06-08-2023 Daaji Talk at Kanha
అంతర్ముకత్వం మరియు భహిర్ముకత్వం గురించి దాజీ ఇచ్చిన సందేశం
సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక అన్వేషకులలో ప్రత్యేకించి రెండు తరగతులు ఉన్నాయి అంతర్ముఖులు, బహిర్ముఖులు బహిర్ముఖంగా ఉండే అభ్యాసులను – నేను దీన్ని వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తాను. మీరు బహిర్ముఖంగా (బాహ్యంగా, బయటకు) ఉండే వ్యక్తి అయితే మీరు అసలు అభ్యాసిగా ఉండలేరు ప్రత్యాహారానికి వ్యతిరేకంగా మీ శ్రద్ధ గనుక ఎప్పటికీ బయటకే ఉంటే, అనిఅర్థం. మీరు కనక ప్రత్యాహార స్థితిలో ఉంటే, మీ శ్రద్ధ, దృష్టి అంతా అంతర్ముఖంగా, అంతరంగంలోనికి ఉంటుంది. అంటే మీ కేంద్రం వైపుకు, మీ హృదయం వైపుకు, మీ హృదయంలో ఉన్న ఆ పరమాత్మ వైపుకు ఉంటుంది. తరచుగా మనం ఈ శ్రద్ధ నుండి ప్రక్కకుమళ్ళుతాం. బాహ్యంగా, తీవ్రంగా బయటకు మళ్ళుతాం. మీరు బయటకు మళ్ళినప్పటికీ, ఆధ్యాత్మిక స్థితులను సంపాదించడం నుండి మిమ్మల్ని ఏదీ ఆపలేదు. అయితే మీరు కేంద్రీకృతమై ఉండాలి సుమా! కొంతమంది ఆహారంపై పూర్తి శ్రద్ధతో, ధ్యాసతో కుక్కలా తింటుంటారు. మీ సహజ స్వభావంతో అలా ఎప్పుడూ తినే పక్షంలో ఎటువంటి తప్పు లేదు. అయితే మీరు ఒక చిన్న భావనతో, ఆ పరమాత్మ స్మరణలో ఆహారం తీసుకుంటున్న భావనతో, ప్రేమతో, కృతజ్ఞతతో కనుక తినగలిగితే అది మిమ్మల్ని ఆహారాన్ని ఆస్వాదించడం నుండి గానీ జీవితంలో మరే విషయం నుండి గానీ ఆపదు. అలాగే సంగీతాన్ని వినడం. ఇక్కడ కూడా మీరు భగవంతుని స్మరణలో కరిగిపోతున్నాననే విషయాన్ని సంగీతానికి కలిపితే అది ఒక భక్తి సంగీతంలా, ఒక భజన్ గా మార్పు చెందుతుంది. భగవంతుని స్మరణవల్ల ఆహారం ప్రసాదమవుతుంది. మీ శృంగారానికి, మీ ప్రియతములను జ్ఞాపకం చేసుకునేందుకు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రతిదీ ఒక అసాధారణ అంతర్ముఖ చర్యగా రూపొందుతుంది రెండు రకాల అభ్యాసులు ఉన్నారని నేను అన్నప్పుడు, వీరి స్వభావాలను ముఖ్యంగా అంతర్గతంగా కేంద్రీకృతం అయ్యేవారిని గమనిస్తే, వారి పురోగతి అద్భుతంగాగొప్పగా దూసుకుపోతుంది. వారిని కలిసిన ప్రతిసారీ మీరు వారి స్థితిని ఎంతో ఆస్వాదిస్తారు. “మాస్టర్ దేనివల్ల సంతోషిస్తారు?” అని ప్రజలు తరచుగా అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆరాటపడతాను. ఇది అందులో ఒకటి. భౌతికంగా మాస్టర్‌కు దగ్గరగా మసలాలని కోరుకోవడం కూడా నా దృష్టిలో బహిర్ముఖత్వమే. ఈ ‘దర్శనం’ అనే దురభిప్రాయాన్ని గురించి మేము ఎన్నోసార్లు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇది ఇప్పుటికే మన హృదయాలకు చేరాల్సింది! “అయ్యో! మిమ్మల్ని చూడకుండా మేమెలా బతకాలి?”అని ప్రజలు అంటారు. ఇదంతా నిరర్థకం! నిష్ప్రయోజనం! అంతరంగంలో బలంగా అనుసంధానం కానంతవరకు, మీరు ఆయన్ని ఎన్నిసార్లు చూసినా ఉపయోగం లేదు. ఎందుకంటే చాలాఏళ్లుగా నేను గమనిస్తూనే ఉన్నాను. బాబూజీ, చారీజీల జీవిత పర్యంతము, అలాగే ఇప్పుడు కూడా ఎవరైతే భుజం భుజం రాసుకుంటూ దగ్గరగా ఉంటారో వారిలో పెద్దగా పురోగతి కనపడదు. ఎవరైతే “నేను ఫలానా, ఫలానా! మీతో కలిసి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చెయ్యాలి. . మీతో కలిసి ఉంటాను” అంటుంటారో వారి కోసం మీరు ప్రార్థించాల్సిందే! ! అది బహిర్ముఖత్వంలో అసాధారణ వైపరీత్యం! మీ మాస్టర్ తో కలిసి ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా బహిర్ముఖులుగానే ఉండవచ్చు. మీరు ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ మీరు తీవ్రమైన అంతర్ముఖులుగా ఉండిఆయనతో గాఢంగా అనుసంధానమై ఉండవచ్చు. ఇదంతా హృదయ సంబంధమైనదేతప్పమరేమీ కాదు!
