ప్రేరణ అనే శీర్షికతో హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజీ రచించిన ‘ ద విజ్డం బ్రిడ్జి “ అనే పుస్తకంలోని భాగాలు హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాసపత్రికలో ధారావాహికగా ప్రచురించడం జరుగుతోంది. ఈ పత్రిక మార్చి 23 సంచికలో “వివేకంతో మార్గదర్శనం పొందండి. అడగండి. అలవరచుకోండి. పంచుకోండి. “ అనే ఉపశీర్షికతో ప్రచురించిన మూడవభాగంలోని ముఖ్యాంశాలు ఈ వీడియోలో మీకు సమర్పిస్తున్నాం.
మన తాతముత్తాతలు సంపాదించి కూడబెట్టిన సంపద వారసత్వంగా లభిస్తే ఎంత బాగుండును అని చాలా మంది కోరుకుంటారు. అది ఒక ఇల్లు లేక, పొలం రూపంగానో , వ్యాపారం లేక ధన రూపంగానో ఉండాలని భావిస్తారు. ఎందుకంటే, అవన్నీ సమకూర్చుకోడానికి వాళ్ళు శ్రమించనక్కర్లేదు కదా! అయితే, మన తాతముత్తాతలు మనకు ఇవ్వగలిగిన వేరే సంపదలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ పైన చెప్పిన వాటిలాగ అవి కంటికి కనిపించేవి కావు. ఆ సంపద పేరు విజ్ఞత లేక జ్ఞానం. అయితే మనలో చాలా మంది ఆ సంపదను వారి నుంచి పొందడానికి ఆసక్తి, శ్రద్ధ చూపించడం లేదు. కారణం – దాని వల్ల తక్షణ ప్రయోజనం ఉండదని మనం అనుకోవడం వల్ల. ప్రయోజనం లేకపోతే మరి అది సంపద ఎందుకయ్యింది? ఆ సంపద ఏ రూపంలో ఉంటుంది? అన్న సందేహం రావచ్చు.
ఈ సంపద మన పూర్వీకులు శతాబ్దాలుగా గడించిన అనుభవసారం. తమ తప్పుల నుండి నేర్చుకున్న గుణపాఠాలు. ఇది వివిధ రూపాల్లో ఉంటుంది. అది ఆరోగ్యం, వైద్యం, ఔషధాలకు సంబంధించినది కావచ్చు. వ్యవసాయం లేక ,వ్యాపారంలో మెళకువలు కావచ్చు. మన సంస్కృతీ, సంప్రదాయాలు కావచ్చు. ఇంకా మరెన్నో రూపాల్లో ఉండవచ్చు. చాలా సంవత్సరాలుగా ఈ సంపద మన పూర్వీకులు తమ వారసులకి నోటి మాట ద్వారా తమ జీవిత కాలంలో అందిస్తూనే వచ్చారు. కానీ ఈ నవీన యుగంలో ఈ వారసత్వాన్ని అందించే ఆనవాయితీ క్రమక్రమంగా కనుమరుగవుతోంది. కారణాలు మనకు తెలిసినవే. తాత మనవళ్ళు కలిసి జీవించే పరిస్థితులు ఇప్పుడు లేవు. తాతగారి ఒడిలో కూర్చుని కథలు వింటున్న చిన్నారులు ఇప్పుడు మనకి కనిపిస్తారా? అమ్మమ్మ పనులు చేసుకుంటూ పాటలు పాడుతుంటే కొంగుపుచ్చుకుని కూడా తిరుగుతూ ఆమెతో గొంతు కలిపే సమయం ఇప్పుడు పసివాళ్ళకు ఉందా? హార్ట్ ఫుల్ నెస్ మార్గ దర్శి దాజీ అభిప్రాయం ప్రకారం తాత, అవ్వలు మరియు మనుమల మధ్య ఉండే అనుబంధం సాధారణ ప్రాపంచిక విషయాల్ని కూడా మరపురాని జ్ఞాపకాలుగా చేస్తుంది. కలిసి వారు చేసే ఆ సహజీవనంలో వివేకం ఒక తరం నుండి మరొక తరానికి జీవనదిలా ప్రవహిస్తుంది.
వారి మధ్య ఉండే ఈ ఆత్మీయత ఈనాటిది కాదు.వేల సంవత్సరాల క్రితం ఆహారం కోసం, వేట పైన ఆధార పడే రోజుల్లో, తల్లిదండ్రులు వేటాడడం కోసం అడవుల్లోకి వెళ్ళినపుడు ఇంటి వద్ద పిల్లల సంరక్షణ బాధ్యత వృద్ధులు తీసుకునే వారు. అంతేకాకుండా, నిప్పు ఎలా రాజేయ్యాలో, నీరు దొరికే ప్రదేశం ఎలా కనిపెట్టాలో, వేటాడడం ఎలాగో, ఇత్యాదివన్నీ పిల్లలికి నేర్పేవారు. ఇంకోలా చెప్పాలంటే, బ్రతకడానికి అవసరమైన విషయాలన్నీ బోధించేవారు అన్న మాట. వేల సంవత్సరాల తరువాత నాగరికత అభివృద్ది చెందినా తాతలు, తమ మనుమలకి జీవితంలో అవసరమయే అటువంటి నైపుణ్యాలు నేర్పుతూనే ఉన్నారు. ఇలా తరాల మధ్య జ్ఞానం ఒకరి నుండి ఒకరికి చేర వెయ్యడానికి ఉపయోగ పడే సాధనమే వివేక వారధి లేక ఇంగ్లీష్ లో విజ్డం బ్రిడ్జి అంటారు.అయితే తల్లిదండ్రులు తమ సంతానానికి ఇవన్నీ నేర్పలేరా అని మీరు అడగ వచ్చు.
