ్యానం ద్వారానే వస్తాయి. అందరూ భగవద్గీత రెండవ అధ్యాయంలోని శ్లోకాలు 58 నుండి 66 వరకు చదివితే… నేను చెప్పిన విషయం మరింత లోతుగా అర్థం అవుతుంది. ధన్యవాదాలు.
24-06-2023 - Daaji Speech at Tikamgarh Evening
కర్మ - కర్మ ఫలం
ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు చాలా ధైర్యవంతులు… వర్షానికి భయపడటం లేదు. సరే! ధ్యాన సమయంలో ఓ ఆలోచన వచ్చింది… అది నాకు చంద్రగుప్త మౌర్యుని గురుదేవులయిన చాణక్యుని గుర్తు చేసింది. ఆయన ఒక ప్రచారాన్ని ప్రారంభించారు… ఉపాధ్యాయులందరినీ ఒకచోట చేర్చి, నవీన భారతదేశం గురించి ఆలోచించడంలో వారు నిమగ్నమైనారు. మీరందరూ ఉపాధ్యాయులు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఒక విన్నపం కూడా. మనమందరం కలిసి నేటి నుండి మళ్లీ నవ భారత ప్రచారాన్ని ప్రారంభించాలని మీకు విన్నపం. ప్రజలందరూ ధ్యానం చేయడం కోసమై, అందరినీ మనం కూడగట్టుకోవాలి. మీరు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఏదైనా విషయంపై ఆలోచిస్తున్నప్పుడు… కొన్ని ప్రశ్నలు వస్తాయి. వాటి సమాధానాలూ స్వతహాగానే వస్తాయి. “ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?… ఏది ప్రయోజనకరం? మరియు ఏది ప్రయోజనకరం కాదు?” “కర్మ అంటే ఏమిటి? కర్మ ఫలితం ఏమిటి?” ఇవన్నీ తెలియడం జరుగుతుంది. మనం కర్మ అంటే ఏమిటి మరియు కర్మ ఫలితం ఏమిటి, అని అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు ఈ మోక్ష స్థితి మనలోకి స్వతహాగా రావడం జరుగుతుంది. నేను దీన్ని మరి కొంచెం వివరిస్తాను. మనం ఇప్పుడు ఏ జీవితమైతే గడుపుతున్నామో… అది పూర్వజన్మ కర్మ ఫలమా లేక కొత్త కర్మలను సృష్టిస్తున్నామా? ఆ రెండూ కలిసికట్టుగా ఉంటాయి. మనం కర్మఫలాలను అనుభవిస్తున్నట్లయితే, వాటిని అంగీకరించిన వైఖరితో అనుభవించండి. మనం కొత్త కర్మలను సృష్టిస్తుంటే… “నేను మీకు సమర్పిస్తున్నాను. మీ శరణాగతిలో ఈ పని చేస్తున్నాను” అని వాటిని భగవంతునికి అప్పగించండి. “నేను అందరికీ నేర్పిస్తున్నాను. దానికై నాకు గర్వం కానీ, ఎలాంటి వికర్షణకానీ లేవు… నేను నా ఈ కర్తవ్యాన్ని ప్రేమతో నిర్వహిస్తున్నాను. మీ సేవలో ఉన్నాను”. కేవలం నేను ఒక ఉపాధ్యాయుడిని. నేను బోధిస్తున్నానంతే! ఇది నా పూజగా మారింది. ఆ విధంగా మీరు ఏ పని చేసినా అందులో మంచే జరుగుతుంది. సమర్థవంతంగా మనం ఏ పని చేసినా అది యోగమే అవుతుంది. అది కర్మయోగం అవుతుంది. ప్రేమతో మనం ఏం చేసినా అది కూడా ఒక రకమైన యోగమే అవుతుంది. జ్ఞానంతోపాటు మన హృదయంలో భక్తి కూడా ఉంటే ఆ జ్ఞానం మూర్ఖత్వంలా కనిపించదు. ప్రతి ఉదయమూ ధ్యానం చేయండి, ప్రతి సాయంత్రమూ నిర్మలీకరణ చేసుకోండి… రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసిన తర్వాత నిద్రపోండి, అప్పుడు ఇంటి వాతావరణం ఎలా మారుతుందో చూడండి. మీరు కచ్చితంగా లోపలి నుండి పురోగతిని పొందుతారు. అలాగే ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. ప్రజలు తాము చెప్పింది తమ పిల్లలు వినరు, అంగీకరించరు, ఎంతో కలవరంగా ఉంటుందంటారు. అయితే ఈ ధ్యాన పద్ధతితో అంతా స్పష్టమౌతుంది. దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా పరిస్థితి ఇలా ఉంటుంది. మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మనకు అనుభవం అయినప్పుడు నమ్మాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడంటే మేఘాలు ఉన్నాయి. అదే కనుక మబ్బులు లేనప్పుడు నక్షత్రాలు ఉంటాయని చెబుతారు. ఎప్పుడు ఆకాశం వంక చూసినా నక్షత్రాలను చూస్తాము కనుక వాటిని నమ్మాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కనుక. భగవంతుడి విషయంలో కూడా అంతే! ధ్యానం వల్ల అనుభూతి మొదలౌతుంది. అప్పుడిక అంగీకరించాల్సిన అవసరం పడదు. మనం నేరుగానే ఆయన ఉనికిని అనుభవించడం ప్రారంభిస్తాం. అటూ ఇటూ పరుగెత్తాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మనకు లోపల నుండి అంతర్యామి అందిస్తున్న పరిస్థితులన్నింటి పట్ల మనం కృతజ్ఞులం అవ్వడం జరుగుతుంది. మనం ధ్యానం పట్ల మక్కువ కలిగి ఉంటాం. ధ్యానంతో అనుభూతి చెందుతాం, అనుభూతి చెంది కృతజ్ఞులం అవుతాం. కృతజ్ఞత వలన ఒక రకమైన శాంతి దొరుకుతుంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా “అన్ని ప్రాణులకు సుఖం కావాలి” అని అంటారు. ఎవరికి సుఖం కావాలని ఉండదు? జీవితంలో సామరస్యం లేనంతవరకు, మనకు ఆనందం దొరకదు. ఈ సామరస్యాన్ని పొందడానికి, మననం చేయగల మనసు కావాలి. ఎప్పుడు