ధ్యానం అంటే ఏమిటి?
ధ్యానం అంటే ఏమిటి? అని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ధ్యానం అంటే ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయడం. దీనికి సమానమైన సంస్కృత పదం ‘ధ్యాన్‘ విభిన్నమైన అర్ధాన్ని కలిగి ఉంటుంది. ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటానికి, దీనికి ఏమీ సంబంధం లేదు. ధ్యాన్ అంటే మనసును, హృదయాన్ని ఉపయోగించి మనసును అధిగమించటం. ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటం అనే మొదటి నిర్వచనం తీసుకుంటే అప్పుడు ముందుగా ప్రణాళిక ప్రకారం హత్యలు చేసే హంతకుడు… అతని చర్యలు కూడా ధ్యానం గానే పరిగణించవలసి వస్తుంది. కానీ మనం దాన్ని అలా పిలవం. ఈ తేడాను గమనించండి. ఆక్స్ ఫర్డ్ ప్రకారం మనసును ఒకే విషయంపై లగ్నం చేయటం ధ్యానం. కానీ మన భారతీయ సంప్రదాయంలో నిజమైన ధ్యానం అంటే మన మనసును అధిగమించటం కాబట్టి కేంద్రీకరించటం అనేది విషయం కాదు. కానీ మనం దృష్టిని కేంద్రీకరించే మర్థ్యాన్ని…. మంచి చెడుల విచక్షణా జ్ఞానాన్ని, కారణానికి, ప్రభావానికి గల సంబంధాన్ని… ఏది చట్టపరంగా తప్పైనా, నైతికంగా ఒప్పో ఇలాంటివి… జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం చట్టపరంగా తప్పు అయినప్పటికీ నైతిక పరంగా అది కచ్చితంగా ఒప్పు అయి ఉండవచ్చు. అది అత్యుత్తమమైన చట్టం.
మనం దీన్ని ముందుగా అనుసరించాలి. మీరు చట్టాన్ని ఉల్లంఘించటం వలన మూల్యం చెల్లించాల్సి వచ్చినా కూడా నైతికతనే అనుసరించాలి. మీరు శిక్షను అనుభవించటానికి ధైర్యం, బలం కలిగి ఉండాలి. కాబట్టి నైతికత చాలావాటిని కోరుతుంది. ధ్యానం మనకు ఖచ్చితమైన స్పష్టతను కలగజేస్తుంది. ‘లా‘ చదివే విద్యార్థులందరూ కనుక ధ్యానం చేసినట్లయితే వారి అంతర్దృష్టి (సహజ జ్ఞానం) ఆకాశమంతగా పెంపొందుతుంది. ఇంతకు ముందు నేను బుద్ధి యొక్క ఐదు స్థాయిల గురించి మాట్లాడటం జరిగింది. దీనిలో అత్యున్నతమైనది ఈ సహజ జ్ఞానం.. ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ లాయర్, డిఫెన్స్ లాయర్ వాదనలు వినిపిస్తుంటారో… వారు నోరు విప్పక ముందే, సహజ జ్ఞానం గల జడ్జి గారు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది చెప్పగలరు. అదీ ధ్యానం యొక్క శక్తి. ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని సాధన చేసి, వారి అంతర్దృష్టి ఏవిధంగా పెంపొందుతుందో గమనించాలని నేను కోరుకుంటున్నాను., తరువాత, అతిధులతో విందు సమయంలో ‘బ్రైటర్ మైండ్స్‘ ప్రదర్శన ద్వారా… కొద్ది వారాల ధ్యానం సైతం పిల్లల మనసును ఏ విధంగా మార్చగలదో మీకు చూపిస్తాను. దీని గురించి మీలో చాలామందికి తెలుసు. అయితే మన బ్రైటర్ మైండ్స్ క్లాసెస్ తెలియని వారి కోసం, ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
బ్రహ్మజ్ఞానం వ్యాపారం కాదు
శ్రీ రామచంద్రజీ మహరాజ్ అత్యుత్తమ ఆవిష్కరణ ఏమిటి? సరళంగా చెప్పాలంటే మొదటిది ధ్యానం, రెండవది కూడా ధ్యానమే! కానీ ప్రతి ధ్యానంలో వైవిధ్యం ఉంది.! రామచంద్రజీ మహరాజ్ ప్రాణాహుతిని కనుగొన్నప్పుడు ప్రాణాహుతి ప్రవాహం మన హృదయంలో కొనసాగుతున్నప్పుడు… మన చైతన్యంలో ఒక దివ్యజ్యోతి వెలుగుతుంది. మనం దాన్ని ఒక సాక్షిగా చూస్తూ అనుభూతి చెందుతాం. సాధారణంగా చేసే ధ్యానంలో మనం ఆ అనుభూతిని పొందలేము. హృదయం లోని దివ్య తేజస్సు పై ధ్యానం చేస్తూ మన మొదటి రోజు నుండే సమాధి స్థితిని పొందగలుగుతాం. దాని కొరకు 50 – 60 సంవత్సరాల తపస్సు అవసరం లేదు. ఈ ప్రాణాహుతిని కనుగొనడమే వారి గొప్ప ఆవిష్కరణ. ప్రాణాహుతి అనేది శ్రీరామచంద్ర మిషన్ యొక్క ప్రాథమిక విషయం. ఈ ప్రాణాహుతి లేకుండా చేసే ధ్యానం ఇతర ధ్యాన పద్ధతుల లాగానే ఉంటుంది. ప్రాణాహుతి తో కూడిన ధ్యానం ద్వారానే సమాధి స్థితిని వికసింపచేసుకోగలం. సమాధి స్థితిని పొందిన తర్వాత మన జీవితంలో కొత్త జీవం వస్తుంది. శ్రీ రామచంద్రజీ మహరాజ్ చెప్పినట్లుగా “మన జీవితంలో జీవం” అనే వాక్యానికి నిజమైన అర్థం తెలుసుకోగలం. ప్రతి వ్యక్తిలోనూ వికసించే ఆధ్యాత్మిక జీవితమే నిజమైన జీవితం. ఇదే మన భారతీయ సాంప్రదాయం. ఏమైనా నామాలు లేదా మంత్రాలు జపిస్తున్నప్పుడు ఉదాహరణకు గాయత్రీ మంత్రం… అది చాలా శక్తివంతమైన మంత్రం. మంత్రం యొక్క సారం….. అంతరార్థం తెలియకుండా దాన్ని మరలా మరలా జపించడం మన మూర్ఖత్వం మాత్రమే! ఈ మంత్రం యొక్క సారం ఏమిటి? మంత్రం ఏమి చెబుతుందంటే, “భూలోకం, పితృలోకం, స్వర్గలోకం అంతా వ్యాపించి ఉన్న నిత్య జ్యోతిస్వరూపమైన ఓ మాతా! నాకు ఆ అనుభూతిని ప్రసాదించండి. నాకు విజ్ఞతను, బుద్ధిని ప్రసాదించండి”. అంటే “ఆ సారాన్ని మన హృదయంలో అనుభూతి చెందాలి.ఆ జ్యోతి నా జ్ఞానాన్ని వెలిగించాలి” అని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే బుద్ధిలో చాలా స్థాయిలు ఉంటాయి. వివేకంలో ఐదు, ఆరు స్థాయిలు ఉన్నాయి. సాధారణ స్థాయి నుండి మేధ, ప్రజ్ఞ ఇలా చాలా స్థాయిలు ఉన్నాయి. మేధస్సు అయిదు గుర్తించదగిన, గుణాత్మకమైన స్థాయిలను కలిగి ఉంటుంది. అది ఒక అశ్వం వంటిది.మంచి శిక్షణ ఇచ్చిన అశ్వం. కొన్ని గుర్రాలు ఉంటాయి. వాటిపై ఎక్కి కూర్చొని ఎంత అదిలించినప్పటికీ, నెట్టినా తోసినా కదలను కూడా కదలవు. మంచి శిక్షణ నిచ్చిన గుర్రాలు కొరడా నీడ చూపినా చాలు, పరిగెత్తడం మొదలు పెడతాయి. వాటికి ఒక సైగ చేస్తే చాలు. మన బుద్ధి కూడా అటువంటిదే. ఒక చిన్న సంకేతం, ఒక మంచి సంకల్పంతో అభివ్యక్తీకరించబడుతుంది. రామచిలుక ను చూడండి. దానికి గాయత్రీ మంత్రం నేర్పితే, అది ఇక ఆ మంత్రాన్ని వల్లే వేస్తూనే ఉంటుంది. మీరు కూడా అలానే మంత్రాన్ని వల్లించినా, పదిలక్షల సార్లు వ్రాసినా ఏం ప్రయోజనం ఉండదు. ‘అమ్మా! ఈ సృష్టికి మూలం నీవు.నా హృదయంలో జ్ఞానజ్యోతిని ప్రకాశింప చేయి’ అని అంతరంగంలో వేడుకొంటేనే ఫలితం ఉంటుంది. ఆ మంత్రజపం చేయడం లోని ముఖ్యోద్దేశ్యం కూడా అదే. మన ఆదిగురువు రామచంద్రజీ మహరాజ్ దీన్ని సుసాధ్యం చేశారు. ధ్యాన పద్ధతిని ఆయన సరళం చేశారు. ధ్యానానుభూతిని పొందాలన్న అభిలాష కలిగిన వ్యక్తి గృహస్థ జీవితాన్ని అనుభవిస్తూ కూడాఎలా ధ్యానం చేసుకోవచ్చో ఆయన తెలియ చేశారు. సరళీకరణ అనేది కీలకమైన విషయం. నేటి యువత యొక్క స్వభావాన్ని, లక్షణాలను మార్చాలని
చాలామంది భావిస్తూ ఉంటారు. యువత మాట వినడం లేదని వారు అంటూ ఉంటారు. వారు ఎందుకు వింటారు? వారు ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం మంచిదే! కానీ వారి ప్రశ్నలకు సమాధానం మన వద్ద లేదు. అనుభవం ద్వారా మాత్రమే సమాధానం ఇవ్వగలం. భగవంతుని నమ్ముతారా? అంటే అందరూ నమ్ముతాం అనే చెప్తారు. అయితే ఎందుకు నమ్ముతారు అని యువత ప్రశ్నిస్తుంది. మన దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది. మన శాస్త్రాలు, తల్లిదండ్రులు, పండితులు, పూజారులు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం అంటారు. అయితే మీరేం అనుకొంటున్నారు? ఎప్పుడైనా భగవంతుని అనుభూతి చెందారా అని ప్రశ్నిస్తే నోరు మూత పడిపోతుంది.
