మన ప్రయాణం విసుగెత్తేలా, సుదీర్ఘంగా, అనంతంగా కొనసాగుతుంది. దీనికి ఎంతో ఓపిక అవసరమవుతుంది. వారి కృపతో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, మనం ప్రయాణాన్ని శాంతంగా, ఏకాంతంగా కొనసాగించగలుగుతాం.
వారి నుండి మనకి బహుమతిగా ప్రసాదించబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లాలాజీ వసంత పంచమి ఉత్సవాలతో ప్రారంభించి, బాబూజీ మహరాజ్ జన్మదినోత్సవం… అలా ఎన్నో. ఒక్కోసారి మనకు తెలియకుండానే,
మనం వారితో సమశృతిలో ఉండకుండానే అవి వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. మన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలంటే… ఆ ప్రకంపనలను అందుకోగలిగినంతగా
సున్నితత్వాన్ని మనలో పెంపొందించుకోవాలి. వారి పిలుపుకు అనుగుణంగా మరింత గాఢంగా, లోతులకు మునక వెయ్యాలి. ఆ ప్రకంపనలకు, సరళంగా చెప్పాలంటే ఆ ప్రాణాహుతికి, మనం ప్రతిస్పందించగలగాలి.
ఒక్కోసారి అభ్యాసులు అడుగుతుంటారు, ఇవాళ మీరు ప్రాణాహుతిని ప్రసారం చేస్తారు కదా! అని. ప్రిసెప్టర్ గానీ, మాస్టర్ లేదా అనంతం నుంచి విముక్తాత్మ ఎవరు ప్రసారం చేసినా తేడా ఏముంది? ఇక్కడ విషయమేమంటే, మనకు ప్రేమపూర్వక సంరక్షణ లభిస్తోంది కదా! దాన్ని మనం ఆస్వాదిస్తూ లోలోతులకు వెళ్లగలగాలి. మన మాస్టర్ల జీవితాలు నా దృష్టిలో చాలా లోతైనవి. మనమెలా జీవించాలో వారు మనకు వాటి ద్వారా బోధిస్తారు. శిష్యులుగా, అభ్యాసులుగా వారు ఏం చేశారో అది అసాధారణం. మాస్టర్లుగా వారి జీవితాన్ని మర్చిపోండి. అభ్యాసులుగా వారు ఏం చేశారు? ఎలా చేశారు? ఏదైనా కానీ, అది మనకు మరింత ముఖ్యం. దాన్ని గమనించడం ముఖ్యం. మాస్టర్ గా వారి జీవితం మనకి అంత ముఖ్యం కాదు. అది మనకు పెద్దగా నేర్పదు. ఎందుకంటే అది తయారైన వస్తువు. తయారైన వస్తువు నుండి మీరేం నేర్చుకుంటారు? వాళ్ళ వరకూ వాళ్ళు తాము తయారైపోయామని ఎప్పుడూ భావించరు.
అభ్యాసులుగా మనం వారిని పూర్తిగా తయారైన వారిగా భావించి పొరపాటు చేస్తున్నాం. వారు కూడా పరిణామం చెందుతూ ఉంటారు. అలా కాకపోతే, ఈ అనంత ప్రయాణంలో తుది, ముగింపు అనేవి ఉండాలి కదా!
