01-03-2023
క్షమాగుణం యొక్క పాత్ర
క్షమాగుణమే సర్వస్వం. మీరు అడుగుతోంది క్షమ గురించే కదా! అష్టావక్రుడిని కూడా జనకమహారాజు అడిగాడు, “ముక్తి ఎలా పొందాలి? వైరాగ్యం ఎలా అభివృద్ధి చేసుకోవాలి?” అని. మీకు ముక్తిపై కోరిక ఉంటే – “కోరికలను విషప్రాయంగా పరిగణించండి” అని వారు రాజుకి చెప్పారు. కోరికలను విషంగా పరిగణించండి మరియు ఈ ఐదు లక్షణాలను అభివృద్ధి చేసుకోండి. అందులో క్షమ ఒకటి. క్షమ, ఆర్జవ, సంతోషం … ఇది ఇలా కొనసాగుతుంది, ఐదు లక్షణాలలో చివరిది సత్యం. మొదటి గుణం క్షమ. మాకు ఎవరో ద్రోహం చేశారని అంటుంటారు కదా! అలాంటప్పుడు మనపై రెండు రకాల ప్రభావం పడుతుంది. మన మనసుకి, మన మెదడుకు అది ఎప్పటికి గుర్తుంటుంది. దాన్ని గురించి ఆలోచిస్తేనే గుండెల్లో భారం అన్పిస్తుంది. గుండె బరువెక్కుతుంది, మనం మర్చిపోలేం కానీ క్షమించగలం. మనం ఎవరినైనా క్షమించినప్పుడు, ఒక రకమైన భారం తొలగిపోతుంది. మనం స్వతంత్రులం అవుతాం. విముక్తి అంటే ఇదే. సంపూర్ణ స్వేచ్ఛ. ఎవరితోనూ ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు ఏమీ ఉండవు. ఎవరితోనూ గొడవలు ఉండవు. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినా, ఇచ్చామని కూడా గుర్తుండదు. ఒక చేత్తో ఇవ్వడం, మరో చేత్తో మరచిపోవడం.
మనం క్షమించకపోతే నష్టం ఎవరికి? వాళ్లదేం పోతుంది? వాళ్లు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. నాకు పదే పదే ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. నా ఉద్దేశ్యం ఒకరిద్దరి నుండి అని కాదు, వేలాదిమంది నుండి వస్తాయి. ప్రధాన సమస్య అమ్మాయిలతోనే. “నేను ఆ అబ్బాయిని ఎంతగానో ప్రేమించాను, కాని అతను వేరే అమ్మాయితో వెళ్లిపోయాడు. తరువాత నేను మరొక అబ్బాయిని కలిశాను. అతను మొదట్లో చాలా మంచివాడే, కానీ తరువాత నన్ను కొట్టడం ప్రారంభించాడు. తర్వాత అతను కూడా వెళ్లిపోయాడు. “ప్రస్తుతం ఎవరినీ ప్రేమించవద్దని నా మనసు చెబుతోంది” అంటూ అమ్మాయిలు ఉత్తరాలు వ్రాస్తారు. కాబట్టి దీనికి నేను ఏం సమాధానం చెప్పాలి? నీవు ఎవరినీ ప్రేమించవా? ఆ ఇద్దరూ మూర్ఖులు. మరి నీవెందుకు అంత తెలివితక్కువదానివి అయ్యావు? నీ హృదయాన్ని పూర్తిగా తెరిచి కూర్చున్నావు. ఇందులోనూ ఓ స్వార్థం ఉంది. శారీరక ఆనందం అని పిలవండి లేదా ప్రేమ యొక్క ఆకలి అని పిలవండి, మీరు దాన్ని చల్లార్చుకోడానికి ఇదంతా చేసారు. కాబట్టి, దీన్ని అర్థం చేసుకోవాలి … చాలా చేదు అనుభవాలు ఎదురైన తర్వాత, ‘సరే, ఇక నేను ఎవరినీ ప్రేమించను’ అని ఆమె తన హృదయాన్ని మూసివేస్తుంది. ఇప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది? నీకు మాత్రమే గదా! నీటిని మూసేసినట్లు హృదయాన్ని చేస్తే, ప్రవహించే నీటిని ఆపితే ఏమవుతుంది? ఒక చెరువు మాత్రమే ఉంటుంది. చెరువు ఏమవుతుంది? దాన్ని మూసి ఉంచితే దుర్వాసన వస్తుంది. ప్రేమ ప్రవాహం ఆగిపోతే, మనిషి రాయి అవుతాడు. “నేను ఎవరినీ ప్రేమించను” అంటే మీరు రాయిగా మారారు… ఎవరి శాపం లేకుండానే అహల్య లా మారినట్లు.
సంతోషం - ఆనందం
యోగ శాస్త్రంలో మనం దేన్నైతే సచ్చిదానందం అంటామో, అదే ఆనందం. కానీ సంతోషం అనేది వేరు. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే తన జీవితానికి అవసరమైన కూడు, గూడు, బట్ట అనేవి… సరిపడా లభించినప్పుడు అతనికి విశాంత్రి లభిస్తుంది. ఎక్కడైతే అశాంతి ఉండదో అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ సుఖం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. కృష్ణ భగవానుడు చెప్పిన చాలా అందమైన శ్లోకం ఒక్కటి ఉంది. అది 2వ అధ్యాయం లోని 66 వ శ్లోకం. ప్రాణులన్నింటికి సుఖం కావాలని వారు అంటారు. సుఖం అవసరం లేనిదెవరికి? ప్రతి మనిషికి, అన్ని జీవ జంతువులకు, చెట్లు, మొక్కలకు కూడా విశ్రాంతి కావాలి. అవి కూడా తినడానికి, తాగడానికి లేకపోతే వాడి పోతాయి. హృదయంలో శాంతి లేని వ్యక్తి సుఖాన్ని పొందలేడు. అన్నీ ఉన్నప్పటికీ శాంతి లేకపోతే సుఖం ఉండి కూడా అది అతనికి దూరంగా ఉంటుంది. అటువంటప్పుడు శాంతిని పొందడం ఎలా? శాంతమనస్కుడు ఎలా అవుతాడు? శాంతికి, మనసుకు చాలా లోతైన సంబంధం ఉంది. ఏ మనసైతే ఆలోచించగలదో, ధ్యానించగలదో, సామరస్యత కలిగి ఉంటుందో, అక్కడ శాంతి ఉంటుంది. మనం ఆలోచన ఎలా చేయాలి? మన ఆలోచనలు ఎప్పుడైతే మన అధీనంలో ఉంటాయో అప్పుడు మనం సరిగా ఆలోచించగలం. మనసు ఎప్పుడు మన అధీనంలో ఉంటుందంటే మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. ధ్యానం, సుఖం, విశ్రాంతి, శాంతి ఇవి నేరుగా పరస్పర ఆధారితాలు. ఎందుకంటే ధ్యానంలో నిమగ్నం అయిన వ్యక్తి యొక్క వివేకం, బుద్ధి కూడా చక్కబడతాయి. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే అన్ని విషయాలు గుర్తించబడతాయి. తప్పు చేయడానికి ముందే ధ్యానంలో, ఇది చేయవచ్చు, అది చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. నాలుగైదు నెలల వయసున్న పిల్లవాడికి కూడా చేతిలోంచి పాలసీసా కింద పడిపోతోందన్న విషయం తెలుస్తుంది.
ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది. మరి మనకి ఎందుకు తెలియదు? మనకి కూడా తెలుస్తుంది. కానీ, వినడానికి ఇష్టపడం. ఒక వ్యక్తి ఎవరినో తిడతాడు, ‘ఫర్వాలేదు. తిట్టడం మన హక్కు’. అటువంటి వ్యక్తులకు మనం ఎలా చెప్పగలం? ఎవరైతే తెరచిన హృదయంతో, మీ సహాయం లేనిదే నేను పురోగమించలేను అని వేడుకుంటాడో, అతడినే భగవంతుడు ఇష్టపడతాడు. దుర్యోధనుడు గర్విష్టి అనే విషయం మీ అందరికి తెలుసు. “జానామి ధర్మం నచమే ప్రవృత్తి” ధర్మం ఏమిటో నాకు తెలుసు… కానీ నేనేమి చేయలేను. అధర్మం ఏమిటో కూడా నాకు తెలుసు, కానీ దాన్ని వదలలేకపోతున్నాను. అటువంటప్పుడు కొద్దో గొప్పో తెలివి ఉంటే మాత్రం శ్రీకృష్ణ భగవానుడిని … “ప్రభూ! నాకు సాయం చేయండి, నా హృదయం తెరచి ఉంది, నేను హృదయ పూర్వకంగా చెబుతున్నాను,” అని ప్రార్ధించవచ్చు. కానీ మనం తప్పు చేసిన తర్వాత కూడా విన్నవించుకోము. అటువంటి వారి పైన సంస్కారాల బరువు పెరుగుతూనే ఉంటుంది. సంస్కారాలు ఉన్నంతవరకు అవి మంచివైనా చెడ్డవైనా జనన మరణ చక్రం తిరుగుతూనే ఉంటుంది. చెడ్డవి అనుభవించడానికి కావచ్చు, మంచివి అనుభవించడానికి కావచ్చు. అనుభవించడానికైతే రావలసి ఉంటుంది. మనం పూర్తిగా సంస్కార రహితులం అయ్యేంతవరకూ మోక్షాన్ని ఎంత మాత్రం ఆకాంక్షించలేమని యోగశాస్త్రం చెబుతుంది.
అంతర్యామి
ఈ అంతర్యామి, ఆత్మ అనేది, ఆత్మానుభవం అనేది అందరికీ వారి వారి లోపలే కలుగుతుంది, బయట ఎప్పటికీ కలగదు. మనందరి ఆత్మా మనలోనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి, చివరి శ్వాస వరకు మనలోనే ఉంటుంది. అందువలన మనం అంతర్ముఖులమై ఈ ఆత్మ వైపు ధ్యాస నిలపాలి.కానీ మనం కనీసం ఒక్కసారి కూడా ఇందుకు కృతజ్ఞత తెలపలేదు. మీరు ఎప్పుడైనా మనలో కొలువై ఉన్నందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలిపారా? హే భగవాన్! మీరు నాలో ఉన్నారు. అందుకు కృతజ్ఞతలు! మీకు మీరే ధన్యవాదాలు ఎలా తెలుపుకోగలరు? మన ఇంగితానికి ఇది సాధ్యమా? వారికి ధన్యవాదాలు చెప్పలేం కానీ హృదయంలో ఒక భావన ప్రకటించాలి. ఈ భావ ప్రకటన ఎలా చెయ్యగలం? ఎవరు లేకపోతే మీరు జీవించి ఉండలేరో ఆయన ఉనికినే మీరు ప్రశ్నిస్తుంటే ఇది ఎలా సాధ్యం? శ్రీరామకృష్ణ పరమహంస, ఇలా భగవంతుడు ఎక్కడ ఉన్నాడని అడిగేవారిని, నీటిలోని చేప, నీరు ఎక్కడ ఉంది అని అడిగినట్లుంది, అనేవారు. నీళ్ళలోంచి బయట పడవేస్తే కదా, దానికి తెలిసేది. మనలో ఉన్న భగవంతుడు మనలో లేకుండా మాయమైతే, అప్పుడు తెలుస్తుంది. మీరు మంచి నిద్రలో ఉన్నప్పుడు, రాత్రి పన్నెండు గంటలకు ఆత్మ మీ శరీరాన్ని విడిచి పెట్టింది అనుకోండి.
మీలో ఎవరికైనా భగవంతుని కృపవలన అలా మీలోని ఆత్మ వెళ్లిపోతే…
ఈ ఆలోచనే మిమల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది. ఎందుకు భయం అంటే చెయ్యవలసిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి అని. కానీ తన బాధ్యతలను, విధులను సక్రమంగా పూర్తిచేసి సిద్ధంగా ఉన్న వాడికి, ఏ విధమైన విచారం ఉండదు. భగవంతుని అంతగా ప్రేమించిన వాడు, భగవంతునిలో కలిసి పోవడానికి ఎందుకు భయపడతాడు? మరణం తరువాత ఆత్మ పరమాత్మతో ఐక్యం అవుతుంది. ఇందులో భయపడడానికి ఏముంది? చాలామంది మృత్యువంటే భయపడతారు. భగవంతునిపై ప్రేమ లేనివారికి మరణమంటే భయం. భగవంతునిపై ప్రేమ వుంటే, మీకు మృత్యువంటే భయం ఉండదు. కాబట్టి మీ పనులన్నీ చక్కబెట్టుకుని ఉండాలి. భగవంతుడు మీతో ‘వెళదామా నాయనా!’ అని అంటే, మీరు ‘నేను తయారుగా ఉన్నాను స్వామీ’ అనాలి. మీ గుండెలపై చెయ్యేసుకుని నా బాధ్యతలన్నీ నిర్వర్తించాను, ఏదీ మిగలలేదు అని నిబ్బరంగా ఉండవచ్చు. మీరు ముప్ఫై, నలభై, యాభై లేదా అరవై ఏళ్ల వయసు వారైనా సరే, ఏ సమస్యా ఉండదు. భగవంతుని పిలుపు వస్తే సిద్ధంగా వుండాలి. భగవంతుని ఎంతగా ప్రేమించాలంటే, పనులన్నీ వాటికవే పూర్తయిపోవాలి.