అలా ప్రశ్నించడంవలన కొంతమందికి కోపం కూడా వస్తుంది. మీరు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటారు. యువత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం. అయితే వారితో ప్రాణాహుతితో కూడిన ధ్యానసాధన చేయిస్తే, వారు అర్ధం చేసుకొంటారు. ఇందులో ఏదో ఉంది, వాదించవలసిన అవసరం లేదు అని వారు అర్ధం చేసుకొంటారు. అనుభూతి చెందినప్పుడు నమ్మకాలు, శ్రద్ధ వీటితో పని ఉండదు. ఎందుకంటే ఒకసారి నేను ఇది సూర్యుడు, ఇవి నక్షత్రాలు, ఇది చంద్రుడు అని చూసినప్పుడు నమ్మకం యొక్క అవసరమేముంది? మీరు కళ్ళతో స్వయంగా చూస్తున్నారు. గాయత్రి యొక్క సారాన్ని మీ హృదయంతో అనుభూతి చెందుతున్నారు. వేద కాలమని చెప్పే ఆ సమయంలో మన దేశంలో, వైదిక కాలంలో ఒక్క మందిరం కూడా లేదు. పూర్తిగా నాలుగు వేదాలూ చదవండి. మందిరం విషయంలో ఎవ్వరూ దిగులు పడేవారు కాదు. ఎందుకు? మనకు ఋషులు, మునులు ఉన్నారు కదా! మనలో కూడా అలాంటివారు ఉన్నారు, రంతా ఋషుల వంటిరే. వారికి ఈశ్వరుని అనుభూతి కలుగుతుంది. ఈశ్వరుని అనుభూతి కలిగినప్పుడు బయట ఉండే వాటి అవసరం ఏముంటుంది? అందువల్లనే అప్పట్లో మందిరాలు లేవు. క్రమక్రమంగా హిందూ ధర్మం పతనం చెందనారంభించినప్పుడు, మందిరాలు వెలవడం మొదలైంది. కొందరు ఇదంతా శ్రద్ధకు సంబంధించిన విషయం అంటారు. ఔను! ఆధ్యాత్మిక విషయంలో తప్పకుండా శ్రద్ధకు సంబంధించిన విషయం ఉంటుంది. శ్రద్ధ లేనప్పుడు తలవంచుకోవడం వలన ఏం ప్రయోజనం ఉండదు. శ్రద్ధ ఉన్నట్లయితే, తలవంచుకోవలసిన అవసరమే లేదు. ఇది పూజ్య లాలాజీ మహరాజ్ చాలా గర్వంగా, ధైర్యంతో, పూర్తి స్పష్టీకరణతో ప్రపంచానికి చెప్తున్నారు. ధ్యానం చేయండి, ప్రాణాహుతి తో ధ్యానం చేయండి అని.అప్పుడు మీ జీవితంలో ఎలాంటి ప్రకాశం వస్తుందో చూడండి. ప్రతి ఇంట్లో ధ్యాన పద్ధతి నెలకొంటుంది. అందరికీ మన దేశంలో ఈ ధ్యాన పద్ధతి ఉందని తెలుస్తుంది. దాన్ని మనదిగా చేసుకుందాం. ఇది మన సంస్కృతిని సంరక్షించుకోవడానికి రానున్న తరానికి అందించ వలసిన అవసరముంది. ముఖ్యంగా ఉచితంగా అందివ్వడం. దీనికి డబ్బు అవసరం లేదు. బ్రహ్మజ్ఞానాన్ని మనదేశంలో అమ్మడం మొదలెడితే, ఈ బ్రహ్మజ్ఞానాన్ని…. యోగ విద్యను మన దేశం అమ్మడం మొదలెడితే, మన దేశం భారత దేశంగా మనజాలదు. ఎందుకంటే బ్రహ్మవిద్య ఎప్పుడూ అమ్మబడేది కాదు. ఏ క్రియ కైనా డబ్బు తీసుకోరు. యోగాన్ని ఉద్యోగంగా ఎప్పుడూ చేయకూడదు. ఇది మన గురువర్యులు శ్రీ రామచంద్రజీ వాగ్దానం. మనం పోయిన తర్వాత కూడా…మనమైతే వెళ్ళిపోతాం. మీలో కొందరు వెళ్ళిపోతారు.మనమంతా వెళ్ళిపోయే వాళ్ళమే. ఒక్కోసారి ఒక్కో వికెట్ అయితే పడిపోతూ ఉంటుంది. కానీ తర్వాత తరానికి అంటే కుమార్తెకు గాని కుమారునికి గాని అయితే చూపాలి కదా! ఈ జ్ఞానాన్ని మీకు వదిలి వెళ్తున్నాం. దీన్ని వ్యాపారంగా ఎప్పుడూ చేయవద్దు.
మానవత్వం నుండి దివ్యత్వం దిశగా
అందరికీ
శుభోదయం! మీలో చాలామంది రానున్న కొద్ది రోజుల్లో తిరిగి వెళ్ళిపోతారు… కొంతమంది ఈరోజు.. మరి కొంతమంది రేపు. వెళ్లే ముందు మౌనంగా కూర్చుని, మన గురు పరంపర మీకు బహుమతిగా ఇచ్చిన దాన్ని గమనించండి. మళ్లీ తరువాతి భండారాకి వచ్చేలోగా దీన్ని మరింత బాగా మెరుగుపరుచుకుంటానని, మీకై మీరు వాగ్దానం చేసుకోండి. తరువాతి భండారాకి మరింత ఉన్నత స్థితితో, మెరుగైన పరిస్థితిలో రాగలగాలి. ధ్యాన అనుభూతి, దాని కొనసాగింపు సమాధిలో లీనమవుతుంది. సమాధి స్థితి, భూమాలో నిలబడుతుంది…. మనం ఇంకా ముందుకి వెళ్ళాలి.. మనం ఆగిపోకూడదు. కొంతమంది ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. మరి కొంతమంది చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. వారి సాధన ఇంకా పూర్తి కాలేదు. ఈ మధ్యనే ఇక్కడ ఒక యూరోపియన్ సెమినార్ జరిగింది. ఆ సెమినార్ లోని అంశం మానవుని నుంచి మానవత్వం ద్వారా, దివ్యత్వం దిశగా బాబూజీ చెప్పినట్లుగా…. “జంతు మానవుని నుంచి, మానవుని స్థాయికి, తర్వాత అక్కడి నుంచి దివ్యత్వం వైపు…” మన సాధనలోనే దీనికి సంబంధించిన పునాది ఇప్పటికే పొందుపరచబడింది. మనం ఆలోచించగలిగినప్పుడు పక్షిలాగో జంతువులాగో ఆలోచిస్తే అలాగే మీరు అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు… ఉదాహరణకి మీరు దివ్యత్వాన్ని అనుభూతి చెందినప్పుడు, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అది మానవత్వం… అంటే మానవుడు మానవత్వంతో ఉన్నట్లు. ఆ దివ్యత్వాన్ని నింపుకున్నప్పుడు, అలా తయారైనప్పుడు – దివ్యత్వాన్ని అనుభూతి చెందడం వేరు, దివ్యత్వం గా తయారవడం వేరు – అది దైవదూత స్థితి! ఈ మానవ వికాసపు నిచ్చెనలో నేను ఏ స్థాయిలో ఉన్నాను? అని ఎవరికి వారు సమీక్షించుకోవాలి. నేను దివ్యత్వంతో ఉన్నానా? మానవత్వంతో ఉన్నానా? లేదా ఒక సాధారణ మానవుని గానే మిగిలానా? పరవాలేదు! అయితే కనీసం నా పరిమితులను నేను తెలుసుకోవాలి. అప్పుడే మనలో ఏదో కొంత తెరవబడుతుంది. మన లోపాలను, బలహీనతలను పునసమీక్షించుకోవడంలో నష్టం గానీ హాని గానీ ఏమీ లేదు. వాటిని సరిగ్గా గుర్తించండి. అప్పుడే మనపై మనం పని చేసుకోగలం. మనం నిజాయితీగా, మనలోకి చూసినప్పుడే ఈ మార్పు/పరివర్తన జరుగుతుంది. మళ్లీ మనం బాబూజీ మాటల్లో చెప్పాలంటే, “సమస్యను గుర్తించినప్పుడే 50 శాతం పని పూర్తయినట్లు. మిగిలిన 50 శాతం దానికి పరిష్కారం వెతకడమే!” ప్రియమైన సోదరీ సోదరులారా! మనం ఇక్కడ హృదయపూర్వకంగా పాల్గొన్నందువల్ల, గురుపరంపర చాలా చాలా సంతోషంగా ఉన్నారు. క్రమశిక్షణ, విధేయత ఇలాంటి విషయాల్లో మనం మరింత ఉన్నత స్థాయిలకు ఎదగడం జరిగింది. మీలో చాలామంది ఇవాళ ఉంటున్నందువల్ల మనం ఈరోజు సాయంత్రం కూడా కలుస్తాం. ముందుగా వెళుతున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అవును! మనం ప్రారంభించదలచుకున్న దాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన విధానాన్ని, యోగిక పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కొన్ని విషయాలు అవసరం. ఒకటి సాధన. ఇందులో మనకి మూడు, నాలుగు విషయాలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. అప్పుడు మనకు అందులో కొంత పరిజ్ఞానం, అనుభవం వస్తాయి. నేను అనుభవిస్తున్న ప్రస్తుత కండిషన్ ఏమిటి? నాలో ఈ అసహనానికి కారణం ఏమిటి? మన గురువర్యుల పుస్తకాలు చదవండి. అందులోంచి ఏం అర్థం చేసుకోగలమో గమనించండి. వీలైనంతగా వాలంటరీ వర్క్ చేయండి. స్పష్టతతో గురుపరంపరను అనుసరించండి. దీనంతటికీ అనుగుణంగా ఆ దివ్య గురువర్యులకు తగ్గ శిష్యులుగా తయారుకండి. వారి భావాలకు అనుగుణంగా నేను నా జీవితాన్ని గడుపుతున్నానా? ఇది వారితో సరిపోలుతున్నదా? బాహ్యంగా కానీ అంతరంగంలో కానీ వారికి అనుగుణంగా జీవిస్తున్నానా? కాబట్టి ఈ ఐదు విషయాలు మనం గుర్తుంచుకోవాలి.
యోగ మహోత్సవ్
ముఖ్యంగా మనదేశంలోనూ, అలాగే కొన్ని ఇతర దేశాలలోనూ మన సహజమార్గ పద్ధతికి ముఖ్యమైన దాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. ‘యోగ మహోత్సవ్‘ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ముఖ్యమైన నగరాలలో ఒకేసారి గాని లేదా విడివిడిగా గాని, మీ అందరి సౌకర్యాన్ని, అవకాశాన్ని బట్టి – ఉదాహరణకు ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో – ప్రతిరోజు ఉదయం సాయంత్రం – హైదరాబాదులో జరుగుతుంది. మనతో కలిసి పాల్గొనేందుకు ఉత్సాహం చూపే పతంజలి యోగపీఠ్, గాయత్రీ పరివార్, టుక్డోజీ మహారాజ్ వంటి ఇతర సంస్థలతో కలిసి… ఈ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. అక్కడ ఇంచుమించు 40 నుంచి 50 వేలమంది నగరవాసులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మేము వారికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు నేర్పించడం జరుగుతుంది. ఉదాహరణకు కొన్ని వ్యాధుల నివారణకు కొన్ని ఆసనాలు బాగా పనిచేస్తాయి. హై బీపీకి సంబంధించిన ఆసనాలను ఒకరోజు ఉదయం నేర్పుతాం. అలాగే ఒక సాయంత్రం డయాబెటిస్ కి మాత్రమే ప్రత్యేకమైన ఆసనాలు నేర్పిస్తాం. మరొక రోజు కేవలం థైరాయిడ్ సమస్యకు, ఊబకాయం సమస్యకు, మరొక పూట బరువు పెరగడానికి, మానసిక ఏకాగ్రతకు ఇలా ఆరు కార్యక్రమాలు. అలాగే ప్రాణాయామం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి సెషన్ చివరిలో సహజమార్గ ధ్యాన పద్ధతి నేర్పడం జరుగుతుంది.
