ప్రశ్న: నేనొక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుణ్ణి. సహజ మార్గంలో చేరి కూడా చాలా ఏళ్లయింది. కానీ సిన్సియర్ అభ్యాసీని మాత్రం కాదు. సాధన చేయకుండానే చాలా సమయం గడిపేశాను. ఇప్పుడు నా హృదయంలో ఎంతో విచారం గూడు కట్టింది. అది నన్ను సాధన చేయకుండా వెనక్కి లాగుతోంది. దీన్నెలా అధిగమించాలి? అలాగే అహంకారంపై, భయంపై పని చేయడం ఎలా మాస్టర్?
Q: I am working as teacher in a private school and have been in Sahaj Marg for a long time, but not a sincere abhyasi. Wasted lot of time without doing practice and now I have regret in my heart and it is pulling me back from Sadhana. How to overcome this? How to work on ego and fear, Master?
దాజీ: మంచిది! మీరు టీచర్ గా పని చేస్తున్నా అన్నారు కదా! మీరు మంచి టీచరేనా? పిల్లలు ఎలాంటి వాళ్ళు? అందరూ మంచివారేనా? కొంతమంది మీలా, మీరు సహజ మార్గంలో ఉన్నట్లుగానేనా? స్కూల్లో సరిగ్గా ఉండని విద్యార్థులను మీరు ఇష్టపడతారా? మీరు టీచర్ గా ఎంతో కష్టపడ్డా, వాళ్ళు సరిగా చదవకపోతే మీరు బాధ పడతారు కదా! అలాగే మన గురువర్యులూ మన కోసం, మన ఆధ్యాత్మిక ప్రయాణం కోసం అన్నీ సిద్ధపరచినప్పుడు, ఇంతకన్నా ఎక్కువగా బాధ పడతారు.
ప్రధాన సమస్యేమిటంటే, ఇటువంటి భావనలకు అలవాటు పడిపోవడమే! నేను దీన్నుంచి బయట పడతాననుకుంటాము. మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి. స్కూల్లోనో, కాలేజీలోనో ఒక సంవత్సరం ఫెయిల్ అయితే పర్వాలేదు. పెద్దగా హాని జరగదు. అదే జీవితంలో విఫలమైతే, మళ్లీ మొత్తం జీవితాన్నే తిరిగి మొదలెట్టాలి. ఇలా విఫలమవడం అలవాటయితే, ఈ విషయంలో మొద్దుబారిపోతాం. మన తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడుతూ మా అబ్బాయి 9 వ తరగతి లోనే ఆగిపోయాడు, సమయం వృధా చేస్తున్నాడు, ఎప్పుడు స్కూల్ నుంచి పాసై బయటపడతాడు? అనుకుంటారు.
అలాగే మన విషయంలో భగవంతుడూ అనుకుంటారు. ఈ వ్యక్తి ఎప్పుడు తిరిగి వస్తాడు? ఎప్పుడు మోక్షం సాధిస్తాడు? ఎప్పుడు తిరిగి ఇతనిని కలుద్దాం? అని. కానీ మనం మాత్రం జీవితం తర్వాత, మళ్లీ మళ్లీ తిరిగి తిరిగి జీవిస్తూ, మరణిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణపు గంభీరత మనం అర్థం చేసుకోవాలి. మనం దీంట్లో హృదయాన్ని పెట్టాలి.
బాబూజీ గారి కాలంలో మన సీనియర్ ప్రిసెప్టర్ లలో ఒకరు, డాక్టర్ కె సి వరదాచారి ఈ ఉదాహరణ ఇస్తూ ఉండేవారు. నీటి కోసం బావిని తవ్వాలనుకొని, ఇక్కడ ఒక అడుగు త్రవ్వి, విసుగొచ్చి ఆగి, ఐదు రోజుల తర్వాత మరోచోట ఇంకో ఐదు అడుగులు త్రవ్వి, ఇంకోచోట పది అడుగులు… ఇలా చేస్తే మీరు నీరు పొందలేరు. ఇక్కడ ప్రయత్నమయితే మీరు చేస్తున్నారు కానీ… అప్పుడప్పుడు, అక్కడక్కడ, సరైన ప్రణాళిక లేకుండా చేస్తున్నారు. అలాగే మనం ఇప్పుడు ధ్యానం చేసి, మళ్లీ కొంతకాలానికి అలాగే మళ్లీ మరి కొంత కాలం తర్వాత ఇలా చేస్తే, దాని వల్ల ఫలితం ఉండదు.
