నమస్తే జీ!
హ్యాపీ జన్మాష్టమి!
గీతా బోధలు సనాతనమైనవి. కాలపరీక్షకు నిలిచినవి. అవి మనలో ఏదో ఒక రకంగా ప్రేరణలు కలుగజేస్తాయి. దురదృష్టవశాత్తు ఆ ప్రేరణలు ఎంత ఉత్కృష్టమైనవైనప్పటికీ, సాధకులు వేటినైతే సాక్షాత్కరించుకోవాలని తపిస్తున్నారో, ఆ దిశగా తరువాతి అడుగు వేయలేకపోతున్నారు.
మన ఆచార్యులు, ఎంతో కీర్తిని పొందిన మన బోధకులెందరో, మనం చేరుకోవలసిన ఉత్కృష్టమైన స్థితి స్థితప్రజ్ఞత్వం అని నిస్సందేహంగా చెప్పారు. నిజమే! అలాగే మనిషి తాను చేస్తున్న కర్మకు, నిజానికి ఆతను కర్త కాడని కూడా చెప్పడం జరిగింది. అయితే మీరు ఆకలిగా ఉన్నప్పుడు హోటల్ కి వెళ్ళి వాళ్ళు చూపించే మెనూ చూస్తే మీకు తృప్తి కలుగుతుందా?
అలాగే మనం స్థితప్రజ్ఞత్వ భావాన్ని గురించి, సమతౌల్య స్థితిని గురించి, ఇటువంటి దివ్య ఆధ్యాత్మిక స్థితులను గురించి కేవలం చదువుతూ ఉంటాం అంతే. ఆ స్థితులకు నిజంగా చేరుకోవాలంటే ఎలా? అటువంటి స్థితులను ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకొనే మార్గాలు చేపడితే తప్ప, కేవలం చదవడం వల్ల, వినడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదని మన అనుభవం చెబుతోంది.
ఈ ప్రయోజనం సిద్ధింపచేసుకోవడానికి అవసరమయ్యే మార్గాల విషయంలో మనం ఎప్పుడూ అంధకారంలోనే ఉన్నాం. వాళ్ళిచ్చే ప్రవచనాల్లో ఎక్కడా రవ్వంత సూచనలు కూడా జాడ తెలియవు. ఫలితం… విన్నవాళ్లందరూ పదే పదే ఆ శ్లోకాలు మంత్రాల్లా వల్లిస్తే చాలన్న పొరపాటు నిర్ధారణకు వస్తున్నారు. ఉదాహరణకు – ‘నేను కర్తను గాను’, నేనే బ్రహ్మను’, ‘అహం బ్రహ్మాస్మి’ అనే వాక్యాలను పదే పదే వల్లిస్తే సరిపోతుందా? ఇలా వల్లె వేయడంతో నా వంతు ధర్మం నేను చేసేశానన్న భ్రమలో ఉండటం నిజానికి మనకు నష్టం చేకూరుస్తుంది.
స్థితప్రజ్ఞత్వం, తామరాకు అశుద్ధమైన నీటి సరస్సులో ఉంటూ కూడా ఏ విధంగా ఆ అశుద్ధ నీటి ప్రభావం లేకుండా ఉండేటువంటి ఆధ్యాత్మిక ఫలితాలు సాధించాలన్నా, లేక ఒక సాక్షిలా తయారవ్వాలన్నా,
లేక ఆనందంగా శరణాగతిని అక్కునజేర్చుకోవాలన్నా, లేక నిష్కామ కర్మ చేయాలన్నా లేక కోరికల్లేని స్థితికి చేరుకోవాలన్నా… సరైన ఫలితాలు రావాలంటే సరైన మార్గాలను అవలంబించాలి.
కేవలం నేను బ్రహ్మను, నేను సాక్షిని అని మంత్రంలా మనసులో అనుకోవడం వల్ల ఆ స్థితులు నిజంగా సృష్టింపబడతాయా? కాస్త ఆలోచించండి. ఇది గనుక అంత తేలికైతే, ఇలా వల్లె వేస్తున్నవాళ్ళు, వింటున్నవాళ్ళు అందరూ శ్రీకృష్ణభగవానుడు ఎన్నో విధాలుగా సూచిస్తున్నదాన్ని ఈపాటికే సిద్ధింపజేసుకొని ఉండాలి.
నేనొక గొప్ప ఆవిష్కరణను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహరాజ్ కృప వల్ల, ఇది మీ ముందుకు తేగలుగుతున్నాను. దయచేసి సావధానంగా వినండి. మనం ఒకసారి మహాభారత యుద్ధ సన్నివేశానికి వెడదాం. యుద్ధం ప్రారంభమవబోతోంది. అర్జునుడు విషాదంలో మునిగిపోయి యుద్ధం చెయ్యనని నిర్ణయం తీసేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. శ్రీకృష్ణ భగవానుడికి ఈ రోజు మనకు కనిపిస్తున్న భగవద్గీత అంతా అతనికి చెప్పడానికి ఎంత సమయం ఉందో. యుద్ధరంగంలో రెండు సైన్యాలు ముఖాముఖి నిలబడి ఉన్నాయి. యుద్ధం ప్రారంభమయ్యిందని సూచిస్తూ శంఖారావాలు, ఇతర శబ్దాలూ వినిపిస్తున్నాయి. అర్జునుడిని సరైన త్రోవలో నడిపించడానికి, తన బోధనల ద్వారా అతన్ని యుద్ధానికి సన్నద్ధుడిని చేయడానికి శ్రీకృష్ణ భగవానుడికి ఎంత సమయం ఉంది? ఆలోచించండి.