13-08-2023, Daaji Talk at Kanha
సమస్యలు - సంకల్పశక్తి
నమస్తే! ప్రణామాలు! గత కొన్ని వారాలుగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు… మన స్టేజి బిల్డింగ్ వద్ద కూర్చుని కొంతమంది అభ్యాసులను కలిసి వారితో పరస్పరం సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిరోజూ విభిన్న కోణాల్లో అవే ప్రశ్నలు, అవే సమస్యలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నీ మానసిక స్థాయి నుండి, కుటుంబ సమస్యల నుండి, సామాజిక సమస్యల నుండి, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుండి పుట్టినవే. మన మాస్టర్లు వీటికి విస్తారంగా, చాలా స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. మనలో చాలామందిలో ఉన్న సమస్య, పుస్తకాలు చదవకపోవడమే! ఉపన్యాసాలు, పుస్తకాలు, సందేశాలు మరియు పత్రికల్లోని వ్యాసాల ద్వారా నూతన వ్యక్తీకరణలు, క్రొత్త అవగాహనలు అన్నీ వ్రాయబడి ఉన్నాయి. లక్షల కొద్దీ ప్రజలు అభ్యాసం చేస్తున్నారు. కానీ మ్యాగజైన్స్ అందించడంలో మనం కొన్ని వేలమందికి కూడా చేరటంలేదు. ప్రాపంచిక సమస్యలను, వాటిని పరిష్కరించడం మాత్రమే కాకుండా, అత్యున్నత స్థాయి అవగాహనను కూడా పెంచుకోవడం… దివ్యత్వం గురించి సంగ్రహావలోకనం పొందడం గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని… మీకు నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే, వాటిని అవగాహన చేసుకోవడానికి ఇవన్నీ చాలా ముఖ్యం. మీకు నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే, వాటిని అవగాహన చేసుకోవడానికి ఇవన్నీ చాలా ముఖ్యం. ఉదాహరణకు “నాయనా! ఇది చేయవద్దు”, అని మీ నాన్నగారు మీకు చెప్పారనుకోండి. నా మనవలు మరియు నా కుమారులు నాకు చాలా పెద్ద పాఠాలనే నేర్పించారు. వాళ్లతో “ఇది చేయవద్దు”, అని చెప్తే దాన్ని కచ్చితంగా చేసి తీరుతారు. ఎందుకు? మొదటిది అహంకారం. రెండు, మూడేళ్ల వయసులోనే వాళ్ళు ఎదురు తిరుగుతారు. చిన్న పిల్లలు ఎదురు తిరుగుతారు. ఎందుకంటే వాళ్లలో ఇప్పుడు అహం కొత్తగా వృద్ధి చెందుతోంది. ‘సరే’ అని చెప్తే అంగీకారం తెలిపినట్లు అర్థం. అవతలి వాళ్లను అంగీకరించామంటే దాన్ని మనం, వారు మనపై అధికారాన్ని చూపినట్టుగా తీసుకుంటాం. అందువల్ల వారు ఎదురు తిరుగుతారు, వయోజనులు కూడా. కొంతమంది పిల్లలు, “నాన్నా, నాకు ఇది చేయాలని లేదు,” అని గౌరవంగా చెప్పవచ్చు… మరో రకం పిల్లలు, “నేను ఎప్పటికీ చేయను” అని చెప్తారు. కానీ వారి మనసు లోతుల్లో నిజాయితీగా ఉండి, తండ్రి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తరువాత వాళ్లు అంగీకరించని విషయాన్నీ క్రమంగా అంగీకరించడం ఆరంభిస్తారు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత విరామం అవసరమే. అభ్యాసీలుగా మనం మన మాస్టర్లను అడిగే ప్రతి ప్రశ్నకు, ముద్రించబడిన సమాధానాలు ఉన్నాయి. ముద్రించబడిన సమాధానాలు ఉన్నాయి. మనలో చాలామంది ఇప్పటికీ వ్యక్తిగతంగా వివరణలు కోరుకుంటారు. సమాధానాలపై ధ్యానించవంతవరకు, వాటిపై ప్రతిబింబించనంతవరకు, దానిపై ఆలోచించనంతవరకు అది భిన్నంగా ఎలా అవుతుంది? కానీ మీరు దానిపై ధ్యానించడానికి, దాని గురించి ఆలోచించడానికి కూడా అవగాహన చేసుకోవాలనుకుంటారు… మీకు కొంత ఎరుక ఉన్నట్లయితే మీ సమస్యను స్పష్టంగా గుర్తించగలగాలి. రెండవది, మీరు సమాధానాలు పొందనప్పుడు పుస్తకాలు తప్పకుండా చదవాలి… మళ్లీ మళ్లీ ధ్యానించాలి, మీ ప్రిసెప్టర్లను సంప్రదించాలి, తోటి సోదరీ సోదరులతో చర్చించాలి. “ఓహ్, నా కూతురు తన భర్తతో బాధపడుతున్నది, ఆమె భర్త ఆమెను రోజూ కొడుతున్నాడు” అని చెప్పినప్పుడు కూడా. నిన్న నేను ఒక సోదరి నుండి సుదీర్ఘమైన లేఖను హిందీలో అందుకున్నాను. ఆమె మరొక సోదరి కోసం ఆ లేఖని పంపించారు. నేను ఆ సోదరి అభ్యాసి యొక్క ఫోటోను చూసి, ఆమె సహజమార్గంలో చాలా అంకితమైన అభ్యాసిగా గుర్తించాను… కానీ ఆమె భర్త వారానికి ఒకటి, రెండుసార్లు ఆమెను కొట్టడం రివాజుగా పెట్టుకున్నాడు. ఆమె అడిగిన ఇటువంటి ప్రశ్నలను, కనీసం వారానికి ఒకసారి అయినా నేను ఇతరుల నుండి కూడా అందుకుంటూ ఉంటాను. ఈ హింసాత్మకమైన సమస్యలన్నింటికీ… అది కుటుంబ సభ్యుల కారణంగా,వ్యాపార భాగస్వాముల కారణంగా లేదా ఇరుగుపొరుగు వారి కారణంగా ఉండవచ్చు… దయచేసి నా ముందుకు తీసుకురాకండి. దానికొక సామాజిక క్రమం (చట్టం) ఉంది. చట్టపరంగా సమస్యను పరిష్కరించే టీములు ఉంటాయి. అవి మన దగ్గర లేవు. మీరు పోలీసులకి ఫిర్యాదు చేయవచ్చు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు మీరు నిజాలను, సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఫలానా వారు నన్ను తిడుతున్నారు అంటే కుదరదు, మీకు ఒక సాక్ష్యం ఉండాలి. మీరు అలాంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారా లేదా ఆర్థికపరమైన సహాయం లభించదని భయపడుతున్నారా? మీకు నిజంగా ఏం కావాలి? స్వేచ్ఛ కావాలా లేదా బానిసత్వాన్ని కోరుకుంటున్నారా? ఎవరైనా మిమ్మల్ని తిడితే మరింత ఎక్కువ శక్తితో ఎదురుదాడి చేసేలా తయారవ్వాలి, అని బాబూజీ మహరాజ్ చెప్తుండేవారు. దాన్ని మరింత శక్తితో ఎదుర్కోవాలన్నారు. దీని గురించే మహాభారతంలో చెప్పబడింది. మహాభారతం నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవాలనుకుంటే… ‘ముగింపే మార్గాన్ని సమర్థిస్తుంది’ అని. కుంతీదేవి జీవితం కూడా దీనిని ప్రతిబింబిస్తుంది. ఆరోజుల్లో సామాజిక నియతి ఎలా ఉండేదంటే, వివాహానికి పూర్వం బిడ్డను కలిగి ఉండడం… ఆమె జీవితంపై ఒక నల్లని మచ్చ అవుతుంది. కానీ కుంతి దీనికి అంగీకరించినట్లయితే, అప్పుడు కర్ణుడు పాండవులతో పాటు గర్వంగా తిరుగుతుండేవాడు. అప్పుడు యుద్ధమే ఉండేది కాదు. ఇది కుంతి చేసిన తప్పిదమా? ఇది సమాజం దోషం. అప్పుడు మరియు ఇప్పుడు, ఈనాటి సమాజం వివాహానికి ముందే జన్మనివ్వడాన్ని ఆమోదించదు. ఈ విషయాలన్నింటినీ నేను సమర్థించడం లేదు. కానీ అది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. మంత్రాల ద్వారానే గర్భధారణ జరిగింది. ఆమె ప్రకృతి శక్తులను ఆవాహన చేసి గర్భధారణ చేయగలిగేదనే మాట వాస్తవం. ఈనాడు మనలో అత్యుత్తమమైన వారిలో సైతం ఈ సంకల్పశక్తి దురదృష్టవశాత్తు కొరవడింది. మనం దేన్నీ ఆవాహన చేయలేం. ప్రకృతి శక్తుల సంగతి తరువాత, మన స్వంత హృదయాల్ని కూడా ఆవాహన చేసుకోలేము.
