ఒత్తిడికి సంబంధించిన ప్రశ్నకి తిరిగి వస్తే, ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా గడపాలి? నేను ఫార్మసీ వ్యాపారం చేసే రోజుల నుండి, మళ్లీ మీకొక ఉదాహరణను ఇవ్వాలనుకుంటున్నాను. 1984 లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ, బ్రూక్లిన్ లో మొదటి ఫార్మసీని తెరిచాను. మావద్ద ఇంటర్న్ షిప్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. చాలామంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఫార్మసీని ప్రాక్టీస్ చేయాలనుకునే వారు. ఫార్మసీని తెరవడానికి లైసెన్స్ పొందాలంటే, ఒక సంవత్సరంలో 2 వేల గంటలు తప్పనిసరిగా ఇంటర్న్ షిప్ చేయాలి. కాబట్టి వారు మా ఫార్మసీకి వచ్చేవారు. తరచూ చాలా త్వరగా అలసిపోతున్నామని ఫిర్యాదు చేస్తూ, చాలా నెమ్మదిగా పనిచేసేవారు. ఆలస్యంగా వస్తూ, తొందరగా వెళ్ళిపోతూ, అనారోగ్యం పేరుతో డుమ్మా కొడుతూ ఉండేవారు.
ఇదంతా కూడా వారు ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు జరిగేది. మేము ఒకరికొకరు బాగా తెలిసినప్పుడు, వారికి లైసెన్స్ లభించగానే, మా ఫార్మసీలో వారికి పర్మనెంట్ జాబ్ ఇచ్చినప్పటికీ, ఫార్మసిస్టుగా చేస్తున్నప్పుడు కూడా ఇదే వరస కొనసాగేది. ‘నేను చాలా ప్రిస్క్రిప్షన్స్ పూర్తి చేస్తున్నాను, చాలా పని చేస్తున్నాను, బిల్లింగ్ చేయడం, ఇన్సూరెన్స్ వారితో మాట్లాడటం, డాక్టర్లను పిలవడం’ వంటి ఫిర్యాదులు కొనసాగేవి. అదే నేను వారిని నా వ్యాపార భాగస్వామిగా చేసుకుంటాననే అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం, వారి వైఖరి అకస్మాత్తుగా మారిపోయేది. పనికి తొందరగా వచ్చేవారు, చిరునవ్వులు చిందించేవారు, సెలవు తీసుకునేవారు కాదు, ఇంటికి ఆలస్యంగా వెళ్లేవారు.
నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నానో మీకు అర్థమైందా? నాకిందులో ఏం లాభముందనేది మీకు అర్థమయినపుడు, ఒక సంస్థకు చెందినవారమనే అవగాహన మీకు కలిగినపుడు, మీ ఒత్తిడంతా తొలగిపోతుంది. ఇది నాది అని మీరనుకున్నపుడు, యజమాని అనే భావన అక్కడ ఉంటుంది. తన స్వంత బిడ్డను పోషించే తల్లికి, ఇంకొకరి బిడ్డను పోషించే తల్లికి గల వ్యత్యాసాన్ని చూస్తారు. కొత్త కోడలు ఇంటికొచ్చిన మొదట్లో ఏం జరుగుతుంది? ఆ ఇల్లు తనది అవదు, నాది అనే భావం నెమ్మదిగా పెరుగుతుంది. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎప్పటివరకు నాది అనే భావం పెరగదో, అప్పటివరకు ఒత్తిడి ఉంటూనే ఉంటుంది.
నేను ఒకరి కోసం పనిచేసినా లేదా మరొకరి వ్యాపారం నడుపుతున్నా, ‘నేను వేరే వాళ్ళకోసం పని చేస్తున్నాను, దాని నుండి మరొకరు లబ్ది పొందుతున్నారు’ అనే భావం మీలో ఉంటే, మీరు మారాల్సి ఉందని అర్థం. పనిలో తక్కువ బలాన్ని, తక్కువ శక్తిని, తక్కువ ఉత్సాహాన్ని చూపుతారు. కానీ మీ చైతన్యాన్ని చేయవలసిన పనిలో పెంచుకున్నపుడు, దానిని మీరు చేయగలిగినంత గొప్పగా, చాలా సంతోషంగా చేయగలరు. మీకు ద్వేషం, ఉద్రిక్తత, ఒత్తిడి ఉండి, మీరు అలాగే పని చేస్తుంటే, మీ ఆరోగ్యం ఏమైపోతుంది? దానికి బదులుగా, మీరు ఆనందంగా పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి.
తినేటపుడు కూడా, మీ భార్యతో లేదా మరొకరితో గొడవ పడుతూ తింటే మీ మనస్థితి, మీ జీర్ణక్రియ ఎలా ఉంటాయి? అదే ఆనందంగా, ఆస్వాదిస్తూ, సంతోషంగా… నా భార్య దీన్ని నాకోసం కష్టపడి తయారు చేసిందనే ఆలోచనతో తింటే, అప్పుడు మీరు చిరునవ్వు నవ్వుతారు. మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మీ ఉద్వేగపరమైన ఆరోగ్యం కూడా ఆకాశమెత్తుకు ఎదుగుతుంది. కుటుంబ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి.