ఆటోమేటిజం
గౌరవనీయులైన పెద్దలు, ప్రియాతి ప్రియమైన సోదరీ సోదరులారా! నిన్న చెప్పబడిన విషయం మనలో చాలామందికి నిరుత్సాహం కలిగించేదిగా అనిపించింది. చాలాకాలం నుండి మనం సాధన చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ యోగపురుషులు, యోగీందర్, శ్రీకృష్ణ భగవాన్ తో అనుబంధం కూడా ఏర్పడలేదు. కేంద్ర మండలాన్ని చేరుకోవాలని చాలామంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు, పొందుతున్నారు కూడా.
కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, యోగీశ్వరునితో అక్కడ సంబంధం ఏర్పడాలి. ఆ రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన చెప్పారు. మనకు ధ్యాస కుదిరినా, కుదరకపోయినా ఒక ఖచ్చితమైన సమయంలో ఉదయం ఒక గంట సేపు క్రమం తప్పకుండా ధ్యానానికి కూర్చోవాలి. మీరు 6 గంటలకు కూర్చోవాలి అనుకుంటే 6 గంటలకే కూర్చోండి. ఒక రకమైన క్రమశిక్షణ ఏర్పడుతుంది. 6:05 లేదా 5:55 అన్నా కూడా కుదరదు. ఆరు అనుకుంటే, సరిగ్గా ఆరు గంటలకే. ఒక గంట సేపు, ధ్యాస కుదిరినా కుదరకపోయినా అలవాటు చేసుకోండి. ఒక సంవత్సరంలో ఏం జరుగుతుందో చూడండి.
తర్వాత అలా అలా ముందుకు సాగుతున్న కొలదీ, ఉన్నతమైన అధి చైతన్యం ఆ ప్రత్యేకమైన సమయంలో క్రిందికి దిగనారంభిస్తుంది. బాబూజీ మహరాజ్ పదేపదే చెబుతున్నటువంటి రెండు విషయాలు గురించి మీలో చాలామందికి పూర్తి అవగాహన ఉంది. మన వ్యవస్థలో ఒక జీవ గడియారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే మన వ్యవస్థకు ప్రత్యేకమైన సమయంలో, ఒక ప్రత్యేకమైన పని చేయడానికి శిక్షణ ఇవ్వడం. దానిలో మార్పులు ఉండకూడదు.
రెండో విషయం, ఆటోమేటిజం. ఒక ఉన్నతస్థాయి ఆటోమాటిజం మన వ్యవస్థలో ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్వతహాగానే మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ధ్యానంలోకి దూకి, అధి చైతన్యాన్ని స్పర్శించడం. సంకల్ప మాత్రాన మీరు ఆ పని చేయగలగాలి. దాన్ని అలవర్చుకోవడానికి సహజమార్గంలోని మొదటి నియమాన్ని అనుసరించాలి. నిర్ణీత సమయంలో, ముఖ్యంగా, సూర్యోదయానికి ముందు ధ్యానం చేయాలి.
సూర్యోదయం గురించి బాబూజీ ఎందుకు చెప్పారు? ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు. నదీ ప్రవాహంతో పాటు ఈదడం సులభం. దానికి ఎదురుగా ఈదడానికి ప్రయత్నిస్తే మనం తొందరగా అలసిపోతాం. ప్రవాహానికి ఎదురుగా ఈదితే ఆ ప్రవాహం మనకు సహకరించదు. సర్కేడియన్ రిథమ్… ఈ నాసికా రంధ్రం గుండా లేదా ఆ నాసికా రంధ్రం గుండా జరిగే మన ఉచ్ఛ్వాస, నిశ్వాసలు సూర్య, చంద్ర గమనాలతో చక్కగా క్రమ పరచబడి ఉంటాయి.
రాత్రి సమయంలో, సూర్యనాడి/కుడి నాసిక ప్రధానంగా పనిచేస్తున్నపుడు మనం శక్తిని విడుదల చేస్తాం. చంద్రనాడి లేదా ఎడమ నాసిక ప్రబలంగా ఉన్నప్పుడు మనం శక్తిని గ్రహిస్తాం. తెల్లవారుజామున, సూర్యోదయానికి ముందు, చంద్రనాడి చురుకుగా ఉంటుంది. కాస్మిక్ శక్తి ప్రవాహం మన వ్యవస్థ లోకి ప్రవేశిస్తుంది. దానితోపాటు ప్రాణాహుతి, తపించే హృదయంలోకి దూసుకుని వస్తుంది. ఆ ప్రవాహమే తీవ్రతరమవుతుంది. దానిలో ఉన్న తర్కం ఇది. అదేవిధంగా సూర్యాస్తమయానికి ముందు సూర్యనాడి చురుకుగా ఉండి, శక్తి బయటకు ప్రవహిస్తుంది.
