01-04-23
ధ్యానం మిగిలిన పనులకు సమయాన్ని సృష్టిస్తుంది
ఈ విషయంలో నా అనుభవం వేరు. నేను ఫార్మసీ చదువుకున్నాను. అందులో బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ పూర్తి చేశాను. వివిధ రకాల పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాను. వీటితో పాటు, ప్రతి సంవత్సరం మాస్టర్ ను నాలుగు నెలలకి, ఐదు నెలలకి లేదా ఆరు నెలలకు ఒకసారి కలిసి కొంత సమయం గడిపేవాడిని. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. మీ హృదయాన్ని ధ్యానంలో సంపూర్ణంగా నిమగ్నం చెయ్యండి.మీ వృత్తిపరమైన జీవితం సరైన రీతిలో సాగిపోతుంది. వృత్తి పరమైన జీవితంలో మునిగిపోతే, ధ్యానం శాశ్వతంగా చేజారిపోయింది. ఎవరైతే తమకు రోజులో తక్కువ సమయం వుందని భావిస్తారో, వారు ప్రత్యేకంగా ధ్యానం చెయ్యాలని మహాత్మా గాంధీ అనేవారు. ధ్యానం చెయ్యడం వలన ఎక్కడ సమయాన్ని వృథా చెయ్యకూడదో తెలుస్తుంది. సమయం చాలా ఆదా అవుతుంది. ధ్యానం చెయ్యని వారు ఎప్పుడూ ఏదో పనికిమాలిన పనులలో నిమగ్నమై వుంటారు.
05-04-23
హృదయాన్ని అనుసరించండి
నేను చెబితే నన్ను కూడా నిరాదరిస్తావు కదా!
ఎవరో ఒకరిని చేయాలి కదా! మీకు జపం చేయాలనే కోరిక ఉంటే చేయండి. ఎవరొద్దంటారు? జపం పూర్తయ్యాక, ధ్యానం చేసుకోండి. సైన్స్ వల్ల అంతా జరుగుతుంది. విశ్వాసం వల్ల, గౌరవం వల్ల, శ్రద్ధతో ఏమీ జరగవు. సైన్స్ లో ఏదైతే పరిశీలిస్తామో, అదే సత్యం అవుతుంది. ఏదైతే మనం చూస్తామో, అనుభూతి చెందుతామో అదే సత్యం అవుతుంది. ఆధ్యాత్మికత కూడా అంతే. మనకి ఏమీ తెలియకుండానే శ్రద్ధ వహిస్తాం. తెలియకుండా శ్రద్ధ వహిస్తే అది గుడ్డి నమ్మకం అవుతుంది. దాని పరిణామాలు సరిగా ఉండవు. గురువులను కూడా పరీక్షించాలి. అందరూ వెళ్తున్నారని వెళ్లడం, సాష్టాంగ నమస్కారం చేయడం, విగ్రహాల ముందయితే ఇంకా ఎక్కువ. జపానికి సంబంధించి మరింత ఎక్కువ. ఇవన్నీ ప్రయోగాలు. ప్రయోగాలు చేసి దీనివల్ల ఇది జరిగింది, దీనివల్ల ఈ అనుభూతి కలిగింది, దీన్ని పదిసార్లు నేను చేశాను, ఫలితం ఇది. అన్నీ వైజ్ఞానికంగా పోల్చి చూడండి. తర్వాత మీరే చూడండి, మీ అనుభవం ఏం చెప్తుందో! మీ అనుభవంతో చేయండి. నేను చెప్పడం వల్ల లేదా మరొక ముని చెప్పడం ద్వారా, ఇక్కడ అక్కడ తిరిగి దారి తప్పకండి. మీ హృదయం ఏం చెప్తోంది? మీ హృదయం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఆత్మకు ఒక ధ్యేయం ఉంది. ఈ శరీరాన్ని ధరించక ముందే, దానికొక ధ్యేయం ఉంది. నేను మనిషిగా పుట్టి ఈ పనులు చేస్తాను, అని అనుకుంటుంది. కానీ జన్మ తీసుకున్న తర్వాత అవన్నీ మరిచిపోతాం. కానీ ధ్యేయ ప్రాప్తి కోసం ఏ మార్గాన్నయితే అనుసరిస్తామో అది సరైనదైతే ఆత్మశాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆత్మకి తెలిసిపోతుంది. ఈ దారి సరైనదా, కాదా అని. ఒకవేళ ఆ మార్గం దాని అభివృద్ధి కొరకు సరైనది, మంచిది అయితే మనకు పరిపూర్ణ శాంతి లభిస్తుంది. ఒకవేళ అది తప్పు అయితే హృదయం భారం అయిపోతుంది. అదే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. హృదయాన్ని అనుసరించండి. అదే భగవంతుని పొందే మార్గం. అందులో క్రొత్తది ఏమీ లేదు. ఎక్కడైతే హృదయంలో అపూర్వ శాంతి లభిస్తుందో అదే మన మార్గం అని అర్థం చేసుకోండి. ఎక్కడైతే అశాంతి, సంశయం ఉంటాయో ఆ మార్గంలోకి వెళ్ళకండి. మీ హృదయంలో చేయనా వద్దా అనే సంశయం ఏర్పడిందంటే.. సంశయం ఎందుకు వస్తుంది? మీకు రసగుల్లా ఇష్టం. తిన్నారు. ‘క్రిందటి సారి తిన్నాను, ఇప్పుడు తిననా, వద్దా’ అని మీ అమ్మను అడుగుతారా? అమ్మ ఏమంటుంది? ‘నీకు బాగుంటే తిను, లేదంటే వద్దు’ అంటుంది. అందువల్ల సరళమైన పద్ధతి, సరళమైన దారి. ఎందుకు నాతో బలవంతంగా చెప్పిస్తారు? మీకే తెలుసు.
మన ప్రార్థనలోని అసలైన భావం
ప్రార్థన విషయంలో మొదట్లో నేను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. హే నాథ్, హే ఈశ్వర్, మానవ జీవితమునకు యదార్ధ లక్ష్యం నీవే! యదార్ధ అంటే ఏమిటి? నిజమైనది, అసలైన లక్ష్యం. అంటే దీని అర్థం జీవితంలో మరింకే లక్ష్యాలు ఉండకూడదని కాదు. వేరే లక్ష్యాలు కూడా ఉంటాయి. ఒకరు డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకరు లాయర్ అవ్వాలనుకుంటారు. పిల్లలకి మంచి పెళ్లి సంబంధాలు రావాలనుకుంటారు. దానిలో ఏమాత్రం తప్పులేదు. కానీ ప్రధాన లక్ష్యం… సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నట్లుగా కేంద్రీకృతమై ఉండాలి. గ్రహాలు వేరే ఎటువైపూ మళ్ళవు. అన్నింటి దృష్టి సూర్యుని పైనే ఉంటుంది. సూర్యుడు అన్ని గ్రహాలకు కేంద్రమయ్యాడు. అదే విధంగా భగవంతుడు మన జీవితాలకు కేంద్రం కావాలి. మిగతా విషయాలు పరిధిపై ఉంటే పర్వాలేదు. ఈరోజుల్లో మన జీవితాన్ని నిరుపయోగ విషయాలపై కేంద్రీకరిస్తున్నాం. ఈశ్వరుని పరిధిపై ఉంచుతున్నాం. దానివల్ల సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల మనం ప్రపంచాన్ని కేంద్రంగా చేసుకోక…. నేను ప్రపంచాన్ని వదిలేయమని చెప్పట్లేదు కానీ ఈశ్వరున్ని కేంద్రంగా చేసుకుంటేనే అది మన యధార్థ లక్ష్యం అవుతుంది. రెండవ వరుసలో ‘మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్నది’ అని చెప్తాం. అంటే కోరికలే ఉండవద్దని చెప్పడం కాదు. పిల్లలు ఉంటారు. కుటుంబంలో పెళ్లైన తర్వాత పిల్లలు కావాలనుకుంటారు. దాన్ని కూడా కలిగి ఉండకూడదా? కోరికల పట్టికలో పిల్లలు కావాలని కోరుకోవద్దా? తప్పు ఎక్కడుంది మరి? నాకు కొడుకే కావాలని కోరుకుంటే అది తప్పు అవుతుంది.అమ్మాయే కావాలని కోరుకోవడం కూడా. ఇదే నాకు కావాలని భగవంతుని పట్టుబట్టినప్పుడు, గందరగోళం అవుతుంది. కోరికలు ఉండకూడదా? అని చిన్నపిల్లలు వాదిస్తారు. అందుకు వాళ్ళు సహజమార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతారు కూడా. కానీ మనలో శరణాగతి భావం ఏర్పడితే, తరువాత కొడుకు గాని, కూతురు గాని కావాలనే కోరిక తగ్గిపోతుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ, పిల్లలు కలిగినా మీ కృపయే, కలగకపోయినా మీ కృపయే అని పరమాత్మ ను ప్రార్థిస్తాం. శరణాగతి నొందిన భావంలో మనం ఏ విషయాన్ని డిమాండ్ చేయం. ఆహారం కావాలనుకుంటే దొరుకుతోంది. అది చాలు! రసగుల్లా కావాలి, పరోటా కావాలి, అది కావాలి, ఇది కావాలి అని షరతులు పెట్టవద్దు. పట్టుబట్టడమే సమస్య. ఇక మూడో వాక్యంలో ‘మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే’ అంటాం. దాని అర్థం ఏంటి? ‘నేనేమీ కాను’ అనే భావం ఏర్పడాలి. ఎవరినైనా తీసుకెళ్లి పైన పీఠంపై కూర్చోబెట్టి అన్నీ మీరే అని అంటూ, మనం అంతకంటే పైకి వెళ్లి, ఈ డిమాండ్ ను మీరు తీర్చాలి అంటాం. దానివల్ల ఎక్కువ గందరగోళం అవుతుంది. శరణాగతి భావం ఎప్పుడు జీవనంలో ఉండాలి. అది లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఈశ్వరుని చేరుటకు మనం చేసే యాత్ర శూన్యంగా మిగిలి పోతుంది. ఇదే జరగాలి, అది జరగకూడదు అంటూ ఒక డిమాండ్ తర్వాత మరొక డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఎవరికి మనం ఇలా షరతులు విధిస్తున్నాం? ఈశ్వరునికి షరతులు విధిస్తే మీరు ఎక్కడికీ చేరలేరు. మీ జీవితంలోనే చూడండి. ఎవరికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నారో, వారు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు. సరే! ఎవరి పిల్లలు అయితే 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయసులో ఉన్నారో వారు చేతులు దించండి. ఇప్పటికీ ఎక్కువే ఉన్నారు. పిల్లలు మీకు షరతులు విధిస్తే మీకెలా ఉంటుంది? నాకు ఈ ఫోన్ వద్దు, ఐఫోన్ కావాలి అంటారు. ఐఫోన్ కొనడానికి మీరు సిద్ధమైతే, కాదు కాదు, ఐ14 కావాలంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మ ఆహారం తయారు చేస్తుంది. ఇది ఎందుకు వండలేదు? అని ప్రశ్నిస్తారు. వాళ్లతో, ‘కొంచెం ఈ గిన్నెలు కడగమ్మా’ అని అనండి. ‘సరే! కడుగుతాను గాని నాకు ఇది కూడా కావాలి,’ అని ముందుగానే కండిషన్ పెడతారు. మనం ఈశ్వరునితో అలా చేస్తున్నాం. మనకు నచ్చని విషయాన్ని ఆయన చేయాలని ఎందుకు షరతులు పెడుతున్నాం? మీకూ షరతులు అంటే ఇష్టం లేదు కదా! ఆయన షరతులకు ఆవల ఉన్నారు. చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే మానేయండి. మేం కూర్చుని ఉన్నాం, మీకు రావాలనిపిస్తే రండి, రావాలని లేకపోతే మీ ఇష్టం. ఆయన మన నుండి ముక్తిని పొందుతారు. ఎలా? మనకు స్వేచ్ఛనిచ్చి తాను స్వయంగా స్వేచ్ఛను పొందుతారు. మనం కూడా ఆయనకు స్వేచ్ఛను ఇవ్వాలి. మా జీవితంలో మీరు ఏం చేసినా మాకు సమ్మతమే అని అనాలి.
భక్తితో పని చేయడం
ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ప్రశ్నించిన వారెవరు?
ఎవరైనా కానీ, నిలబడడం మాత్రం చేయరు! ఏ పని చేయడానికయినా ఉత్సాహం ఎందుకు ఉండదు! ఉదాహరణకు మీరు ఒక పరిశ్రమ నడుపుతున్నారు. లాభం రాలేదు. అప్పుడు ఆసక్తి కూడా కలగదు. ‘సరే! వేరే పని చేద్దాం!’ అని భావిస్తారు. అన్ని పనుల్లోనూ అలాంటి కొరత ఉంటే మనసు నిమగ్నం అవదు. అప్పుడు నేను ఏవిధంగా పనిచేస్తున్నాను, అని ఆలోచించాలి. ఎవరికైతే అభిరుచి ఉంటుందో, కర్మయోగి వలే…అమ్మలాగా! ఎప్పుడు తలనొప్పిగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆమె మనసు బాగుండదు. లేకపోతే ఆమె సంతోషంగా వంట చేస్తుంది. భోజనం పెడుతుంది, అన్నీ చేస్తుంది. ఆమె ఎప్పుడూ ఈరోజు నాకు మూడ్ బాలేదు అని చెప్పదు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇలాగే చెప్తున్నారు. “ఇవాళ నాకు మూడ్ లేదు. బయట తినేసి రండి. వస్తూ నాకోసం కూడా తీసుకురండి” అని చెప్తున్నారు. ఈ మూడ్ లేదా మానసిక స్థితి అనేది విచిత్రమైనది. చాలా దుర్వినియోగం జరుగుతుంది. దాని వలన మన జీవితం మీద, మన మీద అసలు నియంత్రణ ఉండదు. లేకపోతే జీవితం మీద ఎవరికి ఆసక్తి ఉండదు? జీవితం ఇక అంతమవుతుంది, ఐదు నిమిషాల్లో చనిపోతారు అన్నప్పుడు జీవితం మీద ఆసక్తి మొదలవుతుంది. ‘ఈ జాగ్రత్త పడివుంటే బావుండేది…. ఈ పని చేసి ఉంటే బాగుండేది. ఆ పని చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే మిగిలింది’ అని భావిస్తారు. ఏ పనిచేసేటప్పుడయినా ఆసక్తి, ఉత్సాహం కలగకపోతే భగవంతునితో “నేను చేయలేక పోతున్నాను, దయచేసి సహాయం చేయండి” అని ప్రార్థించండి. సహాయం కోసం ప్రార్థించాలి. ఏ పని చేసినా హృదయాన్ని నిమగ్నం చేయాలి. ఉదాహరణకు నేను ఇక్కడకు వచ్చాను. నేను చాలా దూరం ప్రయాణం చేయాలి. సరే వచ్చాను. చాలా మంది బారులు తీరి నిల్చున్నారు. “హబ్బా!సిట్టింగ్ ఇవ్వాలి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది” ఇలా నేను ఆలోచిస్తే, మీరు నా గురించి ఎలా భావిస్తారు? అలాగే మీ గురించి, మీ ఇంటి వారు, ప్రజలు భావిస్తారు “అసలు ఆసక్తే లేదు సన్యాసిలా కూర్చున్నాడు. వట్టి మూర్ఖుడు. సన్యాసి లాగా మారలేదు, మరి పని కూడా చేయడం లేదు” అని. కర్మ అనేది ఒక నియమం వంటిది. పరమాత్మ కూడా పనిచేయకుండా ఉండలేడు. గీతలో కూడా శ్రీకృష్ణుడు ‘నేను ఒక్కక్షణం కూడా కర్మ నుండి దూరంగా ఉండలేను’ అని చెబుతాడు. కాబట్టి కర్మ చేయవలసిందే. ఎటువంటి కర్మ చేయాలి? శ్రీకృష్ణుడు కర్మను మూడు విధాలుగా విభజించాడు. ఒక రకమైన కర్మలో పనిచేస్తాం. ముఖ్యంగా ఎవరైతే బలవంతంగా పనిచేస్తారో అది కూడా కర్మయే కానీ బలవంతంగా చేయవలసి వచ్చింది. రెండో రకం ఇక్కడ ఈ భావన, ఆ భావన అంటూ ఏమీ ఉండదు. పనిచేస్తుంటాం అంతే! ఇది నా బాధ్యత అని భావిస్తాం. అమ్మకి సేవ చేయడానికి ప్రజలు వారి బాధ్యత అని భావిస్తారు. బాధ్యత అనుకొని మీరు పని చేస్తే అమ్మకు కాళ్లు పడితే, దాని బదులు కాళ్లు పట్టక పోవడమే మంచిది. మీ హృదయంలో ప్రేమ ఉంటే ఆమె పాదాలు నొక్కండి. ప్రేమ లేకుంటే వదిలేయండి. అంతేకానీ బలవంతంగా ఇది నా బాధ్యత అనుకొని మాత్రం చేయకండి. ప్రేమతో చేసిన పనిలో ఆనందం లభిస్తుంది. తల్లి, పిల్లలకు పాలు పట్టిస్తుంది. అది ఒక బాధ్యతగా చేస్తుందా? రాత్రి రెండయినా సరే, పిల్లవాడు ఏడవగానే ఒడిలోకి తీసుకుంటుంది. భర్త ఏం చేస్తుంటాడు? గురకలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడైనా తల్లికి కొద్దిగా నలతగా ఉండి…. తాను పాలు ఓవెన్ లో వేడి చేసి, చల్లార్చి పిల్లవాడికి పట్టించాల్సి వస్తే, దాని గురించి ఆయన డైరీ లో రాసుకుంటాడు. 2023, ఏప్రిల్ 5 న నా భార్యకు దురదృష్టవశాత్తూ నలతగా ఉంది. రాత్రి రెండు గంటలకు మా బాబు ఏడవడం ప్రారంభించాడు. నేను ఆ సమయం లో లేచి, పాలు వెచ్చబెట్టి మా బాబుకు పట్టించాను. అందువలన ఆ రోజు నాకు నిద్రా భంగం కలిగింది. ఫలితంగా ఆఫీస్ కు కూడా లేటుగా వెళ్ళాల్సివచ్చింది. ఉదయం లేవగానే ‘చూడు నేను ఈ పని చేశాను’ అని భార్యకు కూడా గొప్పగా చెప్పుకుంటాడు. అతను కూడా అదే పని చేసాడు. కానీ తల్లి, తండ్రి వారిద్దరి పని తీరులో తేడా ఉంటుంది. కర్మ ఎలా చేయాలంటే అది ఆకర్మలా ఉండాలి. చేసిన కర్మ ప్రభావం మనసుపై ముద్ర వేయని విధంగా ఉండాలి. ఆ కార్యం నెరవేర్చామా, లేదా అన్న ఎరుక కూడా ఉండకూడదు. శ్వాస తీసుకొంటున్నామా లేదా అన్న అనుమానం ఉంటుందా? నేను శ్వాసిస్తున్నానా, లేదా అని ఎవరినైనా అడుగుతామా? అడగాల్సిన అవసరం ఏముంది? పొద్దున్నే అమ్మని, రాత్రి నాకు పాలు పట్టావా అని అడగాల్సిన అవసరం ఏముంది? మనకు ఏది సరైనదో అది దొరుకుతుంది. ప్రతీదీ దానంతట అదే జరిగి పోతుంది. ‘అందుకే మన జీవితం, మరీ ముఖ్యంగా మన సాధన స్వయంచాలితంగా జరిగిపోవాలి’ అంటారు బాబూజీ. ఉదయం మనం చేసే ధ్యానం, సాయంత్రం చేసే నిర్మలీకరణ స్వభావసిద్ధంగా జరిగిపోతూ ఉండాలి. ధ్యానమే మన స్వభావంగా మనం ధ్యాన మయులం అవ్వాలి. రెండవ రోజు ధ్యానం చేసేటప్పుడు ఈ ధ్యానమయ స్థితి మరింత మెరుగౌతుంది. ఈ స్థితి మరింత గాఢమవుతూ, ప్రగాఢంగా అవుతున్న కొద్దీ ఆ ప్రగాఢత మన జీవన స్థితిని ఏర్పరుస్తుంది. ఆ స్థితి వలన మన జీవితం మరింత లోతులకు చేరుకుంటుంది. పునాది బలంగా ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితులు ఆ పునాదిని నాశనం చేయలేవు. పునాది పర్వతమంత స్థిరంగా ఉంటుంది. ఒక చిన్న తలనొప్పి వచ్చిందంటే చాలు, ఇంట్లో పోట్లాట మొదలవుతుంది. కనుక కర్మ, ఆకర్మ, వికర్మ. ఒక పని చేయాలనిపించకపోతే ఆ పనిని వదిలేయాలి. తర్వాత కర్మ. ఆ పని చేసినా, చేయకపోయినా పెద్దగా తేడా ఏమీ అనిపించదు. తర్వాత వికర్మ. విశిష్ట కర్మ. ఇది మనం మనస్ఫూర్తిగా, ప్రేమతో చేసే కార్యం. ఇంకా ఉన్నత స్థితిలో చేశామా, లేదా అన్న ఎరుక కూడా ఉండదు.ఇటువంటి కర్మ వలన సంస్కారాలు కూడా ఏర్పడవు. అందువల్లనే బాబూజీ ఎంతో చతురతతో నిరంతర స్మరణ గురించి చెప్తూ…. మనం చేసే ప్రతి కార్యం భగవంతుడే చేస్తున్నాడన్న భావనతో చేయమని చెప్పారు. భగవంతుడే ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని యొక్క ప్రభావం మన మీద ఎలా పడుతుంది? అటువంటి భావనతో ఒకసారి పని చేసి చూడండి. ఎలాటి ఫలితం లభిస్తుందో చూడండి. రెండవది, నేను ఈ పనిని భగవంతుని కోసం చేస్తున్నాను, ఎవరైతే నా సర్వస్వమో ఆయన కోసం ఈ పని చేస్తున్నానన్న మనోవైఖరి కలిగి ఉండండి. ఆయనే నా జీవనాధారం అన్న భావనతో చేసిన పని ఎంత ఉత్తమంగా ఉంటుందో చూడండి. మీరు ఒక డాక్టర్ అయితే, మీ ముందు రోగి కూర్చొని ఉన్నప్పుడు… ఇతనికి చికిత్స భగవంతుడే చేస్తున్నాడు లేదా నాతో చేయిస్తున్నాడు అన్న భావనతో కనుక అతనికి చికిత్స చేస్తే…. చేసే పని పట్ల పూజ్య భావం ఏర్పడుతుంది. సన్యాసం తీసుకోవలసిన అవసరం ఉండదు. చేస్తున్న పనిని భక్తి భావంతో కనుక చేస్తే అన్నీ సజావుగా సాగిపోతాయి.
