శ్రీ రామచంద్రజీ మహరాజ్ అత్యుత్తమ ఆవిష్కరణ ఏమిటి? సరళంగా చెప్పాలంటే మొదటిది ధ్యానం, రెండవది కూడా ధ్యానమే! కానీ ప్రతి ధ్యానంలో వైవిధ్యం ఉంది. రామచంద్రజీ మహరాజ్ ప్రాణాహుతిని కనుగొన్నప్పుడు ప్రాణాహుతి ప్రవాహం మన హృదయంలో కొనసాగుతున్నప్పుడు, మన చైతన్యంలో ఒక దివ్యజ్యోతి వెలుగుతుంది. మనం దాన్ని ఒక సాక్షిగా చూస్తూ అనుభూతి చెందుతాం.
సాధారణంగా చేసే ధ్యానంలో మనం ఆ అనుభూతిని పొందలేము. హృదయం లోని దివ్య తేజస్సు పై ధ్యానం చేస్తూ మన మొదటి రోజు నుండే సమాధి స్థితిని పొందగలుగుతాం. దాని కొరకు 50 – 60 సంవత్సరాల తపస్సు అవసరం లేదు. ఈ ప్రాణాహుతిని కనుగొనడమే వారి గొప్ప ఆవిష్కరణ.
ప్రాణాహుతి అనేది శ్రీరామచంద్ర మిషన్ యొక్క ప్రాథమిక సూత్రం. ఈ ప్రాణాహుతి లేకుండా చేసే ధ్యానం ఇతర ధ్యాన పద్ధతుల లాగానే ఉంటుంది. జీవం లేని శవం లాగా! ప్రాణాహుతి లేకుండా ధ్యానం సాధ్యం కాదు. ప్రాణాహుతి తో కూడిన ధ్యానం ద్వారానే సమాధి స్థితిని వికసింపచేసుకోగలం. సమాధి స్థితిని పొందిన తర్వాత మన జీవితంలో కొత్త జీవం వస్తుంది. శ్రీ రామచంద్రజీ మహరాజ్ చెప్పినట్లుగా “మన జీవితంలో జీవం” అనే వాక్యానికి నిజమైన అర్థం తెలుసుకోగలం. ప్రతి వ్యక్తిలోనూ వికసించే ఆధ్యాత్మిక జీవితమే నిజమైన జీవితం. ఇదే మన భారతీయ సాంప్రదాయం. ఏమైనా నామాలు లేదా మంత్రాలు జపిస్తున్నప్పుడు ఉదాహరణకు గాయత్రీ మంత్రం… అది చాలా శక్తివంతమైన మంత్రం. మంత్రం యొక్క సారం, అంతరార్థం తెలియకుండా దాన్ని మరలా మరలా జపించడం మన మూర్ఖత్వం మాత్రమే! ఈ మంత్రం యొక్క సారం ఏమిటి?
మంత్రం ఏమి చెబుతుందంటే, “భూలోకం, పితృలోకం, స్వర్గలోకం అంతా వ్యాపించి ఉన్న నిత్య జ్యోతిస్వరూపమైన ఓ మాతా! నాకు ఆ అనుభూతిని ప్రసాదించండి. నాకు విజ్ఞతను, బుద్ధిని ప్రసాదించండి”. అంటే “ఆ సారాన్ని మన హృదయంలో అనుభూతి చెందాలి. ఆ జ్యోతి నా జ్ఞానాన్ని వెలిగించాలి” అని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే బుద్ధిలో చాలా స్థాయిలు ఉంటాయి. వివేకంలో ఐదు, ఆరు స్థాయిలు ఉన్నాయి. సాధారణ స్థాయి నుండి మేధ, ప్రజ్ఞ ఇలా చాలా స్థాయిలు ఉన్నాయి.
