ప్రశ్న నమస్తే దాజీ! నావి రెండు ప్రశ్నలు. ఒకటి, ప్రస్తుత యుద్ధ సమయంలో ప్రశాంతంగా ఉండటం సాధ్యమేనా? రెండు, ఆధ్యాత్మికతలో చక్రాలు, నాడుల ప్రభావమెంత? నా ఆధ్యాత్మిక ప్రయాణంలో వీటి గురించి అవగాహన ఎంతవరకు కలిగి ఉండాలి?
Q: Daaji, namaste! I have two questions. One, in the current war scenario, is it possible to be calm and peaceful?
The second one, in spiritually what is the importance of chakras and naadis? In my spiritual journey, how much awareness shall I have on these?
దాజీ: ఇటువంటి పెద్ద యుద్ధాల గురించి మాట్లాడుకునేటప్పుడు, యుద్ధానికి కారకుడైన ఆ వ్యక్తిని మనమెలా మార్చగలమనే ఆలోచనలో మనం విఫలమవుతాం. అది అసాధ్యం! మార్చగలమనుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఒక చిన్న కుటుంబంలో కూడా మనకు ఎంతో ప్రియమైన వారిని సైతం మనం మార్చలేము. ఉదాహరణకి నా పిల్లలను నేను ప్రభావితం చేయగలనా? సోదరీ సోదరులను, తల్లిదండ్రులను నేను నా ఆలోచనలకి అనుగుణంగా మార్చగలనా? అది జరగదు. ఓర్పుతో కూడిన హృదయంతో, మనం వేచి ఉండాల్సిందే. పిల్లల్లో మార్పు కోసం ఎంత వరకు వేచి ఉండాలో, తల్లులకు బాగా తెలుస్తుంది. అదే మార్పుకోసం వారిపై బలప్రయోగం చేస్తే, మార్పు ఎన్నటికీ కలుగదు.
అందుకే మనం భగవంతుని విశ్వశాంతికై ప్రార్థించాలి. మనం అంత వరకే చేయగలం. అవకాశం ఉన్నంత వరకు, మనవైపు నుంచి శాంతిని, ప్రశాంతతను వ్యాపింప చేయగలగాలి.
ఇక నాడీ చక్రాల గురించిన మీ రెండవ ప్రశ్న విషయానికొస్తే, ఆధ్యాత్మికతలో వాటి పాత్ర, ప్రాముఖ్యత ఎంతో ఉంది. అయితే ఇదంతా మనకు ఈ పద్ధతిలో శిక్షణ ఇస్తున్న గురువు గారికి వదిలేయాలి. వారి మార్గదర్శకత్వంలో, ఈ మార్గంలో మనం ఎక్కడ ఉన్నా, ఒక్కొక్కరం ఒక్కో స్థాయిలో ఉండవచ్చు, కానీ గురువర్యుల పాత్ర, ప్రతి అభ్యాసీని అత్యున్నత దశకు చేర్చుటయే.
మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. హృదయ మండలంలోని ఐదు చక్రాల విషయానికి వస్తే, ఎడమ చనుమొనకి 4 వ్రేళ్ళ దిగువన ఒక చక్రం ఉంటుంది. దాని బింబ ప్రతిబింబంగా కుడివైపు అదే స్థానంలో రెండవ చక్రం… సరిగ్గా ఈ రెండిటికీ పై వైపుగా అవే స్థానాలలో, అంటే చనుమొనలకు పైన ఇంకో రెండు ఉంటాయి. అక్కడినుంచి త్రిభుజాకారంలో గీత గీస్తే, కంఠ స్థానంలో ఐదో చక్రం ఉంటుంది. ముందుగా ఈ 5 చక్రాలు లేదా బిందువుల గురించి చర్చిద్దాం.
హృదయంపై మనం చేసే ధ్యానంలో మనం పురోగమిస్తూ ఆ బిందువు పై సాధన మరింతగా చేస్తున్నప్పుడు, కొంత చైతన్య స్థాయి అనేది మన హృదయంలో ఏర్పడుతుంది. ఉదాహరణకు భగవంతుని గురించి మాట్లాడుతూ, ఓహ్! నేను ఆయనను అనుభూతి చెందానంటే, మీ చైతన్య స్థాయి ఈ హృదయ చక్రం వద్ద బాగా అభివృద్ధి చెందినప్పుడే, మీరు మీలోనే భగవంతుని బాగా అనుభూతి చెందగలిగి ఉంటారు. మీకు ఆయన ఉనికి పై ఎంతో విశ్వాసం కలుగుతుంది.