06-04-23
హనుమంతుని గొప్పతనం -
లాలాజీ మహరాజ్ చాలా ఎక్కువగా ఇష్టపడేవారు. మీరు కనుక లాలాజీ మహరాజ్ సంపూర్ణ రచనలు, రెండవ సంపుటి కనుక చదివి ఉంటే అందులో వారు ఇలా అన్నారు. ‘హనుమాన్’ అనే పేరు ఎలా వచ్చిందో ఆయన అందులో చెప్పారు. అది తర్వాత కూడా పెట్టి ఉండొచ్చు. మహాభారతంలో కూడా, ఏ తల్లి తన పిల్లలకు దుష్టయుద్ధ్ ‘దుర్యోధనుడు’ అని పేరు పెడుతుంది? ధృత్ రాష్ట్ర… అలా. ఆ పాత్ర గుణాలను వర్ణించే క్రమంలో, ఆ వ్యక్తి స్వభావాన్ని ప్రతిబింబిస్తూ, తదనంతరం వారికీ పేర్లు పెట్టి ఉండవచ్చు. హనుమాన్ యొక్క అత్యున్నత గుణం, లాలాజీ వర్ణించినట్లు, ‘హను’ అంటే అతీతంగా/లేకుండా… ‘మాన్’ అంటే మానావమానములకు అతీతంగా ఉండేవాడే హనుమంతుడు. వారి మానసిక స్థితి ఎలాంటిదంటే, మానావమానములకు అతీతంగా అంటే పూర్తి సమర్పణా భావం, వినమ్రతా స్థితి. దీన్నే బాబూజీ మహరాజ్ పార్సీ భాషలో ‘అభూదియాత్’ అని పేర్కొనేవారు. అప్రాధాన్యమైన స్థితి! ఆయనే సర్వస్వం, ‘నేను’ అనే భావన అస్సలు లేని స్థితి. ఆ భావన ఎప్పుడు కలుగుతుందంటే…. అభ్యాసీ తొమ్మిదో చక్రాన్ని చేరుకున్నప్పుడు అక్కడి సంపూర్ణ స్థితిని అనుభూతి చెందినప్పుడు కలుగుతుంది. ‘అనంతం వైపు’ అనే తన పుస్తకంలో బాబూజీ దీన్ని ప్రస్తావించారు. అది హనుమంతుల వారి మనోస్థితి.అది మనలో పెంపొందించుకోవాలి. ఒక అభ్యాసీతో బాబూజీ దీని గురించి కొంత చర్చించారు కూడా! ఆయన ఏమన్నారో సోదరుడు సంజయ్ ను యధాతధంగా మీకు వివరించవలసిందిగా నేను కోరుతున్నాను. ఒక్క అంగలో పూర్తి దూరాన్ని అధిగమించడం గురించి అడిగిన ఒక అభ్యాసీతో బాబూజీ, హనుమంతుడి ఉదాహరణను ఇలా గుర్తు చేశారు. సముద్రాన్ని ఒక్క అంగతో హనుమంతుడు లంఘించడం గురించి చెబుతూ…. దీనికి కావలసిన మొదటి ఆవశ్యకత, ఆయన ఎల్లప్పుడూ తనను తాను మర్చిపోయే స్థితిలోనే ‘స్వీయ మైమరపు’ లోనే ఉంటారు. రెండో ఆవశ్యకత, తన యజమాని నుండి వచ్చే ఏ ఆదేశాన్నైనా అమలు జరిపే ఆలోచనలోనే నిమగ్నమవుతారు. ఆయన దృష్టిలో లక్ష్యం మాత్రమే ఉంటుంది తప్ప దారిలో ఎదురయ్యే అవరోధాల గురించి గానీ దూరాభారాన్ని గానీ అస్సలు లెక్కచేయరు. మనం కూడా లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అటువంటి స్వీయమైమరపుని మనలో సృష్టించుకోగలిగితే… అంతటి దూరాన్ని మనమూ ఒక్క గంతులో అధిగమించవచ్చు. హనుమంతుల వారి లక్ష్యం తల్లి సీతాదేవి. అలాగే అభ్యాసులకు లక్ష్యం మన మాస్టర్ లేదా ఆధ్యాత్మిక జనని. దీనికి కావలసిన అత్యున్నత గుణాలు రెండు. ఒకటి, నేను నా మాస్టర్ తో అనుసంధానమై ఉన్నంతవరకు ఎటువంటి తప్పూ జరగదనే అపారమైన ధైర్యం. రెండవది వినమ్రత. హనుమాన్ లా ఎలా తయారవ్వాలి? వారి అత్యున్నత లక్షణాన్ని మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మన ఆది గురువులు చెప్పినట్లు, హనుమాన్… హను అంటే అతీతంగా… మాన్ అంటే – ఈ గౌరవం, స్వాభిమానం వేటికోసమైతే నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తపన పడతారో… అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. జీవితంలో తన అస్తిత్వాన్ని, పూర్తి సమర్పణా భావంతో, ఎటువంటి ప్రాముఖ్యతా లేకుండా జీవించగలగడం. అత్యున్నత వినమ్రతా భావం! ‘నేను కేవలం నా ప్రభువు సేవకుడిని’, అనే భావంతో అందరికీ సేవ చేయడం. కుటుంబంతో ప్రారంభించి దేశానికి అనంతరం ప్రపంచానికి సేవలందించడం. వ్యక్తులుగా మన కర్తవ్యం, విధించడం కాదు, గ్రహించడం.
07-04-23
రిలాక్సేషన్ శిక్షణ యొక్క ఉపయోగాలు
మానవులపై వాతావరణ ప్రభావం గురించి నేడు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. దీనినే ఎపిజెనెటిక్స్ లేదా బాహ్యజన్యుశాస్త్రం అంటారు. ఈ బాహ్య జన్యువులు మన శరీరం, మనస్సు, ఆత్మలపై గాఢ ప్రభావాన్ని ఏర్పరుస్తాయి. -50 డిగ్రీలు ఉండే శీతల వాతావరణం లేదా 50 డిగ్రీల ఉష్ణ వాతావరణం ఈ రెండూ కూడా విపరీత పరిస్థితులే. మధ్యే మార్గం లేదా మితత్వంలో ఉండడం ఉత్తమమైన మార్గం అని యోగశాస్త్రం చెప్తుంది. అటువంటి తటస్థ వాతావరణాన్ని యోగ సాధన సహాయంతో మనం మనలో ఏర్పరుచుకొంటాం. బాహ్య వాతావరణ ప్రభావం కంటే మన అంతరంగ వాతావరణ ప్రభావం మనపై అధికంగా ఉంటుంది. అయితే ఈ అంతర్గత వాతావరణాన్ని మనం ఏవిధంగా ఏర్పరచుకోగలం? మీరు బాగా కోపంగా ఉన్నారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? మీ చేతులు వణకడం మొదలుపెడతాయి. మీ దవడ కండరాలు బిగుసుకుపోతాయి. కాళ్ళు చేతులలో అధిక రక్త ప్రసారం జరుగుతుంది. ఇతర శరీర అవయవాలు అంటే గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు లోని ఫ్రంటల్ కార్టెక్స్ వీటన్నింటిలో రక్త ప్రసారం నెమ్మదిస్తుంది. మన అంతర్గత వాతావరణం మార్పు చెందినప్పుడు కోపం బాగా వస్తుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు మన గుండె, లివర్ వంటి ఇతర అంతర్గత అవయవాలన్నింటిలో రక్త ప్రసరణ సజావుగా సాగిపోతూంటుంది. మన మెదడు యొక్క ఫ్రంటల్ కార్టెక్స్ అంటే కపాల భాగంలో కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇలా రక్త ప్రసరణ సజావుగా జరగడం వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే మన ఆలోచనా విధానంలో అప్రమత్తత ఏర్పడుతుంది. కోపం వచ్చినప్పుడు ఈ అప్రమత్తత మాయం అయిపోతుంది. ధ్యాన సహాయంతో మనం ధ్యానమయ స్థితిలో ఉన్నప్పుడు మనలో ఒక విశ్రాంత స్థితి ఏర్పడుతుంది. ఏ అవయవాలకు అయితే సక్రమంగా ఆక్సిజన్ అందాలో, వాటికి ఆక్సిజన్ అందుతుంది. ఒక ముగ్గురు అమెరికన్ సైనికులున్నారు.సైనికులలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. వీరితో పోరాడుతున్న ఎదుటి పక్షంలో ఉన్నవారికి అటువంటి క్రమశిక్షణ, రీతి, రివాజులు ఏమీలేవు. ఎవరినైనా అంతం చేయాలనుకుంటే, చేసేయడమే ఈ ముగ్గురు సైనికులపై, కొన్ని వేల మంది ఒకేసారి దాడి చేయడం జరిగింది. వారు ముగ్గురూ మెల్లగా ఒక పెద్ద చెట్టు క్రింద ఉన్న పొదలలో నక్కి కూర్చున్నారు. వారిని వెతుకుతూ వచ్చిన వారు, వీరు ఎక్కడ దాక్కున్నారో కనుగొనలేక వెనుకకు మరలి పోయారు. సాధారణంగా అటువంటి సమయంలో శ్వాస తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది…. కానీ ఈ ముగ్గురు సైనికులు శ్వాస తీసుకొంటున్న శబ్దం కూడా బయటకు రానంత నెమ్మదిగా శ్వాస తీసుకొన్నారు. ఎందుకంటే వారు ధ్యాన సహాయంతో రిలాక్సేషన్ పద్ధతిని నేర్చుకొన్నారు. ఒకవేళ వారు కోపంతో బయటకు పరుగెత్తుకొని వచ్చి ఎదురుదాడికి పాల్పడి ఉంటే చనిపోయి ఉండేవారు. ఎప్పుడు దాడి చేయాలి, ఎప్పుడు దాక్కోవాలి అన్న విషయం గురించిన అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. దాక్కోవడం అన్నది పిరికి చర్య కాదు. స్వీయ రక్షణ చేసుకోవడం పిరికితనం కాదు. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, తీవ్రంగా కాక నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఆ పరమాత్మతో అనుసంధానం చెందండి. అటువంటి పరిస్థితులలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అన్న అవగాహన మీకు ఆ పరమాత్మ నుండి లభిస్తుంది.