భౌతిక, ఆధ్యాత్మికతల మధ్య సమన్వయం
మన భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో సమన్వయం వుండాలి. ఒకేదానిలో లోతుగా కూరుకుపోకూడదు. ఆధ్యాత్మికతలో నీ భౌతిక బాధ్యతలను మరచిపోయేంతగా లోతుగా వెళ్లకూడదు. ఆ విధంగా చేయకూడదు. అలా చేస్తే పిల్లలకు ఫీజులు ఎవరు కడతారు? ఇంటి బాధ్యతలను ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులకు సేవ ఎవరు చేస్తారు? అవన్నీ చేయవలసిందే! మనం పిచ్చివాళ్లం కాదు కదా?
భౌతికతలో కూడా మన ఆధ్యాత్మిక బాధ్యత లేనంతగా, లోతుగా వెళ్లకూడదు. రెండూ సమంగా వుండాలి, బ్యాలెన్స్ గా వుండాలి. దీనినే సమతుల్య జీవనమంటారు. మీకు నా వ్యక్తిగత కథ ఒకటి చెబుతాను. నాకు 18 సంవత్సరాల వయసులో ఇది జరిగింది. మామూలుగానే ఆ వయసులో ఏదో తెలియని ఆశయం వుంటుంది కదా! నేను కూడా వివేకానందుడి లాగా కావాలని వుండేది. మీలోనూ కొందరికి అలాగే స్వామీజీలా అయిపోవాలనే కోరిక వుండవచ్చు! దాని అర్థం ఏమిటి? గ్రామ గ్రామాన పర్యటించాలి అనే కోరిక. ఇంకేముంది? ఒకరోజు ఉదయమే నేను ఇంటి నుంచి అమ్మ, నాన్నతో చెప్పకుండా బయలుదేరాను. మా ఇల్లు నర్మదా నదికి దగ్గరలో వుంది. ఎందుకంటే మా ఊరు నర్మదా నది ఒడ్డునే ఉన్నది. నేను ఆ నది ఒడ్డుకు వెళ్లాను. అక్కడ శిథిల స్థితికి చేరిన ఓ శివాలయం ఉన్నది. అక్కడ అఘోరా బాబా సన్యాసుల గుంపుతో కూర్చుని వున్నారు. నేను ప్రొద్దుటే వెళ్లి ఆయన్ని చూస్తూ వున్నాను. ఆయన కూడా ఈ మూర్ఖుడు ఎక్కడి నుంచి వచ్చాడో అన్నట్లుగా చూస్తూ వున్నారు. అయినప్పటికీ నేను ఒక చెట్టు క్రింద కూర్చుని, ఆయన ఏం చేస్తున్నదీ చూస్తూ వున్నాను. సాయంత్రమైంది. ఆ వృద్ధ సన్యాసి నా వైపు జాలిగా, ‘ఇతడు ఇక్కడకు ఎందుకు వచ్చాడు? ఏమి చేస్తున్నాడు?’ అన్నట్లు చూశాడు. ఆయన నన్ను ‘నీవు ఏం చేయాలని అనుకుంటున్నావు’ అని అడిగాడు. ‘మీరు నాకు గురువైతే, నేను మీకు సేవ చేస్తాను’ అని నేనన్నాను. ‘ప్రస్తుతం నీవు ఏం చేస్తున్నావు’ అని వారు నన్ను అడుగగా, నేను ఫార్మసీ చదువుతున్నానని చెప్పాను. ఆయన నన్ను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. ఇంకా ఇలా అన్నారు. ‘ఆ రోజుల్లో ఇప్పటిలా తారీఖులు వేసేవారు కాదు కాబట్టి నా వయసు సుమారు ఎనభై, ఎనభై రెండు వుండవచ్చు. ఇప్పటి వరకు నాకు భగవంతుడికి సంబంధించిన ఎటువంటి అనుభూతీ కలగలేదు. ఇప్పటికీ నేను ఇలా వ్యర్ధంగా తిరుగుతూనే వున్నాను. నీవు ఇంటికి వెళ్లు. నాకు కూడా ఇంటికి వెళ్లాలని అనిపిస్తూ వుంటుంది. కానీ జనం నన్ను తిరిగి వచ్చేశాడని నవ్వుతారు. వారి ముందు నేను అవమానించబడతాను. అయినా నన్నిప్పుడు ఎవరు గుర్తుపడతారు? నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు కూడా. నాకే ఎనభై రెండు సంవత్సరాలు. నా తల్లిదండ్రులు కూడా వెళ్లిపోయి వుంటారు’ అని చెప్పారు. ఔను! ఆయన్ని ఎవరు గుర్తుపడతారు? ఆయనకు తిరిగి వెళ్లిపోవాలనే కోరిక వున్నా కూడా వెళ్లలేదు. వెళ్లలేడు… కానీ ఆయన మాటలు నా హృదయాన్ని తాకాయి. ఎందుకంటే ఆయన కళ్లల్లో ఒక విధమైన జాలి వుంది, ఒక విధమైన దయ వుంది. ‘నేను చేసిన తప్పు నీవు చేయవద్దు’ అని ఆయన అన్నారు.
లక్ష్యం పట్ల ఎలా జాగృతమవ్వాలి?
లక్ష్యం పట్ల ఎలా జాగృతం కావాలి? ఇది సందిగ్ధం, అయోమయం కలిగించే విషయం. ఇది మీ లక్ష్యం కావాలి అని నేను తెలిపినా, మీరు విఫలులౌతారు. మేం మీకు ఇస్తున్నదేంటో తెలుపుతాను. మీరు గనక ఒకరికి 6 ప్యాక్ శరీరం తయారవాలని అంటే, అది ఒక ధ్యేయం అవుతుంది. అదే నేను గనక ఒక పిల్లవాడితో సరదాగా ‘పద మనం ఆడుకుందాం, కొంచెం మజా చేద్దాం… వెయిట్ లిఫ్టింగ్ చేద్దాం, కుస్తీ చేద్దాం,’ అంటే అది సరదాగా చేసే పని అవుతుంది. అందులో ఎటువంటి సమస్యా వుండదు. పైగా ఆ పిల్లవాడు తనంతట తానే బలంగా తయారవుతుంటాడు. సహజ మార్గం, హార్ట్ఫుల్నెస్ ద్వారా యోగిక ప్రాణాహుతితో, ధ్యాన స్థితితో జీవితం కొనసాగించాలని మాటిమాటికి మేము నొక్కి చెబుతుంటాం. హృదయం పవిత్రం, సరళతరం చేస్తే, స్వయంచాలకంగా ఏం కావాలో అది అవుతుంది. భగవంతుడు ఇటువంటి వ్యక్తుల వైపు పూర్తిగా ఆకర్షితుడవుతాడు. వారు మనల్ని లాక్కుంటూ ఉంటారు. మనం లక్ష్యం వైపు వెళ్ళనవసరం లేదు. అదే తనవైపు లాక్కుంటూ వుంటుంది. అలా ఎప్పుడు జరుగుతుంది? మన హృదయాన్ని శుద్ధంగా, పవిత్రంగా వుంచుకోగలిగినపుడు. మనం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం… ధ్యానం, నిర్మలీకరణ చేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ప్రార్ధన చేసి యోగనిద్రలో పడుకోవాలి. ఇదే లక్ష్యంగా పెట్టుకోండి. మనం సాధనను లక్ష్యంగా చేసుకుంటే, లక్ష్యం దానికదే కళ్ళముందుంటుంది.
14-03-23
భగవదనుభూతికి హృదయాన్ని తయారు చేయడం
ఇదే భగవంతుడు అని, నేను చూశానని మీరు అనుకుంటే, అది ఒక పెద్ద సమస్య అవుతుంది. బహుశా ఆయన దేవుడే కావచ్చు, కానీ హృదయంలో అనుభూతి చెందేవరకు… ఆయనను భగవంతుడు అని పిలవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే గుర్తించినప్పుడు, గుర్తింపు నుండి ఒక రకమైన శాంతిని అనుభవించడం ప్రారంభిస్తాం. మీరు శాంతిని అనుభవించడం ప్రారంభించినప్పుడు, ప్రయత్నం అనేదే ఉండదు, తపస్సు అనేదే జరగదు. అయితే దేవుడు ఎవరో తెలుసు. ఇది నిజం కూడా కావచ్చు, కానీ మీరు అనుభూతి చెందకుండానే వారిని అంగీకరించారు. చాలామంది ‘గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరా’ అంటారు. గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణువు, గురువు అంటే మహేశ్వరుడు అని ఇలా పోలిక తెస్తాం కదా! మనం ఎప్పుడు పోల్చగలం? ఆ రెండూ మనకు తెలిసినప్పుడు మాత్రమే. మీకు మహేష్ తెలియదు, విష్ణువు తెలియదు, బ్రహ్మ తెలియదు కానీ గురువు ఇలా ఉంటాడు అంటారు. అప్పుడు గురువు అంటే కూడా తెలియనట్లే. ఎవరూ తెలియకుండానే, మనం వారితో పోల్చేశాం. ఎందుకు? నాకు సంస్కృత శ్లోకం తెలుసు… నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు… అలాగ ఇది సమస్యగా మారుతుంది. ఎందుకు? నాకు సంస్కృత శ్లోకం తెలుసు… నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు… అలాగ ఇది సమస్యగా మారుతుంది. మన జ్ఞానం, జ్ఞాన సముపార్జన, అది మన వ్యక్తిగత అనుభవంపై ఆధారపడి ఉండాలి. అప్పుడు నేను దేవుడిని అనుభవించాను కాబట్టి నేను అంగీకరించినదాన్ని నమ్ముతున్నానని మనం నమ్మకంతో చెప్పగలం. సహజమార్గం అనేది మనకు అనుభూతిని క్రమంగా పెంచుతూ ఉండే మార్గం. మన హృదయ స్వచ్ఛత పెరిగే కొద్దీ, కొత్త కొత్త అద్భుత అనుభవాలకు సిద్ధమవుతాం. మురికి నీళ్లు – నూనె కలపండి. అలాగే స్వచ్ఛమైన నీరు, నూనె కూడా కలపండి. రెండూ స్వచ్ఛమైనవే. అయినా కూడా అవి కలవవు. రెండూ తమ తమ పరిధుల్లో స్వచ్ఛమైనవే. నీరు స్వచ్ఛమైనది, నూనె కూడా స్వచ్ఛమైనది, కానీ మిశ్రమం కాలేదు. రెండింటి స్వభావం వేరు. కబీర్ ఏమంటారంటే, ఒక వర్షపు చుక్క సముద్రంలో పడినప్పుడు అది సముద్రంగా మారుతుంది. కానీ నూనె పడితే, నూనె వర్షం పడితే, వేల సంవత్సరాల పాటు అది సముద్రపు నీటిపై తెట్టులా తేలియాడుతూనే ఉంటుంది. ఎన్నటికీ కలవదు. మరి ఆ నీటిచుక్క సముద్రంలో పడినప్పుడు, నేను సముద్రం అయ్యానని చుక్క ఎలా చెబుతుంది? అది ముగిసిపోయింది. చెప్పడానికి ఎవరూ లేరు… మరి భగవంతుని అనుభవం ఇలా ఉందని ఎవరు చెప్పగలరు? వారు చెప్పేవన్నీ అబద్ధాలే అవుతాయి. వారు తమ అనుగ్రహంతో మనలను అంతిమ తరగతిలో చేర్చినప్పుడు, అడగడానికి ఏమీ మిగలదు. మన నాలుక మౌనంగా మిగులుతుంది. అందుకే సనాతన ధర్మం, ఉపనిషత్తులలో ఏం చెప్పబడింది? అంతిమ స్థితిని ఏమన్నారు? నేతి, నేతి, నేతి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ లోకంలో దేవునితో పోల్చదగినది ఒక్కటి కూడా లేదు. అనుభవించిన ప్రతీదీ మూగగా మారుతుంది. అతను మాట్లాడతాడు కాని ఏం మాట్లాడతాడు? అపరిమితమైన ఆకాశాన్ని తన ఆవరణలోకి తీసుకువచ్చి, మీరు దాన్ని ఎలా వర్ణిస్తారు, అని అడగండి. ఆత్మానుగత ప్రపంచం అనంతం. ఆ అనంత ప్రపంచాన్ని మన మానసిక ప్రపంచంలోకి తేగలరా? అది ఎలాంటిదంటే ఆకాశాన్ని మన వాకిట్లోకి, పెరట్లోకి తెచ్చి ఇప్పుడు దీన్ని వివరించండి అన్నట్లుంటుంది. ఇది ఎలా కుదురుతుంది? మనో ప్రపంచం కూడా ఎంత పెద్దదంటే, దాన్ని ఆలోచనల్లోకి తీసుకురావడం ఎంత కష్టం? మీకు అనిపించినదాన్ని మీ ఆలోచనల్లోకి తీసుకురావడం చాలా కష్టం. అదేవిధంగా, చిన్న విషయం, మీరు గోధుమ రొట్టె తిని లేదా ఒక స్వీట్ తిని… ఎవరైనా యూరోపియన్ వచ్చి ఇది నీకెలా ఉంది అని అడిగితే, అప్పుడు ఇది చాలా మంచి స్వీట్ అంటావు, ఇంకా ఏం అంటావు? తిని తెలుసుకో సోదరా అని మాత్రం చెబుతావు. ఎందుకంటే కనీసం ఇలాంటి వాటి గురించి కూడా మనం చెప్పలేం. మన మనసు లోని భావాలను, అనుభూతులను మన ఆలోచనల్లోకి తీసుకురావడం చాలా కష్టం. ఇంక దాన్ని మాటల్లో తీసుకురావడం మరింత కష్టం. ఇలాంటి వేదికపై ఎవరైనా భగవంతుడు ఇలా ఉన్నాడు, అలా ఉంటాడు, అలా లేడు అని చెబితే, ప్రార్థిస్తూ గౌరవంగా అక్కడి నుంచి పారిపోండి. ‘వారికి వివరించింది, దయచేసి నాకు కూడా వివరించండి’ అని నేరుగా భగవంతుడినే ప్రార్థించండి. కేవలం హృదయం స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈశ్వరుడు స్వయంగా మీ హృదయంలోకి వస్తాడు. మీరు వారిని పిలవాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా వస్తారు. మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. తల్లి కోసం ఏడుస్తున్న పిల్లాడిలా ఉండండి. ఆయన కోసం అలాంటి ఆర్తి ఉండాలి. దానికోసం పడే తపనకు తెలివి, ధైర్యం అవసరం లేదు. ఏమీ అవసరం లేదు, కేవలం తపన, ప్రేమ చాలు. ప్రేమ ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే దొరుకుతుంది. మనకు కావలసిందల్లా తపన, వారి కొరకు చనిపోవడానికైనా సిద్ధపడే ప్రేమ. అంటే మనం అపరిమితమైన దాన్ని పొందాలనుకుంటే, మన ప్రయత్నాలు కూడా అపరిమితంగానే ఉండాలి. పరిమిత శ్రమతో ఐదు నిమిషాలు ధ్యానం, ఐదు నిమిషాలు నిర్మలీకరణ కూడా చేయరు కాని… ప్రజలు కేంద్ర మండలానికి చేరుకుని ఈశ్వరునిలో లయం కావాలని మాత్రం కోరుకుంటారు. అది ఎలా సాధ్యం? మనం అపరిమితమైన వాటితో విలీనం కావాలంటే, లయం అవడానికి, లయావస్థ సాధించడానికి… మన ప్రయత్నాలు కూడా అపరిమితంగా ఉండాలి.
