అందరికీ నమస్కారం! గత సాయంత్రం ఎంతో అద్భుతమైన, మైమరపించే ప్రదర్శనను మనం తిలకించాం. గొప్ప నైపుణ్యాత్మకమైన ప్రదర్శన! ఫ్లూట్ వాయిద్యపు కళా కోవిదుని గొప్ప ప్రదర్శన! చిన్న పిల్లవానిగా ఆయన ‘రాగ్ యమన్’ ఫ్లూట్ పై నేర్చుకున్నా, 50 సంవత్సరాల పైగా ఇప్పటికీ అదే రాగాన్ని సాధన చేస్తూనే ఉన్నారు. స్వరాలు కొన్నే అయినా సాధన ఎంతో. మనం ఆనంతం దిశగా ప్రయాణిస్తున్నాం. ఇక్కడ స్వరాలు అనంతం! ఆధ్యాత్మిక అన్వేషకుడు ప్రతిక్షణం ఇంకెంత సాధన చేయాల్సిన అవసరం ఉందో ఊహించండి.
పండిట్ జీ (శ్రీ హరిప్రసాద్ చౌరాసియా) అప్పుడప్పుడు సాధన చేస్తూ ఉండొచ్చు. ప్రఖ్యాత గాయకుడైన పండిట్ జస్ రాజ్ జీ కూడా అదే చెప్తుండేవారు. నేను వారిని పండిట్ జీ! మీరు మాకందరికీ ఇచ్చే సందేశం ఏమిటి? అన్నప్పుడు, పండిట్ జస్ రాజ్ రెండు విషయాలు చెప్పారు. ‘రియాజ్’ అంటే నిరంతర సాధన. అలాగే ‘పెద్దల పట్ల గౌరవం’. విచారకరమేమంటే, ఈ రోజుల్లో పెద్దలంటే గౌరవం పూర్తిగా మాయమైంది. వారి స్వంత కుటుంబ సభ్యులను కూడా గౌరవించట్లేదు. ఇక కొత్తవారి గురించి చెప్పేదేముంది.
గౌరవించే స్వభావం, పరస్పర విశ్వాసం,
ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండాలి. సోదరీమణులను స్వంత వారిగా భావించండి. వారిపై ఇంద్రియ లాలసత్వం లేకుండా,
తప్పుడు ఆలోచనలు లేకుండా ఉండండి. ఇదే నైతికత (Akhlaq). ఇదే మనకు కావలసింది. ఇదే మన హార్ట్ఫుల్నెస్ విధానంలో కీలకం. పరస్పర గౌరవం, ప్రేమ, మీ జీవితంలో ఎవరినీ తప్పుగా భావించకుండటం.
బ్రెజిల్ దేశపు వృద్ధుల గురించి నేనెప్పుడూ ఉదహరిస్తుంటాను. 75, 80 సంవత్సరాల వృద్ధులు అక్కడి వేల సంవత్సరాల ఆచార వ్యవహారాలను, వారి పూర్వీకుల నుంచి వారసత్వంగా నేర్చుకొని కొనసాగిస్తుంటారు. ఏ వైద్యం మెరుగైనది? ఏ మొక్క ఔషధంగా పనిచేస్తుంది? రుతువులకు అనుగుణంగా జీవనాన్ని ఎలా కొనసాగించాలి? ఇలా… ఇటువంటి విజ్ఞానం అమెజాన్ అటవీ జాతుల నుంచి మాయమైపోతోంది. అక్కడి యువత పెద్ద నగరాల వైపుకు వెళ్ళిపోతోంది. ఇక వాళ్ళు ఎలా వారి పూర్వీకుల విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు? వారి మధ్య బంధం విచ్ఛిన్నమవుతోంది.
చిన్నపిల్లల జీవితాల్లో తాతయ్య, అమ్మమ్మల పాత్ర ముఖ్యమైనది. విజ్ఞానం కన్నా ముఖ్యంగా వారు పిల్లలకు జీవితాన్నే నేర్పుతారు. సక్రమంగా ఎలా కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో, కొత్త విషయాలు నేర్చుకోవడం మన మనుగడలో కీలకం. ఇవన్నీ మనం పెద్దలనుండే నేర్చుకుంటాం. స్కూళ్లు, కాలేజీల నుంచి నేర్చుకోం. కేవలం మనల్ని ఉత్తేజపరిచే సమాచారం మాత్రమే స్కూళ్లు, కాలేజీలలో మనకు నేర్పబడుతుంది. అయితే అందులో తప్పేం లేదు. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిందే. కానీ పాతవి మర్చిపోవద్దు. మన ప్రాచీన ఆచారాల్ని వదిలి వేయకండి.
