ప్రశ్న: MBA చదువుతున్న మా కాలేజీ విద్యార్థులు ధ్యానం కూడా చేసేలా నేనెలా ప్రోత్సాహించగలను? ధ్యానం చేస్తున్నవారిని ఇతరులు హేళన చేస్తున్నారు. వారికి ఎలా నచ్చచెప్పాలి?
Q: How do I encourage our college students studying MBA, to do meditation also? Others are mocking at those who meditate. How to convince them, Daaji?
దాజీ: ముఖ్యంగా ఆ వయసు పిల్లలకు నచ్చచెప్పడం చాలా కష్టం. వారికి తమదైన స్వంత మనస్సు ఉంటుంది. తమదైన మార్గం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు అప్పటికే ధ్యానం చేస్తున్న వారైతే, అది వేరేగా ఉంటుంది. ఏ కాలేజీలో నైనా, స్కూల్లో నైనా కొంతమంది విద్యార్థులు, కొంతమంది ఉపాధ్యాయులు అప్పటికే ధ్యానం చేస్తుంటే, చాలా వ్యత్యాసం ఉంటుంది.
ఐఐఎం, అహ్మదాబాద్ లోని ఒకేవిధంగా ఆలోచించే కొంతమంది విద్యార్థులు, సైన్స్ మరియు స్పిరిచ్యువాలిటీ క్లబ్బులు పెడదామనే వార్త బయటకు రాగానే, తరగతిలోని ఆ కొంత మంది విద్యార్థుల పై మాత్రమే గురి పెడుతుంటారు. ఈ రోజుల్లో చాలా కాలేజీలలో ఇలాంటి క్లబ్బులు ఉన్నాయి… యూత్ క్లబ్, సైన్స్ మరియు స్పిరిచ్యువాలిటీ క్లబ్బులు.
మీరు అహ్మదాబాద్ నుండి కొంతమంది మంచి వక్తలను, పునీత్ లాల్ భాయ్ లాంటి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించవచ్చు. ఆయన మీ సంస్థ శ్రేయోభిలాషి కూడా అనుకుంటాను. సంజయ్ లాల్ భాయ్ వంటివారిని గూడా ‘మేనేజ్ మెంట్ మరియు మేనేజ్ మెంట్ లో ధ్యానం యొక్క పాత్ర’ గురించి మాట్లాడమని ఆహ్వానించండి.
విద్యార్థులు వారి మాటలను శ్రద్ధగా విన్నట్లయితే ఆది వారి జీవితాలలో ఎంతో దోహదం చేయగలదు. ఎందుకంటే వారిద్దరు తండ్రీకొడుకులు, వ్యాపార ప్రపంచంలో ఉన్నవారు, అహ్మదాబాద్ లోని ఐఐఎంకు బెనిఫాక్టర్స్. విద్యార్థులు సానుకూల వైఖరిని కలిగి ఉండి, అహ్మదాబాద్ లోని ఐఐఎం ను స్థాపించిన వారి మాటలను స్వీకరించే ధోరణిలో వింటారు. కాబట్టి అలాంటి ప్రముఖులను మీ సంస్థకు ఆహ్వానించి మేనేజ్ మెంట్ లో ధ్యానం యొక్క పాత్ర గురించి మాట్లాడమని అడిగితే మంచిది. వాస్తవానికి అది చాలా ఉపయోగకరం. ధ్యానం చేస్తున్న వారిని పిచ్చివారు అనే అపవాదు కూడా ఎక్కువగానే ఉంటుంది. అనుకోనివ్వండి.. వేళాకోళం చేసే వారున్నారు. నన్ను కూడా వేళాకోళం చేసే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. నేను ధ్యానం చేస్తూ ఉండడం వలన ఎంతో మంది స్నేహితులు దూరమయ్యారు… కానివ్వండి.
