Pujya Daaji’s talk on 8/3/2019
జీవితంలో మనం చేసుకొనే ఎంపికల గురించి నేను నిన్నటి నుండి ఆలోచిస్తూ ఉన్నాను. మన స్వీయ ఎంపికలు తరచుగా మనలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి. మనం చేసుకొనే ఉత్తమ ఎంపికలు, పెద్ద, పెద్ద విషయాలు మన జీవితంలో మార్పుకు దోహదం చేస్తాయని మనం భావిస్తూ ఉంటాము. అయితే మనం తీసుకొనే చిన్న నిర్ణయాలే, చిన్న విషయాలే మార్పుకు దోహదం చేస్తూ ఉంటాయి. సందర్భం ఏదయినప్పటికీ, ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే మనం మూడు రకాల పరిస్థితులలో చిక్కుకొని ఉంటాము. స్థూలత ను కలిగి ఉండడం లేదా ఉన్నత ప్రకంపనలు కలిగి ఉండడం లేదా ఏమి చేయకుండా నిరామయం గా ఉండి పోవడం.
అయితే ప్రకృతిలో నిరామయం అనేది ఉండదు. ఉన్నత స్థితికి చేరుకోవడం లేదా క్రిందికి దిగజారడం ఉంటుంది. కానీ నిరామయ స్థితి అనేది ఉండదు. ప్రయత్నం తోనే ఏదైనా సాధ్యం అవుతుంది. పరిణామం చెందాలంటే ఒక ఉదాత్తమయిన ప్రేరణ అవసరం. మనం మారాలి, మనలను రూపాంతరం చేసుకోవాలి అనే తపన కనుక మనలో లేకపోయినట్లైతే, పరివర్తన కోసం మనం కృషి చేయడం లేదని అర్థం.
బాహ్య ప్రయత్నం లేదా అంతర్గత ప్రేరణ లేనప్పుడు వ్యక్తి ఎప్పుడూ క్రిందికే దిగజారుతాడు. అంటే జడోష్ణత. అసలీ జడోష్ణత అంటే ఏమిటి? వ్యవస్థలో దేనినైనా కానీ, అలా నిరుపయోగంగా వదలి వేస్తే, అది క్షయానికి గురి అవుతుంది. అంటే క్రుళ్ళిపోతుంది. మన శరీర వ్యవస్థ కూడా అంతే. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, భావోద్వేగ పరంగా కానీ, లేదా ఆధ్యాత్మికంగా కానీ సద్వినియోగం చేసుకోకపోతే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది.
అందుకే శారీరక స్వస్థత కోసం వ్యాయామం చేస్తాం. మానసిక పరిపక్వత కోసం ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా కూడా మన వంతు కృషి చేస్తూ ఉన్నాం. మనలో ఎక్కువ మందిమి చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికోన్నతికి మన చేసే ఈ కృషి సరిపోదు. ధ్యానం చేయని సమయాలలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ సమయాన్ని ఎలా గడుపుతూ ఉన్నాం?
ధ్యానించని క్షణాలు కూడా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. ఆ ఉన్నత అస్తిత్వం యొక్క సూక్ష్మ తరంగ స్థాయికి మనం ఎలా చేరుకోవాలి? మనలను మనం చక్కగా తీర్చి దిద్దుకొని, మునుపటి స్థితి లేదా మునుపటి క్షణం కంటే మరింత సూక్ష్మ స్థితికి చేరుకో గలిగితే మనం అత్యంత నిర్మల స్థితికి చేరుకుంటాము. “నేను మారాలి” అనే తపనను కలిగి ఉండడం ముఖ్యం.
ఆ ఉన్నత అస్తిత్వం తో సరితూగే ప్రకంపనా స్థితికి చేరుకోవాలి. ఆ పరిణామ క్షణాలను ఆస్వాదించ గలగాలి. స్వీయ పరిణామాన్ని భారంగా భావిస్తే మాత్రం మిగిలేది శూన్యమే. జీవితం లోని ప్రతీక్షణం నుండి ప్రయోజనం పొందండి. మాస్టర్ చైతన్యంతో కనెక్ట్ అవ్వండి.
సరళ భాషలో బాబూజీ దీన్నే నిరంతర స్మరణ అనేవారు. నిరంతర స్మరణ లో మునిగి ఉండండి. మీ చైతన్య స్థితిగతులను పరికించండి. అంటే ఇది చాలా సులభమైన విషయం.
ధ్యాన సమయం లో మనం పొందే ఆ స్థితిని ఆస్వాదించండి. రోజువారీ జీవనం లో మరింత నమ్రత తో వ్యవహరించండి. అంతే!! సాధ్యమైనంత వరకు ఏమీ చేయకుండా నిరామయంగా మాత్రం ఉండకండి.
ఉదయం మనం ఏ స్థితినయితే పొందుతామో, ఆ స్థితిని మరింత విస్తరింప చేసుకోండి. మరింత మెరుగు పరుచుకోండి. ఆ స్థితి మెరుగు చెందుతున్న కొద్దీ మనం మరింతగా కేంద్రీకృతం చెందగలుగుతాం. ప్రస్తుతానికి నేను మీతో పంచుకోవాలని భావించింది ఇంతే! ధన్యవాదాలు.