బాబూజీ గురించి…

ప్రియ మిత్రులారా,

ఇదంతా 1976లో, నాకు ఇరవై యేళ్ళ వయస్సు వస్తున్నప్పుడు మొదలైంది.

ఏమంత చెప్పుకోదగ్గ పురోగతి లేకుండా నేను ధ్యానం చేస్తూండడాన్ని గమనించిన నా కాలేజీ మిత్రుడు ఒకడు నన్ను ఒక మహిళ దగ్గరికి తీసుకు వెళతాను; ధ్యానంలో తక్షణమే మైమరపు స్థితికి చేరుకునేందుకు ఆమె నీకు సహాయపడుతుందని చెప్పాడు. అతని సలహా నాకు ఎంతగానో నచ్చి, అతడితో వెళ్లాను. మొదటిసారి ధ్యానానికి కూర్చొన్న నాకు, జీవితంలో కలిగిన అత్యంత ఆశ్చర్యకరమైన అనుభవం అదే. నేను చేరుకోవలసిన చోటుకే వచ్చాను అనిపించింది. ఎంతో ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించిన ఈ ధ్యానపధ్ధతికి మార్గదర్శి ఎవరో, వారిని కలుసుకోవాలన్న తపన అప్పుడు నాలో కలిగింది.

వారి పేరు శ్రీ రామచంద్ర. వారు ఉత్తర భారతదేశం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్ నివాసి. నేను ప్రతి రోజూ ధ్యానం చేస్తున్నప్పటికీ, వారిని కలుసుకోవడానికి దాదాపు ఒక ఏడాది పాటు, 1977లో నా కాలేజీ సెలవుల వరకూ, వేచి ఉండవలసి వచ్చింది. నేను షాజహాన్పూర్ చేరుకున్నప్పుడు, వారొక ప్రేమించే వ్యక్తిగా, నిరాడంబరుడు, నిజాయితీపరుడు, అత్యంత వినయశీలి అయిన వ్యక్తిగా నాకు కనిపించారు. నిజంగా, వారి అత్యంత నిరాడంబరత నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఒక వ్యక్తిలో ఇలాంటి స్వచ్ఛత, నిరాడంబరత్వమూ ఎలా ఉంటాయా అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన సంపూర్ణ ప్రేమస్వరూపులై ఉన్నారు. ఆయన ద్వారా ఎల్లవేళలా యోగశక్తి ప్రసరణ ప్రవహిస్తూ ఉండడాన్ని నేను అనుభూతి చెందాను. ఆయన ఎక్కువసేపు మౌనంగానే ఉండేవారు; అయినా, నాలో అంతరంగ అనుభూతులూ కలుగుతూ ఉన్నాయి. ఆయన ఉనికిని నాలో

అనుభూతి చెందుతూ తీరిక లేకుండా ఉన్నాను. నా ప్రియతమునితో నా ప్రయాణం ఆవిధంగా మొదలయింది.

బాబూజీ పేరుతో మనం పిలిచే వీరు,  లాలాజీగా పిలువబడే ఫతేఘడ్ నివాసి, ప్రసిద్ధ గురువర్యులు, మహాత్మా శ్రీ రామచంద్ర గారి శిష్యులు. లాలాజీ 1931 ఆగష్టులో ఈ లోకాన్ని వీడి వెళ్ళారు. ఆ సమయంలో లాలాజీ తన వారసుడిగా ఎవరినీ నియమించకుండానే పరమపదించారు.  “దీపం వెలిగినప్పుడు, దీపం పురుగులు వాటంతట అవే వచ్చి దీపం చుట్టూ చేరుతాయి.” అని తన అనుయాయులతో శెలవిచ్చారు.

తరువాత, 1942లో లాలాజీ సాహెబ్ దివ్యాశీస్సులు తన ప్రతి అణువణువులోనికి ప్రవహిస్తున్నట్లుగా బాబూజీ అనుభూతి చెందారు. 1944వ సంవత్సరంలో బాబూజీని తన ఆధ్యాత్మిక వారసుడూ, ప్రతినిధిగా పని ప్రారంభించమని లాలాజీ ఆదేశించారు. 

ఈ ఇరువురి మహనీయుల భాగస్వామ్యపు మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వ సంపద కాలాంతం వరకూ చిరస్థాయిగా గుర్తుంచుకోబడుతుంది. ఆధ్యాత్మికాభిలాషుల పురోగతికి దోహదపడే వారి సమర్థత ఇప్పటికే చరిత్రలో స్థానం దక్కించుకుంది. ఈ సంక్రమించిన సంపదను తెలుసుకునేందుకు ఎక్కడనుండి మొదలుపెట్టాలో తెలియని కష్టమైన పని. ఈ విషయంలో భౌతికంగా, స్పష్టంగా, సులభంగా విశదీకరించగలిగేవి బహుశః బాబూజీ గారి గ్రంథాలు కావచ్చు.

