ఈ గందరగోళం అంతా హృదయం వలనో లేక మనస్సు యొక్క తర్కం వలనో కాదు. నిజానికి ఈ గందరగోళమంతా మీరు సరియైన దానిని అనుసరించాలని అనుకోకపోవడం వలన. హృదయం యొక్క స్వరాన్ని వినండి.
ఎందుకు? అది ఎల్లప్పుడూ ఎప్పటికీ తప్పుదోవ పట్టించదు. అయితే హృదయం ‘ఇది తప్పు, దీన్ని చేయవద్దు’ అన్నప్పుడల్లా మీరు దానిపై ఒక రాయి పెట్టి ‘నువ్వు నోరు మూసుకో, ఇక చాలు ఆపు’ అంటారు. ఈ విధంగా మనం ఇంకా ఇంకా బండరాళ్లను మన హృదయం పై మోపుతూ… ఈ క్రమంలో మనమే బండరాయిలా, రాతి హృదయం గల వ్యక్తులుగా మారిపోతాం. హృదయాన్ని వినటం ఎలా? ఇది చాలా సులభం. పాల బాటిల్ తో అటు ఇటు పరిగెడుతూ ఉన్న ఒక చిన్న పిల్లవాడు కూడా దాన్ని నేలమీద పడవేస్తే… తానేదో తప్పు చేశాననో లేక ఏదో తప్పు జరిగిందనో అర్థం చేసుకుంటాడు. మరి పెద్దవాళ్లు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎందుకు అర్థం చేసుకోలేరు?
మనం ఉద్దేశ్యపూర్వకంగానే హృదయవాణిని వినిపించుకోవాలనుకోము. గందరగోళం మనస్సు వలన, హృదయం వలన కాదు. మన ఆశ, మన అహం మనలను ఒక నిర్దిష్టమైన దిశలో నడిపిస్తుంది. అందువలనే మనం హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో మనల్ని మనం శుద్ధీకరించుకొని, జీవితంలో ఏది ముఖ్యమైనదో దానికి ప్రాధాన్యతనిస్తాం. ఒక్కసారి మనకు జీవితంలో ప్రాధాన్యత నివ్వదగినది ఏమిటో అర్థం అయితే, అప్పుడు హృదయాన్ని అనుసరించటం తేలిక అవుతుంది. హృదయం సహజ లయను అనుసరిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో నేను మీకు వివరిస్తాను. మీరు అసహజమైన రీతిలో జరిగే దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు చూస్తున్నారు, వింటున్నారు. చూడటం, చూడాలనుకోవడం అనేది మనలో చాలామందికి సహజమైనది. అలాగే వినటం, వినాలనుకోవడం కూడా అతి సహజమైన విషయం. మీ కళ్ళు మసక బారినట్లై, మీ చూపు అస్పష్టంగా ఉంటే ఏమిటి అర్థం? లేక మీరు సరిగ్గా వినలేకపోతే ‘నా చెవులకు ఏమైంది? మూసుకుపోయినట్లుంది. శుభ్రం చేయాలి’ అనుకుంటారు. విషయాలన్నీ సహజ రీతిలో జరుగుతున్నప్పుడు, మీకు ఎలాంటి ఎరుకా ఉండదు.
మీలో నుండి ఓహ్! నేను చక్కగా చూడగలుగుతున్నాను, కంగ్రాట్యులేషన్స్ అనే సిగ్నల్ ఏమీ రాదు. మీరు ఆ క్షణాన్ని అనుభూతి చెందరు. మీరు చక్కగా వినగలిగినప్పుడు, శభాష్! నేను బాగా వినగలుగుతున్నాను అని మిమ్మల్ని మీరు అభినందించుకోరు. ఎప్పుడైతే తప్పు జరుగుతుందో అప్పుడు మీ హృదయం ‘ఇది సరైనది కాదు’ అని చెబుతుంది. మీరు ఎంత ఎక్కువగా మీ హృదయాన్ని వినగలిగితే, అది అంత స్పష్టంగా మాట్లాడుతుంది.
మీరు హృదయాన్ని వినటం తగ్గిస్తే దాని గొంతు ఇంకా ఇంకా తగ్గిపోయి, మీరు వినటం లేదు కాబట్టి అదిక ఏం మాత్రం మీకు సూచనలను ఇవ్వదు. మీరు విననప్పుడు హృదయం ఏమాత్రం సూచనలు ఇవ్వని రోజు కూడా వస్తుంది.
ఆ రోజు మీరు ఒక రాక్షసుడిగా, రాతి హృదయం గల మనిషిగా తయారవుతారు. కాబట్టి హృదయ వాణి లేక అంతర్వాణికి, మనస్సు యొక్క స్వరానికి మధ్య గల తేడాను గుర్తించడం చాలా తేలిక.