ఆ సమయంలో మనం చేసుకునే నిర్మాలీకరణ ప్రక్రియ ద్వారా మనలోని మలినాలు, పొగ/ఆవిరి రూపంలో మన వెనుక భాగం నుండి బయటకు వదిలించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రవాహంతో పొగ కూడా కలసి వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. అదే మీరు రాత్రి పొద్దుపోయిన తర్వాత నిర్మలీకరణకు కూర్చుంటే, అది మీ నిద్రా సమయం అవ్వడం వల్ల తరచుగా మీ చైతన్యం అందుకు సహకరించదు. కాబట్టి దయచేసి దీనిని దృష్టిలో ఉంచుకోండి. చెప్పిన విధంగా సాధన చేయడం ఎంతో ముఖ్యం. ఒకసారి 5:30 కి, లేదా 7:30 కి, ఒక్కోసారి అసలు చెయ్యకుండా, మరోసారి 12 గంటలకు ఇలా చేసినా, ప్రాణాహుతి మనకు అందుతుంది. అయితే, అందులో ఖచ్చితత్వం/పరిపూర్ణత్వం లోపిస్తుంది. చిన్న చిన్న పనులలో కూడా ఖచ్చితత్వం ఉండాలని బాబూజీ అనేవారు. లేకపోతే జీవితాంతం అసంతృప్తే ఉంటుంది.
పళ్ళు తోముకోవడం, ముఖం కడగడం, స్నానం చేయడం, ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేయడం, బ్రేక్ ఫాస్ట్ తయారుచేయడం, తినడం, గిన్నెలు శుభ్రం చేసుకోవడం అన్నింటిలో ఖచ్చితత్వం, మెరుగ్గా పని చేయగలగాలి. ఇలా చిన్న చిన్న పనులలోనే మెరుగు పడనినాడు, మనం మాట్లాడుకునే ఆధ్యాత్మిక స్థితులను పొందడం, వాటికి అంటి పెట్టుకోవడం, అలాగే జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది.
తయారయ్యే స్థితి నుంచి ఆ స్థితిని స్థిరంగా నిలబెట్టుకునే దాకా మీరు సాధన చేస్తూ అనుభవాలు పొందుతారు, అలాగే ఆ అనుభవాల పట్ల విసుగు చెందుతారు కూడా. అనునిత్యం జరిగే ఎన్నో అనుభవాల పట్ల మనం అలసిపోయి, ఫలితంగా ఏదో ఒక రోజు నేను ఫలానా విధంగా తయారవ్వాలని తీర్మానం చేసుకుంటాం. అలా తయారైన తర్వాత, అప్రయత్నంగా అలాగే స్థిరంగా నిలబడగలగాలి. అయితే, దీనిని సాధించడానికి మన ప్రారంభమనేది ఒక ‘పద్ధతి’ తో మొదలవ్వాలి.
కాబట్టి చెప్పిన విధంగా సాధన చేయండి. తరువాత కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే… మనం స్కూల్లో, కాలేజీలో చదివే రోజుల్లో నిరంతరం చదవనప్పుడు సరిగా పరీక్షలకు ప్రిపేర్ అవ్వనప్పుడు ఉద్విగ్నత, భయం వేస్తాయి. కొంతమంది సబ్జెక్టులో ఫెయిల్ అవుతారు కూడా. అప్పుడు సరిగ్గా నేర్పలేదని టీచర్ ను మీరు నిందించ లేరు కదా! ఉపాధ్యాయుని నిందించే హక్కు మీకు లేదు.
కాబట్టి సరిగ్గా సాధన చేస్తే అప్పుడు మాస్టర్ తో “మాస్టర్! మీరు చెప్పినట్లుగా ధ్యానం చేసాము. నిరంతర స్మరణలో ఉన్నాము. నిర్మలీకరణ చేసుకున్నాము. ప్రార్థనను అర్పించాము. కానీ ఎందుకో అలాగే ఉండిపోయాం” అనగలుగుతాం. కానీ ఆ పరిస్థితి ఎన్నటికీ ఉత్పన్నం కాదు. మన బాధ్యతలను సరిగా నిర్వర్తించినపుడు, ఎవరినీ నిందించే అవకాశం ఉండదు. మీ పనిలో నిర్లక్ష్యం వహించి, మీరెలా భగవంతునికి ఫిర్యాదు చేయగలరు? మౌనం గానే వుండి తీరాలి. చెప్పిన పని చెయ్యడం సంభవించలేదు కనుక నేను భగవంతునికి ఫిర్యాదు చెయ్యలేను. అయితే మీరు అన్నింటిని చక్కని, సరైన వైఖరితో చేసినప్పుడు, భగవంతుని మీరు “ప్రభూ! మీరు ఇలా ఎలా ఉండగలరు? నేను అన్ని పనులూ ఎంతో ప్రేమ, భక్తితో నిర్వర్తించాను. అయినా…” అని నిలదీయగలరు.
