ప్రశ్న: మా బంధువులందరి ప్రశాంతత కోసం మీ ఆశీర్వాదం ఇవ్వండి.
మతం అంతమైన చోట ఆధ్యాత్మికత మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంతమైన చోట సత్యతత్వం మొదలవుతుంది. అది కూడా అంత మైనప్పుడు, యదార్థ స్థితి ఏర్పడుతుంది, అది కూడా పూర్తయ్యాకా, లక్ష్యాన్ని చేరుకుంటాం అని సత్యోదయం అనే పుస్తకంలో బాబూజీ మహరాజ్ చెప్పారు.
సత్యతత్వం యొక్క అంతం ఎలా జరుగుతుంది?
Q: Seeking your blessings for peace and harmony in all our family members. In the book ‘Reality at Dawn’,
Babuji mentioned – “where ‘religion’ ends,
there ‘spirituality’ starts, and where spirituality ends realization starts, and where realization ends ‘absoluteness’ starts and when that too ends we have reached our ‘goal’ “. My query is how ‘reality’ ends
during our spiritual journey?
మొదట మీరు ఆశీర్వాదం కోసం అడిగారు. చాలామంది కోసం
ఆశీర్వాదం అడిగారు. మీ దగ్గర అంత పెద్ద బలగం ఉందా? మంచిది.
మరి ఈ ఆశీర్వాదాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ దాచి పెడతారు.
ఇది సరదాగా అనే మాట, అలాగే గంభీరంగా ఉండే మాట కూడా.
శాంతి కోసం ఇలా గురువును అడుగుతారు. ఇంతకంటే మూర్ఖత్వం
మరొకటి లేదు. భిక్ష అడుక్కోవడం సరికాదు. అది మన హక్కు.
ధ్యానం చేస్తే శాంతి దొరుకుతుంది. నేను చేస్తే నాకు లభిస్తుంది. నేను ఆహారం
తీసుకుంటే నా కడుపు నిండుతుంది. నేను చదివితే నా తెలివి పెరుగుతుంది.
నేను ధ్యానం చేయడం వల్ల మా అమ్మకు ఉపయోగం లేదు. ఆమెకు శాంతి
దొరకదు. మీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వదలిస్తే మీకే ఇస్తారు…
పిల్లలకు కాదు. వారు తీసుకోలేరు.
ఎందుకంటే, ప్రారంభంలో భగవంతునితో
మనకుండే సంబంధం పరస్పర సంబంధం.
తర్వాత అది వివిధ రీతులుగా, బహుళంగా ఉంటుంది.
అది వేరే విషయం అనుకోండి.
అది ఎప్పుడు అవుతుందంటే, ఇలా అంటారు కదా,
భగవంతునితో ముఖాముఖి ఏర్పడినప్పుడు. ముఖాముఖి ఎప్పుడు ఏర్పడుతుంది?
మనం అక్కడికి (పైకి చూపుతూ) చేరుకున్నప్పుడు.
అదే నిజమైన ముఖాముఖి.
ఇక రెండవ ప్రశ్న, మతం అంతమైన చోట ఆధ్యాత్మికత మొదలవుతుంది.
ఎప్పుడు ఆధ్యాత్మికత అంతమవుతుందో అప్పుడు సత్యతత్వం మొదలవుతుంది.
అది కూడా అంతమైనప్పుడు బ్రహ్మానందం మొదలవుతుంది. అది కూడా
అంతమైనప్పుడు యధార్థమైన స్థితి మొదలవుతుంది.
ఇక్కడ మనం మతము మరియు ఆధ్యాత్మికతల మధ్య గల వ్యత్యాసాన్ని
సరిగ్గా అర్థం చేసుకోవాలి. మతాలు సర్వదా మనల్ని విడదీస్తాయి.
ఎలా? నా ధర్మం అన్నిటికంటే గొప్పది. నా మతం ఆ మతం కంటే మంచిది.
