వచ్చే భండారాకు మరింత బాగా తయారవుదాం
01-05-22 Part-1 & 2 వచ్చే భండారాకు మరింత బాగా తయారవుదాం
శ్రీకృష్ణ పరమాత్మ నుండి వచ్చిన మూడు సందేశాలను, మూడు చిట్కాలను దయచేసి జ్ఞాపకం ఉంచుకోమని మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే మన భండారా సందేశం ప్రకారం మనం సంస్కారాలను ఎలా ఏర్పరచుకుంటాం, వాటిని ఎలా తొలగించుకుంటాం, సంస్కారాలేర్పడని విధంగా మన జీవనశైలిని ఎలా మార్చుకుంటాం అనే విషయంపై ఆలోచించాలి. సంస్కారాలను ఏర్పరుచు కోకపోతే క్లీనింగ్ అవసరం లేదు, ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఇది సాధ్యమని నేను హామీ ఇస్తున్నాను. ఎంత కాలం మందులు వేసుకుంటాం? ఆరోగ్యవంతులు అయ్యేంతవరకే కదా! ఎంతకాలం ధ్యానం చేస్తూనే ఉంటారు? మీరు సంపూర్ణంగా ఆధ్యాత్మికులు అయ్యేంతవరకే.
బాబూజీ మరో విధంగా భరోసా ఇచ్చారు. లాలాజీ శిష్యులలో ఒకరు ఎలాగో సాధనను వదిలేసారు. అంటే ఆయన బాబూజీని లాలాజీ వారసునిగా గుర్తించలేదు. కానీ ఏళ్ల తరబడి పూజలు చేస్తూనే ఉన్నారు. ఒకరోజు ఆయన బాబూజీ మహరాజ్ ను కలిసి ఆయనతో, “మీరు లాలాజీ మహరాజ్ పై ఎన్నో ఏళ్లుగా ధ్యానం చేస్తున్నారు,” అన్నారు. బౌన్సర్ వేసినట్లు బాబూజీ వెంటనే అతనికి సమాధానం ఇచ్చారు. “మీరు 20 ఏళ్లుగా పూజ చేస్తూనే ఉన్నారు, అదెప్పుడు అంతమవుతుంది? అదే మాకు కూడా వర్తిస్తుంది. మేము అక్కడికి చేరే వరకు,” అని. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించడం లేదు. భయపెట్టినా, ఎవ్వరూ భయపడటం లేదు. ఈ విషయాన్ని హృదయంలోకి తీసుకొండి.
నేనేదో సాధారణ వ్యాఖ్య చేస్తున్నాను అని చాలామంది అనుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన సాధారణ వ్యాఖ్యయే. ఎవరూ మినహాయింపు కాదు. మిమ్మల్ని మీరు మినహాయింపు వర్గం లోని వారమని భావించకండి. ఇది అందరికీ వర్తిస్తుంది. కృష్ణ పరమాత్మ దీనిని మన కోసం సులభతరం చేశారు. వాగ్దానం చేశారు. ఒక సంవత్సర కాలం ఇలా చేసి ఏమి జరుగుతుందో చూడండి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30 తర్వాత మనలో ఏమి జరిగి ఉంటుందో మనం చూస్తాం. మనందరికీ తమవైన ప్రత్యేకమైన సంస్కారాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ధోరణి ఉంటుంది. మరో వ్యక్తి లో అలాగే ఉండదు. కొన్ని సామాన్య సంస్కారాలు ఉంటాయి. వాటికి సంబంధించిన సంస్కారాలు A, B మరియు D బిందువుల వద్దకు ఆకర్షించబడతాయి. ఇవి సాధారణమైనవి. కానీ వాటిలో చాలా ప్రత్యేకమైన సంస్కారాలు మనందరిలో వేరు వేరుగా ఉంటాయి. ఆ అలవాట్లను, ధోరణులను గుర్తించి, వాటిపై పని చేయండి. వాటిపై మీకు పనిచేయాలనిపించకపోతే, వాటిని మాస్టర్ గారికి అర్పించి, ఆయన ఏమి చేస్తారో చూడండి. అన్ని పనులను, ఆలోచనలను, బాధలను, సంతోషాలను ఒక్కొక్కటిగా కాకుండా ఒకేసారిగా ఆయనకు సమర్పించండి.
