సహజమార్గ గురుపరంపర
నమస్కారం.
జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి మనందరికీ గొప్ప సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆయన యోగ పురుషుడు మాత్రమే కాదు, యుగ పురుషుడు, యోగేశ్వరుడు, యోగానికి భగవానుడు కూడా. సహజమార్గపు ఆదిగురువు అయిన లాలాజీ మహరాజ్… శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో, పూజ్య భావంతో, గౌరవంతో, అమితంగా ప్రేమించేవారు. ఆయన భారత దేశపు చరిత్ర లోని ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్నంతటినీ శోధించి… శ్రీకృష్ణుడు అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంగా ఆకాశంలో ఉండడాన్ని కనుగొన్నారని తమ గ్రంథాలలో వ్రాయడం జరిగింది. అలాగే బాబూజీ మహరాజ్ కూడా అవతార పురుషుడైన శ్రీరాముని… నైతికతకు, సత్ప్రవర్తనకు, సామాజిక సంస్కృతికి పునాదులు వేసిన వ్యక్తిగా విశ్వసించేవారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ కలియుగాన్ని శాసించే యుగపురుషుడు. నైతికత, సత్ప్రవర్తనలను పునాదిగా ఏర్పరచుకొని, శ్రీకృష్ణ భగవానుడు మానవ జీవిత గమనంలో భక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. భగవంతుని పట్ల ప్రేమను, ఆధ్యాత్మిక యోగ సాధనలో భక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. సహజమార్గ పద్ధతి ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే… మనం నిత్యం చేసే కర్మలను ప్రేమ, ఉత్సాహాలు లేకుండా కేవలం భౌతికంగా, మానసికంగా మాత్రమే చేసినట్లయితే, బ్రతుకు ఈడుస్తున్నట్లుగా ఉంటుంది. అలా కాకుండా మనం చేసే పనులను భగవంతుని పట్ల ప్రేమతో చేసినట్లయితే… అది ఒక విధమైన భక్తిగా మారి జీవితం ధన్యమవుతుంది. లేకపోతే ఎప్పుడూ శ్రమ గానే మిగిలిపోతుంది. అలాగే మనం సంపాదించుకున్న జ్ఞానం కూడా కలుషితమైపోతుంది. పాలు పాడై పెరుగుగా మారినట్లు, జ్ఞానం కూడా అహం వల్ల కలుషితమైపోతుంది. జ్ఞానం కూడా అహం వల్ల కలుషితమైపోతుంది. ఆ జ్ఞానానికి భగవంతుడు కేంద్ర బిందువుగా ఉంటే భగవంతుని ప్రభావం ప్రబలంగా ఉంటూ… భగవంతుడే కేంద్ర స్థానాన్ని గ్రహిస్తే జ్ఞానం భక్తిగా పరివర్తన చెందుతుంది. లేకపోతే ఆ జ్ఞానం మూర్ఖత్వంగా మిగిలిపోతుంది. శ్రీకృష్ణుని జీవితంలో మరొక ముఖ్యమైన పాత్ర ఏమిటంటే… మనందరికీ ఈరోజు తెలిసిన సహజమార్గ పద్ధతి ద్వారా ప్రసరించబడే ప్రాణాహుతి అనే ఆధ్యాత్మిక శక్తి ప్రసరణ. అర్జునునికి 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలలో గల జ్ఞానాన్ని మౌఖికంగా అందజేయడం అనేది అసాధ్యమైన విషయం… ముఖ్యంగా యుద్ధం ప్రారంభం కానున్న కీలక సమయంలో అన్ని దిక్కుల నుండి శంఖాలు పూరించబడిన తర్వాత… పైగా ఆ క్షణంలో అర్జునుడు విషాదంలో మునిగి, తానిక యుద్ధం చేయలేనని చతికిల పడినప్పుడు. ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానాన్నంతటినీ ప్రాణాహుతి ప్రసరణ ద్వారా కొన్ని క్షణాల్లోనే అర్జునునికి అందజేయడం జరిగింది. వేద వ్యాస మహర్షి ఈ ప్రక్రియ కంతటికి సాక్షిగా ఉన్నారు. కృష్ణార్జునుల మధ్య జరిగిన ప్రాణాహుతి ద్వారా అందించబడిన జ్ఞానాన్ని వ్యాస మహర్షి తర్జుమా చేసారు. అదే మనం ఈరోజు చదువుకుంటున్న 700 శ్లోకాలు గల భగవద్గీత. కేవలం ఆధునిక మానవుడు మాత్రమే ఈ ప్రక్రియను అంటే జ్ఞానాన్ని
డౌన్ లోడ్ చేయడం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోగలుగుతాడు. కొన్ని గిగాబైట్ల మెమొరీని ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలో ఎలా డౌన్ లోడ్ చేయవచ్చో… నేటి మానవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఈనాటి ప్రపంచం మాత్రమే ఈ విధంగా జ్ఞానాన్ని డౌన్ లోడ్ చేసుకోవడాన్ని అర్థం చేసుకోగలదు. ఆయన జీవిత కాలంలోనే దివ్యలోకాలకు తరలి వెళ్లాలని సంకల్పించినప్పుడు… ఆ చివరి క్షణాలను ఉద్ధవుడు తెలుసుకుని… “స్వామీ, మీరు వెళ్లిపోతే మేమేం చేయాలి? మీరు మాతో ఏమీ పంచుకోలేదు,” అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, “నువ్వే అందరికీ బోధించాలి భక్తిని గురించి… భక్తి యొక్క ఎరుకను గురించి గోపికలకు బోధించు, భక్తిని గురించి ప్రపంచానికంతటికీ తెలియజేయి,” అంటారు. ఆ సాంప్రదాయమే ఈరోజుకూ కొనసాగుతోంది. శ్రీకృష్ణుని ప్రకారం భక్తి అంటే కేవలం బాహ్య ఆరాధనే కాకుండా… మనం చేసే అన్ని పనులకు వర్తిస్తుంది. వాటన్నింటినీ స్వామికి అంకితం చేస్తాం. జీవితంలోని ప్రతి అంశమూ ఆ పరతత్వం పట్ల ఉన్న ప్రేమ తరంగాలతో కంపించాలి… అప్పుడే దాన్ని నిజమైన భక్తి అనగలుగుతాం. పాలలో ఒక నిమ్మరసం చుక్క పడితే పాలు పాడైపోయినట్లు; భక్తి అనేది అత్యాశగా ఏర్పడినప్పుడు, ఏదైనా ఆశించినప్పుడు… అది బ్రహ్మవిద్య