మననం చేయగలగుతాం? కేంద్రీకరించబడిన మనసు వల్ల మాత్రమే పని జరుగుతుంది. మనసు ఏకాగ్రతగా ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు మనసు ఏకాగ్రమవుతుంది? అది ధ్యానం వల్ల మాత్రమే జరుగుతుంది. కనుక ఈ ఆనందం మరియు ధ్యాన స్థితులను మీరు కలుపుతూ పొండి, అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి ఇది ఒక సూత్రం (ఫార్ములా) గా తయారయింది. ధ్యానం వల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వలన మననం చేసే సామర్థ్యం పెరుగుతుంది. మననం వలన సామరస్యం మరియు స్థిరత్వం పెరుగుతుంది. స్థిరత్వం వలన సుఖం స్వయంచాలకంగా ఒక నీడలా వెంటే ఉంటుంది ఈ రోజు మీరందరూ దాన్ని అనుభూతి చెందారు. అలాగే ఇప్పటికే చాలా సిట్టింగ్స్ కూడా తీసుకున్నారు. మీరు ప్రతిరోజూ ధ్యానం చేయాలని నేను కోరుకుంటాను. అలాగే మీకు ఎప్పుడైనా కొంత టెన్షన్ అనిపించినప్పుడు, యాప్ నుండి లేదా ప్రిసెప్టర్ నుండి సిట్టింగ్ తీసుకోండి. మీరు వారానికి రెండు లేదా మూడు సిట్టింగ్‌లు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరో ఒక ప్రిసెప్టర్ నుండి 2 లేదా 3 సిట్టింగ్‌లు తీసుకోండి. సామూహిక సత్సంగ్‌లు, గ్రూప్ సత్సంగ్‌లు కూడా ఏర్పాటు చేసుకుంటే, అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఓ కొత్త మలుపు రావచ్చు. మనం ఎంత ఆసక్తి తీసుకుంటామో – భౌతిక జీవితంలో, పెట్టుబడితో వడ్డీ పెరుగుతుందని అంటారు. బ్యాంకులో ఎంత డబ్బు వేస్తే అంత వడ్డీ వస్తుంది. ఆధ్యాత్మికతలో తేడా ఉంది… ఆసక్తి (ఇంటరెస్ట్) ఉంటేనే మూలధనం (కాపిటల్) పెరుగుతుంది – అదే ఆధ్యాత్మిక మూలధనం. ధన్యవాదాలు.
అష్టాంగ యోగా
చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న అడిగారు. నేను మీకు చెప్పినట్లుగా, ధ్యానం వల్ల ఏది మంచి ఏది చెడు అనే వివేక శక్తి పెరుగుతుంది. ఆ విషయం స్వయంగా మనకు చాలా బాగా అర్థమవుతుంది. పతంజలి మహరాజ్ అష్టాంగ యోగం, యమతో మొదలవుతుంది. రెండవ అంగం నియమ. ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. యమను పతంజలి ఎందుకు ముందు పెట్టారు? యమ అంటే ఏమని అర్థం చేసుకుంటారు? యముడు అంటే మృత్యుదేవత, ధర్మంగా పాలించేవాడు. మీరు యముడు కావాలని చెప్తాము. యమునిగా ఎందుకు మారాలి? మనలో ఉన్న నకారాత్మక గుణాలను పూర్తిగా తొలగించుకోవాలి. మీరే స్వయంగా యమునిగా అయ్యి మీలోని నకారాత్మక గుణాలను, బలహీనతలను పూర్తిగా పోగొట్టుకోవాలి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏది మంచి, ఏది చెడు అనేది మనకు తెలుస్తుంది. చెడు విషయాలు మన మనసులో పెద్ద ఎత్తున కనిపిస్తాయి. వాటిపై పనిచేయడానికి మనం ఈశ్వరుని ప్రార్థించాలి. “మీ సహాయం లేకుండా ఇవన్నీ నా వల్ల కావడం లేదు, నాకు సహాయం చేయండి”. అని ఆయన మద్దతు కోరుతాం. నెమ్మది నెమ్మదిగా నియమ వైపు వస్తాం. యమ, నియమ లను పాటించడం వలన మనలో ఒక రకమైన భావం ఏర్పడుతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని మనకు ఇచ్చాడు. అది ఎప్పటి వరకూ ఆరోగ్యంగా ఉంటుందో అప్పటివరకు నేను ఈ తపస్సు చేయగలను. అనారోగ్య శరీరంతో తపస్సు చేయలేం. అవును, మొదటినుండీ మన అంతరంగంలోని ఆత్మపై ఆ స్థాయి ఏర్పడితే… స్వాస్థ్య స్థాయి ఏర్పడితే, రోగాలు రానీ, రాకపోనీ, అది ఆరోగ్యంగానే ఉంటుంది. ఇది మరో విషయం. కానీ ధ్యానం ద్వారా మన సూక్ష్మ గ్రాహ్యత, మన ఎరుక, చైతన్యం ఎంతగా పెరుగుతాయంటే… ఏం చేయాలి ఏం చేయకూడదు అని మనకు తెలిసి, యమ, నియమలు స్వతహాగానే మనలో ఏర్పడతాయి. అందువలన మనం ధ్యానంతో మొదలెడతాము. ధారణ కూడా ఒక రకమైన ప్రవాహంలా జరుగుతుంది.ధారణ అంటే ఒక రకమైన ఆలోచన… వర్షపు బిందువులు ఒక బిందువు, రెండవ బిందువు పడినట్లుగా కాక వర్షం మన ఇంటి కప్పు పై పడినప్పుడు… అది అడ్డంకులు లేకుండా పడే వర్షపు బిందువుల్లా, ధారగా కిందికి జాలువారుతుంది. మనకు ఈశ్వరుని గురించిన ఆలోచన వస్తుంది. ఏదో ఆటంకం కలిగి ఆగిపోతుంది, మరల ఆలోచన వస్తుంది, మళ్లీ ఒక ఆటంకం ఏర్పడుతుంది… అలా వర్షపు బిందువులు పడినట్లుగా వస్తుంటాయి. దానిని మనం ధారగా చేయాలి. దీనిలో మనం నిష్ణాతులుగా ధ్యానం ద్వారానే అవుతాం. మీరు ఆలోచనతో ధ్యానం ఆరంభిస్తారు. మంచిదే. కానీ అది అనుభూతిగా మారాలి. అనుభూతిలో ఆలోచన ఉండదు. అందుకే ధ్యానం మనస్సును అధిగమించే ఒక పద్ధతి. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని తెలిసినప్పుడు యమ, నియమలు స్వతహాగా జరిగిపోతుంటాయి. ఎనిమిది దశలూ ఒకదానికొకటి తోడుగా ఏర్పడతాయి.