అది విరుద్ధంగా ఉంటుంది. అనంత ప్రయాణంలో ఫుల్ స్టాప్ లు ఎలా ఉంటాయి? కనుక అది సరికాదు. మనం తరచుగా స్వర్గం లేదా బ్రైటర్ వరల్డ్ అనేది ఎక్కడో ఉందనుకుంటాం. అది ఎక్కడో లేదు. ఇక్కడే, ఇప్పుడే,
ఈ జీవితంలోనే దాన్ని అనుభూతి చెందకపోతే… మన కోసం వేచి ఉండే దివ్యలోకాలు అంటూ ఎక్కడో లేవు. అది మన హృదయంలోనే ఉంది. వారి అంతరంగిక సంభాషణల్లో బాబూజీ ఇలా అన్నారు… “మనం భగవంతుని కోసం హృదయంలో తప్ప అన్నిచోట్లా వెతుకుతూ తప్పు చేస్తాం… భగవంతుడే మనల్ని వెతికితే ఇక ఇబ్బంది ఏముంది? ఆయనే మన హృదయాన్ని తన నివాసంగా, తన దివ్యధామంగా ఏర్పరుచుకోవాలని భావిస్తే, ఆయనకు అవరోధం ఏముంటుంది?” హింసాత్మకమైన గృహంలో మీరు నివసించడానికి ఇష్టపడతారా? కోరికలతో, మరెన్నో విషయాలతో నిండిపోయిన ఇంట్లో నివసించగలరా? కనీసం అతిథిగా అక్కడ ఒక గంటసేపైనా ఉండగలరా? కాబట్టి స్వాగతించే వైఖరి అవసరం. అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనం ప్రేమతో ఆహ్వానించగలమా? మనం ఆహ్వానిస్తాం. అయితే అటువంటి ప్రేమపూర్వక వాతావరణాన్ని మనలో సృష్టించగలమా? ఇవి రెండూ విభిన్నమైనవి. ప్రేమపూర్వక వాతావరణం సృష్టించగలిగితే మనం ఆహ్వానించకుండానే వారే స్వయంగా దిగి వస్తారు. సహజంగా ఆకర్షితులవుతారు. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. స్వర్గమే, ఆ దివ్యలోకాలే మన హృదయంలోకి దిగి వస్తాయి. అటువంటి అభ్యాసులు ఎక్కడికి వెళ్ళినా వారి ప్రేమ ప్రకంపనలతో… వినమ్రతతో, వివేకం, అవగాహనలతో స్వర్గాన్నే సృష్టిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ, ప్రదేశంలోనూ, ఎవరిపైనా, మనం షరతులను విధించం. మన అభిప్రాయాలు ఎంత సరళంగా, అనువుగా ఉంటాయంటే, ‘ఇష్టమైతే స్వీకరించండి, లేకపోయినా పర్వాలేదు’ అనేలా ఉంటాయి. మన భావాలు ఇతరులపై రుద్దాలని అనుకోం. ఒక విధంగా హార్ట్ఫుల్నెస్ ప్రపంచానికి మనం సరళంగా ఉంటామనీ, కఠినంగా ఉండమనీ తెలియజేసే పద్ధతి. ఇలా కాదు అలా అని ఎప్పుడైతే అంటామో, అది సహజమార్గం కాదు. అప్పుడు మనం దివ్యలోకాలను మన చుట్టూ సృష్టించుకోనట్లే. అహంకారంతో మన ఆస్తిత్వాన్ని బలంగా ప్రకటించడం ద్వారా, మన చుట్టూ చీకటి ప్రపంచాన్ని తయారు చేసినట్లే. నేను నా దివ్య గురువర్యుల లక్షణాలను నాలోనికి ఆకర్షిస్తున్నాను… నేను వారిలా తయారవుతున్నాననే ఆలోచన కూడా, అదెంత ప్రార్ధనాపూర్వకమైనదైనప్పటికీ…
అందులో కూడా ఎక్కడో దురాశ ఉంటుంది. ఈ ప్రేమ సంబంధంలో నేనలా తయారవ్వాలి, ఇలా తయారవ్వాలి అనే అభ్యర్థనకు తావున్నదని నేననుకోను. మరింత ప్రేమ పూర్వకంగా లేదా ఎవరినో సహించాలనీ… అలాంటివి ఉండవు. మన అస్తిత్వానికి అంగీకారమే కీలకం. సహజమార్గం అంటే అంగీకారం గురించే. మీరు విషయాలను సంతోషంగా అంగీకరిస్తే, అది ఉన్నత దశ. అంగీకారమనే భావనే తలెత్తకుండా, సంతోషంగా ఉండగలిగితే
అది ఏదైనా కానీ, మీరు విజయవంతమైనట్లే! నేను అంగీకరించాననే భావన కూడా మీ మనసులోకి ప్రవేశించదు. మనం ఎంత పరిపూర్ణ శూన్యత్వంగా తయారవుతామంటే… మన గుండా ఏది ప్రవహించినా, అది ఆనందమైనా విషాదమైనా, మీరు దాన్ని తుడిచేయగలరు. మీ కళ్ళముందే అన్నీ కరిగిపోతాయి. ఇవన్నీ నిజానికి చాలా ఉన్నత లక్ష్యాలు… సందేహం లేదు! అయితే సత్యతత్వం మన స్థాయికి దిగివచ్చి
కష్టాలని మనం వేటినైతే భావిస్తామో, వాటిని విశ్లేషిస్తుంది. నిర్మలీకరణకై మనం సాయంత్రం కూర్చున్నప్పుడు… మనం మన వెనుక భాగం నుండి అవి ఆవిరైపోతున్నట్టు భావిస్తాం. రాత్రిపూట మన సమస్యలను, వారు పరిష్కరించినా, లేకపోయినా మాస్టర్ ముందు పెడతాం. ఒకవేళ ఆ సమస్య అలాగే ఉంటే, దానిపై పని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఇక మీ సమస్యగా ఉండదు. మీరు ఇంకెవరికో సమస్య సృష్టించారు.