మాస్టర్ క్లాసెస్ కూడా ఉంటాయి. అయితే “దాజీ! మీరు తప్పక రావాల్సిందే! మా దగ్గర లక్ష మంది ప్రజలు ఉన్నారు.” అని మీరు ఒత్తిడి చేయకూడదు. మీ నగరాలలో పాల్గొనే వ్యక్తుల బాధ్యత మీదే! నేను అన్నిచోట్లకు రాలేను. అన్నిచోట్ల ఉండలేను కదా! హృదయం ఉవ్విళ్లూరుతున్నా, శరీరం సహకరించడం లేదు. ఇవన్నీ పరిమితులు. కానీ గురు పరంపర ఎంతో శక్తివంతంగా శక్తి సామర్థ్యాలను ప్రసరిస్తున్న ఈ తరుణంలో, మీరు తప్పక మీ అంతట మీరే సాధించగలరు. ఉదాహరణకు జైపూర్, లక్నో, బరోడా, చెన్నై ఇలాంటి నగరాలు.. లేదా చిన్న పట్టణాలైన ఖమ్మం, కరీంనగర్ లేదా ఇంకా చిన్న ప్రదేశాలైన మీ సొంత గ్రామాలలో కూడా. మీకేమీ 40, 50 వేల మంది అక్కర్లేదు! మీ గ్రామంలో ఒక పదిమంది కూడినా సరిపోతుంది. అలాగే మీరు యోగా, ప్రాణాయామా మాస్టర్ కూడా కానక్కర్లేదు. అయితే మీకు మేం ఒక వ్యాధి నివారణలో ఉపయోగపడే ఆసనాలకు సంబంధించిన వీడియోలను పంపడం జరుగుతుంది. అలాగే ముద్రలను కూడా ఉపయోగించడం ఉంటుంది. మీ గ్రామంలో 10, 15 మంది సభ్యులు పాల్గొన్నప్పుడు వారికి పొలారిటీ ప్రక్రియను కూడా నేర్పించవచ్చు. ఇలా మీరు మీకున్న సృజనాత్మకతతో మన పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకురండి. ఇక్కడి మొత్తం జనాభాకి మనమిక్కడ వారి సేవకై ఉన్నామని తెలియబడాలి. ఈ 40 లేదా 50 వేలమంది ఎవరైతే నగరాలలో, స్టేడియాలలో కార్యక్రమాలలో పాల్గొంటారో, ఏదో ఒక రోజు క్రమం తప్పక సాధన చేయడం ప్రారంభిస్తారు. వాళ్లు క్రమం తప్పక సాధన చెయ్యకపోతే, మీరు నిరుత్సాహ పడవద్దు. ముందు వాళ్లు పద్ధతికి పరిచయం అవుతారు.
తర్వాత నెమ్మదిగా వాళ్ళు దీన్ని అందిపుచ్చుకుంటారు. అనంతరం ఇది ఒక ఇంటింటి ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కాబట్టి ప్రిసెప్టర్లు, సెంటర్ ఇన్ ఛార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్స్ మాత్రమే కాకుండా అభ్యాసీలుగా ఇది మన అందరి బాధ్యత. మన గురు పరంపర సందేశాలు మనందరికీ అందుబాటులోనే ఉన్నాయి. సందేశమే కాకుండా మనం వారికి ఇక్కడ ఏం ప్రసారం చేస్తున్నామనేదే ముఖ్యం. ప్రసరించిన దానివల్లే వాళ్ళు శాశ్వతంగా పరివర్తన చెందగలుగుతారు. కనీసం మార్పు కలగాలన్న కోరికైనా మనలో కలగాలి. మారాలి అనే చిన్న సరళమైన కోరిక హృదయంలో జనిస్తే అదే ఎంతో గొప్ప విషయం. ‘నేను మారాలి, మరింత ఉన్నతంగా ఎదగాలి‘ అనే కోరిక కలగాలి. కోరిక కలగడమే ఎంతో ముఖ్యం. దాన్ని సాధించడం కనీసం జరగాలి. అప్పుడు మనం మన దివ్య గురువర్యులను, వారిని మరింత ఉన్నతంగా సేవించడానికి మన అందరినీ దీవించమని ప్రార్థించి, మిగిలినది వారికే వదిలివేస్తాం! అందరికీ ధన్యవాదాలు.
నిజమైన శిష్యుడు
ఇది క్లిష్టమైన ప్రశ్న. నిజానికి మీ హృదయం సత్యాన్వేషణ ప్రారంభించినప్పుడు, ఏం జరుగుతుందో మీతో పంచుకుంటాను. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? ఇక్కడి నుంచి నేను ఎక్కడికి ప్రయాణిస్తాను? ఇటువంటి కాస్త జిజ్ఞాస, కొద్ది ఉత్సుకత… మీరు ఈ విషయాలపై నిజాయితీతో ఉన్నప్పుడు, కొంత స్థాయిలో తపన… అన్నింటికీ మూలమైన ఆ తల్లి కోసం హృదయ వేదన మొదలవుతాయి. అప్పుడు ప్రకృతి సహజంగానే నీవు గురువుని కనుగొనే పరిస్థితులను సృష్టిస్తుంది. అప్పుడు సాధకుడు శిష్యుడు అవుతాడు. శిష్య అనేది సంస్కృత పదం. క్రమశిక్షణను అనుసరించే వాడే శిష్యుడు. శీష్ అంటే క్రమశిక్షణ. సాధకుడు ఇప్పుడు గురువు చెప్పే అన్నింటిని, వారి ద్వారా వచ్చే అన్ని ఆదేశాలను, శ్రద్ధగా అనుసరిస్తాడు. అప్పుడు అతను లేదా ఆమె శిష్య అనబడతారు. ధ్యానం గానీ, సాధనకు సంబంధించిన ఇతర అంశాలు గానీ బోధించబడిన వాటిని పాటిస్తున్నప్పుడు, క్రమంగా గురువు మనకు ఎన్నో, ఎన్నెన్నో విషయాలను పంచుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఆయన ద్వారా కలగడం సంభవించి…. మన పరిధి ఆయన సహాయంతో విస్తృతం అవ్వడం ప్రారంభిస్తుంది. అప్పుడు మన అహం చిన్నగా కరిగిపోవడం మొదలౌతుంది. శిరస్సులో అహంకారం ఉంటే ఆధ్యాత్మిక ప్రయాణం జరగదు. మనం రావణుడు అయ్యే ప్రమాదముంది. అతను భగవాన్ శివునికి ఉన్నత స్థాయి శిష్యుడు. శివశంభో! అయినా పతనమైపోయాడు. అతను ఎన్నో నియమాలను శిరసావహించాడు. ఎన్నో ఆదేశాలను, మార్గంలో ఎన్నో కఠిన పరీక్షలను ఎన్నింటినో ఎదుర్కొన్నాడు. అయితే అహం మీ కేంద్రంలో ఉండి, భగవంతుని మీ పరిధి లేదా అంచులలో ఉంచినప్పుడు, మీరు ప్రమాదంలో ఉన్నట్లు. భగవంతుని లేదా మీ గురువర్యుని కేంద్రంలో ఉంచి, మీరు నెమ్మదిగా పరిధి లేదా అంచు నుండి సైతం తప్పుకోగలగాలి. కాలక్రమేణా మనలో ఆయనే నేను అనే భావన పొడచూపుతుంది. క్రమంగా నేననే భావన నెమ్మదిగా కరిగిపోయే కొలదీ, భక్తి మొదలవుతుంది. అహం కరిగిపోయినప్పుడే నిజమైన భక్తి అంకురిస్తుంది. మీరు ప్రపన్న అనే స్థితిని పొందుతారు. శరణాగతి… ఈ స్థితిలో మీరు కేవలం పేరుకే జీవించి ఉన్నట్లు. మీ అస్తిత్వం ఉన్నప్పటికీ మీ జీవితం మొత్తం భగవంతునికి సమర్పణ గావిస్తారు. ఇప్పుడు మీరు భగవంతునికి ప్రియులవుతారు. నిజమైన భక్తునిగా తయారవుతారు. ఇక ఆపై మిమ్మల్ని చూడవలసిన బాధ్యత అంతా వారిదే…ఆ గురువర్యులదే. ఈ ప్రయాణం ఇంతవరకే ఉంటుంది.
