జూన్ 21 – ప్రేరణ పొందండి (మొదటి భాగం)
అలవాట్ల నిర్మూలన, సృష్టి
పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగ పద్ధతి, ఇప్పటి శాస్త్రీయ, ఆధ్యాత్మిక సాధనల ఆధారంగా అలవాట్లను మరింతగా మెరుగుపరచుకునే విధానాలను దాజీ మనకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చివరి యమ అయిన ‘అపరిగ్రహ’, అంటే స్వాధీనతా వైఖరి, అనురాగం, దురాశ, సంపదలపైన దృష్టి లేకుండా ఉండడం మీద దృష్టి సారిస్తున్నారు.
అతి స్వల్ప వినియోగం (మినిమలిజం) : సుస్థిర నిర్వహణ (సస్టయినబిలిటీ)
గతించిన కొన్ని దశాబ్దాలలో యథేచ్ఛగా విహరించే తత్వానికీ, సుఖాసక్తి వాదానికి దూరంగా జరిగే ఉద్యమం మనిషిని నిశ్శబ్దంగా సరళత, అతి తక్కువగా వినియోగించే వైఖరి, చాలా కాలం మనగలిగే జీవన శైలి దిశగా కొనిపోతూ, అయిదు అంశాల చుట్టూ పరిభ్రమిస్తున్నది.
ఆ అయిదు అంశాలు – వదలివేయడం (రెఫ్యూజ్), తగ్గించుకోవడం (రెడ్యూస్), తిరిగివాడుకోవడం (రీయూజ్), మరో ప్రయోజనానికి వీలు కల్పించడం (రీపర్పస్), పునర్వినియోగానికి వీలు కల్పించడం (రీసైకిల్).
దీనిని మనం ఇండ్ల నిర్మాణంలోనూ, భవన నిర్మాణ శాస్త్రంలోనూ, ఇంటి లోపల సుందరీకరణలోనూ చూడవచ్చు. ఉదాహరణకు చాలా శ్రవణ-దృశ్య మాధ్యమాలలో సహజసిధ్ధంగా లభించే వస్తువులతో, పునర్వినియోగానికి తీసుకువచ్చిన సామాగ్రితో చిన్న ఇళ్ళలో నివసించడం ఎలాగో చూపిస్తున్నారు.
‘ద లైఫ్ చేంజింగ్ మ్యాజిక్ ఆఫ్ టైడీయింగ్ అప్’ అనే మేరీకొండో పుస్తకం మనలను అద్భుతానికి గురిచేసి ఆశ్చర్యపరచింది. టైడీయింగ్ అప్ అనే టెలివిజన్ ప్రోగ్రామ్ మనకు ఎన్నో సవాళ్ళు విసిరింది. ఇది ఇంటిని శుభ్ర పరుచుకోడం, గృహశోభ, గృహాలంకరణకు సంబంధించినది. ఇంటికి అవసరమైన వస్తువులే కొనుక్కోవాలనీ, మనకు ఆనందాన్నిచ్చే వాటినే ఎంచుకోమనీ, మనం జీవనం కొనసాగిస్తున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని ఇది ప్రేరేపించింది.
బాగా అభివృధ్ధి చెందిన సమాజాలలో స్థూలకాయం ఒక మహమ్మారిగా మారిన కారణంగా మనం ఇదే తీరును ఆహారం, తిండి విషయంలోనూ గమనిస్తున్నాం. అతితక్కువ వినియోగం వైపు మొగ్గు చూపిస్తున్నాం.
సామాన్యంగా గమనిస్తే, ( ఒక విధంగా మనం నా ప్రథమ గురుదేవులైన) బాబూజీ గారు చెప్పినట్లు “తక్కువ, తక్కువ దిశగా ఎక్కువ, ఎక్కువగా” కదలుతున్నట్లు గమనిస్తాం.