నేను పూజ చేసే విధానం వేరేదాని కంటే మంచిది అంటూ…
నమ్మడం నమ్మకపోవడం మత సంబంధమైనది.
ఏ దేవున్ని నమ్మాలి? ఎన్ని సార్లు పూజ చేయాలి?
ఈరోజు ఇది చేయాలి, ఇంకో రోజు అది చేయాలి
ఇవన్నీ మతపరమైన విషయాలు.
మనసుకు సంబంధించిన మాటలు.
ఈయన దేవుడు, ఆయన కాదు. ఇది మంచిది, అది కాదు అనేవి.
ఆధ్యాత్మికతలో అనుభవానికి సంబంధించిన విషయాలుంటాయి.
ధర్మంలో తత్వం గురించి మాట్లాడుతారు. ఈశ్వరుని గురించి మాట్లాడుతారు.
ఆధ్యాత్మికతలో ఈశ్వరుని అనుభూతి చెందడం గురించి మాట్లాడుతారు.
అది విశ్వాసం. విశ్వాసానికి ఒక విధానం ఉంటుంది.
కానీ మనం స్వయంగా అనుభవం పొందినప్పుడు,
దానిని ఆధ్యాత్మికత అంటాం.
ఈ భేదం అర్థమైందా? వారు అనుభవాన్ని పొందినప్పుడు,
“మేము ఈ గుహలో కూర్చుని ధ్యానం చేసాం…
ఈ గురువును కలిసాం. భలే మజా వచ్చింది. ఆయన మాకు ప్రసాదం కూడా
ఇచ్చారు. ఆయన నా నుదుటి భాగాన్ని తాకారు.
నేను ప్రకంపనలను అనుభూతి చెందాను”, అని అంటారు.
నీ తలపై దోమ కుడితే కూడా ఆ ప్రకంపనలు వస్తాయి.
ఒక వ్యక్తి చెయ్యి ఏదైనా సంకల్పంతో మీ తల పైకి వస్తే మీరు దానిని
గౌరవంగా అనుభూతి చెందుతారు. ప్లేసిబో ప్రభావం అయితే ఉంటుంది కదా.
ఎవరైనా మీ అమ్మతో కొంతసేపు నా తలపై చేయి పెట్టమ్మా అనండి. ఎంత
శాంతి లభిస్తుందో చూడండి. భగవంతుని కూడా ప్రార్థించనవసరం లేదు.
ఎప్పుడైనా అలా చేశారా? మనం అనుభవం గురించి మాట్లాడినప్పుడు
అది ఆధ్యాత్మికత అవుతుంది. ప్రజలు ఈశ్వరుని గురించి గప్పాలు కొడతారు…
చర్చిస్తారు, వాదిస్తారు, అది మతం అవుతుంది. నేను చెప్పినట్లు వారు ఒకసారి
అనుభవం పొందితే సరిపోదు. ఒకసారి శాంతిని అనుభవిస్తే కూడా సరిపోదు.
నేను అనుభూతి పొందుతూ ఉండాలి. మీరు ఉదయం ధ్యానం చేశారు అనుకోండి.
ఎంతో శాంతిని అనుభూతి చెందుతారు.
కానీ అరగంట ధ్యానం తర్వాత దినమంతా శాంతికి భంగం కలుగుతూ
ఉంటే మీరు దానిని ఆనందిస్తారా? అరగంట ధ్యానం నాకు ఇష్టమే అంటారా?
కానీ ఆదర్శవంతమైన స్థితి అంటే తర్వాత రోజంతా శాంతియుతంగా ఉండడం.
బయట ఇబ్బందులు అయితే ఎప్పుడూ ఉంటాయి.
కానీ అంతరంగిక హృదయ స్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఇబ్బందులు ఉంటాయి, మీరు సాక్షిగా ఉంటారు.
నా అనుభవమే ముఖ్యమైన విషయం. అది శాశ్వతమైన స్థితి కావాలి.