పరిణితి
నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఒకరోజు ఒక అభ్యాసీని ఈ ప్రశ్న అడిగాను. “నీవు ఒక మామిడి పండును గానీ, ఆపిల్ పండును గానీ, కమలాపండు లేదా సపోటా ఏ పండునైనా చెట్టు నుండి కోసావా”? వర్సెస్ (అలాగే) ఒక పండు స్వయంగా చెట్టు నుండి రాలడం? చెట్టు నుండి స్వతహాగా క్రింద పడుతున్న ఆపిల్ లేదా నారింజ పండు కోయడానికి సిద్ధంగా ఉన్నదని అర్థం. ఆ సంసిద్ధత ఆ పండుకు ఉన్నట్లయితే అది చాలా రుచికరంగా, చాలా తీయగా ఉంటుంది. ఆ సమయానికంటే ముందు నీవు కోసినట్లయితే అది చేదుగా ఉంటుంది. చాలాసార్లు మనం సలహాలు ఇస్తుంటాం. సలహాలు ఇవ్వవద్దని లాలాజీ చెప్పారు. ఎందుకంటే అవతలి వ్యక్తి సిద్ధంగా లేనప్పుడు… పరిణితి చెందిన హృదయంతో లేనప్పుడు, వాళ్లు మన సలహాను తీసుకోరు. వెనక్కి తిప్పి కొడతారు. అది ప్రతి చర్యను చూపుతుంది, తిరుగుబాటు చేస్తుంది. కొన్ని కేంద్రాలలో తరచుగా మన వాళ్ళు విరాళాల కోసం ప్రకటనలు చేస్తుంటారు. కాన్హాకు విరాళాల అవసరం ఉంది అంటారు. కొందరు ఉత్సాహపరులైన ప్రిసెప్టర్లు, సంపన్నులైన భావి అభ్యాసులను కలిసి… ‘మా మిషన్ కు డబ్బు అవసరం ఉంది సార్’ అని అడుగుతారు. వారికి డబ్బు ఉండవచ్చు కానీ వారి హృదయాలు సిద్ధంగా లేనప్పుడు అడగకండి. ఆ వ్యక్తి హృదయం సిద్ధంగా ఉందా, పరిణితి చెందిందా అని మీకు తెలియదు కాబట్టి ఎప్పుడూ అడగకండి. వారి ఆత్మసాక్షి మెరుగైనప్పుడు, శృతిలో ఉన్నప్పుడు దేన్నయినా అడిగే అవసరమే లేదు. అది సహజసిద్ధంగా ప్రతిస్పందిస్తుంది. విషయాలు సహజంగా జరిగినప్పుడు ఆ విరాళంలో ఆనందం, మాధుర్యం నిండి ఉంటాయి. అలా కానట్లయితే అది మన మాస్టర్లకు చేదు ఫలాలను సమర్పించినట్లు అవుతుంది. మనం ఆ ప్రభువు పాదాల చెంత చేదు ఫలాలను ఉంచి ‘ఇది నా నైవేద్యం’ అని ఎలా సమర్పించగలం? లేదు! అది హృదయం నుండి మాత్రమే రావాలి. చాలా తరచుగా మనం ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాం… ఎవరైనా ‘దయచేసి నాకు సలహా ఇవ్వండి’ అన్నప్పుడు కూడా ఏం జరుగుతుంది? మన హృదయం ఆ సలహా తప్పా, ఒప్పా అని విశ్లేషించటం మొదలు పెడుతుంది. మాస్టర్లు కానీ ప్రిసెప్టర్లు కానీ మీకు ఏమైనా సలహాలను సూచనలను ఇస్తే అది అప్పటికే మీకు బోధింపబడి ఉంది. మీరు మీ హృదయాన్ని ఎందుకు సంప్రదించకూడదు? రాత్రి ప్రార్థనలో మన గొప్ప మాస్టర్ ను పరిష్కారం కొరకు ప్రార్థించవచ్చు. నేను కూడా నా జీవితంలో గమనించింది ఏమిటంటే, మనం ఆ సలహాను పాటించే ధైర్యం లేకపోవడం వలన దాన్ని అంగీకరించం. ధైర్యం అనేది స్పష్టత వలన వస్తుంది. స్పష్టత అనేది సరైన అవగాహన వలన వస్తుంది. మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగినప్పుడు, అంగీకారమనేది తక్షణమే వస్తుంది. ఆ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పినా, సరైన అవగాహన లేకుండా మీరు దాన్ని అంగీకరించలేరు. దుర్యోధనునికి, అర్జునునికి గల భేదాన్ని చూడండి. అవగాహనా స్థాయిలోనే ఆ తేడా అంతా ఉంది. సరైన సమయంలో అతను అర్థం చేసుకొని ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. అది ఒక పెద్ద సంఘటన. ఆ పెద్ద సంఘటన యొక్క స్వభావం మన దైనందిన జీవితంలో ఏర్పడే చాలా పరిస్థితుల స్వభావం కూడా ఒకలాంటివే. ఏమీ తేడా లేదు
లోభం, అహంకారం, వైఖరి
మూడు విషయాలు… లోభం ప్రలోభంగా ప్రతిబింబిస్తుంది, బాబూజీ దీన్ని దురాశ అనేవారు. ఇది మొదటిది. రెండవది అహంకారం. దురాశ అనేది అంతులేని కోరికల యొక్క ఫలితం. ఈ రెండింటికి పరిష్కారం మన ప్రార్ధనలో ఇవ్వబడింది. మనం ‘ఓ మాస్టర్!’ అన్నప్పుడు మన హృదయం నిరంతరం ‘నేను నా మాస్టర్ యొక్క శిష్యుడిని’ అనే భావనలో మునిగి ప్రతిధ్వనించాలి. మన హృదయంలో ఆ వినమ్రత అనేది ఉద్భవించాలి, సున్నితత్వం అనేది వ్యక్తమవ్వాలి, గౌరవభావం అనేది కలగాలి. ఓ మాస్టర్! అన్నప్పుడు ఆ భావన మన హృదయంలో పొంగిపొరలాలి. మీలో ఈ భావన ఉన్నట్లయితే మీరు మిగిలిన ప్రార్థనను పూర్తిచేయలేరు. మీరు అప్పుడే, అక్కడే కరిగిపోతారు. ‘నా జీవిత లక్ష్యం మీరే’ అని చెప్పనవసరం లేదు. కాబట్టి సరియైన విధంగా ప్రారంభించండి. గౌరవంతో కూడిన ప్రార్ధనాపూర్వక వైఖరిని అనుభూతి చెందండి. మీలో గనుక ఈ ప్రార్ధనాపూర్వక వైఖరి ఉన్నట్లయితే మీరిక ఎలాంటి ప్రార్థనలు చేయనవసరం లేదు.
