ప్ర: నమస్తే దాజీ! కర్మ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఏ కారణమూ లేకుండానే, మనం బాగా ప్రేమించే వ్యక్తుల చేతిలో శిక్షింప పడుతూ ఉంటాం. దీన్ని మనం కర్మ అని భావించవచ్చా?
దాజీ: చర్చించాలంటే ఇది చాలా సంక్లిష్టమైన విషయం. మన జీవితాల్లో సంభవించే చిన్న విషయాలను విశ్లేషిద్దాం. ఈరోజు సాయంత్రం 8:30 కి ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. నేను పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. ఇది ఇక్కడ వేచి ఉన్న వేలమంది కర్మా, నా కర్మా లేక నా పక్కన కూర్చున్న శ్రీ అనిల్ సహస్రబుద్ది గారి కర్మనా? దీనిని ఎవరు మారుస్తారు? నేను ఇక్కడకు సరిగ్గా 8:30 కి వద్దామనుకున్నాను. కానీ పది నిమిషాలు ఆలస్యం అయ్యాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ ఏమై ఉంటుందని విశ్లేషిస్తే, మనకు మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ టైముకి ఒక్కోసారి రాలేకపోతాం. అలాగే అవతలి వారి కోరికలను, అంచనాలను అందుకోలేక పోతాం కూడా. ఎందుకంటే మనల్ని ఎన్నో ప్రభావితం చేస్తాయి.
ఇక్కడికి రావడానికి నేను కారెక్కేముందు, చాలాకాలంగా నిబద్ధతతో సాధన చేస్తున్న అభ్యాసీ ఒకరు నన్ను కలిశారు. తీవ్ర దుఃఖంతో చిన్న పిల్లాడిలా ఏడుస్తూ నా కాళ్ళపై పడ్డారు. “దాజీ దయచేసి నన్ను రక్షించండి, నా భార్య నన్ను వదిలేస్తున్నది, మా అత్తమామలు నా తప్పు లేకుండానే నన్ను కోర్టు కీడుస్తున్నారు”. కాబట్టి ఇలా జరుగుతుంటే, ఒకరి కర్మ మిగిలిన వారిని ఎలా ప్రభావితం చేస్తుందో ఆ క్రమంలో ఎలా ఆలస్యం అవుతుందో అర్థమవుతుంది.
ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. కేవలం నా కర్మ నా తలరాతను నిర్ణయిస్తుందని చెప్పలేం. ఇతరుల కర్మలు కూడా నా విధిపై ప్రభావాన్ని చూపవచ్చు. ఉదాహరణకు శ్రీరామచంద్రుని జీవితాన్ని గమనిస్తే, మీ అందరికీ రామాయణం గురించి చాలా బాగా తెలుసు. వశిష్ట మహర్షి, విశ్వామిత్రుడు వంటి ఎందరో మహర్షులు సీతామాత, శ్రీరామచంద్రులది పరిపూర్ణమైన జంట అని, వారి జాతకాలు ఎంతో చక్కగా కుదిరాయనీ, వారి జీవితాల్లో ఎలాంటి దోషాలు జరగవనీ అన్నారు. పైగా వారికి బాధలను కలుగజేసే ఎలాంటి గత జన్మ కర్మలు లేవన్నారు. వారి అవతారాలను అర్థం చేసుకున్నప్పుడు, శ్రీరామునికి గతజన్మ తాలుకు కర్మ లేదు. సీతాదేవి కూడా గతంలోని కర్మల భారాన్ని కలిగిలేదు. మరి అన్ని కష్టాలు ఎలా అనుభవించారు?
కాబట్టి విధిని అనుసరించి కష్టాలు పడడానికి కర్మ ఒక్కటే కారణం కాదు. ఇతర ప్రభావాలు కూడా ఉంటాయి. మనం రామాయణంలో కైకేయి పాత్రని చూసినప్పుడు, ఆమె తన దాసి మంధర చే ఎలా ప్రభావితమైందో, దశరథుని మనసును ఎలా ప్రభావితం చేసిందో తెలుస్తుంది. దశరథ మహారాజుకు తన పెద్ద కుమారుడు అడవుల్లోకి వెళ్లడం ఇష్టం లేకపోయినా, రాజధర్మం పాటించి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి అలా చేయవలసి వచ్చింది.