అంతరంగ అప్రమత్తత యొక్క ప్రాముఖ్యత
ఎవరూ కూడా మీకు చాలా విషయాలను సంపూర్ణంగా నేర్పలేరు. ఇక్కడ మీరు నేర్చుకునేది, చాలా ఉంటుంది. అయితే, జీవితంలో ఒక్కోసారి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటే, అప్పుడు ఇక్కడి స్కూల్లో నేను చదువుకున్నాను… ఇక్కడ ఎన్నో నేర్పారు. కానీ నేను ఇప్పుడు చేసిన పని మాత్రం స్కూల్లో నాకు నేర్పలేదే – అనిపిస్తుంది. కాబట్టి, జీవితంలో ప్రతీదీ నేర్పించబడదు. మన అంతరంగంలో కనుక అప్రమత్తత ఉంటే, దాని నుంచి అన్నీ లభిస్తాయి. మీకు ఒక కథ వినిపిస్తాను. ఒక పెద్ద దొంగ ఉండేవాడు.చాలా ప్రఖ్యాతిగాంచినవాడు. ఎంత ప్రఖ్యాతిగాంచిన వాడంటే, అతని కూతురికి అతనంటే అమితమైన ప్రేమ ఉండేది. ఎంత మంచి తండ్రి! అలాగే పెద్ద దొంగ! ‘దొంగతనం చేయడం నాకెప్పుడు నేర్పుతావు’ అని ఆమె తండ్రిని అడుగుతూ ఉండేది. సరే అయితే! ఇవాళ ఉదయం చూద్దాం. ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళారు. మొదట ఒక సంపన్నుని ఇంటిని చూద్దాం అనుకున్నారు. గ్రామం లోనే పేద్ద సంపన్నుడు. అక్కడ ఆ ఇంటిని గమనించడం మొదలెట్టారు. ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? ఎప్పుడొస్తున్నారు? ఎప్పుడు చీకటి అవుతుంది? ఇంటికి తాళం ఎప్పుడు వేస్తారు? అలా బాహ్య పరిశోధన చేశారు. రాత్రి ఆ ఇంట్లోకి వెళ్లారు. ఖజానా తాళం తెరచుకోవడానికి సమయం పట్టింది. దానిలో వజ్రాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి. తండ్రి కూతురిని లోపలికి పంపి, లోపల ఉన్నవన్నీ తీయమన్నాడు. పెద్ద ట్రంకుపెట్టెలోకి దూరి ఒకటి తర్వాత మరొకటి తీయసాగింది. ఆ తండ్రి ఏమనుకున్నాడో, పెట్టె మూతను మూసేసి బయట నుండి తాళం వేశాడు. అక్కడి నుండి పారిపోయాడు. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమైంది కదా! ఆమె లోపలి నుంచి టకటక శబ్దం చేసింది. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళు లేచారు. ఒక పనిమనిషి దీపం పట్టుకొని ఆ గదిలోకి వచ్చి ఆ పెట్టె మూత తెరిచింది. ఆ అమ్మాయి చాలా చురుకైన పిల్ల. గబుక్కున ఆ దీపాన్ని ఉఫ్ మని ఊదింది. ఆ చీకట్లో ఇంట్లో నుండి బయటకు పరుగు తీసింది. అలా పరిగెత్తుతూ, పరిగెత్తుతూ, తరుముతున్న గ్రామస్తుల నుండి తప్పించుకుంటూ… ఊరు బయటకు పరిగెత్తి అక్కడున్న బావిలో ఒక పెద్ద బండను పడేసింది. వారంతా బావిలో నుండి వచ్చిన శబ్దానికి ఆ అమ్మాయి బావిలో పడి చనిపోయిందని అనుకున్నారు. ఇప్పుడు మనం బావిలోకి వెళ్లి ఎలా చూస్తాం? రేపు ఉదయం వచ్చి ఆమెను బయటకు తీద్దాం, అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ అమ్మాయి పక్కనే ఒక చెట్టు పైన ఎక్కి కూర్చుని ఇదంతా చూస్తున్నది. తర్వాత ఆ అమ్మాయి తన ఇంటికి వెళ్ళింది. తండ్రిని బాగా తిట్టింది. నన్ను లోపల ఎందుకు బంధించి వచ్చావు అని గొడవ పడింది. నీకు కొంత నేర్పించాలనుకున్నాను. కానీ నీకు నేర్పించే అవసరమే లేదు. నీవు నీ అంతరంగంలో ఎంత అప్రమత్తంగా ఉన్నావో నాకు తెలుసు. జీవితంలో ప్రతీ విషయాన్ని నేర్పించలేం. సందర్భాలు వేరువేరుగా ఉంటాయి. మనకు అప్రమత్తత కావాలనుకుంటే ధ్యానం చేయడం వల్ల మాత్రమే లభిస్తుంది. తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన ధ్యానం నుండి వస్తుంది. తెలివి తక్కువ వారు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు. పని చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత కూడా కొంతమందికి తాము తప్పు చేశామనే విషయం తెలుసుకోలేరు. ధ్యానం అనే మాధ్యమం ద్వారా నేను చేయవలసిన పని సరైనదా, కాదా, ఒప్పా, తప్పా, అనే విషయం ముందే తెలుస్తుంది.
శిశువులపై పర్యావరణ ప్రభావం
నేను పర్యావరణ ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా అంతర్గత వాతావరణంగా మీరు అర్థం చేసుకోండి… మన దేశంలో తల్లి కాబోతున్న అమ్మాయి, ముఖ్యంగా మా ఊరిలో నాకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు, నేను వారి ఉదాహరణను చెప్పగలను. వారు గర్భవతిగా ఉన్నప్పుడు, వారి అత్తమామల ఇంటి నుండి కొన్ని పూజలు చేసిన తరువాత… వారు చాలా ఆనందంగా తమ తల్లిదండ్రుల ఇంటికి వచ్చేవారు. అక్కడ తన తల్లిదండ్రుల ఇంట్లో తాము గర్భంతో ఉన్న సమయాన్ని గడిపేవారు. వారికి ప్రయోజనం ఏమిటి? వారి బాహ్య మరియు అంతరంగ వాతావరణం బాగుంటుంది. ‘ఇలా చేయండి, అలా చేయండి, ఎందుకు కూర్చున్నారు’ అని ఎవరూ అనరు. అత్తమామల ఇంట్లో కూడా అలా ఎవరూ మాట్లాడరు. కానీ మనం స్థిమితంగా ఉండలేం. ఏదో ఒకటి చేస్తూండాలనే కోరిక ఉంటూ ఉంటుంది. ఈ విషయాల గురించి అమెరికాలో ఒక పెద్ద పరిశోధన జరిగింది. దీని పరిశోధకుడు డాక్టర్ బ్రూస్ లిప్టన్. అనంతరం ఆయన ‘బయాలజీ ఆఫ్ బిలీఫ్’ అనే ఒక పుస్తకాన్ని కూడా వ్రాశారు. విశ్వాసంతో మీ జీవావరణం ఎలా మారుతోంది. నమ్మకం ద్వారా మీ శరీరం ఎలా మారుతుంది? గుర్తింపు ద్వారా మన అంతరంగ వాతావరణం ఎలా మారుతుంది? కాబట్టి మీ చుట్టుపక్కల తుపాకీ శబ్దాలు ఒకవైపు మిమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నప్పుడు, మీకు ఎక్కడికీ వెళ్లాలనిపించదు. చనిపోవడానికి అక్కడికి ఎందుకు వెళ్లాలి? అయితే, ఆ సమయంలో కాబోయే తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె అంతర్గత వాతావరణం ఎలా ఉంటుంది? ఆమె ఒత్తిడికి లోనవుతుంది. ప్రజలు ఒత్తిడిలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు వారి రక్త ప్రసరణ చేతులు మరియు కాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మరియు లింబిక్ మెదడు అలాగే జంతుస్వభావ మెదడు అనబడే వెనుక ఉన్న మెదడు వద్ద రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. మెదడు నుంచి విడుదలయ్యే న్యూరో ట్రాన్స్మీటర్లు కూడా అదే పని చేస్తాయి. ఈ న్యూరో ట్రాన్స్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి తల్లి రక్తం ద్వారా, రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా గర్భాశయానికి కూడా చేరుకుంటాయి. పిల్లలకు వెళ్ళే ఆ రక్తం కచ్చితంగా ఒత్తిడి హార్మోన్లతో పిండానికి వెళుతుంది. తరువాత వారి చేతులు, పాదాలు కూడా పొడవుగా తయారవుతాయి. వాళ్ళ చేతులు, కాళ్ళు చురుకుగా ఉంటాయి. అప్పుడు రక్తం ఊపిరితిత్తులకు, ఫ్రంటల్ మెదడుకు వెళ్లాల్సిన చోట, దాని ప్రసరణ తగ్గుతుంది. తద్వారా వారి మానసిక అభివృద్ధి కూడా తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. జీర్ణక్రియలో కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అక్కడ రక్త ప్రసరణ తగ్గుతుంది కనుక. ఆయన అదే అధ్యయనాన్ని మంచి ఇరుగు పొరుగు వ్యక్తులున్న ప్రదేశాల్లోనూ చేశాడు. ఎక్కడ తల్లికి మంచి సంరక్షణ అందుతుందో… ఎక్కడ వాతావరణం సామరస్యంగా ఉంటుందో, బయట మరియు లోపల, అక్కడ ఆ పిల్లల పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. దాన్ని వారి అభిజ్ఞా సామర్థ్యం అని పిలవండి లేదా చురుకుదనం అని పిలవండి, అది మెరుగుపడుతుంది. పూర్వకాలంలో, ‘భగవద్గీత చదవండి… మీకు ఏ మత విశ్వాసం ఉందో దానికి కట్టుబడి, ధ్యానం కూడా చేయండి. మంచి వాతావరణంలో ఉండండి’ అని చెప్పేవారు. మంచి సంగీతం వినండి. ఆవేశపూరిత సంగీతం మరియు డిస్కో సంగీతం పిల్లలలో కూడా చెడ్డ మానసిక స్థితిని సృష్టిస్తాయి. మంచి అంతర్గత వాతావరణాన్ని ఎలా సృష్టించాలి? నాకయితే ధ్యానం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.
08-04-23
అంతరంగంలో శూన్యత సృష్టించుకోండి
మనం చాలాసార్లు వర్షం ఎలా పడుతుందని ఆలోచిస్తూంటాం. మన దేశంలో వేసవి కాలం తరువాత వానలు పడతాయి. ఎండ వలన ఏం జరుగుతుంది? వేడి గాలి పైకి వెళ్తుంది. క్రింద శూన్యత ఏర్పడుతుంది. మేఘాలు అక్కడికి ఆకర్షించబడతాయి. ఉష్ణోగ్రత తగ్గడం వలన శీతలీకరణ జరిగి వర్షం కురుస్తుంది. ఇది చాలా సరళంగా, సహజంగా జరిగే ప్రక్రియ. నేను ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను? మనలో చాలామందిమి చాలాసార్లు భగవంతుని ఆశీస్సుల కోసం యాచిస్తుంటాం. ప్రభూ! మాపై దయ చూపించండి. మీరు చాలా దయామయులు! భగవంతుని ఇలా స్తుతిస్తూ ఉంటాం. కానీ ఆయనపై ఎటువంటి ప్రభావం ఉండదు. మన విజ్ఞాపనల ప్రభావం ఆయనపై పడాలంటే మనవైపు నుండి హృదయంలో ఎంత శూన్యత ఉంది? వేసవి కాలం ఈ శూన్యత వాతావరణంలో సహజంగానే ఏర్పడుతుంది. మనలో ఈ శూన్యత ఎలా ఏర్పడుతుంది? లోపల చాలా నిండిపోయి ఉంది. లోపల నిండిఉన్న దాన్ని బయటకి పంపి శుభ్రం చేస్తేనే కదా, లోపల కాస్త చోటు ఏర్పడేది! అప్పుడే కదా! భగవంతుడి కృప, కానుక లేదా మరొకటి అనండి, అది మనపై ప్రవహించేది. దాన్ని తోసి, బలవంతం చేసి ఎవ్వరికీ ఇవ్వలేం. తపస్సు చేసి మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి. తపస్సు అంటే వేడి కదా! మన సంస్కృత భాషలో ఎంతో లోతైన అర్థం ఉన్న మంచి పదాలు ఉన్నాయి. తపస్సు – తాపంతో ఎందుకో జోడించారు. అక్కడ కేవలం శీతలంగా మాత్రమే ఉంటుంది. తపస్సుతో కాకుండా మరే విధంగానూ భగవంతుని కృప, అనుగ్రహం పొందలేమని… చాలా తేలికైన పదాలతో మనకు అర్థం అయ్యే విధంగా చెప్పారు. తమను తాము సన్నద్ధం చేసుకోవాలి అంటూ ఉంటారు కదా! స్వర్గానికి వెళ్లడానికి సిద్ధమౌతున్నారు అని. ఎందుకు? స్వర్గం అనే ప్రదేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ భగవంతుడు ఉంటాడో అదే స్వర్గం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ. మన హృదయం పవిత్రంగా ఉంటే, ఖచ్చితంగా భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడు. కాబట్టి స్వర్గం మన హృదయంలోకే దిగి వస్తుంది. స్వర్గానికి వెళ్ళే అవసరం ఉండదు. ఇవన్నీ మన గురువర్యుల సందేశాలు. వీటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంసిధ్ధత! మనం కేవలం సిద్ధంగా ఉండాలి. నాలో ఆ శూన్యత కలగాలి అని పట్టుదలతో ప్రయత్నం చెయ్యాలి. ఎవరినీ బలవంతంగా నాకు ఇది కావాలి అని అనలేం. అందుకే భగవద్గీతలో చెప్పినట్లు – కర్మణ్యేవాధికారస్తే… బ్రహ్మవిద్య కోసం ప్రయత్నం చెయ్యడం మన కర్తవ్యం. దాని ఫలితం మన బాధ్యత కాదు. మా ఫలేషు కదాచన… ఫలితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు. అది శరణాగతి భావన. శరణాగతి వల్లనే మన హృదయంలో ఆ శూన్యత ఏర్పడుతుంది. ఇలా మొదటి మూఢ నమ్మకం ఆశీర్వాదం గురించి. రెండవ మూఢ నమ్మకం – దర్శనం గురించి. సాధు సత్పురుషులను ఒకసారి దర్శనం చేసుకుంటే పని జరిగిపోతుందనే భావన. ఇది అంత తేలికైనది కాదు. బాబూజీ అనేవారు – నన్ను కాకులు, కోతులు, గాడిదలు అన్నీ చూస్తూ ఉంటాయి. మీరు కూడా దర్శిస్తూ ఉంటారు. వ్యత్యాసం ఏమిటి? పరివర్తన లేనప్పుడు గాడిద, గాడిద గానే ఉంటుంది. కోతి, కోతి గానే ఉంటుంది. మీరు కూడా ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మార్పు అనేది లోపల నుండి రావాలి. దర్శనం చేసుకున్న పిమ్మట వారి నుండి స్పూర్తిని పొంది, వారిలా మారలేకపోతే ఆ దర్శనం వలన ఉపయోగం లేదు. వర్షం పడుతుంది, కానీ మీరు విత్తనం నాటకపోతే ఏమీ జరగదు. ఏం నాటాలి? మన ఆలోచనలలో ఎటువంటి విత్తనం నాటాలంటే… ‘నేను ఇలా అవ్వాలి’ అనే సంకల్పం చేసుకోవాలి. ఇలా అవ్వాలి అనే సంకల్పం చేసుకోవడాన్నే హృదయంలో విత్తనం నాటడం అని అంటారు. ‘నేను మారాలి’. ఏమవ్వాలి? దేని నుండి విముక్తి పొందాలి? ఇది మీకు తెలిసినదే. రాత్రిపూట ప్రార్థన చేసుకొనేటప్పుడు… ‘నాలో ఈ లోపాలు ఉన్నాయి’ అని భగవంతుడికి విన్నవించుకోండి. అవి పొలంలో కలుపు మొక్కల వంటివి. కలుపుని తొలగించాలి. కలుపుని పంజాబీలో ఏమంటారు? కట్ పట్… మీకు అర్థం అయ్యింది కదా! వాటిని తొలగించాలి. మనలోని లోపాలను తొలగించాలి. తరువాత మంచి విత్తనాలు నాటాలి. మీరు కనుక ఇది చెయ్యకపోతే, అక్కడ ఒక అడవి తయారవుతుంది. అడవి తయారయ్యింది అంటే, ఇక మన చేతిలో ఏమీ ఉండదు. తరువాత మరింత ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ఒక ఏడాది పాటు కలుపు తీయకపోతే, మరుసటి సంవత్సరం మరింత ఎక్కువ పెరుగుతుంది. మనలో ఏర్పడే ఈ లోపాల పెరుగుదల, కాలుష్యం, ఆలోచనల కాలుష్యం, భావనల కాలుష్యం, వీటి వలన బాహ్యంగా కాలుష్యం ఏర్పడుతుంది. మనలో లోభం లేదా దురాశ పెరగడం వలన, చమురు శుద్ధి కర్మాగారమో, రసాయన కర్మాగారమో స్థాపిస్తాం. తద్వారా పారిశ్రామిక వ్యర్థాలు కూడా వస్తాయి. వ్యర్థాలని గాలిలోకి, నీటిలోకి, భూమిలోకి వదిలి పెడతాం. ఇవన్నీ లోభం వల్లనే. అందుకనే బాబూజీ మహరాజ్ అనేవారు… మన కోరికలే మన ఉన్నతికి ఆటంకాలు అని. చెప్పడానికి బాగానే ఉంటుంది. ఈ లోభాన్ని వదిలించుకోవడం ఎలా? సహజమార్గ పద్ధతి ప్రకారం, మనం దేన్నీ వదులుకోనవసరం లేదు. అన్నీ తమంతట తామే సహజంగా జరుగుతాయి. ఒకరితో జత కడితే… అంటారు కదా, ఒకరు జతగా ఉంటే అందరూ తోడు ఉన్నట్లే, అదే అందరితో జత కడితే ఎవ్వరూ తోడు లేనట్లే! ఒకరిని నమ్ముకుంటే, మిగతా పని అంతా వారే చూసుకుంటారు. మన పని ఏమిటి? కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడమే కదా? అంతకన్నా ఇంకేమన్నా చేస్తున్నామా? మనందరం కళ్ళు మూసుకుని కూర్చోగలం కదా! ప్రేమతో కళ్ళు మూసుకుంటే… మన జీవితాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు జరగవచ్చు. లేకపోతే ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్తాం. రావడం, పోవడం, రావడం, పోవడం అనే ఈ ప్రహసనం ఇలాగే కొనసాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దర్శనం గురించి ఇంకా చాలా చెప్పవచ్చు. జనులు భౌతిక దర్శనంతో సంతోష పడతారు. అలా ఆనంద పడవద్దు. కరచాలనం చేశా, నమస్కారం చేశా, తల మీద వారి చెయ్యి పెట్టించుకున్నా! ఎప్పటి వరకు లోపల నుండి మార్పు రాదో, అప్పటి వరకు ఏమీ జరగదు. హృదయ ద్వారాలు తెరవడం అనేది ఏదో శస్త్రచికిత్స బయట నుండి చెయ్యడంలా ఉండదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ భూమ్మీద నడిచారు. అయితే వారిని స్వయంగా చూసిన వారు సైతం ఎంతమంది వారిని గుర్తించారు? ఎవ్వరూ గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా వారు అవతార పురుషులు మాత్రమే, అంతకంటే ఇంకేమీ కాదు కదా? తరువాత ఏమిటి? మీ బుర్రలో ఏదన్నా ప్రణాళిక ఉందా? ఒకవేళ మీరు ఆ సమయంలో అక్కడ ఉన్నా, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారమని… గుర్తు పట్టినా, మన తదుపరి కార్యాచరణ ఏమిటి? ఆలోచించారా? అదే మూర్ఖత్వంతో వారిని అనుసరించి పూజలు చేస్తూ ఉంటారా? ఎక్కడి నుండి అనుసరిస్తారు? వెనక వెనకే తిరుగుతారా? హృదయంతో వారిని అనుసరించండి. కాబట్టి వారిని అనుసరించాలంటే మీ హృదయంతో అనుసరించండి. అలాగని వారు ఇప్పుడు లేరని కాదు. వారు అన్నిచోట్లా ఉన్నారు. మునుపటి కన్నా ఇప్పుడు ఇంకా తేలిక. హృదయంతో అనుసరించండి. నాలో ఇటువంటి మూర్ఖత్వం, లోపాలు ఉన్నాయని కొంచెం రోదించండి. వారి సహాయంతో వాటి నుండి విముక్తి పొందగలుగుతాం. మునుపటి కన్నా మంచి వ్యక్తులం అవ్వగలం. అనంతరం మనం దివ్యత్వంగా మారే అవకాశం కూడా ఉంది.