మాస్టర్ సహాయంతో మీరు ముందుకెళ్లేకొలదీ, తర్వాతి చక్రం దగ్గర భగవంతుని మీలోనే కాకుండా మీరు అన్నిట్లో, అన్నిటా అనుభూతి చెందుతారు. ఆకాశంలో, నక్షత్రాలలో మీ చుట్టూ ఉన్న అన్నింట్లో గ్రహిస్తారు. దీన్ని మీరు తిరస్కరించదలచినా తిరస్కరించలేరు. అదొక అద్భుతమైన, మైమరపించే అనుభవం. తత్ఫలితంగా తర్వాతి చక్రం తెరుచుకుంటుంది. అక్కడంతా ప్రేమమయమే! భగవంతుని అన్నిటా దర్శించినప్పుడు, హృదయం నుంచి అన్నిటి పట్ల ప్రేమ సహజంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ధైర్యం అనేది అప్పుడు పెంపొందుతుంది. ఇక్కడ మీరు ప్రేమను పెంపొందించుకున్నప్పుడు, సహజంగానే కొంత ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిర్భయత్వం ఇవన్నీ పెంపొందుతాయి. ఇవన్నీ తర్వాత చక్రం యొక్క సుగుణాలు. ఈ నిర్భయత్వం, విశ్వాసం కారణంగా మీ ఆలోచనల్లో స్పష్టత ఏర్పడి మీ హృదయం, మనసు స్పష్టతతో ఉండడమనేది ఐదవ చక్రం యొక్క లక్షణం.
ఈ విధమైన చలనాలు ఏర్పడనంతవరకూ, మీకు ఈ అనుభూతులనేవి కలగవు. కాబట్టి మన పని ఉదయం ధ్యానం, సాయంత్రం నిర్మలీకరణ తప్పనిసరిగా చేయాలి. ఇక్కడ ఏవి శుభ్రపడతాయంటే, చక్రాలు, నాడులే కాకుండా మన వెన్నెముక, మొత్తం శరీర వ్యవస్థ శుభ్రపడుతుంది. మనలోని ప్రతీ కణమూ స్వచ్ఛతనూ, సరళతనూ కలిగి ఉంటుంది. సంక్లిష్టతలు, మాలిన్యాలు తగ్గిపోయినట్లు మీరు అనుభూతి చెందుతారు. అప్పుడు మీరు భగవంతుడు వాడగలిగే నిజమైన వాహనంలా మీ హృదయాన్ని తయారుచేసుకుంటారు. అది ఎంతో అద్భుతమైన స్థితి!
కేవలం నాడులు, చక్రాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్వచ్ఛపరచబడినపుడే ఇది వీలవుతుంది. మీరు అప్పుడు ఒక ప్రత్యేకమైన స్థాయిల లోని ప్రకంపనలను కలిగి ఉంటారు. మిమ్మల్ని కలిసిన వారు, మీతో మాట్లాడిన వారు, కలిసి ప్రయాణించిన వారు మీ అస్తిత్వంతో ప్రభావితులవుతారు. మీ ఉనికే మీ గురించి గొప్పగా చెబుతుంది. మీరప్పుడు భగవంతుని గురించేమీ విశ్వసించమని చెప్పనక్కర్లేదు. మీ ఉనికి లో వారు దాన్ని గ్రహిస్తారు. అవును, ఈ వ్యక్తి ఆధ్యాత్మికుడు, ప్రశాంతంగా ఉన్నాడు, ఎంతో ప్రేమమయంగా, దయతో ఉన్నాడని వారు తెలుసుకుంటారు. దీని తరువాత మనలో ఎటువంటి కృత్రిమత్వం ఉండదు. అది అంతా అలా సహజత్వంతో ఉంటుంది. ఒక సరళమైన ధ్యానసాధన ఇదంతా చేస్తుంది. థాంక్యూ!