సంతృప్తిని కలిగించేవి ఏవి?
మనం ఆత్మతో సంపర్కం కలిగి ఉన్నప్పుడు సంతుష్టంగా ఉంటామనీ, సంతుష్టి, మనసు నుండిగాని, శరీరం నుండి గానీ లభించదనీ, దాని జన్మస్థానం ఆత్మ అనే విషయాన్ని ఇంతకు క్రితం తెలుసుకున్నాము.
ఇప్పుడు మనం ఆ సంబంధాన్ని అనుభూతి చెందటానికి సహకరించే సాధనల గురించి పరిశీలిద్దాం. ఈ సందర్భంగా, ప్రాచీన యోగ పితామహుడైన పతంజలి యోగ సూత్రాలను తెలుసుకుందాం వాటిని ఆయన వేల సంవత్సరాల క్రితం రాసి నప్పటికీ, ఇప్పటికీ అవి విలువైనవి, వర్తిస్తాయి.
స్వచ్ఛత ->సంతుష్టి ->ఆనందం
స్వచ్ఛత నుండి నాలుగు లక్షణాలు ఉద్భవిస్తాయి పతంజలి అన్నారు.
అందులో మొదటిది సంతుష్టి.
అది ఎలా సంభవిస్తుంది? ఆత్మ చుట్టూ ఆవరించిన సంక్లిష్టతలు, మాలిన్యాలు, భారం మన వ్యవస్థ నుండి తొలగించుకొనడం ద్వారా, మనం మన చైతన్య క్షేత్రాన్ని శుద్ధీకరించి, అంతర్ముఖులమవుతాం, ఆత్మతో సంపర్కం ఏర్పరుచుకుంటాం. అసలు సిసలైన సంతుష్టిని మనం అనుభూతి చెందేది ఇక్కడే.
రెండవది, శాంతమైన సంతుష్టి వలన అసాధారణమైన ‘ఆనందం’ కలుగుతుందని పతంజలి అంటారు.
ఆ విధంగా స్వచ్ఛత సంతుష్టికి, సంతుష్టి ఆనందానికి దారి తీస్తుందన్నమాట. ఈ విధంగా లభించిన అసాధారణమైన ఆనందం ఒక అంతర్గత స్థితి. లౌకిక జీవనంలోని సుఖదుఃఖాలతో దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. ఎందుకంటే, అవి చంచలమైనవి, వస్తూ పోతూ ఉండే వాతావరణం వలే మారుతూ ఉంటాయి.
“నాకు సంతోషం, సంతృప్తిని కలిగించేవి ఏవి?” అని గనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, బహుశా మీకందే సమాధానం – మీరు ప్రేమించే వారితో మీ సంబంధబాంధవ్యాలు, మీ ఉద్యోగం లేదా సుఖవంతమైన జీవన శైలి.
మరి మీకు ఇవన్నీ లభించాయే అనుకుందాం, కాని మీ అంతరంగంలో శాంతి, ప్రశాంతతలు లేకపోతే, అప్పుడు మీరు నిజంగా ఆనందంగా ఉండగలరా?
“నా పరిస్థితులు మారిపోయినప్పుడు నేను ఎలాంటి అనుభూతికి గురవుతాను?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని చూడండి. బాహ్యపరమైన సంఘటనలు, పరిస్థితుల మీద మీ సంతోషానందాలు ఆధారపడి ఉన్నాయని గ్రహిస్తారు. ఒకవేళ పరిస్థితులు గనక దిగజారిపోతే – కోవిడ్ మహమ్మారి సంక్షోభంలో జరిగినట్లు – అప్పుడు కూడా మనం సంతోషంగా ఉండగలమా?
నిజమైన ఆనందంలో ఉండే వ్యక్తి, అన్ని పరిస్థితులలో ఆనందంగా ఉంటాడు. వ్యక్తులు, బాహ్య విషయాలు, సంతోషాన్ని తెచ్చినా అది తాత్కాలికమే. ఈ సంతోషం కూడా మన రోజువారీ జీవితంలో అవసరమే, కానీ అది మనతో శాశ్వతంగా ఉండదు. పరిస్థితులు మారినప్పుడు అది మాయమవుతుంది.
ఎప్పటికీ మనతో ఉండే ఆనందాన్ని ఎలా సృష్టించుకోగలం? మన మనుగడలో ఏమి సంభవిస్తున్నప్పటికీ మనం ఆనందంగా ఉండగల శిక్షణను మనకు ఎలా ఇచ్చుకుంటాం?
మన అస్తిత్వ కేంద్రంలోకి లోతుగా మునగడం ద్వారా, ఎప్పటికీ మనతో నిలిచిపోయే సంతుష్టిని మనం పొందగలమన్నది యోగం అందించే వాగ్దానం. యోగి వ్యవహరించే శాస్త్రమే సంతుష్టి.
“మన కేంద్రం నుండి ఏదీ మనలను వేరు చేయలేదు” అని ఓషో అంటారు.
ఆనందం గురించి జర్మన్ తత్వవేత్త షోపెన్ హావర్ యొక్క అతి ప్రాచుర్యం పొందిన ప్రశ్న, మనిషి సంతోషంగా లేదా ఆనందంగా ఉన్నాడని మనం ఎలా నిర్ణయించగలం? దీనికి సమాధానంగా అతడే నిర్వచించిన సూత్రం ఏం చెబుతుందంటే, అన్ని కోరికలు పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు కలిగేదే నిజమైన ఆనందం.
దీన్నే గణితపరంగా చెప్పుకోవాలంటే :
ఆనందం=ఫలించిన కోరికల సంఖ్య
ఎంత ఎక్కువగా కోరికలుంటే, వాటన్నింటినీ ఫలింప చేయడం అంత కష్టం అవుతుంది. కాబట్టి మనలో ఆనందం లోపిస్తుంది. కోరికల తీవ్రత పరంగా గనుక చూస్తే, మనకు కోరికలు తక్కువగా ఉన్నప్పటికీ వాటి తీవ్రత చాలా గణనీయంగా ఉంటే, అవి సంతృప్తి చెందేంత వరకూ మనం విశ్రమించం.
మనకు కోరికలే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అది, అపరిమితమైన ఆనందానికి దారితీయగలదు.
ఎందుకంటే, కోరికలే లేనప్పుడు మనం దేనికోసమూ ఎదురు చూడం. మనం దేనినీ ఆశించనపుడు మనం నిస్పృహ చెందనవసరం లేదు. దీనికి భిన్నమైన పరిస్థితిలో, అంటే నిస్పృహ చెందినపుడు, అది క్రోధానికి దారి తీసి, దాని వలన సమత్వం కోల్పోవడం, సమతుల్యం కోల్పోవడం వలన భయం ఏర్పడి, చివరకు మనం మన మానవతనే పోగొట్టుకునే స్థితి కలుగుతుంది.
https://cdn-prod.heartfulness.org/e-magazines/telugu/HFN_MAG_AUG21_TELUGU.pdf