మేధస్సు అయిదు గుర్తించదగిన, గుణాత్మకమైన స్థాయిలను కలిగి ఉంటుంది. అది ఒక అశ్వం వంటిది. మంచి శిక్షణ ఇచ్చిన అశ్వం. కొన్ని గుర్రాలు ఉంటాయి. వాటిపై ఎక్కి కూర్చొని ఎంత అదిలించినప్పటికీ, నెట్టినా తోసినా కదలను కూడా కదలవు. మంచి శిక్షణ నిచ్చిన గుర్రాలు కొరడా నీడ చూపినా చాలు, పరిగెత్తడం మొదలు పెడతాయి. వాటికి ఒక సైగ చేస్తే చాలు.
మన బుద్ధి కూడా అటువంటిదే. ఒక చిన్న సంకేతం, ఒక మంచి సంకల్పంతో అభివ్యక్తీకరించబడుతుంది. రామచిలుక ను చూడండి. దానికి గాయత్రీ మంత్రం నేర్పితే, అది ఇక ఆ మంత్రాన్ని వల్లే వేస్తూనే ఉంటుంది. మీరు కూడా అలానే మంత్రాన్ని వల్లించినా, పదిలక్షల సార్లు వ్రాసినా ఏం ప్రయోజనం ఉండదు.
‘అమ్మా! ఈ సృష్టికి మూలం నీవు. నా హృదయంలో జ్ఞానజ్యోతిని ప్రకాశింప చేయి’ అని అంతరంగంలో వేడుకొంటేనే ఫలితం ఉంటుంది. ఆ మంత్రజపం చేయడం లోని ముఖ్యోద్దేశ్యం కూడా అదే. మన ఆదిగురువు రామచంద్రజీ మహరాజ్ దీన్ని సుసాధ్యం చేశారు. ధ్యాన పద్ధతిని ఆయన సరళం చేశారు. ధ్యానానుభూతిని పొందాలన్న అభిలాష కలిగిన వ్యక్తి గృహస్థ జీవితాన్ని అనుభవిస్తూ కూడా ఎలా ధ్యానం చేసుకోవచ్చో ఆయన తెలియ చేశారు.
సరళీకరణ అనేది కీలకమైన విషయం. నేటి యువత యొక్క స్వభావాన్ని, లక్షణాలను మార్చాలని చాలామంది భావిస్తూ ఉంటారు. యువత మాట వినడం లేదని వారు అంటూ ఉంటారు. వారు ఎందుకు వింటారు? వారు ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం మంచిదే! కానీ వారి ప్రశ్నలకు సమాధానం మన వద్ద లేదు. అనుభవం ద్వారా మాత్రమే సమాధానం ఇవ్వగలం.
భగవంతుని నమ్ముతారా? అంటే అందరూ నమ్ముతాం అనే చెప్తారు. అయితే ఎందుకు నమ్ముతారు అని యువత ప్రశ్నిస్తుంది. మన దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది. మన శాస్త్రాలు, తల్లిదండ్రులు, పండితులు, పూజారులు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం అంటారు. అయితే మీరేం అనుకొంటున్నారు? ఎప్పుడైనా భగవంతుని అనుభూతి చెందారా అని ప్రశ్నిస్తే నోరు మూత పడిపోతుంది. అలా ప్రశ్నించడం వలన కొంతమందికి కోపం కూడా వస్తుంది. మీరు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటారు. యువత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం. అయితే వారితో ప్రాణాహుతితో కూడిన ధ్యానసాధన చేయిస్తే, వారు అర్ధం చేసుకొంటారు. ఇందులో ఏదో ఉంది, వాదించవలసిన అవసరం లేదు అని వారు అర్ధం చేసుకొంటారు. అనుభూతి చెందినప్పుడు నమ్మకాలు, శ్రద్ధ వీటితో పని ఉండదు.