Daaji Speech On, 25-08-2023
హృదయాధారిత ధ్యానం
దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి… మనం ఈ పద్ధతిలో ‘హృదయంలో దివ్యత్వం ఉన్నద’నే భావంతో ధ్యానం మొదలు పెడతాము. ఒక సమర్ధుడైన యోగి నుండి మనం పొందే ప్రాణాహుతి, ఆయన హృదయం నుండి మన హృదయానికి చేరుతుంది. దీని ఫలితంగా ఈ ప్రాణాహుతి మన హృదయం ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలో చేరి మన శరీరంలోని ప్రతి చిన్న కణానికి చేరుతుంది. మనకు ఆధ్యాత్మిక పోషణనిస్తుంది. మన జీవితంలోని ప్రతి నిర్ణయం కూడా హృదయం చేత ప్రేరేపింప బడుతుంది. మీరు హృదయాధారిత ధ్యానం చేసినప్పుడు మీ హృదయంలో ఎంతో సున్నితత్వాన్ని పెంపొందించుకుంటారు. మనసు కంటే హృదయాన్ని తరచుగా వినియోగించటం అనేది ఒక అలవాటుగా మారుతుంది. మన జీవన విధానం మారుతుంది.అది మెదడుతో కేంద్రీకృతం కాక, హృదయంతో కేంద్రీకృతం అవుతుంది. మైండ్ ఫుల్ నెస్ లో వలే మన ఎరుక పట్ల మనం ఎక్కువ దృష్టి పెడితే, అది ఒక శుభారంభమే … కానీ ఒక్కోసారి ఎరుక కూడా మనకు తలనొప్పిని కలిగించవచ్చు. ఒక వారం రోజుల పాటు మౌనాన్ని పాటిస్తే, మీ మనసు యొక్క కార్యకలాపాల పట్ల ఎరుక కలిగి ఉంటే… మీరు కేంద్రీకరింపబడి ఉంటారు కానీ మీ అంతరంగం లోకి లోతుగా వెళ్లలేరు. మైండ్ ఫుల్ నెస్ ద్వారా ఏకాగ్రత పెంపొందుతుంది. ఇందులో సందేహమేమీ లేదు. కానీ మీరు ఏదో కోల్పోతున్నామని భావిస్తారు. నేను దేనినైనా హృదయంతో అనుభూతి చెందాలనుకుంటాను. హృదయంపై ధ్యానం చేయటానికి మరొక కారణం, మా గురుదేవులు ఇలా అనేవారు. శ్రీకృష్ణ భగవానుడు, “నేను ప్రతి ఒక్క మానవ హృదయంలో, ప్రాణి కోటి హృదయంలో ఉన్నాను… హృదయమే పశ్యసి – నన్ను మీ హృదయంలో అనుభూతి చెందండి” అని అన్నారని చెప్పారు. నేను దేనినైనా నా కాలేయంలో గాని, ముక్కులో గాని అనుభూతి చెందలేను. నేను నా మెదడుతో అనుభూతి చెందలేను. నా మెదడుతో ఆలోచించగలను కానీ హృదయం తోనే గ్రహించగలను, అనుభూతి చెందగలను. ఇంకా చాలా శాస్త్రీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఏమైనా ఇప్పటికి దీనిని వదిలేద్దాం. మీకు ఇష్టమైతే ‘ది హార్ట్ ఫుల్ నెస్ వే’ అనే పుస్తకాన్ని చదవవచ్చు. అది మీకు ఈ పేరు ఎందుకు, ఎలా వచ్చిందో వివరిస్తుంది.
అంతర్యామిని అనుభూతి చెందండి
ఏదైనా అలవాటుగా మారితే కష్టం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దేవాలయం, మసీదు, గురుద్వారా ఇవన్నీ ప్రారంభం మాత్రమే. ప్రారంభాన్ని అంతంగా భావించకూడదు. మన శాస్త్రాలన్నింటిలో ఇదే చెప్పబడింది. ఆకారం నుండి, ఆలోచన నుండి నిరాకారం వైపు సాగాలి. నిరాకారమైన దాన్ని దేవాలయాల్లో ఎలా ఉంచగలరు? ఆలోచనను, ఆలోచనారహిత స్థితికి అనగా మనసుకు అతీతంగా తీసుకొని వెళ్ళాలి. అంటే ఆలోచనలను అధిగమించి, అనుభూతులను అధిగమించి వెళ్ళాలి. దానిని మీరు ఎక్కడ ఉంచగలరు? స్వామి వివేకానంద దీని గురించి ఎటువంటి ఉదాహరణ ఇచ్చేవారంటే, వారు కూడా వేదాలు గురించి చాలా చెప్పారు. చిన్న పిల్లవాడు అక్షరాలు నేర్చుకునేటప్పుడు అచ్చు పలక ఇస్తాం. దానిపై అక్షరాలు, అంకెలు రాయడం నేర్చుకుంటాడు… ఏ, బి అని. కాలేజీకి కూడా అటువంటి ఆ అచ్చునే తీసుకుని వెళ్తారా? మీరు వెళ్లే ప్రతి చోటుకు విగ్రహాన్ని తీసుకొని వెళ్లగలరా? మీ వద్ద ఎన్ని విగ్రహాలు ఉన్నా, వాటి అనుభూతి ఎప్పుడూ బయట నుంచి కలుగదు, లోపల నుండే వస్తుంది. మీకు తెలుసు, సిక్కు మతంలో గురునానక్, వారి తర్వాత వచ్చిన గురువులు వారందరూ ధ్యానం చేసేవారు. గురునానక్ అయినా సరే, ఆఖరి గురువు గురు గోవింద్ సింగ్ అయినా సరే, మధ్యలోని అగడ్జీతో సహా అందరూ ధ్యానం చేసేవారు. జైన మతంలో చూసినట్లయితే, మహావీరుని చిత్రాలు ధ్యానముద్రలో ఉంటాయి.. బుద్ధ భగవానుని చూస్తే, ధ్యానముద్రలో ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధానికి ముందు ధ్యానం చేశాడు. కైలాసంలో శివుని గురించి ఆలోచన వచ్చినప్పుడు ఆయన చిత్రం ధ్యానముద్రలో ఉన్నట్టుగానే మన దృష్టికి వస్తుంది. వారికి ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది? వారు ఎప్పుడూ దేవాలయాలకు వెళ్లి ‘భగవంతుడా నువ్వు మేలుకో’ అని అనలేదు. ఇప్పుడు అందరూ దేవాలయాలకు వెళ్లి, గంట కొట్టి భగవంతుడిని మేల్కొలుపుతున్నారు. ముందు మీరు మేల్కోండి. దేవాలయాలు అనేవి ఒక చిహ్నం. ఈ దృశ్యరూపకమైన చిహ్నాలను దాటి మనం ముందుకు వెళ్లాలి. అవి మనకి ఈ దిశలో వెళ్ళండి అని సూచన చేస్తాయి. గంట కొట్టడం ఒక చిహ్నం. మేలుకొనమని. అగరవత్తులు వెలిగించడం ఒక చిహ్నం. దానిలా పరిమళాన్ని ప్రపంచమంతా వెదజల్లమని. దీపం వెలిగించడం అంటే అర్థం దీపంలా వెలుగుతూ ప్రపంచానికి ప్రేమ వెలుగును పంచమని. ఇవన్నీ గుర్తులు. కానీ మనం, ఎందుకు చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? అనేది అర్థం చేసుకోకుండా అవే చేస్తూ ఉంటాం. అది క్రమంగా ఒక ఆచారంగా అలా పుట్టుక నుండి మరణం వరకు ఉండిపోతుంది. ఎప్పుడైనా దీనిని చేయకపోతే