వారికి జీవనోపాధికి కావలసిన పనులతో తీరిక ఉండదు. అదే తాతలు బామ్మలు అయితే వారికి బోలెడంత సమయం, ఓపిక ఉంటాయి. చెప్పే విషయం కూడా ప్రేమతో, అనునయంగా, విసుగు లేకుండా చెప్పగలుగుతారు. పిల్లలికి వాళ్ళలో నచ్చే విషయం అదే మరి.
అంతరించి పోతున్న ఈ సంప్రదాయం యొక్క విలువ తెలుసుకోవాలంటే ఒక్క సారి చరిత్ర లోకి తొంగి చూడాలి.
పసిఫిక్ మహా సముద్రంలో కొన్ని దీవులున్నాయి , వీటన్నిటినీ కలిపి పోలినీసియా అంటారు. ఈ దీవులు ఒకదాని కొకటి వేలమైళ్ళ దూరంలో ఉంటాయి. అయినా ఆ దీవుల వారందరిదీ ఒకే రకమైన సంస్కృతి. దానికి కారణం, అక్కడ నివసించే ప్రజలు సాధారణ పడవల్లో, దిక్సూచి సహాయం కూడా లేకుండా, ఆ దీవుల మధ్య రాకపోకలు సాగిస్తూ ఉండేవారు.
పలు అనే పేరుగల ఆ జాతి పెద్దలు తమ ప్రజలకి పాటల ద్వారా నక్షత్రాల కదలికలను గురించి నేర్పేవారు..వారు కొన్ని వందల నక్షత్రాల పేర్లు తమ జ్ఞాపక శక్తి ద్వారా చెప్పగలరు. ఆకాశంలో మేఘాల అమరిక చూసి తుఫాను రాకని మూడు రోజుల ముందే పసి గట్టె వారు. ఇవన్నీ కేవలం నోటి మాట ద్వారానే జరిగేవి అంటే నమ్ముతారా? కానీ అదే నిజం.
ఇప్పుడు మరొక వివేక వారధి గురించి తెలుసుకుందాం. దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులు చాలా ప్రసిద్ధమైనవి. ఈ అడవుల్లో ‘షమనులు’ అనే మందులిచ్చే మనషులు ఉంటారు. ఎంతో కాలంగా వారు అనేక రకాల వ్యాధులకి మందులు ఇస్తున్నారు. బెల్స్ పాల్సీ అనే అరుదైన వ్యాధితో సహా.
ఈ షమనులు నడిచే విజ్ఞానసర్వస్వం అని చెప్పవచ్చు. వీరి గొప్పతనం తెలియజేసే ఒక సంఘటన చూడండి. మార్క్ ప్లోట్కిన్ అనే ఒకాయనకి కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని రకాల వైద్యాలు చేసినా ఏమీ ఫలితం లేక పోయింది. ఆయన అలాగే కుంటుతూ ఒక రోజున అమెజాన్ అడవుల్లో తిరుగుతూ ఒక షమన్ కంట బడ్డాడు. ఆయన వెంటనే ఒక చెట్టు బెరడు తో దాన్ని శాశ్వతంగా నయం చేశాడు.. అంతటి ప్రభావ వంతమైన వైద్య విద్యని వాళ్ళు కేవలం నోటి మాట ద్వారా తరతరాలుగా తమ సంతతికి అందజేస్తూ వచ్చారు. దాన్ని కోల్పోవడం అంటే కొన్ని కోట్లు ఖర్చు చేసి, అదే వ్యాధికి మళ్ళీ మందులు కనిపెట్టడం అన్నమాట. అలాంటి షమనులుని కాపాడ వలసిన బాధ్యత మనందరి పైనా ఉంది.
మన కుటుంబాల్లో పెద్దవారి దగ్గర ఎంతోకొంత వారసత్వ విజ్ఞత ఉంటుంది. దాన్ని మనం కోల్పోకూడదు. ‘పెద్దల మాట చద్ది మూట’ అన్న నానుడి మీరు వినే ఉంటారు.
వయో వృద్ధుల్ని గౌరవిద్దాం ఆదరిద్దాం. అరుదైన మరియు ప్రయోజన కరమైన విజ్ఞానాన్ని మనం వారి నుంచి అందుకుని తరువాతి తరాలకి కూడా అందజేద్దాం.
ద విజ్డం బ్రిడ్జి పుస్తకం చదవండి. ఈ అంశం గురించి మరింత వివరంగా చదివి తెలుసుకోండి.
దీని తరువాతి భాగం ఏప్రిల్ 23 సంచికలో వెలువడుతుంది.
నమస్తే