సంగీత కళాకారులకు ధ్యాన ప్రయోజనం
శ్రీకృష్ణుడు భగవద్గీతలో ‘యోగహా కర్మసు కౌశలం’ అంటారు. యోగ ద్వారా మీరు చేసే కార్యకలాపాలు అన్నిటిలో మీరు నిష్ణాతులు అవుతారు. మీరు యోగం లో ఉన్నప్పుడు అంటే మీరు మీ స్వీయ ఉన్నతాత్మతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు… ధ్యానం ద్వారా మీ అంతరంగంలో కేంద్రీకృతం చెందినప్పుడు… మీ జ్ఞానం ఆకాశంలో దూసుకుపోతుంది. మీ సృజనాత్మకత కూడా ఆకాశాన్ని అంటుతుంది. మన శరీర వ్యవస్థలో అనేక యోగ చక్రాలు ఉన్నాయి. ప్రత్యేకించి సంగీత కళాకారుల ప్రస్థానం హృదయచక్రం నుండి కొనసాగుతుంది. పంచభూతాలపై పట్టు సాధిస్తారు. గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం వీటి అన్నిటి మీద పట్టు ఏర్పడుతుంది. పంచభూతాలలో ప్రతి ఒక్కటీ తనదైన స్వభావాన్ని, లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు వినే ఉంటారు. దీపక్ చక్ర ఎడమ చనుమొన నుండి రెండు అంగుళాలు పైకి ఉంటుంది. ఆ చక్రం నుండి మీరు పాడినప్పుడు అద్భుతాలు సృష్టించ గలుగుతారు. దీపక్ చక్రాన్ని మీరంతట మీరుగా క్రియాశీలకం గావించలేరు. గురువే దానిని క్రియాశీలకం చేయవలసి ఉంటుంది. మీ భక్తి వలన అది తెరవ బడాలి. అప్పుడు మీ గానం విభిన్న స్థాయికి చేరుకుంటుంది. అలాగే మేఘ చక్రం. కుడి చనుమొన నుండి రెండు అంగుళాలు పైకి జలచక్రం క్రిందుగా ఉంటుంది. ఆ చక్రం నుండి కనుక మీరు పాడితే ఏర్పడే తాదాత్మ్యత ఇంచుమించుగా సమాధి స్థితిని తలపిస్తుంది. మీ గానం వర్షాన్ని కురిపిస్తుంది. ఈ పంచభూతాలను దాటితే గాయకుడు పరబ్రహ్మాండ మండలాన్ని అందుకొంటాడు. మీరు మీకు తెలియకుండానే ఈ రోజు మీ గానంతో ఆ పరబ్రహ్మాండ మండలాన్ని స్పృశించారు. మీరు చైతన్యంలో ఉండి, మీ సంకల్పంతో దానిని స్పర్శించడం చూడాలని అనుకుంటున్నాను. మీకప్పుడు వ్యత్యాసం తెలుస్తుంది. ‘ఈ ప్రకంపనలను, ప్రాణాహుతిని సంగీతం ద్వారా, నా స్వరం ద్వారా అందించినప్పుడు ప్రజలు ముక్త స్థితిని అనుభవించాలి’ అనే సంకల్పం చేయాలి. అది క్షణమైనా, అరక్షణమైనా కానీ. అప్పుడు వారు మనం ఈరోజు ఉన్నట్లుగా, మరో ప్రపంచంలో ఉంటారు. కానీ మీరది ఎరుకతో చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు మీరు సంగీతాన్ని ఆలపించకపోయినా బ్రహ్మాండ మండలం నుండి ప్రాణాహుతిని ప్రసరింపచేసే సమయం వస్తుంది. అది సడి లేని సంగీతమవుతుంది. నిజమైన ఓంకారం వస్తుంది. మీ ఆంతరంగిక ప్రకాశం ఈ భౌతిక చట్రానికి పరిమితం కాకూడదు. ఆ అంతరంగిక ప్రకాశం విశ్వమంతటికీ అందించబడాలి. మీరు భగవంతుని ప్రేమలో ఉన్నప్పుడు, ప్రతిదీ లోపలి నుండి వికసిస్తుంది. చక్రాలన్నీ పూర్తి సమతుల్యతలో ఉంటాయి. అవి సంపూర్ణ సమతాస్థితిలో ఉన్నప్పుడు, దాని ఫలితంగా అదే స్థితిని మీరు బయటకు వ్యక్తపరుస్తారు. మనం శాంతి, శాంతి, శాంతి అంటూ శాంతి గురించి మాట్లాడుకుంటాము. మన మంత్రాలు చాలావరకు ‘ఓం’ తో మొదలై ‘ఓం శాంతి, శాంతి, శాంతి’ తో ముగుస్తాయి. ఈరోజు ప్రతి ఉచ్ఛస్వరం వద్ద ప్రజలు చప్పట్లు కొట్టారు. సభామర్యాదగా మాత్రమే నేను చప్పట్లు కొట్టాను. నాకు చప్పట్లు కొట్టాలని లేదు. ఎందుకో మీకు తెలుసా? నేను మైమరిచిపోయాను. చప్పట్లు కొట్టే అవసరమే లేనంతగా లయమైపోయాను. మీరు భగవంతుని ప్రేమలో, భక్తిలో లయమైనప్పుడు, అలాంటివి సంభవిస్తాయి. ఈ ప్రకంపనల నుండి వచ్చే ఫలితాలు భిన్న స్థాయిలో ఉంటాయి. నేను చూడాలనుకుంటున్నది ఏమిటంటే, ఈ సంగీత కళాకారులు ప్రపంచ శాంతికి ఎరుకతో సహకరించాలి.
దైవ భక్తుని సౌందర్యం
ఒక భక్తుని సౌందర్యం మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అటువంటి వ్యక్తుల సాంగత్యాన్ని మీరు ఇష్టపడతారు నా గురుదేవులు ఏమనేవారంటే “మీరు మంట పక్కన కూర్చుంటే వెచ్చదనం అనుభవిస్తారు. మరి ఒక సాధువు పక్కన కూర్చుంటే, మీరు ప్రశాంతతను ఎందుకు అనుభూతి చెందరు?” అని. వారు తరచుగా “మీరు మీ పని చేయండి, నేను నా పని చేస్తాను” అని చెప్పేవారు. దాని అర్థం మీరు సాధన చేయండి. మీ ఆధ్యాత్మిక పురోగతి యొక్క బాధ్యత నాపై ఉంచండి. కానీ మీరు సాధన చేయాలి కదా! సాధన చేయకుండా ఏ రంగంలోనూ పురోగతి చెందలేరు. మీరు అక్షరాలు, అంకెలు నేర్చుకోవాలన్నా చాలాసార్లు సాధన చేయాలి. నెమ్మది నెమ్మదిగా భాష నేర్చుకోవడానికి సాధన అవసరం. వంట నేర్చుకోవడానికి సాధన అవసరం. సంగీతానికి సాధన అవసరం. ప్రతి విషయానికీ సాధన అవసరం. మనం అనంతం వైపు ప్రయాణించడానికి, మనం అనంతమైన దివ్యత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం కావాలో ఊహించండి. అనంతమైన సాధన!
అంగీకార హృదయాలే నాకు కావలసింది
ప్రజలు మాకు ధనం ఇవ్వటానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నారు. కానీ నాకు అవసరమైనవి చెట్లు నాటడానికి సహాయపడే బలమైన చేతులు. పొలారిటీ ప్రక్రియను ఉపయోగించి నిద్రలేమితో బాధ పడేవారికి సహాయపడేవారు, ఒక నర్సింగ్ హోమ్ నుంచి ఇంకో నర్సింగ్ హోమ్ కి వెళ్లి… అక్కడి నర్సులకి పొలారిటీ నేర్పించి, తద్వారా మరణ భయం వలన కలిగే నిద్రలేమితో బాధపడే కాన్సర్ వ్యాధిగ్రస్తులకి సహాయపడటం. మీరు మీ ప్రేమను, ఈ దైవిక దివ్యసారాన్ని, ప్రాణాహుతిని వారిపై ప్రసరింప చేస్తే, వారి ముఖాలు వెలిగిపోవడం మీరు గమనించగలరు. మాకు వాలంటీర్ల అవసరం చాలా ఉంది. ఈ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి, వారు ఒకరి నుంచి మరొకరి వద్దకు వెళుతూ… వారి జీవన శైలిలో మార్పును తెచ్చి తద్వారా వారి జీవితాల్లో ఆనందాన్ని తేవడం. పట్టణాలలో, పల్లెటూర్లలో ఉన్న మా వివిధ సెంటర్లలో వేల సంఖ్యలో ఉన్న మా సహచరులతో నేనంటాను… దైవాన్వేషణ ఒక్కటే సరిపోదు, సేవ కూడా చాలా ముఖ్యమని. ఈ రోజుల్లో వృద్ధులు మాత్రమే ఉండే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికా లాగా మన దేశంలో వృద్దులకు సేవ చేసే ఉద్యోగులు లేరు కదా! ఇటువంటి వృద్ధులు చాలా కష్టాలు పడుతున్నారు. వాలంటీర్లు వారి వద్దకు వెళ్ళి, వారికి పాలు, కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చి పెట్టమంటారా అని అడగటం… మిమల్ని దేవాలయానికి కానీ పార్క్ కు కానీ తీసుకు వెళ్ళమంటారా అని అడగటం… ఇటువంటి విషయాలు చాలా సహాయపడతాయి. భారతదేశంలో నా చిన్నతనంలో మా తండ్రిగారు నాకు ఒక శ్లోకం నేర్పించారు. ఈ శ్లోకాన్ని రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే చదవమని చెప్పారు. నేను ఆయన ముందు ఈ శ్లోకాన్ని పఠించేవాడిని. ఈ శ్లోకం నాకు కంఠస్థం అయ్యింది. ఆ శ్లోకాన్ని మీకు చెబుతాను, “కరాగ్రే వసతే లక్ష్మీ, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవిందే, ప్రభాతే కరదర్శనం” అరచేతులను ముఖానికి దగ్గరగా ఉంచి చూస్తూ ఈ శ్లోకం చదివేవాడిని. ఈ విధంగా కొన్ని నెలలు గడిచాయి. ఈ శ్లోకం అర్థం తెలియకుండా, అర్థం లేకుండా రోజూ చదివే వాడిని. ఈ శ్లోకం అర్థం – చేతివేళ్ళ కొసలలో ఐశ్వర్యం నిక్షిప్తమై ఉంది అని అంటే సిరిసంపదల దేవత అయిన లక్ష్మీదేవి. కరమధ్యేతు గోవింద అంటే ఆ పరమాత్ముడు మీ అరచేతి మధ్యలో కొలువై ఉన్నాడని. కర మూలే సరస్వతి అంటే అరచేతి మూల భాగంలో జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవి కొలువై ఉందని… ఇప్పుడు ధ్యానం తరువాత నేనీ శ్లోక పరమార్థాన్ని గ్రహించ గలిగాను. మీ చేతులు, మీరు చేసే పనులు చాలా ముఖ్యమైనవి. ఈ చేతుల ద్వారా మీరు కష్టపడకుండా సంపదను కానీ, జ్ఞానాన్ని కానీ, దైవాన్ని కానీ పొందలేరు. అటువంటప్పుడు పని ఎలా జరుగుతుంది? మనకు కష్టపడేవాళ్ళు అవసరం. మనం ఇదంతా ధనం లేకుండా కూడా సాధించవచ్చు, కొంత ధనం అయితే అవసరం. ముఖ్యంగా మనకు అవసరమైనవి మనో సంకల్పం కలిగిన హృదయాలు.
ప్రకంపనాపూర్వక వైద్య పద్ధతులు
వైద్యరంగంలో ఎంతో పురోగతి సాధించటం జరిగింది. మనకు తెలియని కొన్ని అవయవాలను గురించి, వాటి పాత్రను గురించి మనకు సరియైన అవగాహన లేదు. అవి గుర్తింపబడినప్పటికీ, వాటి పాత్ర ఏమిటన్నది మనకు స్పష్టమైన అవగాహన లేదు. నేను సంప్రదాయ వైద్య పద్ధతిలో ఒక ప్రత్యేకమైన నేపథ్యం కలిగి ఉన్నా కానీ దానిపై ఎక్కువగా దృష్టి పెట్టను. నేను ఎల్ ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మసీ డిగ్రీ 1978లో పూర్తి చేసి, 1980లో ఫార్మస్యూటిక్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను. ఫార్మాకాలజీ మరియు ఫార్మకాగ్నెన్సీ లలో కూడా నాకు మంచి నేపథ్యం ఉంది. ప్రస్తుత వైద్యరంగం గత ఐదు సంవత్సరాల క్రితం కంటే కూడా ఎంతో అభివృద్ధి పథంలో సాగుతూ ఉంది. మీ అందరికీ అల్లోపతి వైద్యం గురించి బాగా తెలుసు. కొంతమందికి ఆయుర్వేదం గురించి కూడా తెలిసి ఉండవచ్చు. నేను ప్రత్యేకించి ఏ వైద్య విధానాన్ని ఎంపిక చేసుకోను. నాకు ఏది పనిచేస్తుందో దాన్నే నేను అనుసరిస్తాను. మనం వైద్యాన్ని గురించి అన్ని కోణాలలో, అన్ని విధాలా తెలుసుకొని ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను ప్రకంపనా క్షేత్రానికి సంబంధించిన వైద్యరంగం వైపు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటున్నాను. ఏ విధంగా కొన్ని వస్తువులు మనుషుల ప్రకంపనలను కలిగి ఉంటాయో… అదేవిధంగా కొంతమంది మనుషులు వారి చేతులతో ఒక స్థాయి ప్రకంపనలను సృష్టించగలుగుతారు. వారి చేతులు మీ శరీరం చుట్టూ కదులుతున్నప్పుడు, మీ ప్రకంపన నమూనా మారుతుంది. మీ మ్యాగ్నెటిక్ (అయస్కాంత) క్షేత్రం, మీ ఆరా (కాంతి) క్షేత్రం మార్పు చెందుతాయి. ఈ విధమైన ఆరోగ్య క్షేత్రం ఏదో విధంగా మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
అనారోగ్య కారణాల ఫలితంగా అనారోగ్య క్షేత్రం ఏర్పడుతుంది. మనం ఇప్పటికే సృష్టించుకున్న ఈ క్షేత్రాన్ని ఏవిధంగా సరిదిద్దగలం? మన కాన్హా శాంతివనం ఆశ్రమంలో ఈ ప్రకంపనలను సరిదిద్దడానికి ఎన్నో విధాలైన పద్ధతులను అనుసరిస్తున్నాం. అందులో ఒకటి పొలారిటీ కానీ అది రెండవది. అన్నిటికంటే ప్రాథమికమైనది, ఆధ్యాత్మికతకు సంబంధించినది అయినప్పటికీ… ఉదయం ధ్యానం, సాయంత్రం నిర్మలీకరణ, రాత్రి ప్రార్థన కూడా… మన ప్రకంపనలను భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థాయిలలో ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఇదే ప్రాథమికమైన విషయం. రెండవది పొలారిటీ. మూడవది మేము ప్రయోగం చేస్తున్న క్వాంటం హీలింగ్. ఇంకా క్వాంటం బయోఫిట్ బ్యాక్ హీలింగ్. ఇంకా ఇప్పుడు ప్రయోగం చేస్తున్నది, నేర్చుకుంటున్నది అలాగే చాలా మంచి ఫలితాలను ఇస్తున్నది మ్యాట్రిక్స్ థెరపీ. అఫ్ కోర్స్! సంప్రదాయ విధానాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, యునాని ఇలా ఎన్నో చెప్పవచ్చు. యోగా, మన ఆహార పద్ధతులు కలిస్తే వ్యాక్సిన్లుగా తయారవుతాయి. అవి మనను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒక్కసారి మన లోనికి వ్యాధి ప్రవేశిస్తే, ముఖ్యంగా మానసికమైనదాన్ని సరి చేయటం చాలా కష్టం.