ప్రజలు భయపడిపోతారు. నేను కూడా భయపడేవాడిని. నా తల్లిదండ్రులు కూడా భయపడేవారు. ఈ రోజు పూజ చేయలేదు, హారతి ఇవ్వలేదు అని. నా స్నేహితులు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ ఉండేవారు. కారులో వెళ్ళేటప్పుడు దారిలో గుర్తుకు వచ్చేది ‘అరే! ఈరోజు నేను దండం పెట్టుకోవడం మర్చిపోయాను’ అని. మళ్లీ యూ టర్న్ తీసుకుని… ఇంటికి వెళ్లి, దేవుడికి దండం పెట్టుకుని, ఫోటో మీద కొన్ని పూలు విసిరి, అప్పుడు వెళ్ళేవారు. దండం పెట్టుకోకపోతే ఆరోజు చెడు జరుగుతుందేమో అని ప్రజలు భయపడతారు. పూజ ఎందుకు చేస్తాం? భయం వల్ల. భయంతో భగవంతుడిని ఎవరూ పొందలేరు. ప్రేమతోనే అది సాధ్యమవుతుంది. మీ ఆఫీసులో అందరూ మీ కాళ్లకు నమస్కారం చేస్తే మీకు ఎలా ఉంటుంది? మీరు ఇష్టపడరు. మరి భగవంతుడు అందరూ తన పాదాలకు నమస్కరించడాన్ని ఎందుకు ఇష్టపడతాడు? ఆయనకి కాళ్ళే లేవు. మీరు తప్పు దిశలో బాహ్యంగా వెళ్తున్నారు. అంతరంగంలో నమస్కరించండి. ఎవరైతే అంతరంగంలో ఉన్నారో వారికి. ఆయన లేకుండా మీరు కనీసం శ్వాస కూడా తీసుకోలేరు. మన అంతరంగంలో వారు లేకపోతే, మనకు జీవితమే లేదు. చిన్న పిల్లవాడు పుట్టిన వెంటనే ఏడుస్తాడు. పుట్టగానే పిల్లవాడు ఏడవకపోతే, తల్లి ఏడుస్తుంది. ఎందుకంటే జీవాన్ని ఇచ్చేది ఆ పిల్లవాడితో రాలేదు. ఏదైతే మీకు జీవాన్ని ఇస్తోందో, ఇప్పటివరకు మీరు కూర్చునేలా చేసిందో, అది ఎవరివల్ల? మీ ఆత్మ మీ ప్రాణదాత. అది మీ బయట లేదు కదా. ద్వారకలో, మక్కాలో, అమృత్ సర్, కైలాసంలో కూడా లేదు. మీకు జీవాన్ని ఇచ్చే ఆత్మ మీ లోపల ఉంది. లోపల ఉన్నదాన్ని మీరు ఎందుకు బయట వెతుకుతున్నారు? బయట వెతికితే అది తప్పు. మీ లోపల ఏదైతే ఉందో దానిని గౌరవించండి. అంతర్యామిని అనుభూతి చెందండి. ఇంకెక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. బయట వెతికితే ఫర్వాలేదు. అదీ ఒక విధమైన అన్వేషణే. కనీసం చివరికి ఏమీ దొరకదు అని తెలుస్తుంది. మీరు ఒక ముగింపుకి రాగలుగుతారు. కానీ మీరు ఏ దిశలో అన్వేషించినా అది నిజాయితీతో కూడినదై ఉండాలి. అందువల్ల దానికి ఒక ముగింపు పలకవచ్చు. మనం సరిగా వెతకం. అందువల్ల అన్ని దిశల్లోనూ పరిగెడతాం. మీరు బయట ప్రపంచంలో కనుక వెతికినట్లయితే… అప్పుడు మీరు బాహ్య విధానాల ద్వారా భగవంతుడిని పొందలేము అని తెలుసుకోగలుగుతారు. కనీసం దీన్నైనా మీ హృదయం అనుభూతి చెందుతుంది.
సమన్వయంతో ముందుకు సాగటం
ఇప్పటివరకు ఈ విషయంపై నేను మాట్లాడకపోయినప్పటికీ, ఇది ఆసక్తికరమైన అంశం. మంచి చెడులు రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి సమాజం, ప్రదేశం, దేశంలో మాత్రమే కాక, ఇవి రెండూ కాలంతో కూడా సంబంధం కలిగివుంటాయి. చిన్నతనంలో నేను ఆటలాడుకొనేవాడిని. నాన్నగారు కూడా వెళ్లి ఆడుకొని రమ్మనేవారు. ఎందుకంటే చిన్నతనంలో ఆడుకోవడం ఒక మంచి విషయం. వృద్ధాప్యం లో ఆటలాడడం అంత మంచి విషయం కాదు. ఇవి కేవలం కాలం, ప్రదేశంతో మాత్రమే కాదు, హృదయం యొక్క మంచితనానికి సంబంధించినవి కూడా. మంచా, చెడా అన్న విషయాన్ని మీ హృదయం గ్రహిస్తుంది. చిన్న పిల్లలకు కూడా మంచి, చెడుల మధ్య అంతరం తెలుస్తుంది. నా మనవడు, మనవరాలు పాలు గానీ, నీళ్ళు తాగేటప్పుడు వారి చేతి లోని బాటిల్ లేదా గ్లాస్ క్రింద పడితే… ఏదో జరిగింది అన్న విషయం వారికి అర్థంమై ఏడవడం మొదలుపెడతారు. ఎందుకు ఏడుస్తారు అంటే ఏదో జరిగిందని వాళ్ళకీ అర్థం అవుతుంది. ఇక్కడ తప్పు జరిగిందన్న విషయం అందరికీ అంతరంగంలో తెలుస్తుంది. నీవు తప్పు చేసావు అనీ ఎవరో బయటి వ్యక్తి వచ్చి చెప్పవలసిన పని లేదు. తప్పు చేసినా కానీ ఆ తప్పును స్వీకరించగల ధైర్యం ఉండాలి. చెడు అన్న విషయం ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, మంచి చేసినప్పుడు నేను చేసిన పని మంచిదా, కాదా అన్న విషయం కూడా అర్థం కాదు. కానీ తప్పు జరిగితే మాత్రం ఆ విషయం వెంటనే అర్థం అయిపోతుంది. అందువల్ల మనస్సుతో తీసుకున్న నిర్ణయం, హృదయం సహాయంతో తీసుకొన్న నిర్ణయం ఈ రెండిటినీ ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంటిలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి లేదా ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలి అనుకుంటే మీ అమ్మనో, సోదరినో, మీ ధర్మపత్నినో సలహా అడిగితే … రెండు, మూడు నెలల నుండి మీరు సతమతం అవుతున్న సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. అక్కచెల్లెళ్ళు మీరు ఇది సమస్య అని పూర్తిగా చెప్పకముందే వారు మీ సమస్యకు పరిష్కారం చెప్పేస్తారు. కారణం ఏంటో మీకు తెలుసా? మనం బుర్రని ఉపయోగిస్తాము. వాళ్ళు హృదయాన్ని ఉపయోగిస్తారు. సమస్యను వారు ఇట్టే పట్టేస్తారు. అందుకే మన హృదయాన్ని జాగృత పరచవలసిన అవసరం ఉంది. తార్కిక మనస్సును మధ్యలోకి లాగకండి. తార్కికమైన మనస్సు చేసే ప్రతి మంచి ఆలోచన, హృదయంతో సమ్మిళితం చెందుతుంది. నిర్ణయం సరైనది అయితే మనస్సు, హృదయం రెండూ సమన్వయంతో ముందుకు సాగుతాయి.