09-04-2023
జనన-మరణ, ధ్యాన వైఖరులపై దాజీ వివరణ
అయితే మరి ఎలా? బ్యాంకులో డబ్బు ఉంటేనే కదా మరొకరికి ఇవ్వగలరు… అవునా! మీ హృదయంలో ఆధ్యాత్మిక సంపద లేనట్లయితే పిల్లలకు ఎలా ఇవ్వగలరు? దాన్ని చేతితో తీసి ఇవ్వలేం. ఎందుకంటే అది భౌతికమైన సంపద కాదు. మీరు కూర్చునే పద్ధతి, నిద్రపోయే పద్ధతి, మాట్లాడే పద్ధతి, ఒకరినొకరు చూసుకునే తీరు… ఇతరులు చెప్పేదాన్ని వినే పద్ధతి, ఇవన్నీ పిల్లలు పరిశీలిస్తారు. వాళ్లు మీలాగే ప్రత్యేకించి తల్లిలాగే తయారవుతారు. గర్భధారణ సమయం నుండి మూడు, నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా వారు ప్రతిదీ గ్రహిస్తారు. మంచి, చెడు అన్నీ. తర్వాత మార్చడం చాలా కష్టం. లాలాజీ మహరాజ్ అంటుండేవారు… మీ కుటుంబంలో ఉన్నతాత్మల పుట్టుకకు అవసరమైన వాతావరణం గర్భధారణ కంటే ముందే ప్రారంభమవుతుంది అని. గర్భధారణ జరిగేటప్పటికే చాలా ఆలస్యమైనట్లు. ఇది ఎలా జరుగుతుందో తెలియజేస్తాను. నేను అమెరికాలో ఉండగా తరచూ ఇండియాకి ప్రయాణిస్తూ ఉండేవాడిని… అప్పుడు మాస్టర్ ను ఇలాంటివే ప్రశ్నిస్తూ ఉండేవాడిని. ఒక పిల్లవాడికి ఏది ముఖ్యం? ఇండియాలో గర్భధారణ జరిగితేనే ఉన్నతాత్మలను పిల్లలుగా పొందగలమా? అంటే ప్రజలు ఈ ఆలోచన కలిగి ఉంటారు… ఏమిటంటే యూరప్, యూఎస్ వంటి దేశాలలో గర్భధారణ జరిగితే పిల్లలు అక్కడి సంస్కారాలు, ప్రకంపనలను గ్రహిస్తారనే భావన. ఏది మంచిది? ఇండియా లేక బయట దేశాలా? నేను అడిగిన రెండవ ప్రశ్న జ్యోతిష్యం. పుట్టిన సమయం, ప్రదేశం మొదలైనవి… ఆయన ఇవేవీ కాదన్నారు. జ్యోతిష్యం కొంతమేరకు ముఖ్యమైనదే. మీరు ఫలానా ముహూర్తమనే నిర్ణయించుకున్నప్పటికీ, ఆత్మ అనేది తనతోపాటు తెచ్చుకునే సంక్లిష్ట సంస్కారాల నిర్మాణం తప్ప మరేమీ కాదు. ఒకసారి జన్మ తీసుకున్నాక, సంస్కారాలు ఇప్పటికే ఉన్నాయి. చాలావరకు తనదైన సొంత విధితో అది జన్మిస్తుంది. అందువల్ల ఎప్పుడు, ఎక్కడ బిడ్డ జన్మించిందనేది పెద్ద విషయం కాదు. అది తన సామాను తీసుకుని అప్పటికే వచ్చేసింది. అందువల్ల ముఖ్యమైన విషయం ఏమిటంటే మంచి సంస్కారాలు గల ఆత్మను ఎలా ఆహ్వానించాలి? అంతేకాకుండా ‘నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు’, అని చెప్పడానికి భగవంతుడు ట్రాఫిక్ పనిచేసే వ్యక్తి కాదు అని ఆయన అన్నారు. అది ఇనుప ముక్కలను ఆకర్షించే అయస్కాంతం లాంటిది. ఎటువంటి తెలివి అవసరం లేకుండా పని జరిగిపోతుంది అంతే! గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల ప్రకంపనా స్థాయిని బట్టి… వారి ప్రవర్తనను బట్టి, వారు ఒకరి పట్ల ఒకరు గౌరవభావంతో ఉన్నారా? పూజ్యభావంతో ఉన్నారా? లేదా ఒకరినొకరు తృప్తి పరచుకుంటున్నారా? లేదా మరింత తక్కువ స్థాయిలో ఉన్నారా? ఈ మొత్తం ప్రక్రియలో వివిధ స్థాయిల్లో మంచి, చెడు ఉన్నాయి. ఇంకా ఆయన ఏమన్నారంటే, దానికి బదులుగా గర్భధారణ సమయంలో వారి వైఖరి, దానికి తగ్గ ఆత్మను ఆకర్షిస్తుంది. మీరు పశు ప్రవృత్తితో ఉన్నట్లయితే, తామసికమైన ఆత్మను ఆహ్వానిస్తారు. పూజ్య భావంతో ఉన్నట్లయితే, సాత్వికమైన ఆత్మను ఆహ్వానిస్తారు. తర్వాత మీరెక్కడ జన్మనిస్తారు అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి గర్భధారణ సమయంలో వైఖరి ఆత్మ యొక్క నాణ్యతను నిర్ణయిస్తుంది. మనం చనిపోయే సమయంలో మన ప్రకంపనా స్థాయి ఎలా ఉంటుందో అలాగన్నమాట. మీ ప్రియతముని వద్దకు వెళుతున్నట్లు మీరు అనుభూతి చెందినట్లయితే… మీరు ఆ సమయంలో భావనలను మార్చలేరు. మనం వెళ్లక తప్పదని గ్రహించినప్పుడు ప్రేమతో, పూజ్యభావంతో వెళ్లండి. మీరు భయపడి వెళ్లినట్లయితే, కోపం తెచ్చుకున్నట్లయితే… లేదంటే పూర్తి జీవితాన్ని ఒకసారి అవలోకించితే… ఇది చేయలేదు, అది చేయలేదు, వారిని క్షమించమని అడగాలి కానీ అడగలేదు… వీరికి చెడు చేశాను. ఇలా మొత్తం గుర్తొస్తుంది. మీ మనసులో మీరేం చేశారు? ఏం చేయలేదు? చేసినవి ఎంత చెడుగా చేశారు? చేయవలసి కూడా చేయనివి. వాళ్లే తిరిగి ఈ లోకానికి వస్తారు. రీసైకిల్ అవుతారు. భగవంతుడు ‘ఈ జన్మలో నీవు పూర్తి చేయనివి పూర్తి చేయడానికి మరొక జన్మ తీసుకో’ అంటాడు. మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు. అక్కడికి కూడా తీసుకువెళ్లడానికి ఎవరూ రారు. మన ప్రకంపనా స్థాయి బాగా భారంగా, పాప భూయిష్టంగా ఉంటే అదే ప్రకంపనా స్థాయి గల లోకం లోనికి వెళతాం. అలాగే ఎవరైతే తేలికగా, పూజ్యభావంతో ఉంటారో వారు ఉన్నత లోకాలకు వెళతారు. మరింత పవిత్ర హృదయం ఉన్నవాళ్లు మరింత పై స్థాయిలకు వెళతారు. మీరు మేఘాలను చూస్తారు కదా! కొన్ని ఎర్రగా, కొన్ని తెల్లగా, కొన్ని నల్లగా రకరకాలుగా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి? అలాగే వాటి ఎత్తు కూడా వేరువేరుగా ఉంటుంది. అవి తయారైన ఎత్తులు వేరుగా ఉంటాయి. లౌకికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా ఇది నిజం. ఉన్నత లోకాలలో ఉన్నతాత్మలు, నిమ్నలోకాలలో నిమ్న ఆత్మలు ఉంటాయి. ఇదిచాలా సరళమైన విషయం. అందువల్ల వైఖరి చాలా ప్రముఖమైనది. మన ధ్యానంలో కూడా ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు పొద్దున్న చేసుకోబోయే ధ్యానానికి ముందు రోజు రాత్రే నేను పొద్దున్నే ధ్యానం చేసుకోవాలని తయారవడం ప్రారంభిస్తే… మనసు ఎంతో ఆత్రుతతో, తపనతో వేచి ఉంటుంది. మీరు ధ్యానానికి అటువంటి స్థితిలో కూర్చోండి. చూడండి! అటువంటి ఉదయపు ధ్యానంలో ఎటువంటి విశేషాలు సంభవిస్తాయో! ఈ ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వచ్చింది, ఇదేమీ ఉండదు. ‘బలవంతంగా నా స్నేహితుడు పిలిచాడు. అందుకే వచ్చాను’. ఇలా అంటే అయిపోయినట్లే. అది పనిచేయదు. వస్తే శ్రద్ధగా చేయండి. అప్పుడు చూడండి, అది మనల్ని ఎక్కడిదాకా తీసుకెళుతుందో!
దేవతలు ధ్యానం ఎందుకు చేస్తారు?
ఇది మన దేశ సంస్కృతికి సంబంధించిన విషయం. సినిమాలలో కానీ, చిత్రపటాలలో కానీ శంకర భగవానుడు… యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కానీ ధ్యానముద్రలో కనిపిస్తారు. హనుమంతుని చూడండి! చిత్రపటంలో శ్రీరాముని పాదాల చెంత, ధ్యానంలో నిమగ్నుడై కనిపిస్తాడు. నేను చిన్నప్పుడు రామాయణం చదివేవాడ్ని కాదు కానీ, రామాయణంలో వుండే చిత్రాలను ఆసక్తిగా చూసేవాడ్ని. ఆ చిత్రాలన్నిటిలోకి నన్ను ఆకర్షించిన చిత్రం ఒకటుంది. ఆ చిత్రంలో సీతమాత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు నలుగురూ కలిసి ధ్యానం చేస్తుంటారు. కైలాసంలో ధ్యానముద్రలో వున్న శంకర భగవానుడి పటం, మా నాన్నగారు మా ఇంటి వాకిలికి ఎదురుగా తగిలించారు. ఇలా వేల సంవత్సరాలుగా వివిధ రకాలుగా ఈ చిత్రాలు చిత్రీకరించారు. కానీ వీటి అన్నింటిలోనూ సారం, భావం ఒక్కటే… అదే ధ్యానం! శంకరునికి ధ్యానం చెయ్యవలసిన అవసరం ఏమిటి? ఆయనే స్వయంగా దేవుడు కదా! అదే విధంగా శ్రీరామచంద్రునికి, సీతమాతకి, శ్రీకృష్ణుడికి ధ్యానం చెయ్యవలసిన అవసరం ఏం వచ్చింది? ఎవరిపై ధ్యానం చేసేవారు? ఇది ఆలోచించవలసిన విషయం. జవాబు లభించినా, లభించక పోయినా, మీ హృదయంలో తృష్ణను జాగృతం చేయండి. ఆ దేవీదేవతలే ధ్యానం చేస్తున్నారంటే, తుచ్ఛ మానవులమైన మనం కూడా ధ్యానం చేయాలి అనే ప్రేరణ పొందగలం. ధ్యానం వల్ల మన హృదయం, మనసు ధ్యానమయం అవుతాయి. అలాగే మన స్వభావం కూడా ధ్యానమయం అయితే ఎంతో మేలు జరుగుతుంది.
జీవితం అంటే ఏమిటి?
నాకు సంబంధించినంత వరకు జీవితం అంటే మనల్ని మనం అధిగమించేందుకు దొరికిన ఒక అవకాశం. మనల్ని మనం అధిగమించడం అంటే మంచి మానవులుగా రూపాంతరం చెందడం. అంటే మనం వికాసం చెందడం అని కూడా అర్థం. ఇదే మానవ పరిణామం. మానవ స్థాయిలో పరిణామం ఎలా చెందాలి? అలాగే మానవ స్థాయిలో దేన్ని సుసాధ్యం చేసుకోగలం? అని తెలుసుకోవడమే జీవితం. భౌతికంగా డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతపరంగా చూస్తే… కొన్ని మిలియన్ సంవత్సరాల అనంతరమే పరిణామం సాధ్యమయ్యింది. కానీ ఇప్పుడు మన వద్ద అన్ని మిలియన్ సంవత్సరాల సమయం లేదు. కాలంతో పాటు మనకు వయస్సు పెరుగుతుంది. మనం వృద్ధులం అవుతామంతే! మనకు మూడు శరీరాలు ఉంటాయి. అందులో ఒకటి భౌతిక శరీరం. ఈ శరీరం పరిణామం చెందలేదు. వృద్ధాప్యానికి లోనవుతుంది అంతే. రెండవ శరీరం గురించి తర్వాత మాట్లాడుకుందాం. మూడవది ఆత్మ. శాస్త్రాలు దీనినే కారణ శరీరం అంటాయి. ఈ ఆత్మ లేదా కారణ శరీరం, ఇది ఎన్నటికీ పరిణామం చెందదు. ఎందుకంటే కారణ శరీరం పరిపూర్ణమైనది. మార్పు చెందనిది. పరిపూర్ణం అయినదాన్ని ఇంకా పరిపూర్ణం చెందించలేము కదా! ఈ మూడు శరీరాలలో స్థూల శరీరం పరిణామం చెందలేదు. కారణ శరీరం కూడా పరిణామం చెందదు. అయితే మన జీవితంలో పరిణామం చెందేది ఏది? అది మన సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీర పరిణామం గురించి తెలుసుకోవాలి అంటే, ముందుగా ఈ సూక్ష్మ శరీరం దేనితో తయారయ్యిందో తెలుసుకోవాలి. సూక్ష్మ శరీరం నాలుగు విషయాలతో తయారు చేయబడిందని మన ఋషులు చెప్తారు. అవి చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ నాలుగూ పరిణామం చెందినప్పుడు మాత్రమే, మనం పురోగమిస్తాం. ఇవి నాలుగూ క్రియాత్మక తత్వాలు కనుక క్రియాత్మకంగా మాత్రమే ఇవి పరిణామం చెందుతాయి. మనస్సు, ఆంగ్లంలో దీన్నే మైండ్ అంటారు. మనస్సు ప్రాధమిక కర్తవ్యం ఆలోచించడం. అన్ని రకాల చెత్త ఆలోచనల నుండి ఒక క్రమబద్దమైన స్థితికి చేరుకోవడం. అంటే నిర్మాణాత్మకమైన ఆలోచనా స్థితికి చేరడం… తరువాత మనస్సు హృదయం నుండి పనిచేయడం ప్రారంభించినప్పుడు, అనుభూతి చెందడం మొదలు అవుతుంది. అంటే మనస్సు పరిణామం చెందడం అంటే ఆలోచన నుండి అనుభూతికి చేరుకోవడం. ఈ అనుభూతి స్థిరపడినప్పుడు, ‘ఇక ఈ అనుభూతి చాలు! నేనే ఆ అనుభూతిగా రూపాంతరం చెందితే బావుంటుంది అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం… మీకు చాలా ధనవంతుడైన ఒక స్నేహితుడు ఉన్నాడనుకుందాం. ఒకసారి ఒక 3, 4 నెలల పాటు మీరు అతని నివాసంలో అతనితో ఉండవలసి వచ్చింది. మీరు 3 నెలల పాటు ఆనందంగా అతని ఆతిథ్యాన్ని స్వీకరించి మీ స్వగృహానికి తిరిగి వచ్చారు. కానీ తిరిగి వచ్చిన అనంతరం మీ మనఃస్థితి ఎలా ఉంటుంది? నా స్నేహితుని యొక్క గొప్ప ఆతిథ్యాన్ని ఆనందంగా అనుభవించాను. నేను కూడా అతనిలా ధనవంతుడిని అయి ఉంటే ఎంత బావుండేది అనిపిస్తుంది. అంటే ఆతిథ్యాన్ని ఆనందంగా అనుభవించడమే కాక ఆ అనుభూతి స్వంతమైతే బాగుండునని భావించడం. దైవత్వాన్ని క్షణమాత్రం అనుభూతి చెందడం లేదా స్నేహితుల బలవంతం మీద ఇటువంటి ఆశ్రమాలను ఎప్పుడో ఒకసారి సందర్శించడం… ఎంతో కొంత అనుభూతి చెందడం… వీటన్నిటి కంటే దైవత్వంగా పరిణామం చెందడం మంచి విషయం. దైవత్వాన్ని అప్పుడప్పుడు సంగ్రహావలోకనం చేయడం కంటే దైవత్వంగా రూపాంతరం చెందడం ప్రధానం. ‘ఆలోచన నుండి అనుభూతికి, అనుభూతి నుండి ఆ అనుభూతిగా రూపాంతరం చెందడం’ ఇదే పరిణామక్రమం అని యోగ శాస్త్రాలు చెబుతాయి. మీరు దైవత్వంగా రూపాంతరం చెందినప్పుడు… ఈ విశ్వం లోని సిరిసంపదలు అన్నీ మీ పాదాల ముందు మోకరిల్లుతాయి. కానీ సమర్థుడు, మేధావి అయిన వ్యక్తి… ఈ దైవ కానుకలను కూడా త్యజిస్తాడు. అన్నిటి నుండీ విముక్తుడు అవుతాడు. నిజమైన సన్యాసం అంటే అదే. రెండవది బుద్ధి. దీని గురించి క్లుప్తంగా చెప్తాను. పరిణామక్రమంలో బుద్ధి, మేధాశక్తిగా రూపాంతరం చెందుతుంది.కాలక్రమేణా అది అంతర్దృష్టిగా తయారవుతుంది. కొంతమందిని మీరు ప్రశ్నించినప్పుడు… వారు మేధోపరంగా కాక అంతర్దృష్టితో సమాధానం చెప్పి మీకు సరైన మార్గదర్శనం చేస్తారు. ఈ అంతర్దృష్టి తదుపరి దశలో జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. అహం కూడా పరిణామం చెందుతుంది. మనస్సే మన ప్రధాన శత్రువు అని అందరూ అంటారు. అహంకారాన్ని కూడా అలానే భావిస్తారు. నిజానికి మనస్సు మన ప్రధాన శత్రువే కాదు మనకు మంచి స్నేహితుడు కూడా. అహంకారం కూడా మనస్సు లాంటిదే. మీరు కనుక అహంకారిగా మారితే, ఆ ఆహంకారం మిమ్మల్ని నాశనం చేస్తుంది. కానీ అదే అహాన్ని నిర్మాణాత్మకంగా వినియోగిస్తే, దాన్ని మీరు సద్వినియోగపరచినట్లే. నేను ఒక మంచి టీచర్ ను లేదా ఒక మంచి నర్స్ ని లేదా ఒక మంచి డాక్టర్ ని… లేదా ఒక మంచి గృహిణిని లేదా ఒక మంచి తల్లిని అవుతాను అన్న ఉద్దేశ్యంతో అహాన్ని సద్వినియోగం చేస్తే… వ్యక్తిగత, స్వీయ అహంభావ ప్రవృత్తుల నుండి మీరు ఒక దైవికమైన, సార్వజనీనమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. ఇవి మూడూ మీ స్వీయ చైతన్యంతో ముడిపడినప్పుడు మీరు ఒక సార్వజనీన వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. అందరికీ ఆమోదయోగ్యులు అవుతారు. విశ్వ చైతన్యంలో భాగస్వాములు అవుతారు. క్లుప్తంగా చెప్పాలంటే, స్వీయ చైతన్యం నుండి విశ్వ చైతన్యం దిశగా పయనించడమే జీవితం. మంచి ప్రశ్న అడిగారు. ధన్యవాదాలు.