మనకు అవసరమైనంత మాత్రమే స్వీకరించి, వినియోగించడమన్నది మన యోగిపుంగవుల పరంపర తమ జీవితంలోని అన్ని క్షేత్రాలలో అనాదిగా అనుసరించిన సూత్రమే. యౌగిక పరిభాషలో దీనినే ‘అపరిగ్రహ’ అంటారు. ఇదే ఐదవది, చివరిది అయిన యమము.
వాతావరణ మార్పులు, పర్యావరణ వినాశనం, జీవజాతులు అత్యధిక సంఖ్యలో అంతరించిపోవడం, వివిధ సామాజిక, సాంస్కృతిక రంగాలకు చెందిన (జనులలో) మనుష్యుల్లో విస్తారమైన అసమానతలు వంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్న మానవాళికి ఇప్పుడు ఇది అత్యావశ్యకం.
అపరిగ్రహ
మిగిలిన నాలుగు ‘యమ’లు, అంటే ప్రేమ, సత్యసంధత, నిజాయితీ, బ్రహ్మచర్యం చివరకు ‘అపరిగ్రహ’కు దారితీస్తాయి.
అన్ని మత, తాత్విక సాంప్రదాయాలలోనూ, అన్ని సంస్కృతులలోనూ ఈ ముఖ్యమైన సూత్రం అంతర్లీనంగా ఉంటుంది. ఎన్నో శతాబ్దాలుగా చాలామంది సత్యాన్వేషకులు తమ సంపదలను త్యజించి సన్యాస జీవనాన్ని అవలంబించారు.
గత 50 సంవత్సరాల కాలంలో చాలామంది ఆడంబరమైన జీవన శైలినుండి తప్పుకున్నారు, తీవ్రమైన పోటీతో కూడిన మనుగడను వద్దనుకున్నారు. తమ జీవన విధానాన్ని సరళీకరించుకున్నారు. ఆధునిక పట్టణీకరణకు చెందిన వాడిపారవేసే సంస్కృతిని తిరస్కరించారు కూడా. ఇటువంటి ఎంపికలు మనకు ‘అపరిగ్రహాన్ని’ గురించి ఒక అవగాహన కల్పిస్తాయి, కేవలం వస్తు సంపదను త్యజించడం వల్ల ఈ యమం పాటించినట్లు అవదు.
ఈ లోకంలో నివసిస్తూ సంపదలు మన స్వాధీనంలో ఉన్నప్పటికీ, అవి ఉన్నా లేకపోయినా కూడా మనలను బాధించని విధంగా వాటిపట్ల ఎటువంటి అనుబంధంలేని వైఖరితో జీవించగలగాలి.
సంస్కృత భాషలో అపరిగ్రహ అనే పదంలో మూడు భాగాలున్నాయి. ‘అ’ లేనితనాన్ని సూచిస్తుంది, పరి అంటే అన్నివైపులా, గ్రహ అంటే లాక్కోవడం, స్వీకరించడం. ‘పరిగ్రహ’ అనే పదానికి ఇది వ్యతిరేకమైనది.
‘అపరిగ్రహ’ అంటే తీసుకొనే తత్వాన్ని మించిన ఉన్నతమైన వైఖరి, జీవితంలోని ఏ స్థాయిలోనైనా నిజంగా అవసరమైనంత వరకే స్వీకరించడం.
అపరిగ్రహ విజయవంతం అవాలంటే, స్వీయ నిగ్రహం పాటించడం, ఇతరుల వస్తువులపై దురాశను, అతిలాలసత్వాన్ని వదిలించుకోవడం, వినాశనానికి హేతువైన అత్యాశ, స్వాధీనం చేసుకొనే వైఖరులను తొలగించుకోవడం అవశ్యకం అవుతాయి.
ఈ సూత్రానికి మరొక నిర్వచనం, నీవు పొందినదానికంటే ఎక్కువగా ఇవ్వు అని కూడా చెప్పుకోవచ్చు. ఇదొక విధంగా కొరతను విడిచిపెట్టి సమృద్ధి చైతన్యంతో జీవించడం అన్నమాట.