ప్రశ్న: మానవ రూపం లో ఉన్నప్పుడు తను చేసుకొన్న కర్మ ఫలానుసారం ఆత్మ విభిన్న గతులకు చేరుకుంటూ ఉంటుందని అంటారు. స్వర్గం వంటి సుందర ప్రదేశంలో ప్రశాంతంగా నివసిస్తున్న ఆత్మలను ఈ విధంగా ఇబ్బంది పెట్టి వెనుకకు లాగడం భావ్యమేనంటారా?
మీ కుమారునికి కృష్ణ లేదా నారాయణ అనే పేరు పెట్టడం ఏమాత్రం సహాయపడదు. మీరు కృష్ణ చైతన్యంలో ఉండాలి. దివ్య చైతన్యంలో ఉండాలి. మీ ప్రియతముని కోసం ప్రేమలో మునిగిపోయి ఉండాలి. నేను ఇప్పుడు నా ప్రియతముని చూడబోతున్నాను. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు చావంటే భయపడినప్పుడు జరగదు. సాధారణంగా, సహజ మరణం సంభవించినప్పుడు, మీకు చక్రాల గురించి తెలుసు కదా! మొదటిది మూలాధార చక్రం. అది పనిచేయడం ఆగిపోతుంది. మూలాధార చక్రం భూమి తత్వంతో కూడినది. అది కుప్పకూలినప్పుడు మీ క్రింది భాగం కదులుతుంది. మీ పాదాలు భూమ్మీద లేనట్లుగా అనుభూతి కలుగుతుంది. ఆ క్షణాన కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.
తరువాత ఆత్మ పైకి కదులుతూ స్వాధిష్ఠాన చక్రం వద్దకు వస్తుంది. నీటి లక్షణం దానికుంటుంది, శరీరం చల్లబడుతుంది. ఆత్మ ఇంకా ముందుకు, నాభి చక్రం వైపు కదులుతుంది. అక్కడ అగ్నితత్వం ఉంటుంది. అప్పుడు మీకు వెచ్చగా అనిపిస్తుంది. ఇలా చల్లగా, వెచ్చగా ఉండే అనుభవాలు అప్పుడే ప్రాణాలు విడుస్తున్న వ్యక్తిని తాకినప్పుడు, మీరు అనుభూతి చెందుతారు. ఇంకా పైకి వాయుతత్వాన్ని చేరినప్పుడు వణుకుతుంటారు. శరీరం వణకడం ఆరంభిస్తుంది. ఆత్మ ఆజ్ఞాచక్రం వైపు కదిలినప్పుడు కళ్ళు తేలవేస్తారు. వ్యక్తి చనిపోయినప్పుడు అలా తెల్లగుడ్లు పైకి వస్తాయి.
అప్పుడు ఆత్మ తన జీవిత కాలంలోనే ముక్తి స్థాయిని సాధించినట్లయితే, బ్రహ్మరంధ్రం చక్రం గుండా బయటకు వెళుతుంది. చాలామంది పెద్దలు తల వెనుక భాగాన జుట్టు ముడి వేసుకుంటారు. అది సరిగ్గా బ్రహ్మరంధ్రం ఉన్న స్థానం. విముక్తి పొందిన ఆత్మ ఎల్లప్పుడూ ఈ ప్రత్యేకమైన చక్రం గుండా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దానికి తనదైన ప్రకంపన స్థాయి ఉంటుంది. తనదైన చైతన్య స్థాయి ఉంటుంది. అది తరువాత కచ్చితంగా అదే ప్రకంపనా క్షేత్రాన్ని జత కూడుతుంది. ఇది తాళం, తాళపు చెవి వంటిది. మిమ్మల్ని తీసుకెళ్లడానికి ఎవరూ రారు. ఆ దిశలో అది అలా అమరుతుంది. శరీరంతో అనుబంధం ఎక్కువగా గల ఆత్మలు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి.