హృదయంలోని దివ్యజ్యోతి
ఈ హృదయం పై ధ్యానం చెయ్యడం, ఆ ధ్యానానుభూతి పొందటానికి ఒక మార్గం వుంది. కొందరికి ఈ అనుభవం మొదట్లోనే కలుగుతుంది. మరి కొందరికి రెండు వారాలు, మూడు వారాల సమయం పడుతుంది. కానీ మన పని మనం చేస్తూ వుండాలి. ఈ హృదయం పై ధ్యానం చేసే తత్వం వెనుక వున్న రహస్యం చెబుతాను. మహాభారత యుద్ద సమయంలో శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపం సందర్శనం అనంతరం… అర్జునుడు ఎంతో కృతజ్ఞతా భావంతో “ఓ ప్రభూ! నాకైతే మీ దర్శన భాగ్యం కలిగింది… రాబోయే తరాలవారు మిమల్ని ఎలా తెలుసుకోగలరు? మీ దర్శన భాగ్యం వారికి ఎలా లభిస్తుంది?” అని శ్రీకృష్ణుని అడిగినప్పుడు, దానికి భగవానుడు ఒకే వాక్యంలో ఇచ్చిన సంపూర్ణ సమాధానం… “హృదయ మె పశ్యసి” అంటే “నన్ను మీ హృదయంలో కనుగొనండి”. శ్రీకృష్ణుడు మనకు ఈ మార్గం చూపారు. ఇక అంతా మనపై ఆధారపడి వుంది. ఎవరికి ఎంతగా వీలైతే అంత… ఇంకొక ఉదాహరణ ఇస్తాను. మన కళ్లజోడు… మీద నూనె కానీ, కొంత దుమ్ము కానీ పడినప్పుడు ఆ కంటి అద్దాలతో మీరు చదవగలరా? చాలా కష్టం కదా! మీ కళ్లద్దాలు ఎంత శుభ్రంగా వుంటే అంత బాగా మీరు చూడగలరు. అలాగే మన హృదయంలో పేరుకున్న దుమ్ము, ధూళి తొలగి పోవడానికి సమయం పడుతుంది. కొంచెం కొంచెంగా, ఈ మురికి తొలగి పొయేకొలదీ మనకు అంత ఎక్కువగా మన హృదయంలో అనుభూతి కలుగుతుంది. మన హృదయం ఎంతగా స్వచ్ఛంగా మారి పవిత్రత పెరుగుతుందో, మనకు అంతగా అటువంటి అనుభవాలే కలుగుతాయి. ధన్యవాదాలు.
ధ్యానంలో పిల్లలకు శిక్షణ
మనం ధ్యానాన్ని ఒకే ఊహ లేదా ఒకే ఆలోచనతో మొదలు పెడతాం. నా హృదయంలో ఈశ్వరుని దివ్య తేజస్సు అప్పటికే ఉంది. అది నన్ను తనవైపుకు ఆకర్షిస్తూ ఉంది. అంతే! ఈ ఆలోచనతోనే మనం ధ్యానం చేస్తాం. తరువాత ధైర్యంగా, చాలా ప్రశాంతంగా వేచి చూస్తాం. ప్రాణాహుతి ప్రసారం వచ్చినప్పుడు మనం ప్రేమగా దాన్ని స్వీకరిస్తాం, ఆహ్వానిస్తాం. అంతే! ఈ ఆలోచన ఒక అనుభూతిగా మారుతుంది. తరువాత ఆలోచన ఏమీ ఉండదు. ఆలోచన అనుభూతిగా మారినప్పుడు, మనం ఒక్కసారిగా ప్రశాంతత పొందుతాం. ప్రతి ధ్యానంలోనూ శూన్యత్వం పొందడం జరగకపోవచ్చు. మనం ఎన్ని ఆలోచనలు ప్రోగు చేసుకున్నామో మీరు గమనించండి. ప్రతిరోజూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా మనకు చాలా ఆలోచనలు వస్తాయి. కానీ ఆ సమయంలో మన మనస్సు ప్రశాంతంగా లేదు కాబట్టి మనకు ఏ ఆలోచన వచ్చిందో, వెళ్ళిందో తెలియదు. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మనకు అంతా స్ఫురిస్తుంది. పిల్లలు ప్రతిభావంతులు.మనం ఏం చేస్తామో దాన్నే వారు యధాతధంగా అనుకరిస్తారు. మన భాష, మనం ఎలా మాట్లాడుతాం, ఏమైనా వ్యావహారిక తరహాలో రహస్యాలు చెప్పుకున్నా… వారు వాటిని అలాగే నేర్చుకుంటారు. మనం ఉదయాన్నే పూజ గదిలో లేదా వేరుగా ఒక గదిలో ధ్యానానికి కూర్చున్నప్పుడు… పిల్లలు తప్పకుండా మనలను అనుకరిస్తారు. 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారంతట వారే ధ్యానంలో ఆసక్తి కనబరుస్తారు. మా నాన్నగారు కూడా ధ్యానం చేస్తారు. మా అమ్మ కూడా ధ్యానం చేసేవారు అని చెప్తారు. వారు తమంత తామే ధ్యానం ప్రారంభిస్తారు.
ధ్యానానికి, కష్టాలకి సంబంధం ఉందా?
సవాళ్లు వస్తాయి. ఎవరి జీవితంలో సవాళ్లు లేవు?
అందరి జీవితాల్లో సవాళ్లు వస్తూనే ఉంటాయి. అవతార పురుషులైన అయోధ్యకు చెందిన పూజ్య శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు. మనకు కూడా కష్టాలు వస్తాయి. ధ్యానం వలన ఈ కష్టాలు మొదలవడం అనేది ఉండదు. ఇది ఒక అపార్థం మాత్రమే. మీరు ధ్యానం చేసినా, చేయకపోయినా డబ్బులు ఉన్నా లేకున్నా, అందరికీ కష్టాలు ఉంటాయి. ధనవంతుల కష్టాలు వేరుగా ఉంటాయి. మనకు బయటకు కనబడవు. వారు మనసు లోపల ఆందోళనగా, దుఃఖితులై ఉంటారు. వారి కోసం ప్రార్థించాలి. పేదవాడికి రెక్కాడితే కానీ డొక్కాడదు. వారికి ఆహార సమస్య మాత్రమే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఆహారం దొరకనంత సమస్య ఏమీ లేదు. కాబట్టి ప్రతి వ్యక్తికి వేరు వేరు రకాల సమస్యలు ఉంటాయి. నిజానికి మనం ధ్యానం చేసినప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే దాన్ని పూర్తి చేయడానికి మనకు ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి నేను చెప్పదలచుకుంది ఏమిటంటే, ధ్యానం వలన మన సమస్యలను తొలగించుకోవచ్చు. కాబట్టి సరైన పద్ధతిలో, ప్రేమతో ధ్యానం చేయండి.