వినయం! ఈ మధ్యన ఎవరో అడిగారు, స్త్రీలలో ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఏమిటని? స్త్రీలనే కాదు, పురుషులలో కూడా ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం వినయమని నేను చెప్పాను. అందమైన వ్యక్తిలో కూడా అహంకారం ఉంటే, వారిలోని అందం అంతర్ధానమవుతుంది. అతను లేదా ఆమె రాకాసిలా కనపడతారు. వినయం మన వ్యక్తిత్వానికి శోభనిస్తుంది. భారతదేశపు ముగ్గురు అత్యున్నత స్త్రీమూర్తుల గురించి చెబుతూ స్వామీ వివేకానంద, ‘వారి వినయ వ్యక్తిత్వాల వల్లే, వారంతా గొప్పవారయ్యారు’ అనేవారు.
సీతామాత, గాంధారి, అలాగే ద్రౌపది… వారి సుగుణాలను మీరు గ్రహించాలి. భారతదేశంలో తరతరాలుగా వస్తున్న జ్ఞానసంపదను మనమిక్కడ ఒక పండుగలా జరుపుకుంటున్నాం. సహజమార్గీయులుగా, హృదయాన్ని అనుసరించేవారిగా, మనం దేని కోసం ఇక్కడ ఉన్నామనే దానిపై మనం ధ్యానం చేయాల్సి వుంది. మనకు లభించే సూక్ష్మ సందేశాన్ని మన జీవన శైలి ద్వారా పరిపుష్టం చేసుకోవాలి. వేదికలపై ఎంతో మాట్లాడవచ్చు గాక! కానీ మనం ఇచ్చే సందేశం, మన జీవన శైలి ద్వారా బలంగా ప్రకటితమైనప్పుడే, అప్పుడు మాత్రమే ప్రజలు మన పట్ల ఆకర్షితులౌతారు. ఇక్కడ నిజంగానే ఏదో ఉందని విశ్వసిస్తారు.
నిన్న మనందరం కలిసి కూర్చొని, వారి సంగీత కార్యక్రమంలో చూపిన క్రమశిక్షణ, నిజంగానే అసాధారణం. పండిట్ జీ ఇలా అన్నారు. “నేను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఇంతటి జనాభాను ఎక్కడా చూడలేదు. అలాగే ఇటువంటి వాతావరణాన్నీ చూడలేదు. దేవతలే కూర్చుని వింటున్నట్లుగా అనిపించింది. ఇదంతా అద్భుతం! అత్యద్భుతం!” అన్నారు. మన సంస్థకి వారిచ్చిన ప్రశంసలివి. మనకి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.
పూజ్య బాబూజీ మహరాజ్ చెప్పిన ఒక సరళమైన విషయం జ్ఞప్తికి వస్తోంది. “నేను శిష్యులను తయారు చేయను. మాస్టర్స్ నే తయారు చేస్తాను” అన్నారాయన. ఎంత గొప్పగా ఉంది! కాబట్టి మాస్టర్ వలనే తయారవ్వడానికి అందరి దగ్గర శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. అలా అవ్వడానికి మనకేం కావాలి? భండారాలో మీతో పంచుకున్న సందేశపు బుక్ లెట్ దాని గురించే. జీవితంపై ఆధిపత్యం పొందడం కోసమే. అందరూ చదవండి.
అలాగే మీ అంతరంగంలో ఏది అలా జరగనీయకుండా ఆపుతోందో దయచేసి గమనించండి. మిమ్మల్ని అందులో సమైక్యపరచుకోవడంపై దృష్టి పెట్టండి. ఒక్కటే మనల్ని లోపలి నుంచి సమైక్య పరచగలదు. అది మనం చేసే సాధన! అది లేకుండా మనకి ఏదీ సాధ్యపడదు. ఆ అత్యద్భుత విద్వాంసుడు పండిట్ జీ ప్రతి రోజూ సాధన చేస్తారు. మరొక గాత్ర విద్వాంసుడు, పండిట్ జస్ రాజ్ రియాజ్ (నిరంతర సాధన) ప్రాముఖ్యత గురించి నాతో చెప్పారు. బాబూజీ కూడా సాధన గురించి ఎంతో చెప్పారు. సాధన… కేవలం సాధన మాత్రమే! అయితే సరైన దృక్పథంతో/వైఖరితో చేసే సాధన మాత్రమే. మనం తరచుగా భక్తి గురించి మాట్లాడుకుంటాం. భక్తి లేకుండా, మన హార్ట్ఫుల్నెస్ లో హృదయం లేకుండా మనకేదీ లభించదు.