సత్కోల్ బ్యాచ్ ల గురించి కూడా ప్రకటించాలి అనుకుంటున్నాను. దయచేసి రిజిస్టర్ చేసుకోండి. ఈ బ్యాచ్ లు మే 15 నుండి జూన్ 15 వరకు తెరిచి ఉంటాయి. ఎవరైతే సత్కోల్ కి వెళ్లి కొంత విశ్రాంతి పొందాలనుకుంటారో వారు వెళ్ళవచ్చు. అలాగే ఆదివారం, బుధవారం సత్సంగాలు ఎప్పుడూ అవి జరిగే ప్రదేశాల్లోనే జరుగుతాయి. సరేనా!
తరువాతి భండారా పూజ్య చారీజీ జయంతి ఉత్సవం, జులై 23, 24, 25 తేదీలలో ఉంటుంది. అది 23 శనివారం నుండి ఉంటుంది. ఇంతకంటే మంచి రోజులను మీరు ఆశించలేరు. శనివారం, ఆదివారం, సోమవారం. ఇవి చాలా ప్రియమైనవి. మీరు రాలేకపోతున్నందుకు చారీజీకి క్షమాపణలు చెప్పలేరు. ఇంకా 3 నెలలు ఉన్నాయి. చాలామంది సాకులు చెప్తారు. కానీ నేను మూడు నెలల ముందుగా చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా 24 జూలై 2024 లేదా 2070 నా! అంత కాలం జీవిస్తామా అని అడుగుతారు. కానీ నేను 2070 గురించే మాట్లాడుతున్నాను. మీరు నన్నలా అడిగితే, “అవును. నేను అక్కడ ఉంటాను” అని చెప్పడానికి మొదటి వ్యక్తి గా ఉంటాను. తేదీ ఏదైనా కానీ మనకు సంబంధం లేదు. మనం అన్నివేళలా సిద్ధంగా ఉండాలి. అది 2050 లేదా 2029 అయినప్పటికీ అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాం. కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో చేరుకోలేకపోతే అది వేరే విషయం. కానీ మన వైపు నుండి అన్ని వేళలా ‘సరే’ అనే చెప్పాలి. ఏ భండారా అయినా ఏ సత్సంగం అయినప్పటికీ, మనం వెళ్ళాలి. కృతజ్ఞతలు.
ఒక అభ్యాసీగా మనం కావలసినంత సిద్ధంగా ఉండాలి. 24 జూలై అని చెప్పాము… “నాకు ఆఫీసులో చాలా పని ఉంది. వ్యాపారంలో చాలా ఆర్డర్లను పూర్తి చేయాలి” అంటే వెళ్లి మీ ఆర్డర్లను పూర్తి చేయండి. ప్రపంచం ముందుకు సాగుతూనే ఉంటుంది. మనం మళ్ళీ ఇక్కడికి, ఈ ప్రపంచంలోకి తిరిగి వస్తూనే ఉంటాం. ఇది చాలా అందంగా ఉంటుంది, ఆనందించండి. ముందుకు సాగాలని అనుకుంటున్న వారు అప్రమత్తంగా, సిద్ధంగా ఉంటారు. పది నిమిషాల తర్వాత భండారా ఉన్నప్పటికీ వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇప్పటి నుండే తర్వాతి భండారాకు మనం తయారవడం మొదలుపెడితే గానీ, ఇప్పుడు మనకున్న కండిషన్ అప్పటి వరకు మనతోనే ఉండదు. దీనిపై ఆలోచించడానికి ప్రయత్నించండి. ఇది మానసికమైనది. తర్వాతి భండారాకు తయారవడం మొదలుపెట్టగానే ఈ కండిషన్ చాలా వేగంగా జీర్ణమవుతుంది.
