ప్రశ్న: దాజీ, హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిలో ఎదురయ్యే దశలు, స్థితులను వివరించండి. అలాగే హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన వల్ల మన శరీరంలో శక్తి కేంద్రాలేమైనా క్రియాశీలం అవుతాయా?
Q: Daaji, what are the states or stages in Heartfulness meditation? Are there any power centres get activated in our body, due to the practice of Heartfulness meditation?
దాజీ: నేనేం చెప్పాలి? ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయనా? లేక చాలా తియ్యగా ఉన్నాయనా? నాకు తెలియట్లేదు. నా దృష్టిలో ఆధ్యాత్మిక అన్వేషకునిలో వికాసం అనేది చాలా సరళంగా తెలుసుకోవచ్చు. మొదట ఆ వ్యక్తి, భగవంతునిపై గల పిడివాద అభిప్రాయాల నుంచి వైదొలుగుతాడు. అలాగే రెండో విషయం భగవంతుని అనుభూతి చెందడం. ఎన్నెన్నో అనుభవాల ద్వారా విసుగు చెంది చివరికి ఆయనలా ఎప్పుడు తయారవగలను అని భావించడం.
ఈ మూడింటినీ అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. మొదటిది మతం మూఢనమ్మకాలు విశ్వాసాల గురించి. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అలాగే దయామయుడు ప్రేమ స్వరూపుడు కూడా. ఇదంతా ఆయన గురించిన జ్ఞానం. మన పూర్వీకుల నుంచి గ్రంథాల నుంచి మనం పొందిన విజ్ఞానం. ఇందులో తప్పేం లేదు. అయితే నా అంతట నేను ఆ అనుభూతిని తెలుసుకోవడం, పొందడం ఇంకా బాగుంటుంది కదా!
భగవంతుడు అంటే ప్రేమమయుడు, దయామయుడు, సర్వజ్ఞుడు, కరుణామయుడు అని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మన జ్ఞానాన్ని పరిపుష్టం చేసుకోగలం. అనుభవం లేని జ్ఞానం మిడిమిడి జ్ఞానమే. అనుభూతి పొందినప్పుడే దానిలోని సౌందర్యం అర్థమవుతుంది.
అలాగే నేను అనుభవాలతో ప్రజలు విసుగెత్తి పోతారు అని కూడా అన్నాను కదా! నాకు ఈ అనుభవాల పరంపరతో విసుగు కూడా వచ్చేది. ఏడ్చేవాణ్ణి కూడా! ఈ అనుభవాలు ఎంత ఎక్కువై పోతాయంటే, ఇక చాలు! అనిపించేంత. ఇక ఆయనలా మారడానికి ప్రార్థిస్తాం.
ఇదంతా వివరించేందుకు సూక్ష్మమైన విషయంగా ఉంటుంది… అయినా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఉదాహరణకి మీకు ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఆతిథ్యం స్వీకరించే అవకాశం వచ్చిందనుకోండి. మీరు అది ఎంతో ఆస్వాదిస్తారు. ఒక అత్యున్నత స్థాయి ఆతిథ్యం మీకు అనుభవం లోనికి వస్తుంది. ఎలాన్ మస్క్ తో గడిపిన ఆ సమయం మీకు ఆనందంగానూ గొప్పగానూ ఉంటుంది. అయితే మీక్కూడా అంత సంపద, ఐశ్వర్యం ఉండి అంత భాగ్యవంతుడిగా అవ్వాలని అనిపిస్తుంది కదా! అంత ఐశ్వర్యవంతుడి ఆతిథ్యం పొందడం ఒక విషయం అయితే, అంత ఐశ్వర్యాన్ని స్వయంగా పొందడం మరొక విషయం. ఇక్కడ మీకు తేడా అర్థమైంది కదా!
హృదయంలో శాంతి, ప్రశాంతత, ప్రేమ అనుభూతి చెందడం, ఒక్కసారైనా సరే! ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను ఫలానా ప్రదేశానికి వెళ్లాను… ఆ స్వామీజీ నా తలపై తన చేయి ఉంచారు, నాకెంతో బాగా అనిపించింది. అదే ఒక శాశ్వత అనుభవంగా ఎలా మార్చుకోవడం? క్రమంగా మీరే ఆ అనుభూతిగా మారిపోవాలి. మీరు ప్రేమించడం కాదు… మీరే ప్రేమగా మారి పోవాలి. మీరు ప్రశాంతంగా ఉండడం కాదు… మీరు ఆ స్థితిలో నిలిచిపోవాలి. ఒక ప్రేమ మూర్తిగా శాంతమూర్తిగా మారిపోవాలి. అప్పుడు నేను ఫలానా వారిని ప్రేమిస్తున్నాను, ఇలా ఇది క్రియాత్మకంగా ఒక చర్యగా ఉండదు. అప్పుడది మీ స్వభావంగా మారిపోతుంది. మీరు అదే అవుతారు. మీ ప్రేమలో ఎంపిక లేదా ఎంచుకున్నట్లు ఉండదు. కాబట్టి ఇది మన ఆధ్యాత్మిక పురోభివృద్ధిని అర్థం చేసుకునే ఒక పద్ధతి.
ఇక శక్తుల విషయానికొస్తే అఫ్ కోర్స్, యోగిక చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వాటితోనే ఉంటాయి. బాబూజీ మహరాజ్ కృపతో, ఈ చక్రాల గుండా జరిగే మన ప్రయాణంలో, అక్కడ మనం పొందిన శక్తులను ఆయన నిర్వీర్యం చేయడం జరుగుతుంది. తత్ఫలితంగా మనలో అహంభావం ఏర్పడదు. ఆ దివ్య గురువర్యులు మనకు చేసే గొప్ప సహాయం అది. సహజ మార్గ పద్ధతి ద్వారా కొంత శక్తిని మేల్కొలపాలని మీరు భావిస్తున్నట్లయితే, ఈ పద్ధతి మీకు ఉపయోగపడదని నేను చెప్పక తప్పదు.