బుద్ధుని వ్యవసాయం

అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు

-బుద్ధుని వ్యవసాయం-

ఒక రైతు, తన పంట చేతికొచ్చిన సందర్భంగా సంతోషంతో పండగ జరుపుకొంటున్నాడు.

అదే సమయంలో, అటువైపుగా బుద్ధుడు రావడం జరిగింది.

తన సంబరాలకు అంతరాయం కలిగిస్తూ, చేతిలో భిక్షాపాత్రతో తన ముందు నిలబడిన బుద్ధుడిని చూసి, రైతుకు కోపం వచ్చింది.

అతను బుద్ధుడితో, ” అయ్యా, నేను కష్టపడి, పొలం దున్ని, విత్తనాలు నాటి, పంట పండించాను. దానివల్ల నాకు ఈ ఆహారం సమకూరింది. మీరు కూడా ఏదైనా పని చేసుకొని బ్రతకవచ్చు కదా! ఇలా యాచిస్తున్నారెందుకు?”, అన్నాడు.

అందుకు బుద్ధుడు, “నాయనా! నేను చేసేది కూడా వ్యవసాయమే!” అని బదులు ఇచ్చాడు.

“ఐతే మరి మీ ఎద్దులు ఏవి, విత్తనాలు ఎక్కడ, నాగలి ఏది?” అని ప్రశ్నించాడు ఆ రైతు.

దానికి బుద్ధుడు,
“నాయనా! నేను చేసే శ్రమే, నేను ఉపయోగించే ఎద్దు;
నా మనస్సు అనే పగ్గాలతో నేను దానిని నడిపిస్తున్నాను;
ధర్మం అనే పిడి సహాయంతో నేను ఆ పగ్గాలు పట్టుకున్నాను;
శ్రద్ధ అనే పరికరంతో నేను ఆ ఎద్దును అదిలిస్తున్నాను;
నా విజ్ఞత, నా నిరాడంబరతే నేను ఉపయోగించే నాగలి;
ఆ నాగలితో దున్నుతూ, మాయ అనే కలుపు మొక్కలను తీసేస్తున్నాను;
విశ్వాసమే నేను నాటే విత్తనాలు;
నేను చేసే మంచి పనులే వాటికి పోషణ;
ఇలాంటి వ్యవసాయం వల్ల, నేను, అన్ని దుఃఖాలనూ నశింపజేసే ‘నిర్వాణం’ అనే శాశ్వతమైన ఫలాల్ని పండిస్తున్నాను,” అని సమాధానం చెప్పాడు.

గౌతమ బుద్ధుని ఆ బోధన లోని అంతరార్థం తెలుసుకున్న ఆ రైతుకు పరమానందం కలిగింది.
అతడు భక్తితో నమస్కరించి, ఒక బంగారు పాత్రలో పరమాన్నం తెచ్చి, బుద్ధుని పాదాల వద్ద సమర్పించాడు

Share this post