అందువలనే హిందువులు శరీరాన్ని కాల్చేస్తారు. అయినప్పటికీ కొన్ని ఆత్మలు స్మశాన భూమిలో వేలాడుతుంటాయి. కొన్ని ఆత్మలు ఎప్పుడు అక్కడే ఉండడం వాస్తవం. అందువలన స్మశాన భూమికి ఒంటరిగా వెళ్లవద్దని, భయపడతారని చెబుతారు.
ఉన్నతంగా పరిణతి చెందిన ఆత్మలు, ఎక్కువ కాలం ఇక్కడే ఉంటాయి. అవి తమ సంకల్ప మాత్రాన వస్తాయి, సంకల్ప మాత్రానే వెళ్తాయి. బాంధవ్యంతో రావు. ఇతరులకు సహాయపడటం కోసం వస్తారు. ఏదో సాధారణ వ్యక్తిగా డబ్బుతో సహాయపడటమే కాకుండా, తనకున్న చిన్న చిన్న వస్తువులతో స్వల్ప పరిమాణంలో సహాయం చేస్తారు. కానీ దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. వెళ్లిపోయిన ఆత్మలని మనం కాంటాక్ట్ చేయవచ్చా? అది మంచి పద్ధతి కాదు. వారు తమకు తాముగా మిమ్మల్ని కలుస్తారు. కలల రూపంలో రావచ్చు లేదా మీరు ధ్యానం చేస్తూ ఒక ప్రత్యేకమైన చైతన్య స్థాయిని చేరుకున్నప్పుడు కూడా రావచ్చు. వాటితో సంబంధం పెట్టుకోవద్దని నేను గట్టిగా సిఫారసు చేస్తున్నాను. ప్రేమతో ఉండి మీ ప్రేమను ఆ విముక్తాత్మకు ప్రసరింప చేయండి. ఎలా ప్రసరింపజేయాలి? మీ కళ్ళు మూసుకోండి. ఆ ఆత్మ పట్ల ఎంతో ప్రేమను, ఆప్యాయతను తెచ్చుకోండి, అప్పుడు ఈ ప్రేమ నా ప్రియతముని చేరుకుని వారికి పోషణనివ్వాలని, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఉన్నతంగా ఎదగడానికి సహాయపడమని భగవంతుని ప్రార్థించండి.
మీరింకా బాధపడుతూ ఉంటే.. నేను ఇప్పటికీ 1993లో మరణించిన మా నాన్నగారి కోసం బాధపడుతుంటాను. దాంట్లో తప్పేమీ లేదు. మనందరం మన ప్రియమైన వారిని కోల్పోయినట్లు భావిస్తాం. ఫర్వాలేదు! కానీ నేను ‘నాన్నగారూ, రండి!’ అనాలా? నేను అలా చేయను. నా ప్రేమను ప్రసరింప చేస్తానంతే. వారు వారి యాత్రలో పురోగమిస్తూ ఉంటారు. వారు ప్రయాణించే చోట ప్రదేశం, ఆకాశం ఉండదు. మీరు తలుచుకున్న మరుక్షణమే వారు మీతో ఉంటారు, కానీ మీరు వారిని అనుభూతి చెందరు. మనం వారిని పిలవాలా అంటే అవసరం లేదు. మీరు తలచుకోగానే వారు మీతో ఉంటారు, వారు జన్మ తీసుకుని ఉంటే తప్ప.
అధికమైన భారాన్ని కలిగిన ఆత్మ వెంటనే జన్మ తీసుకుంటుంది. బ్యాగేజీతో ఉండటం అంటే ఎన్నో కర్మల భారాన్ని వారితో కలిగి ఉండటం. వారి ఆత్మకు తేలికదనం లేక ఉన్నత స్థితులకు వెళ్లలేదు. భారమైన వస్తువులు వెనుక ఉండిపోతాయి కదా! బుద్ధుడు, మహావీరుడు లాంటి ఉన్నతాత్మలు, ఇంకా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారు సాధారణ జన్మ తీసుకోరు. ఎందువలనంటే వారికి చాలా ప్రత్యేకమైన మాతృగర్భం కావలసి ఉంటుంది. ఈరోజుల్లో అలాంటిది దొరకదు.