ఎందుకంటే ఒకసారి నేను ఇది సూర్యుడు, ఇవి నక్షత్రాలు, ఇది చంద్రుడు అని చూసినప్పుడు నమ్మకం యొక్క అవసరమేముంది? మీరు కళ్ళతో స్వయంగా చూస్తున్నారు. గాయత్రి యొక్క సారాన్ని మీ హృదయంతో అనుభూతి చెందుతున్నారు. వేద కాలమని చెప్పే ఆ సమయంలో మన దేశంలో, వైదిక కాలంలో ఒక్క మందిరం కూడా లేదు. పూర్తిగా నాలుగు వేదాలూ చదవండి. మందిరం విషయంలో ఎవ్వరూ దిగులు పడేవారు కాదు. ఎందుకు? మనకు ఋషులు, మునులు ఉన్నారు కదా! మనలో కూడా అలాంటివారు ఉన్నారు, వారంతా ఋషుల వంటి వారే. వారికి ఈశ్వరుని అనుభూతి కలుగుతుంది. ఈశ్వరుని అనుభూతి కలిగినప్పుడు బయట ఉండే వాటి అవసరం ఏముంటుంది? అందువల్లనే అప్పట్లో మందిరాలు లేవు.
క్రమక్రమంగా హిందూ ధర్మం పతనం చెందనారంభించినప్పుడు, మందిరాలు వెలవడం మొదలైంది. కొందరు ఇదంతా శ్రద్ధకు సంబంధించిన విషయం అంటారు. ఔను! ఆధ్యాత్మిక విషయంలో తప్పకుండా శ్రద్ధకు సంబంధించిన విషయం ఉంటుంది. శ్రద్ధ లేనప్పుడు తలవంచుకోవడం వలన ఏం ప్రయోజనం ఉండదు. శ్రద్ధ ఉన్నట్లయితే, తలవంచుకోవలసిన అవసరమే లేదు. ఇది పూజ్య లాలాజీ మహరాజ్ చాలా గర్వంగా, ధైర్యంతో, పూర్తి స్పష్టీకరణతో ప్రపంచానికి చెప్తున్నారు. ధ్యానం చేయండి, ప్రాణాహుతి తో ధ్యానం చేయండి అని. అప్పుడు మీ జీవితంలో ఎలాంటి ప్రకాశం వస్తుందో చూడండి.
ప్రతి ఇంట్లో ధ్యాన పద్ధతి నెలకొంటుంది. అందరికీ మన దేశంలో ఈ ధ్యాన పద్ధతి ఉందని తెలుస్తుంది. దాన్ని మనదిగా చేసుకుందాం. ఇది మన సంస్కృతిని సంరక్షించుకోవడానికి రానున్న తరానికి అందించ వలసిన అవసరముంది. ముఖ్యంగా ఉచితంగా అందివ్వడం. దీనికి డబ్బు అవసరం లేదు. బ్రహ్మజ్ఞానాన్ని మనదేశంలో అమ్మడం మొదలెడితే, ఈ బ్రహ్మజ్ఞానాన్ని, యోగ విద్యను మన దేశం అమ్మడం మొదలెడితే, మన దేశం భారత దేశంగా మనజాలదు. ఎందుకంటే బ్రహ్మవిద్య ఎప్పుడూ అమ్మబడేది కాదు. ఏ క్రియ కైనా డబ్బు తీసుకోరు. యోగాన్ని ఉద్యోగంగా ఎప్పుడూ చేయకూడదు. ఇది మన గురువర్యులు శ్రీ రామచంద్రజీ వాగ్దానం.
మనం పోయిన తర్వాత కూడా…మనమైతే వెళ్ళిపోతాం. మీలో కొందరు వెళ్ళిపోతారు. మనమంతా వెళ్ళిపోయే వాళ్ళమే. ఒక్కోసారి ఒక్కో వికెట్ అయితే పడిపోతూ ఉంటుంది. కానీ తర్వాత తరానికి అంటే కుమార్తెకు గాని కుమారునికి గాని అయితే చూపాలి కదా! ఈ జ్ఞానాన్ని మీకు వదిలి వెళ్తున్నాం. దీన్ని వ్యాపారంగా ఎప్పుడూ చేయవద్దు.