నిద్రా సమస్యలు మరియు రోగనిరోధకత
నా మనసుకు స్ఫురించే ప్రాథమిక విషయం ఏమిటంటే వ్యాక్సినేషన్ లాగే, సమయానికి ముందే మనంతట మనమే టీకా తీసుకోవాలి. నేను ఇంజక్షన్స్ వంటి వాటి గురించి మాట్లాడటం లేదు. మనం రోగనిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోగలం అనేదాని గురించే మాట్లాడుతున్నాను. మనం వ్యాయామం ఎలా చేయాలి వంటి విషయాలతో మొదలుపెట్టి ఆసనాలు, ప్రాణాయామం ఎలా ఆచరించాలి? మన ఆహారాన్ని, జీవన శైలిని, మన నిద్రాచక్రాల్ని ఎలా క్రమబద్ధం చేసుకోవాలి… ఇవన్నీ! ఈ రోజులలో చాలా వ్యాధులు మానసికపరంగా ఉంటున్నాయి. నేను మానసిక వ్యాధి లక్షణాలన్నీ ప్రాథమికంగా నిద్రారుగ్మతల వల్లే కలుగుతున్నాయని భావిస్తాను. సాధారణ ఆరోగ్యవంతులు ఎప్పుడైనా నిద్రించగలిగినప్పటికీ, వారు సమయానికి నిద్రించడాన్ని ఎంచుకోరు. వారు వారి ఫోన్లను వీక్షిస్తూ, అందులో ఆటలు ఆడుతూ, కంప్యూటర్లోనూ ఆటలు ఆడుతూ ఉంటారు. ఇలా వినోదానికి చాలా పద్ధతులున్నాయి. ఏదో కోల్పోయామనే రుగ్మత లేదా ఏదో కోల్పోతామనే భయం మనలను స్వాధీన పరచుకుంటుంది. మెదడు నుండి విషపదార్థాలను తొలగించే ఒక క్రొత్త విధానం కనుగొనబడింది. దాన్ని గ్లింఫాటిక్ సిస్టం అంటారు. గ్లింఫాటిక్ సిస్టం మెదడు నుండి విషపదార్థాలను తొలగిస్తుంది. మన శరీరం మొత్తంలో తల భాగం మినహా లింఫాటిక్ వ్యవస్థ ఉంటుంది. మెదడులో మాత్రం లేదు. మెదడు శరీరంలో చాలా విలువైన అవయవం. కనుక ప్రకృతి మెదడులో మరీ ఎక్కువ నాళికలు (పైప్ లు) ఏర్పాటు చేయకూడదని భావించి ఉండవచ్చు. కాబట్టి ప్రకృతి గ్లింఫాటిక్ వ్యవస్థ అని ఒక విశిష్ట వ్యవస్థను ఏర్పరచింది. దానిలోని గ్లియల్ కణాలు మానసిక చర్యలలో ఏర్పడే వ్యర్థాలను తొలగించడంలో దోహదం చేస్తాయి. మీరు ఏ పనీ చేయకుండా స్తబ్దుగా ఉన్నప్పుడు కూడా మనసు తన పని తాను చేస్తూ మెదడును సకారాత్మకంగా గాని లేదా నకారాత్మకంగా గాని ప్రభావితం చేస్తుంది. అది నిరంతరం జీవక్రియలో నిమగ్నమై ఉంటుంది. అలాంటి పరిస్థితులలో వ్యర్ధాలు తయారవుతాయి. మరి వాటిని తొలగించే ప్రక్రియ లేనప్పుడు మెదడుకు ఏమవుతుంది? అది మందకొడిగా చిరాకుగా ఉండి త్వరలో నశిస్తుంది. ప్రకృతి మనలో ఒక వ్యవస్థను ఏర్పరిచింది. మనం నిద్రించినప్పుడు గాఢ నిద్రాస్థితిలో, శాస్త్రీయంగా దాన్ని డెల్టా తరంగ గాఢ నిద్రాస్థితి అంటారు, ఆసమయంలో కణాల మధ్య గల అంతరం పెద్దదై ఇంట్రా సెరిబ్రల్ ద్రవం ప్రవహించి చివరికి సెరిబ్రో స్పైనల్ ద్రవంలో కలుస్తుంది. దీనివలన వ్యర్ధాలన్నీ నిర్మూలింపబడతాయి. మీరు సరిగా నిద్రించనప్పుడు, మీరు నిద్రించకూడదని ఎంచుకున్నప్పుడు లేదా మీరు సరిగా నిద్రించ లేకపోయినప్పుడు… ఈ రెండు పరిస్థితులలో ఈ గ్లింఫాటిక్ వ్యవస్థ యొక్క ప్రవాహం దెబ్బతింటుంది. మెదడు యొక్క కణాలలో వ్యర్థాలన్నీ పేరుకు పోతాయి. మీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది, చికాకుగా ఉంటారు. నిద్రలేమి తరచుగా ఉన్నప్పుడు చికాకు కలుగుతుంది. దృష్టి కేంద్రీకరించలేకపోవడం జరుగుతుంది. మీరు సరిగా నిద్రించనప్పుడు మీరు తరగతులకు సరిగా హాజరు కాలేరు.మీ శ్రద్ధ తగ్గుతుంది. శ్రద్ధ లేకుండా మీరు తరగతులలో ఏం నేర్చుకుంటారు? అంతేకాకుండా మనం రోజంతా నేర్చుకున్న విషయం, నిద్రలో మన వ్యవస్థలో అనుసంధానం అవుతుంది. ఈ విజ్ఞానాన్ని సమ్మిళితం చేసుకోవడం అవసరం. మీరొక పుస్తకాన్ని చదువుతారు. దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా చదివినప్పుడు… మీరు రెండు నిమిషాల క్రితం చదివిన పుస్తకంలోని వాక్యాలను గుర్తు తెచ్చుకోలేనప్పుడు, మీరు దాన్నెలా సమ్మిళితం చేసుకోగలుగుతారు? సమ్మిళితం చేసుకోలేనప్పుడు మానసికంగా సుసంపన్నంగా ఎలా అవుతారు? జీర్ణంకాని, సమ్మిళితం చెందని ఆహారం మనలో జీర్ణవ్యవస్థ రుగ్మతలకు దారితీస్తుంది. జీర్ణం కాని జ్ఞానం కూడా మనకు భారమవుతుందని నేను ఆశ్చర్య పోతుంటాను!
ఇది పరిశోధన చేయాల్సిన విషయం.