భగవంతుని కృప దానంతటదే వస్తుంది
ఎలాగైతే భగవంతుడు తనంతట తానుగా పవిత్ర హృదయంలో నివసిస్తాడో… అలాగే ఆశీర్వాదం అనండి లేదా వారి కృప అనండి లేదా అనుగ్రహం అనండి, అది దానంతట అదే వస్తుంది. అడగవలసిన అవసరం ఉండదు. వారిని సర్వజ్ఞుడు అని అంటాం. మరి అడగవలసిన అవసరం ఏముంది?
సర్వజ్ఞుడు అన్నప్పుడు వారికి అన్నీ తెలుసు కదా! ఈ తయారవ్వడం అనేది, మనం శూన్యత్వం వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం మనల్ని మనం శూన్యంగా తయారు చేసుకోవాలి. మనకు మొట్టమొదటి సమస్య ఏమిటి? మనకు మన లక్ష్యం ఏమిటో తెలియదు. మనకు లక్ష్యం ఏమిటో పైపైన మాత్రమే తెలుసు. మనం “ఓ ప్రభూ! మానవ జీవితపు యదార్ధ లక్ష్యం నీవే” అని ప్రార్థిస్తాం. ఓ ప్రభూ! అంటే ఓ భగవంతుడా! మీరే మా జీవితపు నిజమైన ధ్యేయం. నేను వారిని నా లక్ష్యంగా చేసుకున్నాను. నేను సంసిద్ధంగా లేను. మనం ఇంకా తయారవుతూ ఉంటే వారు ఎలా లభిస్తారు? మనం సరిగ్గా సంసిద్ధులం అవలేదు. రెండవ సమస్య ఏమిటంటే, మనం ఇప్పటికీ మన కోరికలకు బానిసలమే. “నాకు మీరు నా జీవిత లక్ష్యం అని తెలుసు అది తెలిసి కూడా నేను నా కోరికలకు బానిసగా ఉన్నాను”. అలాగని జీవితంలో కోరికలు ఉండకూడదని కాదు కోరిక ఉండవచ్చు కానీ మనం దానికి బానిస కాకూడదు. ఇదే కావాలి, అదే కావాలి, అని మన మనసు, హృదయం, ఆసక్తి అన్నీ దాని వెనకే పరిగెడుతున్నాయి. మనం ఆ కోరికకు ఒక విధమైన బానిసగా తయారవుతున్నాం. అది మంచిది కాదు. భగవంతుడి అనుగ్రహంతో కోరిక తీరిందా, మంచిదే! తీరకపోయినా కూడా మంచిదే! ఈ విషయాలు మనకు ఆవశ్యకమైనవి. ఇంట్లో భోజనం కావాలి, అది మనకు తెలుసు, పిల్లలకు పెట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, వారి చదువుకు ఫీజు కట్టాలి. ఇవి కోరికలు కాదు, ఇవి మనకు ఆవశ్యకమైన విషయాలు. ఎవరైతే సరైన దారిలో పయనిస్తారో వారికి ఎలాగో ఒక విధంగా, ఎక్కడో అక్కడ నుంచి దారి దొరుకుతుంది. భగవంతుడు అందరిని కాపాడతాడు. మిమ్మల్ని ఎందుకు పట్టించుకోడు? మార్గం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి సరళమైన జీవితానికి ధ్యానం చేయండి. ధ్యానంలో మునిగిపోయే కొద్దీ, మనలో ఉండే అహంకారం నెమ్మది నెమ్మదిగా కరిగిపోతుంది, నశించిపోతుంది. మనం సమాధి స్థితిని పొందుతాం. దాని అర్థం ఏమిటి? కనీసం కొద్ది నిమిషాలు పాటు మనల్ని మనం మరిచిపోతాం. మనం రోజంతా పని చేస్తున్నప్పుడు కూడా ఆ స్థితిని నిలబెట్టుకుంటే శూన్యావస్థ మనతోనే ఉంటుంది.
మంచి పనికి ప్రకృతి మద్దతిస్తుంది
నిజం చెప్పాలంటే, నేనేమీ చేయడం లేదు. మధ్యప్రదేశ్ లో మీరంతా లేకుండా పని జరుగుతుందా? నేనేమి చేసాను? ఏమీ లేదు. ఈశ్వర కార్యంలో నిమగ్నమైనవారికి ఎంతోమంది ప్రజల సహకారం లభిస్తుంది. మనమొక సంకల్పం చేస్తాం. దాన్ని పరిపూర్ణం చేసేందుకు తగిన శక్తి కూడ దానికదే వచ్చేస్తుంది. మీరే చూడండి! మీరు ఎపుడైనా ఒక మంచి కార్యం చేయాలనుకుంటే, ఎవరూ ఆపలేరు. ఆ సమయంలో ప్రకృతి యొక్క సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ప్రజల నుండి సహాయం ఎలా లభిస్తుందంటే, అన్ని చోట్లనుండి వచ్చి సహాయ సహకారాలు అందించే వారు దొరుకుతారు. ప్రేరణ ఈశ్వరుడే కలిగిస్తాడు. మనం తయారుగా ఉన్నట్లయితే, మనకు ప్రేరణ ఇస్తాడు.
ఇది చేయి… అది చేయి అని… ప్రారంభంలో నాకేం అయ్యేదంటే… నాకు 18, 19 సంవత్సరాల వయసున్నపుడు కాలేజీలో చదివేటపుడు, ధ్యానం మొదలుపెట్టాను. ముందు ముందు ఏమయ్యేదంటే, హృదయం నుండి ఇది చేయకు, ఇలా చేయకు అనే స్వరం వినిపించేది. ఇప్పుడేమో ఇలా చేయి, అలా చేయి అని వినిపిస్తూ ఉంది, చాలా తేడా వుంది ఇందులో.
అహంకారం నుండి సేవకు
మిమ్మల్ని ఎవరు ఆపుతారు?
మనకు సేవా భావం కావాలని నిజాయితీగా ప్రార్థన చేస్తే, అది జరుగుతుంది. దాన్ని మనమే నిరోధిస్తాం. కొందరు అహంకారంతో నిండిపోయి తల పైకెత్తి నడుస్తారు. వారికి పతనం సంభవిస్తుంది. తల పైకెత్తి నడవడం వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. నష్టాల మీద నష్టాలే వస్తాయని అర్థం చేసుకోవాలి. కొంత సర్దుకొని, మృదు భాషణ చేస్తూ, అటు ఇటు పరుగులెట్టకుండా శాంతంగా ఉంటే… భగవంతుడు లభిస్తాడో లేదో కానీ, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తల బిరుసుగా ఉండడం వల్ల ఏమీ లభించదని గ్రహించాలి. వారికి స్నేహం కూడా శత్రుత్వంగా మారుతుంది. ఇంట్లో కూడా వారిని ఎవరూ ఇష్టపడరు.‘ఈయన వచ్చారు, కోపంగా మాట్లాడుతూ ఉంటారు’ అని అంటారు. కోపంలో ఇలా జరుగుతూ ఉంటుంది.
అసలు కోపం ఎందుకు వస్తుంది?
ఇది మీలోని అహంకారం, గర్వం ప్రతిబింబించడం వల్లే కలుగుతుంది. కోపం అగ్ని వంటిదని మనకు తెలుసు. ఇతరులను దహించి వేయడానికి ప్రయత్నిస్తాం కానీ మనమే దహించబడతాం. పడ్డవాడికేమీ కాదు. మీరు ఎవరిపై కోపగించారో, అతను విని బయటకు వెళ్ళిపోయాడు. మీకు శత్రువు అయ్యాడు. మీ ఆరోగ్యంపై, మనసుపై, హృదయంపై, ముఖ్యంగా మీ ఆత్మపై ఏ ప్రభావం పడుతుందో దాన్ని చూడడం అత్యవసరం. సైన్స్ పరంగా చూసినట్లయితే అగ్ని కోపాన్ని కలిగిస్తుంది. అహంకారం కోపగించకుండానే తిరుగుతూ ఉంటుంది. దానికి జీవ రసాయన శాస్త్రం మరియు నాడీ వ్యవస్థ శాస్త్రంతో సంబంధం ఉంటుంది. మృదువుగా, వినమ్రంగా ఉండే ఒక వ్యక్తి యొక్క జీవ రసాయన శాస్త్రాన్ని, నాడీ వ్యవస్థ శాస్త్రాన్ని వర్సెస్… పొగరుబోతుగా తిరుగుతున్న వ్యక్తి యొక్క జీవ రసాయన శాస్త్రం, నాడీ వ్యవస్థ శాస్త్రంతో పోల్చినట్లయితే చాలా భిన్నంగా ఉంటుంది. అతని మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. సైన్స్ కూడా పొగరుగా తలెత్తి తిరిగే వాడికి ప్రయోజనం ఉండదని చెప్తుంది. భగవంతుని ముందుకు మనం శూన్యంగా మారి వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా మిగిలి ఉన్నట్లయితే శూన్యంలో గడబిడగా ఉంటుంది. ఏదైనా అపరిమితంగా పొందాలనుకుంటే మనం మన హృదయాన్ని అపరిమితం చేయవలసి ఉంటుంది.
శ్రీకృష్ణ భగవానుని సందేశం ఏమిటి?
మీరు కర్మ అంటే పని చేయండి అంటారు. అహంకారం లేకుండా పని ఎలా చేస్తారు?
