ప్రశ్న: సాధారణ చైతన్యంతో ప్రతిరోజూ నిరంతర స్మరణపై సాధన ఎలా చేయాలి? దీనిపై మరింత స్పష్టత ఇమ్మని మిమ్మల్ని కోరుతున్నాను?
Q: I request you to let me know how to practice constant remembrance everyday with normal consciousness?
దాజీ: చాలా ఏళ్ళ క్రితం, బహుశా 1978 లేదా 79 లోనో, నేను ఇదే ప్రశ్న మా గురువర్యులను అడిగాను. అప్పట్లో మా ప్రశ్నలు, వారి సమాధానాలు కూడా క్లుప్తంగా ఉండేవి. దానికాయన సింపుల్గా నిరంతర స్మరణ అని సమాధానమిచ్చారు. అదే ఎలా? అని వెంటనే వారిని అడిగాను. ‘మీ రోజువారీ పనులు చేయడం మొదలుపెట్టిన ప్రతిసారీ వారితో కనెక్ట్ అవ్వండి’ అన్నారు.
హార్ట్ఫుల్నెస్ లోని ఈ ప్రాథమిక విషయంపై నేను ఎంతో సమయం ఆలోచించాను. ధ్యానం ద్వారా ఏమి పొందుతాం? ధ్యాన సాధన ద్వారా ఏదో లభిస్తుంది కదా! అది ఏమిటి? మనం చైతన్యమని పిలుస్తాం కదా! ధ్యానానికి ముందున్న నా చైతన్య స్థాయికి, ధ్యానానంతరం నా హృదయంలో ఏర్పడే చైతన్య స్థాయికి మార్పు ఉంటుంది. అలాగే అది ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఒకవేళ నేను నా హృదయం లో కొత్తగా ఏర్పడే చైతన్య స్థాయితో బంధం ఏర్పరుచుకోవాలనుకుంటే అది నిచ్చెన పైకి, కిందకి ఎక్కి దిగుతున్నట్లు ఉంటుంది.
కాబట్టి చైతన్యం అనేది ఎంత సూక్ష్మంగా, అలాగే ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే, మనం దాన్ని కోల్పోకుండా ఉండడానికి ఎంతో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ధ్యానానంతరం ఆ స్థితి ఎలా ఉన్నా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, 3 లేదా 4 గంటల తర్వాతైనా మనం దాన్ని కోల్పోతామనిపిస్తుంది. కాబట్టి నిరంతరం జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫ్ కోర్స్! ఒక 2, 3 వారాలు ఇదంతా మనకి సవాల్ తో కూడి ఉంటుంది. రోజువారి భౌతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, అలాగే అంతరంగ చైతన్యంతో కలసి ప్రయాణించడం అనేది, కొన్ని వారాలు కష్టంగా అనిపిస్తుంది.
అదే మీకు నేను చిన్న పిల్లవాడి సైకిల్ ఉదాహరణ ఇస్తే, మూడు లేదా నాలుగు ఏళ్ల పిల్లవాడికి సైకిల్ నేర్పేటప్పుడు వెనక చక్రానికి దన్నుగా రెండు చిన్న ఆధార చక్రాలు బ్యాలెన్స్ కోసం ఉంచుతాం. అలాగే వాడికి మన సహాయం కూడా ఉంటుంది. కొద్ది రోజులకే పిల్లవాడు, ‘అమ్మా, నాన్నా, మీరు నా పక్కన ఉండనక్కరలేదు’ అంటాడు. మరికొంత కాలానికి ఈ చిన్న ఆధార చక్రాలు రెండూ కూడా తీసివేస్తాం. కొన్నాళ్ళకి పిల్లవాడు సైకిల్ పై స్కూల్ కి వెళ్లడం ప్రారంభిస్తాడు. స్నేహితులతో మాట్లాడుతూ, పాటలు పాడుతూ మొదట్లో కష్టంగానే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన పని పెడల్ తొక్కడం. కొన్నాళ్ళకి పెడల్ చేయడం అనేది అలవాటై, తెలియకుండానే చేస్తుంటాడు. కొత్తగా కారు నడపడం నేర్చుకునేటప్పుడు కూడా అంతే. కొంతకాలానికి, కొంత ప్రయత్నం తర్వాత, కారు డ్రైవింగ్ అప్రయత్నంగా జరిగిపోతుంది. కాబట్టి పై రెండు ఉదాహరణలలో కూడా అలవాటుగా చేయడానికి ముందుగా, ఎంతో ప్రయత్నం అవసరమవుతుంది.
నిరంతర స్మరణకు కూడా మొదట్లో ఎంతో ప్రయత్నం అవసరం. ధ్యానం చేసిన ప్రతిసారీ చైతన్య స్థితిని గమనించడం, దాన్ని అర్థం చేసుకోవడానికి, పదిలపరచుకోవడానికి, డైరీలో ఏం జరిగిందో వ్రాయడం, అనంతరం ఆ స్థితికి వీలున్నంతగా అంటిపెట్టుకోడానికి ప్రయత్నించడం ఇలా కష్టపడతాం. తర్వాత మనం బ్రేక్ ఫాస్ట్ చేసినా, పని మీద బయటకు వెళ్లాల్సివచ్చినా, ప్రయాణించేముందు ఆ అంతరంగస్థితితో అనుసంధానం అవ్వడం, దానితో వీలున్నంతవరకు మమేకమవ్వడం చేస్తాం. పని ప్రదేశానికి చేరాక, మన టేబుల్ దగ్గర కూర్చున్నాకా, ఇంకొకసారి సూచన చేసుకోవడం. వీలైతే పని ప్రారంభానికి ముందు, అంతరంగ స్థితిని తీవ్రం చేసుకోవడం కోసం, కేంద్రీకృతం చేసుకోవడం కోసం కనీసం రెండు నిమిషాలు ధ్యానం చేసుకోవడం. ధ్యానంలో ఉండగా ఫోన్ కాల్ వచ్చినా ఇబ్బందేమీ లేదు. మనం జవాబిస్తాం. అలా పక్కకు మళ్ళిన ప్రతిసారీ తిరిగి గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇలా నిరంతరం నాకు నేను అంతరంగంలో కనెక్ట్ అవుతున్నానని గుర్తుచేసుకోవడం చేస్తాం.
