ప్రశ్న: దాజీ, సున్నితత్వాన్ని ఎలా పెంపొందించుకోవడం? రంగులు, లక్షణాలు ఆధారంగా చక్రాలను ఎలా పరిశీలించి అవగతం చేసుకోవాలి? అటువంటి సున్నితత్వాన్ని ఎలా ఏర్పరుచుకోవాలి?
Q: Basing on their colors and characteristics, how to observe and understand the chakras? How to develop such sensitivity?
దాజీ: ఈ ప్రశ్న భూగ్రహంపై ఉన్న అందరు ఆధ్యాత్మిక అన్వేషకులకూ ఉన్నదే. ఇది ప్రాథమికమైన ప్రశ్న. అలాగే దీనికి సమాధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మీకు వివాహం అయిందా? (లేదు) తల్లిదండ్రులతో కలిసి ఉన్నారా? (అవును) ఓకే! ఓకే!
ఒకవేళ మీ అమ్మ, మీ నాన్నగారి లేదా మీ ఆలోచనలని ఒక్కసారే మొత్తం గ్రహించే సమర్థత, సున్నితత్వం కలిగి ఉంటే, అది మీకు ఇష్టమేనా? లేదు కదా! కాబట్టి సున్నితత్వం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఈ సామర్థ్యం వల్ల మన చుట్టుపక్కల జరిగే అన్నింటిని గ్రహించడం, భార్య లేదా భర్త ఉద్దేశాలను, మంచి చెడు భావాలను… ఇవన్నీ ముందే తెలిసిపోతే ఏం జరుగుతుంది? మీరు దానికి స్పందించే కొలదీ సమస్యలు జటిలం అవుతాయి.
ఎదుటి వారి వ్యక్తం చేయని అసంతృప్తి, కోపం కూడా, మీ సున్నితత్వం వల్ల మీకు తెలిసిపోతుంది. అతను నోరు తెరవక ముందే మీరు రక్షణాత్మక వైఖరితో సిద్ధమవుతారు. ‘ఏం మాట్లాడుతున్నావు?’ ‘నేనలా అనుకోవట్లేదు’… ఇలా ఇక యుద్ధం మొదలవుతుంది. కాబట్టి నా దృష్టిలో సున్నితత్వం అనేది సహించ గలిగినంత వరకు మంచిది, వరం లాంటిది. దాన్ని భరించే, అంగీకరించే సహనం మనలో ఉండాలి.
భరించడం, అంగీకరించడం ఇంచుమించు ఒకేలా ధ్వనించినా, ఇవి రెండూ పూర్తిగా ఒకటి కాదు. ఏం జరిగినా ‘నేను అంగీకరిస్తాను’ అంటే అందులో ప్రేమ ఉంటుంది కాబట్టి అంగీకరించడం. నన్ను క్షమించండి. నాకు ఇవాళ ఇంకేమీ తట్టడం లేదు, కనుక మీకు చెడ్డ ఉదాహరణలే ఇస్తున్నాను. మీ బాయ్ ఫ్రెండ్ తో ‘నిన్ను సహిస్తున్నాను’ అంటే ఎలా ఉంటుంది? ‘అంగీకరిస్తున్నాను’ అంటే ఎలా ఉంటుంది? మొదట్లో ఈ రెండు పదాలు ఒకేలా ధ్వనించినా, అవి రెండూ ఒకటి కాదు. కాబట్టి సున్నితత్వం అనేది మన సహనం, అంగీకారంపై ఆధారపడినంతవరకు మంచిదే! ధ్యానం ద్వారా మీరు విషయాల్ని ఎక్కువగా పరిశీలించే, అంగీకరించే సామర్థ్యాన్ని పొందుతారు.
బాబూజీ, డైరీ రాయడం అనేది సున్నితత్వాన్ని పెంచుకోవడంలో చక్కని పాత్ర పోషిస్తుందనేవారు. డైరీ రాయడం ద్వారా మీలో పరిశీలన పెరుగుతుంది. ప్రొద్దున్నుంచి సాయంత్రం దాకా మీరు ఎరుకతో ఉంటారు. డైరీ వ్రాయవలసి ఉంది కాబట్టి చేసిన అన్ని పనులు, మంచి చెడు ఆలోచనలు, హృదయంలో కలిగిన ఉన్నత భావాలూ, కల కన్నవీ, ధ్యానంలో, ఆ తరువాత ఏర్పడ్డ అనుభూతులు, స్థితులు ఇవన్నీ జ్ఞప్తి చేసుకుంటారు. ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంతరంగ సున్నితత్వానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అవగాహనలో సున్నితత్వం పెరుగుతుంది. మిమ్మల్నే కాకుండా ఇతరుల్ని కూడా అర్థం చేసుకుంటారు. వారిని అంగీకరించడం మొదలవుతుంది. మీ గురించి వారిలో చెడు ఆలోచనలు ఉన్నా, ఇవన్నీ మామూలే అని మీరు అనుకుంటారు. ఈ ప్రయాణంలో అందరిలో ఇది సాధారణమే అని అర్థం చేసుకొని మీరు పెద్దగా స్పందించరు. ధ్యాన సాధనలో సౌందర్యం అదే!
సహనం, అంగీకారం మీలో క్రమంగా పెరిగే కొలదీ, మీరు మరింత సున్నితంగా తయారవుతారు. ఇవన్నీ మన అవగాహనపై ఆధారపడి ఉంటాయి. అవగాహన ఎక్కువైతే సున్నితత్వ స్థాయి కూడా అధికమవుతుంది. మీరు సున్నితత్వాన్ని దుర్వినియోగపరిచి మిమ్మల్ని మీరు నాశనం చేసుకునేటట్లయితే భగవంతుడు మీకు సున్నితత్వాన్ని అసలు ఎందుకు ప్రసాదిస్తారు? అప్పుడది భగవంతుని నుంచి మంచి బహుమతి కానేరదు. కాబట్టి దీన్ని నేను సక్రమమైన రీతిలో ఉపయోగించాలి. ప్రతి చక్రం యొక్క కదలికలను అక్కడ ఏర్పడే స్థితులను గురించి చెప్పాలంటే, నా దృష్టిలో మన యాత్ర ఎలా ఉండాలంటే, అక్కడ సంభవించే ప్రతి చిన్న మార్పునీ కనిపెట్టగలిగే విధంగా ఉండాలి.
బాబూజీ మహరాజ్, వారు లాలాజీ సాహెబ్ వద్ద అభ్యాసీగా ఉన్నప్పటి వారి స్వీయ ఆత్మ కథను చదవమని మీ అందరిని కోరుతున్నాను. అప్పట్లో వారు డైరీ ఎలా వ్రాసేవారో, అప్పుడు వారి జీవితం ఎలా గడిపేవారో, అప్పటి వారి సున్నితత్వం… ఆ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించండి. సరళమైన పదాలతో వ్రాసిన చిన్న పుస్తకమది. కొద్ది గంటల్లోనే మీరు దాన్ని పూర్తి చేసేస్తారు. మొదట బాబూజీ స్వీయ ఆత్మకథ (Autobiography Of Ramachandra) వాల్యూం ఒకటిని చదవండి. థాంక్యూ.