మానవుడు, మానవత్వం & దివ్యత్వం
మానవుడు మరియు మానవత్వం మధ్య ప్రాథమిక వ్యత్యాసం మానవులు మరియు జంతువుల మధ్య ఉంది. మనిషి కూడా ప్రాథమికంగా ఒక జంతువే. దీన్ని మీరు యోగిక దృష్టిలో గనుక చూస్తే, చక్రాలను అర్థం చేసుకుంటే, మనలో మూడు నిమ్న చక్రాలు ఉన్నాయి. అవి మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక చక్రాలు. మన శరీరపు క్రిందిభాగంలో పొత్తికడుపు ప్రాంతంలో ఉంటాయి. సామాన్యంగా ఇవి జంతువుల్లో కూడా ఉండేవే. మనలోనూ ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. హృదయ చక్రం, కంఠచక్రం మరియు ఆజ్ఞా చక్రాన్ని దాటి ఉండే ఇతర చక్రాలు మానవుల్లో మాత్రమే ఉంటాయి. హృదయ చక్రం కొన్ని జంతువుల్లో ఉన్నప్పటికీ మానవుల్లో పూర్తిగా వికసించినట్లుగా వాటిలో ఉండదు. మనలో అవి పూర్తిగా వికసించి ఉన్నప్పటికీ, మన ఎంపికలో స్వేచ్ఛ వల్ల మనం వాటిని ఉపయోగించుకోలేం. భగవంతుడు మనకు ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ మనం తరచుగా తప్పు వాటినే ఎంచుకుంటాం. మరింతగా పొందాలనుకుంటాం. మానవులు మానవత్వం గల వారిగా మారగలిగితే, అప్పుడక్కడ పెద్ద మార్పు సంభవిస్తుంది. మానవులు అసహనంగా ఉంటే, మానవత్వం గలవారు సంతృప్తిగా ఉంటారు. మానవులు భయపడే స్థితిలో ఉంటే మానవత్వం వారిని ధైర్యవంతులుగా చేస్తుంది. అది అలా ఉంటుంది. మనం ఒకసారి చైతన్యంలో పరివర్తన లేదా పరిణామ దశలో ముందుకు సాగితే, దివ్యత్వ స్థాయి అనవచ్చు, దైవత్వ స్థితి అనవచ్చు. కొందరు దేవదూతల్లా కనిపిస్తారు. మనం “ఓ! అతడు దేవదూతలా ఉన్నాడు”, అంటాం. కొంతమందిని చూస్తే మృగంలా ఉన్నాడని అంటాం. ఇప్పుడు మానవత్వంతో కూడిన మనిషికి, ఆ దేవదూతకు మధ్య గల భేదం ఏమిటి? మానవత్వం ఉన్నట్లయితే నీకున్న దాన్ని అవతలి వారికి పంచడంలో ఆనందం పొందుతావు. స్వార్థ మానవుడు జంతువుల వలె లాక్కుంటూ ఉంటాడు. పంచుకోవాలని అనుకోడు. దేవదూతలు తమకు లేనప్పటికీ దాన్ని వారు సృష్టించి మనకు ఇస్తుంటారు. ఇలా మానవుని నుండి మానవత్వానికి తదుపరి దైవత్వానికి మార్పు చెందడం అనేది చైతన్యం యొక్క బదిలీ మాత్రమే. మన చైతన్య వికాసమే మన జీవిత లక్ష్యం. మనకు మూడు శరీరాలు ఉన్నాయి. భౌతిక స్థాయిలో ఈ కనపడే శరీరం ఉంది. మనకు మానసిక శరీరం ఉంది. నేను మెదడు గురించి మాట్లాడడం లేదు. చైతన్యం గురించి మాట్లాడుతున్నాను. దాని వెనుక ఆత్మ, దాన్నే జీవశక్తి లేదా లైఫ్ ఫోర్స్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. అది మన లోపల ఉంది. ఈ జీవశక్తి మనలో పుట్టుక నుండి మనం చివరి శ్వాస వదిలే వరకు ఉంటుంది. ఈ జీవశక్తి మన లోపల ఉంది. మత విధానాల్లో దీనికి భిన్నమైన పేర్లు ఉంటాయి. భారత దేశంలో ఆత్మ అంటాం. ఇంగ్లీషులో సోల్ అంటారు. వివిధ సంస్కృతుల వారు వారికి పరిచితమైన పదాలతో పిలుస్తారు. ఈ మూడింటిలో పరిణామం చెందేది ఏది? జీవశక్తి శుద్ధమైనది, దైవికమైనది, అనంతమైనది. అనంతమైనది ఎలా పరిణామం చెందుతుంది? అదే అంతిమమైనది కదా! సంపూర్ణత్వం, పరమ శుద్ధతత్వం ఎలా మార్పు చెందగలదు? మీరు దానికి ఇంకే పవిత్రతను కలపగలరు? శరీరం గ్రద్దలా పైకి ఎగరగలదా, డాల్ఫిన్ లా ఈదగలదా? లక్షల సంవత్సరాల తర్వాత కూడా మీరు అలా చేయలేరు. శరీరం పరిణామం చెందాలంటే ఎన్ని కోట్ల సంవత్సరాల కాలం పడుతుందో భగవంతుడికే తెలియదు. మనకు అంత జీవన ప్రమాణం లేదు. ఈ జీవన ప్రమాణంలో మన వయసు పెరిగి వార్ధక్యంతో మరణిస్తాం. మరి మనం ఏ పరిణామం గురించి మాట్లాడుతున్నాం? చైతన్యం గురించి. చైతన్యం అంటే ఏమిటి? మన ఎరుక యొక్క స్థాయి. దాన్నే డిగ్రీ ఆఫ్ అవేర్ నెస్ అని నిర్వచిస్తారు. దానితో పాటు ఎరుక లేనిస్థాయి అని కూడా అంటారు. అది దేనితో తయారయింది, అని మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. ఇది ఆలోచించడం, వివేకవంతం కావడం వంటి విధులతో తయారైంది. మనసు, బుద్ధి, అహంకారాలతో దాన్ని మనం గుర్తించవచ్చు. ఆలోచన దేనిగా మారుతుందో, వివేకం ఎలా మారుతుందో, అహం దేనిగా మారుతుందో ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరిణామం యొక్క అంతిమ సారం ఏమిటి? ఆలోచన దేనిగా మారుతుంది? బుద్ధి దేనిగా మారుతుంది? అహం దేనిగా మారుతుంది? నా అనుభవం చెప్పేదేమిటంటే, పరిణామం చెందినప్పుడు నీవు ఆలోచించవు. ఆలోచించే సమర్థత మార్పుకు ముందే వదిలివేయబడి అనుభూతి చెందడం ఆరంభిస్తాం. బుద్ధి ఎలా మారుతుంది? ప్రజ్ఞగా, అంతర్బుద్ధిగా మారి, చివరకు విజ్ఞతగా పరిణమిస్తుంది. అది బుద్ధి పరిణామం చెందే క్రమం. బుద్ధి ఎలా మారుతుంది? ప్రజ్ఞగా, అంతర్బుద్ధిగా మారి, చివరకు విజ్ఞతగా పరిణమిస్తుంది. అది బుద్ధి పరిణామం చెందే క్రమం. అహం సంగతి ఏమిటి? మన జీవితమంతా నేను, నేను అనే దాన్ని కేంద్రంగా కలిగి ఉన్నాం. పరిణామం చెందినప్పుడు ‘నేను’ అనే నా గుర్తింపు కేంద్రం ‘మీరు’ గా అవుతుంది. చివరకు అది ప్రేమగా మారుతుంది. నిజమైన ప్రేమలో ‘నేను’ అనునది ‘మీరు’ అనేదానికి తలవంచుతుంది. ‘మీరు’ కేంద్రమైన జీవితం మొదలవుతుంది. అప్పటినుండి మాత్రమే మీలో బంధించబడిన చైతన్యం విస్తరించి విశ్వాన్ని ఆక్రమిస్తుంది. అది పరిణామ పథం. మన చైతన్య వికాసమే మన జీవిత ఉద్దేశం. మనం మాట్లాడుతున్న ఉదయం చేసే ధ్యానం, మన మనసును క్రమపరుచుటకు తోడ్పడుతుంది. ఆలోచించడం నుండి అనుభూతి చెందేలా చేస్తుంది. సాయంకాలం క్లీనింగ్ చేసుకున్నప్పుడు, అది మనలోని మాలిన్యాలను, సంక్లిష్టతను తొలగించి బుద్ధిని వికసింప చేస్తుంది. పరుండబోయే ముందు మనం భగవంతునికి ప్రార్థనను సమర్పించినప్పుడు ‘మానవ జీవితమునకు యదార్ధ లక్ష్యం నీవే’ అంటాం. మన అస్తిత్వపు కేంద్రం మీరుగా, అనంతంగా, ప్రేమగా మారుతుంది. మానవ జీవితమునకు ప్రేమ యదార్ధ లక్ష్యం అవుతుంది. మీరంతా ఈ ప్రేమ సందేశాన్ని విస్తరింప చేస్తారని ఆశిస్తున్నాను. మీ నుండి నేను ఆశించే సహకారం ఇదే. కృతజ్ఞతలు.
క్రమశిక్షణతో ఉండడం ఎలా?
క్రమశిక్షణకు మంత్రదండం ఏమీ లేదు. మనం మాట్లాడుకునే ఈ క్రమశిక్షణ అనేది వ్యక్తిగత విషయం. మనలో ప్రతి ఒక్కరిలో ఉండే సృజనాత్మకత ప్రత్యేకంగా ఉంటుంది. మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. ప్రతి వ్యక్తికి తమదైన జీవితాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. తరచుగా సులభంగా ఉండే దాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది మన సహజ లక్షణం. కొండ క్రిందుగా వెళ్ళటానికి ఎక్కువమంది ఇష్టపడతారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఎవరెస్టు పైకి వెళ్లడానికి ఇష్టపడతారు. ఒక స్థాయి క్రమపద్ధతిని, క్రమశిక్షణను సృష్టించటానికి కొంత సమయం పడుతుంది. దీనికి తగిన కృషి చేయవలసి ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే, ఆఖరికి మీ కూతురు లేక కొడుకు ఉండే గది అయినా, ఒక సంవత్సరం పాటు మీరు ఏమీ కలగచేసుకోకుండా ఉంటే… ఆ గది ఎలా ఉంటుందో చూడండి. ఎన్నో పుట్టినరోజు బొమ్మలు, ఇంకా ఇతర బహుమతులు వచ్చి ఉంటాయి. మీరు ఆ పుస్తకాలను, బొమ్మలను, బట్టలను సర్దటానికి కొంత ఎక్కువ కృషి చేయకపోతే ఆ గది ఎలా ఉంటుంది? అది దుర్వాసన వస్తుంది. పిల్లలు ఆ గది లోనికి వెళ్లడానికి ఇష్టపడరు. ఎవరో ఒకరు దానిని సరిగ్గా సర్ది శుభ్రంగా ఉంచడానికి కృషి చేయవలసి ఉంటుంది. ఇది ఎంట్రోపీ లాంటిది. ఒక ప్రాథమికమైన ప్రశ్న ఏమిటంటే, విశ్వం లోని క్రమశిక్షణ. వాటి కక్ష్యల నుండి అవి ప్రక్కకు తప్పుకోవు.దాని గొప్ప ప్రణాళిక అలా ఉంది. వీటన్నింటినీ సక్రమంగా నిర్వహించడానికి ఎవరు శక్తిని ఇస్తున్నారు? ఇదంతా కేవలం గురుత్వాకర్షణ వల్ల జరుగుతున్నది. అంటే, ఇప్పుడు ఒక ప్రాథమికమైన ప్రశ్న వస్తుంది. ఈ గురుత్వాకర్షణను సృష్టిస్తున్నది ఎవరు? ఇది ఇంకా ఇంకా లోతైన ప్రశ్నకు దారితీస్తుంది. వ్యక్తిగత క్రమశిక్షణ కొంత శక్తిని కోరుతుంది. శక్తి అంటే మీ సంకల్పం, అంటే నేను ఇది తప్పకుండా చేయాలి అనుకోవటం కాదు. మీ హృదయం ఆనందంతో ఏది ఏమైనా నేను సాధించి తీరవలసిందే అని తపించాలి. అప్పుడు ఆ శక్తి అనేది వస్తుంది. జీవితంలో జరిగే ఎన్నో విషయాల పట్ల ప్రజలు విచారంతో ఉంటుంటారు. మన జీవితం మన ఒక్కరి ప్రభావంతోనే కాక, ఎంతోమంది ప్రభావంతో నిర్వహించబడుతుంది. ‘నేను ఒక్కడినే నా జీవితాన్ని నిర్వహించుకుంటాను’ అంటే కుదరదు. మీ పిల్లవాడు మిమ్మల్ని తిట్టినట్లయితే, కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల చేత దెబ్బలు తినటం నేను చూశాను. ఆ తల్లిదండ్రులు, తాత, నానమ్మల పరిస్థితి ఏమిటో ఊహించండి. వారి జీవితాల్లో ఇక క్రమశిక్షణ ఏముంటుంది? కాబట్టి ఎన్నో కారకాలు ఉంటాయి. మనం చేయగలిగింది మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించాలి. దాని పట్ల ఉత్సాహం కలిగి ఉండండి. ఎందువలనంటే భగవంతుడు విచారంగా ఉన్న హృదయాలలోనికి దిగిరాడు. ఎవరైతే సంతోషంతో, ఆహ్వానించే ధోరణిలో ఉంటారో వారి హృదయాలలోకి మాత్రమే భగవంతుడు దిగి వస్తాడు.
మందుల వాడకాన్ని తగ్గించడంలో హార్ట్ ఫుల్ నెస్ వంటి సాధనలు ఎలా తోడ్పడతాయి?
