నాడు న్యూయార్క్ లో పూజ్య దాజీ ఇచ్చిన సందేశం
ఉన్నతమైన ప్రేమ
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెప్టెంబర్ 28, 2016 నాడు న్యూయార్క్ లో స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ పూజ్య దాజీ ఇచ్చిన సందేశాన్ని తలుచుకుందాం.
మహోగని, ఓక్, అకేసియా వంటి కొన్ని వృక్షాలు, పొడవుగా, దృఢంగా, బలంగా పెరుగుతాయి. అదే సపోటా, మామిడి వంటి చెట్లకు వాటికి ఉన్నంత బలం ఉండదు; కానీ ఈ చెట్లు మనకు అత్యంత మధురమైన పండ్లను ఇస్తాయి. ప్రకృతిలో జీవన మాధుర్యాన్ని తీసుకురావడానికి, ఈ సున్నితత్వమే అవసరం. దృఢమైన చెట్లకు మధురమైన పండ్లు కాయవు.
ప్రకృతిలో మనం గమనించదగ్గ మరో ముఖ్యమైన విషయం ఏమంటే, తుఫాను తాకిడికి పెద్దపెద్ద చెట్లు సైతం కూకటి వేళ్ళతో కూలిపోవడం మనం చూస్తాం. అయితే చిన్నదిగా, వినయంగా ఉండే గడ్డి పరకను చూడండి. హృదయ సుకుమారమే దాన్ని అణకువతో తలవంచేలా చేస్తుంది. అహంకారంతో నిండిన హృదయం ఏం చేస్తుంది? అది ఇతరులను బాధించడం మాత్రమే చేయగలదు.
అందమైన గులాబీ గురించి ఆలోచించండి. దాని సువాసనతో, మాధుర్యంతో, పరిమళంతో అది తన చుట్టూ ఉన్న గాలిని నింపే స్వభావం కలిగి ఉంటుంది. సువాసన లేని గులాబీ గులాబీనే కాదు! హృదయంలో ప్రేమ లేని మనిషి కూడా అంతే!
అలాగే మానవ స్థాయిలో సైతం స్త్రీలను, పురుషులను గమనించండి. స్త్రీలు మరింత ప్రేమతో, మృదువుగా ఉంటారు. పురుష స్వభావంలో ఉండే గర్వం, అహంభావం, వారిని కఠినంగా తయారు చేస్తాయి. మన సోదరీమణులు ప్రేమ, సున్నితత్వాల ద్వారా మానవత్వాన్ని, మానవజాతిని సజీవంగా ఉంచుతారు. పరిస్థితులు ఎలా ఉన్నా, వారు సహనం, అంగీకారాలతో అన్నింటిని భరిస్తారు. ఇది భగవంతుని ద్వారా వారికి ప్రసాదించబడిన అంతరంగ స్వభావ ఫలితమే!!
ఆ విధమైన ప్రేమపూరితమైన అంతరంగ స్వభావం అందరికీ కలగాలంటే, ఏం చేయాలి?
మన హృదయాలలో ఉన్న కొంచెం ప్రేమను చిన్నచిన్న విషయాలపైనే పెట్టుబడి పెట్టే పొరపాటు చేసినప్పుడు, ఆ ప్రేమను సంకుచితం చేసి, అది విశ్వవ్యాప్తం అయ్యే అవకాశాన్ని మనం కోల్పోతూంటాం. అటువంటప్పుడు ప్రేమ ప్రవాహం ముందుకు సాగకుండా మన పెరట్లోనే స్తబ్దుగా నిలిచి పోతుంది. ఈ ప్రేమ అనే నదీ ప్రవాహాన్ని, సాగరాన్ని చేరేలా మనం చేసుకోగలగాలి.
మనల్ని మనం పరిపూర్ణులుగా అనుకున్నప్పుడు, దివ్యప్రసారం పొందడానికి ఇక అవకాశం ఉండదు. బోర్లించిన కుండపై ఎంత వర్షించినా అది లోపలికి వెళ్లలేదు కదా! వినయం మనలో ఆధ్యాత్మిక శూన్యతను సృష్టిస్తుంది. అప్పుడు, పైకి తిరిగి ఉన్న ఖాళీ కుండ లాగా, సద్గురువుల దృష్టిని ఆకర్షించి, వారి కృపావర్షాన్ని గ్రహించగలుగుతాం.
మనందరికీ ఉన్న వ్యక్తిత్వం కారణంగా మనం ఆ భగవంతునికి కృతజ్ఞులం. అయితే అహంభావంతో ఉండడం ద్వారా మనల్ని మనమే కాక ఆయన్ని కూడా మనం అవమానిస్తాం! ధ్యాన హృదయంలో ప్రేమ అత్యున్నతంగా ప్రకాశించినప్పుడు, అది తాకిన ఏదైనా అద్భుతంగా మార్పు చెందుతుంది. అంతర్గతంగా ధ్యాన స్థితిలో ఉండి, బాహ్యంగా ప్రాపంచిక విషయాలపై దృష్టిని కేంద్రీకరించినప్పుడు, విషాన్ని కూడా అమృతంగా మార్చగలిగిన గొప్ప అవగాహన పెంపొందుతుంది
ఒక పిల్లి తోకను గిచ్చినప్పుడు అది దూకడానికి బదులు సంతోషంగా ఆడితే, మనం ఆశ్చర్యపోతాం కదా! అలాగే పరిస్థితులు ఎలా ఉన్నా మనం ప్రేమ, చిరునవ్వులతో సహజంగా బదులివ్వడానికి ప్రయత్నించవచ్చు. ఇది పరిణామం కాదా?
ధ్యానం చేసే మనసు అట్టి ఉన్నత స్థితికి చేరడానికి మన పూజ్య గురువర్యుల సహాయం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. లవ్ అండ్ డెత్ అనే పుస్తకంలో మన ప్రియ చారీజీ మాస్టర్ సందేశ సారం నాకు ఈ విధంగా అర్థమవుతుంది…
” ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఇవ్వడం గురించే, తీసుకోవడం కాదు! నిజంగా ప్రేమించడం అంటే అహంభావపు కౌగిలి నుండి బయటపడటం. స్నేహం ప్రేమగా పరిణతి చెందాలి. ఆ ప్రేమ ఆరాధనగా, ఆరాధన భక్తిగా, భక్తి శరణాగతిగా పరిణతి చెందాలి. శరణాగతి వల్ల మనలోని స్వీయ, అల్పమైన ఆత్మస్వభావం నశించాలి. భగవంతునితో మన బంధం ఇలాగే ఉండాలి. ఈ మొత్తం యాత్ర అంతా వారి ప్రేమకు అర్హత పొందడం కోసమే!”
మన హృదయాలలో ఈ ప్రేమ, మృదుత్వం, సున్నితత్వం కలిగివున్నప్పుడు మనం ఎంతో సృజనాత్మకంగా మారవచ్చు. అప్పుడు మనం పూజ్య బాబూజీ మహరాజ్ చెప్పినట్లు ‘ఒక సరికొత్త మానవజాతి’ లా తయారై, మానవత్వాన్ని ఉన్నత స్థాయిలకు తీసుకుని వెళ్లగలుగుతాం.
అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, హృదయపూర్వక శుభాకాంక్షలు!