బాబూజీ గారి రచనలు, సందేశాలు వాస్తవంగా భావి తరాల వారి ప్రయోజనం కోసమే అయినప్పటికీ,  నేడు కూడా వాటిని చదివేందుకు వెచ్చించే సమయం అమూల్యమైనదే కాగలదు. మనం వారి పుస్తకాలు తరచుగానే చదువుతాం; మాటలు, పదాలలోని భావం అర్థమైనట్లే అనిపిస్తుంది. కానీ, వాటిలోని అంతరార్థం, విశిష్టత మనకు అందకుండా అతీతంగానే మిగిలి ఉంటుంది. బాబూజీ ఆధ్యాత్మిక అంతరంగ యాత్రను ఖచ్చితంగా, శాస్త్రబద్ధంగా వివరించారు; పరిపూర్ణత్వ ప్రాప్తికై అనేక సరళమైన పద్ధతులను అందించారు.

జీవితంలో పరిణతి చెందాలని కోరుకుంటే ఆధ్యాత్మిక కార్యాన్ని ఏ విధంగా, ఎక్కడి నుండి చేపట్టాలి, అహాన్ని ఎలా సంస్కరించుకోవాలి, పాటించాల్సిన వివిధ నీతినియమాలు ఏమిటో జ్ఞానోదయం కలిగించారు. వారు అనుసరించిన యోగ పరిశోధన స్వచ్ఛమైనది; తాను కనుగొన్నవాటిని అత్యంత సహజమైన వినమ్రతతో, స్వీయ ప్రాధాన్యత లేని అల్పత్వధోరణితో వెల్లడించారు.

ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే, 20 వ శతాబ్దం మొదటికి ప్రాచుర్యంలో ఉన్న యోగశాస్త్ర విజ్ఞానం, అప్పటికి కొన్ని వేల సంవత్సరాలుగా ఏవిధమైన ఎదుగుదల లేకుండా అలానే ఉండిపోయింది. భౌతిక శాస్త్రం ఏవిధంగా ఐతే స్థూలంగా న్యూటన్ గమన సిద్ధాంతాల ఆధారంగా గుర్తించడం జరుగుతూవచ్చిందో, అదేవిధంగా యోగశాస్త్రం స్థూలంగా పతంజలి యోగ సూత్రాల ఆధారంగా నిర్వచించబడుతూ వచ్చింది. ఐతే, ఏవిధంగా ఐన్ స్టీన్ యొక్క ఆవిష్కరణలు భౌతిక ప్రపంచం పట్ల మనకున్న అవగాహనను విప్లవాత్మకంగా విస్తరించాయో, అదేవిధంగా బాబూజీ ఆవిష్కరణలు ఆధ్యాత్మిక ప్రపంచం గురించిన మన అవగాహనను శాశ్వతంగా మార్చివేసాయి. 

ఆధ్యాత్మిక యాత్రలో వివిధ మండలాల మధ్య ఉన్న చక్ర వ్యవస్థను బాబూజీ పునర్నిర్వచించారు. వివిధ చక్రాల ద్వారా పురోగమిస్తూ చివరకు మన అస్తిత్వ కేంద్రానికి జరిగే ఆధ్యాత్మిక యాత్ర గురించి విస్తారమైన వివరణ అందించారు. ఆ విధమైన యాత్రలో హృదయ చక్రానికి గల ప్రాముఖ్యతనూ, మానవ క్షమతకు సంభవమైన అత్యున్నత పరిమాణాలకు చేరుకోవాలంటే హృదయం పై ధ్యానం యొక్క ఆవశ్యకతనూ, ఆయన విశదీకరించారు. ప్రామాణికమైన అన్ని శాస్త్ర పరిశోధనల మాదిరిగానే, చక్రాల ద్వారా జరిగే ఆధ్యాత్మిక యాత్ర గురించిన బాబూజీ పరిశోధనా ఫలితాలు కూడా క్రమబద్ధంగానూ, నిర్దేశానుబద్ధంగానూ ఉంటాయి.  ప్రారంభంలో, ఈ పరిశోధనలన్నీ చాలావరకూ వారి సహచరియైన, సోదరి కస్తూరి పై జరిగాయి. అతి సులభమైన పదాలలో బాబూజీ ఇవన్నీ వివరించారు; ఈ పుస్తకాలలో, వారి పరిశోధనలన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. 