ధన్యవాదాలు. ఈ విషయంలో పెన్సిల్వేనియా లోని యార్క్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలలో మాకు అనేక సానుకూల ఫలితాలు లభించాయి. పని ప్రదేశాలలో ఒత్తిడి మరియు నిద్రకు సంబంధించిన వైఖరులపై యూనివర్సిటీలోని డాక్టర్లు, నర్స్ లు ఇతర సిబ్బందిపై మేము ఒక పరిశోధన నిర్వహించాము. ఒక అయిదు నిముషాల పాటు ధ్యానం, ఒక ఐదు నిముషాల పాటు నిర్మలీకరణ వారి నిద్రా చక్రాలలో ఎంతో మార్పును తీసుకు వచ్చింది. సంతృప్తికర ఫలితాలను పొందిన వీరు ఈ ధ్యాన పద్ధతిని ఇతరులకు కూడా సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ధ్యానం చేయలేని వారికి పొలారిటీ చికిత్స సిఫార్సు చేస్తున్నారు. ఈ పొలారిటీ అనేది రోగి పై మరొక వ్యక్తి చేసే చికిత్సా పద్ధతి. పొలారిటీ ఫలితంగా వ్యక్తి తక్షణమే గాఢనిద్ర లోకి జారుకుంటాడు. కొన్ని సందర్భాలలో అయితే కొందరు రోగులకు ఉపయోగించే మందులు కూడా పూర్తిగా నిలిపి వేయబడ్డాయి. మంచి నిద్ర కోసం, ప్రత్యేకించి కోమాలో ఉన్న రోగుల కోసం నేను ఈ పొలారిటీని సిఫార్సు చేస్తాను. ఒక ఉదాహరణను చెప్తాను. కోమాలో ఉన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి వద్దకు పొలారిటీ తెలిసిన నా సహచరుడు ఒకరిని పంపాను. రోజుకు రెండుసార్లు 15 నిముషాల పాటు ఆ వ్యక్తి పై పొలారిటీ చేయమని సూచించాను. ఇది చేయడం మొదలు పెట్టిన రెండవ రోజు నుండే ఆ వ్యక్తి మెల్లగా కోమా నుండి బయట పడటం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. క్యాన్సర్ రోగులకు కూడా నేను దీన్ని సిఫార్సు చేస్తాను. క్యాన్సర్ రోగులు మరణ భయంతో, తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. ఆ భయంతో వారు సరిగా నిద్ర కూడా పోలేరు. రసాయనాలు నిల్వ చేసిన గదిలో ఒకదాని తర్వాత మరొక రాడికల్ రియాక్షన్ కొనసాగుతూనే ఉన్నట్లుగా వారిలో ఒత్తిళ్ల తుఫాను కొనసాగుతూ ఉంటుంది. శరీర వ్యవస్థ మొత్తం ఒత్తిడితో నిండి పోతుంది. ఆ సమయంలో కొంత విశ్రాంతిగా ఉండవలసిన అవసరం ఉంది మీరు భగవంతుని నమ్మినా, నమ్మకున్నా ఒక వేళ మీరు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటే భగవంతుని విశ్వసించ వలసిన అవసరం లేదు. ధ్యానం కూడా అంతే. మీరు భగవంతుని పై దృష్టి కేంద్రకరించ వలసిన అవసరం లేదు. అయినా ఆ సత్యతత్వం గురించిన ఎరుక లేకుండా మీరు ఆయనపై ఎలా దృష్టిని నిలపగలుగుతారు? మీ మనస్సును ఆయనపై నిలపాలంటే… ముందుగా ఆ అస్తిత్వం గురించి మీరు అవగాహన కలిగి ఉండాలి. ధ్యానానికి సంబంధించినంత వరకు, ధ్యానానికి ఏ మతంతో సంబంధం లేదు. కానీ ప్రజలు ధ్యానాన్ని ఒక మతం తోనో లేక ఒక దేవుని తోనో ముడి పెడుతూ ఉంటారు. ధ్యానం నుండి ఈ అంశాన్ని తొలగించడాన్ని నేను ఇష్ట పడతాను. అయినా మీరు ఏ దేవుడిపై ధ్యానిస్తారు? అందుకే మేం హృదయంలోని ప్రకాశంపై లేదా హృదయంలోని ప్రేమ పై ధ్యానించమని చెప్తాం. అది సరిపోతుంది. ప్రేమతో మీ కళ్ళు చెమర్చిన ఒక క్షణాన్ని గుర్తు చేసుకొని ఆ క్షణంపై ధ్యానించండి. అటువంటి వైఖరితో ధ్యానించినప్పుడు శరీర వ్యవస్థ మొత్తం విశ్రాంతి పొందుతుంది. ఒక వ్యక్తి అటువంటి విశ్రాంత స్థితిని పొందినప్పుడు, శరీరం అంతా సానుకూల ప్రకంపనలు వ్యాపించడం ప్రారంభిస్తాయి. నేను మా డాక్టర్లలో ఒకరి కాంటాక్ట్ నంబర్ని మీకు ఇస్తాను. అంతర్జాతీయంగా ఆమె పొలారిటీ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. మన సహచరులలో ఎవరైనా తమ తండ్రికి బాగాలేదు… క్యాన్సర్ తో చివరి దశలో ఉన్నారు అని ఈ-మెయిల్ చేస్తే… మేం వెంటనే దాన్ని ఆమెకు పంపుతాం. అప్పుడు ఆమె అన్నిటినీ, అందరితో సమన్వయం చేసుకొంటుంది. మేం ఇప్పటివరకు బాధ నివారణ, నిద్ర లేమికి సంబంధించిన సమస్యలు, ఆందోళన, ఇలాంటి సమస్యలకు పొలారిటీ ద్వారా చికిత్స అందజేస్తున్నాం. గర్భధారణ సమస్యలకు కూడా మేం చికిత్స అందిస్తున్నాము. గత 10 ఏళ్లుగా అనేకమైన మందులు వాడుతునప్పటికీ… గర్భధారణ సమస్యలను ఎదుర్కొంటున్న జంటలు, గర్భధారణలో ఒక యోగ వ్యవస్థ ఎలా సాయపడుతుందన్న విషయం అర్థం చేసుకోవడం కష్టం. మందులతో పాటు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మందులు వాడడం ఇష్టపడకపోతే మరీ మంచిది. ఈ పద్ధతిని ఉపయోగించి చూడవచ్చు. ఎందుకంటే దీని వలన నష్టం ఏమీ లేదు. మేం మందులు ఇవ్వం కాబట్టి మందుల వలన ఏర్పడే దుష్ప్రభావాల భయం లేదు. దీనికి మేం ఎలాటి రుసుము వసూలు చేయడం లేదు. మేం ఆర్థిక ప్రయోజనాల కోసం ఇదంతా చేయడం లేదు. ఎవరైనా ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. మేం దీన్ని వ్యాపారంగా చూడడం లేదు. బాధ్యత కూడా తీసుకోవడం లేదు. “మీరు చెప్పారు కానీ ఫలితం కనిపించడం లేదు, మీ మీద ఒక మిలియన్ డాలర్లకు దావా వేస్తానని” ఎవరైనా అంటే అంటే సంస్థ పరిస్థితి ఏమవుతుంది?. మీ స్వంత పూచీతో దీన్ని ప్రయత్నించి చూడండి. వైద్య శాస్త్రంలో పరిశోధనలు చేసి ఈ డ్రగ్ మంచిది, అది కాదు అని చెప్తూ ఉంటారు. అయితే ఒకటే మాత్ర అందరిపై ఒకటే ప్రభావం చూపుతుందని అర్ధం కాదు. ఒక మందు చూపే ఫలితాలలో 40-50 శాతం వైవిధ్యం ఉంటుంది. అయితే మేం గర్భధారణ సమస్యలలో 70 శాతం సత్ఫలితాలను సాధించాం. నిద్రకు సంబంధించిన సమస్యలలో దాదాపు 99 శాతం ఫలితాలను సాధించాం. నాకు నిద్రకు సంబంధించిన సమస్యలు లేవని ప్రజలు భావిస్తూ ఉంటారు. అయితే అది తప్పు. నేను కూడా కొన్నిసార్లు నిద్ర పట్టక బాధ పడుతూ ఉంటాను. ఎవరికైనా, ఏదైనా జరిగిందని తెలిసిన రోజు నాకిక నిద్ర పట్టదు. నేను చాలా భావోద్వేగాలు కలిగి ఉన్న వ్యక్తిని. అటువంటి పరిస్థితులలో నేను పడుకొని ధ్యానం చేసుకుంటాను. ఎవరిమీద నైనా కొంత పని చేస్తాను. ఆ ధ్యాన స్థితిలో నిద్రలోకి జారుకొంటాను. నిద్ర పట్టడం లేదు అన్న ఒక విషయం మీదే దృష్టి ఉంచకుండా, మీకు ఇష్టమైన ఇతర వ్యాపకాలు ఏమైనా పెట్టుకోవాలి. నిద్ర పట్టడం లేదా? ఒక పుస్తకం చదవండి లేదా ఐస్ క్రీమ్ తినండి. అంతేకానీ నిద్ర పోలేకపోతున్నాను అని ఆ సమస్యతో పోరాడకండి. సమస్య మీద ఎక్కువగా దృష్టిని ఉంచితే మీరు ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. నొప్పి ఉన్నప్పుడు, అదే ఆలోచిస్తూ ఉంటే అది మరింత బాధాకరంగా మారుతుంది. నిరాశగా ఉంది, ఏం చేయలేక పోతున్నాను అని నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ ఉంటే, డిప్రెషన్ కాస్తా స్కిజోఫ్రేనియా లోకి దారి తీస్తుంది. మరింత జటిలమవుతుంది. మనం సమస్యలను కనీసం మనసులోనైనా ఎప్పుడూ నిరాకరిస్తూ ఉండాలి. నిరంతర నిరాకరణ.
మన ప్రవర్తన మార్చుకోవడం ఎలా?