25-06-2023 Daaji Speech at Tikamgarh MP
ఈశ్వరుడు మనల్ని తన నుండి ఎందుకు వేరు చేశారు?
ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. ప్రపంచాన్ని ఎందుకు మార్చాలో ఆయనకు తెలుసు. ఆ స్థితికి మనల్ని తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు… నా ఉద్దేశంలో ఈశ్వరుడు మనల్ని తనకంటే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. దీన్ని అందరూ సమ్మతిస్తారో లేదో! చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక తల్లి జన్మనిచ్చింది కాబట్టి, ఎల్లప్పుడూ తన పిల్లలు తనకంటే పైకి ఎదగాలని అనుకుంటుంది. అలా కాకుండా నాకంటే కిందికి పడిపోవాలి, వాళ్ళు ఏమీ చేయకూడదు అని అనుకోదు. పిల్లలు స్వయంగా వృద్ధి చెందాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. ఈశ్వరుని రచన, వాక్కు అది వారి లీలయే. అందులోనే వారు రమిస్తారు. కొందరు ముందుకు సాగుతారు. కొందరు వెనక్కి వెళ్తారు. నిర్ణయం మీదే. ఆయన మీకు పూర్తి స్వాతంత్రం ఇచ్చారు. మీరు ముందుకు కావాలనుకుంటే వెళ్తారు. మనం స్వయంగా పతనమవుతామా లేదా విజయవంతంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తామా… అనేది మన ఆకాంక్ష తీవ్రతపై ఆధారపడి ఉంది. కాబట్టి ఇది శిక్ష కాదు. మనల్ని జైలుకి పంపారు అనుకుంటాం. ఇది తప్పు మాట. జైలుకు ఎవరు వెళ్తారు? నేరస్తులైన వారు వెళ్తారు. మన ఆలోచనలో ఆ వైఖరి పెట్టుకుంటే అది జైలు లాగే ఉంటుంది. మనం ఈశ్వరునిలోనే ఉండాలనే వైఖరిని కలిగి ఉంటే… ఈ ప్రపంచం స్వర్గమయం అవుతుంది. అది మనపై ఆధారపడి ఉంది. మనల్ని జైల్లో ఎవరూ వేయరు. మనమే స్వయంగా ఖైదు చేసుకుంటున్నాం.
ధ్యానానంతర స్థితిని ఎలా కాపాడుకోవాలి?
ఇవన్నీ స్మరణకు వివిధ మార్గాలు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మను ఆచరించండి, ఫలితాన్ని ఆయనకు సమర్పించండి. ఏ పని చేస్తున్నా, గురువుగారిని తలచుకొంటూ చెయ్యండి. ఆయన కొరకే మనం పని చేస్తున్నామని తలుచుకోండి. ఇది మీకు కష్టమైతే, ఈ పని ఆయనే మనతో చేయిస్తున్నారనే ఆలోచన కలిగి వుండండి. మూడవ ఉపాయం ధ్యానంలో లభించిన అనుభవాలతో మమేకమై వుండండి. నాలుగో ఉపాయం, ఏదైనా పని మొదలు పెట్టే ముందు ప్రార్థనాపూర్వకంగా ఆయనతో మమేకమవ్వండి. ‘మనఃపూర్వకంగా నేను పరమాత్మతో కలిసి వున్నాను’ అనే తలంపు నిలుపుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ప్రస్తుతం చేస్తున్న పని పూర్తయి, రెండవ పని మొదలుపెట్టే ముందు మరలా ఇదే విధంగా తలుచుకోండి. మీకు నచ్చిన, మీ మనసుకు భారం కలిగించని, మీకు ఆనందం కలిగించే ఏ ఉపాయాన్నైనా ఎంచుకోవచ్చు. కానీ మనం సమర్థవంతంగా ధ్యానం ఆచరించకపోతే, ధ్యానమయులం కాకపోతే… ఈ నిరంతర స్మరణ, నిరంతర భక్తి, ప్రేమ ప్రవాహపు అలలు మనలో ఉప్పొంగవు. ధ్యానమయులం కానంత వరకు ఈ స్మరణ కూడా పొడిగా, నిస్సారంగా వుంటుంది. భక్తి లేకపోతే స్మరణ నిస్సారమైపోతుంది.
ప్రేమ - అర్హత
మన హృదయం నుండి హృదయానికి పరిచయాన్ని పెంచుకోవడం అన్నింటికన్నా అత్యుత్తమం. ఈ కాళ్లకు నమస్కరించాలి అనిపించడం, నమస్కారం చేయడం వంటి బాహ్య ఉపచారాలు హృదయంతో చేయండి. మీ పెద్దల, గురువు యొక్క పాదాలను స్పృశించినప్పుడు అందులో ప్రేమ లేకపోతే అది బూటకం అవుతుంది. నిజంగా ప్రేమ ఉంటే ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. ఏదైనా అవడానికి నాకు అర్హత ఉందా అని అనిపించినంతవరకు అది పొందడానికి అర్హత ఇంకా రాలేదని అర్థం చేసుకోండి. హృదయంలో ఏదైనా అవ్వాలని కోరిక కలిగినప్పుడు అది అహంకారాన్ని తృప్తి పరచే విషయమే అవుతుంది. అయితే నేను ఈ సంస్థ ద్వారా, ఈ గురువుల ద్వారా కొంత పొందాను… వారిలాగే సేవ చేయడానికి నా మనస్సు తహతహలాడుతోంది… అని భావించినట్లయితే సేవ చేయడానికి, సేవలో మరణించడానికి కూడా మీరు తయారుగా ఉన్నట్లయితే, ప్రిసెప్టర్ అవ్వడానికి అర్హత వచ్చినట్లు. లేకపోతే ‘నేను ప్రిసెప్టరయ్యాను’ అని ఒక సర్టిఫికెట్ లభిస్తుంది. దాని తర్వాత వారి ప్రగతి ఆగిపోతుంది. ఎందుకంటే వారు తమ అహంకారాన్ని తృప్తి పరచడానికే అలా అయ్యారు కనుక. ఒకవేళ మీది సరైన తపన అయితే మాస్టరే మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. దీనిలో పది సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు అనే లెక్క లేదు. బాబూజీ మహరాజ్ కొంతమందిని పరిచయాత్మక సిట్టింగులతోనే ప్రిసెప్టర్ ను చేసేశారు. అందువలన 10 సంవత్సరాలు అవసరం లేదు. మనసు నిర్మలత, సేవ చేసే భావన ఉంటే మాస్టర్ గుర్తిస్తారు.
