ప్రశ్న: దాజీ, మా పాఠశాల లోని ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలే కాకుండా, పిల్లలకు ధ్యానం లాంటి మంచి విషయాలూ బోధించేలా ఎలా వారికి ప్రేరణ కల్గించవచ్చు?
Q: Daaji, How can I inspire the teachers of our school to teach, not only the syllabus but various other topics of importance to students like meditation etc. also?
దాజీ: ఇది క్లిష్టమైన ప్రశ్న. మన రోజువారీ జీవితంలో మనం ఎదుటివారిలో స్ఫూర్తి నింపాలంటే, మీరు ఒక కంపెనీ అధిపతి కావచ్చు లేదా మీరు మన శ్రీ రామచంద్ర మిషన్ లో సెంటర్ ఇన్ ఛార్జ్ అయ్యుండొచ్చు లేదా ఒక కంపెనీకి లేదా దేశానికి రీజినల్ లేదా జోనల్ కోఆర్డినేటర్ అయ్యుండొచ్చు లేదా ఒక కాలేజీకి డీన్, ప్రిన్సిపాల్ అయ్యుండొచ్చు… మనలో ఉత్సాహం అనేది చాలా ముఖ్యం. ఉత్సాహం గురించి నిన్న మనం చర్చించుకున్నాం. మనలో ఉత్సాహం లేనిదే ఇతరులలో ఉత్సాహం నింపలేము.
ఒకవేళ మనం చాలా కోపంతో స్కూల్ కు వచ్చి టీచర్లను, విద్యార్థులను, ఇతర ఉద్యోగులను అరుస్తూ ఉంటే, బహుశా మనం వారితో పని చేయించవచ్చు కానీ ఆ పనిలో ఆనందం ఉండదు. ఒకవేళ మీరు మీ చేతుల్లో గల పనిని చాలా సంతోషంగా, ఆనందంగా, నవ్వుతూ నిర్వహించగలిగితే అప్పుడు ఈ ఉత్సాహం అనేది తప్పకుండా ఇతరులకు వ్యాపిస్తుంది. ఉత్సాహం అంటే చేసే పనిమీద శ్రద్ధ, సంతోషం కలగడం. మనకు కావలసింది ఇదే! మనకున్న జ్ఞానాన్ని ఆనందంగా పిల్లలతో పంచుకోవడం. ఇదే మన ప్రథమ కర్తవ్యం.
ఏ ఇద్దరు ఉపాధ్యాయులూ ఒకే రకంగా ఉండరు. ఒకరు సమర్థవంతంగా, ఇంకొకరు తక్కువ సమర్థవంతంగా ఉంటారు. ఇద్దరూ బాగా పనిచేసేవారే, ఇద్దరూ తమ విద్యార్థులు బాగా నేర్చుకోవాలని కోరుకునే వారే. కానీ మీరు విద్యార్థులను ‘వీరిద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం’ అని అడిగినప్పుడు, పిల్లలు ఎవరైతే తనకు ఆనందంగా నవ్వుతూ విద్యాబోధన చేస్తున్నారో, ఎవరైతే చాలా ఉత్సాహంగా, సానుభూతితో, స్నేహపూర్వకంగా ఉంటారో, పక్షపాత ధోరణి లేకుండా ఉంటారో వారంటే అభిమానం అని చెప్తారు. ఇవన్నీ చాలా గొప్ప లక్షణాలు.
కానీ అధ్యాపకులు నాలాగా ఉండాలని కోరుకోవడం సమంజసమేనా? నేను అలా అనుకోను. నేను తరచుగా ఈ ఉదాహరణ ఇస్తాను. మీ పిల్లలే మీ మాట వినరు. మీ జీవిత భాగస్వామి మీతో అన్నిసార్లు ఏకీభవించకపోవచ్చు. మీ తల్లిదండ్రులకు మీకూ మధ్య విభేదాలు ఉండవచ్చు. మీ ఆదర్శాలు ఇతర అధ్యాపకుల హృదయంలోకి, మనస్సులోకి చొచ్చుకుపోతాయని మీరెలా ఆశిస్తున్నారు!!