ఇప్పుడు మీరు మాస్టర్ ను పరిష్కరించమని కోరుతున్నారు. మనకు వచ్చిన సమస్యలను పరిష్కరించడం సులువే. అయితే మనం ఇతరులకు సమస్యగా మారినప్పుడు, అప్పుడది పరిష్కరించడం కష్టసాధ్యమవుతుంది.
ఎందుకంటే అది ఇగో కు సంబంధించినదౌతుంది. అప్పుడు తేజోమయ లోకాలు మన హృదయంలోకి దిగి రావు. గుణాతీతంగా, పరిపూర్ణ శూన్యత్వం ఉన్నప్పుడే ఆ దివ్యలోకాలు మనలో ఏర్పడతాయి. అప్పుడు మనం సహజమార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పవచ్చు. మనం ఎక్కడికి వెళ్లినా ఆ దివ్య లోకం సృష్టించబడుతుంది. అటువంటి హృదయాలలో డిమాండ్లు ఉండవు. వారు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. వారిలో సంతృప్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్థితుల గురించి కూడా అడగాలని అనిపించదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం శరణాగతి చెందామో, సృష్టికర్త ఇచ్చినదంతా అంగీకరించామో… అప్పుడు సంపూర్ణ సంతృప్తి నెలకొంటుంది. ఈ సంతృప్తి నెమ్మదిగా పెరిగే కొలదీ – ఇది సరైన పదజాలం కాదు కానీ… నేను వ్యక్తం చేయగలిగే సరైన పద్ధతి ఇదే, సంతృప్తి క్రమంగా ఎక్కువ అయ్యే కొద్దీ, అది అఖండ సంతృప్తికి దారి తీస్తుంది. హృదయంలో నాటబడ్డ సంతృప్తి బీజాలు పెరిగి పెద్దవై ఏదో ఒక రోజు వికసించి సంతృప్త వనం తయారవుతుంది. ఈ సంతృప్తి ద్వారా ఏర్పడే పుష్పాల మకరందం, సువాసనలు, సంతోషం, శాంతి, ప్రశాంతతలు. వీటిని ఆ వ్యక్తి అన్ని చోట్లకు తీసుకెళ్తాడు. ఎందుకంటే సంతృప్తి బీజాలు ఇప్పుడు పెరిగి పెద్దవై శాంతి పరిమళాన్ని వెదజల్లే మహావృక్షాల్లా తయారయినాయి. సంతృప్తిలో డిమాండ్లు ఉండవు. డిమాండ్లు ఎప్పుడైతే మన నుండి ఉండవో… మనల్ని చూసి ఎవరూ భయపడరు.
అందరూ మనల్ని అంగీకరిస్తారు. మన వైపు నుండి కోర్కెల అలలు ఉండవు. ఈ చిన్న ఆలోచనను మీతో పంచుకుందామనిపించింది. స్వచ్ఛమైన హృదయాలలో మనం సంతృప్తి బీజాలను నాటుదాం. సంక్లిష్టతలు మాలిన్యాలు తొలగించి, దాన్ని మరింత స్వచ్ఛంగా తయారు చేద్దాం. పద్ధతి మనకు ఇప్పటికే ఇవ్వబడింది. పద్ధతి కోసం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. అది మనకు ఇవ్వబడింది. దాన్ని సంతోషంగా ఉపయోగిద్దాం. మన గురువర్యుల జన్మదినోత్సవాలను వేడుకగా జరుపుకుందాం. వారి విలువలను గుర్తిద్దాం. వారి గుణగణాలు, విలువలు కోరుకోవద్దు. అయితే వారిలా తయారై, వారి సహాయంతో వారికి అతీతంగా ఎదగాలి. ఇది ఆ దివ్య గురుదేవులను అవమానించినట్లు కాదు. నేనిది పదే పదే చెబుతున్నాను… ‘మేము మీ కంటే ఉన్నత స్థాయికి చేరామంటే’, మన గురుదేవులు తప్పక సంతోషిస్తారు. అందరికీ ధన్యవాదాలు.