అహం కొంత ఉంటుంది. భగవంతునికి తమను తాము సమర్పించుకుని భగవంతుని పట్ల ప్రేమలో, క్రమ క్రమంగా భక్తి కారణంగా నాది లేదా మనది అనే భావం కరిగిపోతుంది. సేవాభావం ప్రకటితమవుతుంది. అందువలన సహజమార్గంలో, మన హార్ట్ ఫుల్ నెస్ లో ఒక పద్ధతి చెప్పబడింది. ధ్యానం చేసిన తర్వాత ఒక స్థితి ఏర్పడుతుంది. ఉదయం మనం ధ్యానం చేసిన తర్వాత ఒక ఆధ్యాత్మిక స్థితి లభిస్తుంది. దాన్ని గమనించి కాపాడుకోండి. ధ్యానం పూర్తి అవగానే వెంటనే లేచి వెళ్ళకండి. పని అయిపోయిందని స్ప్రింగ్ లా పైకి లేస్తారు. చాయ్ త్రాగడానికి, ఏదైనా పని చేయడానికి, ఎవరికైనా ఫోన్ చేయడానికి వెళ్తారు. అలా చేయకండి. మీరు లేకుంటే ఈ ప్రపంచం ఏమీ ఆగిపోదు. ధ్యానం తర్వాత పొందిన స్థితిని చూడండి. దానిపై మననం చేసుకోండి, ఆ స్థితి కోసం అరగంట సేపు కూర్చుంటారు, మరో ఐదు నిమిషాలు కూర్చోండి. దానిలో మమేకమవండి. ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కువగా మునిగి దాన్ని పట్టుకొని ఉండండి. ఏదయినా పని చేసేందుకు మీరు అన్ని చోట్లకు వెళ్తుంటారు. మరో గ్రామంలోని ప్రజలను కలుస్తారు. అంటే ఈశ్వరుడే ఆ పని చేయిస్తున్నాడు. నేను చేస్తున్న పనిని ఆ ఈశ్వరుడే నాచే చేయిస్తున్నాడు.
నేను కేవలం మాధ్యమాన్ని మాత్రమే. ఆ పనిని ఆయనకే అంకితం చేస్తాను, సమర్పించుకుంటాను. ఎవరినైనా మనం కలిసి వారికి మేలు చేస్తే, అది కూడా ఆయన కోసమే నేను చేస్తున్నాను. మనకు లభించిన పని ఫలితాన్ని ఈశ్వరునికి సమర్పించాలి. దానివల్ల మీరు సంస్కారం ఏర్పడకుండా కాపాడబడతారు. మనం ఆ ఈశ్వరునికి అర్పించినట్లయితే, సమర్పించుకుంటే, మీరే నా లక్ష్యం, నా ధ్యేయం అంటూ నేను చేస్తున్న ఏదైనా మీతోటే చేస్తున్నాను. మీకోసమే చేస్తున్నాను. ప్రతి పనిని, ప్రతి శ్వాసను ఆయనకు సమర్పించాలి. ఇలాంటి భావాన్ని ప్రకటించుకోవాలి. మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల అది అలవాటవుతుంది.
హృదయంచే మార్గదర్శనం పొందండి
సహజ మార్గ ప్రత్యేకత ఏమిటి?
అది రహస్యం కాదు, మన మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకి, మనలో నెలకొనే అయోమయం కానీ… సమస్యలకు కానీ సమాధానం మన హృదయం నుంచే లభిస్తుంది. మీరు మీ సమస్యకు సమాధానం కోసం మీ తల్లిదండ్రులను కానీ, బంధుమిత్రులని కానీ, పండితులను కానీ… లేదా మీ గురువును ఇలా ఎవరిని సంప్రదించినా కూడా తుదకి మీ హృదయమే ఏది సరైంది అనేది నిర్ణయిస్తుంది. సహజ మార్గం నేరుగా హృదయం మీదనే నిచేస్తుంది. హృదయంలో స్వచ్చత, పవిత్రత మెరుగుపడే కొలదీ అది స్పష్టమైన సూచనలు ఇస్తుంది. అశుద్ధ హృదయం నుంచి కూడా, నేరుగా నిజమైన సూచనే లభిస్తుంది, ఎంత ఎక్కువ మలిన హృదయం అయినా సరే! దుర్యోధనుడి స్థితిని చూడండి. అతనికీ ‘తను చెయ్యవలసినది ఏమిటనేది‘ తెలుసు. కానీ ఆ పని చెయ్యడానికి తగినంత ధైర్యం అతని దగ్గర లేకపోయింది. మన స్థితి కూడా ఇలాంటిదే. ఏం చెయ్యాలనేది మనకు కూడా తెలుసు. అందరూ ఏం చేయాలో చెప్తారు. హృదయం కూడా ఇలా చెయ్యి అని చెప్తుంది. అయితే ఆ పని చేసే ధైర్యం మనకు ఉండదు.
మనకు లేని ఈ ధైర్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి?
ధ్యానం వలన మనకు ఒకవిధమైన ధైర్యం లభిస్తుంది. “నా వల్ల కాకపోయినా నాకు తోడు భగవంతుడు ఉన్నాడని… నా హృదయ సందేశాన్ని అనుసరించడం మంచిదని, ఆయన కృప వలన అది సఫలీకృతం అవుతుంది అని.” మీకు మీపై అంత విశ్వాసం లేకపోయినా, భగవంతునిపై ఇంత మాత్రం విశ్వాసం ఉంచండి చాలు. “భగవంతుడా! మీరు నాలో కొలువై ఉండి సదా నాలో స్ఫూర్తిని నింపారు.” ఇందులో ఏదో నిగూఢమైనది దాగిఉంది. హృదయాన్ని అనుసరిస్తూ పనిచేసినప్పుడు నష్టపోయినా అధైర్య పడవద్దు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. కానీ ఇప్పటివరకు హృదయ విరుద్ధంగా చేసిన ఎన్నో పనులు, వాటి వలన మనకు లభించిన ఫలితాలను చూడండి. ఇందుకోసం జీవితంలో మనకు కొంచెం అవగాహన అవసరం. కాసేపు శాంతిగా కూర్చుని అయోమయాన్ని పక్కన పెట్టి… మీ ముందున్న సమస్యని సరైన రీతిలో అర్ధంచేసుకోండి. తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు, ప్రార్థనా పూర్వకంగా, ‘భగవంతుడా! నేను ఈ విధంగా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. దయతో నాకు మార్గం చూపండి,’ అని మీరు తీసుకున్న నిర్ణయం నివేదించండి. మీరు చెయ్యబోయే పనికి తుది నిర్ధారణ కూడా లభిస్తుంది. ఏదైనా తప్పు జరిగితే భగవంతుని క్షమాపణ వేడుకోండి, “ఈ విధంగా మరోసారి చెయ్యను” అని సంకల్పించుకోండి. లేదంటే అదే తప్పు ప్రతిరోజూ చెయ్యడం జరుగుతూ ఉంటుంది. మిమల్ని మీరు క్షమించుకోలేరు. మిమల్ని మీరు క్షమించుకోగలిగితే, మిమ్మల్ని భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ మీ హృదయాన్ని అడగండి… ఇంతవరకూ నేను పదే పదే చేస్తూ వస్తున్నది సరైనదేనా అని. కానీ మనం హృదయంపై రాయి ఉంచినట్లు హృదయాన్ని ఆశుద్ధంగానే ఉంచేస్తాం. ఇది ఒక విధమైన అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు బలహీనతగా మారిపోయింది. కానీ ధైర్యం చేసి చూడండి. భగవంతుని హృదయంలో నిలుపుకొని పవిత్రంగా ఈ లోకంలో జీవిస్తే…
తుదిశ్వాస అనాయాసంగా సుఖంగా సాగితే ఎలా ఉంటుంది?
ఆయాసంగా, సుఖం లేకుండా తుది శ్వాస తీసుకుంటే మోక్షం అనేది లభించదు. ఎట్టి పరిస్థితులలో కూడా మోక్షం లభించదు. ఆత్మ, ఆ ఆత్మపై వున్న భారం గురుత్వాకర్షణ శక్తిలా మరల మనల్ని తిరిగి లాక్కుని వస్తుంది. మోక్షం లభించాలంటే ఆత్మ సంస్కార విహీనమై ఉండాలి. ఏవిధంగా ధ్యానం, నిర్మలీకరణల ద్వారా మనం ఉన్నత స్థితిని చేరుకుంటామో మీ అందరికీ చెప్పే ఉంటారు. ఇందుకోసం మీరు మీలో కొంచెం ఉన్మాద అవస్థను తీసుకురావాలి. మన అందరిలో ఈ ఉన్నతమైన స్థితిని చేరుకోవాలనే ఉన్మాదావస్థ కలగాలనీ… ఆ దివ్య ప్రేమజ్యోతి ప్రపంచమంతటా అందరి హృదయాలలో, అన్నిచోట్లా, అన్ని ఇళ్లలో ప్రజ్వలించాలని భగవంతునికి నా ప్రార్ధన. ధన్యవాదాలు!
Daaji North Tour in March & April 2023
21-03-23
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం, దాని ప్రాముఖ్యత
నేను శ్రీరామచంద్ర మిషన్ కు చెందిన వాణ్ణి. 1945లో స్థాపించబడిన ఈ సంస్థలోని ప్రాచీన సాంప్రదాయానికి చెందిన మాస్టర్స్ పరంపరలో నాలుగవ వారసునిగా నాకు ఈ బాధ్యత ఇవ్వబడింది. చట్టబద్ధంగా 1945లో స్థాపించినా, ఈ పద్ధతి 1880ల నుండీ కొనసాగుతూనే ఉంది. ఇందులోని ప్రాథమిక మూల సూత్రం ప్రాణాహుతి ద్వారా ప్రతి వ్యక్తి లోని చైతన్యాన్ని మేలుకొల్పడమే!
మీకు ఒక ఉదాహరణతో దీన్ని వివరిస్తాను. మన శరీరాన్ని ఎలా పోషిస్తాం?