కాబట్టి మీరు ఇతరులకు ఉదాహరణగా ఉండండి. మీరు ఒకవేళ పరిపాలనా విభాగంలో ప్రిన్సిపాల్ ఐతే, పదోన్నతులు ఇచ్చే విషయంలో విద్యాబోధనలో ఉత్సాహం కనబరిచేవారికి ఇవ్వమని నేను సూచిస్తాను. అలాగే ఉత్సాహం లేని వారి పదోన్నతి వాయిదా వేయండి. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు కొంతమంది అధ్యాపకులకు సరదాగా పేర్లు పెట్టే వాళ్లం ‘ఇవాళ మన మాస్టారు ఆముదం తాగి వచ్చారు’ అని దానికి అర్థం ఆయన కొంచెం కూడా ఇవ్వలేనంతగా ముభావంగా ఉన్నారని.
మీకు కూడా అలా తమాషా చేయించుకోవాలని ఉందా? ఎవరూ అలా ఆట పట్టించుకోవాలనుకోరు, కాబట్టి ఉత్సాహంగా విద్యాబోధన చేయండి. మీరు ప్రిన్సిపాల్ అయినట్లయితే చాలా గొప్ప విషయం! మీరు మీలోని ఆనందాన్ని ప్రసరింప చేయండి, అదీ వారి పై అధికారం చలాయించకుండా!
మేము ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చే కేంద్రాలలో మా సహచరులతో విషయాలు పంచుకుంటున్నప్పుడు, నా గురుదేవులు ఏమనేవారంటే, క్రమశిక్షణను ప్రేమతో ఆచరింపచేయడం చాలా ముఖ్యం. క్రమశిక్షణ నేర్పించేటప్పుడు ప్రేమలో లోపం ఉండకూడదు. ప్రేమ లేనప్పుడు ఆ క్రమశిక్షణ నిరంకుశత్వంగా మారుతుంది. విద్యాప్రపంచంలో నిరంకుశత్వం ఏమాత్రం పనికిరాదు. మీరు ప్రిన్సిపల్ కాబట్టి విద్యార్థి పై కానీ ఉపాధ్యాయుని పై కానీ అరచినట్లయితే వారు మీకు సహకరించరు. పైగా వారు ఇంకా ముడుచుకొని పోతారు. మీరు వారితో ఒక్కొక్కరిగా హృదయపూర్వకంగా సంభాషించండి. వీలైతే మీరు ఉపాధ్యాయులందరూ కలిసి ధ్యానం చేసేటట్లు ప్రోత్సహించండి. మీ పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని అనుకుందాం. కొంతమంది ఉపాధ్యాయులయినా మీతో సహకరించి “సరే! మనందరం ఒక అరగంట ముందే సమావేశమై ధ్యానం చేద్దాం” అని అనుకుంటే మీ పాఠశాల వాతావరణంలో అద్భుతమైన మార్పును మీరు గమనించవచ్చు.
మీలో కొంతమందికి తెలిసేఉండొచ్చు, నేను న్యూయార్క్ సిటీలో, దాని పరిసరాలలో ఔషధ వ్యాపారం చేసేవాడిని. మా పనివేళలు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉండేవి. మేము వారంలో రెండు రోజులు మా సహచరులను రోజువారి విషయాల గురించి చర్చించుకోవడానికి ఒక అరగంట ముందు రమ్మని కోరేవాళ్ళం. వారంలో రెండు రోజులు మేము వ్యాపారం ప్రారంభించే ఒక అరగంట ముందు వచ్చి పరస్పరం ఆలోచనల గురించి చర్చించుకునే వాళ్ళం. అలాగే వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాఠశాలలో ఒక అరగంట కార్యక్రమం పెట్టుకోండి. అన్నివిషయాలను చర్చించండి. చర్చ పూర్తయిన తరువాత సమయం ఉంటే, కలిసి ధ్యానం చేయండి. ధ్యానం చేయడం ఇష్టంలేనివారు కేవలం కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చోండి. థాంక్యూ!