అనంతమైన ఆధ్యాత్మిక యాత్ర
ఎవరైనా సరే ‘జీవితంలో విజయం సాధించాను’ అని భావించకూడదు, అనేది నా ఆకాంక్ష. మీకు ఆ భావన కలిగినప్పుడు పట్టించుకోకుండా వుండండి. విజయానికై ఇంకా ఎన్నో మైళ్ళు ప్రయాణించాలి, అని భావించండి. ప్రాపంచిక విషయాలలో విజయం కూడా ఒక రకమైన విజయం అయినప్పటికీ అది అసలైన విజయం కాదు. మంచి స్కూల్లో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడం ఒక విధమైన విజయం. అలాగే మంచి ఉద్యోగం సాధించడం. జీవితంలో ఉన్నతంగా స్థిరపడటం కూడా విజయమని చెప్పవచ్చు. అయితే మనం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటే, ఆధ్యాత్మిక యాత్ర అనంతమైనది. ఈ యాత్రలో మీకు ‘విజయం సాధించాను’ అనే భావం ఎప్పుడూ కలగకూడదు. ఇంకా ఇంకా ప్రయత్నించాలి. భగవంతునిపై ప్రేమ చిగురిస్తే ఆయన్ని స్వల్పంగా ప్రేమిస్తే, ఇందులో మనం విజయం అందుకోలేము. ఆ ప్రయత్నం అనేది అనంతంగా వుండాలి. అనంతమైన దాన్ని పొందాలంటే మన కృషి కూడా అనంతమైనదే అయివుండాలి. కనుక మీ కృషికి స్వస్తి చెప్పే ఆలోచన మీ హృదయం లోకి చేరనివ్వకండి. లేదంటే మనకు విజయం లభించిందని మనసుకి అనిపిస్తే ఇక తదుపరి ముందుకు సాగే ప్రయత్నం నిలిపివేస్తుంది. ఈ రిటైర్ మెంట్ అనే ఆలోచనను మీలోకి రానివ్వకండి. ఎవరూ జీవితంలో ఎప్పటికీ రిటైర్ అవ్వకూడదు. ఏదో ఒక పని, ఏదోఒకటి చేస్తూ వుండాలి.
పరిపూర్ణ శరణాగతి
ఇందులో నన్ను నేను కూడా సరి చేసుకుంటాను. ‘మనసే మీకు శత్రువు’ అని తరచుగా ప్రజలు అంటుంటారు. అయితే సరిగ్గా ఉపయోగించగలిగితే మనసు కన్నా మంచి స్నేహితుడు ఉండడు. అహంతో కూడా సమస్యలు ఉన్నాయి. అయితే అది కూడా మీకు మంచి స్నేహితుడే. ఉదాహరణకు మీరు ఎన్టీపీసీ లో ఒక హోదాలో ఉన్నారు. నేను ఎన్టీపీసీ లో ఫలానా అని చెప్పినప్పుడు అది అహంకారం కాదు. అది ఒక యదార్థం. మీరు ఎన్టీపీసీ లో ఫలానా అనేది యదార్థం. మిమ్మల్ని మీరు ఎక్కువా తక్కువా చేసుకోవడం లేదు. అదేమీ అహంకారపూరిత స్టేట్ మెంట్ కాదు. కానీ మీరు ‘నేను భారతదేశ ప్రధానమంత్రిని’ అంటే మాత్రం మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? సరేనా! ఉదాహరణకు మీరు ఒక సంగీత కళాకారుడు అనుకుందాం. మీరు వేణుగానం చేస్తారు. నిన్న మీరు మాల్ కౌంస్ అనే ఒక అద్భుత రాగాన్ని ఆలపించారు. అక్కడున్న అందరూ మీ కార్యక్రమం చివర్లో లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. వారంతా సంతోషించారు. వాళ్లు నా సంగీతాన్ని ఇష్టపడ్డారని మీరు కూడా ఆనందించారు. మరుసటి రోజు మిమ్మల్ని ఇంకో ప్రదేశానికి ఆహ్వానించారు. అక్కడివారు కూడా మీరు ఇంతకు ముందు రోజు ఆలపించిన రాగాన్నే ఇక్కడ కూడా వినిపించమని కోరారు. మీకు ఆ రాగంపై పట్టు ఉంది. మీరు నిన్నటి మీ ప్రదర్శనతో తృప్తిపడతారా? అంతకన్నా ఇవాళ మెరుగ్గా చేయాలి, అనుకుంటారు కదా! కనుక నిన్నటి మీ సామర్థ్యాన్ని అధిగమించాలనుకోవడం అహంకారం అవుతుందా? కాదు కదా! కళాకారుడుగా నా వ్యక్తిత్వానికి, నా అహం మరింత మెరుగుదల కోసం తోడ్పడుతుంది. అహాన్ని ఉపయోగించి నేను మెరుగు పడేందుకు ప్రయత్నిస్తాను. కనుక నా ప్రదర్శన పట్ల నేను అతిశయం కలిగి ఉంటాను. అందులో తప్పేమీ లేదు. గర్విస్తాను. తప్పేమీ లేదు. హృదయాంతరాళంలో నేను నా బాధ్యత గురించి చక్కగా ఆలోచించి, నన్ను నేను అధిగమించగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. ఇతరులు సంతోషించలేకపోతే అది వారి సమస్య. అయితే నాకన్నా వేరెవరూ గొప్ప వేణుగాన విద్వాంసులు కాదు, గొప్ప కళాకారులు కాదు, అని భావించడం… లేదా ఎన్టీపీసీ లో నాకన్నా బ్రహ్మాండంగా ఎవరూ పని చేయలేరు, ఇలా భావించడం అనేది అహంభావం, అహంకారం, గర్వం. ఈ అహం భగవంతునితో ఆటలాడినప్పుడు, మనలో ఏముందో