గాని, మోక్షం అయినప్పటికీ దాని గురించిన ఒక్క ఆలోచన మిగిలి ఉన్నా కూడా అది కలుషితమైపోతుంది. భక్తికి మచ్చ ఏర్పడుతుంది. ‘భగవంతుడా, నేనింత తపస్సు చేస్తున్నాను, ఇంతగా ధ్యానం చేస్తున్నాను, నాకు కొంత మనశ్శాంతిని ఇవ్వగలరా’… అనేటువంటి లావాదేవీ కూడా భక్తిని పాడు చేస్తుంది. ఎందుకంటే భక్తి దేన్నీ కోరదు. భక్తి అంటే భగవంతుని పట్ల ప్రేమ కోసమే ఉండే ప్రేమ. మన అస్తిత్వం ఉన్నదే భగవంతుని కోసం కేవలం ఆయనను సేవించుట కోసం మాత్రమే. ఆయన జీవితం ఎప్పటికీ ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక వెలుగుకు కాంతిపుంజమై భాసిస్తూ ఉంటుంది. మనం వాటిని ఆకళింపు చేసుకోవాలి. ఆయన తత్వాన్ని మన జీవితాల్లో భాగం చేసుకోవాలి. సహజమార్గ గురు పరంపర శ్రీకృష్ణ భగవానునితో ప్రారంభమవుతుంది… అది కొనసాగుతూనే ఉంది కూడా మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. మన మాస్టర్ల గురు పరంపర శ్రీకృష్ణుడు మరియు రాధతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చైతన్య మహాప్రభు, గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస… స్వామి వివేకానంద, లాలాజీ మహరాజ్, బాబూజీ మహరాజ్, చారీజీ మహరాజ్ ఇలా కొనసాగుతూ ఉంది. ఒక్కోసారి ఈ పేర్లన్నింటినీ గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది. దయచేసి క్షమించండి. నేను అన్ని పేర్లు చెప్పలేకపోవచ్చు, అవన్నీ పుస్తకాలలో ఉన్నాయి. చెప్పలేకపోతే నష్టమేమిటి? కృష్ణుడి పేరు ముందా, లాలాజీ పేరు ముందా, అసలు ఏ పేరు లేదా? ఒకవేళ వాళ్ళ పేర్లన్నీ చెప్పినప్పటికీ వారి గురించి మనకేం తెలుస్తుంది? వారి దివ్య తత్వాలను గురించి ఎలా తెలుస్తుంది? మనం కూడా అటువంటి తత్వాలుగా మారాలి. కాబట్టి గురు పరంపర యొక్క పిలుపు ఏమిటంటే వాళ్ళలా తయారవ్వమని… అలా తయారైన తరువాత ఆ తయారైన తత్వాన్ని కూడా వారికే అర్పించండి. ఆ విధంగా తయారై, మిమ్మల్ని మీరు పూర్తిగా లేకుండా చేసుకోండి. మిమ్మల్ని మీరు లేకుండా చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు కాల్చుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు. ఈ తయారైన తత్వానికి సైతం అతీతంగా ఎదగడం. అప్పుడు ఒక నూతన అస్తిత్వం ప్రారంభమవుతుంది. అప్పుడు మనకు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. కనీసం వారిలా తయారవ్వాలన్న దిశగా ఆసక్తి కనబరచండి. దానికి అవసరమైన లక్షణాలను మీలో పెంపొందించుకోండి. వారికి మన జీవితాల్లో స్థానం కల్పించండి. మనం వారికి అందుబాటులో ఉందాం. ఇలా మనల్ని, మన ఆత్మలను, మన హృదయాలను, మన కృషిని వారికి అందుబాటులో ఉంచడం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం మనమందరం వారికి అందుబాటులో ఉన్నాం. ఇక్కడ వాళ్లు మనపై పనిచేయగలరు. మీరు ఒకేసారి అందరూ ధ్యానంలో కూర్చున్నారనుకోండి, దీన్నే అందుబాటులో ఉండడం అంటారు. వారి దివ్య కృపకు, దివ్య ప్రాణాహుతికి పాత్రులవడం. అప్పుడు మనకు, వారికి మధ్య జరగవలసిన విలీన ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మన ఇళ్లలో కూడా మనం ఈ ప్రాణాహుతికి, పై నుండి వర్షిస్తున్న ఈ దివ్య కృపకు అందుబాటులో ఉంటున్నామా? మీరు అందుబాటులో లేనట్లయితే మీరు వాటిని అందుకునే పరిస్థితుల్లో లేకపోయినట్లయితే మీలో పరివర్తన ఎలా వస్తుంది? కాబట్టి ఆధ్యాత్మిక పరివర్తనకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. భౌతికంగా అందుబాటులో ఉన్నా హృదయం మూసుకుని ఉంటే ప్రయోజనం లేదు. ఎవరైతే అందుబాటులో ఉండాలనుకోవడం లేదో వాళ్లకి చాలా అవరోధాలు ఉంటాయి. ఎవరైతే నిజంగా, నిజంగా పురోగమించాలనుకుంటున్నారో వాళ్లకి ఎటువంటి సాకులు ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనం ఇక ఈ అందుబాటులో ఉండడం కోసం ఎటువంటి కారణాలు, సాకులు ఉండవనే నిబద్ధతను కలిగి ఉందాం. ధన్యవాదాలు.
మరణం - పునర్జన్మ హృదయపు తేలికదనంపై అవగాహన
అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నేను అమెరికా, కెనడా దేశాల అభ్యాసులతో జూమ్ ద్వారా సంభాషించడం జరిగింది. ఆ సెషన్ ధ్యానంతో పూర్తయింది. అయితే దానికి ముందు ధ్యానానికి, నిర్మలీకరణకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు అడగబడ్డాయి. అందులో ఒక పెద్ద మనిషి తన క్రిస్టియానిటీకి సంబంధించి ఒక ప్రాథమిక ప్రశ్నను అడిగారు. మృత్యువు సంభవించే ఆ చివరి క్షణాలలో లార్డ్ జీసస్ చెప్పిన దాని గురించి… అలాగే ఆ సమయంలో మీ హృదయం ఒక ఈక వలె తేలికదనాన్ని అనుభూతి చెందడం గురించి. పూజ్య లాలాజీ మహరాజ్ స్వయంగా మరణం గురించి వర్ణించే క్రమంలో… మూలాధార చక్రంతో మొదలుకొని ప్రతి యోగిక చక్రమూ మరణ సమయంలో అవి ఎలా కుప్పకూలుతాయో… పంచభూతాల