అయితే మన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తన కర్తవ్య నిర్వహణలో విఫలమవ్వరనే నాకు నూటికి నూరు పాళ్ళు ప్రగాఢ విశ్వాసం. బాబూజీ సందేశాన్ని మరొకసారి మననం చేసుకుంటే “అభ్యాసీ నా వైపు ఒక్క అడుగు వేస్తే నేను అభ్యాసీ వైపు వందల అడుగులు నడుస్తాను” అనేవారు. చారీజీ ఇలా చెప్పేవారు “అభ్యాసీ వేసే అడుగుకు, మాస్టర్ వేసే అడుగుకు తేడా ఎక్కడ ఉంటుందంటే, మనం వేసే ఒక అడుగు రెండు అడుగుల దూరం, వారిది అనంతంగా ఉంటుంది”. వారికి వంద అడుగులు వేయాల్సిన అవసరం కూడా లేదు. మనం అత్యంత భక్తితో మాస్టర్ ను అనుసరించాలి. నేను నిన్న చెప్పినట్లు, ‘అపవిత్ర హృదయంలో అభివృద్ధి ఆగిపోతుంది’. మనం మానవులం కాబట్టి మనసు వల్ల ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి. అది సహజం.
పర్వాలేదు… సందేహాలు కలుగుతాయి, ఈర్ష్య కలుగుతుంది అయినా పర్వాలేదు. కానీ ఈ విషాన్ని మీ హృదయంలో ఎప్పటి వరకు ఉంచుకుంటారు? వారే మనకు సహాయం చేయగలుగుతారు. మనం” ఓ మాస్టర్! మీ సహాయం లేకుండా మిమ్మల్ని పొందలేము” అని ప్రార్థించాలి. వారినే మనకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. “మేము పురోగతి చెందలేకపోతున్నాము. దయచేసి మీరు సహాయం చేయండి” అని ప్రార్థిద్దాం. మనలో సూక్ష్మత, అణకువ, వినమ్రత, ‘ఆ ప్రభువుకు భృత్యులం’ అనే భావాలను హృదయంలో పెంపొందించుకోవాలి. అలాగని నా ఉద్దేశ్యం నిరాశతో ఉండమని కాదు. ఎల్లప్పుడూ స్వీకరించే విధంగా ఉండాలి.
నిన్నటి వాతావరణం మనం చూసాం కదా! ఎక్కువ గాలులతో ఉంది, అలాగే వర్షం కూడా. మంచిదే. ఈ ధూళి అంతా పోయి శుభ్ర పడింది. ఒకవేళ వాతావరణంలో శూన్యత లేకపోతే, గాలి ఎక్కడ నుండి వస్తుంది? అది రాలేదు. అల్పపీడన ప్రాంతాలు ఉంటేనే గాలి వీస్తుంది. పైనున్న దివ్య లోకం నుండి కృప రావాలంటే, మన హృదయంలో శూన్యత్వం లేదా కోరికలు లేని స్థితి లేదా అల్పపీడన స్థితి ఉండాలి. ఎంతో తృష్ణ గల హృదయం లేదా విలపించే హృదయం కలిగి ఉండాలి. ఎంతో ప్రేమతో భగవంతుని కృప కోసం వేచి ఉండాలి.
మనం కోరికలతో సతమతమవుతూ ఉంటే, అహంకారం మన కోరికలకు ఆజ్యం పోస్తూ ఉంటే మనవాళ్ళు కూడా మనకు శత్రువులు అవుతారు. కోరికలు, అహంకారం మనలను ఆక్రమించినప్పుడు, భార్య కూడా శత్రువులా అనిపిస్తుంది. భర్త, తల్లిదండ్రులు కూడా శత్రువుల్లా కనిపిస్తారు. ఎందుకు ఈ కోరికలు ఈ అహంకారం? నేను ఇతరుల కంటే గొప్ప వాడిని అనుకోవడం ఎందుకొరకు?
ఎప్పుడూ ఇది గుర్తుంచుకోండి. బాబూజీ చెప్పినట్లుగా, “నేను గొప్పవాడిని అని భావించడంలో తప్పులేదు. కానీ ఎదుటి వ్యక్తి నాకంటే గొప్పవాడు” అని ఎల్లప్పుడూ భావించాలి. అప్పుడు ఏదైనా బాంధవ్యం నిలబడుతుంది. నేను నీ కంటే గొప్పవాడినని మీరు భావిస్తే అంతటితో సంభాషణ అంతమైపోతుంది. వారు మీతో ఎందుకు మాట్లాడుతారు?
కాబట్టి సాధన ఎంతో ముఖ్యం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా, మీకు ధ్యానం చేయాలని అనిపించకపోయినా ఒక నిర్ధిష్ట సమయాన్ని అనుసరించి సాధన చేయండి. మిగిలిన రెండు, మూడు విషయాలు నేను మీతో తర్వాత పంచుకుంటాను. ధన్యవాదాలు.