Gender equality – అంటే లింగ సమానత్వం – సాధించడానికి మార్గం
Gender equality – అంటే లింగ సమానత్వం – గురించి ఆగస్ట్ 26 నాడు దానిని ఒక ప్రత్యేక దినోత్సవంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి వారు, 2022 సంవత్సరానికి, ”రేపటి సుస్థిరత కోసం నేటి లింగ సమానత్వం” ( అంటే ‘జెండర్ ఈక్వాలిటీ’ ) అనే థీమ్ ను, అలానే 2023 కోసం “డిజిటాల్ – జెండర్ సమానత్వం కోసం టెక్నాలజీ’ అనే థీమ్ ను ప్రకటించారు. విజ్ఞానవంతులైన పెద్దల ప్రయత్నాల వలన, ప్రపంచం మొత్తం ఈ విషయం గురించి మెల్లమెల్లగా చైతన్యవంతం అవుతూ వస్తోంది. ఐతే, మన దేశంలోవారికి ఈ అంశం కొత్తదేమీ కాదు. మరి ఇంకా ఏమైనా సాధించవలసినది ఉందా? అంటే, ఈ విషయంలో పరిపూర్ణత సాధించడానికి మరికొంత అవగాహన అవసరమే అనీ, అందుకు జవాబు ఆధ్యాత్మికతలో ఉంది అనీ అంటారు హార్ట్ ఫుల్ నెస్ మార్గ దర్శి దాజీ.
ఈ విషయాన్ని కొంచం విశదంగా పరిశీలిద్దాం.
పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ, స్త్రీలు అన్ని రంగాలలోనూ పురుషులతో సమాన మైన గౌరవం పొందుతూ ఉండేవారు అన్న దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మైత్రేయి అనే ముని భార్య ఉపనిషత్తుల గురించిన వాదనలో విజయం సాధించింది. 17,18వ శతాబ్దాలలో తంజావూరు రాజాస్థానంలో రంగాజమ్మ, ముద్దుపళని అనే రచయిత్రులు ఉండేవారనీ, వారు ఆస్థానంలో ఎంతో గౌరవ మర్యాదలు పొందేవారనీ చరిత్ర చెబుతోంది. అటువంటి అవగాహనా పరిణతి సాధించిన మన దేశంలో, కొన్ని చారిత్రిక సంఘటనల వలన, విదేశీ దాడులవలన ఏర్పడిన పరిస్థితుల కారణంగా స్త్రీలను ఇంటికి పరిమితం చేయడం జరిగినట్లు మనకు తెలుస్తుంది.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అంతకు ముందున్న నిర్బంధాలు మెల్లగా తొలగిపోయినాయి. స్త్రీలు తమకు నచ్చిన రంగంలో రాణించడానికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికీ ఇప్పుడు అన్ని ద్వారాలూ తెరిచి ఉన్నాయి. ఇంతకు ముందు పురుషులు మాత్రమే పాల్గొనే వైట్ లిఫ్టింగ్, బాడ్ మింటన్, టెన్నిస్, హాకీ, క్రికెట్ లాంటి క్రీడల్లో పాల్గొనడమే కాకుండా దేశానికి కీర్తి తెచ్చే పతకాలు సాధించారు మహిళలు. కళా, వ్యాపార రంగాల్లో తాము ఎవరికీ తీసిపోమని చెప్పకనే చెప్పారు. పెప్సీ కంపెనీ సి.యి.ఓ గా పని చేసిన శ్రీమతి ఇంద్రా నూయి మన దేశానికే గర్వ కారణం. విజ్ఞాన శాస్త్ర రంగంలో దేశం గర్వించే ఎన్నో అపూర్వ సాధనలు ఆడవారి సొంతం.
ఇంకా సాధించాల్సింది ఎక్కడ ఉంది?
స్త్రీ-పురుష – అంటే ప్రకృతి-పురుష శక్తులు ‘సమానం’ అని చెప్పడం అంటే, కేవలం బాహ్యపరంగా లేదా భౌతికపరంగా ఆ రెండు శక్తుల మధ్య ఏమీ తేడా లేదని నినదించడం కాదు.
మానవ శరీర నిర్మాణంలో వాటిని పరస్పర పరిపూరకాలుగా గుర్తించి, గౌరవించి, మూల శక్తి ఆ రెండు విధాలుగా ఆవిర్భవించడాన్ని సవినయంగా అంగీకరించడం. అటువంటి అంగీకార భావంతో, సమన్వయం సాధించడం.
భౌతిక పరంగా స్త్రీ-పురుష శక్తుల పరస్పర పరిపూరకత్వం అందరూ తేలికగా గుర్తించవచ్చు.
మానసిక వ్యక్తిత్వ ప్రకటనలో కూడా మానవ స్వభావంలోనే స్త్రీ పురుష వైఖరుల పరిపూర్ణ సూత్రాలు ఇమిడి ఉన్నాయని ఆధ్యాత్మికత తెలియ జేస్తోంది.
అంతర్గతంగా ప్రయాణం సాగించి, ఆత్మ పరిశీలన చేసుకోవడం స్త్రీ వైఖరి అయితే , బాహ్య పరిశీలన బాహ్య విస్తరణ పురుష వైఖరిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాంప్రదాయం ప్రకారం, విస్తరణ కొనసాగించే పురుష సూత్రం, అంతర్గత ప్రయాణం సాగించే స్త్రీ సూత్రాల అంగీకార ఫలితంగా ఈ సృష్టి అవతరించింది.
హార్ట్ ఫుల్ నెస్ ఆది గురువు లాలాజీ మహారాజ్ ప్రకారం, సుస్థిరమైన మానవ మనుగడకు బాహ్య సృజనాత్మక సూత్రాలు, హృదయం లోపలి ప్రకృతి సూత్రాల మధ్య సమన్వయం అవసరం. స్త్రీ పురుషులు ఇద్దరూ బుద్ది పూర్వక సహకారం, హృదయ పూర్వక సామరస్యం తో జీవించి నపుడే సమాజానికి సుస్థిర భవిష్యత్తు సాధ్యం.
హార్ట్-ఫుల్-నెస్ గురువులు అందించిన ఈ సందేశాలపై అధ్యయనం చేసి, మానవజాతి సుస్థిరత కోసం లింగ సమానత్వం గురించిన చక్కని అవగాహన మనందరం సాధిద్దాం
అందరికీ ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ డే శుభాకాంక్షలు !