లోని ప్రతి మూలకం, తర్వాతి చక్రంలో ఎలా కరిగి లయం అవుతుందో… అవి కరిగిపోయి తదుపరి ప్రాధాన్యత లోని చక్రం వద్ద ఉండే మూలకంతో లయమవుతూ… ఆ సమయంలో శరీరంపై ఎటువంటి ప్రభావం కలుగజేస్తాయో తెలియజేశారు. భారతీయ సంప్రదాయం సైతం ఆ సమయంలో భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా హృదయం తేలికదనం అనుభవించడాన్ని గురించి ప్రస్తావిస్తుంది. అందుకే ఎక్కువ సంప్రదాయాలలో, వాళ్ల పిల్లలకు, మనుమలకు దేవీ దేవతల పేర్లు పెట్టడం అనే ఆచారం ఉంది. మీ కుమారుని పేరు కృష్ణ లేదా రామ అయితే, మరణ సమయంలో అతన్ని పిలవడం ద్వారా మీరు ఆయన్ని గుర్తు చేసుకున్నట్లు భావిస్తారు. అయితే అది అలా జరగదు. మీరు మీ పిల్లవాడిని పిలిస్తే, మీరు మీ పిల్లవాడిని మాత్రమే పిలిచినట్లు. మీరు భగవాన్ శ్రీకృష్ణుని పిలిచినట్లు కాదు. ఎలాగైతే ద్రౌపది ఎంతో నిరాశా నిస్పృహలతో నిస్సహాయతతో పిలిచిందో… అలా శరణాగతి భావనతో మీరు పిలిచినప్పుడు, అప్పుడే ఆ పరమాత్మ మీకై వస్తారు. అయితే భగవంతునికి సంబంధించినంతవరకు ఆయన వెళ్లడం, రావడం అంటూ ఉండదు. ఆయన సర్వాంతర్యామి. మరి ఆయన్ను పిలవాల్సిన అవసరం ఏముంది? ఇది తర్కానికి అందదు. బంధం గురించి మనం మాట్లాడినప్పుడు… ఇక్కడ ఉన్న ఎయిమ్స్, హైదరాబాద్ విద్యార్థులు ఈ బంధాన్ని గురించిన ఉదాహరణను అభినందిస్తారని అనుకుంటున్నాను. భౌతిక ప్రపంచంలో గానీ, అనుబంధాల విషయంలో గానీ ఒక బంధం ఏర్పరచాలంటే కొంత శక్తి అనే పెట్టుబడి అవసరమవుతుంది. అదే ఒక బంధాన్ని విచ్ఛిన్నం చేయాలంటే, విడగొట్టాలంటే దీనికి వ్యతిరేకమైనది జరుగుతుంది. అంటే బంధం విడిపోయినప్పుడు శక్తి విడుదలవుతుంది. బంధం బలంగా ఉన్నప్పుడు, దాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు, ఎక్కువ శక్తి విడుదలవుతుంది. మనం ఈ సరళమైన, శాస్త్రీయమైన, బంధం, అనుబంధం అనే అంశాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన శాస్త్రాల్లో ఈ విముఖత లేదా వైరాగ్యాన్ని… ఎంతో అత్యున్నత స్థితిగా అభివర్ణించేవారు. అయితే ఈ అయిష్టత లేదా విరక్తితో కూడిన వైరాగ్యాన్ని బంధంలో కూడా హీనమైనదిగా, నీచమైనదిగా భావిస్తారు. ఎలాగైతే ఆకర్షణ బంధాన్ని ఏర్పరిచినట్లుగానే, వికర్షణ లేదా అయిష్టత కూడా బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. కేవలం ప్రేమ మాత్రమే బంధాన్ని సృష్టించదు, ద్వేషం కూడా ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. తరచుగా మనం ప్రేమించే వారి కన్నా, ద్వేషించే వ్యక్తులనే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. కనుక మీరు ద్వేషంతో, అయిష్టతతో బంధం నుండి విడివడ్డారా? లేక ఆకర్షణతో బంధంలో కూడి ఉన్నారా? అనేది ముఖ్యం కాదు. అది తప్పక ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఎలా తొలగించుకోవాలి? దీన్ని ఎలా నాశనం చేయాలి? దీనికి ఒకే పరిష్కారం! ఎవరైతే శాశ్వతునిగా ఉంటారో, వారితో శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచుకోవడమే! తాత్కాలికమైన వాటితో బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు… అశాశ్వతమైనవి ఏనాటికైనా మాయం అవ్వాల్సిందే. మరిక ఈ శక్తి అనేది ఎక్కడ విడుదలవుతుంది? మీరు దాన్ని ఎలా ఉపయోగించగలుగుతారు? అందుకే మనం ఎంత కాదనుకున్నా, ఎంత మంచి ఆశయం, అభిలాషలతో ఉన్నా, అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకంటే అవి బంధాన్ని సృష్టిస్తాయి కనుక. మరణించే క్షణంలో హృదయం కనుక తేలికదనం అనుభూతి చెందాలంటే… నేను కోరుకున్న సమయంలో ఆ ఈక వంటి తేలిక స్థితిని సృష్టించుకోగలనా? అది అసంభవం! మీరు ముందు నుంచి ఆ విధంగా తయారవ్వడానికి శిక్షణ పొందితే తప్ప, ఇది కుదరదు. మరి అటువంటి స్థితి నాలో నేను శాశ్వతంగా ఎలా సృష్టించుకోవడం? ఈ శిక్షణ జీవితంలో తొందరగా ప్రారంభించాలి. ఈ విద్యార్థులు జీవితంలో చాలా తొందరగా ధ్యానాన్ని ప్రారంభించడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ఇది గొప్ప అవకాశం. నాకు అర్థమైనంత వరకూ ధ్యానం అనేది కూడా ‘మరణించడంలో ఒక ప్రయోగం’ లాంటిదే. మనం మన ఎరుకను కోల్పోయి ధ్యానంలో లోతుగా మునకలు వేసిన ప్రతిసారీ, మనం సమాధి స్థితిలోకి ప్రవేశించినప్పుడు… మరణం వంటి స్థితికి అది సమాంతరంగా ఉంటుంది. మీరు ఎంతో లోతులకు ప్రయాణిస్తారు. లోపలకు కరిగిపోతారు. ఆ సమయంలో మీకు ఇంకేమీ పట్టదు. ఇలా ధ్యానంలో ప్రతిరోజు మరణించే సాధన అనేది… అంటే ప్రతిదాన్నీ వదిలేసి మన హృదయంలో శాశ్వతమైన ప్రియతమునితో కలసి ఉన్నప్పుడు, అద్భుతం జరుగుతుంది. అప్పుడు మనల్ని మృత్యువు సైతం నశింప చేయజాలదు. మీకు ఇక చావు అంటే భయం వెయ్యదు. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఎలాగూ మరణిస్తున్నారు కనుక. మీరు అందులో ఒక భాగమైపోతారు. జీవితం చాలా చిన్నది. కానీ మరణం తర్వాతి సమయం ఎంతో పెద్దది. అటువంటి శుద్ధి చెందిన ఆత్మ, వారు వెనువెంటనే జన్మను తీసుకోలేరు. ఎందుకంటే వారి తేలికైన స్థితి వారిని క్రిందకు రానివ్వదు. భారమైన హృదయాలతో కూడిన ఆత్మలే, అవి పైకి పోలేవు కాబట్టి, ఈ ప్రపంచంలోకి దిగి వస్తాయి. అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. బాబూజీ మహరాజ్ చెప్పినట్లుగా మహావీరుని (జైన తీర్థంకరుడు) వంటి ఎంతో శుద్ధి చెందిన ఉన్నతాత్మలు… వారి గత జన్మ తర్వాత తిరిగి జన్మించడానికి… వారికి తగిన పిండం, తగిన ఆత్మ, అలాగే సరిపోలే మాతృ ప్రకంపనలు లభించడానికి ఐదువేల సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అటువంటి ఉన్నతాత్మను ఆకర్షించాలంటే ఎంతో సమయం అవసరమవుతుంది. కనుక క్లుప్తంగా చెప్పాలంటే, ఈక వంటి తేలికదనాన్ని అనుభూతి చెందగలిగే జీవితం గడపండి. హృదయపు తేలికదనం! మీరు హృదయంలో కొన్ని భావోద్వేగాలు మోస్తూ ఉంటారు. అతిశయం, గర్వం, అహంభావం ఇలాంటివి. అవి నిజంగా అంత విలువైనవా? ఆలోచించండి! ‘నేను నా ప్రియతముల కోసం వేదన చెందుతున్నాను’. ఇంతకీ ఎవరు మీ ప్రియతములు? ఇవన్నీ తాత్కాలికమైన, అశాశ్వతమైన అనుబంధాలు. వీటిలో ఎటువంటి తప్పు లేదు. కుటుంబంతో ఉండండి, వారిని సంరక్షించండి, గౌరవించండి బాగా చూసుకోండి. అందులో ఎటువంటి తప్పులేదు. ఇవన్నీ భగవంతుడిచ్చినవే! మీ తల్లిదండ్రులను మీకు ఆ పరమాత్మే ఇచ్చాడు. తల్లిదండ్రులకు పిల్లలను ఆ భగవంతుడే ఇచ్చాడు. మీరందరూ ఒకరికి ఒకరు బహుమతులు. అటువంటి అనుబంధాన్ని స్వాగతించండి. మనం కృతజ్ఞులమై ఉండాలి. అటువంటి అనుబంధాలు శాశ్వతంగా ఉండాలి. నేను నా తల్లితో సంబంధాన్ని త్రెంచుకోవడం కోసం ఎందుకు ప్రయత్నించాలి? అది మూర్ఖత్వమే! మహాభారత సంగ్రామం శ్రీకృష్ణుని చే సృష్టించబడినప్పటికీ, ఆయన యుద్ధం చేయలేదని ప్రజలు అంటారు. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకుంటాం. ‘ఎప్పుడైతే భగవంతుడు మీ వైపు ఉంటాడో, మీ విజయం అనేది నిశ్చయం’. ప్రజలు ఈ స్టేట్ మెంట్ ని ఎంతగా ఇష్టపడతారంటే… “ఓహ్! భగవంతుడు నా వైపు ఉంటే నేను తప్పక గెలుస్తాను” అని. అయితే నేను కొంత భిన్నమైన దాన్ని మీకు చెప్తాను, “భగవంతుడు నా పక్షాన ఉంటే… నా ప్రపంచంలోని నష్టాలు అన్నింటినీ కూడా నేను భరించగలను… పరమాత్మ నాతో ఉన్నప్పుడు, విజయానికి కూడా అర్థం లేదు”. ధన్యవాదాలు.
సవాళ్ళను అంగీకరించండి వారి సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది
అందరికీ నమస్కారం. తరచుగా ప్రజలు ముఖ్యంగా మన అభ్యాసీ సోదరీ సోదరులు నాకు వ్రాస్తూ ఉంటారు. భగవంతుడు లేదా మాస్టర్ ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నారు? అని. నేను ఎందుకు బాధలు పడుతున్నాను?
జీవితంలో అలాంటి పరీక్షలు ఎందుకు? అని. నేను మన మాస్టర్ల జీవితాల నుండి కొన్ని కథలతో మొదలు పెడతాను. బాబూజీ మహరాజ్ మహాసమాధి తర్వాత ఆయన ఆటోబయోగ్రఫీ నుండి చదివినవి… ఆయన జీవితం లోని 1944, 45, 46 సంవత్సరాల్లోనివి. ఆయన విశిష్ట వ్యక్తిత్వంగా తయారు చేయబడుతున్నప్పుడు… ఆయన విశ్వం యొక్క బాధ్యతను తీసుకోకముందు ఎన్నో పరీక్షలు ఆయనకు పెట్టబడ్డాయి. మీకందరికీ రాధా మాతచే పెట్టబడిన పరీక్ష గురించి తెలుసు. ఆ పరీక్షలో ఆయన విజయం సాధించాకా… “ఇప్పటివరకు నన్ను నీ తల్లిగా భావించావు, ఇప్పటినుండి నన్ను నీ సోదరిగా భావించు” అని రాధా మాత ప్రకటించారు. బ్రైటర్ వరల్డ్ లో అందరూ ఆనందంతో నృత్యం చేస్తున్నారు. వివేకానందుల వారు, లాలాజీ సహా అందరూ “ఇప్పుడు నువ్వు మాకు మార్గదర్శకత్వం వహించు” అని అన్నారు. బాబూజీ మహరాజ్ పరిస్థితి మీరు ఊహించగలరా? అది మన మాస్టర్ మన వద్దకు వచ్చి మన పాదాలు స్పృశించడం వంటిది. అది అంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన పద్ధతి. ఇలా కూడా శక్తి మార్పిడి చేయవచ్చు అని బాబూజీ అన్నారు. శిష్యుడు, గురువు యొక్క పాదాలను మర్దన చేసినప్పుడు… గురువు కూడా తన శిష్యుని పాదాలను మర్దన చేయవచ్చు. ఇది సహజమార్గ పద్ధతి. గురువులు, ప్రిసెప్టర్లు కూడా అభ్యాసులకు భౌతిక స్థాయిలో సైతం సేవ చేయడానికి వెనుకాడడం లేదు. ఇతర గురువులు, సంస్థలు సేవను డిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడ అది పూర్తిగా వ్యతిరేకం. నేను చూసిన, చదివిన, ఇప్పుడు చూస్తున్న మరొక ముఖ్య విషయం ఏమిటంటే… మన గురుపరంపర, అభ్యాసులను మాస్టర్స్ కన్నా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళగలరు. ఇది సహజమార్గం యొక్క మరొక ప్రత్యేక లక్షణం. ఇక్కడ పనిచేస్తున్న మాస్టర్ అత్యున్నతుడైతే అక్కడే సమస్య మొదలవుతుంది. ఆయన