మనందరికీ తెలుసు. మంచి సమతుల ఆహారం, అలాగే మన ఆహారపు అలవాట్లలో క్రమబద్ధత. మరి మన మనసుని ఎలా పోషిస్తాం? స్థూల శరీరం సూక్ష్మ శరీరం… మరి సూక్ష్మ శరీరానికి ఎలా పోషణ ఇస్తాం? మనం ఆలోచిస్తాం, చర్చిస్తాం, పెద్దల నుండి నేర్చుకుంటాం… ఇలా చాలా వాటి ద్వారా మన సూక్ష్మ శరీరాన్ని అంటే మనసుని పరిపుష్టం చేసుకుంటాం. మన ఆధ్యాత్మిక శరీరానికి అంటే ఆత్మకు – కారణ శరీరానికి – ఎలా పోషణ ఇస్తాం? అది ఈ ఘనమైన శ్రీరామచంద్ర మిషన్ లోని గురు పరంపర ద్వారా ఇవ్వబడుతుంది. ప్రతి గురువు ఈ ప్రాణస్య ప్రాణః అంటే ఆత్మకు ఆత్మ వంటి ఈ ప్రాణాహుతిని ప్రసరింప జేయగలుగుతారు. ఇది కేవలం ఒక విశ్వాసం మాత్రం కాదు. మహాభారతంలోని ఆ కీలక ఘట్టంలో భగవాన్ శ్రీకృష్ణుడు అన్ని అధ్యాయాలలోని ఆ శ్లోకాలన్నింటిని చెప్పారని మీరు అనుకుంటున్నారా? అది సాధ్యమయ్యే పనేనా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన చక్కని ప్రశ్న. అవన్నీ చదవాలంటేనే ఎంతో సమయం తీసుకుంటుంది. మరి వారిద్దరూ ఆ కీలక సమయంలో చర్చించడం కుదిరే పనేనా? దానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? యుద్ధం ఎందుకు చేయాలన్న ఆవశ్యకతను చెబుతూ భగవాన్ శ్రీకృష్ణుడు ఏడు లేదా ఎనిమిది శ్లోకాలను మాత్రమే ఆ సమయంలో ఉచ్చరించారు. మిగిలిన శ్లోకాలన్నీ ప్రసరింపబడ్డాయి. అవన్నీ లేవని కాదు. అవన్నీ తప్పకుండా ఉన్నాయి. ఈ ప్రాణాహుతి అనే వాహనం ద్వారా అవి ప్రసరించబడ్డాయి.దీన్ని అనుభూతి చెందవచ్చు. మీరు భగవంతుని నమ్ముతారా? అని కొందరు అడుగుతారు. మనందరం ఎటువంటి జంకు లేకుండా, “అవును నేను భగవంతుని నమ్ముతాను” అంటాం. ఎవరైనా “నేను భగవంతుని నమ్మను” అంటే ప్రజలు వారిని ఎంతో అనుమానంగా చూస్తారు. అయితే ‘భగవంతుని విశ్వసించను’ అన్న వ్యక్తిని నేనెంతో నిజాయితీపరునిగా భావిస్తాను. దేవుని నమ్ముతానని చెప్పే ఎంతో విశ్వాసం గల వారిని కూడా… మీరెందుకు నమ్ముతారని ప్రశ్నిస్తే, మీ విశ్వాసానికి కారణం ఏమిటని అడిగితే… వారు మా తల్లిదండ్రులు నాకలా నేర్పారనో, శాస్త్రాలు చెప్పాయనో మతం బోధించింది లేదా మన సంస్కృతి అనో చెప్తారు. ‘మరి మీ సంగతి ఏమిటి?’ అని ప్రశ్నిస్తే… కనుక విశ్వాసం మంచిదే. అయితే విశ్వాసాన్ని అసలు ఎటువంటి సందేహం ఏర్పడనంతగా దృఢపరుచుకోవాలి. మీరు అనుభూతి చెందడం ద్వారా నిజమైన, ప్రామాణికమైన అంతరంగంలో అనుభూతి చెందడం కోసమే… మీ హృదయాన్ని మేల్కొల్పడం కోసమే శ్రీ రామచంద్ర మిషన్ విశ్వవ్యాప్తంగా పనిచేస్తోంది. అక్కడ శాంతి నెలకొనుగాక! అక్కడ సంతోషం ఉండు గాక! భగవద్గీత లోని రెండవ అధ్యాయం 66వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పినట్లు శాంతి లేని ఆత్మలో సంతోషం ఎలా ఉండగలదు? శాంతి లేనప్పుడు సంతోషం ఉండదు. మననం లేదా ఆలోచనాత్మక మనసు లేకుండా, సామరస్యత లేకుండా, శాంతి ఎలా లభిస్తుంది? దృష్టిని నిలిపే, ఏకాగ్ర చిత్తం లేకుండా ఈ ఆలోచనాత్మక మనసు ఎలా సాధ్యం? ధ్యానం చేయకుండా స్థిర చిత్తం ఎలా వీలవుతుంది? అలా శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానానికి, సంతోషానికి మధ్య సంబంధాన్ని వివరించారు. మన భారత దేశ సంస్కృతి కేవలం సంతోషం కోసమే లేదు. మన దేశ ఆధ్యాత్మిక లక్ష్యం మరింత ఉన్నతమైనది. సంతోషానికి ఆవల, మన యోగ శాస్త్రాలలో చెప్పబడ్డ సచ్చిదానందమనే ఆనందం ఉన్నది. గురువు సహాయంతో దాన్ని కూడా, ఆ ఆనందాన్ని కూడా అధిగమిస్తే, దానికి కూడా వీడ్కోలు పలికితే, అదే నిజమైన పరిత్యాగం అవుతుంది. అది లేకపోతే మీరు తేనెలో మునిగిన తేనెటీగలా ఉండిపోతారు. అది అందులోనే మునిగి చనిపోతుంది. ఆ చైతన్యంలో మునిగి దానికి బానిసైపోతే ఆ ఆనందం వల్ల ప్రయోజనం ఏముంది? కబీర్ సాహెబ్ ఇలా అనేవారు. అయితే ఇలాంటివి విన్నప్పుడు, కొంతమంది నొచ్చుకోవచ్చు. కానీ నా పని సత్యాన్ని చెప్పడమే. మీ హృదయంలో ఎలా అనుభూతి చెందుతారో, ఈ ప్రశ్నలను అడిగి చూడండి. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆట వస్తువులతో గడిపేస్తారు. వయసు వచ్చాకా సరస శృంగారాలతో, సంతోషంగా స్నేహితులతో గడపడం ఇలా ఉంటుంది. అనంతరం ఉన్నతాత్మల సహచర్యం కనుక లభిస్తే మీరు సమాధి అనే తదుపరి దశలోని చైతన్య స్థితిని పొందుతారు. కబీర్, అటువంటి యోగులను కూడా మీరు చైతన్యంతో ఆటలాడుతున్నారని పరిహాసం ఆడేవారు. చైతన్యాన్ని ఒక ఆటవస్తువుగా భావించి, దానితో ఆటలాడవద్దు అనేవారు ఆయన. దానికి అతీతంగా ఉన్నదాన్ని కూడా గమనించండి. చైతన్యానికి ఊతమిచ్చేది ఏమిటో కనుగొనండి. చైతన్యం అంటే అర్థం చేసుకోవడానికి, చైతన్యానికి సరైన నిర్వచనం కోసం ప్రజలు కష్టపడే ప్రస్తుత పరిస్థితుల్లో, ఇక్కడ శ్రీ రామచంద్ర మిషన్ లో మేం ఈ చైతన్యం విషయంలో మరింత ఉన్నత దశలకు చేరడం జరిగింది. సప్త ఋషులలో ఒకరైన వశిష్ట మహాముని ఆ రోజుల్లో చెప్పినదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. యోగవాసిష్టాన్ని పరిశీలిస్తే భగవాన్ శ్రీరామునికి, ఆయన తమ్ముడు లక్ష్మణునికి మధ్య జరిగిన సంభాషణ అంతా చైతన్యాన్ని గురించే. అలాగే జనక మహారాజుకు అష్టావక్ర మునికి జరిగిన చర్చంతా చైతన్యం గురించే. అష్టావక్ర గీత మొత్తం చైతన్యం గురించే. ఆ కాలంనాటి ఆయా వ్యక్తులంతా ఎంతో ఉన్నతంగా చైతన్యం గురించే మాట్లాడేవారు. మన పరిణామంలో ప్రముఖంగా జరిగేది ఈ చైతన్య వికాసమే. ఇది లేకుండా మీ శరీరం, మీ మనసు పరిణామం చెందవచ్చు కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మకు వికాసం చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది శాశ్వతం, మార్పు లేనిది. అది మార్పు చెందనిది. చైతన్యంలో పరిణామం సాధ్యం. మేం ధ్యానం ద్వారా ప్రజలకు ఆ అనుభూతి పొందేందుకు సహాయం చేస్తాం. మేం విశ్వాసం గురించి, విజ్ఞానం గురించి మాట్లాడటం లేదు.ప్రతి చక్రం దగ్గర మనం పొందే అనుభూతి… హృదయ చక్రం నుండి, ఆత్మ చక్రానికి… అక్కడి నుంచి అగ్ని చక్రం, జల చక్రం తర్వాత కంఠ చక్రం, ఆజ్ఞా చక్రం ఇంకా ముందుకు వెళితే, సహస్ర దళ కమలాన్ని కూడా దాటి ముందుకు వెళ్లడం. యోగశాస్త్రం సహస్ర దళ కమలంతో అంతమవుతుంది.అయితే దానికి ఆవల కూడా అత్యున్నతమైనది ఉంది. చాలామంది దానికి ఆవల ఏముందో వర్ణించలేరు. ఎందుకంటే వారంతా అక్కడి (సహస్ర దళ కమలం) ఆనంద స్థితికి అలవాటు పడి అక్కడే నిలిచిపోయారు. అయితే అది కూడా ఒక మత్తుమందు లాంటి వ్యసనమే! కనుక ఆనందం అనేదాన్ని కూడా అధిగమించి… భగవాన్ శ్రీకృష్ణుడు వర్ణించిన ఆ అత్యుత్తమ చివరి స్థితిని, ఆ పరమ శూన్య స్థితిని అందుకోవాలి. శ్రీరామచంద్ర మిషన్ దానికోసమే ఉంది. దానికై మేము ఇంతకుముందే చెప్పినట్లుగా 1880 నుండి సేవ చేస్తున్నాం. ఈ బ్రహ్మవిద్య నేర్పడానికి ఎటువంటి రుసుము మేం విధించడం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఎటువంటి వివక్షత లేకుండా ఏ దేశ, జాతి, మత, లింగ భేదం లేకుండా, మధ్య ప్రాచ్యం నుండి కూడా ధ్యానానికి మా వద్దకు వస్తున్నారు. క్రిస్టియన్లు, యూదులు, ముస్లింలు, ఆఫ్రికా దేశస్థులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మేం కనీసం 50 నుండి 100 మంది వ్యక్తులను ఆయా ప్రదేశాల నుంచి ఆహ్వానించి, మన ప్రాచీన సంప్రదాయాన్ని వారికి నేర్పి… వారిని శిక్షకులుగా తయారుచేసి, వారి దేశాలకు తిరిగి పంపే ఒక విశిష్ట కార్యక్రమాన్ని చేపట్టాం. 1995 నుండి ఇది మా స్వంత ఖర్చులతో కొనసాగిస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది శిక్షకులను తయారు చేశాం. మాకు ప్రపంచవ్యాప్తంగా 14వేల మందికి పైగా అలాంటి శిక్షకులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం కొరకు www.heartfulness.org అనే వెబ్ సైట్ ను మీరు సంప్రదించవచ్చు. అలాగే మీ సమీపంలో ఉండే శిక్షకుల ద్వారా మీరు ఈ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన ప్రక్రియ నేర్చుకోవచ్చు. లేదా హార్ట్ ఫుల్ నెస్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా శిక్షకులతో అనుసంధానమై ధ్యానించవచ్చు.
23-03-23
ధ్యానం అంటే ఏమిటి?
ప్రజలు ధ్యానాన్ని చాలా రకాలుగా చేస్తారు. ధ్యానం అంటే ఒకే ఆలోచనతో పని మొదలు పెట్టడం. ధనవంతుడైన వ్యక్తి ఉన్నాడు. ధనవంతుడైన వ్యక్తి ఉన్నాడు. అతనికి ఆలోచన ఉంటుంది… ఏమిటి? ధనం ఎలా సంపాదించాలి? అతను ధనం మీద ధ్యానం చేస్తున్నాడు. విద్యార్థి ఉన్నాడు. అతను నిజమైన విద్యార్థి అయితే “విద్య-అర్థి”… అతని దృష్టి విద్య మీదనే ఉంటుంది అంటే అతను విద్య మీద ధ్యానం చేస్తున్నాడు. ఆ ఈశ్వరుని ధ్యానించడాన్ని మనం ధ్యానం అంటాం. కానీ మనం ఈశ్వరమయం ఎప్పుడవుతాం? మనం ఆ భగవంతుని అంగీకరించినప్పుడు! మీరు భగవంతుని అంగీకరిస్తారా? మీరందరూ “నేను అంగీకరిస్తున్నాను” అంటూ చేయి పైకి లేపుతారు కదా! అంగీకరించని వారెవరు? ఎవరైనా “నేను భగవంతుని అనుభూతి చెందాను అందుకే అంగీకరిస్తున్నాను” అని చెబుతారా! లేదా ఒక్కసారి అనుభూతి చెందితే అది సరిపోతుందా! భగవంతుని ఒక్కసారి అనుభూతి చెందితే సరిపోదు. మనం ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాం. అది చాలా సంపన్న కుటుంబం. మీరు మూడు నెలలు మీ స్నేహితుని ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ అక్కడ గడిపారు. ఇంటికి వచ్చాక మీ ఇంటివారికి, మీ స్నేహితులకు, ‘అక్కడ నేను మూడు నెలలు గడిపాను‘ అని చెబుతారు. మూడు నెలలు గడిపినందుకు ఆనందం కలుగుతుంది. కానీ మీరు మనసులో నేను కూడా అంత ధనవంతుడైతే బావుండును అని భావిస్తారు కదా! దివ్యత్వం యొక్క అనుభవం అలాగే ఆతిథ్యం యొక్క అనుభవం రెండింటిలోనూ భేదం లేదు. భేదం ఎప్పుడు వస్తుందంటే నేను అలా తయారవ్వాలి అని భావించినప్పుడు! నేను ధనవంతునిగా తయారవ్వాలా లేదా దివ్యత్వంగా తయారవ్వాలా! దివ్యత్వాన్ని అనుభూతి చెందాం కానీ మనం దివ్యత్వంగా మార్పు చెందగలిగితే, అప్పుడు మనం ఒక విభిన్న క్షేత్రంలోకి ప్రవేశిస్తాం. కాబట్టి విశ్వాసం మంచిదే కానీ మన అనుభూతి విశ్వాసంతో కలిసి ఉంటే అప్పుడు మన భగవంతుని అంగీకారం ప్రకాశవంతం అవుతుంది. అలా అనుభూతి చెందిన తరువాత మనమే అనుభూతిగా తయారవుతాం. దివ్యత్వ అనుభూతికి బదులుగా మన గుణాలన్నీ దివ్యత్వంగా మార్పు చెందగలిగితే… మనవాళ్లు సచ్చిదానందం అని చెప్పే స్థితిని మనం నిజంగా అనుభూతి చెందగలుగుతాం. కానీ దాని తరువాత కూడా ఇంకా పెద్ద ప్రపంచం ఉంది. మా గురుదేవులు “మీరు నిజంగా వైరాగ్యం చెందాలి లేదా నిజంగా ఏదైనా వదిలి పెట్టాలి అంటే ఈ ఆనందాన్ని కూడా వదిలిపెట్టండి” అని చెప్పేవారు. అందరూ దుఃఖాన్ని వదిలిపెట్టి పారిపోయి సన్యాసం తీసుకుంటారు… కానీ ఎవరైతే అనంత ఆనందాన్ని కూడా వదిలిపెడతారో, వారు నిజమైన సన్యాసి. అటువంటి వారు కోట్లల్లో ఒకరుంటారు. వారు ప్రతి యుగంలోనూ కూడా అవతరించరు. మన హార్ట్ ఫుల్ నెస్ ఉద్యమం… కేవలం మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి, ఆర్థిక వృద్ధికి మాత్రమే కాకుండా… శరీరం, మనసు, ఆత్మ యొక్క సమగ్ర అభివృద్ధికి! అలాగే ఆ స్థితిని కూడా దాటి మనం పయనించాలి.