గరుడపురాణం ప్రకారం స్వర్గం - నరకం
స్వర్గం, నరకం అనేవి భౌతికంగా కనిపించే ప్రాంతాలు కాదు. భౌగోళికంగా ఈ భూమి మీద కానీ, ఆకాశంలో కానీ లేవు. ఎప్పుడైతే మన హృదయం మన కర్మల చేత, ఆలోచనల చేత స్వచ్ఛంగా, పవిత్రంగా అవుతుందో… అటువంటి వారి హృదయంలోకి భగవంతుడు స్వయంగా వచ్చి కూర్చుంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడే స్వర్గం ఉంటుంది. స్వయంగా భగవంతుడు ఎవరి హృదయాల్లోకి వస్తారో, వారికి స్వర్గానికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. అటువంటి వారికి ప్రతిదీ స్వర్గమయం అవుతుంది. నరకం అనేది దానికి వ్యతిరేకమైన ఉదాహరణ. ఎక్కడైతే అంతా మురికి మురికిగా ఉంటుందో… ఎవరైతే లోభంతో ఉంటారో, ఈర్ష్యతో కూడి ఉంటారో, ఎవరి ఆలోచనలలో అయితే వ్యతిరేక భావం ఉంటుందో… ప్రేమ ఉండదో, ఎక్కడైతే ప్రేమకు ఆటంకం ఉంటుందో, అది నరకంగా తయారవుతుంది. ఇలా అంటూ ఉంటారు కదా! ప్రవహిస్తున్న నది ఎక్కడన్నా ఆగిపొతే అక్కడ ఒక చెరువు తయారవుతుంది. దాన్ని శుభ్రం చెయ్యకపోతే అది ఒక మురికి గుంటగా తయారవుతుంది. దుర్వాసన వస్తుంది. కాబట్టి ప్రేమగంగ ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే ఆగిపోతుందో, మలినం అవుతుంది. వానిలో నరకం తయారవుతుంది.
25-06-2023 Daaji Speech JHANSI, UP Evening
శారీరక స్వస్థతకు మూడు విధానాలు
ప్రత్యేకించి సాయంత్రం నిర్మలీకరణ సమయంలో… మనలో ఏదైతే రుగ్మత ఉందో, అది వెనుక భాగం నుండి పొగ రూపంలో వెళ్ళిపోతోందని, ఒక సంకల్పం చేసుకోవాలి. రెండవ విధానం… మనం రిలాక్సేషన్ చేసుకొంటాము కదా. మీకు లివర్ లోనో లేదా స్ప్లీన్ (ప్లీహము) లోనో సమస్య ఉండి, మీరు బాధను అనుభవిస్తున్నారు అనుకోండి… కాళ్ళు, చేతులు, ఉదరం అన్ని భాగాలు విశ్రాంతిని పొందుతున్నాయి. భూమి నుంచి ఆరోగ్యకరమైన శక్తి పాదాల ద్వారా నా శరీరం లోనికి ప్రవేశించి ప్రశాంతతను కలుగ చేస్తూ ఉన్నది… అని చెప్పుకొంటూ ఉన్నప్పుడు ఒక సంకల్పం చేసుకోవాలి. ‘నా లివర్ లోనికి కూడా ఈ ఆరోగ్యకరమైన శక్తి ప్రవేశిస్తూ ఉన్నది’ అని ఒక సంకల్పం చేసుకొని మన చేతిని ఆ భాగంపై ఉంచుకోవాలి. భూమి నుంచి వస్తున్న శక్తి లివర్ కు స్వస్థత కలుగ చేస్తూ ఉందని భావించాలి. స్ప్లీన్ అయితే ఆ భాగంపై, కిడ్నీ అయితే ఆ భాగంపై చేయి ఉంచుకొని స్వస్థత కలుగుతూ ఉందని సంకల్పం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీరు వ్యత్యాసాన్ని తప్పక కనుగొనగలుగుతారు. సాయంత్రం నిర్మలీకరణ సమయంలో కూడా ఆ భాగం స్వస్థత పొందుతూ ఉందని ఒక సంకల్పం చేసుకోవాలి. దీని వలన చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇక మూడవ విధానం… మీ వీపును ఆన్చి కూర్చోగల, మీకు ఇష్టమైన ఒక వృక్షాన్ని (చెట్టు) ఎంచుకోండి. దాని కాండం మీ వీపు కంటే పెద్దగా ఉండకూడదు. సమానంగా గానీ లేదా చిన్నగా ఉండాలి. కూర్చొనే ముందు ఒక సంకల్పం చేసుకోండి… నాలో నీకు కావలసినది ఏదో తీసుకొని… నాకు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించమని ప్రార్థించండి. అప్పుడు ఆ వృక్షం తన ఆరోగ్యాన్ని, శక్తిని మీకు ప్రసాదిస్తుంది. ఆ విధంగా ఒక అయిదు నిమిషాలు కూర్చోండి. అయితే కూర్చొనే ముందు మాత్రం ప్రార్థన చేసుకొని కూర్చోండి. నేను మీకు మూడు పద్ధతులను వివరించాను.