పనిచేయలేరు. కొంత స్థాయి మనసు, కొంత స్థాయి చైతన్యం ఉండాల్సిన అవసరం ఉంది. నీటి బిందువు పూర్తిగా సముద్రంలో లయమై పోకూడదు. ఒకవేళ అలా అయినట్లయితే, పని జరగడానికి అవసరమైన వ్యక్తిత్వం ఏ విధంగా లభిస్తుంది? మన గొప్ప మాస్టర్స్, వారు శరణాగతి పొందినప్పుడు… ఉదాహరణకు ‘లాలాజీ ఆ పరతత్వానికి సంపూర్ణంగా శరణాగతి చెందారు’… అంటే పూర్తిగా శూన్యీకరించ బడ్డారని అర్థం. ఆయనలో సంపూర్ణమైన శూన్యస్థితి నెలకొని ఉంది. అలాగే ‘బాబూజీ శరణాగతి అయ్యారు’, అంటే అక్కడ రెండు శూన్యత్వాలు ఉన్నాయని అర్థం. అక్కడ ఏదైనా ఉండి ఉంటే, ఎంత చిన్న పరిమాణంలో అయినా వ్యక్తిత్వం అనేది మిగిలి ఉంటే… అప్పుడు లయమవడం అనేది కష్టసాధ్యమవుతుంది. ఒకరు పైపైకి పురోగమిస్తున్న కొద్దీ అక్కడ చాలా ఎక్కువగా అవరోధాలు ఉంటాయి. ఎక్కువగా జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ కేవలం వ్యక్తిగత ఆత్మను సిద్ధం చేయటం కోసమే, అటువంటి శూన్యత్వస్థితిని సృష్టించటం కోసమే! దిగువ స్థాయిలో ఒక వ్యక్తిని పరీక్షించవలసిన అవసరమేముంది? ఎలాగూ అతను అపజయం పాలవుతాడు. మధ్య స్థాయిలో ముందుకు, వెనుకకు జరుగుతూ ఉంటుంది. మధ్య స్థాయిలో అభ్యాసీ విఫలుడైనప్పుడు మాస్టర్ దానిని తన స్వంత అపజయంగా భావిస్తారు, తనను తాను నిందించుకుంటారు. ‘నేనెందుకు ఈ వ్యక్తికి సరిగా సేవ చేయలేకపోతున్నాను, ఇతను అపజయం పొందటం కొనసాగుతూనే ఉంది’ అని భావిస్తారు. మాస్టర్ తనను తాను నిందించుకొని కలత చెందుతుంటారు. అభ్యాసుల పరాజయంపై ఆయన ‘నాలో ఏదో ఒక స్థాయిలో ఆ పరాజయం, బలహీనత ఉంది’ అనుకుంటారు. కాబట్టి నిజానికి ఇది మాస్టర్ కు పరీక్ష, అభ్యాసీకి కాదు, శిష్యులకు కాదు. మనం నిజంగా, నిశ్చయంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. సహజమార్గం యొక్క మరొక సౌందర్యం ఏమిటంటే, ఈ సంసిద్ధత అనేది బలవంతంగా రుద్దబడదు. ఆ పని నిశ్శబ్దంగా జరిగినా, అభ్యాసీ నుండి కొన్ని లక్షణాలను తీసివేయటానికి… ఒక ప్రిసెప్టర్ లేక మాస్టర్ ‘నేను ఈ అభ్యాసీ నుండి ఫలానా లక్షణాన్ని తీసివేస్తున్నానని’ ఆలోచన చేసినా అది పనిచేయకపోవచ్చు. నేను నా లోలోతుల్లోకి ఎంత స్థాయికి వెళ్లాలంటే… ఉద్దేశ్యపూర్వకంగా మొదట్లో మనం చేయవచ్చు కానీ అది ఉద్దేశ్యాల జాడను తప్పించుకొని ఎంతగా సూక్ష్మీకరించబడుతుందంటే… అది ఎటువంటి ప్రకంపనలను సృష్టించదు. అందుకే బాబూజీ మహరాజ్, రాత్రిపూట అభ్యాసులు నిద్రించే సమయాన్ని వారిపై పనిచేయటానికి ఎంచుకునేవారు. అప్పుడైతే వారి నుండి, ఏ దిక్కు నుండి కూడా నిరోధం ఉండదని. బహుశా 2010 లేదా 2011 సంవత్సరంలో చారీజీ మాస్టర్, బాబూజీ మహరాజ్ నుండి ఒక సందేశం అందుకున్నారు… ఆరోజు 28 సెప్టెంబర్ కాబట్టి, నేను వారి ఆశీస్సుల కోసం గాయత్రికి వెళ్లాను… ఆరోజు ఉదయం వారు చాలా విచారంగా ఉన్నారు. నేను మాస్టర్ ను ‘ఎందుకు అంత విచారంగా ఉన్నారని’ అడిగాను. వారు “నేను బాబూజీ వద్ద నుండి అందుకున్న ఈ సందేశాన్ని చూడు” అన్నారు. నేను దానిని చదివాను. ఆ సందేశం యొక్క సారాంశం ఏమిటంటే బాబూజీ మహరాజ్… “నీవు ఈ పరీక్షలో సఫలీకృతుడవైతేనే నీకు అనుగ్రహింపబడిన కృప నిలిచి ఉంటుంది” అన్నారు. అంతే! దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ సారాంశం మాత్రం ఇదే. మాస్టర్ ‘నేను ఇప్పుడు విఫలం అయితే ఎలా’ అని చింతిస్తూ ఉన్నారు. నేను మాస్టర్ తో “సకారాత్మకంగా ఆలోచించండి… మీరు సఫలీకృతులయితే మీకోసం ఎదురు చూసే దానిని గురించి ఆలోచించండి” అని చెప్పాను. నేను వారికి రాధాజీ, బాబూజీని పరీక్షించిన విషయం గుర్తు చేశాను. బాబూజీ ఆ పరీక్షలో సఫలం అయిన వెంటనే చాలా ఉన్నత స్థితులలో విహరించారు అని చెప్పాను. మాస్టర్ చాలా చాలా విచారంతో, ‘నాకు ఈ సందేశం నచ్చలేదు’ అని ఆ కాగితాన్ని టేబుల్ మీదకు గిరాటేశారు. మాస్టర్ గా మీకు సమంజసమైనవి మీరు చేయమని అనుమతి ఇచ్చిన తరువాత… జీవిత సంధ్యా సమయంలో పరీక్షింపబడడం ఎవరికి మాత్రం నచ్చుతుంది? కానీ ప్రకృతి నిగూఢమైనది. అందువల్ల ఆధ్యాత్మికతలో ముందుకు సాగే కొద్దీ మరిన్ని పరీక్షలు ఎదురవుతాయని ఆశించండి. పరీక్షలు అంటే భయపడకండి. వాటి పరిష్కారానికి తగిన సహాయం కూడా, మనందరం ఆ పరీక్షలను నెగ్గాలనే ఆశతోనే ఇవ్వబడుతుంది. అవి నిష్ఫలమైనవి కావు. దారిలో ఇబ్బందులు వచ్చినట్లయితే నిరాశ చెందకండి. వారి సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. వారి సహాయం, ఆదరణ, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మన అపజయానికి వారు బాధపడతారు. వారు అలా కానివ్వరు. అందువల్ల మన దారిలో వచ్చే సవాళ్ళను అంగీకరించండి. వదిలి పెట్టకండి. కుదిరితే మరిన్ని ఆహ్వానించండి. అందువల్లనే పూర్వం మహాత్ములు కష్టాలను ఆహ్వానించేవారు. మనం అలా చేయక్కర్లేదు.