ఇది ఒక సంక్లిష్టమైన, విలువైన ప్రశ్న. జీవితంలో కెరీర్ నీ, ఆధ్యాత్మికతనూ సమగ్రపరచడం ఎలా? దీన్నే పలురకాలుగా కూడా ప్రశ్నించుకోవచ్చు. నా కుటుంబ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమన్వయ పరచడం ఎలా?
నా వ్యాపార జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమ్మిళితం చేసుకోవడం ఎలా? నా ప్రేమనీ, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా సమగ్ర పరచుకోవాలి? ఆధ్యాత్మికత ప్రతి విషయం లోనూ ఉంటుంది. అయితే దాన్ని ప్రతిదాని లోనూ సమ్మిళితం చేసుకోవడం ఎలా? ఆధ్యాత్మికత అనే పదానికి ఉత్సాహం, ధైర్యం, ఆసక్తి అని అర్థం. మీరు చేసే ప్రతి పనిని ఉత్సాహంగా చేస్తున్నారా? మీరు విద్యార్థులయితే కొత్త విషయాలను నేర్చుకోవాలన్న ఆసక్తి, ధైర్యం మీలో ఉందా?
మీరు ప్రేమికులయితే, మీరు ప్రేమించే వ్యక్తిని సంతోషంగా, శాంతిగా ఉంచాలని మీరు భావిస్తున్నారా? లేదా ఇతరుల నుండి లాభాన్ని పొందాలని ఆశిస్తున్నారా? వ్యాపార ప్రపంచంలో కూడా మీరు చేసే ప్రతి పని ఆసక్తిగా చేస్తున్నారా? నిజాయితీ, సత్యసంధత ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత తో ముడిపడి ఉన్నవే. ఒక వ్యక్తి అత్యాశపరుడిగా, హింసాత్మకంగా మారాడనుకోండి. అటువంటి హింసాత్మక వాతావరణంలో అభివృద్ధి ఎలా సాధ్యం?
సామరస్యం, శాంతి లేని చోట సంతోషంగా ఉండడం సాధ్యపడదని గీత లో కూడా చెప్పబడింది. క్రిస్టియన్, యూదు, ముస్లిం, హిందువు ఎవరైనా కానీ, సంతోషంగా ఉండాలనేది ప్రతి ఆత్మ యొక్క స్వప్నం. చిన్న కీటకం అయినా, గాడిద వంటి జంతువు… కొంత స్థాయిలో సంతోషాన్ని, సౌకర్యాన్ని కోరుకుంటుంది. వ్యక్తిగతంగా మీరు శాంతిగా ఉండగలిగితే అదే సంతోషానికి మూలం. మీలో కనుక సామరస్యత, శాంతి లోపించినట్లైతే, మీరు ఎన్నటికీ సంతోషంగా ఉండలేరు. యమ, నియమలను ఉదాహరణగా తీసుకుందాం. యమ అంటే మనలోని బలహీనతలు అన్నిటినీ నాశనం చేయడం. ఎదుటివారిలోనివి కాక నాలోని లోపాలు, బలహీనతలను నాశనం చేయడం. ఆలా చేసినప్పుడు ఏమవుతుంది? ఒక వ్యాపారవేత్తగా, ఒక పారిశ్రామిక వేత్తగా మీరు ఎన్నడూ భూగర్భ జలాలను కలుషితం చేయరు. గాలిని, నేలను కూడా కలుషితం చేయరు. అన్నిటికి మూలం మీ హృదయం లోనే ఉంది. ఆధ్యాత్మికత మీకు ఈ ప్రాథమిక విషయాన్ని నేర్పుతుంది. గాలి, నేల, నీరు ఇవన్నీ కలుషితం కాకుండా చూడడం ఎలా? ఇవే యునెస్కో యొక్క స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు. ప్రజలను, ప్రత్యేకించి స్త్రీలను ఎలా విద్యాపరంగా జాగృతం చేయాలి?
ప్రతి సమాజం లోను ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. అయితే మీ మనస్సు, హృదయం స్వచ్ఛంగా లేనిదే మీరు ఈ స్థిరమైన లక్ష్యాలను సాధించలేరు. ధ్యాన సాధన వలననే శాంతి పొందడం సాధ్యం అవుతుందని నేను అంటాను. శాంతి లేనిదే సామరస్యం లేదు. సామరస్యం లేనిదే సంతోషం అనేది ఉండనే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరి కలలకు మూలం ఆధ్యాత్మికతలో ఉంది. మీరు ధ్యానం చేసినప్పుడు, మీతో మీరు శాంతిగా ఉన్నప్పుడు మీరు మరింత సృజనాత్మకంగా మారుతారు. సృష్టికర్తతో అనుసంధానం చెందగలుగుతారు. అందువలన మన సమాజంలో కూడా మంచి సృజనాత్మక కార్యక్రమాలను ప్రవేశ పెట్ట గలుగుతాము. ఆధ్యాత్మికత అనేది మూలకారణం. అయితే ఈ ఆధ్యాత్మికత ఒక్కటే జీవితం కాదు. మనం ఈ రెండు జీవితాలను సమ్మిళితం చేసుకోవాలి. మీ ఆధ్యాత్మిక జీవితానికి భంగం కలిగించే విధంగా భౌతిక జీవితానికి ప్రాధాన్యత కల్పించరాదు. అలాగే భౌతిక జీవితానికి భంగం వాటిల్లే విధంగా ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రాముఖ్యత నివ్వరాదు. ఈ రెండిటినీ మీరు సమన్వయం చేసుకొని, సమగ్ర పరచుకోవాలి. నాకు సంబంధించినంత వరకు ఆధ్యాత్మికత ఒక అద్భుతమైన విషయం.