ఈ మధ్య నేను ఒకసారి మా పెరట్లో తోట దగ్గర గంట సేపు పని చేసి ఒక అడుగులోతు, రెండు అడుగుల వెడల్పు గల ఒక గుంటను త్రవ్వాను. ఐదు రోజుల తర్వాత నేను అక్కడికి వెళ్లి ఒక చిన్న మొక్కను నాటాలని చూస్తే, నేను త్రవ్విన గుంట ఎవరో నింపి వేశారు. అక్కడ మొక్కలకు నీరు పెట్టే క్రమంలో, చుట్టూతా ఉన్న మట్టి అంతా గుంట లోకి చేరి మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. నేను మళ్ళీ త్రవ్వాల్సి వచ్చింది.
కాబట్టి మనం చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. వీటినే మనం ‘విఫలయత్నాలు’ అంటాం. దీనికి అలవాటు పడితే మన ప్రయాణంలో మనం సంతృప్తిగా ఉంటాం. కానీ గమ్యం చేరడానికి ఎంతో తపన పడాలి, అప్పుడే ఏదైనా ఫలితం ఉంటుంది.
మన ప్రయత్నాలలో ఉత్సాహం అనేది ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైనా చేసేటప్పుడు నాకెంతో ఆనందం ఉండాలి. అప్పుడది అప్రయత్నంగా జరిగిపోతుంది. ఎప్పుడైతే మీరు ‘అబ్బా! ఇప్పుడు ధ్యానానికి కూర్చోవాలా’ అనుకుంటారో, అది ఎంతో భారంగా పరిణమిస్తుంది.
నెపోలియన్ జీవితానికి సంబంధించిన ఒక యదార్థ గాధ మీతో పంచుకుంటాను. ఎన్నో రాజ్యాలను గెలుచుకుని ఫ్రాన్స్ కి తిరుగు ప్రయాణమైనప్పుడు కొల్లగొట్టిన సంపదను అతని సైన్యం కొంత గాడిదలపై, కొంత గుర్రాలపై, అలాగే కొన్ని మూటలను సైన్యం భుజాలపై మోసుకెళ్తున్నారు. ఒక సైనికుడు ఏదో బంగారపు నిధి ఒకదాన్ని తన వీపుపై భారంగా మోస్తూ నడుస్తున్నాడు. చాలా బరువుగా ఉండడం వల్ల, ఆ సైనికుడు తిట్టుకుంటూ ‘ఏమిటీ ఖర్మ! ఈ బరువు కి చచ్చిపోతున్నాను, అయినా మోయవలసి వస్తోంది. చాలా ఆకలిగా ఉంది. ఈ చలిలో నేనిక నడవలేను’ అనుకుంటున్నాడు.
నెపోలియన్ ఇది చూసి, నువ్వేం మోసుకెళ్తున్నావని, అతన్ని అడిగాడు. అతను, నాకు తెలియదని సమాధానమిచ్చాడు. అతన్ని చూడమన్నాడు నెపోలియన్. తీరా చూస్తే లోపలంతా అత్యంత విలువైన బంగారు ఆభరణాలు. నెపోలియన్ అతనితో ‘ఇదంతా నీదే! తీసుకో!’ అన్నాడు.
కొద్ది నిమిషాల క్రితం ఆ సైనికుడు ఆ బరువును మోస్తున్నందుకు తనను తాను కసితీరా తిట్టుకున్నాడు. అకస్మాత్తుగా అతని మానసిక స్థితి మారిపోయింది. అతని శరీరంలో అన్ని వైపుల నుంచి ఎంతో సంతోషం వెల్లివిరిసింది. అతన్నిక ఎవరూ పట్టలేకపోయారు. అక్కడినుంచి ఊహించని వేగంతో తన ఇంటికి చేరుకున్నాడు.
వైఖరిలో ఒక చిన్న మార్పు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. అలాగే నకారాత్మక వైఖరి మన ఆధ్యాత్మిక మార్గంలో అడ్డుకట్ట వేస్తుంది. చదువులో కూడా, ఉత్సాహవంతులైన విద్యార్థులను అలాగే ఇదంతా భారమని భావించే విద్యార్థులను గమనిస్తే, ఎంతో తారతమ్యం వుంటుంది.