అది నా సహజ స్వభావం కావాలి.
అప్పుడు మీరు సత్యతత్వం వైపు కదులుతూ ఉన్నారని అర్థం. అది వాస్తవం.
ధనవంతుల ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించారనుకోండి.
వారింట్లో పది రోజులు ఉంటే మజా వస్తుంది.
తర్వాత నీ పాత స్థితికి, అంటే ఏమీ లేని పేదరికానికి వస్తావు కదా!
ఆ సంపన్నుని ఆతిథ్యాన్ని అనుభవించే కంటే, నీవే సంపన్నుడిగా అవ్వాలి.
అనుభవించడం చిన్న విషయం…
దాని బదులు, ఆ విధంగా మారగలగడం శ్రేయస్కరం.
ఆధ్యాత్మికతలో కలిగే అనుభవాలు మంచివి. వాటికంటే కూడా
మనం గుణాత్మకమైన దానిగా మారడం గొప్పగా ఉంటుంది.
చిన్న చిన్న శాంతి అనుభవాలు పొందడం కంటే నేనే శాంతి స్వరూపంగా
మారాలి. ప్రేమించడం కంటే ప్రేమ స్వరూపంగా కావాలి.
కరుణ చూపడం కంటే పూర్తిగా కరుణామయుడు అవ్వాలి.
అప్పుడు మతంలోని నమ్మకాలు, సందేహాలకు ఆధ్యాత్మికతలో ఉన్న అనుభవాలకు గల వ్యత్యాసం చూడండి.
అప్పుడు మీరు సత్యోదయాన్ని చదివి చాలా బాగా అర్థం చేసుకుంటే,
ఈ తయారవ్వడాన్ని కూడా పరిత్యజించాలి అని బాబూజీ మహరాజ్ అంటారు…
దాన్ని కూడా వదిలేస్తే మంచిది. అది నిజమైన పరిత్యాగం.
మీరు బ్రహ్మానందాన్ని కూడా వదిలేస్తున్నారు. అది కూడా భారమవుతుంది.
సచ్చిదానందాన్ని కూడా వదిలేయగలగాలి.
పనికిమాలిన దాన్ని ఎవరైనా వదిలి పెట్టగలరు.
అత్యున్నత స్థితి అయిన ఆనందాన్ని కూడా వదిలివేయాలని బాబూజీ మహరాజ్ ప్రోత్సహిస్తున్నారు.
అప్పుడు భగవంతుడు మీకు ఏమి ఇచ్చినా,
ఇవ్వకపోయినా దాని పట్ల మీరు శ్రద్ధ చూపరు.
ఆయన బ్రహ్మానందం లేదా నరకం, నిజంగా ఏది ఇచ్చినా పరవాలేదు అనే సంపూర్ణ శరణాగతి కలుగుతుంది.
ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు ఇలా చెబుతారు…
“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ”. అంతే! నాకు ఏదీ వద్దు.
ఈ ధర్మం కానీ ఆ ధర్మం కానీ, ఈ సంతృప్తి లేదా ఏదైనా,
అలాంటిది ఏదైనా సరే…
అన్నింటినీ ప్రేమతో ప్రభువు పాదాల వద్ద పెట్టి పూర్తిగా శరణాగతి పొందుతాను.
నిస్సహాయంగా అలా చేయను, అది అడుక్కోవడం కాదు. కేవలం ప్రేమతో చేస్తాను. ప్రేమ కోసమే ప్రేమ.
మన హృదయం శుద్ధమయినప్పుడు అలా జరుగుతుంది.
అందువల్ల మన సహజ మార్గంలో క్లీనింగ్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం.
ధ్యానం కంటే ఎక్కువగా అంతఃకరణ శుద్ధి చేసుకుంటాం.
ఉదయం ధ్యానం, సాయంకాలం అంతఃకరణ శుద్ధి, రాత్రి ప్రార్థన. వీటిని సాధన చేస్తూనే ఉండాలి.