కాబట్టి కొందరు వ్యక్తుల పిచ్చి కోరికలు ఇతరుల జీవితాలపై ప్రభావం చూపుతాయి. శతాబ్దాలుగా మన నేలపై ఇలా జరుగుతూనే ఉంది. ఒక తండ్రి లేదా తల్లి తమ సంతానం విధిపై ముందుగానే నిర్ణయాలు తీసుకుంటారు. నా కూతురు ఫలానా వ్యక్తిని, ఈ ఊర్లో లేదా ఆ ఊర్లోని వారిని వివాహమాడాలి అనుకుంటారు. ఆ కుమార్తె ఎవరితోనో ప్రేమలో ఉన్నప్పటికీ కూడా. అప్పుడేం జరుగుతుంది? ఎంతో మంది వ్యక్తుల విధి మారుతుంది. ఈ అమ్మాయి మరొకరిని ప్రేమిస్తుంది. అతను ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ పెళ్లి చేసుకోలేరు. ఆమె మరో వ్యక్తిని, అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె గాని, అతను గాని సంతోషంగా ఉండలేరు. ఎంతమంది ఈ సందర్భంగా బాధపడతారు? అది కూడా ఇతరుల ప్రభావం వలన. మనం కేవలం మన కర్మకే బాధితులం కాకుండా, ఇతరుల కర్మకు కూడా బాధితులమవుతాం. ఇలా ఎన్నో ప్రభావాలుంటాయి. మన జీవితాలను ఎవరు మారుస్తారు? నేను గతంలోని కర్మలకు బాధపడుతున్నానా లేదా వర్తమానంలో కొత్త కర్మలను సృష్టిస్తున్నానా?
కొన్ని తరాల క్రితం విమానాలు లేవు. అప్పట్లో విమాన ప్రయాణం లేదు. మరి ఈ రోజుల్లో, ఎగరడానికి ఉపయోగపడే కొత్త కర్మలేమీ చేయకుండానే, మనం గాలిలో ఎలా ప్రయాణిస్తున్నాం? అంటే మనం భవిష్యత్తులోకి ప్రయాణిస్తున్నప్పుడు కొత్త విషయాలను సృష్టిస్తున్నాం. యోగులు, ముఖ్యంగా ధ్యానం చేస్తున్నవారు, కాలం కంటే ముందే విషయాలను గ్రహించగలరు. ముఖ్యంగా మన చైతన్యం ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడు, కారణానికి మరియు ప్రభావానికి గల భేదాన్ని గుర్తించగలం. నేనిప్పుడు చేస్తున్నది గతం యొక్క ప్రభావమా లేక నేనొక కొత్త పరిస్థితిని సృష్టిస్తున్నానా? ఒక విధంగా చెప్పాలంటే నేను ధ్యానిస్తున్నప్పుడు నా గురువును నా హృదయంలో ఎంతో భక్తితో అనుసరిస్తున్నప్పుడు, నేను క్రొత్త విధిని సృష్టిస్తున్నానా? ఆ విధి నేను కోరుకున్నట్లుగా ఉంటుందా? యోగ మార్గాన్ని అనుసరించడం వలన నా విధిని నేను మార్చుకోవడం లేదా? అందువలన యోగా మాత్రమే మన విధిని ఆశించదగినంత లక్ష్యం మేరకు మార్చగలదు. యోగమంటే యోగ్యత. అయోగ్యత యోగాకు వ్యతిరేకం. నెరవేరినప్పటికీ, మనం మార్పు చెందుటకు సహాయపడని మరో గమ్యానికి తీసుకెళ్తుండడంవల్ల, అది అయోగ్యత. యోగ్యత మిమ్మల్ని యోగ్యతా స్థితికి, లయావస్థ స్థితికి చేరడంలో సహాయం చేస్తుంది. మీకిచ్చిన ఈ సుదీర్ఘమైన జవాబు ప్రకారం, కర్మ అన్నివేళలా మనల్ని ప్రభావితం చేస్తుంది. మనదే కాకుండా ఇతరుల కర్మ కూడా.