తర్వాతి భండారాకు ఎలా తయారవ్వాలో మనకు తెలుసు. నేను అడ్మినిస్ట్రేటివ్ తయారీ గురించి కాకుండా, ఆధ్యాత్మికంగా తయారవడం గురించి మాట్లాడుతున్నాను. ఎవరి జన్మదినాన్ని మనం పండుగగా జరుపుకుంటామో ఆయన స్మరణలో, చారీజీ మహరాజ్ స్మరణలో మునిగిపొండి. మాస్టర్! మేము మీలా తయారవుదామనుకుంటున్నాము. ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఆ మాస్టర్ గారిని ప్రార్థించండి.
నీకు అత్యంత ప్రియమైన దాన్ని త్యాగం చేయమని ఇబ్రహీంకు స్వప్నంలో చెప్పబడినట్లు ఖురాన్ లో ప్రస్తావించారు. ఆయన రాత్రంతా ఆలోచించారు. ఆయనకు తన పుత్రుడంటే అత్యంత ప్రేమ. అందువల్ల ఆ పిల్లవాడిని పర్వతం వద్దకు తీసుకొని పోయి బలి ఇవ్వడానికి ప్రయత్నించగా, అల్లాహ్ వచ్చి, ఇది నీకు పరీక్ష మాత్రమే అని చెప్పారు.
మరి మన త్యాగం మాటేమిటి? భగవంతుని పొందటానికి శిరస్సు సమర్పించినా, అది చౌకబేరమేనని బాబూజీ అనేవారు. మన అహం నిర్మూలన కన్నా, తల తెగ్గొట్టుకోవడం చాలా తేలికని బాబూజీ చెప్పేవారు. ‘చావనైనా చస్తాను గానీ తలవంచను’ అంటుంటాం కదా! ఎందుకింత అహంభావం? మనం అహం దగ్గరే ఆగిపోతున్నాం.
బాబూజీ మహరాజ్ విశదీకరించిన 23 వలయాలలో, 5 వలయాలను మనం భయపడే మాయ కు కేటాయించి, అహంకారానికి (ఈగో) 11 వలయాలు ఎందుకు కేటాయించారోనని, నేనెన్నో సంవత్సరాలు ఆలోచించేవాణ్ణి. అహంకారం అనేది ఒక్కటే అయితే మరి 11 వలయాలు ఎందుకు? ఎందుకంటే వదిలివేయడానికి అదెంతో అసాధ్యమైనది కాబట్టి. అలాగే దీని విషయంలో మాస్టర్ కూడా ఏమి చేయలేరు కనుక. ఈగో సమర్పణ పెంపొందించుకోవడం అభ్యాసీ బాధ్యతే. అదే పెద్ద సమస్య.
మాయా వలయాలను అధిగమించడంలో మీరు మాస్టర్ తో కలసి పనిచేస్తారు. ఈగో నిర్మూలన విషయంలో అభ్యాసీయే దీన్ని పెంపొందించుకోవాలి.
శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా కర్మ సమర్పణే కాకుండా, కర్మఫలాలు కూడా సమర్పించాలి. ఇదీ సులభమే. అయితే ‘నేను ఫలానా’, ‘నేనిదంతా చేయగలను’, ‘నేను దీన్ని చెయ్యను’… ఇలా భావించేదంతా అహం మరియు తెలివి.
అలాగే మన ఆత్మకు దగ్గరివన్నీ, మన చిత్తం, అహంకారం, దాని తరువాత బుద్ధి (తెలివి), అనంతరం మనసు, తరువాత మన శరీరం, వీటి తరువాత మనం మన బంధుత్వాల ద్వారా గుర్తించబడతాము. పెళ్లైతే మన జీవిత భాగస్వాములతో, అలాగే మన పిల్లలతో… ఇలా ఆత్మ నుంచి దూరం పెరిగిపోతూ ఉంటుంది.
మనల్ని ఎవరైనా అవమానిస్తే, మీ నడక బాగాలేదనో, ఎలా నడవాలో మీకు తెలీదనో అంటే మీరు పెద్దగా అవమానం ఫీల్ అవరు. అదే మిమ్మల్ని ఎవరైనా మూర్ఖుడు అంటే, గాడిదలా ఉన్నావంటే, బుద్ధిలేనివాడు అంటే, ఇవన్నీ మీ మనసుకు, మీ ఆత్మకు దగ్గర వాటిపై చేసే దాడి లాంటిది. ఎంతో బాధిస్తుంది.