భగవద్గీతలో ధ్యానం గురించి...
నేను ధ్యానం మహిమ గురించి ఒక శ్లోకం చెబుతాను. భగవద్గీత రెండవ అధ్యాయం 66వ శ్లోకం. మీలో ఆసక్తి ఉన్నవారు మూల గ్రంధాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ శ్లోక సారాంశం ఏమిటి? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంతోసేపు నచ్చచెప్పినా అతను వినని కారణంగా, తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. శ్రీకృష్ణుని అసలు స్వరూపం చూసిన తరువాత కూడా ఏమీ ఫలితం లేదు. శ్రీకృష్ణుని నిజ స్వరూపాన్ని చూసిన అర్జునుడు భీతి చెందాడు. ఏ రూపంలో మీకు భగవంతుడు కనిపిస్తే, ఈయన భగవంతుడు అని మీరు నిర్ధారించుకుంటారు? సరే! భగవంతుని దర్శించిన తరువాత మాత్రం మీరు చెయ్యగలిగేది ఏమిటి? ఇది చాలా గంభీరమైన ప్రశ్న. శ్లోకం గురించి తెలుసుకుందాం… “నాకు మీరు మీ విశ్వరూపం చూపించారు, కానీ శ్రీకృష్ణా! రాబోయే తరాలవారు మిమ్ములను ఎలా అనుభూతి చెందగలరు?” అని అర్జునుడు అడిగిన దానికి “హృదయ్ మే పశ్యసి” అని శ్రీకృష్ణుడు చాలా చిన్న సమాధానం ఇచ్చారు. అంటే ‘నన్ను మీ హృదయంలో కనుగొనండి, అనుభూతి చెందండి‘ అని. తరువాత శ్రీకృష్ణుడు చెప్పినది 2/66 అధ్యాయంలో వుంది. ప్రతి జీవి సుఖం కోరుకుంటుంది. ఒక్క మానవులు మాత్రమే కాదు అన్ని జీవాలు సుఖాన్ని కోరుకుంటాయి. నెమలి, కోతి, గాడిదకు కూడా సుఖశాంతులు కావాలి. మీకు మనశ్శాంతిలేనప్పుడు, సుఖం ఎక్కడుంటుంది? మీరు కోట్ల విలువ చేసే భవంతిలో వున్నా, ఎవరినైనా శాసించగల శక్తి, అధికారం వున్నా, మీకు మనశ్శాంతి లభించదు. సామరస్యంతోనే మనశ్శాంతి లభిస్తుంది.
మననం, మనసును తృప్తి పరుస్తుంది. మనసు చేసే పనులు రెండు. ఒకటి – ఆలోచించడం, రెండు – మననం చెయ్యడం. ఈ రెంటికీ తేడా వుంది. వీటి గురించి ఇప్పుడు చెప్పలేను. కానీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ వివిధ దశలను చూడండి. సుఖం కావాలంటే మానసిక శాంతి కావాలి. మానసిక శాంతి కోసం సామరస్యత కావాలి. మనసు మననంలో మునిగిపోవాలి. అందుకు మనశ్శాంతి అవసరం. ఇది మనలో అసహనం తొలగించిన తరువాత, మనసుపై దృష్టి నిలిపిన పిదప జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ధ్యానం చేసినప్పుడే సాధ్యపడుతుంది. ‘స్వాస్థ్య‘ అని పిలవబడే ఆ అసలైన సుఖం మనకు లభించాలంటే – సుఖం… దీన్నే ‘స్వాస్థ్య‘ అని కూడా అంటారు. ‘స్వాస్థ్య‘ అంటే స్వయంగా ఈశ్వరుని పై స్థిర చిత్తం నిలుపుకున్న స్థాయి. బాహ్యంగా ఎంత దుఃఖితుడై వున్నా కూడా, హృదయంలో ఈ స్వాస్థ్య కలిగి వున్నవాడిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.
25-03-24
ఎల్లప్పుడు జాగరూకతతో జీవించండి
ప్రేమ-భక్తి
ఎవరో నాతో అన్నట్లు, మనం స్మరిస్తూనే ఉంటాం. అది ఒక పనిని చేస్తున్నట్లుగానే చేస్తాం. స్మరణ మిమ్మల్ని ప్రేమించేలా చేయాలి అని బాబూజీ మహరాజ్ అనేవారు. ఈ ప్రేమ ఇంకా పైకి ఎదిగి… మనం ప్రేమించే వారి పట్ల లోతైన పూజ్య భావాన్ని, సమున్నత గౌరవాన్ని, ఆరాధనను కలిగించాలని నేను భావిస్తాను. అదే భక్తి. లేకుంటే అది కర్మయోగమైనా, ప్రజలు ధ్యానయోగం అంటారు కదా, అది కూడా ఒక కర్మ (పని)యే కదా! కర్మను ఎలా ఆచరించాలంటే, మనం ఆ పనిని చేయలేదన్నట్లుగా, దానివల్ల మనపై ఎలాంటి ముద్రలు పడనట్లు చేయాలి. దీన్ని మరింత వివరంగా చెప్పనివ్వండి. మీకు ఒక పని ఇష్టం లేకపోయినా చేయవలసి వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? భారం అవుతుంది. ఐదు నిమిషాలు కూడా 60 నిమిషాలుగా కనిపిస్తాయి. కానీ మీరు దేనినైనా మీకై మీరుగా ఇష్టపడి చేస్తే సమయం ఇట్టే ఎగిరిపోతుంది. ఎందుకంటే మీరు ఆ పనిలో ఆసక్తితో ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. ఈ భక్తి అనే మసాలాను మీ సాధనలో జోడిస్తే అది మిమ్మల్ని తదుపరిస్థాయికి తీసుకెళ్తుంది. లేకపోతే ధ్యానమే స్వయంగా భారం అవ్వగలదు. అదే జరిగితే అదొక విషాదం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ తత్వం నిష్కామ కర్మ గురించి, ఈ ప్రపంచంలో ఉండడం గురించి ఇలా చెప్తుంది. మురికి నీటిమడుగులో పెరిగే తామరాకు తన పరిసరాలతో అంటనట్లు ఉండాలి. అంటే మీరు దాని ప్రభావానికి లోను కావద్దని అర్థం. నా ఇష్టాలు, నా అయిష్టాలు వంటి వాటన్నింటినీ మీరు అధిగమించాలి. మనం ఏదైనా చేస్తున్న ప్రతీసారి మనం మార్పు చెందాలి. మనమేది చేస్తున్నా దానిలో ఇష్టాయిష్టాలు ఉంటాయి. మధ్యలో దానికి చాలా తటస్థంగా మరోటి ఉంటుంది. కానీ ఈ నిరంతర భాషణం ఎప్పుడూ ఉంటుంది. ధ్యానం… ఓహ్! దాజీ సాధారణంగా 25 నిమిషాలు ధ్యానం చేయిస్తారు. కానీ ఈరోజు 50 నిమిషాలు చేశారు. ఇలా అంతరంగంలో జరుగుతూ ఉంటుంది. నాకు ఇది ఇష్టం లేదు. ఇది ఎప్పుడు అయిపోతుంది? బాబూజీ! “దయచేసి మాకు సహాయం చేయండి. ఈ సిట్టింగును ఆపమని ఆయనతో చెప్పండి” అని ప్రార్థిస్తారు. మీ లోలోతుల్లో క్లీనింగ్ జరుగుతున్నప్పుడు, ఇదెప్పుడు అయిపోతుందా అనే ఆలోచన వస్తుంది. కానీ మీరు అలాగే ధ్యానాన్ని కొనసాగిస్తే ఆ సొరంగపు చివరికి వెళ్లి ఒక అద్భుతమైన స్థితిని పొందుతారు. మీరు దాన్ని వివరించలేరు. కాబట్టి శరణాగతిని పొందడమే సులువైన పని. ఒక సిట్టింగ్ గురించి నిర్ణయించి, ఇది నాకు నచ్చింది, నచ్చలేదు అనే నిర్ధారణకు రావద్దు. అదేమిటో అదే అది. కేవలం గమనించండి, సాక్షిగా ఉండండి మరియు డైరీలో వ్రాసుకోండి. తర్వాత దాని గురించి మరచిపోండి.
ఇష్టాఇష్టాలను అధిగమించడం
స్థితిని ఆనందించడం గురించి నేను తరచూ చెప్తుంటాను. ఇప్పుడు దీనికి పూర్తిగా భిన్నమైన దాని గురించి మాట్లాడతాను. మీ అనుభవాల గురించి ఎక్కువగా పట్టించుకోవద్దని చెప్తున్నాను. మీరు ఒక ప్రత్యేకమైన అనుభవం మీకు నచ్చిందనుకుంటూ దాన్నే ఆస్వాదిస్తే, దాన్నే పట్టుకుని ఉంటారు. ఈ స్థితి ఎంతో బాగుంది అనుకుంటూ, రాబోయే సిట్టింగులలో కూడా తరచూ మీరు ఆ అనుభవాన్నే ఆశిస్తారు. దానిలో తప్పులేదు. కానీ మీరు ఆ స్థితిని అధిగమించాలి. అందువల్లనే భారత దేశంలో ఎందరో యోగులు సహస్ర దళ కమలాన్ని దాటి ముందుకు వెళ్లలేదు. ఆ సహస్ర దళ కమలమే అంతా అని, అదే అంతిమమని, యోగ సాధనలో అదే చివరిదని తీర్మానించారు. ఈ స్థితిలోనే ఎవరైనా సచ్చిదానంద స్థితిని పొందుతారు. అస్తిత్వం, చేతనత్వం మరియు ఆనందం. ఆనందం అనేది ఏవిధంగా ఉంటుందంటే, మీరు ఏదో విధంగా ఆ ఆనందంలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మీకు ఇక ఆసక్తి ఉండదు. మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డ వారిలా మంత్రముగ్ధులై పోతారు. అఫ్ కోర్స్! సచ్చిదానంద సమ్మోహన స్థితి చాలా తేలికగా ఉంటుంది. అయినప్పటికీ మీరు దానికీ అలవాటు పడినట్లే కదా! అలాంటి స్థితిని బాబూజీ ఒక ప్రత్యేకమైన విధంగా వివరించారు. ఆటవస్తువులతో పిల్లలు ఆడుకోవడాన్ని ఆనందించినట్లు, యవ్వనం లో మీరు శృంగారం వంటి వాటితో ఆనందించినట్లు, ఇవి మీ ఆటవస్తువులు అని వారన్నారు. మీరు వాటితో ఆడుకుంటారు. ఒక యోగి తన చైతన్యంతో ఆడుకుంటాడు. అది ఆటవస్తువుల కంటే ఎలా భిన్నమైనది? బాబూజీ చెప్పినట్లు, మీరు వాటిని అధిగమించాలి. ఈ ఆనందాన్ని అధిగమించాలి. ఈ సచ్చిదానందాన్ని కూడా అధిగమించి… ఈ చైతన్యానికి ఊతమైన దాన్ని వెదకాలి. అటువంటి ఎరుకనిచ్చేది సౌశీల్యం. ఈ చైతన్య క్షేత్రం ఎలా సృష్టించబడుతుంది? దానికి ఊతమిచ్చేది ఏమిటి? అక్కడికి మనం వెళ్ళాలి. కాబట్టి మన లక్ష్యం చాలా గొప్పది మరియు చాలా సరళమైనది. ఇష్టాయిష్టాల వెనుక పడకుండా, ముందుకు సాగుతూ ఉండండి. దేన్నైనా ఇష్టపడడంలో తప్పులేదు కానీ దానికి అలవాటు పడకండి. మీకు అది నచ్చింది, మంచిది. దాని తర్వాతేంటి? ఇలా ఎన్ని విషయాలు మీ జీవితంలో సందడి చేస్తాయి? నేను ఇక్కడికి ప్రవేశిస్తున్నప్పుడు గులాబీ రేకుల వర్షం కురిపించారు. గులాబీ రేకులను కారుపై చల్లారు. దాని సువాసన నిజంగా చాలా బాగుంది తెలుసా! గులాబీ పూల సువాసన నాకు నచ్చింది. తర్వాత నాకు గులాబీ సెంటు కావాలని, దాన్ని అటవీ ఉత్పత్తుల నుండి తెమ్మని అడిగితే, సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి ఉదాహరణనే బాబూజీ మనకు ఇచ్చారు. మీరు ఒక తోట గుండా ప్రతి రోజూ ప్రయాణిస్తూ ఉంటే అక్కడ ఒక గులాబీ పొదను మీరు చూడడం జరగవచ్చు. ఆ ప్రత్యేకమైన పూలు మీకు నచ్చుతాయి. మరుసటి రోజు ఆ పూలు పూర్తిగా విచ్చుకొని ఉంటాయి. మూడవరోజు మీరు వాటి సువాసనను పీల్చడానికి దగ్గరకు వెళ్తారు. ఆ తర్వాత రోజు మీకు ఆ పూలను తెంపుకొని, ఇంటికి తీసుకెళ్లాలని అనిపిస్తుంది. ఈ విధంగా మన ఇష్టాలను, అయిష్టాలను పెంచుకుంటాం. అతను లేదా ఆమె చాలా మంచిది, ప్రియమైనది అంటూ ఇష్టపడడంలో తప్పులేదు. ఆ కథను అక్కడే ముగించండి, ఇంకా ముందుకు తీసుకెళ్లవద్దు. ఇది జీవితంలోని అన్నింటికీ వర్తిస్తుంది. ఇలా చేయడం ద్వారా మనం సంస్కారాల నుండి విముక్తులమవుతాం. అలాగే సాయంత్రపు నిర్మలీకరణ చేసుకొనే అవసరం ఉండదు. కాబట్టి సహజమార్గము, తన పరిసరాలచే ప్రభావితం కాకుండా ఉండే తామరాకు వంటి జీవనశైలిని బోధిస్తుంది.