18
అధ్యాయాలు, 700 శ్లోకాలు, అర్జునుడికి బోధించాలంటే కనీసం కొన్ని గంటలైనా అవసరమవుతుంది. ఇటువంటి కీలకసమయంలో ఇదెలా సాధ్యపడుతుంది? కొన్ని నిముషాల కంటే ఎక్కువ వెచ్చించలేమని ఎవరికైనా అర్థమవుతుంది. యథార్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానప్రసరణ చేశాడు. కొద్ది నిముషాల్లోనే ఆ క్షణంలోనే అతనికి అవసరమైన మానసిక స్థితులన్నిటినీ ప్రసరించడం జరిగింది. నిజానికి ఒక ఆధ్యాత్మిక సాధకుడు తన ఆధ్యాత్మిక యాత్రలో అనుభవించేటువంటి ఆధ్యాత్మిక స్థితులవి. ఈ ప్రక్రియ ద్వారా అర్జునుడు వెంటనే ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యానుభూతిని పొందడమే గాక అనవసరమైన మమకారాన్ని తన హృదయంలోనుండి తొలగించడం జరుగుతుంది. అటువంటి సమర్థుడైన వ్యక్తి అందుబాటులో ఉంటే, అది ఈ రోజు కూడా సాధ్యమే. కాని మనకు కనిపించేదేమిటంటే, జనం తమ జీవితం అంతా వినడానికి, గీతా పారాయణానికి ప్రాధాన్యతనిస్తారే తప్ప, ఆ గీతా ప్రభావాన్ని గాని సారాన్ని గాని అనుభవంలోకి తెచ్చుకోవాలనుకోరు. గీతాసారం వాళ్ళ హృదయాలను అసలు స్పృశించదు.
ఇన్ని సంవత్సరాలుగా గీతను విన్న తరువాత కూడా ఎంతమంది అర్జునుడిలా పరివర్తన చెందడం జరిగింది? శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానాన్ని ప్రసరించడం జరిగింది. దానికి వ్యాస మహర్షి సాక్షిగా ఉన్నాడు. ఆయనే ఆ ప్రసరించిన జ్ఞానాన్ని శ్లోక రూపంలో పొందుపరచారు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మాటల్లేకుండా శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగిన ప్రసరణను ఆ తరువాత వ్యాస మహర్షి శ్లోకరూపంలో తర్జుమా చేయడం జరిగింది. హృదయం నుండి హృదయానికి జరిగిన ఈ జ్ఞాన ప్రసరణకు వ్యాసమహర్షి సాక్షిగా ఉండటమే గాక, అందులోని ఉద్వేగాలను, ఆధ్యాత్మిక స్థితులను జాగ్రత్తగా శ్లోక రూపం లోకి తర్జుమా చేశారు. అదే మనం ఈరోజు చదువుకొనే గీతగా మారింది.
యథార్థంగా శ్రీకృష్ణుడు శ్లోక రూపంలో పలికినవి కేవలం 7 శ్లోకాలు మాత్రమే. ఈ ఏడు శ్లోకాల ద్వారా ఏడు ఆణిముత్యాలను అర్జునుడికి అందించడం జరిగింది. కాలక్రమేణా వ్యాసమహర్షి తర్జుమా చేసిన శ్లోకాలు గాక, అనేక మహర్షుల ద్వారా మిగిలిన శ్లోకాలు చేర్చబడ్డాయి. భగవంతుడు, అర్జునుడు వీరిరువురి హృదయాల మధ్య జరిగిన హృదయ సంభాషణ ఇది. ఈ హృదయ సంభాషణకు తక్కువ ప్రాముఖ్యత ఉందనుకోవద్దు. బహుశా మౌఖికంగా పలికిన ఏడు శ్లోకాల కంటే ముఖ్యమేమో కూడా.
నా ప్రియతమ బాబూజీ మహరాజ్, నా ప్రభువు పట్ల పరమ పూజ్యభావంతో, కృతజ్ఞతతో నిండి ఉప్పొంగుతున్న హృదయంతో, ఈ ఏడు రత్నాలను, ఈ ఏడు శ్లోకాలను మీతో పంచుకుంటున్నాను.
శ్లోకం/రత్నం 1
प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ||2.55||
ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే.
