లాలాజీ మహారాజ్
1873 – 1931
లాలాజీ అని ఆప్యాయంగా పిలిచే ఫతేఘర్‌కు చెందిన శ్రీ రామచంద్ర హార్ట్‌ఫుల్‌నెస్ సంప్రదాయంలోని మొట్టమొదటి గురువు. తమ ఆధ్యాత్మిక పరిణామంపై హృదయపూర్వకమైన ఆసక్తి ఉన్న అన్వేషకులందరూ అనుభూతి చెందగలిగేలా ఆయన యోగిక ప్రసారం యొక్క పురాతన కళను పునరుద్ధరించారు.
కుటుంబ జీవితం స్వీయ-అభివృద్ధికి అత్యంత అనుకూలమైనదని లాలాజీ గారి నమ్మకం. వాస్తవానికి, ఆయనని ప్రేరేపించి, సత్యపథంలో తనను అప్రమత్తంగా ఉంచిన ఘనత తన భార్యదేనని ఆయన ప్రశంసిస్తారు.
స్వతహాగా లాలాజీ ఎప్పుడూ ప్రశాంత స్వభావులు, అయితే ఇతరుల బాధలను, ఆనందాలను చూసి సులభంగా చలించిపోయేవారు. ఆయనకు కోపం చాలా అరుదుగా వచ్చేది. అనవసరమైన మాటలకు అవకాశం ఇవ్వకుండా, తన ఆలోచనలను తెలియజేయడానికి, తన శ్రోతల హృదయాలను దోచుకోవడానికి సంభాషణను ఉపయోగించడంలో ప్రావీణ్యులు. ఆయన వ్యక్తిత్వం, జీవన విధానం, సాధారణ ప్రవర్తన లాలాజీకి అందరి అభిమానాన్ని, గౌరవాన్ని సంపాదించిపెట్టాయి.
లాలాజీ తన రెప్పపాటులో ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకురాగలిగేవారు, కానీ ఎలాంటి ప్రదర్శన ఆయనకు నచ్చేదికాదు. హృదయంలోని వివిధ సంక్లిష్టతలను తొలగించడానికి, ఆయన తన అనుచరులతో శత్రువులను స్నేహితులుగా చేసుకోమని చెప్పేవారు. నైతికత స్వీయ-సాక్షాత్కారానికి ముఖ్యమైనదని, ప్రేమ అనేది ఒక గొప్ప సాధనగా ఆయన భావించారు. బాధలు అనేవి అనేక రహస్యాలు దాగిఉన్న దివ్య ఆశీర్వచనాలని బోధించారు.
తన కార్యాలయంలో లేనప్పుడు, లాలాజీ అన్వేషకులకు శిక్షణ ఇచ్చేవారు, రాత్రి తెల్లవారుజాము రెండు గంటల వరకు వారికి ప్రసారం చేసేవారు. 1929లో పదవీ విరమణ చేసిన తరువాత, ఆయన తన సమయాన్ని అంతా ఆధ్యాత్మిక కార్యకలాపాలకే కేటాయించడం ప్రారంభించారు. పుస్తకాలు, వ్యాసాలు, లేఖలను చెప్పి వ్రాయిస్తూ ప్రతిరోజూ రెండు, మూడు గంటలు గడిపేవారు. ఆయన ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషలలో గొప్ప పండితులు, హిందీ, సంస్కృతంలో కూడా మంచి పరిజ్ఞానం ఉన్నవారు.
లాలాజీ చాలా సరళమైన, పవిత్రమైన జీవితాన్ని గడిపారు. ఆయన పేరు చాలా దూరం వ్యాపించి, చాలా మంది ప్రజలు ఓదార్పు కోసం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం ఆయనను సంప్రదించేవారు. ఆధ్యాత్మిక పురోగతిని అనుగ్రహించకుండా ఆయన ఎప్పుడూ ఎవరినీ వెనక్కి పంపలేదు. ఆయన స్వరం చాలా సుమధురమైనదిగా ఉండడం వలన, ఆయన పాటలు ప్రేక్షకుల ఆత్మను తాకే శక్తిని కలిగి ఉండేవి. ఈ మార్గదర్శకులు చేసిన మహోన్నతమైన పని కారణంగానే, ఈ రోజు హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారందరికీ సులభమైన, సమర్థవంతమైన ప్రక్రియను అందించగలుగుతోంది.
హార్ట్‌ఫుల్‌నెస్ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక ప్రసార కళ లాలాజీ మహారాజ్ నుండి షాజహాన్‌పూర్‌కు చెందిన శ్రీ రామచంద్ర (బాబూజీ) గారికి అందజేయబడింది. బాబూజీ ఈ సాంప్రదాయంలో రెండవ మార్గదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.