శారీరక స్వస్థతకు మూడు విధానాలు
ప్రత్యేకించి సాయంత్రం నిర్మలీకరణ సమయంలో… మనలో ఏదైతే రుగ్మత ఉందో, అది వెనుక భాగం నుండి పొగ రూపంలో వెళ్ళిపోతోందని, ఒక సంకల్పం చేసుకోవాలి. రెండవ విధానం… మనం రిలాక్సేషన్ చేసుకొంటాము కదా. మీకు లివర్ లోనో లేదా స్ప్లీన్ (ప్లీహము) లోనో సమస్య ఉండి, మీరు బాధను అనుభవిస్తున్నారు అనుకోండి… కాళ్ళు, చేతులు, ఉదరం అన్ని భాగాలు విశ్రాంతిని పొందుతున్నాయి. భూమి నుంచి ఆరోగ్యకరమైన శక్తి పాదాల ద్వారా నా శరీరం లోనికి ప్రవేశించి ప్రశాంతతను కలుగ చేస్తూ ఉన్నది… అని చెప్పుకొంటూ ఉన్నప్పుడు ఒక సంకల్పం చేసుకోవాలి. ‘నా లివర్ లోనికి కూడా ఈ ఆరోగ్యకరమైన శక్తి ప్రవేశిస్తూ ఉన్నది’ అని ఒక సంకల్పం చేసుకొని మన చేతిని ఆ భాగంపై ఉంచుకోవాలి. భూమి నుంచి వస్తున్న శక్తి లివర్ కు స్వస్థత కలుగ చేస్తూ ఉందని భావించాలి. స్ప్లీన్ అయితే ఆ భాగంపై, కిడ్నీ అయితే ఆ భాగంపై చేయి ఉంచుకొని స్వస్థత కలుగుతూ ఉందని సంకల్పం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీరు వ్యత్యాసాన్ని తప్పక కనుగొనగలుగుతారు. సాయంత్రం నిర్మలీకరణ సమయంలో కూడా ఆ భాగం స్వస్థత పొందుతూ ఉందని ఒక సంకల్పం చేసుకోవాలి. దీని వలన చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇక మూడవ విధానం… మీ వీపును ఆన్చి కూర్చోగల, మీకు ఇష్టమైన ఒక వృక్షాన్ని (చెట్టు) ఎంచుకోండి. దాని కాండం మీ వీపు కంటే పెద్దగా ఉండకూడదు. సమానంగా గానీ లేదా చిన్నగా ఉండాలి. కూర్చొనే ముందు ఒక సంకల్పం చేసుకోండి… నాలో నీకు కావలసినది ఏదో తీసుకొని… నాకు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించమని ప్రార్థించండి. అప్పుడు ఆ వృక్షం తన ఆరోగ్యాన్ని, శక్తిని మీకు ప్రసాదిస్తుంది. ఆ విధంగా ఒక అయిదు నిమిషాలు కూర్చోండి. అయితే కూర్చొనే ముందు మాత్రం ప్రార్థన చేసుకొని కూర్చోండి. నేను మీకు మూడు పద్ధతులను వివరించాను.
హృదయం పై ధ్యానం ఎందుకు?
ధ్యానం అంటే మనసును అధిగమించటం. మనసును అధిగమించడమంటే ఆలోచనలు, బుద్ధి, అహంకారపు భావనలను అధిగమించటం. మనం హృదయంలో ఈశ్వరీయ ప్రకాశం కలదనే సంకల్పం చేస్తాం. అది మెదడుతో చేస్తాం. ఆ తరువాతి దశ ఏదైతే వస్తుందో, అది ప్రాణాహుతి కారణంగా కలిగే అనుభూతి వలన మాత్రమే. ఆ అనుభూతిని హృదయంలోనే పొందటం వలన హృదయం పై ధ్యానం చేస్తాం. సంకల్పం మనసుతో చేస్తే, అనుభూతి హృదయంలో కలుగుతుంది. అనుభూతి కలగడం ఆరంభించినప్పుడు మనసు ఆలోచించటం మానేస్తుంది. దాన్నే సరియైన ధ్యానం అంటాం. ఎపుడైతే మనసు ఆలోచించటం మాని, తాను దేనిపై ధ్యానం చేస్తుందో… దాని యొక్క అనుభూతిని మాత్రం పొందుతుందో, అప్పుడది సరియైన ధ్యానం.
ఇతరుల కోసం నేను ధ్యానం చెయ్యవచ్చునా?
ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చాలా మార్పుని తెస్తుంది. వారికి బదులు మీరు ధ్యానం చేస్తే వారికి ఏమీ ఉపయోగం ఉండదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. పూజారులు మీ ఇంట్లో మీ కోసం కథాశ్రవణం లేక మంత్రాలు చదివితే… ఆ మంత్రాల వలన ఎవరికి లాభం కలుగుతుంది? ఆ పూజారికే కదా! మీరిచ్చే డబ్బు, దక్షిణ అవి కూడా వారికే చెందుతాయి. వివాహం జరిపించిన్నప్పుడు కూడా పూజారిని పిలుస్తారు. ఆయన కొన్ని మంత్రాలు చదివి వెళ్ళిపోతాడు. ఆయన చదివిన మంత్రాల అర్థం ఎవరికి తెలుస్తుంది? మీరే ఆలోచించండి… మీరు వేరొకరికై ధ్యానం చెయ్యాలి అని అంటున్నారు. ఒకరి కోసం మరొకరు ధ్యానం చేసే పద్ధతి అయితే ఉంది. కానీ ఆ పని చెయ్యగల సమర్థత, కలుగజేసే ఉన్నతమైన స్థితి మీ ప్రస్తుత ఆధ్యాత్మిక స్థితికి చాలా దూరంగా వుంది. మీరు గురువుని ప్రార్థించండి, “భగవంతుని దయ వలన ఆ వ్యక్తి ఈ సమస్య నుంచి బయట పడాలి” అని. ఇంకా ఆ వ్యక్తి దృష్టి భగవంతుని వైపు మరలాలి అని. అప్పుడు వాళ్ళ మనసులో కొద్దికొద్దిగా భగవంతునిపై శ్రద్ధ కలగడం ఆరంభిస్తుంది.
సమస్యలను సరి చేసుకోవడం కూడా కోరికేనా?
కానే కాదు… మీ జీవితంలో కష్టాలే కష్టాలు అనే పరిస్థితి ఎదురైనప్పుడు… మనస్ఫూర్తిగా మాస్టర్ గారిని ప్రార్థించండి. వారు కాకుండా మనల్ని రక్షించేవారు ఎవరున్నారు? బాబూజీ మహరాజ్ సాధారణ కోరికల గురించి ఇలా చెప్పేవారు. ఉదాహరణకు మీకు ఆకలేసింది… అమ్మ రొట్టె, కూర పెట్టింది… కానీ మీరు, ‘అమ్మా! నువ్వు రసగుల్లా ఎందుకు పెట్టలేదు?’ అని అడుగుతారు. దానితోపాటు గొడవ పడతారు, డిమాండ్ చేస్తారు. మొదట్లో కోరిక ఉంటుంది. తర్వాత మనం దాన్ని డిమాండ్ చేయడం ప్రారంభిస్తాం. కోరిక ఆశ, కాంక్షగా మారుతుంది. ఆశ డిమాండ్ గా మారుతుంది. తర్వాత డిమాండ్ తీరాలని పట్టుబడతారు. “నాకు ఇది కావాల్సిందే” అని. కాబట్టి ఇవన్నీ కోరికల యొక్క పతనావస్థకు చెందిన స్థాయిలు. వీటిని మొదటి నుండి క్రమబద్ధం చేయాలి. రెండవ అంశం కూడా ఉంది… దాన్ని అర్థం చేసుకోవడానికి శరణాగత భావం ఉండాలి. స్వీయ అర్పణ భావం ఉండాలి. “మాస్టర్! మీరు మమ్మల్ని ఏ పరిస్థితిలో ఉంచినా మాకు అంగీకారమే” అని. కానీ అలా ఎవరు చెబుతారు? దాని కోసం కూడా ధైర్యం కావాలి. పరిస్థితులతో చికాకుగా ఉంటూ కూడా, ‘మాకు ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, కానీ మాకు అంగీకారమే’ అని మాస్టర్ తో సంతోషంగా చెబుతాం. వినడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది కానీ… అప్పుడప్పుడు అలా చేసి దాని పరిణామం ఎలా ఉంటుందో చూడండి.