మనకు అవి సరిపడా ఉన్నాయి. దానిని ఒక పరీక్షగా భావించి నైపుణ్యంతో, అద్భుతంగా అధిగమించి… మాస్టర్ తో ‘పరీక్షలకు ధన్యవాదాలు మాస్టర్’ అని చెప్పండి. నేనిప్పుడు మరొక ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను. ఒక వారం రోజులు, కోరికలు లేని జీవన విధానాన్ని ప్రయత్నించి చూడండి. దానిలో పరిణతి సాధించినప్పుడు, మీరు తీసుకోవాల్సిన మరొక ఛాలెంజ్… ఏ విధమైన ప్రతిచర్య లేకుండా సాక్షిగా ఉండడం ఎలా? ఇష్టాయిష్టాలు లేకుండా విషయాలను చూడడం ఎలా? ఇష్టాలు, అయిష్టాలు వస్తాయి, కానీ మీరు వాటిని ఎలా సమతుల్యం చేస్తారు? ఒక నెల రోజుల పాటు ప్రయత్నించండి. రెండింటిలో మొదటిది, మీకు ఏదైనా కోరిక కలిగినప్పుడు దానిని ఏదో విధంగా వారం పాటు తగ్గించుకోవడం… వాయిదా వేయడం ద్వారా, మీ కండిషన్ ఎలా మారుతుందో చూడండి. రెండవది మీ ఇష్టాయిష్టాల పట్ల ఏ విధమైన ప్రతిస్పందన లేకుండా ఉండడం. మరొక ముఖ్యమైన సందేశం… వచ్చే 2024 పూజ్య బాబూజీ మహరాజ్ 125వ జన్మదిన సంవత్సరం. దానిని కేవలం ఏప్రిల్ 30 నే కాకుండా… 2024 లీప్ సంవత్సరాన్ని మన ఆధ్యాత్మిక ప్రగతిలో కూడా ఒక పెద్ద (లీప్) ముందడుగు వేసే సంవత్సరంగా… సంవత్సరం మొత్తం జరుపుకుందాం. మీరందరూ కూడా ఎంతో సంతోషానందాలతో జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
భౌతిక - ఆధ్యాత్మిక జీవితాలను పరిపూర్ణం చేసే దిశగా కృషి
ఆధ్యాత్మిక జీవితం మన వైపు నుండి కూడా కొంత ప్రయత్నాన్ని కలిగి ఉంటుంది… తరువాత అది మన జీవితంలో ఒక భాగమై సహజ సిద్ధంగా, స్వతహాగా అయిపోతుంది. మనం మనకు కావలసిన వాటితో, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన జీవన విధానం మొదలగు వాటితో తీరిక లేకుండా ఉంటాము. మనం కొంత స్థాయిలో సాధన చేస్తున్నట్లయితే, ఉదాహరణకు, మీరు ఒక మంచి టెర్రరిస్టుగా అవడానికి సాధన చేస్తున్నారు అనుకోండి. టెర్రరిస్టుగా మీ మనసులో ఏం జరుగుతూ ఉంటుంది… ఒకరిని ఎలా కొట్టాలి, ఒకరిని ఎలా చంపాలి లేదా ఒక్క దెబ్బతో ఎంతోమందిని ఎలా నాశనం చేయాలని… అది మరీ తీవ్రమైన ఉదాహరణ. కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఇతరులను చంపడానికి బదులు తననే త్యాగం చేస్తారు. ఈ దైవ సామ్రాజ్యానికి సేవ చేసే అవకాశం కోసం అన్వేషిస్తుంటారు. వారి జీవితం ఉన్నతమైన వారి నుండి మార్గదర్శనం పొందుతుంది మరియు సాధన పలు అవగాహనా క్షేత్రాలలో వ్యక్తపరచబడుతుంది. మనం సాధన చేస్తున్నప్పుడు, భగవంతుని గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా… ఎన్నో గొప్ప విషయాలు మన హృదయాలలో తెరుచుకుని, ఈ సందేశాలన్నింటికీ మనం ఒక వాహకంగా అవుతాం. ఏసు ప్రభువు మాత్రమే కాదు ఈ సందేశాలను స్వీకరిస్తున్నది… మనం కూడా అంతటా విస్తరించిన పవిత్రాత్మల నుండి ఇలాంటి సందేశాలను స్వీకరించగలం. మన ప్రయత్నాల ద్వారా, మన ఉద్దేశ్యాల ద్వారా మన హృదయాలు మరెంతో పవిత్రంగా మారుతాయి. మనల్ని స్వచ్ఛపరచుటకు మన హృదయం మనకు అందుబాటులో ఉంటుంది. ఈ శుద్ధత మన ఇతర జీవన కార్యక్రమాలలో విస్తరిస్తుంది. ఉదాహరణకు, నేను ఉదయం ధ్యానం చేస్తాను… ధ్యానం తర్వాత నాలో ఒక ప్రత్యేకమైన స్థితి, ప్రశాంతత, నెమ్మదితనం ఏర్పడతాయి. ఈ ప్రశాంతతా స్పెక్ట్రం మీలో ఉన్నట్లయితే,
మీరొక శాస్త్రీయ అధ్యయనం చేయాలనుకుంటే… ధ్యానం చేసేవారిలో, సాధువుల్లో, దివ్యత్వాన్ని కలిగియున్న వ్యక్తుల్లో, తీవ్రవాదుల్లో ఈ చైతన్యంతో కూడిన పెద్ద చైతన్య పరిదిని మీరు చూస్తారు. మీరు దేనిలో ఆసక్తి చూపుతున్నారు అనే దానిపై ఆధారపడి ఆ చైతన్య స్పెక్ట్రం (పరిది) మీలో కూడా భాగమవుతుంది. మీ కార్యకలాపాలలో మీరు కొన్నిసార్లు పైకి లేదా కిందికి పడిపోవచ్చు. కానీ మీ సగటు ఒకేలా ఉంటుంది. ఈ సగటు చైతన్య స్థితి ప్రతిరోజూ మరెంతో మెరుగ్గా మారుతూ ఉంటుంది. ధ్యానం చేస్తుండడం వలన చైతన్యం మరెంతగానో శుద్ధమవుతుంది. ఇలాంటి చైతన్య స్థితిలో పనిచేసినా, కుటుంబ సభ్యులతో పరస్పరం మాట్లాడినా కూడా జీవితం ఎంతో బాగుంటుంది. నేను ఒక ఫార్మసిస్ట్ ను. న్యూయార్క్ నగరంలో ముఖ్యంగా బ్రూక్లిన్ లో చాలా సంవత్సరాలు, 1984 నుండి 2005 వరకు ఫార్మసిస్ట్ గా పనిచేశాను. నా దినచర్యలో భాగంగా, నేను ఉదయం ధ్యానం చేసేవాడిని, తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసి పనిచేయడానికి ఫార్మసీకి వెళ్లేవాడిని. ఉదయం పని వేళలో మందుల దుకాణం తలుపు తెరిచే సమయానికే ప్రజలు అక్కడ వేచి ఉండేవారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా వెళ్ళినప్పుడు… స్టేటిన్ ద్వీపాల నుండి బ్రూక్లిన్ కు వెళ్లడానికి ఊహించని పరిస్థితుల్లో ఎప్పుడైనా సమయం దాటిపోయేది. ఎలాగైతేనేం ప్రజలక్కడ వేచి ఉండేవారు. ‘ఎందుకు’ అని నేను ఆశ్చర్య పోతుండేవాడిని. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క రోగితో సహనంతో వ్యవహరించే తీరు కారణం… వారిపై శ్రద్ధ తీసుకుని, వారితో సమయం గడిపి, వారి సమస్యలన్నీ వినడం, మందులు ఇవ్వడం మాత్రమే కాకుండా… మన గురించి, మన ఉద్దేశాలను ప్రశాంతమైన మనసుతో, ప్రశాంతమైన హృదయంతో పంచుకోవాలి. కొన్నిసార్లు చిన్న చిన్న వాద వివాదాలతో భరించలేని గొడవ జరిగిన సందర్భాలు ఉన్నాయి అనుకోండి. కానీ ఎక్కువసార్లు మనం వివరించాల్సి ఉంటుంది. కొందరు, ముఖ్యంగా వృద్ధులు అసలు అర్థం చేసుకోరు. ఇన్సూరెన్స్ పాలసీలు తరచూ మారుతూ ఉంటాయి. కొన్ని మందులు దాన్లో కవర్ అవుతాయి, కొన్ని కావు. ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం చెల్లించాల్సిన ధర అనూహ్యంగా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు కాల్ చేసి బ్రాండ్ మార్చమని కోరాల్సి ఉంటుంది. గ్రామీణ వృద్ధులు కొందరు చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు. నేనైతే ప్రశాంతంగా వాళ్ళతో కూర్చుని, వాళ్ళ చేతులు పట్టుకుని వివరించేవాడిని. కేవలం ధ్యాన స్థితిలో ఉన్న మనసు మాత్రమే ఈ పని చేయగలదని అనుకుంటాను. చాలాసార్లు వేర్వేరు మందుల షాపుల నుండి వచ్చిన రోగులు… కోపంతో మా దగ్గరికి వచ్చి ‘అక్కడ ఆ విధానముంది… ఇక్కడ ఇలా ఉంది’ అంటూ మమ్మల్ని అవమానిస్తుంటారు. ఎలా మాట్లాడాలో, ఎలా వివరించాలో వారికి తెలియదు. హఠాత్తుగా విషయాలు మారిపోతుంటాయి. ధ్యాన స్థితిలో ఉన్న మనసుతో పనిచేసేవారు ఎక్కువ న్యాయం చేయగలరని అనుకుంటాను. తలుపులు తెరవడం వంటి భౌతికమైన పనులు చేసేటప్పుడు సైతం పడకగది లేదా… స్నానాల గది లేదా ఒక సొరుగు తలుపులను మీరు ఎంతో జాగ్రత్తగా, మృదువుగా తెరుస్తారు. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో భాగమే అనుకుంటాను. నా దృష్టిలో ఆధ్యాత్మిక జీవితం అంటే అలలను సృష్టించడం కాదు, మీ హృదయంలో ఎంతో అలజడిని కలిగి ఉండడం కాదు. హృదయం సాధ్యమైనంత పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన హృదయం ఉన్నప్పుడు పవిత్రత అంతటా నెలకొని ఉంటుంది. ఇదే సాధనలోని అన్ని విషయాలకు మూలమని నేను అనుకుంటాను. సాధన లేకుండా, ధ్యానం లేకుండా మీరు ధ్యానస్థితిని కలిగి ఉండలేరు. ఆ ధ్యానస్థితి లేకుండా మీరేమి అందిస్తారు? అవే పాత విషయాలనే కదా!
నిత్య జీవితంలో హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన ప్రయోజనం
ఇప్పుడే నేను “అందుబాటు లోని అపార్థం” అనే విషయాన్ని గురించి చదివాను. అది ఒక మానసిక ధోరణి. ఇందులో ప్రజలు వారికి వెంటనే అందుబాటులో గల సమాచారం వలన అపార్థం చేసుకుంటారు. ఈ అందుబాటులో గల సమాచారం ఎప్పుడూ పక్షపాత వైఖరితో ఉంటుంది. ఈ తక్షణ సమాచారంలో ఎటువంటి ఆలోచన, అవగాహన ఉండవు. ఉదాహరణకు మీరు ఫలానా రెస్టారెంట్ బాగోలేదు అని చెప్పారనుకోండి! ఒకవేళ ఆరోజు ఆ వెయిటర్ కు ఉదయాన్నే తన ఇంట్లో వాతావరణం సరిగా లేదనుకోండి. మీరు వెంటనే ‘ఆ రెస్టారెంట్ బాగోలేదు’ అని నిర్ధారణకు వచ్చారు. దీన్నే తక్షణ ప్రభావం అంటారు. కానీ మీరు మరలా మరలా వెళ్ళినప్పుడు అది నిజం కాదని తెలుసుకుంటారు. కానీ నేను ఇతర విషయాలను అర్థం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలా! మునుపటి పక్షపాత వైఖరి లేకుండా హృదయాన్ని తెరచి ఉంచగలగాలి. ఉదాహరణకు నేను హెన్నాకు (ప్రశ్న అడిగిన సిస్టర్) అబద్ధం చెప్పాను. తత్ఫలితంగా ఆమె నన్ను విశ్వసించడం లేదు. నేను అప్పుడు హెన్నాను, ‘నన్ను క్షమించు, నన్ను మరలా విశ్వసించమని’ కోరుకుంటాను. అంటే నేను మన మునుపటి అనుభవాలను మరిచిపోయి నా మీద గల ఉద్దేశాన్ని మార్చుకోమని కోరుకుంటాను. నేను హెన్నాను నా మీద అటువంటి ఔదార్యాన్ని చూపించమని ప్రార్థిస్తాను. మిగతా ప్రపంచం విషయంలో కూడా నేను ఇతరుల తప్పులను క్షమించగల ఔదార్యాన్ని కలిగి ఉండాలి. ప్రోగు చేసుకున్న ముద్రలను తొలగించుకోగలగాలి. వారికి కొంత స్వాతంత్రం ఇవ్వాలి.దాని అర్థం ఆ విషయం మరచిపొమ్మని కాదు. ఇది మనకి ఒక మౌలిక విషయాన్ని నేర్పిస్తుంది. మనకు ఏదైనా విషయం/చర్య జరిగినప్పుడు అది మన మనసులో అభిజ్ఞా జ్ఞాపకంగా లేదా భావోద్వేగ జ్ఞాపకంగా ఉంటుంది. భావోద్వేగ జ్ఞాపకం వలన ముద్రలు, సంస్కారాలు ఏర్పడతాయి. నేను చాలా తేలికగా క్షమించగలను. నేను సాయంత్రం చేసే నిర్మలీకరణ వలన ఈ బరువును తొలగించుకోగలను. కానీ ఆ విషయాన్ని గుర్తుంచుకోవడం నాకు మంచిది. ఎందుకంటే అభిజ్ఞా స్థాయిలో జ్ఞాపకం ఉంచుకోవడం అనేది నా వ్యక్తిగత పరిరక్షణకు మంచిది. కాబట్టి నిర్మలీకరణ మన యొక్క రక్షణ కవచాన్ని తొలగించదు. మన భావోద్వేగ భారాన్ని మాత్రమే తొలగిస్తుంది. కాబట్టి ఆ విధంగా నిర్మలీకరణ చాలా ప్రాముఖ్యమైనది. మనం ధ్యానం చేసినప్పుడు ధ్యానమయ మనస్సు మనం అనవసరంగా ప్రోగు చేసుకునే మొత్తం భారాన్ని తొలగిస్తుంది. ధ్యానమయ మనస్సు మనం మరిన్ని సంస్కారాలను ఏర్పరచుకోకుండా సహాయం చేస్తుంది. ధ్యానం రెండు వైపులా పదును గల కత్తిలా పనిచేస్తుంది. ధ్యానం వలన ధ్యానస్థితి కలగడమే కాక, మనం ధ్యానమయ మనసుతో పనిచేస్తుంటే మనకు తక్కువ కోపం, సక్రమమైన అవగాహన కలుగుతాయి. దాని వలన ఎక్కువ భారం గల సంస్కారాలను ఏర్పరచుకోము. చుట్టూ జరిగే విషయాల వలన మనం ఎక్కువగా ప్రభావితమవము. మనం మన సమస్యలను అవి సంభవించక ముందే తొలగించగలుగుతాము. ఎందుకంటే ధ్యానమయ మనసు సమయానికి ముందే అంటే… మీరు ఆ విషయాన్ని ఆలోచించక ముందే మీరు ఆ పని చేయకముందే అర్థంచేసుకోగలదు. ఉదాహరణకు నేను ఉదయాన్నే ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో నాకు దివ్యత్వం గురించి, బాబూజీ గురించిన ఆలోచనలే కాకుండా… ఆ తరువాత రోజంతా చేయవలసిన పనుల గురించిన ఆలోచనలు కూడా వస్తుంటాయి. అవి నా మనసులో అలా కదిలినప్పుడు, నేను ఆ ఆలోచనలను గమనిస్తాను. అప్పుడు స్వయంచాలకంగా నేను శ్రద్ధ చూపకూడని విషయాలను నేను గమనించగలుగుతాను. నా హృదయం వాటిని నివారించమని చెప్తుంది. కాబట్టి ఆ ఆలోచనలను పట్టించుకోకపోవడం వలన అలాగే ఆ పని చేయకపోవడం వలన నాకు చాలా సమయం కలసి వస్తుంది. కాబట్టి మనం చాలా సమయం ఆదా చేసుకుంటాము. నిర్మలీకరణ ప్రక్రియ మనల్ని ఎన్నింటినుండో పెద్ద ఎత్తున విడుదల చేసి, మనకు ఎంతో ప్రశాంతతను, తేలికదనాన్ని అందిస్తుంది. మీరు భగవంతుణ్ణి నమ్మటం, నమ్మకపోవటం అనేది ముఖ్యం కాదు. కానీ మీరు ఈ సాయంత్రపు నిర్మలీకరణ పద్ధతిని చేసినప్పుడు లేక ఉదాహరణకు మీరు మీ నిగ్రహాన్ని కోల్పోయి… మీకు కోపం రాబోతున్నప్పుడు మిమ్మల్ని మీరు నిభాయించుకుని కేవలం రెండు నిమిషాలు నిర్మలీకరణ చేసుకుంటే… ఆ బయటకు పొంగి వచ్చే కోపం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. కోపం అనేది ఏ పరిస్థితిలోనయినా అది న్యాయపరమైన కారణమైనా, కాకపోయినా ఎల్లప్పుడూ చెడ్డదే. దాన్ని మీరు వాయిదా వేయగలిగినంత వేసి దాని ప్రభావాన్ని చూడండి. నేను మీకు దీన్ని వివరిస్తాను. మీలో ఎంతమంది రసాయన శాస్త్రాన్ని అర్థం చేసుకోగలరో నాకు తెలియదు కానీ రసాయన శాస్త్రంలో బంధాలు అనేవి ఉంటాయి. మనకు అనుబంధాలు ఉన్నట్లే అక్కడ రసాయన బంధాలు ఉంటాయి. రసాయన బంధాలు ఏర్పడటానికి ఎలాగైతే శక్తిని ఉపయోగించటం అవసరమో… అలాగే ఎలాంటి బంధాన్నైనా ఏర్పరచుకోవాలంటే శక్తిని తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. సంబంధాలను ఏర్పరచుకుని మనం ఎన్నో భావోద్వేగాలను పెట్టుబడిగా పెడతాం. అది బలమైనదైనా లేక బలహీనమైనదైనా, ఒక బంధాన్నయితే ఏర్పరుస్తుంది. మనం ఈ బంధాలను తెంచుకున్నప్పుడు, ఉదాహరణకు నేను భౌతిక శరీర చైతన్యంతో బంధమేర్పరుచుకొని నన్ను నేను దానితో గుర్తించుకున్నప్పుడు లేదా… నా మానసిక చైతన్యంతో లేక నా అహంతో, నా సంఘంతో గుర్తించుకున్నప్పుడు… ఈ బంధాలను కరిగించివేసినప్పుడు, నిర్మలీకరించినప్పుడు, తెంచుకున్నప్పుడు నా లోపలి నుండి ఎంతో శక్తి విడుదల అవుతుంది. శారీరక వ్యవస్థ నుండి విడుదలైన ఈ శక్తి ఇప్పుడు మరింత సృజనాత్మకమైన పనికి అందుబాటులో ఉంటుంది. అందుకే మరీ ఎక్కువగా బంధాలను ఏర్పరచుకోకండి… సంబంధాలను కలిగి ఉండండి అంటుంటారు. ఎంత అవసరమో అంతవరకే బంధాన్ని కలిగి ఉండండి. ప్రేమ బంధం అనేది ఎల్లప్పుడూ ఆహ్వానించదగినది. ఇది ఎల్లప్పుడూ మనకు స్వేచ్ఛను కలిగిస్తుంటుంది. ప్రేమ బంధం, నిస్సారమైన బంధాల కంటే ఎక్కువగా మనకు స్వేచ్ఛనిస్తుంది. నిస్సహాయతతో కూడిన బంధాలను వదిలివేయాలి. ఒక్కసారి ఈ విధమైన వాటిని వదిలి వేయగలిగితే మీలో ఎంతో సృజనాత్మక శక్తి పొంగుతూ ఉంటుంది. నేనిది ఎందుకు చెప్తున్నానంటే, శక్తి అనేది ఎన్నటికీ నాశనం చేయబడదు. శాస్త్ర విజ్ఞానం దీన్ని మరలా మరలా చెప్తూనే ఉంది. గొప్పవాడైన ఐన్ స్టీన్ కూడా ‘శక్తి ఎన్నటికీ ధ్వంసం చేయబడదు, మనం శక్తి రూపాన్ని మార్చగలమంతే’ అని చెప్పారు. కోపం కూడా ఒక శక్తి. నేనీ కోపాన్ని ఒక కటకం లేక నా చైతన్యం ద్వారా… నా హృదయం ద్వారా పయనింప చేయటం వలన నేను మరింత అవగాహనతో దాన్ని మార్చగలను, పరివర్తన చెందించగలను. దాన్ని మరింత కరుణ గల హృదయంగా మార్చుకోగలను. మీరు దాaనికి కొంత సమయాన్ని ఇచ్చి మీ కోపానికి కారణం ఏమిటని ఆలోచిస్తే… అప్పుడు మీరు, ‘నేను దాన్ని వాయిదా వేయటం సంతోషంగా ఉంది, నాకిప్పుడు అర్థమైంది, నేను దాన్ని బయటకు పొంగనీయలేదు’ అనుకుంటారు. కాబట్టి హార్ట్ఫుల్నెస్ సాధనాంశాలలో ధ్యానం కంటే ఎక్కువగా నిర్మలీకరణ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఒక అద్భుతమైన పరికరం.