అయినప్పటికీ, ఇదంతా పైపైన కనిపించే అతి కొద్ది భాగమే. ఎందుకంటే, మనకు కావాల్సింది కేవలం వారి స్వానుభవానికి సంబంధించిన జ్ఞానం కాదు; మనం ప్రత్యక్షానుభవం పొందాలి. వారు తమ పుస్తకాలలో వర్ణించినటువంటి యాత్రలో మనల్ని కూడా నడిపించేందుకు, వారి సేవలను హృదయపూర్వకంగా అందించారు. సృష్టి ఆవిర్భావానికి పూర్వం మన ఆది మూలం లేదా మన అస్తిత్వపు కేంద్రానికి మనల్ని నడిపించేందుకు తాను కనుగొన్న సరళమైన విధానాలను మనకు అందించారు. ఈ ప్రయాణంలో మనం ఇతరులకు ఏ విధంగా సహాయపడవచ్చో మనకు నేర్పారు. దానివల్ల సరళమైన ఈ వికాస పథం, జ్ఞానోదయ మార్గం మానవాళికంతటికీ ఒక హృదయం నుండి మరొక హృదయానికి వ్యాపించగలదని ఆశించారు.

మనం సంక్రమించుకున్న దాని ప్రాముఖ్యత ఎంత మహత్తరమైనదంటే, అది ఊహించనలవి కాని కాల్పనిక కథ అనిపించవచ్చు. ప్రతి ఒక్కరికీ జ్ఞానోదయమా? పాతకాలంలో ఆవిధమైన జ్ఞానం, తమను భగవంతునివైపు నడిపించగల మహాజ్ఞాని అయిన గురువును వెదుక్కుంటూ వెళ్ళే సన్యాసులకు, సాధువులకు మాత్రమే పరిమితమైంది. చరిత్రలలో మనం చూడగలిగేదానికన్నా ఎంతో మహత్తరమైన స్థాయిలో మానవ చైతన్యం జ్ఞానవంతమై విస్తరించగలగే అవకాశం ఇంతకు మునుపెన్నడూ లేదు. మతాలకు, సంస్కృతులకు, జీవన విధానాలకు అతీతమైన బోధనలతో అత్యంత సులభమైన పద్ధతులను ప్రపంచానికి బాబూజీ అందించారు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక పరిణామాన్ని ప్రతిఒక్కరి జన్మసిద్ధ అధికారంగా వారు అందిస్తున్నారు. అత్యున్నత స్థితికి ఆధ్యాత్మికంగా పరిణామం చెందటమనేది సకల మానవాళియొక్క లక్ష్యం కావాలని, అది నిజానికి మన జన్మసిద్ధ అధికారమని వారే మనకు గుర్తెరిగించారు. 

బాబూజీ డైరీలలో వెల్లడించబడిన రహస్యాలలో అత్యంత ప్రాముఖ్యత కల్గిన వానిలో ఒకటి, 24 మార్చి 1945 తేదీతో ఉంది. ఆ శుభదినాన శ్రీకృష్ణ భగవానుడు –  బాబూజీకి  సాక్షాత్తూ ఆ అంతిమ పరతత్వం [Ultimate Being] ఉపదేశదీక్ష ఇచ్చినట్లు, తమ అంతరంగ సంభాషణ ద్వారా బాబూజీకి తెలియజేస్తారు. సృష్ట్యాది నుండీ ఈ విధమైనది ఇదే ప్రప్రథమ ఉదాహరణ.

 అత్యున్నతమైన ఆధ్యాత్మిక పరిణామాన్ని ప్రతిఒక్కరి జన్మసిద్ధ అధికారంగా వారు అందిస్తున్నారు. అత్యున్నత స్థితికి ఆధ్యాత్మికంగా పరిణామం చెందటమనేది సకల మానవాళియొక్క లక్ష్యం కావాలని, అది నిజానికి మన జన్మసిద్ధ అధికారమని వారే మనకు గుర్తెరిగించారు. 