ధ్యాన సమయంలో నకారాత్మక ఆలోచనలు
నకారాత్మక ప్రశ్నలు ఎందుకు వస్తాయి? ఉదాహరణకు ఇలా అవుతుందేమో! అలా అవుతుందేమో! అలా చేయాల్సి ఉంది. కానీ నేను అలా చేయలేదు. ఇవే ఆలోచనలు వస్తాయనుకుంటాను. నేను ఇది చేయాల్సి ఉంది. కానీ చేయలేదు. చేయలేకపోయాను. చేయాలని అనిపించట్లేదు. ఎవరితోనైనా గొడవపడితే, వారి విషయంలో అప్పుడప్పుడు పశ్చాత్తాప పడుతుంటాం. పశ్చాత్తాపం కాకపోతే మరొక విధంగా, మనసు రగులుతూ ఉంటుంది. ఈసారి చూపిస్తాను నేనేమిటో అని… ఇలా రకరకాలయిన ఆలోచనలు వస్తాయి. వీటి మూలం ఏమిటి? ఇతరులపై ప్రతీకారం తీర్చుకోవాలనే వైఖరి మనల్ని నాశనం చేస్తుంది. అయిందేదో అయ్యింది. దాన్ని వదిలేయండి. అయిపోయిన దాని గురించి బాధపడకూడదు. కానీ దాని నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. ఏదైతే పొరపాటు అయిందో లేదా సగంలో పని వదిలేసామో అలా ఆ విధంగా ఇంకెప్పుడూ చేయను. సంపూర్ణంగా చేస్తాను అని. దీనినే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు, నైపుణ్యంతో లేదా కుశలతతో చేసిన పని కర్మయోగం అవుతుంది. సగం పూర్తి చేసిన లేదా అసంపూర్ణమైన పని కర్మయోగం ఎప్పుడూ అవదు. మనందరికీ ఒకే ఒక పెద్ద అనారోగ్యం ఉంది. 99% మన సమస్యలపై మనం పూర్ణ హృదయంతో పనిచేయం. పూర్తి హృదయంతో, కుశలతతో ఏ పనీ చేయం.
26-06-2023 Daaji Talk in GWALIOR, MP
ధ్యానంలో కలిగిన ఆనందానుభూతి
ఇంత మంచి స్థితిని అనుభూతి చెందడం గొప్ప సౌభాగ్యానికి సంబంధించిన విషయం. అందరూ ఎక్కడో ఒకచోట ఎంతో కొంత పొందుతూ ఉంటారు. ఈ హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యానంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది అందరి కోసం. ధ్యానంలో కొంతమందికి ఎన్నో ఆలోచనలు వస్తాయి, కొంతమందికి రావు. అది అంత ముఖ్యమైనది కాదు. ధ్యానం తర్వాత వచ్చే స్థితిలో ఎల్లప్పుడూ తేలికదనాన్ని అనుభూతి చెందుతారు. శాంతిని అనుభూతి చెందుతారు. ప్రతి సిట్టింగ్ లో ఇది అందరికీ గ్యారెంటీగా అనుభూతిలోకి వస్తుంది. ఈరోజే కాదు, ఇక్కడ ఎంతోమంది కొత్తవారు ఉన్నారు. పద్ధతిప్రకారంగా మన జీవితంలో దీన్ని మీదిగా స్వీకరించండి. మన జీవితంలో ఎలా పరివర్తన చెందుతామో చూడండి. ధ్యానంతో అనుబంధంగా అతి ముఖ్యమైన నిర్మలీకరణ పద్ధతి ఉంది. నిర్మలీకరణ చేయకుండా ధ్యానం చేసినప్పటికీ ప్రగతి అంత గొప్పగా ఉండదు. ఉదయం ధ్యానం చేస్తాము. సాయంత్రం నిర్మలీకరణ చేస్తాము. పగలంతా మంచి చెడు పనులు జరుగుతూ ఉంటాయి.అవి మనసుపై ప్రభావాన్ని చూపుతాయి. మనసుపై పడితే, అది తిరిగి చైతన్యంపై ప్రభావం చూపుతుంది.దానివల్ల ఆత్మపై కూడా ప్రభావం పడుతుంది. అవి తొలగించుకోవాలి. చివరికి నిద్రపోయే ముందు,
ఈశ్వర సన్నిధిలో ఆయన్ని ప్రార్థిస్తాం. ప్రార్థనాపూర్వకంగా నిద్రపోతాము.
ధ్యాన సమయంలో ఆలోచనలు వస్తే...
