ప్రియమైన మిత్రులారా,
ఏ ఆధ్యాత్మిక సాధన ధ్యేయమైనా స్థితప్రజ్ఞ స్థితిని సాధించడమే; అంటే సృష్టికి పూర్వం ఉన్న సమత్వ స్థితిని పోలి ఉండే స్థితి అన్నమాట. అసలు ఈ ‘సమత్వ స్థితి’ అంటే ఏమిటి? భౌతిక స్థాయిలో వస్తువు యొక్క గురుత్వ కేంద్రానికి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) ఆధారం ఉంటే వస్తువు సమతౌల్య స్థితిలో ఉంటుంది. ఆ కేంద్రం ఆధారాన్ని కోల్పోతే, వ్యవస్థ ఆ సమత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. జీవితంలో సమత్వాన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే మన దృష్టిని మన కేంద్రంలో కేంద్రీకరించాలి. అయితే మన కేంద్రం ఎక్కడుంది?
స్థూల శరీరానికి గురుత్వ కేంద్రం ఉంటుంది, కాని అది జీవుడి మొత్తానికి కేంద్రం కాదు. స్థూలాశరీరం కేవలం ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించే ఏర్పాటు మాత్రమే. మొత్తం జీవుడికి అత్యవసరమైనవి ప్రధానంగా మనస్సు, బుద్ధి, అహంకారం, అనే సూక్ష్మ శరీరాలు. ఈ మూడు సూక్ష్మ శరీరాలు చిత్తం అనే నాల్గవ సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. సూక్ష్మ శరీరాలన్నీ కూడా ఆత్మ లేక పురుషుడి యొక్క పరికరాలు. అందుచేత ఆత్మే మన అసలు కేంద్రం అన్నమాట.
కేవలం కేంద్రం ఉన్నంత మాత్రాన మనం సెంటర్డ్ గా ఉన్నట్లు కాదు. మన చైతన్యం కేంద్రంలో స్థిరంగా ఉన్నంత మేరకు మనం సెంటర్డ్ గా ఉన్నట్లు. భౌతిక వస్తువు సమతౌల్యంగా ఉండేటువంటి స్థానం ఆధారం చేసుకుని ఉంటే ఎలా ఉంటుందో మన కేంద్రంలో చైతన్యాన్ని స్థిరంగా ఉంచితే కూడా అంతే సంత్వ స్థితిలో ఉంటుంది. వ్యక్తిగత సమత్వ స్థితికి ఇదే మూలం.
ఒక బండరాయి కొండ అంచున పడకుండా బ్యాలన్స్ అవుతూ తన సెంటర్డ్ నెస్ ను కోల్పోయిందంటే క్రిందపడి, ముక్కలవ్వచ్చు. మన దృష్టి కూడా కేంద్రం నుండి ప్రక్కకి మళ్ళి గతి తప్పిందంటే మనం మరింత క్రింది స్థాయి అస్తిత్వాలకు దిగజారి స్థిరత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం దుర్బలంగా తయారవుతాం. అటువంటి క్షణాల్లో మన బలహీనతలు వాటంతట అవే బయటపడి, మనం వెనక్కి పడిపోయే ప్రమాదం ఉంటుంది.
జీవితంలో ఏదైనా సరే మన దృష్టిని మన ఆధ్యాత్మిక కేంద్రం నుండి మరల్చగలుగుతుంది. అన్నిటి కంటే ప్రమాదకరమైనవి మన కోరికలు; కాని మనం సరిగ్గా నిర్వహించే విధులు కూడా మనలను దారి మళ్ళేలా చెయ్యవచ్చు, మనం చెయ్యనిస్తే. అనేక బాధ్యతలతో కూడిన మనిషి సాధారణ జీవనం, అనేక సూర్యుళ్ళ చుట్టూ తిరిగేటువంటి గ్రహం పరిస్థితిలాంటిది; ఎన్నో గురుత్వాకరషణ కేంద్రాలు(గ్రావిటేషనల్ సెంటర్లు) ముందుకీ-వెనక్కీ లాగుతూ ఉంటాయి. జీవితం యొక్క అటువంటి విరామం లేకుండా ఉండే కదలికల్లో మనలను మనం ఎక్కడో కోల్పోతూ ఉంటాం. అలాగని ప్రపంచానికి విముఖంగా ఉండటం ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా?
చాలా కాలం క్రితం శ్రీకృష్ణ భగవానుడు, స్థితప్రజ్ఞుడై ఉంటూ, యోగస్థితిలో1 స్థిరపడి ఉంటూ లౌకిక ధర్మాలను నిర్వర్తించేటువంటి అవకాశాన్ని పరిచయం చేయడం జరిగింది. అయితే ఈ భావాన్ని ప్రత్యక్షంగా ఆచరించి ఆ స్థితిని సిద్ధింపజేసుకోగలిగేటువంటి విధానమే సహజమార్గ విధానంగా మనం అర్థం చేసుకోవచ్చు.
జనవరి12, 1946 న పూజ్య లాలాజీ బ్రైటర్ వరల్డ్ నుండి బాబూజీ మహారాజ్ తో దివ్యసంభాషణ ద్వారా ఒక ఫారసీ పద్యం ద్వారా పంచుకున్న సందేశం:
నామి గోయం కి అజ్ దునియా జుదా బష్! బహర్ కరె కి బషి బా ఖుదా బష్.
“నేను నిన్ను ప్రపంచానికి దూరంగా ఉండమనడం లేదు,
నిర్వహించవలసిన విధులన్నీ దైవ స్పృహతో నిర్వర్తించమని మాత్రమే చెబుతున్నాను. ”
ఈ సందేశం సమతౌల్య జీవనాన్ని నిర్దేశిస్తోంది. సహజమార్గం ద్వారా సిద్ధించగలిగే ఈ సెంటర్డ్ నెస్ (కేంద్రంలో స్థిరంగా ఉండగలిగేటువంటి ఈ స్థితి),ఈ రోజున మనకి తెలిసిన హార్ట్ఫుల్నెస్ పద్ధతతే ఆ రోజుల్లో మరింత స్పష్టంగా రూపుదిద్దుకుంటూ ఉన్న క్రమంలో ఉన్న పద్ధతి.
మనం మాస్టరు హృదయం నుండి అందుకుంటున్న ప్రాణాహుతి ప్రసరణే, తద్వారా మనలో నిక్షిప్తం చేసే దివ్యచైతన్యమే ఈ సహజమార్గం యొక్క మూలసారం. ఈ దివ్య చైతన్యాన్ని నిలుపుకోవడం కోసం చేసే సాధనే మనం నిత్యం చేసే సహజమార్గ అభ్యాసం -ప్రధానంగా ధ్యానము, శుద్ధీకరణ, ప్రార్థనలతో కూడిన ఈ అభ్యాసం. ప్రతీ ఉదయం ధ్యానం ద్వారా మనలను మనం కేంద్రంలో స్థిరపరచుకోడానికి మనలను మనం శృతి చేసుకుంటూ ఉంటాం. సాయంకాలం చేసే శుద్ధీకరణ భవిష్యత్తులో మనలను దారి మళ్ళించే బీజరూపంలో ఉండే తత్త్వాలను తుడిచివేస్తుంది; లేకపోతే మనకు ప్రసాదించబడిన ఆధ్యాత్మిక స్థితులు పాడయ్యే అవకాశం ఉంటుంది. చివరిగా, నిద్రకు ఉపక్రమించే ముందు మనలను మనం ఎదుర్కొంటూ మన చేతలను బేరీజు వేసుకుంటూ, ఆ మరుసతి రోజు కోసం చేసుకోవలసిన సంకల్పాలను ప్రార్థనాపూర్వకంగా చేసుకుంటాం ప్రార్థన ద్వారా; ఆ విధంగా అనేక అవకాశాలతో నిండిన ఆధ్యాత్మిక రంగాన్ని సృష్టించుకోవడం జరుగుతుంది. ఈ మూడు ప్రక్రియల ప్రభావం మొత్తంగా సెంటర్డ్ నెస్ గా పరిణమిస్తుంది.
ధ్యానం చైతన్యానికి స్వేచ్ఛనిస్తుంది. చైతన్యం శరీరానికి, ఆత్మకు మధ్య వాహకంగా పని చేస్తుంది. జాగృదావస్థలో అంటే మెలకువగా ఉండే స్థితిలో ఈ చైతన్యం భౌతిక శరీరం మీద ఉంటుంది. నిద్రావస్థలో ఈ చైతన్యం ఇంద్రియాలతో విడివడిపోయి తనలోనే లీనమై ఉండిపోతుంది. కలల్లేని, గాఢనిద్రలో, సుషుప్తావస్థలో చైతన్యం ఆత్మలో లీనమై విశ్రాంతి తీసుకుంటుంది. లోతుగా ధ్యానిస్తున్నప్పుడు కూడా చైతన్యం ఆత్మలో లీనమై ఉండటమేగాక అన్ని దిక్కులా విస్తరిస్తుంది. ఇందులో జాగృదావస్థలోని అప్రమత్తత, కలల్లేని నిద్రలోని సెంటర్డ్ నెస్ (కేంద్రంలో స్థితమైన) లక్షణం రెండూ అనుభూతి చెందడం జరుగుతుంది. దీన్నే తురీయ స్థితి అని అంటారు. ధ్యానంలో కలిగే ఈ తురీయ స్థితిని గనుక మనం జాగృదావస్థలోకి తీసుకోరాగలిగితే, దాన్ని తురీయాతీత స్థితి అని అంటారు. సహజమార్గంలో ఈ స్థితిని నిరంతర స్మరణ అని అంటాం. నిరంతరస్మరణ ద్వారా మెలకువగా ఉంటూ చేసే దైనందిక కార్యాలన్నీ నిర్వహిస్తూ ఉన్నప్పుడు లోతైన ధ్యానస్థితిలో ఉండగలిగితే , స్థితప్రజ్ఞత అనే యోగస్థితిలో స్థిరపడగలుగుతాం. ఆ విధంగా దివ్యచైతన్య స్థితిలో ఉంటూ మన విధులను మనం నిర్వహించుకుంటూ ఆ పరమసత్యాన్ని సాక్షాత్కరించుకోగలుగుతాం. లైబర్ XXIV ఫిలాసోఫోరం అనే మధ్యయుగంలో వ్రాసిన గ్రంథంలో ఈ పరమసత్యాన్ని ఈ విధంగా వివరించడం జరిగింది: “భగవంతుడు ఒక అనంతమైన వలయం, దాని కేంద్రం అన్ని చోట్లా ఉంది కాని దాని చుట్టుకొలత మాత్రం ఎక్కడా కనిపించదు.”
ప్రేమతోనూ, గౌరవంతోనూ,
కమలేష్ పటేల్
1భగవద్గీత 2 వ అధ్యాయం 47-50 శ్లోకాలు