నేను సిద్ధంగా ఉన్నాను!!

యూట్యూబ్ పోస్ట్ యొక్క ట్రాన్స్క్రిప్టు

జీవితంలో ఊహించని మార్పులను ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో ‘స్పీకింగ్ ట్రీ’ లో వారు రాసిన ఒక వ్యాసంలో పూజ్య దాజీ విశదీకరించారు. ఆ వ్యాస సారాంశం ఇప్పుడు మనం తెలుసుకుందాం.జీవితంలో అనుకోని మార్పులు, సవాళ్ళు మన సహనానికి ఎంతో పరీక్ష పెడతాయి. అటువంటి పరిస్థితుల్లో, ‘ఏదేమైనా కానీ, నేను ఎదుర్కోగలననే’ మొక్కవోని విశ్వాసం మనం పెంపొందించుకోగలగాలి. కానీ, ఒక్కోసారి మనలో ఈ నమ్మకమే లోపిస్తుంది. దానికి కారణం మన సంసిద్ధతలో లోపం. ఎప్పుడైతే మనం నూరుశాతం అవసరమైన సంసిద్ధతతో ఉంటామో, అప్పుడు మనం విశ్వాసంతో ఉంటాం కూడా.

అర్జునుడు విలువిద్యలో ఎన్నడైనా విశ్వాసం కోల్పోయాడా? అతని బాణాలు ఎన్నడూ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం అవ్వలేదు. తిరుగులేని సాధన మాత్రమే అతన్ని విలువిద్యలో నిష్ణాతుని చేసింది. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే మరొక విషయం ఏమంటే, మన దృష్టి ఫలితం మీద కేంద్రీకృతం అవ్వడం. ఇది మనలో సందేహాన్ని రేకెత్తించి, మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. క్రమశిక్షణ లేని ఆలోచనల సమూహంలో కొట్టుమిట్టాడే మనసు, మన వికాసాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయడమే కాక, ఫలితాన్ని కూడా చేజారి పోయేలా చేస్తుంది.
ఫలితం మీదకు ధ్యాస పోకుండా ఉండాలంటే, వర్తమానం పై దృష్టి నిలపడమే మన కర్తవ్యం.

అలాగే ఇతరుల పట్ల, మనల్ని వాళ్ళు దాటి ముందుకు వెళతారనే భయం కూడా మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సహజంగా వారు మన పై విజయం సాధించినప్పుడు మనలో విశ్వాసం వీగిపోవడం, అలాగే మనం వారి కన్నా బాగా పనితీరు కనబరిచినప్పుడు, విశ్వాసం పెరిగిపోవడం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా పెరిగిన విశ్వాసం తాత్కాలికమే. తిరిగి వేరే ఎవరో మన పై విజయం సాధించినప్పుడు, పొందిన విశ్వాసం కోల్పోవడమూ పరిపాటే. అందుచేత – గతంలోని మనతో, వర్తమానంలోని మనల్ని పోల్చుకోవడమే శ్రేష్టమైన పద్ధతి. ఈ విధమైన పోలిక వల్లనే మనం మరింత మెరుగు పడటానికి వీలు కలుగుతుంది. ఐతే, తగిన ప్రయత్నంతో నిరంతరంగా మనలని మెరుగుపరచుకుంటూ, లక్ష్యంపై అనవసరపు ధ్యాస లేకుండానూ, అలాగే ఇతరులతో పోల్చుకోకుండానూ ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, జీవితం మనపై విసిరే సవాళ్లను అధిగమించ గలిగే విశ్వాసాన్ని ఎలా సంపాదించుకోగలుగుతాం?

అన్నిటికంటే ముందుగా, మనం మన ఆత్మతో సామరస్యంతో అనుసంధానింపబడగలగాలి. అప్పుడే మనం జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను స్పష్టతతో, నిబద్ధతతో తీసుకోగలిగే విశ్వాసాన్ని పొందగలం. అందుకుగాను, ధ్యానం అనే అద్భుతమైన కళ మనకు తోడ్పడుతుంది. దాని వలన మనసుకి అంతా ఎంతో స్పష్టంగా కనపడటమే కాకుండా యుక్తాయుక్త విచక్షణ, వివేకం ఏర్పడతాయి. ఈ అంతర్గత సామరస్యం మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికీ. పురోగతి సాధించడానికీ ఉపయోగపడినప్పటికీ, భవిష్యత్తుపై ఆందోళన చెందే లక్షణం మనలను అసంపూర్ణంగానే మిగులుస్తుంది. మరి దీన్నెలా అధిగమించాలి?

మన కర్తవ్య పాలన – మనం ఏ పని చేసినప్పటికీ – అంకితభావంతో నిజాయితీగా, నిబద్ధతతో చేయాలి. అలాగే మన చేతిలో లేని వాటి గురించి మన భయాల బరువులను తగ్గించుకోగలగాలి. ఈ విధంగా మనల్ని మనం నిరంతరం మెరుగుపరచుకోవడం ద్వారా, అనవసరపు ఆలోచనలు, భయాలను మనం అధిగమించవచ్చు. ‘దృష్టి ఎటువైపు ఉంటే శక్తి అటువైపే ప్రవహిస్తుంది’ అన్న సామెత ప్రకారం, అంకితభావంతో మన సామర్థ్యం మేరకు పని చేసినప్పుడు మనలో చక్కటి తృప్తి ఏర్పడుతుంది. మన పరిస్థితులను యధాతధంగా స్వీకరించడం ద్వారా నిరంతర ప్రయత్నంతో చేసే కృషి, మనలో సంతృప్తికరమైన స్థితిని కలగజేస్తుంది. ఈ బీజం పెరిగి మహావృక్షమై చివరకు అంతులేని ఆనందాన్ని, తద్వారా మన హృదయంలో పరమ శాంతిని, సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ విధానాన్ని మరింత వేగవంతం చేయడానికి, హృదయ స్వచ్ఛతకు, మనలోని సంక్లిష్టతలను, మాలిన్యాలను వదిలించుకోవడం ఎంతో ముఖ్యం.

హార్ట్ ఫుల్ నెస్ విధానంలోని సాయంకాలపు నిర్మలీకరణ లేదా క్లీనింగ్ అనే పద్ధతి మనలోని సంక్లిష్టతలను, మాలిన్యాలను ప్రభావవంతంగా తొలగించి పునరుజ్జీవింప చేసే ప్రక్రియ. మీ హృదయము, మనసు ఎంతో తేలికగా, స్వచ్ఛంగా మారే కొలది ప్రతిదీ సరళంగా, ఆహ్లాదకరంగా తయారవుతుంది. ఆత్మవిశ్వాసం అంటే, స్వచ్ఛమైన ఉనికి యొక్క అత్యున్నత ఫలితమే.

Share this post