శ్రీ రామకృష్ణ పరమహంస భక్తి గురించే మాట్లాడేవారు. వారు వివేకం గురించీ చెప్పేవారు. యోగాలో వివేకం అనేది ప్రాథమిక అంశం. యుక్తాయుక్త విచక్షణే వివేకం. ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే విచక్షణ. ‘వారు ప్రేమించే అందర్నీ ప్రేమించమని’ చారీజీ మహరాజ్ అన్నప్పుడు, మనం ఆలోచిస్తాం. ఇతను నాకు ఎంతో మంచి చేశాడు… అతను నాకు చాలా చెడు చేశాడు… నేను ఇతన్ని ప్రేమిస్తాను… అతన్ని తక్కువ ప్రేమిస్తా లేదా పూర్తిగా ద్వేషిస్తాను. ఈ విధంగా విచక్షణ మనలో ప్రవేశిస్తుంది. ‘వారు ప్రేమించే అందరినీ ప్రేమించమనే’ సందేశం మాత్రం అలాగే మిగిలిపోతుంది. వారు ఎవరిని ప్రేమించరు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు కదా! అంటే మరి నేనూ అందరిని ప్రేమించాలి కదా! అయితే మన విచక్షణ అందరిని ప్రేమించలేనంటుంది. ‘అందరూ ప్రేమించే వారిని ప్రేమించు’ అలాగే ‘వారు ప్రేమించే అందరినీ ప్రేమించు’ అనే ఈ రెండు ప్రకటనలు ఒకదాన్ని మరొకటి పూరించేవే.
భక్తి, ప్రేమకు పరాకాష్ట. అదొక బహిర్గతమైన స్థితి. ప్రేమ కూడా ఎలాగైతే, ఒక ప్రక్రియలా కాకుండా ఒక స్థితి వంటిదో, అలాగే భక్తి కూడా మనం చేరుకునే ఒక స్థితి. వివేకం అనేది ఒక ప్రక్రియ… విధానం. అది ప్రారంభం! పరవాలేదు… మనం మొదలెడదాం. కొత్తల్లో ఒకరిని ఇష్టపడతాం. వేరొకరిని ద్వేషిస్తాం. అదంతా సహజం. అయితే మన లక్ష్యం స్థిరంగా ఉండాలి. భగవంతునిపై ప్రేమతో మొదలు పెట్టండి. అలాగే మన ఈ ప్రయాణం మనల్ని ఎలా ముందుకు నడుపుతుందో చూడండి. ప్రేమ పరిపుష్టమై భక్తి లోకి ఎలా మారుతుందో చూడండి. అప్పుడు ప్రతిదీ ప్రేమగా మారిపోతుంది. అప్పుడు మనం వారిని అందరిలో దర్శిస్తాం. అందరిలో అనుభూతి చెందుతాం. సహజమార్గంలో బోధించేదీ, అత్యున్నతమైనదీ ఇదే! అందుకే… ఐకమత్యం ముఖ్యమే కానీ, మనం దాన్ని బలవంతంగా రుద్దలేం! అది నా సాధనా ఫలితం కావాలి. దీన్ని విస్మరిస్తే, మీలో సాధన తగ్గిందని, అవగాహన లోపించిందని, సరైన ఆలోచన, జీవితంలో నిజాయితీ కొరవడ్డాయని కచ్చితంగా అనుకోవచ్చు.
సరే! రానున్న భండారాను మనం వేడుకగా జరుపుకుందాం. జ్ఞానవారధుల ఉత్సవంగా చేసుకుందాం. అదే సమయంలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం. మన పిల్లలను మరింత బాగా ఎలా పెంచాలనే దానిపై నాకు వచ్చిన ఆలోచనలను, 9 నియమాల రూపంలో ఒక పుస్తకంగా పొందుపరిచాను. దీన్ని పెంగ్విన్ ఇండియా సంస్థ పబ్లిష్ చేస్తారు. నేను చెప్పినట్లుగా ఈ పుస్తకం కుటుంబాలకు, తర్వాతి తరాలను తయారు చేయడంలో ఒక రెఫరెన్స్ బుక్ గా ఉపయోగపడుతుంది. అది పెద్దలకూ, మన పిల్లలకూ మార్గదర్శకత్వంలో ఉపయోగపడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఎక్కువగా చెప్పడానికేమీ లేదు. మీరంతా రావడం నాకెంతో సంతోషాన్ని కలగజేసింది. ముఖ్యంగా ఈసారి… ఎందుకంటే అంతరంగ బహిరంగ వాతావరణం సామరస్యంతో ఒకే భావాన్ని ఒకే నాదాన్ని పలికిస్తున్నాయి. అటువంటి బహుమతిని ప్రసాదించినందుకు మన దివ్య గురుదేవులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉందాం. అందరికీ ధన్యవాదాలు.