Daaji’s talk 9th March 2019
ధ్యానం ద్వారా మన స్వీయ ప్రగతి లేదా పరిణామం గురించి తరచుగా ఆందోళన చెందుతాము. మనం నిజంగా ప్రగతి చెందుతున్నామా లేదా అని కూడా తరచూ అర్థం చేసుకోలేము. మరికొంతమంది తమకేమీ తెలియకపోయినా తామెంతో సాధించామని సాధికారికంగా అనుకుంటారు. ఇది కొంతమంది వ్యక్తులలో పెద్ద వ్యత్యాసాన్నే చూపిస్తుంది.
నేను ఇదివరకు చెప్పిన గుర్రాల ఉదాహరణలో బాగా పెంచబడిన గుర్రాలు, సాధారణ గుర్రాలు మరియు ఎంతకీ కదలని గుర్రాలు అని మూడు వర్గాలుగా విభజించినట్లు వీరిని కూడా ఒక సమూహంగా చేయవచ్చు. కదలని వాటిని కొరడాతో ఎంత కొట్టినా కదలవు. ఒక్కో కొరడా దెబ్బతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటాయి. బాగా తర్ఫీదు ఇవ్వబడిన గుర్రాలు కొరడా నీడను చూడగానే పరిగెత్తుతాయి. అభ్యాసీల విషయంలోనూ అదే పరిస్థితి. చిన్న సైగ, అతి సూక్ష్మమైన సూచన, చెపుతున్న వాక్యం పూర్తి కాకముందే కొందరు చక్కగా అర్థం చేసుకుంటారు. స్థూలమైన వ్యక్తులు భగవంతుడు తమకు ఏమీ ఇవ్వలేదని, అందుకే తాము విచారంగా ఉన్నామని అంటారు. సూక్ష్మంగా ఉండే వ్యక్తులు చక్కగా పెంచబడిన గుర్రంలా అన్నింటినీ ఆశించరు. వారికి ఎంత చిన్న మొత్తం లభించినా కృతజ్ఞత తో ఉంటారు. ప్రకృతి నుండి గాని భగవంతుని నుండి గాని లభించిన వాటికి ఎప్పటికీ కృతజ్ఞులై ఉంటారు.
మన సాంప్రదాయంలో, సహజమార్గ సంస్కృతి అని నేను అనను కానీ భారతదేశంలో, ముఖ్యంగా, ‘గురుదేవా! ఆశీర్వాదాలు ఇవ్వండి,’ అని అడుగుతారు. మీరు ఆశీర్వాదాలను ఎలా తీసుకోగలరు? ఇదేమైనా నేను చెప్పాను నువ్వు తీసుకున్నావు వంటిది కాదు కదా! భగవంతుడు పిసినారి కాదు. ఆయన దృష్టి అందరిపై సమంగా ఉంటుంది. అందరినీ సమదృష్టితో చూస్తారు. అతడు పుణ్యాత్ముడు కావచ్చు, పాపి కావచ్చు. పుణ్యాత్ములు దాన్ని సరైన విధానంలో గ్రహించగలుగుతారు. పాపులు అలా గ్రహించలేరు. దీవెనలు అందరికీ సమంగానే ఇవ్వబడతాయి.
ఉదాహరణకి వర్షం పడుతున్నప్పుడు ఒకరు బకెట్ ను సరిగ్గా పెడితే, మరొకరు తలకిందులుగా పెడతారు. ఇప్పుడు తమాషా చూడండి. వర్షం సరిగ్గా పెట్టబడిన బకెట్ ను నీళ్లతో నింపుతుంది. తలకిందులుగా ఉన్నది ఎప్పటికీ నిండదు. అది 10 సెంటీమీటర్ల వర్షం, లేదా 100 సెంటీమీటర్ల వర్షం అనేది విషయం కాదు. తలక్రిందులుగా ఉన్నది ఖాళీగానే ఉంటుంది. కాబట్టి మన ముఖాన్ని ఇచ్చే వారి వైపు మరల్చాలి.
కాంతి యొక్క మూలానికి, వస్తువుకు మధ్య దూరం ఎక్కువైనప్పుడు నీడ పొడవుగా ఏర్పడుతుంది. ఏ అంతరం గురించి మనం మాట్లాడుతున్నాం? శిష్యుని వైపునుండి మూలం వైపుకు గల భావోద్వేగ అంతరం ఎంత ఎక్కువ అయితే, దూరం అంత ఎక్కువై నీడ అంత పొడవుగా, పెద్దగా ఏర్పడుతుంది.
దగ్గరగా మనం ఉంటే కాంతి ఎప్పుడూ ఉంటుంది. మన చుట్టూ కాంతి ఉంటుంది. మనం మూలంగా తయారవ్వాలి. ఎంపిక మనదే. మీరు మూలం కావాలనుకుంటున్నారా? లేదా పొడవైన నీడలా ఉండాలనుకుంటున్నారా? ఇదంతా కూడా మన వైఖరి కి సంబంధించిన విషయం.
సరిగ్గా నిలబెట్టిన బకెట్, తలక్రిందులుగా ఉన్న బకెట్… చాలా సులువైన ఉదాహరణ కానీ వ్యత్యాసం చాలా ఎక్కువ. గుర్రాల విషయంలో కూడా, కొన్ని గుర్రాలు గాడిదల్లాగ అసలు కదలవు.
అభ్యాసీల్లో ఎక్కువమంది సాధారణమైన వారే. పదే పదే చెప్తారు కానీ కొంతకాలం తర్వాత చెప్పిన విషయం మరచి పోతారు. నా బకెట్ పూర్తిగా నిండి ఉన్నదని నమ్ముతారు. నేను చేయడానికి ఏమీ లేదు అనుకుంటారు. కానీ మీ బకెట్ సరిగ్గా నిలబెట్టబడి, మీ వైఖరి సరిగ్గా ఉండి, అది నింపబడినప్పటికీ మరో సమస్య ఉంటుంది. ఆ బకెట్టు అడుగున రంధ్రం ఉండవచ్చు. నీళ్లు ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. బకెట్ ను సరిగ్గా నిలబెట్టినప్పటికీ, రంధ్రాలు అంటే కోరికలుంటే అవి మన శక్తిని హరిస్తాయి. కాబట్టి దీవెనలు అడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీవెనలు ఇవ్వడంలేదని భగవంతుని నిందిస్తారు. దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి కానీ ‘భగవంతుడా, దీవెనల కోసమే మేము ఇక్కడికి వచ్చాము’ అని ఎప్పుడూ అనకండి.
మనల్ని మనం తయారు చేసుకోవడం మన పని. అంతే!! ఆ తయారీ దృఢనిశ్చయంతో ఉండాలి. ఒక తపస్సులా, అసాధారణ స్థాయిలో ఉండాలి. అయితే ఉదయం ధ్యానం, సాయంత్రం నిర్మలీకరణ, నిరంతర స్మరణ, తపనను పెంచుకోవడం ఏదీ చేయరు. మన మాస్టర్ లు మనలో నిలుపుకోవడానికి ఇవ్వాలనుకున్న చైతన్య మార్పును, శక్తిని ఎలా ఆశిస్తారు? మీరు వాటిని నిలుపుకోలేరు. దానికి అభ్యాసం తప్పనిసరి. అభ్యాసం, సరైన వైఖరి లేకుండా మనం ప్రగతిని సాధించలేము. మీకు బాగున్నట్లుగా అనుభూతి చెందవచ్చు. ఒక రాతి యొక్క ఉపరితలం వర్షం కురిసినపుడు దొర్లుతూ నునుపుగా అవుతుంది. శాశ్వతమైన ప్రశాంతతను అంతరంగంలో ఏర్పరచుకోవాలి. మనం మూలము అయ్యే అవసరం ఉంది. మూలము తో లయమవ్వడం గురించి మర్చిపోండి. మూలమే అవ్వండి. విన్నందుకు ధన్యవాదాలు.