తాత్పర్యం: పార్థా! మనసులోనుండి కోరికలన్నింటినీ పరిత్యజించినవాడు, ఆత్మ-సంతుష్టితో ఆత్మలో స్థిరపడినవాడు, తనదైన ప్రజ్ఞను స్థిరంగా ఉంచుకున్నవాడు,
అతడే స్థిత ప్రజ్ఞుడు.
శ్లోకం/రత్నం 2
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ||2.62||
ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూప జాయతే
సంగాత్సంజాయతే కామః కామా క్రోధోభిజాయతే.
తాత్పర్యం: ఇంద్రియసుఖాలను గురించే ఆలోచించేవాడు వాటికి ఆకర్షితుడవుతాడు;
ఆకర్షణతో కోరిక పుడుతుంది; కోరిక నుండి కోపం విడువడుతుంది.
శ్లోకం/రత్నం 3
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ||2.63||
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి.
తాత్పర్యం: కోపం గందరగోళ స్థితికి లేదా భ్రమకు లోను చేస్తుంది; దాని వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది; జ్ఞాపక శక్తి నశించడం వల్ల బుద్ధిని కోల్పోవడం జరుగుతుంది లేదా
బుద్ధి నాశనమవుతుంది. బుద్ధి నాశనమైనప్పుడు మనిషి అథోగతిపాలవుతాడు.
శ్లోకం/రత్నం 4
राग द्वेष वियुक्तैस्तु विषयान् इन्द्रियैः चरन ।
आत्म वशहैः विधेयात्मा प्रसादं अधिगछति ।।2:64||
రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైః చరన్
ఆత్మ వశైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్ఛతి.
తాత్పర్యం: మనసును నియంత్రించినవాడు రాగద్వేషాలకు అతీతమైనవాడు, ఇంద్రియ విషయాలను ఉపయోగించుకుంటూనే భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతాడు.
శ్లోకం/రత్నం 5
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ।।2:66।।
నాస్తి బుద్ధిరస్య న చాయుక్తస్య భావనా
న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్.
తాత్పర్యం: సామరస్యం లేకుండా మనిషికి విజ్ఞత ఉండదు. సామరస్యం లేకుండా ధ్యానం కూడా అసాధ్యం. ధ్యానం లేకుండా శాంతి లేదు. ఇక శాంతి లేని మనసు గలవాడికి సంతోషం ఎలా ఉంటుంది?
శ్లోకం/రత్నం 6
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।।3:35||
శ్రేయాంస్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావః
తాత్పర్యం: ఇతర ధర్మాన్ని పరిపూర్ణంగా అనుసరించడం కంటే సరిగ్గా చేయకపోయినా స్వధర్మాన్ని అనుసరించడమే మేలు. ఎందుకంటే పరధర్మం భయంతో కూడుకున్నది.
క్లుప్తంగా చెప్పాలంటే, బాబూజీ ఇలా అనేవారు: “నీ పని నువ్వు చెయ్యి చాలు”.
శ్లోకం/రత్నం 7
न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ।।3:04।।
న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సన్యసనాదేవ సిద్ధిం సమాధిగచ్ఛతి.
తాత్పర్యం: కర్మను చేయకుండా ఉండటం ద్వారా మనిషి ఆ కర్మ నుండి విముక్తి పొందలేడు. అలాగే కేవలం తాను సాధించిన వైరాగ్యం ద్వారా కూడా పరిపూర్ణతను పొందలేడు.
రహస్యం 1
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ||4:7||
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
తాత్పర్యం: ధర్మానికి హాని కలిగి, అధర్మం ప్రబలిన ప్రతి సారీ… ఓ అర్జునా, నేను ఈ భూమ్మీద అవతరిస్తూనే ఉంటాను.
రహస్యం 2
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ||4:8||
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
తాత్పర్యం: శిష్టులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ఈ భూమిపై మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటాను.
రహస్యం 3
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥18:66॥
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః
తాత్పర్యం: అన్ని ధర్మాలను విడిచిపెట్టి, నన్ను మాత్రమే శరణు వేడినట్లైతే, నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. భయపడకు.
కాబట్టి మిత్రులారా, అందరికీశుభం కలుగుగాక; ఈ జన్మాష్టమి వేడుకలను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీలో
కొంతమంది ఉపవాసం చేయగలరేమో చూడండి. శ్రీ కృష్ణుడు అర్జునుడితో పలికిన ఈ శ్లోకాల అర్థంపై ధ్యానించడానికి
ప్రయత్నించండి. వారిరువురి హృదయాల మధ్య జరిగిన హృదయ-సంభాషణకు తక్కువ ప్రాధాన్యత ఉందని కాదు దీని అర్థం. గీత
మొత్తంగా ఈనాటికీ ఇంతకు పూర్వం ఎప్పుడూ లేని విధంగా మన జీవితాలకు వర్తిస్తుంది; ఇది భవిష్యత్తరాల్లో కూడా ప్రయోజనం
పొందే విధంగా తరతరాల్లో తప్పక ప్రతిధ్వనిస్తుంది. ధన్యవాదాలు. ఈ సంప్రదాయాన్ని తరువాతి తరాలకు అందించండి. నమస్తే.