“మీ హృదయం చెప్పేది వినండి”
చేయవద్దు. హృదయం దాన్ని ఒప్పుకోనప్పుడు సహజంగానే చేయకూడదు. అదే నిస్సహాయ స్థితిలో చేయవలసి వస్తే, ఆ విషయం వేరు. కుటుంబంలో శాంతి కోసం, ఒక్కోసారి మనసు చంపుకొని ఒప్పుకుంటాం. ఒక్కోసారి మనసు చంపుకొని ఒప్పుకుంటాం. అలా ఒక పరిమితి వరకు ఒప్పుకుని. ఇక ఆ తరువాత ఒప్పుకోవద్దు. హృదయాన్ని అనుసరించి పనిచేసినప్పుడు, జీవితంలో ఏమేం అనుభూతి చెందామో ఆ రెండింటి పరిణామాలు ఎలా ఉంటాయన్నది జాగ్రత్తగా చూడండి. ఎవరినీ అడిగే అవసరమే లేదు. అంతరంగంలో కాస్త పరిశీలించి చూడండి. నేను నా హృదయం చెప్పింది చేయకపోవడం వలన కలిగిన పరిణామాలు ఏంటి? ఇది నేరుగా ఒక పరిష్కారం.
అందరూ కలిసి ధ్యానించండి
ఈమధ్య బరోడా లోని ఎమ్ ఎస్ యూనివర్సిటీలో పరిశోధనలు కూడా జరిగాయి. కుటుంబ సభ్యులందరూ ధ్యానం చేసే కుటుంబాలు, ఎవరూ ధ్యానం చేయని కుటుంబాలు…కుటుంబంలో భర్త ధ్యానం చేస్తాడు, భార్య చేయదు లేదా భార్య ధ్యానం చేస్తుంది కానీ భర్త చేయడు… వారు ఈ కుటుంబాల యొక్క ఆనందకర సూచీని తయారు చేశారు. సహజంగానే అందరూ కలిసి ధ్యానం చేసే కుటుంబాలలో ఆనందం ఎక్కువగా ఉంది. విచిత్రమైన విషయం ఏమిటంటే ధ్యానం చేయని కుటుంబంలోని వారు… కుటుంబంలో ఒకరు ధ్యానం చేసే కుటుంబాల కంటే సంతోషంగా ఉన్నారు. కుటుంబంలో ఒక్కరే ధ్యానం చేసేవారు ఇంటి మొత్తానికి లక్ష్యంగా మారతారు. ‘ఎటువంటి వ్యక్తి! వింత మనిషి లాగ ఉన్నారు’ అని భావిస్తారు. అందరూ వారిని పక్కకు పెడతారు. అలా అంటే ఆనందం, శాంతి ఎలా లభిస్తుంది? మీరు వేరు, మీరు వేరు అని వారిని నిందిస్తూ, వారిపై దాడి చేస్తూ ఉంటారు. కాబట్టి ధ్యానించండి. ఇంట్లో అందరూ కలిసి ధ్యానం చేస్తే బాగుంటుంది. మేము బ్రైటర్ మైండ్స్ పిల్లలకు చాలా విషయాలు నేర్పిస్తాం. పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు. వారి జ్ఞాపక శక్తి ఎక్స్ఐపి టెక్నిక్ తో వృద్ధి చెందుతుంది. కళ్ళు మూసుకొని కూడా వారు చదవగలుగుతారు. ఏ కుటుంబాలలో తల్లిదండ్రులు ధ్యానం చేయరోఆ పిల్లలు నేర్చుకుంటారు, కానీ రెండు మూడు నెలలలో మరచిపోతారు. ధ్యానం చేసే కుటుంబంలోని వారు పిల్లల యొక్క బ్రైటర్ మైండ్స్ మీద కూడా శ్రద్ధ పెడతారు. ఆ పిల్లలకు బ్రైటర్ మైండ్ టెక్నిక్ జీవితాంతం గుర్తుండి పోతుంది.
సిట్టింగ్ ల మధ్య తారతమ్యం ఉంటుందా?
ఒకే ప్రిసెప్టర్ వద్ద మీరు మరలా మరలా సిట్టింగ్ తీసుకోండి… లేదా వేరే వేరే ప్రిసెప్టర్ల వద్ద సిట్టింగ్ తీసుకోండి. అనుభూతి తప్పకుండా మారుతూ ఉంటుంది. మాస్టర్ గారి ముందు కూర్చుని సిట్టింగ్ తీసుకున్నప్పుడు కూడా అనుభూతి వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకే మానసిక స్థితిలో, ఒకే విధంగా ఉండం. ఇలా చెప్తుంటారు కదా! నది ప్రవహిస్తూ ఉంటుంది, నది యొక్క ప్రవాహం లేదా తరంగాలు ఎప్పుడూ ఒకేవిధంగా వెనక్కి రావు! మన ఆలోచనా ప్రవాహం దానికంటే సూక్ష్మంగా, వేగంగా ఉంటుంది… కాబట్టి మనలోని అంతరంగ స్థితి మన ఆలోచనలతో పాటు ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క ప్రిసెప్టర్ వద్ద సిట్టింగ్ తీసుకున్నప్పుడు మీకు అనేక రకాలైన అనుభూతులు తప్పకుండా కలుగుతాయి. అది సహజం.
నిరంతర స్మరణ
ఎలాగైతే అమ్మ లేకుండా పిల్లలు ఉండనే ఉండరో… అలాగే మనం సరైన రీతిలో ధ్యానం చేసినప్పుడు మనలో పెంపొందిన స్థితి మనలను విడిచి వెళ్ళదు. ఆధ్యాత్మిక స్థితి మన మనసును దివ్యత్వం వైపు తీసుకెళ్తుంది. అప్పుడు ఎటువంటి స్థితి పెంపొందుతుంది అంటే, ఆ స్థితి నుండి దూరం అవ్వడానికి మనస్కరించదు. మనం ఏ పని చేస్తున్నా కూడా, ఉదాహరణకు మనం ఉదయం ధ్యానం చేస్తాం. ధ్యానం తర్వాత పెంపొందిన స్థితిని కళ్ళు తెరిచిన తర్వాత రెండు, మూడు లేదా ఐదు నిమిషాలు మీరు ధ్యానం చేసిన చోట అలానే కూర్చుని… ఈ స్థితిని రోజంతా నిలుపుకోవడంపై దృష్టి పెట్టండి. అది మన స్వభావంగా ఎలా మారుతుందో చూడండి. ప్రతిరోజు కొత్త కొత్త అనుభూతులు కలుగుతూ ఉంటాయి. వాటిని మీరు మీ స్వభావంలో ఇముడ్చుకోండి. అప్పుడు మనలో నిరంతరం మార్పు కలుగుతూ ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసేవారైనా లేదా వంట చేసేవారైనా… కేవలం ఒకసారి నేను భగవంతునితో అనుసంధానమయ్యాను అని ఒక సంకల్పం చేసుకోండి. తరువాత ఆ పని మారి వేరే పని చేస్తున్నారు. లాండ్రీలో బట్టలు వేయాలి లేదా ఎవరైనా క్లయింట్ తో మాట్లాడాలి. ఆ సమయంలో మరలా భగవంతునితో అనుసంధానమై చూడండి. నేను వారితో అనుసంధానమయ్యాను అని ఒక ఆలోచన చేయండి చాలు.
మనసులో చెడు ఆలోచనలు వస్తే ఏం చేయాలి?
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచనలు వస్తే ఏం చేస్తారు? అప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి… ముఖ్యంగా ప్రిసెప్టర్ లేదా మాస్టర్ తో ధ్యానిస్తున్నప్పుడు… చెడు ఆలోచనలు వస్తే, ఈ సమయంలో ఈ ఆలోచనలు వస్తున్నాయేంటి అనుకుంటారు. ఇతనికి ఇంత దానం చేశాను, అతనికి మంచి భోజనం పెట్టాను వంటి మంచి ఆలోచనలు వస్తే అంతగా ఆలోచించం. అదే ఆలోచనలో అలాగే కొనసాగుతాం. ఇంత దానం చేశాను, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం. అవి కూడా ఆలోచనలే. ఆలోచనలు ఆలోచనలే కదా! అవి మంచి ఆలోచనలు కానీ చెడువి కానీ, అవి మనం ధ్యానం చేయకుండా చేసి, ధ్యానాన్ని భగ్నం చేస్తాయి. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ముఖమంతా ముడుచుకొని పోతుంది. ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు వచ్చాయేంటి? ఒక్క క్షణం కళ్ళు తెరవండి, ఇదొక పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటంటే ప్రార్థన చేయండి, హార్ట్ఫుల్నెస్ లో ఉన్న ప్రార్థన… ‘ఓ మాస్టర్, మానవ జీవితమునకు యదార్ధ లక్ష్యము నీవే’ అని ప్రార్థించడం రెండవ పద్ధతి. ఇక మూడవ పద్ధతి, దీర్ఘంగా, లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదిలేయడం. అప్పటికీ పని జరగకపోతే కొంతసేపు 2, 3 నిముషాలు ఆపేసి, ఏవైనా ధార్మిక గ్రంథాలను, పుస్తకాలను చదవండి. ధ్యానం చేసే మానసిక స్థితిని ఏర్పరచుకోండి. ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. కొంత తేడా అయితే ఉంటుంది. ఇన్ని పద్ధతులు పాటించినా పని జరగకపోతే ఈశ్వరునికి శరణాగతి నొంది, ఆయనకే వదిలేయండి. ఈరోజు కాకపోతే సాయంత్రం ప్రయత్నించండి లేదా రేపు ఉదయం ప్రయత్నించండి. ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. పదేపదే ప్రయత్నిస్తూ ఉంటే విజయాన్ని సాధిస్తారు.
నకారాత్మక ఆలోచనల ప్రభావాన్ని ఎలా తప్పించుకోవాలి?
చెడు ఆలోచనలు వచ్చినప్పుడు, వాటిని నిరోధించడానికి మనం చేసే ప్రయత్నం వల్ల వేడి పుడుతుంది. శక్తికి మరియు పదార్థానికి మధ్య పోరాటం జరిగినప్పుడు వేడి పుడుతుంది. మనమేదైనా తప్పు పని చేసినప్పుడు, అమ్మ ఈరోజు నీవేం చేశావు అని అడిగిందనుకోండి. చేసిన తప్పు పని గురించి చెప్పే సమయం వచ్చినప్పుడు… వదిలేయ్, ‘ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు’ అనే భావంతో కుంచించుకుపోతారు. వారి శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. మంచి ఆలోచనలు వస్తే మనస్సు ఆనందిస్తుంది. తక్షణమే పరవశం చెందుతుంది. ఇది కూడా శరీరధర్మ పరమైన, భావోద్వేగపరమైన ప్రభావం. మన ఆలోచనల వల్ల మనలో శారీరకపరమైన మార్పు వస్తుంది. క్రమక్రమంగా మన ఆలోచనల కారణంగా మనలో జన్యు పరివర్తన జరుగుతుంది. ఈరోజుల్లో ఎపిజెనిటిక్స్ పై చాలామంది అధ్యయనం చేస్తున్నారు. ఏ ఇంటి వాతావరణం మంచిగా ఉంటుందో, నేను ఆధ్యాత్మిక దృక్పథంలో కాకుండా… ఇంటి వాతావరణం గురించి మాట్లాడుతున్నాను.శాంతియుతంగా ఉండడం, ఆ ఇంట్లోని వ్యక్తులు పరస్పరంఅర్థం చేసుకునే వారై ఉన్నప్పుడు… అలాగే ఏ ఇంట్లో వ్యక్తుల మధ్య పదే పదే గొడవలు జరిగే వాతావరణం ఉన్నప్పుడు… వారి ఆరోగ్యం గురించి ఆలోచించండి. కరోనా వంటి రోగాలు ప్రబలినప్పుడు వెంటనే వాటికి లోనవుతారు. రక్తపోటు కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ రెండు రకాల ఇళ్లల్లో పుట్టిన పిల్లలు కూడా భిన్నంగా ఉంటారు. వారి సంస్కారాలు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఏ ఇంట్లో ధ్యానం చేయబడుతుందో, అంటే ధ్యానం చేయవలసి వచ్చిందని ధ్యానం చేయడం కాదు. మా అమ్మమ్మ చేస్తుంది, మా తాతయ్య చేస్తారు కాబట్టి నేను కూడా తప్పకుండా చేయాలి అనే ఉద్దేశంతో చేయకుండా ఉండడం మేలు. మీ హృదయంలో ఈశ్వరుని పట్ల తపన ఉన్నట్లయితేనే చేయండి.
10-04-23
సంస్కారాలు వారసత్వంగా వస్తాయా?