ఆయనకు అంతా తెలుసు కదా! అందుకే కృష్ణ పరమాత్మ గీతలో ఇలా అంటారు… సర్వ ధర్మాన్ పరిత్యజ్య, మామేకం శరణం వ్రజ. ‘నన్ను శరణు పొంది మిగిలిన అన్నింటినీ వదిలేయి’ అని. మీ పనులు మీరు చేయవద్దని దీని అర్థం కాదు. దీని అర్థం, నన్ను హత్తుకొని నా సహచర్యాన్ని అనుభూతి చెందమని… నేను నీకోసం ఎల్లప్పుడూ ఉన్నానని నీ జీవితంలో, నీవు చేసే ప్రతి పనిలోనూ నేను ఉన్నానని… నన్ను నీ సహచరునిగా భావించమని, నీవు కర్తవని భావించవద్దని, నా సహాయం తీసుకో అని. అప్పుడు మీరు చేసే ప్రతి పనీ మార్పు చెందుతుంది. మన అంతరంగంలో భగవంతుని లేదా ఒక ఉన్నతాత్మను స్థిరపరచుకున్నప్పుడు అహం అనేది ఉంటుంది కానీ అది వ్యక్తం అవదు. మీరు చేసే పనిలో, కర్మలో మీరు దివ్యతను మిళితం చేస్తున్నారు. ఆ విధంగా మీ పని కర్మయోగమవుతుంది. అలాంటి భావంతో చేసిన కర్మ, భక్తి యోగమవుతుంది. ఇలాంటి వైఖరితో మీరు ఉన్నప్పుడు, భగవంతుడు మీ అంతరంగంలో ఉన్నప్పుడు, మీరే స్వయంగా దేవాలయం లా మారతారు. భగవంతుడు నెలవున్న ప్రదేశాన్ని తీర్థం అంటాము కదా! మీరు ఇంట్లో ఉంటే మీ ఇల్లే దేవాలయం. సినిమా చూడడానికి మీరు థియేటర్ కు వెళ్తే అది తీర్థమవుతుంది. షాపింగ్ మాల్ కి వెళ్తే అది కూడా దేవాలయం అవుతుంది. భౌతికంగా దేవాలయానికి వెళ్లినా ఆ దివ్యతను గురించిన ఎరుక లేనంతవరకు, ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు అక్కడికి వెళ్ళవచ్చు గాక! అక్కడ దండ ప్రణామాలు, అన్ని క్రతువులు చేయవచ్చు గాక! అయితే మీలో ఆ దివ్యత్వం అనే సుగంధం లేనంతవరకు, అది అసంపూర్ణమే! నేను పరిపూర్ణంగా శరణాగతుడనవ్వాలి. సమర్పణ అంటే మీరేదో పోగొట్టుకున్నట్లు కాదు. ఇక్కడ మీరు అన్నీ పొందుతారు. ఎందుకంటే శరణాగతి చెందడం అంటే మీ ప్రియతమునితో ‘నా తరఫున నీవు పని చేయమని’ హృదయపూర్వకంగా చెప్పడమే! అప్పుడు పని ఎలా మార్పు చెందుతుందో చూడండి! మీరు చేసే ప్రతి పనిలోనూ ఎంతో సౌందర్యం వ్యక్తం అవుతుంది. మీరు ఒక డాక్యుమెంట్ పై సంతకం పెట్టేటప్పుడు కూడా … మీ హృదయం లోని దివ్యత్వంపై ఎరుకతో సంతకం చేసినప్పుడు, అది సమూలంగా మార్చి వేస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు – అది సాధారణమైన భోజనమే కావచ్చు – దివ్యమైన ఎరుకతో తినాలి. ఆహాన్ని కరిగించి వేయడమంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు. మీ హృదయం లోకి దివ్యమైన ఎరుకను తెచ్చుకోవడం ద్వారా మీరు పని చేయడం అన్నమాట. అదే కర్మయోగం. ఇటువంటి భక్తి లేకుండా, చేసే పనిలో దివ్యత్వం లేకుండా, చేసే పని శ్రమ అవుతుంది. భగవంతుని ఎరుక లేకపోతే, చేసే పనిపై ప్రేమలేని, బరువు మోసే గాడిదలా తయారవుతాం. భగవంతుడు మీకు పని చేసే సామర్థ్యం ఇచ్చారు. దాన్ని ఆస్వాదించాలి. ఆకాంక్షించాలి. పనిలో భగవంతునికి భాగస్వామ్యం కల్పిస్తే పని స్వభావమే మారిపోతుంది. కర్మతో భక్తిని రంగరిస్తే అది ఆరాధన అవుతుంది. అలాగే జ్ఞానం..! ఇంతకుముందు మనం ఈ జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. భక్తి లేని జ్ఞానం! ఎల్లప్పుడూ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ మీరు కేవలం ఒక మూర్ఖుడిలా కనిపిస్తారు. ప్రజలు అటువంటి వ్యక్తులను ఇష్టపడరు. నిత్య జీవితంలో ఆఫీసుల్లోనూ మీరు గమనిస్తూ ఉంటారు కదా! ఎంతోమంది తరచూ మనకు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వాళ్లకే అన్ని తెలిసినట్లుగా, ఎన్నో రకాల సంగతులు చెబుతుంటారు. ప్రేమించడం అటు ఉంచండి, కనీసం మీరు వాళ్ళని గౌరవిస్తారా? కాబట్టి భక్తి… కేవలం భక్తే సర్వస్వమూనూ! మన హృదయాంతరాళాలలో భగవంతునిపై అటువంటి ప్రేమను పెంపొందించుకొని… దాన్ని మన చర్యలలో, పనులలో పొందుపరిస్తే జీవితం మారిపోతుంది.