ఎరుకతో మరణించడం ఎలా?
మనం ధ్యానిస్తున్నప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది? కొన్ని జరుగుతాయి. ఒకటి, దివ్య ప్రకాశం యొక్క మూలం నా హృదయంలో ఉందని లేదా దివ్య తేజస్సు నా హృదయంలో ఉందని మనం ధ్యానాన్ని ప్రారంభిస్తాం. సరే! తర్వాత కొన్ని ఆలోచనలు ప్రవేశించి, మన ఈ పవిత్ర భావాన్ని ఆటంక పరుస్తాయి. అప్పుడు ఈ భావన కొన్నిసార్లు మరుగున పడుతుంది. తర్వాత మీరు ఎరుకను కోల్పోయానన్న విషయాన్ని గ్రహిస్తారు. అలాగే కొన్ని ధ్యాన సమయాల్లో మిమ్మల్ని మీరు ఎంతగా కోల్పోతారంటే, మీరు ఎరుకను కోల్పోయానన్న సంగతి కూడా గ్రహించలేరు. అయితే ఆ తెలియని చోటు నుండి మీరు ఎలాగో తిరిగి వస్తారు. మనలో చాలామందికి ఇది జరుగుతూ ఉంటుంది. ఆ స్థితి ఒక విధంగా తాత్కాలిక మరణం వంటిది. అది అలా జరిగినప్పుడు, కొంతమంది అభ్యాసులు ఎంతగా భయపడతారంటే … వాళ్ళు ఉలిక్కిపడి, ‘నాకేం జరిగిందో‘నని ఒక్క ఉదుటున ధ్యానం నుండి లేస్తారు. అలా మీలో చైతన్యం కోల్పోయినప్పుడు, యోగాలో దీన్నే సమాధి స్థితి అంటాం. అయితే బాబూజీ మహరాజ్ ప్రకారం, ఈ సమాధి స్థితి కూడా పునాది రాయి వంటిదే! మీరు ఇంకా ముందుకు, దీన్ని కూడా అధిగమించి వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఒక్క క్షణం మీలో ఉన్న ఆ పూర్తి ఎరుకను కోల్పోయినటువంటి స్థితి… అదే సమయంలో మీలో చైతన్యం కొంత స్థాయిని కలిగి ఉండే స్థితి అది ఎవరికైనా లభించే సమ్మోహన స్థితి వంటిది. యోగ శాస్త్రాలలో దీన్నే తురీయాతీత స్థితిగా పేర్కొనడం జరిగింది. ఎప్పుడైతే మీలో చైతన్యం కోల్పోయిన ఆ స్థితి కూడా మీ ఎరుక నుండి మాయమైతే, అప్పుడు ఆ క్షణంలో మీరు మరణించారని భావిస్తారు. కనుక ఒక విధంగా ఎరుకతో మరణించడానికి శిక్షణగా, ధ్యాన సాధనను మనం భావించవచ్చు. మరణం సంభవించే ఆ క్షణంలో ఎటువంటి భయం వేయదు. మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. చావు అనేది రేపు వచ్చినా, రేపటి దాకా ఎందుకు? ఇప్పుడు వచ్చినా సరే! భగవంతుని దయ వల్ల, అలాగే జరగనీ! నేను సిద్ధం! అప్పుడక్కడ భయం ఉండదు. ఎందుకంటే అప్పటికే ధ్యాన సమయంలో సమాధి స్థితిని అనుభవించిన ఫలితంగా, మరణం అనేది అందుకు భిన్నంగా ఉండదు. నిజానికి మరణం అనేది ఆ చైతన్య రహిత స్థితి కన్నా, అకస్మాత్తుగా విస్ఫోటనంలా సంభవించే ఒక బృహత్తరమైన స్థితి. ఇది ఎలాగంటే ఒక కప్పులో ఉండే చిన్న పరిమాణంలోని నీరు… అకస్మాత్తుగా ఆకాశాన్ని ఆవరించిన ఒక భారీ పరిమాణంలోని మేఘం వలే మారిపోవడం. అంతటి స్థాయి కలిగిన యోగి, ఎలాగో తన చైతన్యాన్ని, ఎరుకను అన్ని దిశలా కలిగి ఉంటాడు. ధ్యాన సాధన మనల్ని ఆ క్షణానికి సిద్ధమయ్యేలా తయారు చేస్తుంది.
ధ్యాన సమయంలో ఆలోచనలు
మీ మనసుకు విశ్రాంతినివ్వడం ఎలా? ఇంకో విధంగా చెప్పాలంటే మీరు మీ మనసును తన పని తనను చేయవద్దని చెప్తున్నారు. మీ మనసు కనుక ‘నేను పని చేయను‘ అంటే అది ఒక విషాదమవుతుంది. కానీ ఇక్కడ మీరు అడుగుతున్నారు. నాకు ప్రశ్న అర్థమైంది… కానీ ఈ వేర్పాటు అనేది ఎక్కడినుండి వస్తున్నది? మనసు బిజీగా ఉన్నదని గుర్తిస్తున్నది ఎవరు? ప్రశ్నను అడుగుతున్న ‘నేను‘ ఎవరు? మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. రెండవ విషయం… బాబూజీ మాటల్లో కళ్ళు చూడటానికి, ముక్కు వాసన చూడటానికి, చెవులు వినటానికి ఎలాగో… అలాగే మెదడు, మన మనసు ఆలోచించటానికి ఉన్నాయి. దాన్ని ఆపటానికి ప్రయత్నించవద్దు. సరేనా! ఆయన ఇంకొక వాక్యాన్ని జోడిస్తారు. మీరు ఏం ఆలోచించాలనుకుంటున్నారో, అదే మీ మనసు ఆలోచించేలా నిర్ధారించుకోండి. మీరు దాన్ని దివ్య ప్రకాశపు ఉనికి మీద ఆలోచించాలని కోరుకుంటున్నారు. అది ప్రారంభం. మనం ప్రార్థనాపూర్వకంగా చేసే ఈ భగవంతుని దివ్య తేజస్సు ఉందనే ఆలోచన దివ్యత్వపు అనుభూతిగా మారుతుందని ఆశిస్తూ, అది ఎంత తాత్కాలికమైనప్పటికీ ఎదురు చూస్తాం. ఆ తర్వాత ఒక స్థాయిలో మీరు ఈ అనుభూతిగా తయారవ్వాలని కోరుకుంటారు. మీకు ఇంతవరకు అర్థమయింది కదా! సరే, ఆపై మీరు ఆ విధంగా తయారై ఏదో సాధించామనే ఆనందాన్ని అనుభూతి చెందుతారు. అక్కడ ఒక విధమైన ఆనందం ఉంటుంది. ఇది స్వయంచాలితంగా జరుగుతుందని బాబూజీ అంటారు. మీరు దీన్ని అధిగమించి ఏమీ లేని స్థితికి చేరుకుంటారు. మీరు ఆ పరమానంద స్థితిని సైతం అధిగమిస్తారని దీని అర్థం. ఈ మార్పు చెందే క్రమం… ఆలోచన నుండి భావనకు, ఆపై అనుభూతికి, అనుభూతిగా మారడం నుండి ఆనందానికి… అక్కడి నుండి శూన్యత్వంకు అధిగమించటం అనేది క్రమక్రమంగా జరిగే ప్రక్రియ. ఓర్పుతో ఉండండి. నేను సాధన ప్రారంభించిన తొలిరోజుల్లో, ఒక విద్యార్థిగా కూడా కొన్నిసార్లు .. ‘నేను ఇది చదవాలి‘ లాంటి ఆలోచనలు నా మనసులోకి వస్తుండేవి. నేను ఈ చాప్టర్ చదివితే మంచిది, దీన్ని చదివితే మంచిది ఇలా. వెంటనే నేను ఆ చాప్టర్ తీసుకుని చదివే వాడిని. ధ్యానం తరువాత నాకేమి సూచనలను ఇవ్వాలనుకుంటున్నదో వాటిని గమనించి మనసులోనే గుర్తుంచుకునే వాడిని. కాబట్టి మనసు నుండి వచ్చే సందేశాలు నిరుపయోగమైనవి కాదు. అది ఎప్పుడూ మనం చేయకుండా వదిలేసిన పనులను గూర్చి గుర్తు చేస్తుంది. కాబట్టి దీనిని గుర్తుంచుకోండి. ఒక్కసారి మీరు ఆ పనిని పూర్తిచేస్తే అది మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టదు. ఒకసారి నేను బాబూజీ ముందు సిట్టింగ్ లో కూర్చుని ఉండగా… నా స్నేహితుల గూర్చిన అనవసరమైన ఆలోచనలు రావటం మొదలు పెట్టాయి. అప్పుడు నా పరిస్థితి ‘భగవంతుడా, నన్ను రక్షించు‘ అన్నట్లుగా ఉండి నా శరీరమంతా చెమట పట్టింది.నేను నిజం చెప్తున్నాను. అది నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందంటే చెమటతో పూర్తిగా తడిసిపోయి నా దవడలను గట్టిగా బిగించి కళ్ళు తెరిచి మూసాను. అప్పుడు నాకు కొంత ఉపశమనం కలిగింది. అప్పుడు నా హృదయంలో ఒక అవగాహన మొలకెత్తింది. ‘నేనెందుకు పోరాడుతున్నాను? ఆయనకు అన్నీ తెలుసు. నా చైతన్యపు లోలోతుల్లోంచి వాటిని బయటకు తీసివేయాలనుకుంటున్నది ఆయన. నేనెందుకు జోక్యం చేసుకోవాలి? ఆయనేం చేయాలనుకుంటున్నారో అది ఆయన్ను చేయనిద్దాం.” ఈ అవగాహన నా ధ్యానాలన్నింటినీ రక్షించింది. మాస్టర్ పని చేస్తున్నారు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి. కానీ కొన్ని ఆలోచనలు, మన చేత సృష్టించబడిన వాటిని, ఏదో విధంగా మనం అదేం సూచిస్తున్నదో దాన్ని చేసి వాటిని ఆపాలి. తప్పిదాలు అప్పటికే జరిగిపోయాయి, ఇంక వాటిని మీరు సరిదిద్దుకోలేరు. మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరండి. అదే సర్దుకుపోతుంది.
విద్యార్థులుగా నకారాత్మక ఆలోచనలను ఎదుర్కోవడం ఎలా?
నకారాత్మక ఆలోచనలు మనకెందుకు వస్తాయి?
ముఖ్యంగా నేను నా గురించి చెప్తాను. అప్పుడు నీకెందుకు వస్తున్నాయో బహుశా నీవు తెలుసుకోగలుగుతావు. నాకు ఫిజిక్స్ మీద అంత ఆసక్తి ఉండేది కాదు.సరిగా చదవలేక పోయేవాడిని. పరీక్షలు దగ్గరకు రాగానే ఆందోళన కలిగేది. అదే జరుగుతుంది కదా! ఏ విషయం గురించైనా మనం సంసిద్ధులుగా లేమో, మనకు అర్థం కాదో, తెలియదో అప్పుడు మనకు ఆందోళన కలుగుతుంది. నీకు ఏబిసిడిలు రాయడంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? కలగదు, ఎందుకంటే అవి నీకు వచ్చు కనుక. ఏ విషయంలో అయితే ఆసక్తి కలుగుతుందో అది త్వరగా నేర్చుకోగలుగుతాం. బాబూజీ “రెండు సాధనాలు విద్యలో ఉపయోగపడతాయి – ఒకటి మీ శ్రద్ధ, రెండు మీ పరిశీలన. మీకు శ్రద్ధ ఉంది కాబట్టి ఆ విషయం గురించి మరలా మరలా పరిశీలిస్తారు, ఆలోచిస్తారు” అని చెప్పేవారు. కాబట్టి శ్రద్ధ మరియు పరిశీలన అవసరం.