అవును. పూర్వజన్మ సంస్కారాలు మనం తీసుకునే వస్తాం. తరువాత మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇరుగు – పొరుగు… ఉపాధ్యాయులు మొదలైన వారి ప్రభావం ఎలాగూ ఉంటుంది. దానివల్ల మరిన్ని సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారం అంటే ఏమిటి? ఏదైతే మనం ఇంగ్లీషులో ఇంప్రెషన్స్ అంటామో, కాగ్నెట్స్ అంటామో అవి. ఉదాహరణకు అడవి నుండి ఒక ఏనుగు వచ్చిందనుకోండి.అడవి ఏనుగును పట్టుకోవడం చాలా కష్టం. కానీ ఒక అరడజను మంది దాన్ని పట్టుకుని, కాళ్ళను ఒక స్తంభానికో, చెట్టుకో ఇనుప సంకెళ్ళతో బంధిస్తారు. అప్పుడు అది తప్పించుకోలేదు. నాలుగు కాళ్లు ఇనుప సంకెళ్లతో బంధించబడ్డాయి. ఒక వారం లేదా రెండు, మూడు వారాలు అక్కడే నిలబడి ఉంటుంది. తరువాత డీలా పడిపోతుంది. పిమ్మట మీరు ఒక సన్నని ప్లాస్టిక్ తాడుతో, ఒక ప్లాస్టిక్ కుర్చీకి కట్టినా కూడా… అది తాను బంధించబడ్డాను అని అనుకొని తప్పించుకోకుండా అక్కడే ఉంటుంది. సర్కస్ లో అలాగే శిక్షణ ఇచ్చి తీసుకువస్తారు. అది తలుచుకుంటే మొత్తం సర్కస్ టెంట్ నే ధ్వంసం చేయగలదు. కానీ దాన్ని అలా ప్రవర్తించేలా నియంత్రించారు. దాని మనసును లొంగదీసుకుని, ఎలా కావాలో అలా తయారు చేస్తారు. పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగినప్పుడు మనం జవాబు చెప్పలేకపోతే, బలవంతంగా వారి నోరు మూయిస్తాం. చాలా విషయాల్లో వారిని మాట్లాడనీయం. ‘నాకు తెలియదు’, అని మీరు చెప్పినప్పుడు అది చాలా మంచిదవుతుంది. మనం ఇది మంచి, ఇది చెడు అని ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాం. అలాంటప్పుడు వారి లోపల ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. ఇది కండిషనింగ్. దీన్నే సంస్కారం అంటారు. మనం మంచి సంస్కారాలను ఇవ్వగలం. అలాగే చెడు సంస్కారాలను కూడా. సహజ మార్గం, హార్ట్ ఫుల్ నెస్ వే, మనం సంస్కారాలను దాటి వెళ్లాలని అంటుంది. సంస్కారాలు ఏమీ లేనట్లయితే అప్పుడు ముక్తి లభిస్తుంది. మంచి సంస్కారాలు ఉంటే ఆ మంచిని భోగించడానికి రావాలి. చెడ్డవైతే అవి కూడా భోగించడానికి రావాలి. మంచివైనా, చెడ్డవైనా… అలాగే బంగారు సంకెళ్లతో బంధించబడినా లేక ఇనుప సంకెళ్లతో బంధించబడినా, బంధనం బంధనమే కదా! అన్ని సంస్కారాలను తీసివేయాలి. దీని కోసమే మనం ధ్యానం, నిర్మలీకరణ, గ్రూపు సత్సంగ్, భండారాలకు రావడం ఇవన్నీ చేస్తున్నాం. అలాగే మనం స్వంతంగా తపస్సును సాధన చేస్తాం. వీటన్నింటి వల్ల మనం సంస్కారరహితులం అవుతాం. ఇప్పటిదాకా ఏం జరిగిందో దాన్ని భగవంతునికి సమర్పించి వదలివేయండి. రోజువారీ జీవనంలో సంస్కారాలు ఎలా ఏర్పరచుకోకుండా ఉండాలో దానిపట్ల శ్రద్ధ వహించండి. అది కూడా యోగ సాధనే. మనం శ్రద్ధగా ధ్యానం చేస్తాం. ఎవరైతే నిరంతర స్మరణలో భగవంతునితో అనుసంధానంలో ఉంటారో వారికి సంస్కారాలు ఏర్పడవు. కొన్ని రోజులకు ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి మరొకరి సంస్కారాలను తొలగించడంలోనూ సమర్ధుడవుతాడు.
కుటుంబంలో వ్యతిరేకత ఉంటే ధ్యానించడం ఎలా?
మీకు ఎదురైన ఈ పరిస్థితి మా గురుదేవులైన పూజ్య బాబూజీ మహరాజ్ కి కూడా ఎదురైంది. వారి తండ్రిగారికి బాబూజీ ధ్యానం చేస్తుంటే చాలా విచారంగా ఉండేది. ధ్యానంలో మునిగిపోయి కుటుంబాన్ని వదిలేసి ఏదో ఒకరోజు సన్యాసి అయిపోతాడేమోనని భయంగా ఉండేది. సామాన్యంగా ప్రజలకు ధ్యానం గూర్చి చాలా అనుమానం ఉంటుంది. రోజూ ధ్యానానికి వెళ్తూ ఉంటే ఇల్లు ఏమవుతుంది అనే చింత ఉంటుంది. కానీ కళ్ళు తెరిచి కూడా మీరు ధ్యానం చెయ్యండి.బాత్ రూమ్ లో పది, పదిహేను నిమిషాలు ఎక్కువసేపు ఉండి ధ్యానం చేసుకోండి. నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ధ్యానం చెయ్యండి. చెయ్యాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో వివాదం పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ధ్యానం చెయ్యడం లేదని వాళ్లకి చెప్పండి. లేదా ‘మీరే చెప్పండి నేను ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్పండి’ అని అడగండి. మీ దగ్గర ఏదైనా పధ్ధతి ఉందా? అని అడగండి. “ఇది నేను చేసే ధ్యానం. మీరు కూడా స్వయంగా చేసి చూడండి. నేను మంచి పద్ధతిలో చేస్తున్నానా లేక ఏమైనా తప్పుగా చేస్తున్నానా అని. నేను చేస్తున్నది తప్పు అని మీకు అనిపిస్తే చెప్పండి. నేను వదిలేస్తాను. కానీ మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి” అని మీ తల్లిదండ్రులకి చెప్పండి. ఈ రెండు ఉపాయాలే నేను మీకు చెప్పగలిగేవి.
దాజీ, షిఫ్ట్ సిస్టంలో పనిచేసేవారు, సమయ నిర్వహణ ఎలా చేయాలి? అంటే ధ్యానానికి తమ సమయాన్ని ఎలా నిర్దేశించుకోవాలి? -
ధ్యానానికి సమయాన్ని నిర్దేశించుకోవడం అనేది చాలా చిక్కు ప్రశ్న. మీకు అనుకూలమైన ఏ సమయంలోనైనా మీరు ధ్యానం చేయవచ్చు. అది ఉదయం 6:00 కావచ్చు 7:00 లేదా 8:00 కావచ్చు… లేదా తెల్లవారుజామున నాలుగు గంటలైనా కావచ్చు. ప్రొద్దుటిపూట ఏదో ఒక సమయాన్ని నిర్దేశించుకోండి. ధ్యానం అనేది భగవంతునితో మీరు గడిపే సమయం. మీరు ప్రతిరోజు ఆయనతో సమావేశమయ్యేందుకు ఉదయం ఆరు గంటలు అనుకుంటే, ఆరింటికల్లా కళ్ళు మూసుకుని కూర్చోండి. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక అది స్కూల్ నుంచి, కాలేజీ నుంచి, ఉద్యోగం నుంచి వచ్చినా లేదా ఏ పని నుంచి వచ్చినా సరే… అది ఏ సమయమైనా సరే, రాగానే మిమ్మల్ని మీరు నిర్మలీకరణ చేసుకోండి. తర్వాత మీ కుటుంబ సభ్యులతో గడపండి. కానీ మీరు నిద్రపోయే సమయాన్ని మాత్రం ముందుగానే నిర్దేశించుకోండి. మీరు ఏ పని చేయకపోయినా పర్వాలేదు కానీ… ఆ సమయాన్ని మాత్రం నిర్దేశించుకోండి. అది 10:30 అయితే 10:30… 11 అయితే 11 గంటలు! 9 అయితే 9. ఏ సమయం అయినా సరే… క్రమశిక్షణతో మీరు ఒకసారి నిద్రకు సమయాన్ని నిర్దేశించుకుంటే, మిగిలినవన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లో కూడా చూడండి. ఒకరు ఆరింటికి, ఇంకొకరు ఏడు గంటలకి, మరొకరు రాత్రి తొమ్మిది గంటలకి తింటామంటారు. ఒక్కొక్కరు ఒక్కో సమయానికి భోం చేస్తుంటే మీ ఇంట్లో వంట చేసే అమ్మకు కానీ, వదినకు లేదా అక్కచెల్లెళ్లకు దీనివల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుంది? ఒకరి తరువాత ఒకరు ఈ విధంగా వస్తూ ఉంటే, దాదాపు వారి జీవితం నరకప్రాయం అవుతుంది. అలాగే ఉదయం పూట కూడా కొందరు పెందరాళే, కొందరు ఆలస్యంగా లేచి ఒక్కొక్కరూ ఒక్కో సమయంలో బ్రేక్ ఫాస్ట్, లంచ్ చేస్తూ ఉంటే… అది ఎలాంటి పరిస్థితి! అందరూ ఒక సమయాన్ని నిర్దేశించుకొని ఆ సమయానికే భోజనం చేయండి. దానివల్ల కుటుంబంలో ఐకమత్యం, ఆనందం వృద్ధి చెందుతాయి. దానివల్ల కుటుంబాల పైన ఆ పరమాత్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.
స్వచ్ఛంద సేవకులు
వాలంటీర్ అంటే తమంతట తాముగా సంతోషంగా తమ సోదర సోదరీమణులకు సేవ చేయడం. ధ్యాన స్థితిలో ఉండి సేవ చేయడం. సోదర సోదరీమణులు ధ్యానంకై కూర్చొని ఉంటారు. కానీ వాలంటీర్ల ముఖ్య కర్తవ్యం ఏమిటంటే, తమకు తాము ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉండి… మాస్టర్ లో లీనమై, అటువంటి స్థితిలో అందరికీ సేవ చేయాలి. వాలంటీర్ వర్క్ అంటే అది. అందరినీ ఆహ్వానించడం వారి బాధ్యత. ఎవరైనా వృద్ధులుంటే, వారికి మెట్లు ఎక్కడం కష్టంగా ఉండొచ్చు. అటువంటి వారికి సహాయం చెయ్యడం… కుర్చీలో కూర్చోపెట్టడం… ఇలాంటివి వాలంటీర్ల బాధ్యతలు. సామాన్యంగా వాలంటీర్లు ఏం చేస్తారంటే, మీరు ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇక్కడ కూర్చోకండి, అక్కడ కూర్చోకండి… ఫోన్ ఆఫ్ చెయ్యండి. ఫోన్ ని ఇలా చెయ్యండి, ఇలాంటివి చెప్పి వారి బుర్ర తింటారు. కానీ వాలంటీర్ ఏ పని చేసినా ప్రేమతో చెయ్యాలి.
ఆనందం ఎక్కడ లభిస్తుంది?
ఆనందం అనేది మనకు ఆత్మనుండే లభిస్తుంది. మనలోని ఆత్మయే ఆనందానికి మూలం. అక్కడ నుండే సర్వం లభిస్తాయి. మనలోని ఆత్మయే ఆనందానికి మూలం. అక్కడ నుండే సర్వం లభిస్తాయి. కానీ మనం ఎప్పుడైతే ఆత్మను ఖైదు చేస్తామో, అప్పుడు మనకు ఆ ఆనందం అనే ప్రకాశం లభించదు. ఆత్మను ఎలా ఖైదు చేస్తామో తెలుసా? మన కోరికలతో మన అహంకారంతో ఆ వెలుగుని రానివ్వకుండా మనం ఆత్మను ఖైదు చేస్తాం. సరిగ్గా గమనించండి. ఆ వెలుగుని మనం అహంకారం మరియు కోరికలు అనే కారు మేఘాలతో కప్పి వేయడం వల్ల… ఆత్మ చుట్టూ అంధకారం మాత్రమే మిగులుతుంది. మన అహంకారం ఎలా ఉంది అని, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఒక్కమాట అంటే మీరు తట్టుకోగలరా? కోపం వచ్చేస్తుంది. మనలోని చెడు లక్షణాలన్నీ పైకి వచ్చేస్తాయి. ఇలాంటి సమయాల్లో మన ఆత్మ ఎలా ఆనందంగా ఉండగలదు? ఆత్మకు ఒకే ఒక్క అవసరం ఉంటుంది. అది దేనికోసమైతే ఈ జీవితాన్ని తీసుకుందో, దాన్ని ప్రాప్తి చేసుకోవడం. మనం ఏదైనా చేస్తున్నా, అంటే ఏదైనా పని చేస్తున్నా, ఏదైనా ఆలోచిస్తున్నా, ధ్యానం చేస్తున్నా లేదా పూజ చేస్తున్నా… అది ఆత్మ యొక్క ఉన్నతికైనప్పుడు ఒక రకమైన శాంతి లభిస్తుంది. ఆ శాంతే ఆత్మకు ఆనందాన్ని విరజిమ్ముతుంది. కొందరు అడుగుతూ ఉంటారు కదా! ఆనందానికి సరైన మార్గం ఏమిటని? ఏదైతే మీ ఆత్మకు శాంతిని చేకూరుస్తుందో అదే సరైన మార్గం.
మనం తలవంచి ఎందుకు ప్రణమిల్లుతాం?
మనం శిరస్సు ఎందుకు వంచుతామో ముందుగా తెలుసుకోండి. నాలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. మీలో కూడా ఉన్నాడు కదా! అందుకే ఆయనను అంతర్యామి అంటాం. ఆయన మనలో స్థిర నివాసం ఏర్పరచుకొని నివసిస్తూ ఉన్నారు. ‘ప్రతి ఒక్క ప్రాణి హృదయం లోను నేను ఉన్నాను’ అని శ్రీకృష్ణ భగవానుడు కూడా అన్నారు. మన ధర్మ శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాయి.అయినా మనం ఆ పరమాత్మ ను బయట వెతుకుతూనే ఉంటాం… వెతుకుతూనే ఉంటాం. తప్పుడు మార్గంలో నడుస్తే, దాని పరిణామం కూడా తప్పుగానే ఉంటుంది. నీ లోపల ఉన్న ఆ అంతర్యామి నీకోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చెడ్డదారిలో నడుస్తానన్నా ఆయన ఎవరినీ ఆపడు. మంచి పని చేస్తానంటే, దానికి కూడా మద్దతు ఇస్తాడు. నీ లోపల నీ జీవన దాత ఎవరైతే ఉన్నాడో… నీవు ఏడుస్తూ ఈ భూమ్మీదకి వచ్చినప్పుడే, ఆయన నీలోనికి ప్రవేశిస్తాడు. అది ఆయన రాకకు గుర్తు. అంటే పిల్లవాడు పుడుతూనే ఏడుస్తాడు. అలా ఏడ్చాడు అంటే ఆ భగవంతుడే జీవుడి రూపంలో ఆ పిల్లవాడి లోపల ప్రవేశించినట్టు. అదే అతడు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? రామ్ భరో భాయ్ రామ్.. కథ సమాప్తం అవుతుంది. ఐతే ఈ జనన మరణాల మధ్యలో ఉన్న జీవితం ఆ జీవన దాత వల్ల లభించినదే. దాన్ని నీవు ఆత్మ అను, భగవంతుడను, లేక అంతర్యామి అను. ఏ పేరైనా పెట్టు, తేడా ఉండదు. నీవు ముస్లిం, క్రిస్టియన్ లేక హిందూ అయినా, ఏమీ తేడా ఉండదు. వారందరిలో, మనందరిలో ఆ జీవన దాత ఉన్నాడు. పేర్లు వేరువేరుగా పెట్టొచ్చు. అది వేరే విషయం. కానీ అతడు మన లోపల ఉన్నాడనేది మాత్రం యదార్ధం. నా ఆత్మ నా లోపల ఉంది. నా ఆత్మ ఇతనిలో లేదు. నా ఆత్మ షాజహాన్ పూర్ లో లేదు, కాశీ లో లేదు… ద్వారక లో సైతం లేదు. నా ఆత్మ నాలోనే ఉన్నది. అటువంటప్పుడు నీవు బయట వెతికితే ఆయన లోపల నుండి కోపగించుకుంటారు. భార్య ఇంట్లో ఉన్నపుడు ఆమె కోసం బయట వెతికితే మిమ్మల్ని మీ ఆవిడ నవ్వుతూ, ‘ఎవరైనా దొరికారా’ అంటూ ఎగతాళి చేస్తుంది. పరమాత్మ విషయంలో కూడా అంతే. ఆయన మన లోపల ఉన్నాడు. హృదయమే పశ్యసి. నన్ను నీ హృదయం లోనే అనుభూతి చెందు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తారు. హృదయమే పశ్యసి అంటే హృదయం ద్వారానే నన్ను మీరు అనుభూతి చెందగలరు అని శ్రీకృష్ణ భగవానుడు అంటారు.
11-04-23
ధ్యానం వల్ల అందరితో కలుపుగోలుగా ఉండలేకపోతున్నాను.
ఈ పరిస్థితిని నేనెలా ఎదుర్కోవాలి?
ఇది సహజమైనది. సహజంగా జరిగే దాన్ని అలా జరగనివ్వండి. మీ మనసులో ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా వుండాలి అనిపిస్తే అలాగే వుండండి. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు తప్ప మిగతావారందరూ మీ ప్రవర్తనతో కలత చెందుతారు. మీరు భగవంతుని స్మరణలో వుండండి. మనం ఉదాసీన మనస్కులై వుండాలి అని అర్థం కాదు. ఈ ఉదాసీనత తో పాటు ఒక విధమైన మౌనం తోడైతే అది విషతుల్యమైన మౌనం. మనం ఎప్పుడు ధ్యానం చేసినా ఒక రకమైన సమతుల్య స్థితి ఏర్పడటం నేను గమనించాను. ఒక విధమైన ఆనందం కలుగుతుంది. చాలా అరుదుగా నైరాశ్యం కలుగుతుంది. అది కూడా కొన్ని క్షణాల పాటు లేదా పది, పదిహేను నిమిషాల సేపు, ఒక గంట సేపు… ఈ నైరాశ్యం వుండవచ్చు. కానీ మిగతా సమయమంతా ఎగసే అపరిమిత ఆనంద, సంతోషాలతో వుంటాం. ఇది నా స్వానుభవం. ఇక మీ అనుభవం విషయానికి వస్తే, ఈ ఉదాసీనత నుంచి మీరు త్వరగా బయట పడండి. ప్రిసెప్టర్ దగ్గర ముఖాముఖి సిట్టింగ్ తీసుకోండి. ఆనందపూర్వకంగా మీ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించండి.
జీవితంలో మీరు ఎదుర్కొన్న సంఘర్షణలు గురించి సంక్షిప్తంగా వివరిస్తారా?