ఇప్పుడు మనం ప్రజల జీవిత విధానాలను విశ్లేషిద్దాం. ఇప్పుడు నా వయస్సు 66, నేను ధ్యానం ప్రారంభించినప్పుడు నాకు 19 లేదా ఇరవై ఏళ్ళు ఉండేవి మధ్యలో 46 సంవత్సరాల అంతరం ఉంది. ఇప్పుడు నా జీవిత విధానాన్ని చూస్తే, ధ్యానం ద్వారా నా జీవితంలో పొందిన దాన్ని ఇతరులతో పోల్చితే అంటే ధ్యానం చేస్తున్న వారు వర్సెస్ ధ్యానం చేయని ప్రజల జీవితాలలో సంతోష సూచిక లేదా సంపూర్ణ సంతృప్తిలో స్పష్టమైన భేదాన్ని చూడగలరు. ధ్యానం చేస్తున్న వారి పిల్లలు మరియు ధ్యానం చేయని వారి పిల్లలలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల, అసలు దాన్ని మనం కొలవలేము. హిందీలో ‘జమీన్ ఆస్మాన్ కా ఫరక్ హై’ అంటారు. అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం.
కాబట్టి ధ్యానాన్ని తొందరగా ప్రారంభించడం పలు కారణాల వల్ల మేలు అని నా ఉద్దేశం. ప్రాథమికమైన కారణం ఏమిటంటే మీరు పెళ్లికి ముందు నుండే ధ్యానం చేస్తున్నట్లయితే, మీ పూర్తి కణజాల వ్యవస్థ ఆధ్యాత్మిక ప్రకంపనాలకు అనుగుణంగా ఉంటుంది. మీ క్రోమోజోములు, మీ జన్యు నమూనా కూడా భిన్నమైన తరంగదైర్ఘ్యం కు అనుగుణంగా అవుతుంది. అలా జరిగినప్పుడు మీరు మీ జన్యు సంపదను మీ పిల్లలకు అందించగలరు. మరో రకంగా అయితే అలా జరగదు.
మీరు 30, 40 లేదా 50 సంవత్సరాల వయసులో ధ్యానం ప్రారంభించారనుకోండి. అప్పుడు ఆ రకమైన జన్యు నమూనాను మీ పిల్లలకు అందివ్వగలరా? అసాధ్యం. రెండో విషయం, మీరు అంత వయసు వచ్చే వరకు వేచి ఉన్నప్పుడు, వృద్ధులవ్వడం వల్ల కనీసం సరిగ్గా కూర్చోలేరు. మీ కాళ్ళను, చేతులను, మీ వీపును కదిలిస్తూ ఉంటారు. మీ శరీరం మీకు సహకరించదు. ధ్యానం చేసినంత సేపు కూర్చోలేము.
ధ్యానం మాత్రమే కాదు, వివాహం కూడా చిన్న వయసులో జరగడం మీకు ప్రయోజనకరం. ఎందుకంటే మనం జీవితంలో, ఇప్పుడు కాకపోయినా తర్వాతయినా త్వరగా నేర్చుకుంటాం. 70 సంవత్సరాల వయసులో తాత, అవ్వ అయినప్పుడు మీ మనవలను కనీసం ఎత్తుకోలేరు. మీరు 30 ఏళ్ల వయసులో వివాహమాడి, పిల్లలను పొందినప్పుడు, ఆ పిల్లలు కూడా ఆలస్యంగా మీలాగే వివాహమాడితే, మీరు కనీసం మీ మనవలను చూడలేకపోవచ్చు. కాబట్టి తొందరగా వివాహం చేసుకోవడం మంచిది. ప్రస్తుతం మనం వేరే అంశంలో ఉన్నాము. మీరు చిన్న వయసులో ధ్యానం చేయడం గురించి ప్రశ్న అడిగారు. ఇది మీ ప్రశ్న కానప్పటికీ నేను తొందరగా ఎందుకు పెళ్లి చేసుకోవాలో వివరించాలనుకుంటున్నాను.
మీకు 30 లేదా 32 ఏళ్ల వయసులో సంతానం కలిగింది అనుకుందాం. 15 సంవత్సరాల కాలంలో మీకు మెనోపాజ్ మొదలవుతుంది. ఆ సమయంలోనే మీ పిల్లలకు టీనేజ్, యుక్త వయసు వస్తుంది. మీలో హార్మోన్ల మార్పులు, అలాగే పిల్లలలో కూడా హార్మోన్ల మార్పులు జరుగుతాయి. మీరు మానసిక స్థితిలో తీవ్ర మార్పులు అలాగే పిల్లలలో కూడా వారి జీవితంలో, ఈ యుక్తవయసులో ఎలా సర్దుబాటు చేసుకోవాలో నేర్చుకుంటూ ఉంటారు. ఇల్లు అలజడితో నిండిపోతుంది. మీ పిల్లలను మీరు అర్థం చేసుకోలేరు. మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. అక్కడ నరకం కనిపిస్తుంది. కాబట్టి చాలా విషయాలలో మీరు ఎలాంటి సమయపాలన చేయాలో దాని ఫలితాల మీద ఆలోచించండి.