మంచి వైఖరిని పెంపొందించుకోవడం మనకు ఎంతో ఉపకరిస్తుంది. మనం కృత్రిమంగా నైనా చేసే పని చిరునవ్వుతో, సంతోషంగా చెయ్యాలి. ఉత్సాహంగా ప్రారంభిస్తే మన ఆసక్తి, ఉత్సాహం అంటువ్యాధిలా అలా అలా వ్యాపిస్తాయి. ఇటువంటి పాజిటివ్ వైఖరి వల్ల మీ భార్య కూడా ఎంతో ప్రభావితమౌతుంది. పిల్లలతో మాట్లాడినప్పుడు, వారు కూడా ప్రభావితులవుతారు. మన ఉపాధ్యాయులూ ఉత్సాహంతో మనం అడిగే ప్రశ్నలకు, వాళ్లు కూడా ప్రభావితులవుతారు. ఈ ధ్యానంలో ఏదో ఉంది సుమా, ఇతను ఎప్పుడూ చిరునవ్వుతో ప్రసన్నంగా ఉంటాడు, అనుకుంటారు. నా దృష్టిలో నేనిప్పటిదాకా నేర్చుకున్న దాంట్లో, ఈ వైఖరి అనేదే ముఖ్యంగా మనం పెంపొందించుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో ఎంతో ఉప్పొంగే ఉత్సాహం, ఆనందం ఉండాలి.
నిన్న మహాభారతం గురించి మాట్లాడుకున్నాం. భగవంతుని రూపం గురించి ఎవరో అడిగారు. నేను వారికి ఇదే చెప్పాను. భగవాన్ శ్రీకృష్ణుని వారి జీవిత కాలంలోనే, రూపురేఖలతో సజీవంగా వారు తమ మధ్య ఉన్నప్పుడే, ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. మనకి అసలు ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. మనదంతా ఊహాజనితమే!
మీరు ఆయన రూపంపై ధ్యానించాలని అనుకున్నారనుకోండి. మీ హృదయంలో ఎవరి రూపం గమనిస్తారు? టీవీలో చూసిన నితీష్ భరద్వాజ్ నే శ్రీకృష్ణునిగా భావిస్తారా? లేదా ఇంకెవరో అంటారు, రాధ కృష్ణుని తోనే ఎప్పుడూ ఉంది కదా! అని, తన ఊహల్లోకి రాధని కూడా తెచ్చుకుంటారు. అప్పుడు ఇంకొకరు, తన సొంత రాధ గురించి ఆలోచిస్తాడు. శ్రీకృష్ణునికి ఉన్నప్పుడు నాకెందుకు ఉండకూడదు? అని.
మనం గంభీరంగా ఆలోచిస్తే అర్జునుడు, అతని సోదరులు, వారు యోగులు కాకపోయినప్పటికీ, శ్రీకృష్ణుని సలహాను ఎల్లప్పుడు తు.చ తప్పక అనుసరించారు. ఆయన ఏం చెప్పినా పాటించారు. ఆయన సలహాను పరిపూర్ణంగా అంగీకరించారు. అదే వారికి మోక్షాన్నిచ్చింది. వారు ఆయన శరణుజొచ్చారు. ఆయనేం చెబితే అంత!
ఇప్పుడు శ్రీకృష్ణుడు మనందరి వద్దకు విడివిడిగా వచ్చి, ఇది చెయ్, అది చెయ్ అని చెప్పరు. ఆయన అర్జునునికి ఏం బోధించారో అది మనం అనుసరిద్దాం. మహాభారత సంగ్రామంలో ఆయనిచ్చిన సలహాలన్నింటిలో అతి ముఖ్యమైనదిదే! ‘నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించు. మన బాధ్యత సరిగా నిర్వర్తించగలగడమే ఆయనకి మనమిచ్చే నివాళి. ఆయన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతను నెరవేర్చినప్పుడు, అంతకంటే గొప్ప తపస్సు, త్యాగం వేరొకటి లేదు.
యోగా అంటే చేసే పని, ఆరాధన గా మారడమే! అదే డైనమిక్ యోగా! పిల్లలకు నేర్పేటప్పుడూ, తోటి ఉపాధ్యాయులతో సంభాషించేటప్పుడూ, ఇంటికి వచ్చాక కుటుంబంతో ముచ్చటించేటప్పుడూ, అంతర్లీనంగా భగవత్ ధ్యాస లోనే ఉండడం. ఇది నాకెప్పటికీ భారం కానేరదు. నిజానికి ఎవరైతే చిరునవ్వుతో పని చేస్తారో, వారెన్నటికీ అలసిపోరు. అదే ఎవరైతే పని ప్రారంభానికి ముందే, తన పని చూసి భయపడతారో వారు ముందే అలసిపోతారు.
Here one sentence is purposefully deleted..you may remove in the video
కాబట్టి సరైన వైఖరి పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం.