వివేక వారథి
రెండు భూ భాగాల మధ్య ఒక పెద్ద అగాథం కానీ, ఒక లోయ లాంటి ప్రదేశంగానీ ఉండి, అటు వైపు ప్రజలు ఇటు రాలేక, ఇటు వైపు వాళ్ళు అటు ప్రక్క వెళ్ళ లేని పరిస్థితి ఉంటే ఏం చేస్తాం? ఆ రెండిటి మధ్యా ఒక వంతెన లేక వారధి నిర్మిస్తాం. అప్పుడు ఏమవుతుంది.? రెండు ప్రక్కల ప్రజల మధ్యా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. సంస్కృతీ సాంప్రదాయాల మార్పిడి జరిగి సరిక్రొత్త సమాజానికీ, తద్వారా ప్రగతికి దారి ఏర్పడుతుంది . అయితే ఇప్పుడు మనం వంతెనల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే, ప్రస్తుత కాలంలో మన సమాజంలో తరాల మధ్య అలాంటి ఒక అగాథం నెలకొని ఉంది. మలి వయసులోని పెద్దతరం ప్రజలందరూ ఒక ప్రక్కన , యువతరం మరొక ప్రక్కన ఉండిపోతున్నారు. పాత తరం వారి అనుభవసారం నేటి యువతకి అందుబాటులో లేదు. యువతరం వారి సాంకేతిక, విజ్ఞాన ఆవిష్కరణల ఫలితాలు పాత తరం వారు అందుకోలేక పోతున్నారు. మారుతున్న కాలంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలతో, రెండు తరాల వారు కలిసి ఒకే ఇంట్లో జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కారణం? చదువుల కోసం ఉద్యోగాల కోసం యువతరం గ్రామాలను వదిలి దూర ప్రదేశాలకూ, కొండొకచో, దూరదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నారు కూడా. ఇది తిరిగి మరల్చ లేని ఒక మార్పు. దీనివలన జరుగుతున్నదేమిటి? గతంలోలా పెద్ద వాళ్ళు తమ అనుభవంతో తమ సంతానానికి ఇచ్చే సలహాలు, హెచ్చరికలు ఇప్పుడు లేకుండా పోయాయి. తరతరాలుగా ఒకరి నుండి ఒకరికి అందుతూ వస్తున్న సంప్రదాయం అనే గొలుసు తెగిపోయింది. మన వారసత్వ గుర్తింపు, మనం గర్వంగా చెప్పుకునే మన సంస్కృతీ క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఇలాంటి ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాలంటే మనం ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి పూజ్య దాజీ నడుంకట్టారు.
తరాల మధ్య నెలకొన్న అంతరాన్ని పూడ్చాలంటే ఒక వారధి నిర్మించవలసిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. “ ద విజ్డం బ్రిడ్జి “ అనే శీర్షిక తో, తన అనుభవ సారాన్ని రంగరించి నేటి తరం యువతకు తమ పిల్లల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలూ, తమ తలిదండ్రుల విషయంలో వారి బాధ్యతలనూ స్పష్టంగా చూపించే ఒక పుస్తకం రచించి, ప్రచురించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అనుకోకుండా లభించిన ఖాళీ సమయం ఈ రచన చెయ్య డానికి ఆయనకు ఎంతగానో ఉపకరించింది. ఈ పుస్తకం ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అమ్ముడైన ఒక ప్రచురణగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పుస్తకం లోని ఒక్కొక్క అధ్యాయంలోని ముఖ్య భాగాలను సంక్షిప్తంగా ఈ వీడియో ద్వారా అందజేయడానికి ప్రయత్నిస్తున్నాం.
ఇందులో మొదటి అధ్యాయం తలిదండ్రుల నుద్దేశించి రచయిత వ్రాసిన పరిచయ వాక్యాలతో ప్రారంభమవుతుంది. ఆయన తన సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఎంతోమంది తల్లిదండ్రులతో పిల్లల పెంపకం విషయంలో జరిపిన చర్చలూ, మానసిక శాస్త్ర నిపుణులతో జరిపిన సంభాషణలూ , ఆయన నిర్వహించిన వివాహాల వధూవరులు తరువాతికాలంలో ఆయనతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఆయన ఈ విషయంపైన ఎంతో అనుభవం సంపాదించారు. ఆ అనుభవాల ప్రాతిపదికగా ఆయన క్రొత్తగా తలిదండ్రులైన వారికోసం ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న పిల్లలు తాత గారి ఒడిలో పడుకుని ఆయన కథలు చెబుతూ ఉంటే ‘ఊ’ కొడుతూ నిద్రపోయే ఒకానొక కాలం ఉండేది. బహుశా ఇప్పుడు 40 ఏళ్ళు వయసు దాటిన వారికి అలాంటి సందర్భాలు గుర్తుండ వచ్చు. ఇప్పుడు అవి గగన కుసుమాలే. ఎందుకంటే, తాతలు, నాయనమ్మలూ ఇప్పుడు ఏ ఇంట్లోనూ కనబడరు. మన బాధ్యతలు పంచుకునేన్దుకూ, మనం ఆందోళనలో ఉన్నపుడు మేమున్నాం అనే భరోసా కల్పిస్తూ అవసరమైన సలహాలూ, చిట్కాలూ అందించేందుకు పెద్ద వాళ్ళు ఎవరూ లేని ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. చిన్న పిల్లల పెంపకం తలిదండ్రులకు ఒక సమస్యగా మారింది. అది ఒక రోజులో ఎక్కువ భాగం వారి సమయాన్నిహరించేస్తోంది. సలహా ఇచ్చే వారు లేక “డు-ఇట్- యువర్ సెల్ఫ్” సూచనల మీద ఆధార పడవలసి వస్తోంది. ఒకప్పుడు ఇంట్లో పెద్ద వాళ్ళు తీసుకునే పసిపిల్లల బాధ్యత, ఇప్పుడు క్రెష్ లో ఆయాల మీద పడింది.
వీటికి తోడు తలిదండ్రుల్లో తమ పిల్లలను గొప్ప వారుగా “ తయారు” చెయ్యాలనే ఒక ఆకాంక్ష బలంగా వేళ్ళూనుకొంది. ఆ కారణంగా చిన్న పిల్లలని, వారు స్వేచ్చగా ఆడుకోవలసిన సమయంలో కంప్యూటర్ క్లాసులకీ, కరాటే క్లాసులకీ తీసుకు వెళుతున్నారు. వాటికోసం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు చేస్తున్నారు.
కానీ ఇవన్నీ సత్ఫలితాలను ఇస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. పిల్లలపై ఒత్తిడి పెరిగి వాళ్ళు కున్గుబాటుకు, మరియు అనేక మానసిక సమస్యలకు గురి అవుతున్నారు.
అయితే, తలిదండ్రులు కెరీర్ పరంగా తమ సంతానం గొప్ప శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నారు గానీ , వారి ఆంతరంగిక అభివృద్ది గురించి ఆలోచించడం లేదు.తమ స్వంత సుఖం, సమయం కూడా లెక్క చేయ కుండా పిల్లల భవిష్యత్తు కోసం కష్ట పడుతున్నారు. సరిగ్గా అలాంటి పేరెంట్స్ ని దృష్టిలో ఉంచుకుని ఈ విజ్డం బ్రిడ్జి లో వారు తమ హృదయాల్లో నిగూడంగా ఉన్న శక్తులను ఎలా గుర్తించి ఉపయోగించు కోవాలి , పిల్లలను సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగల ధీరులుగా ఎలా తయారు చెయ్యాలి అనే విషయాలను, సూచనలనూ పొందుపరిచారు.
ప్రపంచంలో బతకడానికి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో పిల్లలకు చెప్పవలసిందే !అయితే అది మాత్రమె చాలదు. వారు ఆధ్యాత్మికంగా , మానసికంగా భావోద్వేగపరంగా కూడా ఎదగాలి. దీన్ని పిల్లల్ని భవిష్యత్తుకి తయారు చేయడం అనే కంటే వారి భవిష్యత్తు యొక్క ‘సంరక్షణ’ అనడం సముచితంగా ఉంటుంది. సంరక్షణ వారి దీర్ఘకాల ప్రయోజనాలని కాపాడుతుంది. అదొక పవిత్ర కార్యం. అదే అసలైన సంసిద్ధత.
వచ్చే సంచికలో పిల్లల ఎదుగుదలలో, వారు నివసించే గ్రామం ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం.
విజ్డం బ్రిడ్జి పుస్తకం చదివండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి.
నమస్తే.