నిద్ర - ఆరోగ్యంపై దాని ప్రభావం
ఒకవేళ మీరు ఫోన్ తో గడుపుతూ, రాత్రి ఒంటిగంట వరకు మేలుకొని ఉంటారు. ఒంటిగంట వరకు చేయాల్సిన అంత ముఖ్యమైన పని మీకేం ఉంటుంది! కానీ ఈరోజుల్లో ప్రజలకు ఇదో పెద్ద వ్యాధిలా మారింది. పిల్లల్లోనే కాదు పెద్దవారిలో కూడా! దాని వలన నిద్ర సరిగా పట్టదు. వారి మానసిక పరిస్థితి దిగజారిపోతుంది. ఉదయం ధ్యానం సరిగా చేయలేరు. చికాకుగా ఉంటారు. ప్రమాదాలు కూడా దాని వల్లనే జరుగుతాయి. నిద్ర సరిగా పట్టదు. చాలా ప్రమాదాలు సరిగా నిద్రించని కారణంగా జరుగుతాయి. ఆ వ్యక్తి యొక్క మెదడు కూడా త్వరగా క్షీణిస్తుంది. మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు చాలామంది యువత ఫోన్ తో గడుపుతూ, రాత్రి చాలా ఆలస్యంగా నిద్రిస్తున్నారు. వారికి 50 ఏళ్ల వయసు వచ్చేసరికి వారి మానసిక పరిస్థితిని చూడాలి. వారి పరిస్థితి గురించి ఆలోచించి మీరు హైరానా పడతారు. వాళ్ళ మెదడు చాలా త్వరగా క్షీణించడం మొదలవుతుంది.
ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం
సుదూర ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణాన్ని మనం కొలవలేం. మీరు కోరుకుంటే మీ మెడను ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిప్పగలుగుతారు. అది కూడా ఎప్పుడు తిప్పగలుగుతారు?
మీరు పూర్తి సన్నద్ధత తో ఉన్నప్పుడు. మనం కనుక సన్నద్ధంగా లేకుంటే కోట్ల సంవత్సరాలు గడిచినా ఏదీ సాధ్యం కాదు. ఏదైనా మన తయారీ పై ఆధారపడివుంటుంది. బాబూజీ రచనలైన సత్యోదయం, ఎఫికసీ ఆఫ్ రాజయోగ,అనంతం వైపు ఇంకా ఇతర రచనలు చదివితే మీకు ఈ ప్రయాణం ఎక్కడి వరకు, ఎక్కడికి చేరుకోవాలి అన్న విషయం కొద్ది కొద్దిగా అర్ధం అవుతుంది. మరీ ముఖ్యంగా మన గమ్యానికి ఎలా చేరుకోవాలి అన్న విషయం గురించి ఒక స్పష్టత ఏర్పడుతుంది. మనం చేరుకోవాల్సిన గమ్యం ఒక ప్రదేశం కాదు. అది మన హృదయం లోనే ఉంది. మనం సాధించవలసినది మన హృదయం లోనే ఉంది. ఉదాహరణకు మనం ఇక్కడ ఒక కొవ్వొత్తి వెలిగించి దాని వెలుపల నీలం రంగు అద్దం ఉంచితే ఏమవుతుంది? అందులోంచి వెలువడే కాంతి నీలం రంగులో ఉంటుంది కదా! కొవ్వొత్తి వెలుపల ఎరుపు, తెలుపు, పసుపు, ఇలా రంగురంగుల అద్దాలు ఉంచితే ఏమవుతుంది? అదే నలుపు రంగు అద్దం ఉంచితే బయటకు కాంతి వెలువడదు కదా! మన ఆత్మ కూడా అలాంటి పరిస్థితినే కలిగి ఉంటుంది. మనలోని సంక్లిష్టతలు అనుకోండి, స్థూలత్వం అనుకోండి… మన శాస్త్రాలలో చెప్పినట్లు పాపం, పుణ్యం ఇవి రంగుటద్దాల లాగా ఆత్మను కప్పి ఉంచుతాయి. మన సహజమార్గం లోని నిర్మలీకరణ ప్రక్రియ ద్వారా మెల్లమెల్లగా ఈ సంస్కారాలు అన్నీ ఒకదాని తరువాత ఒకటిగా తొలగిపోతాయి. తరువాత ఉన్నట్లుండి మనకు మన గమ్యం స్ఫురిస్తుంది. అయితే ఇది అంతా మనపై ఆధారపడి ఉంటుంది. మనం విషయ లాలసత్వం నుండి ఎలా బయట పడతామన్న విషయం మీద ఇది ఆధారపడి ఉంటుంది. అలా కాక ఇంకా విషయ లాలసత్వం ఉంటే మాత్రం బండి ముందుకు కదలదు. విషయ లాలసత్వం అన్నది ఇక్కడ ప్రధాన సమస్య. మన ధ్యానంతో పాటుగా మన చైతన్య స్థితి కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని మనం ఈ చుట్టుపక్కల ఉన్న వస్తువులను మాత్రమే చూడగలుగుతాం. అదే డాబా పైకి వెళ్తే మరి కొంత చూడగలుగుతాం. పదవ అంతస్తు మీద నుండి చూసినప్పుడు మరింత ఎక్కువగా చూడగలుగుతాం. ధ్యానంతో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొన్నప్పుడు…. హృదయ చక్రం నుండి ఆత్మ చక్రం (ఈ చక్రాల గురించి బాబూజీ సవివరంగా తెలియ చేసారు) ఇలా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొని ఆ స్థితిని మనం అనుభూతి చెందినప్పుడు… ఆ స్థితి విభిన్నంగా ఉంటుంది. ఆ స్థితిని మనం ఎలా వర్ణించగలుగుతాం? ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడి విషయాలు మనకు అర్థం అవుతాయి. ఉన్నత స్థితికి చేరుకొన్నప్పుడు సమస్త బ్రహ్మాండాన్నీ చూడగలుగుతాం. అయితే మన చిన్న ఆవరణ లోనికి బ్రహ్మాండాన్ని తెచ్చి ఉంచగలమా? దాన్ని ఎలా వర్ణించగలం? అది వేరుగా ఉంటుంది కదా! ఈ ప్రయాణం అనంతమైనది. పరమాత్మ కూడా అనంతుడే. ఆ పరమాత్మను చేరుకొనే మార్గం కూడా అనంతమైనదే. కాని ఏదో ఒక బిందువు నుండి ప్రయాణం మొదలు పెట్టక తప్పదు. మనం ఆ పరమాత్మ సమీపానికి అయితే చేరుకోగలం కానీ ఆయన్ను చేరుకోలేం. మార్గం ఎంతో కష్టతరమైనది.
విశ్వ ప్రార్థన ఆవశ్యకత
ఎందుకని పెట్టారంటే, ఎక్కడ తొమ్మిది గంటల సమయం అయినా, ఇతర దేశాల్లో అయినా కూడా…. అందరి ప్రార్థన ఒకే వాతావరణాన్ని కలుగజేస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట సమయం 9 గంటల అవుతుంది కదా! ఇప్పుడు ఎక్కడ 9 అయి ఉంటుంది? చైనాలో, అక్కడి అభ్యాసులు ధ్యానంలో కూర్చుని 10, 15 నిమిషాలు ప్రార్థన చేస్తారు. దాని కంటే ముందు జపాన్లో అవుతుంది. దాని కంటే ముందు ఆస్ట్రేలియాలో, ఫిజీలో అవుతుంది. ఇలా ప్రార్థన విశ్వవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంటుంది. ఏదైనా హృదయంతో చేస్తే అది జరిగిపోతుంది. నేను ఈ పిల్లల వలే చిన్నగా ఉన్నప్పుడు, కాలేజీ రోజుల్లో అప్పుడప్పుడు 9 గంటల ప్రార్ధనను మరిచిపోయేవాడిని. అందువల్ల సాయంత్రం ఐదు, ఆరు గంటలకు చేసేవాడిని. దాని ప్రయోజనం ఏమిటంటే ప్రార్థనను నేను సరిగ్గా అర్థం చేసుకోగలిగాను. 9 గంటలకు లేదా ఆలస్యంగా చేస్తే ప్రార్థన లోని రెండు వాక్యాలు పూర్తి కాకముందే నిద్ర వచ్చేది. నా ప్రార్థన పూర్తయ్యేదే కాదు. అందువల్ల నేను సాయంత్రం నా కోసం ప్రార్థన చేసుకునే వాడిని. దాని భావాన్ని అర్థం చేసుకోవాలని బాబూజీ అనేవారు. దాని భావాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మననం చేస్తూ నిద్రపోవాలి. “ఓ మాస్టర్! మానవ జీవితానికి యదార్ధ లక్ష్యము నీవే,” అంటూ రెండు వరుసలు చదివేసరికి నిద్రపోయే వాడిని. అందువలన సాయంత్రం ఐదు, ఆరు గంటలకే పెట్టుకున్నాను. ఆ సమయంలో నా మనస్సు జాగృతమై ఉండడం వల్ల దాని భావం బాగా అర్థమయింది. తొమ్మిది గంటల ప్రార్థన వేరే విషయం. రాత్రి పరుండబోయే ముందు “ఓ మాస్టర్! మానవ జీవితమునకు యదార్ధ లక్ష్యము నీవే” అంటూ చేసే ప్రార్థన అన్నింటికంటే చివరి పని అవుతుంది.
పిండాండంలో ఏదైతే ఉందో, అదే బ్రహ్మాండంలోనూ ఉంది...
యథా పిండాండ్, తథా బ్రహ్మాండ్ … ఏదైతే శరీరంలో ఉందో, అదే బ్రహ్మాండంలో కూడా ఉంది. దీన్ని తిరగేసినట్లైతే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే శరీరంలో కూడా ఉంది. అది చాలా వరకు నిజం. భగవంతునిలో ఏదైతే ఉందో అదే మనలోనూ ఉంది. దీని గురించి పూజ్య లాలాజీ మహరాజ్ చాలా బాగా చెప్పారు. దీన్ని అర్థం చేసుకోడానికి ముందుగా ఆత్మను, తరువాతే బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మానసికంగా, ధ్యానం ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతాం. ఆత్మ అంటే అర్ధం ఏమిటి? ఆత్ మరియు మన్. అత్ అంటే కదలిక, మన్ ఆలోచించడం. బ్రహ్మాండం లేదా బ్రహ్మం బృహ్, మన్ పదాల కలయిక వల్ల ఏర్పడుతుంది. బృహ్ అంటే విస్తరణ. ఇక్కడ మన్ అనే దానికి చింతన, ధ్యానం అనే అర్థం తీసుకోవాలి. ఆత్మలో అంటే మనలో ఆలోచించడం జరుగుతుంది. మన ఆలోచన సరళంగా, ఒకే దిశలో ఒక ఆలోచన నుండి, రెండో ఆలోచన వైపుగా కదులుతుంది. బ్రహ్మంలో ఏం జరుగుతుంది? చింతన, మననం 360 డిగ్రీలలో జరుగుతుంది. అలాగే విస్తరణ జరుగుతుంది. దానిలో ఒకే దిశలో ఆలోచన ఉండదు. నాలుగు వైపులా, 360 డిగ్రీలలో ఉంటుంది. ఈ ఆలోచన కూడా అన్ని దిశలలో విస్తరిస్తుంది. అందువలనే బ్రహ్మ యొక్క ముఖం మనం చూసినట్లయితే, అది ఎలా చిత్రించబడింది? నాలుగు ముఖాలు కదా! ఆయనకు నాలుగు ముఖాలున్నాయి. దాని అర్థం ఏమిటంటే, ఆయన నాలుగు వైపులా ఆలోచిస్తాడు. అలా ఆలోచించి పని చేస్తాడు. మన ఆలోచన ఒకే దిశలో కదులుతుంది. కానీ ధ్యానం ద్వారా మనస్సు ఎలా అవుతుందంటే, ఒక్కోసారి ధ్యానం చేస్తున్నపుడు వ్యాపార సంబంధమైన ఆలోచనలు వస్తాయి. దానికి ఏదో కారణం ఉంటుంది. దాన్ని అన్ని వైపులా నుండి శ్రద్ధగా గమనించండి. ఇది మంచిదా, చెడ్డదా, చేయవచ్చా, చేయకూడదా, లాభమా, కాదా, ఇది విజయవంతమవుతుందా లేదా… ఇలాంటి అన్ని ఆలోచనలు ఆ సమయంలో వస్తాయి.అంతకంటే ప్రాముఖ్యత ఏమీ లేదు.