అంతటి  అపూర్వమైన  దివ్య కృపను ఆకర్షించగలగడానికి ఎంతటి మహాన్నత వ్యక్తిత్వం అయ్యుండాలి? ఆయనను నేను గమనించిన కొద్ది మేరకు, ఇక్కడ మీతో పంచుకోగలను. ఆయన వ్యక్తిత్వంలో కించిత్తు కూడా అహంకారం లేదు. ఆయన, వారి ద్వారా దైవం  తన కార్యాన్నినిర్వహించుకునేందుకు వీలుగా సహకరించిన పరిపూర్ణమైన దివ్య సాధనం, పరిపూర్ణమైన దివ్య వాహనం. ఆయన కేవలం ఒక సాక్షిగా నిలిచి, తన ద్వారా దైవ కార్యాన్ని జరగనిచ్చారు. విశ్వంలోని ప్రతి నిబంధనకూ, అసమానమైన మానవ మర్యాదతో, తలొగ్గారు. పర్యావరణపరంగా, సామాజికపరంగా, సాంప్రదాయపరంగా,  మేధోపరంగా, అధ్యాత్మికపరంగా – ఏ రంగంలో చూసినా ఆయన విడిచిన ఆనవాళ్ళు వాస్తవానికి గుర్తింప శక్యం కానిది. ఆయన ఎన్నడూ తన అధమాధమమైన సహచరులను ఆక్షేపించలేదు; అలాగని ఆయనకు అనుకూలంగా పలికే వారి పట్ల  పక్షపాతమూ చూపలేదు. ఆయనలో నిరంతరం ప్రేమ, సరళత, వినయం, అత్యంత సూక్షస్థాయిలోని ఎరుక,  వివేకం ఉట్టిపడుతూ ఉండేవి. అవి ఇప్పటికీ అలానే ప్రవహిస్తూనే ఉన్నాయి. బాబూజీ ఉనికి యొక్క సున్నితత్వాన్ని అధ్యయనం చేసినప్పుడు, అత్యుత్తమ మానవ ప్రవర్తన, వ్యక్తిత్వాల ఉదాహరణ, అమితమైన స్ఫూర్తి మనకు లభిస్తాయి.

అయినప్పటికీ ఇవేవీ కూడా,  ఆయన తన జీవితకాలంలో ఎవరో, అలానే నాకు గానీ, ఆయన గురించి తెలిసిన ఇతరులకు గానీ ఆయన ఏమిటో, తెలియజేయవు. దానిని  మాటలలో వర్ణించలేం. అనాదిగా కొందరు గొప్ప భావుకులు, కవులు  ప్రేమను గురించి వర్ణించడంలో కొంతవరకూ సఫలత పొందినప్పటికీ, ఆ వర్ణనలన్నీ అసంపూర్ణమైనవే. బాబూజీ మనకు ప్రేమను గురించి తెలియజెప్పారు. తన జీవితంలో ఆయన ప్రేమకు ప్రతిరూపమయ్యారు. మనం తామరపువ్వులలాగా వికసించి, తయారు కావలసిన  విధంగా తయారు కావడానికి, ఆయన నిరంతరం ఆ ప్రేమను మనవైపు ప్రసరిస్తూనే ఉన్నారు. దానిని మనం వివేకంతో సద్వినియోగం చేసుకుందుము గాక!

1976 లో జరిగిన నా మొట్టమొదటి ధ్యాన సమావేశం, 1977 లో మొట్టమొదటిసారి నేను బాబూజీని కలిసిన మధుర క్షణాల  స్మృతులు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ఒక విధంగా  చెప్పాలంటే, ఆ మొట్టమొదటి క్షణాలలోనే ఆయన చెయ్యవలసినదంతా చేసేశారు. అయినప్పటికీ ఇంకా యాత్ర కొనసాగుతూనే ఉంది. ఆ అనంతమైన గమ్యం వైపుకు పిలుస్తూ, ఆ దిశగా సాగే యాత్రలో, నేను మరింత పురోగమించేలా ఆయన  నాకు నిరంతరం మార్గదర్శనం చేస్తున్నారు. దీనిలోని సౌందర్యం ఏమిటంటే ఇది మొత్తం మన అంతరంగంలోనే జరుగుతుంది. మాస్టరుగా బాబూజీ సామర్ధ్యం ఎటువంటిదంటే, చివరికి మన హృదయాంతరాళంలో కూడా ఏ మాత్రం జాడ తెలియని విధంగా ఆయన ఈ మొత్తం పనిని కూడా నిర్వహిస్తున్నారు. ఆ ‘ఉనికిలేని ఉనికి’ యొక్క సువాసనే ఆ దివ్యత్వానికి ఆనవాలు. అటువంటి దివ్యత్వం మన మధ్యన ఉండటం అనేది మానవజాతి చేసుకున్న అదృష్టం. 

శుభాకాంక్షలతో,

దాజీ

Share this post