అసలు ఇదంతా ఎందుకు? మీరు ఎవరినైనా ప్రేమిస్తే, ఆ వ్యక్తి మీ మనసులో నిరంతరం ఉంటారు. ప్రియతముని క్షణకాలం కూడా మర్చిపోరు. ఈ దివ్యత్వమేదైతే ఉందో, అదేమిటో కూడా మనకు తెలియదు. మరి ఆ దివ్య అస్తిత్వాన్ని ఎలా ప్రేమించడం? అది మనకు అంతవరకు తెలియదు కదా! మనం దివ్యులమే, అది కూడా దివ్యత్వమే అని మనం అద్వైత సిద్ధాంత పరంగా అనుకోవచ్చు గాక! కానీ నేను నా చైతన్యంతో అందులోని సర్వవ్యాపక దివ్యత్వాన్ని గ్రహించాలి కదా. లేదా వ్యక్తిగత చైతన్యం విశ్వ చైతన్యంతో అనునాదించాలి. అది జరగనంతవరకు సిద్ధాంతం గానే ఉంటుంది. కాబట్టే ఆ అంతరంగ స్వభావాన్ని మరింతగా అనుభూతి చెందడం కోసమే మన ప్రయత్నం.
ఒక చక్రాన్నించి ఇంకొక చక్రానికి ప్రయాణించేటప్పుడు మనం వివిధ స్థితులను అనుభూతి చెందుతాం. చివరికి మనం ఒక నిరామయ స్థితికి చేరుకుంటాం. అక్కడ ఏమీ ఉండదు. అక్కడ ఎటువంటి లక్షణాలు అసలు ఉండవని కాదు. అయితే మనం దాన్ని వర్ణించలేం. అక్కడ మాటలకు అందని స్థితి ఉంటుంది. మళ్లీ అద్వైత సిద్ధాంతంలో వర్ణించినట్లుగా…ముందుగా అన్నీ సకారాత్మకంగా వర్ణిస్తారు. కానీ చివరికి నేతి, నేతి అంటే ఇది కాదు ఇది కాదు అని అంటారు. ఆ అనంత తత్వాన్ని అనుభూతి చెందినప్పుడు, ఎవరైనా అది ఎలా ఉంటుందని ప్రశ్నిస్తే, అప్పుడు మనం ఇది కాదు ఇది కాదు అని మాత్రమే చెప్పగలం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ పరమాత్మతో పోల్చదగిన వస్తువేదీ లేదు కనుక. అందుకే నేతి, నేతి అనడం. అనుభవం విషయానికి వస్తే మీరు తప్పక అనుభూతి చెందగలరు.
మనకు దివ్యత్వం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేనందువల్ల, మనం సిద్ధాంతపరంగా ఆ అస్తిత్వాన్ని ప్రేమిస్తూ ప్రయాణం ప్రారంభించాలని బాబూజీ అనేవారు. అలా ఆలోచించడం ప్రారంభించిన తర్వాత, క్రమేణా సహజంగా ప్రేమించడం మొదలెడతాం. కాబట్టి మొదటగా ధ్యానం, మధ్యలో నిరంతర స్మరణ వస్తుంది. ప్రేమ తరువాతి స్థాయి. కానీ ప్రేమే చివరిది కాదు. ఇంకా కొంత ఉంది. నేను ఒకరిని ప్రేమిస్తే వారు కూడా నన్ను ప్రేమించారనుకోండి. తర్వాత వివాహమవుతుంది. అప్పుడు కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. ఇద్దరూ ఒక్కటయినప్పుడు, మూడోది జన్మిస్తుంది. అది లయం కావడం. ఇద్దరు ఒక్కటవడం.
అలాగే నా వ్యక్తిగత చైతన్యం విశ్వజనీనమైనప్పుడు, అది కూడా లయావస్థే. ఈ లయం అనేది నాలో వేరేవి ఉన్నంతవరకు జరగదు. అంటే నాలోని స్వచ్ఛత, దివ్యత్వపు స్వచ్ఛతతో అనునాదింపబడాలి. అలా కాకపోతే అది లయం కాదు. నీటిచుక్క సముద్రంలో కలవాలంటే ఆ రెండింటి స్వభావాలు పోలి ఉండాలి. నీటిలో నూనె చుక్క వేసి అవి రెండూ కలవాలంటే వీలవుతుందా? అది జరగదు. దివ్యత్వంతో లయమవ్వాలంటే నేనూ దివ్యత్వం గానే మారాలి. కొన్ని దివ్య లక్షణాలు ఉన్నప్పటికీ, మనలో చాలా మందికి పరిపూర్ణ దివ్యత్వం ఇంకా లేదు. అది సత్యమైనప్పుడు, మనం అలా తయారైతే లయావస్థ జరిగి తీరుతుంది. థాంక్యూ!