ప్రశ్న: దాజీ, వ్యవసాయంలో మీకు ఎన్నో సరికొత్త ఆర్గానిక్ విధానాలు తెలుసు. అలాగే మీరిక్కడ కాన్హాలో వాటిని అవలంబిస్తున్నారు కూడా. ఎంతోమంది వారి గ్రామాలలో కూడా ఈ విధానాలను, పద్ధతులను అవలంబించాలని ఉత్సాహంతో ఉన్నారు. దీని గురించి అందరికీ విశదీకరిస్తారా?
దాజీ: నా దృష్టిలో పంటలు సాగు చేయడానికి ముఖ్యమైన వాటిలో మొదటిది భూసారం. తర్వాత ముఖ్యమైనది నీటివనరులు. నిరంతరం నీటి లభ్యత ఉందా లేదా అనేది. ఈ రెండూ లభించినప్పటికీ ఒక్కొక్కసారి కీటకాలు, పురుగులు మీ పంటను నాశనం చేయవచ్చు. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది సంక్లిష్టంగా ఉంటుంది.
నా అభిప్రాయంలో భగవంతునికి శరణాగతి, ఆయనపై పూర్తి విశ్వాసం కలిగి ఉండటానికి అవకాశం ఉన్న ఏకైక వృత్తి వ్యవసాయమే. ఇక్కడ ప్రతీది భగవంతుని, ప్రకృతి చేతిలో వదిలేయబడుతుంది. మీరు వారి దయాదాక్షిణ్యాలపై ఆధార పడతారు.
అటువంటి పరిస్థితులలో మనం భూక్షేత్రాన్ని దర్శించినప్పుడు ప్రథమంగా చేయవలసింది, ముందుగా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడమే. వ్యవసాయ క్షేత్రంలో ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేయడమే. తర్వాత ఆ క్షేత్రాన్ని ఏ పంట వేయాలో మీకు మార్గదర్శనం చేయమని ప్రార్థించడమే. అది మీతో మాట్లాడుతుంది. ఏ పంట ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అన్నీ మీకు తెలుస్తాయి. నేలతల్లి ద్వారా కూడా ఇది చేయాలి, అది చేయకూడదు అని మీకు మార్గదర్శనం జరగడాన్ని అనుభూతి చెందుతారు.
భూమాత ద్వారా వచ్చే ఈ సలహాలను పాటించండి. ఇటువంటి శరణాగతిని ఎప్పుడైతే మీరు పాటిస్తారో, మీకు భూమాత దగ్గర్నుంచి ప్రేరణాత్మక మార్గదర్శనం లభించడం గమనిస్తారు. ఇక మీరు తప్పు చేయడం జరగదు. మనం ధ్యానించినప్పుడు, మన హృదయాలలో భూమాత సలహాను అంతర్ దృష్టితో పాటించినప్పుడు, దిగుబడి కూడా ఎన్నో రెట్లు అధికమవుతుంది. ఇలా భూమాత, ప్రకృతి మనకు సహాయ సహకారాలు అందించేందుకు, మనం ఎకరానికి ఒక టన్ను యాక్టివేటెడ్ చార్ కోల్ స్ప్రే చేయడం ద్వారా దిగుబడి రెండింతలు, మూడింతలు అవుతుంది. ఎకరానికి ధాన్యం 10 టన్నులు పండించే సమయంలోనే, పై విధంగా ఒక టన్ను యాక్టివేటెడ్ చార్ కోల్ స్ప్రే చేయడం ద్వారా, 20 నుంచి 30 టన్నుల దిగుబడిని పొందవచ్చు.
యాక్టివేటెడ్ చార్ కోల్ ఎలా తయారు చేసుకోవాలో చాలామందికి తెలియకపోవచ్చు. కాన్హాకు వచ్చి మీరు మూడు, నాలుగు రోజులు గడపడం ద్వారా మీరు ఇవన్నీ నేర్చుకోవచ్చు. నేను నిన్ననే చెప్పినట్లు దీనికి ఎటువంటి రుసుములు, ఫీజులు లేవు. ఈ విధమైన శిక్షణకు మీరు మా ఆశ్రమంలోనే ఉండొచ్చు. ధ్యానం చేయండి. ఇక్కడ వసతి, భోజనం అన్నీ ఉచితమే. మీరేదైనా విరాళం ఇవ్వాలనుకుంటే అది మీ ఇష్టం.
ఎన్నో ఇతర విషయాలు కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఆధ్యాత్మికత, ధ్యానమే కాకుండా వ్యవసాయంలోని ఆధునిక పద్ధతులను, ఇతర మెళకువలను, బయో చార్ కోల్ తయారీ, హైడ్రోపోనిక్స్ (భూరహిత వాతావరణంలో మొక్కలు పెంపకం) నర్సరీలు, మామిడిలో దిగుబడి పెంచడం, ఒకే చెట్టుపై 10 రకాల మామిడి పండ్లను పండించడం ఇలాంటివన్నీ. ఒకవేళ మీకు సొంత భూమి లేకపోయినప్పటికీ, మేము నేర్పే శాస్త్రీయ పద్ధతుల ద్వారా స్వయం ఉపాధినీ పొందవచ్చు.
ఇక్కడ దీని ద్వారా మాట్లాడుకునేటప్పుడు మీకు మరింత వివరంగా చెప్పడం కుదరకపోవచ్చు. ఎందుకంటే వినే అందరికీ వ్యవసాయం ఇష్టం ఉండకపోవచ్చు కదా! ఎన్ని చెప్పినా, నేర్చుకోవాలంటే మీరు ఇక్కడికి రాక తప్పదు. కాబట్టి సరళంగా చెప్పాలంటే, దయచేసి ఇక్కడకు వచ్చి అన్నీ నేర్చుకోండి.