తర్వాత మీకు అత్యంత దగ్గరి మనుషులను ఎవరైనా అవమానిస్తే, మీ తల్లిని ఎవరైనా తిడితే మీ రక్తం మరిగిపోతుంది. ఆమె మీ ఆత్మీయురాలు కాబట్టి. మీ భార్య లేదా భర్తను, ఒకవేళ మీరు ఇష్టపడకపోయినా, ఎవరైనా అవమానిస్తే మాత్రం ‘నా భార్యను ఎందుకలా అంటావని’ అప్పుడూ మీ రక్తం ఉడుకుతుంది.
మనకు కావలసిన వారితో మనం గుర్తింపబడడం వల్లే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మనం గుర్తింపబడే అహానికి సంబంధించిన ఇలాంటి విషయాలన్నీ ఒక్కసారిగా, గంపగుత్తగా మాస్టర్ కి సమర్పించండి. అది మాయ అయినా, అహంకారమైనా వారికి సమర్పించి మిమ్మల్ని మీరు విముక్తి కావించుకోండి.
మన సాధనలో ఉదయం ధ్యానంలో మునిగి పోవడం అంటే, మనకు లభించే ప్రాణాహుతి లేదా ప్రకంపనలతో అనునాదం చెందడమే. ప్రాణాహుతి ఎంత స్వచ్ఛమైనదో మీరు గ్రహిస్తారు. అది మూలం నుంచి వస్తుంది. కనుక దాని ప్రకంపన అత్యున్నతంగా ఉంటుంది. మనం ధ్యానంలో వికాసం చెందే కొలదీ మన ప్రకంపనలు మెరుగుపడి, కొంతకాలానికి మన ప్రకంపనలు ప్రాణాహుతి ప్రకంపనలతో ఏకమౌతాయి. అప్పుడిక ప్రాణాహుతి సంబంధ ప్రకంపనలను గుర్తించలేము. మన స్వీయ ప్రకంపనలనీ గ్రహించలేము. ఈ రెండూ సమంగా మారిపోతాయి.
మనం పురోగతి చెందుతున్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ఇది కూడా ఒక సూచన. నేను గ్రహించే ప్రాణాహుతితో నేను తక్షణమే అనునాదించ బడడం కూడా కీలకమే.
రెండవ ముఖ్య సాధన, నిరంతర స్మరణ. దీని గురించి మీకు తెలుసు కనుక మరింత మాట్లాడను, అలాగే క్లీనింగ్. నిరంతరస్మరణ లోనూ తెలిసో తెలియకో కొన్నిసార్లు సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి, నిర్మలీకరణ తప్పనిసరి. తెలియక చేసిన తప్పులకు క్షమించమని రాత్రి నిద్రపోయే ముందు భగవంతుని ప్రార్థించండి. మన పదవ ఆదేశము దీని గురించే. తెలియక చేసిన తప్పులకు క్షమార్పణ వేడుకొనండి. తెలిసి చేసే తప్పులు క్షమించమని ఎలా అడగడం అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. తెలిసి చేసే తప్పుల గురించి మాస్టర్ ఏమంటారంటే, మనం ఏం చేసినా, తెలిసి చేసిన వాటికి పర్యవసానాలు తప్పవు.
ఈ సెమినార్ నుంచి జీర్ణం చేసుకోవడానికి ఎంతో విషయం ఉంది. దీన్ని తీవ్రంగా పరిశీలించి, బాగా ఆలోచించి మన జీవితాన్ని సక్రమమైన దారిలో మెరుగుపరుచుకోవాలి. ప్రతీ క్షణాన్ని ఒక చక్కని అవకాశంగా మలచుకొని, మన ఎదుగుదలను చూసి ఆ దివ్య మాస్టర్స్ చిరునవ్వు చిందించే విధంగా, వచ్చే భండారాకు మరింత బాగా తయారవుదాం.
త్వరలో కలుద్దాం… ధన్యవాదాలు.