కేవలం మన హృదయంలో ఈశ్వరీయ ప్రకాశం ఉందనే అలోచనని ఉంచుకోవాలి. దాని గురించి ఇక ముందు ఆలోచించవద్దు. ఎందుకంటే మనం ఆలోచించినప్పుడల్లా ఆ వెలుగు ఎలా ఉంటుంది? ఈశ్వరీయ ప్రకాశం ఎలా ఉంటుంది? గణితంలో ప్రారంభంలో ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లుగా… ఇది + ఇది కూడితే లేదా దీనితో గుణిస్తే ఇది దీనికి సమానమా కాదా అన్నట్టుగా ఆలోచిస్తాం. కాబట్టి ఆ తర్వాత నిరూపిస్తాం లేదా నిరూపించలేకపోతాం. అదే విధంగా మన హృదయంలో దైవిక కాంతి ఉందనే ఊహాజనిత ఆలోచనను ఉంచుతాం. ఉంటే ఎలా ఉంటుంది? ఇది చూడవలసినది కాదు. అనుభవించాల్సినది. ఆలోచనలు వస్తే రానివ్వండి. వాటితో గొడవ పడకండి. మీరు వాటితో పోరాడటానికి ప్రయత్నిస్తే, అవి మరింత ఉత్సాహం పుంజుకుంటాయి. కాబట్టి హృదయంలో దివ్య కాంతి ఉందని సున్నితంగా ఆలోచించండి. దానిపై ఎక్కువ వత్తిడి పెట్టవద్దు. అలాగే అప్పుడప్పుడూ చాలా ఆలోచనలు వస్తాయి. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు, ఈ సహజమార్గ పద్ధతిలో నేను ధ్యానం చేయడం ప్రారంభించాను. అప్పుడు మేం యువకులం. అప్పుడప్పుడు స్నేహితులతో సినిమాలకు వెళ్లేవాళ్ళం. తప్పు లేదు, సినిమాకి వెళ్లొచ్చు. కానీ కొన్నిసార్లు ఇది అతి అవుతుంది. 2 లేదా 3 నుండి 6; 6 నుండి 9 గంటల వరకు, అలా 2 నుండి 9 వరకు కొన్నిసార్లు అవుతుంది. అలా 9:00 గంటలకు మేము సిట్టింగ్ కోసం ప్రిసెప్టర్ వద్దకు వెళ్లేవాళ్లం. అప్పుడు ధ్యానంలో, అంతకు ముందు చూసిన సినిమా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎలాంటి కార్యకలాపాలలో పాల్గొంటున్నామో మనం ఆలోచించాలి. మన దృష్టి ఎక్కువగా మరల్చకుండా ఉండే కార్యక్రమాలలో పాల్గొనాలి. లేకుంటే అనవసరంగా మనసుకు భారం అవని సినిమాలు చూడండి. కొందరు అనవసరంగా సినిమాలకు వెళ్లి ఏడుస్తారు. ఏడవడానికే సినిమాలకు వెళ్లారా అన్నట్లు. అలాగే హృదయం ఎంత బరువెక్కుతుందంటే సినిమాలో దుఃఖం ఉంటే తనలో కూడా దుఃఖం కలుగుతుంది. అక్కడ ఉత్కంఠ ఉంటే ఇక్కడ కూడా ఉత్కంఠ నెలకొంటుంది. సాక్షిగా గమనించండి. అది వినోదం. దాన్ని చాలా సీరియస్‌గా తీసుకోకండి. అదే విధంగా జీవితంలోని అన్ని పరిస్థితులను అలాగే పరిగణించండి. భగవద్గీతలో ఏమంటారు? ‘సాక్షిలా ఉండండి’ అంటారు గదా! గమనించే వ్యక్తి పనులకు, సాక్షి చేసే పనులకు చాలా తేడా ఉంది. మనం ఏది గమనించినా, మన శక్తి అంతా అందులోకి వెళుతుంది. అందులో ఎమోషన్స్ కూడా వస్తాయి. సాక్షిగా ఉంటే, వారి పరోక్ష శక్తి మాత్రమే దానిలోకి వెళుతుంది. మనం రోడ్డుపై వెళుతున్నాం అనుకోండి… అటూ ఇటూ చూస్తూ, కొన్ని సంఘటనలను సాక్షిగా చూస్తాం. చూసిన తరువాత అవి మనలను ఆకర్షిస్తే అది మన పరిశీలనా వస్తువైపోతుంది. తరువాత దాన్ని గురించిన ఆలోచనే ధ్యాన సమయంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఏదైతే మనకు ఇష్టం కలిగిస్తుందో లేక అయిష్టం కలిగిస్తుందో దానికి సంబంధించిన ఆలోచనలే మాటి మాటికీ వస్తుంటాయి. మనం ఈ ఇష్టాయిష్టాలను దాటి వెళ్లాలి. తరువాత మెల్లమెల్లగా అలవాటై అది మన ధ్యానమంతటిలో కలసిపోతుంది. భగవద్గీతలో చెప్పినట్లు కమలం ఎలాగైతే బురద నీటిలో వుంటూ కూడా… మురికి ప్రభావం తనమీద పడనివ్వదో… నీవు కూడా అలాగే వుండాలి.చెప్పిందయితే అర్ధమవుతూ వుంది. కానీ చేయటం ఎలా? మన మానసిక స్థితిని ఎలా చేసుకోవాలంటే, దేని ద్వారా అయితే ఆ స్థితి ఏర్పడుతుందో… ఆ ధ్యానం ద్వారానే మనం ఆ మానసిక స్థితిని నియంత్రించగలుగుతాం. అయితే ప్రారంభంలో మాత్రం ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. మొత్తం 24 గంటలలో మీరు ఆరు నుంచి పది గంటల పాటు నిద్రపోగా, మిగిలిన సమయంలో మీ మనసు పరిస్థితి ఏమిటి? మన మనసు ఎక్కడికి పోతే అక్కడకు దానిని పరుగెత్తనిస్తాం. దానికి ఏవిధమైన కళ్లెమూ వేయం. కేవలం ధ్యానం చేసే సమయంలోనే దానికి కళ్లెం వేయాలని ప్రయత్నిస్తే అది ఎలా ఒప్పుకుంటుంది? పధ్నాలుగు పదిహేను గంటలపాటు అది అటూ ఇటూ కోతిలా తిరుగుతూ వుంటుంది. కానీ మనం అర్థగంట పాటు ఏకాగ్రత కావాలని ప్రయత్నిస్తాం. అప్పుడు మనకు అది కష్టమవుతుందా, కాదా? కానీ ధ్యానం ద్వారానే అది మెల్లమెల్లగా క్రమబద్ధం అవుతుంది. ఎప్పుడైతే క్రమబద్ధమవుతుందో, దానిని మించిన స్నేహితుడు మీకు వుండడు. మన మనసు మన అధీనంలోకి రానంతవరకు అది శత్రువులానే అన్పిస్తుంది. ఎలాంటెలాంటి ఆలోచనలో వస్తుంటాయి. ధ్యానం మధ్యలో మన ధ్యాస, ఆలోచనల మీదికి పోతుంది. చాలా గందరగోళం జరుగుతుంది. మనసులో ఏదో ఒకటి వస్తూనే వుంటుంది. ఇటువంటి ఆలోచనలు ధ్యానం చేయని సమయంలో కూడా వస్తూనే వుంటాయి. కానీ వాటిని మనం గుర్తించలేం. అవి గుంపులుగా వస్తుంటాయి. మనసు ప్రశాంతంగా వుండదు. కానీ మనం ధ్యానంలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా మనం వేటినయితే గమనిస్తామో, అవే ఆలోచనలు వస్తాయి. అందువల్ల ధ్యానం చేయకపోతే ఆలోచనలు రావు అని అన్పిస్తుంది. కానీ అది పొరపాటు. ఆలోచనలను మనం గుర్తిస్తాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఆలోచనను మనం నియంత్రిస్తాం. అయితే ధ్యానం తరువాత వచ్చే ఆలోచనలను కూడా నియంత్రిస్తూ వుండాలి.