సమర్పణాభావం
సమర్పణ అనే మాట అనగానే సమర్పించుకోవడం జరగదు కదా! నేను మొదట్లో చెప్పినట్టుగా మన ప్రగతి… క్రమానుగత ప్రగతి, ప్రతిరోజు మన హృదయంలో అనుభూతి పెరుగుతున్న కొలదీ సమర్పణా భావము పెరుగుతుంది. మన శ్రద్ధ, మనం వారిపై ఆధారపడి ఉండడం పెరుగుతాయి. ఈశ్వరుని పట్ల, గురువు పట్ల శ్రద్ధ ఎప్పుడు పెరుగుతుంది? మనం ఆయనపై ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధ్యానంతో పాటు కొంత అనుభూతి కలుగుతుంది. అప్పుడు శ్రద్ధ పెరుగుతుంది. దినదినాభివృద్ధి చెందినట్లు అనుభూతి పెరుగుతున్న కొలదీ మన స్థితిలో, మన చేతనత్వంలో పరివర్తన చెందడం మొదలెడతాం. మన కోరికల తీవ్రత తగ్గడం, అలాగే మన అహంకార స్థాయి తగ్గడం ఆరంభం అవుతుంది. ధ్యానం చేయడం వల్ల ఈశ్వరుని పట్ల, గురువు పట్ల కృతజ్ఞులమై ఉంటాము. నెమ్మది నెమ్మదిగా మనలో మార్పు కలుగుతూ శరణాగతి భావం సహజంగానే కలుగుతుంది. మనము శరణాగతి నొందామా లేదా అనేది మాటల్లో చెప్పడం ఉండదు. అది చాలా సహజమైన స్థితి అవుతుంది. మీరు హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం చేయండి, పూర్తిగా సాధన చేయండి. నేను 1976లో అహ్మదాబాద్ లో 3వ సంవత్సరం ఫార్మసీ విద్యార్థిగా ఉన్నప్పుడు ధ్యానసాధన ప్రారంభించాను. అప్పటినుండి శ్రద్ధగా ధ్యానించడం వల్ల ఎంతో మార్పు వచ్చింది. మా కాలేజీలో కూడా నా స్నేహితులు చాలా చిన్న వయసులోనే ధ్యానాన్ని ఆరంభించారు. ఇప్పుడు వారు ప్రపంచంలో అక్కడ ఇక్కడ ఎన్నో చోట్ల ఉన్నారు. నేను యూఎస్ కు వెళ్లాను. వారి జీవన శైలిని గమనిస్తే, తోటి వారితో పోల్చినప్పుడు వారు అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మా కాలేజీలో కొంతమంది మాలాగా ధ్యానం చేయలేదు. వారి జీవితాలు, ధ్యానం చేస్తున్న మా జీవితాలతో పోల్చి చూసినప్పుడు, ఎంతో వ్యత్యాసం ఉంది. 18, 19 ఏళ్ళ వయసులో ధ్యానం చేయడం ప్రారంభించాము. ఇప్పుడు మేము 60 సంవత్సరాల పైబడిన వయసులో ఉన్నాము. 60 ఏళ్ల వయస్సులో ఉన్న వారు కొందరు ఇప్పటికీ ధ్యానం చేయకుండా ఉన్నారు. వారంతా మా స్నేహితులు కావడంతో వారి జీవితాలను కూడా చూస్తున్నాం. ధ్యానం చేస్తున్న వారి కుటుంబాలలో, ధ్యానం చేయకుండా ఉన్న వారి కుటుంబాలలో చాలా వ్యత్యాసం ఉన్నది. వారి పిల్లల్లో మరియు వారి సంస్కారాలలో చాలా వ్యత్యాసం ఉన్నది. యోగ పద్ధతి ఒక్క రోజులో అయిపోయేది కాదు. జీవితకాలమంతా కూడా సరిపోదు.
ఆలోచనారాహిత్య స్థితి
అందరూ నన్ను గురూజీ అంటారు కానీ క్షమించండి. నేను ఒప్పుకోలేను! నన్ను గురువుని చేయకండి. నేను మీ సోదరుడిని లేదా స్నేహితుడిని. ఈ ఆలోచనల గురించి మా గురుదేవులు చెప్తుండేవారు. నేను కూడా వారిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు, వారు నాకు ఈ సమాధానం ఇచ్చారు, కళ్ళు చేసే పని ఏమిటి? చూడడం. ముక్కు పని వాసన చూడటం, చెవుల పని వినడం. మనసు పని ఆలోచించడం. దానిని ఆలోచించనివ్వండి. ఆపవద్దు. మనసు యొక్క స్థితి సహజంగానే ఆలోచన చేయడం. ధ్యానం ద్వారా మనం మనస్సుకు మనకు అవసరమైన వాటిని ఆలోచించేలా నెమ్మదిగా శిక్షణనిస్తాము. మనము ప్రాణాహుతి ద్వారా ధ్యానం చేసినప్పుడు ఈ ఆలోచనల ప్రభావం చాలా విభిన్నంగా ఉంటుంది. మీరు చెప్పినది సరైనదే, ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ ఆలోచనలను అధిగమించడాన్ని ‘ధ్యానస్థితి’ అంటాము. ఈ హార్ట్ ఫుల్ నెస్ లో ప్రాణాహుతి ద్వారా ధ్యానం చేసినప్పుడు ధ్యానస్థితి సహజంగా తనంతట తానుగా సంభవిస్తుంది. మీరు పోల్చి చూసుకోండి. మీరు ఐదు రోజులు ప్రాణాహుతితో, ప్రాణాహుతి లేకుండా ధ్యానించండి. మొదట మీరు ఐదు రోజులు ప్రాణాహుతి లేకుండా ధ్యానించండి. తర్వాత కేవలం రెండు రోజులు, రోజూ అరగంట పాటు ప్రాణాహుతి సహాయంతో ధ్యానించండి. ప్రాణాహుతి వలన మానసిక స్థితిలో ఎంత మార్పు వస్తుందో మీకు మీరే గమనించండి. కావాలంటే, మీరందరూ ఢిల్లీలో ఉన్నారు కదా! నేను మా ప్రశిక్షకులను మీ ఆఫీసుకు వచ్చేలా ఏర్పాటు చేస్తాను. లేదా మీరు ప్రశిక్షకుని ఇంటికి దగ్గరలో ఉంటే అక్కడకు లేదా మా ఆశ్రమానికి వెళ్లి అక్కడ ధ్యానించండి. మీలో ఏం మార్పు కలుగుతుందో గమనించండి. మొదటి ధ్యాన సెషన్ లో తక్షణమే మీలో మార్పు కలుగుతుంది. మొదటి సెషన్ లోనే మీరు “అవును! నాకు ధ్యానంలో ఇటువంటి అనుభూతి జీవితంలో ఎప్పుడూ కలుగలేదు” అని భావిస్తారు. నేను మీకు ఈ హామీ ఇస్తున్నాను. రెండవ విషయం ఏమిటంటే, మా మాస్టర్ తనని ఎవరైనా “దీనికోసం మీరు ఎంత రుసుము వసూలు చేస్తారు?” అని అడిగినప్పుడు ఇలా చెప్తుంటారు. ఇదే ముఖ్యమైన విషయం. ఇప్పటివరకు నన్ను ఎవరూ అడగలేదు. “కమలేష్ భాయ్! మీరు చాలా చెప్తూ ఉంటారు, కానీ దీని వెనుక గల రహస్యం ఏమిటి? మీకు ఎంత లభిస్తుంది?” అని. అప్పుడు నేను వారిని “మీరెంత ఇవ్వదలుచుకున్నారు” అని అడుగుతాను. మీరు డబ్బుతో బ్రహ్మవిద్య కొనాలని అనుకుంటున్నారా? ఒకవేళ డబ్బుతో బ్రహ్మవిద్య నేర్చుకోగలిగితే ఇక బ్రహ్మవిద్య అవసరం ఏమిటి? కొనుక్కోండి చూద్దాం! కాబట్టి కొన్ని విద్యలు ఎలాంటివంటే వాటికి వెల కట్టలేము. మా గురువు గారు “బ్రహ్మ విద్యను అమ్మడం అంటే ఈశ్వరుని అవమానించడమే” అని చెప్పేవారు. దానికి ఎటువంటి రుసుము ఉండదు. ఈ రోజుల్లో నీళ్ల బాటిల్ ను మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాము. కానీ గాలి ఉంది… అది ప్రాణంతో సమానం. అలాగే ప్రాణాహుతి… వీటికి ఎటువంటి రుసుము ఉండదు. కానీ అవి లేకుండా మనం జీవించలేము.