ధరిత్రి ఎప్పుడూ ఉంది, ఉంటుంది

ఒక కప్ప కథ

ఒక ఇల్లాలు వంట చేసే ప్రయత్నంలో ఒక గిన్నె నిండా నీళ్ళు పోసి పోయ్యి  మీదకి ఎక్కించింది.ఇంతట్లో ఎక్కడినుంచి   వచ్చిందో ఒక కప్ప ఆ కాగుతున్న నీళ్ళలో వచ్చి పడింది. బయటేమో బాగా చలిగా ఉండడం వలన కామోసు ఆ కప్పకి ఆ నీళ్ళల్లో హాయిగా అనిపించింది. ఎదురుచూడని  ఈ సుఖాన్ని కప్ప బాగా ఆస్వాదిస్తోంది. కానీ క్రమ క్రమంగా నీటి ఉష్ణోగ్రత పెరుగుతోంది. అయినా కప్ప మాత్రం ఎటువంటి ప్రమాదాన్ని శంకించలేదు. అలాగే ఆ వేడి నీళ్ళల్లోఈదుకుంటూ ఆనందిస్తోంది .  ఎప్పుడైతే నీళ్ళు  మరిగే స్థాయికి వచ్చాయో దానికి అలారం మోగింది. ఇంకా ఈ నీళ్ళల్లో కొంచెం సేపు ఉంటె తనకి చావు ఖాయం అని అర్ధం చేసుకుని బయటికి దూకి ప్రాణాలు రక్షించు కుంటుంది. సంగ్రహంగా ఇదీ  కప్ప కథ.

ఈ కథకి నేను చెప్పబోయే అంశానికి ఏమిటి సంబంధం అని మీకు సందేహం రావచ్చు. విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న జీవరాశుల పరిస్థితి కాగుతున్న వేడి నీళ్ళ లోని ఆ కప్ప పరిస్థితి లాగానే ఉంది. ఎలా అంటారా అయితే వినండి. గత కొన్ని సంవత్సరాలుగా భూ తాపం పెరుగుతోంది. ఒక్కొక్క వేసవికి పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు చూస్తె ఈ విషయం మనకి తెలుస్తుంది. దీనికి కారణం మనమే. అభివృద్ది పేరుతొ అడవుల్ని నరికేస్తున్నాం. భూగర్భ జలాల్ని తోడేస్తున్నాం. మనం నడిపే పరిశ్రమలు సృష్టించే కాలుష్యం, వేడిమి, దీనికి  తోడవుతున్నాయి.

ఇప్పుడు మళ్ళీ మనం కప్ప దగ్గరికి వద్దాం. కప్ప తెలివయినది కాబట్టి సరైన టైం లో బయటకి దూకి బతికి పోయింది. కానీ మనకి ఆ అవకాశం లేదు. మనం దూకడానికి వేరే ప్రదేశం లేదు. భూతాపం పెరుగుతున్న మాట వాస్తవమే అయినా అది అంత భయంకరంగా పెరుగుతోందా అని మీకు అనుమానం రావచ్చు. అయితే, అది ఎంత వేగంగా ఏ పరిమాణంలో పెరుగుతోందో తెలుసుకోవాలంటే  ఇది వినండి. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా వారు జపాన్ మీద వేసిన ఆటం బాంబు జ్ఞాపకం ఉంది కదా, అలాంటి బాంబులు సెకనుకి ఒకటి చొప్పున గత 150 సంవత్సరాలుగా సముద్రంలో వేస్తె దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించండి. ఇప్పుడు పెరుగుతున్న తాపం దానితో సమానం అని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు.

మరి మనం ఈ దారుణ పరిస్థితి లో నుంచి బయటపడే మార్గమే లేదా అంటే – ఉంది. కాలుష్య కారక పరిశ్రమలని మూసేయడం ,అడవుల్ని నరకకుండా చట్టాలు తేవడం ద్వారా దీన్ని అరికట్ట వచ్చు. కానీ అది సాధ్యమయ్యే పనేనా? అది  మన చేతుల్లో లేని విషయం. దేశాలనేలే రాజకేయ నాయకులు తలుచుకుంటేనే అది వీలవుతుంది. అందుకని దీని నివారణకి  వ్యక్తిగతంగా మనం చేయగలిగినది ఏదైనా ఉంటె అది చెయ్యడమే దీనికి పరిష్కారం.. ఎందుకంటే వ్యక్తి స్థాయిలో చైతన్యము వచ్చినపుడే సమాజం స్థాయిలో లేదా ఒక దేశం స్థాయిలో మార్పు రావడానికి అవకాశం ఉంది.

హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజీ దీనికి కొన్ని సూచనలు చేశారు. వాస్తవానికి వాటిని  సూచనలు అనడం కంటే, ఆయన స్వీయ పర్యవేక్షణలో కాన్హా శాంతివనం సృష్టించిన అనుభవంతో చెప్పిన మాటలు అనడం సబబుగా ఉంటుంది.  హైదరాబాదు నగరం సమీపంలో కాన్హా శాంతివనం నెలకొల్పాలని ఆయన సంకల్పం చేసినపుడు  ఆయనకి లభించిన భూమి దాదాపు ఎండిపోయిన బీడు భూమి  లాంటింది. ఈరోజు అది పచ్చదనంతో నవనవలాడుతూ  కొన్ని వందల పక్షి జాతులకు ఆశ్రయ మిస్తూ జీవ వైవిధ్యానికే ఒక ఆదర్శం అనిపించే విధంగా ఎన్నో వృక్షజాతులకు ఆలవాలంగా వెలుగొందుతున్న  ఒక నందన వనం అని చెప్పవచ్చు. అయితే ఆ పరివర్తన వెనుక వజ్ర సంకల్పం, కఠోర పరిశ్రమ,  అన్నిటినీ మించి పరిశుద్ధమైన హృదయాల తోడ్పాటు ఉన్నాయి.

దాజీ ఏమంటారంటే, పారిశ్రామిక కాలుష్యం గురించి ఆలోచించడాని కంటే  ముందు అంతకంటే లోతైన సమస్య – అదే మానవుల ఆలోచనలనుంచి జనించే కాలుష్యం గురించి మనం పట్టించుకోవాలి. ఎందుకంటే చాలా సమస్యలకి మూలం అదే కాబట్టి.

మరి ఈ భావ కాలుష్యాన్ని అరికట్టే మార్గాలు ఏమిటి? ఇవి మనకి  పతంజలి మహర్షి రచించిన అష్టాంగయోగంలో లభిస్తాయి అంటారు దాజీ.

అష్టాంగా యోగా లోని మొదటి అంగం ‘ యమ”. ఈ యమ అనే దాన్ని మనం చిత్త శుద్ధితో ఆచరిస్తే, దానిలో అంతర్భాగం అయిన 4 మంచి ధోరణులు మనకి అలవడతాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఆ నాలుగు ధోరణులు ఏమిటంటే, చిత్తశుద్ది , నిజాయితీ, మితత్వం, అపరిగ్రహం.

చిత్తశుద్ది, నిజాయితీ ఉంటె పరిశ్రమల యాజమాన్యం చట్టాలను అతిక్రమిస్తూ కాలుష్యానికి కారకులవుతారా?

మితత్వం విషయానికొస్తే, అది ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు..ప్రజలు తమ అవసరాలకు మించి వస్తువుల్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని నియంత్రించ గలిగితే మనం విలువైన వనరుల్నికాపాడుకోవచ్చు. తద్వారా కుటుంబాలు ఎంతో ధనాన్ని ఆదా చెయ్యడమే కాక ఈ భూమి మనకి అందించే వనరుల్ని సంరక్షించుకోవచ్చు. అగ్ర రాజ్యాలు తమ అవసరాలకుమించి వస్తువుల్ని ఔషదాలనీ నిలవ చెయ్యడం వలన అవి నిజంగా అవసరమైన పేద దేశ ప్రజలకు అందడం లేదు.

మన ఆలోచనల్ని స్వచ్చంగా ఉంచాలంటే దానికి ధ్యానం ఒక  మంచి మార్గం. దాని ద్వారా పైన చెప్పిన యమ లోని సూత్రాల్ని పాటించగల సామర్ధ్యం కూడా మనలో వస్తుంది. మనుషులే కాక పశు పక్ష్యాదులు, ఇతర జీవరాశులు మన లాగే ఈ భూమి అందించే వనరులపై అధికారం కలిగి ఉన్నాయనే స్పృహ ఏర్పడుతుంది.

కాన్హా శాంతివనంలో అటువంటి ఒక ఆదర్శ వాతావరణం నెలకొని ఉంది. వర్షాలు పడడం ఆలశ్యం అయి చెట్లు అన్నీ ఎండిపోతాయేమో అని భయ పడుతున్న సమయంలో అక్కడకు వచ్చిన ప్రతి అభ్యాసీ తనతో తెచ్చుకున్న త్రాగు నీటిని మొక్కలకి అందించి వాటిని కాపాడారంటే నమ్మగలరా? కానీ అది నిజం.

మన ధరిత్రీ మాతను కాపాడుకునేందుకు మనం చేయ గలిగిన కొన్ని చిన్న మంచి పనులు:

  • ఆన్ లైన్లో వస్తువులు కొనేటప్పుడు అన్నీ ఒకేసారి కొనండి. అలా చేయడం వలన పాకింగ్ కి ఉపయోగించే పదార్ధాల వాడకం తగ్గుతుంది.
  • ప్రయాణాల్లో మంచి నీళ్ళ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ సీసాల వాడకం తగ్గించండి.
  • స్నానానికి మితంగా నీళ్ళు వాడడం, అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పడం అలవాటు చేసుకోండి.
  • ఇవన్నీ పిల్లలికి చిన్నప్పటినుంచీ నేర్పించండి.
  • ధ్యానం చెయ్యండి .మనస్సు పరిశుద్ధంగా ఉంచుకోండి.

అలా చేస్తే మనం కూడా కప్ప లాగా సరైన సమయంలో మేల్కొని బ్రతికి బయట పడతాం.

Share this post