ధన్యవాదాలు! మనందరి అస్తిత్వంలోనూ ఇది ఒక ప్రాథమిక ప్రశ్న. మనందరం మారాలని కోరుకుంటాం. ముఖ్యంగా మన ప్రవర్తనలో మార్పు. తద్వారా మన ప్రియతములు మనతో ఏకీభవించాలనీ, అనునాదించాలనీ కోరుకుంటాం. అలాగే మన ప్రియతములు వారి ప్రవర్తనను మార్చుకోవాలనీ తద్వారా మనం వారిని మరింత ప్రేమించగలమని ఆశిస్తాం. ఇది షరతులతో కూడి ఉంటుంది ఈ ప్రవర్తన అనేదాన్ని అర్థం చేసుకునే ముందు, నేనెందుకు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నానో తెలుసుకోవాలి. ఇది ఎలా మనలో కండిషన్ చేయబడింది? దీన్నుంచి బయటపడేదెలా? మనం దీని గురించి సంక్షిప్తంగా చదువుకున్నాం. ఉదాహరణకి మద్యపానం, మత్తు పదార్థాలు, లైంగిక వ్యసనాలు. కొన్ని అలవాట్లు మనలో లోతుగా నాటబడి మన శారీరక వ్యవస్థలో బలంగా స్థిరపడిపోతాయి. వాటి మధ్య ఏర్పడ్డ ఒక పరస్పర సంబంధం ద్వారా, నేను దీన్ని విశదీకరిస్తాను. మన ధోరణులు, స్వభావాలు లేదా వృత్తులు ఎలా ఏర్పడతాయంటే… మానసిక ధోరణి కొన్ని చర్యలను సృష్టిస్తుంది. వీటినే మనం ప్రవృత్తి అంటాం. దీనిపై ఆధారపడి మన ప్రకృతి లేదా స్వభావం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది మనలో జన్యుస్వభావంగా రూపొందుతుంది. ఇదే మన విధిని, భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మనలో స్వభావాన్ని సృష్టించుకోవడం ద్వారా మన విధిని మనమే సృష్టించుకుంటున్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనలో ఈ ధోరణులను ఎలా సృష్టించుకుంటున్నాం? వాతావరణం, పరిసరాలే దీనికి కారణం. అంతా ఇదే అని కాదు కానీ, ఇది మనలో స్వభావం దృఢపడేందుకు, స్థిరపడేందుకు దోహదం చేస్తుంది. ఉదాహరణకు మీకు ఒక ప్రేమ వ్యవహారం ఉందనుకోండి. మీరు ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే ప్రేమ విఫలమైన కొంతకాలానికి మీరు ఆ వ్యక్తిని కలవడం జరిగితే, అప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఆనాటి సంగతులను గుర్తు చేస్తూ పోట్లాటకు దిగుతారా? లేదా మీరు సారీ చెబుతారా? ఇవి రెండూ భిన్న పద్ధతులు. ఆ సమయంలో మీ మనసును ఎలా క్రమబద్ధీకరిస్తారు? మీరు స్థిరంగా, నిదానంగా ఉంటారా లేక తిక్క తిక్కగా ప్రవర్తిస్తారా? ఆ క్షణంలో మీ మనసు చంచలంగా ఉంటే… విషయాలను సరిగా అర్థం చేసుకోలేని విధంగా ఉంటే, అప్పుడు ఆ మొత్తం వ్యవహారం వెనక్కి తంతుంది. ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. మన జ్ఞాపకాలు ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ చర్యలైనా మన జ్ఞాపకాలలో నిలిచి ఉంటాయి. మనం దాన్ని అభిజ్ఞా జ్ఞాపకాలు అంటాం. అది అస్తిత్వ జ్ఞాపకంగా అక్కడే నిలిచి ఉంటుంది. దీన్ని మరింత విభజిస్తే, ఎపిసోడిక్ మెమరీ (కాలానుగుణ జ్ఞాపకాలు) అవుతుంది. మన అంతరంగంలో మరింత లోతుగా ఏర్పడి, అవే భావోద్వేగ జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఈ భావోద్వేగ జ్ఞాపకాలే మన ప్రవర్తన, ధోరణులను నిర్దేశిస్తాయి. చిన్నతనంలో కుక్కకాటుకు గురైన వ్యక్తి ఎటువంటి రక్షణాత్మక ధోరణిలో ఉంటాడు? ముద్దులొలికే కుక్కపిల్లకు కూడా దూరంగానే ఉంటాడు కదా! ఒకసారి కుక్కకాటుకు గురైతే ఎప్పటికీ భయపడుతూ ఉండే ఈ ధోరణిని ఎలా మార్చాలి? హార్ట్ ఫుల్ నెస్ పద్ధతిలో ముఖ్యంగా సాయంత్రపు నిర్మలీకరణను చేసేటప్పుడు, మనం ఒక సంకల్పం చేసుకుంటాం. ‘నాలో పగటిపూట ఏర్పడిన, సృష్టించుకున్న సంక్లిష్టతలు, మాలిన్యాలు అన్నీ నా శరీర వ్యవస్థ నుండి వెళ్ళిపోతున్నాయి’, అని. దీనివల్ల నా వ్యవస్థలో అద్భుతమైన ప్రభావం కనబడుతుంది. దీన్ని గనక 10, 15 నిమిషాలు రోజూ సాయంత్రం ఇంటికి చేరాక, మన కుటుంబ సభ్యులతో కలవడానికి ముందే సాధన చేయాలి. సాధారణంగా మనం పని నుండి ఇంటికి మనతో పాటు భావోద్వేగ సరంజామాను వెంట తెస్తాం. అన్ని రకాల భావోద్వేగాలను మోసుకు వస్తాం. మన కుటుంబ సభ్యులతో కలవకముందే, ఇంట్లో ఒకచోట నిశ్శబ్దంగా కూర్చుని ఈ నిర్మలీకరణ ప్రక్రియను కనక చేసుకుంటే… తెలిసో తెలియకో రోజంతా ఏర్పరచుకున్న ముద్రలను వదిలించుకొని స్వచ్ఛంగా తయారవుతాం. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు జిమ్ కి వెళ్లి అరగంట, గంటా, రెండు గంటలు శ్రమించారనుకోండి. మీకు బాగా చెమట పడుతుంది. మీరు అలాగే ఇంటికి వచ్చి మీ భార్యను దగ్గరకు పిలుస్తారా? ఆమె దయచేసి స్నానం చేసి రమ్మంటుంది. పరిశుభ్రత అవసరం. మనం ఎరుకతో కానీ, ఎరుక లేకుండా కానీ చేసే పనుల వల్ల మన అంతరంగ పరిశుభ్రత కొంతవరకు చెడిపోతుంది. మనం దాన్ని శుద్ధీకరించుకోవాలి. ఇది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే, మొదటి నుండి మన వ్యవస్థలోకి వచ్చి చేరిన విషయాలు. మనం చేసేదంతా ‘మురికి చేసుకుని, దాన్ని వదిలించుకుంటాం’. అంటే పోస్ట్ ఎఫెక్ట్… చొక్కాకు మురికి అయితే దాన్ని శుభ్రం చేసుకోవడం. అదే రెండవ విధానంలో నా చొక్కాను, నా అంతరంగ స్థితిని బాహ్య పరిస్థితుల ద్వారా పాడు చేసుకోకుండా ఉండడం. అంటే నా అంతరంగంలో, భావోద్వేగాలలో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడం. దీన్నెలా సాధించడం? ధ్యానం ద్వారా అంతరంగంలో సమతుల్యతను కలిగి ఉంటారు. అప్పుడు మిమ్మల్ని ఏదీ కదిలించలేదు. అయితే ప్రవర్తనలో మార్పు ఎలా? అనే ప్రశ్నకు సమాధానంగా, అది అంత సులభం కాదు. మనసులో లక్ష్యం ఉన్న వ్యక్తికి ఇది ఒక చిన్న పిల్లల ఆట వంటిది. మీరు భగవద్భక్తి ఉన్న వ్యక్తి అయితే, మతవిశ్వాసాలు ఉన్న వ్యక్తి అయితే, మీకు కొంత వెసులుబాటు ఉంటుంది. ‘అవును! నేను ఆ అనంతత్వాన్ని అనుభూతి చెందాలి’ అనుకుంటారు.శాస్త్రీయమైన మనసు వీలున్నంతవరకు తన చైతన్యాన్ని వికసించేలా చేస్తుంది. అమెరికాలోని ఒక బాస్కెట్ బాల్ క్రీడాకారునికి ఎన్ బీ ఏ లో ఆడాలనే ఒక లక్ష్యం ఉంటుంది. అదే ఇక్కడ ఒక మంచి క్రికెట్ ప్లేయర్ అవ్వాలని లక్ష్యం ఉంటుంది. కనుక ప్రవర్తనలో మార్పు అనేది మీరు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే జరుగుతుంది. ఈ జీవితం నుంచి మీరేం ఆశిస్తున్నారు? తదనుగుణంగా, మీ లక్ష్యానికి అనుకూలంగా మీరు మీ జీవనశైలిని సర్దుబాటు చేసుకుంటారు. మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులు వారి అలవాట్లకు ఎంతగా బంధింపబడతారంటే, వారిలో మృదుత్వం లోపిస్తుంది. కొన్ని అలవాట్లు మీరు మారాలనుకున్నప్పటికీ, అవి మిమ్మల్ని వదిలిపెట్టవు. ‘అవును! నేను మారాలి!’ అనే నిశ్చయానికి, మీ జీవితంలో కొన్ని ఆసక్తులు, ఆనందాలు అత్యవసరం. లక్ష్యం, లక్ష్య సాధనకు నేను చేయాల్సిన పని చేయాలి. విచారంగా ఉంటూ, తాగుతూ, పొగ పీలుస్తూ ఉంటే!! కొంత స్థాయిలో ఉత్సాహం ఉండాలి. స్థిరంగా ఉండడానికి కొంత శక్తి అవసరం. సుస్థిరమైన, చక్కని మానవునిగా నా ప్రవర్తనకు ప్రయత్నం అవసరం. కొంత స్థాయిలో ఉత్సాహం ఉండాలి. స్థిరంగా ఉండడానికి కొంత శక్తి అవసరం. సుస్థిరమైన, చక్కని మానవునిగా నా ప్రవర్తనకు ప్రయత్నం అవసరం. నా అభివృద్ధిపై నాకు ఆసక్తి లేకపోతే ఎందుకు ప్రయత్నిస్తాను? కనుక ఇవన్నీ – లక్ష్యాలు, ఆకాంక్షలు, జీవనశైలిలో మార్పులు ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానింపబడి ఉంటాయి. కొంత స్థాయిలో ఆసక్తి అనేది తప్పనిసరి. కుటుంబ సభ్యులు కూడా విమర్శించే బదులు… ‘నువ్వు తప్పక చేయగలవు, నువ్వు ధైర్యవంతుడివి, దృఢమైనవాడివి’ అని ప్రోత్సహిస్తూ తోడ్పాటునందివ్వాలి. నా దృష్టిలో కొన్ని అలవాట్లు మార్చుకోవాలంటే స్నేహితుల, కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మంచి అలవాట్ల విషయంలో, చిన్నతనం నుండి తల్లిదండ్రులు మంచి వ్యక్తిత్వపు బీజాలను వారి పిల్లలలో నాటవలసి ఉంది. అది గర్భధారణ సమయం నుండే ప్రారంభం అవుతుంది. కొన్ని కణాలు కోట్ల కణాలుగా మార్పు చెందే, కణ విభజన వేగవంతమయ్యే సమయం నుండి, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారనేది పిల్లలు గమనిస్తూ ఉంటారు. పెద్దవారు కోపం తెచ్చుకున్నప్పుడు, వాదులాడుతున్నప్పుడు పిల్లలు ప్రభావితులవుతారు. వారి అంతర్గత వ్యవస్థ దానికి అనుగుణంగా మార్పు చెందుతుంది. అప్పుడు కూడా ఈ ప్రాథమిక ప్రశ్న, ఎలా తొలగించుకోవడం? అనేదానికి నాకు తట్టే సమాధానం హార్ట్ ఫుల్ నెస్ పద్ధతిలో మనం చేసుకునే నిర్మలీకరణ ప్రక్రియ. సాయంత్రపు నిర్మలీకరణ, అట్టడుగు స్థాయి నుండి, ఉప చేతనా స్థాయి నుండి మన ప్రవర్తనలో మార్పు తీసుకుని వస్తుంది. కాబట్టి దీనంతటికీ సాధన అవసరం.