హృదయ క్షేత్రాన్ని దాటి వీలైనంత తొందరగా బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశించడం మంచిదని నేను ఒకరితో చెప్పాను. మనకు ముఖ్యంగా 16 చక్రాలు ఉన్నాయి. హృదయంతో సహా 13 పైన, 3 క్రింద ఉంటాయి. అవి మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు. ఈ పిండ ప్రదేశాన్ని దాటి బ్రహ్మాండ మండలంలోకి ప్రవేశిస్తే ఇక్కడ ఆరవ చక్రము దానిపైన ఏడవది ఉంటాయి. 7, 8 చక్రాల మధ్య మరో రెండు ఉపబిందువులు ఉంటాయి. వాటిని కోరికల బిందువు మరియు సరస్వతీ బిందువు అని బాబూజీ చెప్పారు. సరస్వతీ బిందువు వద్ద మీకు పరిపూర్ణ జ్ఞానం వికసించడం జరుగుతుంది, అది మంచిదే. కానీ ఈ యాత్రలో 7 మరియు 8 బిందువుల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు మీరు మరెన్నో బిందువులను దాటాలి. మీరు ఈ కోరికల బిందువును కూడా స్పర్శిస్తారు.
ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక యాత్రలో వెనుకబడి ఉండి, ఈ ఆధ్యాత్మిక బిందువు గుండా మీ 75వ ఏట ప్రయాణిస్తున్నారనుకోండి. ఆ బిందువు వద్ద ఉండే వాతావరణాన్ని మీరు అనుభవంలోకి గ్రహించేటప్పుడు, మీ స్వేచ్ఛకు సంబంధించినంతవరకు, మీ ఆధ్యాత్మిక అపిటమిన్, మీ లైంగిక కోరిక కు సంబంధించినంతవరకు మీరు యుక్తవయస్కుల్లో వలె అనుభూతి చెందుతారు. అకస్మాత్తుగా మీలో లైంగిక కోరిక కలిగి, నాకిలా అయిందేమిటని ఆశ్చర్య పోవడం మొదలెడతారు. నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని, ఎన్నో సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను, ఇప్పుడు ఈ ముసలి వయసులో ఇలాంటి అనుభవాన్ని అనుభూతి చెందుతున్నానేమిటి అని ఈ విషయానికి సిగ్గు పడతారు.
కాబట్టి మీరు 35, 40 ఏళ్ల వయసులో ఈ కోరికల బిందువు గుండా ప్రయాణిస్తుంటే పరవాలేదు. ఈ బిందువు వద్ద మీకు సిగ్గు అనిపించదు. అందువలన ఎన్నో లాభాలు ఉన్నాయి. వాస్తవానికి ప్రతికూలతలు చాలా ఉన్నాయి. మొదట మీరు అవసరమైనంత ఎక్కువసేపు కూర్చోలేరు. అవసరమైనంత ఎక్కువ సేపు కూర్చుని ధ్యానం చేయలేకపోతే మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏమౌతుంది? అది అంతమవుతుంది. మీరు మరో జన్మ కోసం, మీకు మంచి సంస్కారాలను ఇచ్చి, సహజమార్గం వంటి మంచి విధానంలోకి తెచ్చే తల్లిదండ్రులు లభించేంతవరకు వేచి ఉండాలి. మీరు చైనాలోనో ఆఫ్రికాలోనో ఎక్కడ తిరిగి జన్మిస్తారో ఎవరికి తెలుసు? అదే తల్లిదండ్రులకి మీరు మళ్ళీ జన్మించాలని ఆశిస్తే అలా జరగదు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ముక్తిని పొంది ఉండవచ్చు. మళ్లీ వెనక్కి రాకపోవచ్చు. ఆధ్యాత్మిక మార్గం గురించి గంభీరంగా ఆలోచించండి. మనలో చాలా మంది సహజమార్గ సాధన చేస్తున్నందున మన యాత్రను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని విశ్వసించండి. అనవసరంగా ఆలస్యం చేయకండి.