నాకు ఎటువంటి బాధలు లేవు. హిందీ లో ఒక అందమైన, మధురమైన గీతం ఉంది. దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి, హృదయం నాది కానీ నా ప్రేమ మాత్రం వేరొకరికి అనే అర్థంలో ఒక పాట ఉంది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే హృదయం నాది కానీ ఇతరుల బాధలను మోస్తూ ఉంటాను. ప్రేమ, బాధ ఈ రెండూ నాతోనే వస్తూంటాయి. దీని వలన నాకు ఎటువంటి అభ్యంతరం కానీ, కష్టం కానీ లేదు. కాకపోతే మనం ఏ అభ్యాసుల గురించైతే, ఏ అభ్యాసుల పైనయితే పని చేస్తున్నామో, ఆ అభ్యాసుల పై పని జరుగుతూనే ఉంటుంది అనుకొండి. వారు ప్రతిరోజూ ధ్యాన సాధన చేయాలి, నిర్మలీకరణ చేసుకోవాలి అని మాత్రం నేను కోరుకొంటాను. ఫలితాన్ని నా కళ్ళతో చూడాలి అని అనుకొంటున్నాను. బాబూజీ కూడా అదే నిరాశ లో ఉండేవారు. ఋతవాణి (Voice Real) లో ఆయన ఎవరికో వ్రాసిన ఒక ఉత్తరం ఉంది. అందులో ఆయన ఇలా రాశారు… సంగ్రహంగా చెప్పాలి అంటే, “నా జీవిత కాలంలోనే మీరందరూ వికాసం చెందాలి. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నా తర్వాత నాలాగే మార్గదర్శనం చేయగల గురువు ఈ సంస్థ బాధ్యతలు స్వీకరిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.” అయితే వేరే ఎవరికో ఎందుకు అవకాశం ఇవ్వాలి?! ఆయన జీవిత కాలం లోనే వికాసం చెందితే మంచిదే కదా! ఆయన తర్వాత గురువు గారు ఉండరని కాదు. నా తర్వాత కూడా ఎవరో ఒకరు బాధ్యతలు స్వీకరిస్తారు. వారు కూడా మీకు సేవలు అందిస్తారు. వారసులు వస్తూ ఉంటారు… పోతూ ఉంటారు. కృపా వర్షం కురుస్తూనే ఉంటుంది. ప్రాణహుతి ప్రసారం జరిగి పోతూనే ఉంటుంది. ఒక రోజు ధ్యానం చేయడం, ఒక రోజు చేయకపోవడం. దీని వలన ఎటువంటి లాభం ఉండదు. మీకు ఒక కథ చెప్తాను. గతంలో నేను ఫార్మసిస్ట్ ను అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు మందుల కోసం మా వద్దకు వస్తూ ఉండేవారు. మందుల చీటీ ప్రకారం మేము వారికి మందులు ఇస్తూ ఉండేవారం. కొన్ని కొన్ని విచారకరమైనవి, అలాగే నవ్వు తెప్పించే సంఘటనలు కూడా జరుగుతూ ఉండేవి. ఒక స్త్రీ వచ్చింది. మీరు నాకు తప్పు మందు ఇచ్చారు అంది ఆవిడ. నేను తప్పు మందు ఏమీ ఇవ్వలేదని ఆవిడతో అన్నాను. ఈ మాత్ర నాపై పని చేయలేదు అని ఆవిడ అంది. నిద్ర కోసం నాకు డాక్టర్ గారు నిద్ర మాత్ర ఇచ్చారు కానీ రాత్రిపూట నాకు ఏ మాత్రం నిద్ర పట్టడం లేదు అంది ఆవిడ. ఈ మాత్ర మీరు ఎప్పుడు వేసుకుంటున్నారు అని నేను ఆవిడను ప్రశ్నించాను. పగటి పూట వేసుకుంటున్నాను అనేది ఆవిడ సమాధానం. దాని వలన ఆవిడ పగలంతా నిద్రపోతోంది. రాత్రిపూట ఇక ఆవిడకు నిద్ర పట్టడం లేదు. కాలేజీలో చదువుకొనే సమయంలో నా రూమ్మేట్ ఒకడు ఉండేవాడు. చాలా హుషారుగా ఉండేవాడు. మేము ధ్యానం చేస్తూండేవాళ్ళం. అయితే అతను ధ్యానం, నిర్మలీకరణ, ప్రార్థన ఈ మూడూ ఒకేసారి చేసేవాడు. మన సాధనను సూచించిన విధంగానే చేయాలి. నిర్దిష్ట సమయంలో ధ్యానం చేయమని చెప్పబడింది. ఒక నిర్దిష్ట సమయం అంటూ బాబూజీ ఏమీ నిర్ణయించలేదు. కానీ మీకై మీరు ఒక నిర్దిష్ట సమయాన్ని ఏర్పరచుకోవాలి. మీలో ఎవరైనా కానీ ఒక నిర్దిష్ట సమయంలో ధ్యానం చేస్తున్నారా? బహుశా ఒకరిద్దరు చేస్తూ ఉండవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ‘మేము చాలా క్రమంగా ధ్యానం చేస్తాము సాబ్!’ అని. ధ్యానం క్రమం తప్పకుండా చేస్తారు సరే! ఎప్పుడు చేస్తారు? ప్రతి ఆదివారం నేను ధ్యానిస్తాను. ధ్యానం ప్రతి ఉదయం చేయాలి. మనం ధ్యానానికి ఒక నిర్దిష్ట సమయాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో… అప్పుడు దాని పరిణామాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దాన్ని మీరు విప్లవాత్మకమైనది అనండి లేదా ప్రగతిశీలకమైనది, ఏదైనా అనండి. ఉదయం ఒక నిర్దిష్ట సమయాన్ని ఏర్పరచుకోండి. సాయంత్రం చేసుకునే నిర్మలీకరణ విషయంలో అయితే ఈ రోజుల్లో ఆఫీసు పని ముందుగా ఊహించలేకుండా ఉంటోంది. అందువల్ల ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటారో వెంటనే చేసుకోండి. నిద్రపోయే సమయం కూడా కచ్చితంగా పాటించండి. 10 అనుకుంటే 10 గంటలకే – ముందూ కాదు, వెనుకా కాదు. ఇలా చేస్తూ ఉంటే కొంతకాలానికి క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఉదయపు ధ్యానం కూడా సరిగా జరుగుతుంది. రోజు కూడా చక్కగా గడుస్తుంది. ధ్యానంలోనే మన స్థితిపై పనిచేయడం వల్ల సంస్కారాలు ఏర్పడడం తగ్గుతుంది. రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా – పొద్దుటి ధ్యానానికి తయారీతో పాటు, ‘నిద్ర లేవడంతోనే నేను ధ్యానించాలి’ అనే నిరీక్షణలో ప్రార్థించి నిద్రపోవాలి. మీరు ఇంత మాత్రం చేస్తే నాకు చాలా సహాయం చేసినట్లే. ఇక మనం చేయాల్సిందేమిటి? అది పెద్దగా ఏం లేదు. ఉదాహరణకు మీరు ఉదయం 6 గంటలకు ధ్యానానికి కూర్చున్నారు. కళ్ళు మూసుకోవాలి. ఇంకేం చేస్తారు? బాబా రామ్ దేవ్ లా బలంగా శ్వాసించనవసరమైతే లేదు కదా! అది కూడా చేస్తే మంచిదే. ఇప్పుడు బాబా రామ్ దేవ్ కూడా ప్రిసెప్టర్ అయ్యారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఆయన ఇప్పుడు హార్ట్ ఫుల్ నెస్, సహజమార్గ పద్ధతి ద్వారా ధ్యాన ప్రక్రియ, క్లీనింగ్ ప్రక్రియ, రాత్రి ప్రార్థన నేర్పుతారు. అక్కడికి వారితో వచ్చిన ముగ్గురు సహచరులు, అలాగే రామ్ దేవ్ బాబాతో కలిపి నలుగురు ప్రిసెప్టర్లను తయారు చేశాము. ఏది ఏమైనప్పటికీ ధ్యానం చేయకుండా మనం ముందుకు సాగలేము. ఏ మనిషి, ఏ మనస్సు ముందుకు పురోగతి చెందలేదు. ఎంత ప్రగతి సాధించినప్పటికీ, ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే మరింత ముందుకు వెళతారు. ధ్యానం చాలా మహిమాన్వితమైనది. ధ్యానం వల్లనే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ధ్యానం వల్లనే ఎవరినైనా క్షమించే శక్తి పెరుగుతుంది. ఏదైతే జ్ఞాపకం ఉంచుకోవాలో దాన్ని జ్ఞాపకం ఉంచుకుని, మర్చిపోవాల్సిన దానిని మర్చిపోతాం. ధ్యాన పద్ధతి ఒక అద్భుతమైన టెక్నిక్. ధ్యానం లేకుండా శాంతి లేదు. మరి శాంతి లేనప్పుడు సుఖం ఎలా లభిస్తుంది? ‘అశాంతస్య కుతఃసుఖం’ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మరి శాంతి, ధ్యానం చేయకుండా ఎలా లభిస్తుంది? కొంతమంది అంటూ ఉంటారు, ‘అయ్యా! ఎన్నో ఏళ్ల నుండి ధ్యానం చేస్తున్నాను. కానీ సుఖం లేదు. శాంతి లేదు అని. నేను వారినిదే అడుగుతాను, ‘దేనిపైన మీరు ధ్యానిస్తున్నారు?’ అని.
ఒక మంచి నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి?
మహత్వపూర్వక నిర్ణయాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు మీరు? ఎవరిని పెళ్లి చేసుకోవాలి, రెండవది ఎలాంటి ఉద్యోగం చూసుకోవాలి, మూడవది ఏ మార్గాన్ని ఎంచుకోవాలి… 10, 11, 12వ తరగతి విద్యార్థులు ఏ కోర్స్ తీసుకోవాలి, అని పలువిధాల ఆలోచనలలో పడిపోతారు. ఎందుకంటే తల్లిదండ్రులు వారిని ఇది చేయి, ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు లేదా ఈ పిల్లాడిని పెళ్లి చేసుకో… రెండు బిఎండబ్ల్యూ కార్లున్నాయి అంటూ కంగారు పెట్టేస్తారు. పాపం వాళ్లు కలవరం చెందుతారు. వీళ్ళు మన కులంవారు అంటూ పిల్లలను మరింత కలవరపెడతారు. పిల్లల్ని మరింత కంగారు పెట్టకుండా చూడడం తల్లిదండ్రుల బాధ్యత. జీవితాన్ని చూసి నిర్ణయం తీసుకోండి. నా నుంచి ఆశించకండి. జీవితంలో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా మీరు మీ హృదయాన్ని మూసి పెట్టారు, అది మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ‘నన్ను ఈ పని చెయ్యనీ’ అని మీరు మీ హృదయాన్ని విననందుకు, నేడు దాని పరిణామం ఎలా ఉందో మీకు అర్థమవుతోంది కదా! నన్నెందుకు అడుగుతారు? మీ అందరికీ తెలుసు. మీరు నన్ను ఎందుకు అడుగుతారంటే, మీకు అదే చేయాలని ఉంటుంది. అయోమయం ఏమీ లేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలని లేదు, ఐనా దాజీ ఒకవేళ చెప్తే చేసుకొందామని చూస్తారు. అప్పుడది నా బాధ్యత అవుతుంది. తల్లిదండ్రులు కూడా ఏం జరిగినా మా బాధ్యత లేదు, దాజీ మీదే పెట్టొచ్చని ఆలోచిస్తారు. ఎవరి వైవాహిక జీవితంలోనైనా సమస్యలు ఉండకపోవడం అనేది అసంభవం. తల్లిదండ్రులేమో పెళ్లి చేశారు, నేను వారి మాట వినకుండా ఉంటే బాగుండేది అంటూ తల్లిదండ్రులను నిందిస్తారు. ఇతరులను నిందిద్దామనే తప్ప, తమను తాము స్వయంగా నిందించుకునే ధైర్యం ఎవరిలోనూ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా స్వయంగా తీసుకో. హృదయం చెప్పేది విను. అది ఏం చెప్పిందో తెలుసుకోవడానికి ధ్యానం చేయి. ఒక రోజు కాదు, ప్రతిరోజూ ప్రశాంతంగా ధ్యానం చేయి. హృదయం చెప్పేది విను. తొందరపడకు. వారం రోజులపాటు చెయ్యి. పిచ్చివాళ్ళలా అదే పనిగా ఆలోచించకు. ఒకసారి బాబూజీ కి ప్రార్థనలో విన్నవించుకుని ఆయనకు వదిలేయి. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే స్పష్టమైన అవగాహన ఏదో ఒక ధ్యానంలో కనిపిస్తుంది. ఒక్క సిట్టింగ్ లోనే నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే అప్పుడు తీసుకున్న నిర్ణయం మీ మనసుకు నచ్చినదై ఉంటుంది. కొంత సమయం తర్వాత కూడా మనసు స్థిరపడకపోతే, అయోమయంగా ఉంటే ప్రిసెప్టర్ దగ్గరికి సిట్టింగ్ కోసం వెళ్ళండి. వారితో మీ సమస్య గురించి చెప్పకండి. అవసరం లేదు. సిట్టింగ్ తీసుకోండి. దాని తర్వాత మీరు స్వయంగా నిర్ణయం తీసుకోండి.
12-04-24
కోపం - అపరాధ భావం
మార్గం మీరే శోధించాలి. కోపం వస్తుంది. అపరాధ భావం కూడా కలుగుతుంది. కోపం వచ్చినప్పుడు చాలా ఆనందపడే ఏ ఒక్క మనిషినీ నేను ఇప్పటివరకు చూడలేదు. బయటికి మాత్రం ఆనందంగా ఉన్నట్లు కనిపించొచ్చు. కానీ లోపల మాత్రం వారికి స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. దవడలు బిగుసుకుంటాయి. కళ్ళు ఎర్రబడతాయి. పెద్దగా ఉబ్బుతాయి. ఎదుటి వారిని కొడదామన్నట్లు పిడికిళ్లు కూడా బిగుసుకుని తయారుగా ఉంటాయి. ఇదంతా అపరాధ భావం లోపల వస్తేనే జరుగుతుంది. మనలో రగిలిన నిప్పురవ్వ మంటగా పెరిగితే మనల్ని కూడా దహిస్తుంది కదా. నాకు కోపం రావటం కరక్టే, అని మీకు అనిపించవచ్చు. కానీ ఆ కోపాగ్నిలో మనం కూడా స్వయంగా దహించుకుపోతాం. కోపగించుకోవడం న్యాయబద్ధమైనదైనా కాకపోయినా కూడా, దాని పరిణామం మాత్రం ఎల్లప్పుడూ చెడ్డదే అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రతిసారీ కోపం తెచ్చుకోవటం, తర్వాత అపరాధ భావంతో కృంగిపోవటం. దీనివల్ల ఉపయోగం ఏముంది? బాబూజీ చెప్పేది ఏమిటంటే, రాత్రి నిద్ర పోయే ముందు పశ్చాత్తాపం చెందాలి అని. పశ్చాత్తాప భావనతో ప్రార్థనాపూర్వకంగా భగవంతునికి మాట ఇవ్వాలి. అదేమిటంటే, ‘నేను ఈ తప్పు మళ్ళీ ఇంకెన్నడూ చెయ్యను’ అని. మీరు తప్పులు చెయ్యొచ్చు. బాబూజీ చెప్పేదేమంటే, రోజూ మీరు ఎన్ని తప్పులైనా చేయ్యొచ్చు. ఫరవాలేదు! కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యకు అని. మనవల్ల ఏదైనా పొరపాటు జరగవచ్చు. మనం మనుషులం, మానవులం కదా! పరిపూర్ణులం కాదు కదా! అందుకని భగవంతుని క్షమాపణ కోరాలి. ‘క్షమించండి, ఇంకెప్పుడూ మళ్ళీ ఈ తప్పు నేను చేయను.ఇంకెప్పుడూ ఇటువంటిది నా వల్ల జరగదు’ అని ఒక గట్టి సంకల్పం చేసుకోవాలి. ధ్యానం చెయ్యండి. ‘ప్రకృతి ప్రసాదించిన నాలోని ఈ లక్షణాలన్నీ సాధారణమవుతున్నాయి’ అనే సంకల్పం కూడా మనం చెయ్యవచ్చు. కామక్రోధాలు ప్రకృతి ద్వారా మనకు లభించిన వరాలు. వాటిని మనం పూర్తిగా నిర్మూలించలేం. ఏవిధంగా అయితే శక్తిని నాశనం చెయ్యలేమో అలా. సైన్స్ కూడా ఇదే చెబుతుంది కదా! ‘ఎనర్జీ కెన్ నెవర్ బి డెస్ట్రాయ్డ్’ శక్తిని మనం ఎన్నటికీ నాశనం చేయలేం. శక్తిని ఇంకొక శక్తిగా మార్చవచ్చు. ‘విద్యుత్’ ఒక శక్తి. అది బల్బులోకి వచ్చినప్పుడు కాంతినిచ్చేదిగా మారుతుంది. హీటర్ లో అదే వేడిమిగా మారుతుంది. కానీ శక్తిని ఎప్పటికీ నాశనం చేయలేం. క్రోధం కూడా ఒక శక్తియే. ఒకటి రెండు నిమిషాలు క్రోధాన్ని వాయిదా వెయ్యగలిగామనుకోండి. కొంచెంసేపటి కోసం…ఒకవేళ మీలో ఇంత ఎరుక ఉంటే, చైతన్యం ఉంటే…! బాబూజీ తో కనెక్ట్ అవ్వండి. అప్పుడు ఆ కోపమే మీలో ఒక దయతో కూడిన భావాన్ని కలుగచేస్తుంది. ఇతరులపై, అంటే ఎవరి మీద అయితే మనకు కోపం వచ్చిందో, వారిపై జాలి కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం! మనకి లోపల దుఃఖం కూడా కలుగుతుంది. అప్పుడు మనలో ఎటువంటి భావన కలుగుతుందంటే, ‘పాపం, వాళ్ళవల్ల తప్పు జరిగింది. జరిగితే జరిగింది. సరే! నేనెందుకు కోపం తెచ్చుకునే తప్పు చెయ్యాలి? ఒక్కోసారి తప్పు జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎంతో కొంత తెలియచేయాలి. మీ తప్పు ఈ కారణంగా జరిగింది అని తెలియచేసి, మనమందరం కలసి ఇప్పుడు ఆ తప్పును ఈ విధంగా సరిదిద్దుకుందాం, అని చెప్పగలగాలి. అలా చెయ్యడం వల్లనే, అప్పుడే మనం ఇతరుల హృదయాలను కూడా స్పృశించగలుగుతాం. వాళ్లలో మార్పును కూడా తీసుకు రాగలుగుతాం. అందుకని క్రోధాన్ని, కోపాన్ని కొంచెంసేపు వాయిదా వేసి మాస్టర్ తో అనుసంధానం అవ్వండి.
నయవంచన ఎదుర్కోవడం
ఇది స్వాభావికమైనది. మీరు ఎవరినైనా నమ్మకపోతే అది మీకే హాని చేస్తుంది. కొంతమంది మంచివాళ్లు కూడా ఉంటారు. ఎందుకంటే మీ మొదటి అనుభవంలోని స్నేహితుడు చాలా మంచివాడు అయ్యుండవచ్చు. వివాహం చేసుకుంటానని కూడా మాట ఇచ్చాడు. అయితే మీరు అనవసరమైన చిక్కుల్లో పడి… వివాహానికి ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి మీద నమ్మకం పోతుంది. ‘నేనింక ప్రేమించను’ అని నిర్ణయించుకుంటే ఎవరికి హాని కలుగుతుంది? మీకే కదా! ఎలాగైతే నది ప్రవహిస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక రాయి ఎదురై దానిని ఆపేస్తుంది. అది తప్పించుకొని ముందుకు వెళుతుంది. మరొక రాయి అడ్డు వచ్చింది. మీరు వెళ్లకపోతే ఏం చేస్తారు? ఒకేచోట నిలిచిపోతారు కదా! నాచు పడుతుంది. దుర్గంధం వస్తుంది. హృదయం యొక్క ప్రవాహాన్ని, ప్రేమ యొక్క ప్రవాహాన్ని ఆపినట్లైతే మనలో దుర్గంధం పెరుగుతుంది. నమ్మడం మన సహజ స్వభావం. ఎవరైనా మనల్ని మోసం చేస్తే, అది వారి స్వభావం. హృదయాన్ని కొంచెం విశాలం చేసుకొని వారిని క్షమించండి. బండిని నడిపించండి. లేదంటే మీరు అక్కడే ఆగిపోతారు. అప్పుడు కష్టం మనదే అవుతుంది. అందువల్లనే ఆశించడం, లేకపోవడం అనేది పెద్ద విషయం కాదు. మనం నమ్మకం ఉంచడం మంచిదే. ఒకసారి ఒక వ్యక్తితో కష్టం కలిగింది. సరే! అందరూ అలా ఉండరు కదా! ఏమో ఎవరు చెప్పగలరు? ఆ వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత మారిపోయి ఉంటాడేమో! బుద్ధిమంతుడయ్యాడేమో! హార్ట్ ఫుల్ నెస్ లోకి కూడా వచ్చి ఉంటాడేమో! అప్పుడు మీరు కూడా అంటారు. అతడు పది సంవత్సరాల క్రితం ఇలా చేశాడు. కానీ ఇప్పుడు మహాత్ముడు అయ్యాడు అని. మీ గురించే ఆలోచించండి. మీరు ఎప్పుడూ అలా చేయలేదా? ఎప్పుడో ఒకప్పుడు అలా చేసే ఉంటారు కదా! ఎవరో ఒకరితో ఇలా తెలివిగా వ్యవహరించే ఉంటారు కదా! మీ మీద అలాంటి అభిప్రాయమున్న వ్యక్తి మీతో ఎలా మంచి సంబంధాన్ని ఏర్పరచుకోగలడు? నేను ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాను. నేను చదువుకునే రోజుల్లో మా క్లాస్ జరిగేటప్పుడు… ప్రొఫెసర్లు బోర్డు పై వ్రాసేటప్పుడు మాలో నుండి ఇద్దరు ముగ్గురు పిల్లలు లేచి కిటికీ గుండా బయటకు వెళ్లిపోయేవారు. ఇద్దరు, ముగ్గురు వెళ్లిపోయారని ప్రొఫెసర్లకు కూడా తెలుస్తూ ఉండేది. తరువాత వాళ్ళు పట్టుబడతారు కూడా. ముందు హాజరు తీసుకునేటప్పుడు ఉండి… తిరిగి ఆఖరున తీసుకునేటప్పుడు ఇద్దరు, ముగ్గురు తగ్గిపోయి ఉండేవారు. హాజరు పలకని వాడు పట్టుబడతాడు. ఇప్పుడు వారి ప్రార్థన ఎలా ఉంటుంది? ఈ ప్రొఫెసర్ మర్చిపోతే బాగుండును అని. మీ నమ్మకం పోయింది కదా? కానీ మనం ప్రార్థిస్తాం. ఆయన మర్చిపోతే, మన మీద నమ్మకం ఉంటే మరో రెండు మూడు మార్కులు ఎక్కువ వస్తాయి అని. ఇతరులు మన తప్పులను క్షమించాలని మనం ఆశించినప్పుడు, వారు కూడా మనం వారి తప్పులు మరిచిపోవాలని ఆశిస్తారు.
దివంగత ఆత్మలకై ప్రార్థన
మనం వారికోసం ప్రార్థించవచ్చు. మీరు వారిని పిలువలేరు. మీ నానమ్మ కానీ తాతయ్య కానీ, వారు ఎక్కడ ఉన్నా వారికి కూడా ఈ ప్రాణాహుతి లభించాలని ప్రార్థించండి. దాని వలన వారి ఆత్మకు కూడా అధిక శాంతి లభిస్తుంది. ఎవరినీ కూడా ‘మేము సత్సంగ్ లో కూర్చున్నాము, మీరు కూడా రండి’ అని పిలవలేం. మనం ఆత్మను ఆదేశించలేం. ఆత్మలు స్వతంత్రమైనవి. వారికి ఇష్టమైతే మన అందరినీ ఆశీర్వదించడానికి రావచ్చు. కానీ మనం వారిని ‘రండి! మాతో కూర్చోండి’ అని ఆదేశించలేం. కానీ మనం ‘మీరు వస్తే బాగుంటుంది… మాతో పాటు ధ్యానించండి’ అని ప్రార్థించవచ్చు. అది పరవాలేదు! రావడం, రాకపోవడం అనేది వారి ఇష్టం.
తెరచిన కనులతో ధ్యానించడం ఎలా?
మీరు ఇప్పుడు ధ్యానం ముగించారు కదా! ధ్యానానికి ముందున్న స్థితికి, ధ్యానం తర్వాత స్థితికి గల భేదం మీరు గమనించే ఉంటారు. కళ్ళు మూసుకుని చేసిన ధ్యానం అనంతరం మనకు లభించిన స్థితిని, కళ్ళు తెరచుకొని ఉన్న సమయంలో కూడా గట్టిగా పట్టుకొని ఉంచాలి. ఆ అనుభూతిని రోజంతా కొనసాగించాలి. నేను ఏం చేసేవాడినంటే, ప్రతిరోజూ ఉదయం 6:00 – 6:30 కు నా ధ్యానం పూర్తయ్యేది. తర్వాత అల్పాహారం ముగించుకొని ఆఫీస్ కు వెళ్ళవలసి ఉంది. అయితే ఏ రోజూ కూడా ధ్యానం ముగిసిన వెంటనే హడావుడిగా పరుగెత్తేవాడిని కాదు. ధ్యానం అనంతరం ఒక 4, 5 నిముషాలు విశ్రాంతిగా కూర్చునేవాడిని. అప్పుడప్పుడు మూడ్ బావున్నప్పుడు బాబూజీ మహరాజ్ రచనలు గానీ లేదా విస్పర్స్ గానీ చదివేవాడిని. ధ్యానానంతర స్థితిని కొంత అవలోకనం చేసుకొని, ‘ఈ రోజు నాకు ఇలా అనిపించింది’ అని డైరీలో వ్రాసుకునే వాడిని. ధ్యానానంతర స్థితిని పట్టి ఉంచాలి. అయితే ఈ స్థితి చాలా సూక్ష్మంగా ఉంటుంది. కొంత నిర్లక్ష్యం వహించినా ఆ స్థితి నాశనం అవుతుంది. ఆ స్థితి గులాబీ పూల కంటే సూక్ష్మంగా ఉంటుందని బాబూజీ అనేవారు. గాలిని ఎలాగైతే పిడికిలి లో బంధించి ఉంచలేమో, అలాగే ఆధ్యాత్మిక స్థితిని కూడా బంధించి ఉంచడం కష్టమైన విషయం. హృదయంతో ఆ అనుభూతిని ఆస్వాదించాలి. ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు ఆ స్థితితో అనుసంధానం చెందాలి. భోజనం చేసే సమయంలో కూడా ఆ స్థితిని పట్టి ఉంచాలి. ఉదయం ధ్యానంలో లభించిన స్థితిని పునరావలోకనం చేసుకొంటూ ఉండాలి. ఉదయం ధ్యానంలో ఏం జరిగింది అన్న విషయాన్ని మనం అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. అప్పుడు ఒక నిమిషం లేదా అర నిమిషం పాటు కళ్ళు మూసుకొని అవలోకనం చేసుకొంటే, ఆ స్థితి వెంటనే స్ఫురిస్తుంది. బాబూజీ మనకు ఆ స్థితి వెంటనే స్ఫురించేలా చేస్తారు. మనం ఏదైనా ఆధ్యాత్మిక స్థితిని కోరుకుంటే… ఆయన హృదయపూర్వకంగా దాన్ని మనకు బహుమతి రూపంలో అందజేస్తారు. ఉదయం మనకంటూ ఒక స్థితిని ప్రసాదించారు. దాన్ని మనకు తిరిగి ఎందుకు ఇవ్వరు? మన నిర్లక్ష్య ధోరణి వలన మనం ఆ స్థితిని పోగొట్టుకున్నాం. తిరిగి లభించిన ఆ స్థితికి జీవం పోయాలి అంతే. మనమైతే ఆ స్థితిని పొందేసాము. మీ అందరికీ ఐదు ఒవెల్స్ (ఇంగ్లీషులో అచ్చులు) ఏ, ఈ, ఐ, ఓ, యు లు తెలుసు కదా! ధ్యానం ద్వారా మనం ఆధ్యాత్మిక స్థితిని పొందుతాం (అక్వైర్).ఎన్లైవెన్ అంటే ఆ స్థితికి జీవాన్ని ఇవ్వడం. ఎందుకంటే మనం అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. తిరిగి జీవింప చేయాలి. దాన్ని మరింత తీవ్రతరం చేయాలి. తీవ్రతరం చేసి లోనికి గ్రహించాలి (ఇంబైబ్). దానివల్ల ఆ స్థితిలో ఐక్యమవుతాం (వన్ నెస్). ఇక యూనియన్ అంటే భగవంతునితో లయం చెందుతాం. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. అది బాబూజీకి చాలా ఇష్టమైన కథ. నేను ఒకసారి ఈ కథను అభ్యాసులకు వివరిస్తూ ఉంటే, వెనుక కూర్చుని ఉన్న బాబూజీ విన్నారు. తర్వాత ఆయన ఒక ప్రిసెప్టర్ ను పిలిచి, ‘ఈ పిల్లవాడు ఎవరు? లోనికి పిలుచుకుని రా!’ అని చెప్పారు. ఏమైనా తప్పు జరిగిందేమోనని నాకు భయం వేసింది.కానీ ఏ కథను నేను వారికి చెప్పానో, అది ఇప్పుడు చెప్తాను. అది నిరంతర స్మరణ గురించిన కథ. అది ఈ ప్రశ్నకు సంబంధం కలిగి ఉన్నది. ఒక చిన్న అబ్బాయి సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు ఎలాంటి సైకిల్ ను ఇస్తాం? నాలుగు చక్రాలు లేదా మూడు చక్రాలు ఉన్న సైకిల్ ను ఇచ్చి సపోర్టుగా వెనుక నుండి తోస్తాం కూడా. తర్వాత రెండు చక్రాల సైకిల్ ప్రక్కన రెండు చిన్న చక్రాలు అమర్చబడి ఉన్నదాన్ని ఇస్తాం. మొత్తం నాలుగు చక్రాలు ఉంటాయి. అలా కొంత శిక్షణ పొందిన తర్వాత రెండు చక్రాలు ఉన్న సైకిల్ నిచ్చి వెనుక పట్టుకుని సపోర్ట్ చేస్తాం. తర్వాత వాడు రెండు చక్రాల సైకిల్ పై స్కూల్ కి వెళ్తాడు.రెండు చక్రాలు ఉంటాయి కాబట్టి బైసికిల్ అంటాము. బై అంటే రెండు. తర్వాత తనే చేతులతో పట్టుకొని నడుపుతాడు. ట్రాఫిక్ ను చూస్తాడు, అప్పుడప్పుడు ఒక చేయి వదిలేస్తాడు, ఒక్కోసారి రెండు చేతులు కూడా వదిలేస్తాడు. పాటలు పాడుతూ వెళ్తాడు, స్నేహితులతో గప్పాలు కొడతాడు. కానీ మాట్లాడుతూ ఉన్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ, ట్రాఫిక్ ను చూస్తున్నప్పటికీ, సైకిల్ పెడల్స్ ను తొక్కుతూనే ఉంటాడు. అంటే మనల్ని మనం హృదయపూర్వకంగా నిరంతర స్మరణలో ఉంచుకొని, మాస్టర్ తో అనుబంధంలో ఉంటూనే, ప్రక్కనున్న పనులన్నీ చేస్తూ ఉండాలి. ఇది చాలా సులువు. చిన్నపిల్లవాడు సైతం చేయగలిగినప్పుడు, మనమంతా ధ్యానులం కదా! ఉదయం ఏర్పడిన ధ్యానస్థితిని మన స్వభావంగా చేసుకోవాలి. రెండవ రోజు ఆధ్యాత్మిక స్థితి ఏర్పడుతుంది. దాన్ని కూడా మన స్వభావంగా చేసుకోవాలి. మూడవ రోజు… అలా మన అస్తిత్వపు క్రమానుగత ఆధ్యాత్మికతను పొందడం జరుగుతుంది. దాన్ని విశ్వామిత్రుని వలె మన చేతిలో నుండి జారిపోనివ్వవద్దు.
సమయ పరిమితిని విధించకండి
ధ్యానం, నిర్మలీకరణ, రాత్రి ప్రార్థన నిర్ణీత సమయాలలో చేయండి. వాటితో పాటు మీకు కలిగే మనోభావాలను పొందుపరచండి. కొంతమంది వ్యక్తులు స్వేచ్ఛ తీసుకుంటారు. రేపు చేద్దాంలే అంటూ వారు నేడు కేవలం 40 నిమిషాలు లేదా… 10 నిమిషాలు మాత్రమే ధ్యానం చేద్దామని నిర్ణయాలు తీసుకుని కూర్చుంటారు. అభ్యాసీగా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు కాలపరిమితి విధించుకోకూడదు. మాస్టర్ గారికి ప్రార్థన చేసి కూర్చోవాలి. సిట్టింగ్ 5 నిమిషాల్లో అయిపోయినా అది వారి అభీష్టం, గంటలో పూర్తయినా అదీ వారి అభీష్టమే. ఇది ఒక గంట కంటే ఎక్కువ ఎలాగూ ఉండదు. సమయ పరిమితిని ఉంచవద్దు. దానిని వదలి వేయాలి. లేకుంటే ఇదీ సమస్యగా మారుతుంది. నేను ఈ రోజు 20 నిమిషాలు కూర్చుంటాను అనే తీర్మానంతో కూర్చుంటే… అప్పుడు నా మనస్సు కూడా దీని గురించే ఆలోచిస్తుంది. 20 నిముషాలలో సిట్టింగ్ పూర్తి చేయాలి అని. కాబట్టి అప్పుడు మీరు కోరుకున్నంత లోతుకు వెళ్లలేరు. ఎందుకంటే శరణాగతి భావంతో మాత్రమే మనం లోతుగా వెళ్లగలం… కానీ శరణాగతి లేకుండా, ఈ రోజు నేను 20 నిమిషాలు ధ్యానం కోసం కూర్చుంటాను అని షరతు విధించలేం. ప్రేమలో షరతులతో మీరు నొక్కిచెప్పలేరు. పెళ్లి విషయంలో కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అయితే ఫలానా, ఫలానా షరతులతో అని అంటే ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకోవాలని నా ముందుకు కండిషన్స్ తో వస్తే, తిరస్కరిస్తాను. మొదటి నుంచీ ఇలాంటి షరతులు పాటిస్తూ, మనం కూడా ఇలాంటి తప్పులకు పాల్పడుతున్నాం. నేను 20 నిమిషాల్లో పూర్తి చేస్తాను… 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను అనే షరతులను ఎప్పుడూ ఏర్పరచుకోకండి. ఏం జరగాలో, దాన్ని అలా జరగనివ్వండి. భగవంతుడిని పూజించడం అంటే ఇలాగే ఉండాలి. ఇది ఒక్కటే అభ్యర్థన! అందరూ ప్రిసెప్టర్ వద్దకు వెళ్లి ముఖాముఖి సిట్టింగులు తీసుకోవాలి. సామరస్య పూర్వకంగా ఉండండి. పరస్పర విశ్వాసాన్ని కొనసాగించండి. ఒకరినొకరు గౌరవించుకోండి. అప్పుడు మన మిషన్ ఎంతవరకు అభివృద్ధి చెందుతుందో చూడండి.