యోగా మీద జరిగే శాస్త్రీయ పరిశోధనలను చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనమెందుకు ఈ పని చేస్తున్నాం? మనం యోగ సాధనల గురించి అన్ని విషయాలపై ముఖ్యంగా ప్రాణాహుతి సహాయంతో జరిగే హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతిపై పరిశోధనలు చేస్తున్నాం. సాధారణ ధ్యాన పద్ధతికి మరియు ప్రాణాహుతి ద్వారా జరిగే ధ్యాన పద్ధతి మధ్య గల విశేషమైన భేదం ఏమిటి?

ఈ ధ్యాన పద్ధతిలో ప్రజలు ధ్యానం ప్రారంభించిన మొదటిసారే మనందరం ధ్యానానికి ముందు ధ్యానం తరువాత మన చైతన్యంలో ఏం మార్పు జరుగుతుందో అనుభూతి చెందుతాం. మనకు ఈ విషయంలో శాస్త్రీయ నిరూపణ అవసరం లేదు. శాస్త్రీయ పరిశోధనలు శాస్త్రీయ దృక్పథం కలవారిని ఒప్పించడం కోసం మాత్రమే. ‘యోగా ప్రభావంతమైనది, యోగా వలన మన జీవితాలు రూపాంతరం చెందుతాయి, యోగా మనకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది, యోగా వివిధ చైతన్యస్థాయిలను అనుభూతి చెందేలా చేస్తుంది’ అని తెలియచేయడం.

రోజువారీ సాధన చేస్తున్నప్పుడు, మనలను అలాగే మన స్నేహితులను గమనించినప్పుడు, మేము 1974 లో ఫార్మసీ మొదటి సంవత్సరంలో చేరాము.‌ రెండు సంవత్సరాల తరువాత నేను ఈ ధ్యాన పద్ధతిని ప్రారంభించాను. 1976 నుంచి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచాయి. నేను నా స్నేహితులతో అప్పుడప్పుడు కలసి కూర్చొని మాట్లాడినప్పుడు, ఈ నలభై సంవత్సరాలలో ధ్యాన పద్ధతిని అవలంబించిన వారి జీవితాలలో, అలాగే ధ్యానం అలవాటు లేని వారి జీవితాలలో ఎటువంటి తేడా ఉందో గమనించవచ్చు. జీవితంలోని నాణ్యతలో గల తేడాను మనం గమనించవచ్చు. మీరు ప్రాణాహుతితో ధ్యాన పద్ధతి మొదలుపెట్టినప్పుడు మీ జీవిత పరిణామ క్రమంలో వేగవంతంగా ఉన్నారనడం అసంబద్ధమేమీ కాదు. లేదంటే మీ చైతన్యం పరిణామం చెందడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఈ ధ్యానం ద్వారా, కొద్ది సమయంలోనే మీ చైతన్యం మార్పు చెందడం గమనించవచ్చు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలి. ఉదయం 20 నిమిషాల ధ్యాన సాధన, సాయంత్రం 20 నిమిషాల నిర్మలీకరణ, పడుకోబోయే ముందు ఐదు నిమిషాల రాత్రి ప్రార్థన చేయాలి. మనకు పరిణామ క్రమంలో కొన్ని లక్షల సంవత్సరాల సమయం ఆదాతో పోలిస్తే ఇది కష్టమేమీ కాదు. మీరు వేగంగా పురోగమిస్తున్నారు. కొంతమంది “సార్! మాకు తీరిక లేదు. నేను ఫలానా వ్యక్తిని. నేను చాలా బిజీగా ఉంటాను” అని వాదిస్తారు.

మీరు మహాత్మా గాంధీ గారి వాదన విన్నప్పుడు వారు “మీరు నిజంగా బిజీగా ఉంటే ధ్యానం మీకు మరింత సమయాన్ని అందిస్తుంది” అని చెప్పేవారు. మీరు బిజీగా ఉన్నప్పుడే ధ్యానం చేయండి. మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇది ఎలా జరుగుతుంది? మీరు ఉదయం ధ్యానం చేస్తున్నప్పుడు, మీరు దివ్యత్వం యొక్క ఉనికి గురించి ఆలోచించడమే గాక ఆ రోజంతా చేయబోయే పనుల గురించి కూడా ఆలోచిస్తారు. మీ మనసులో మీరు చేయవలసిన పనులకై ప్రణాళికలు మెదలుతాయి. అలాగే మీరు ఎవరినైనా కలవడానికి ముందే, వాటికి తక్షణ పరిష్కారం మనసులో లభిస్తుంది. తరచుగా మీకు ఆ సమావేశం అవసరం లేదనిపిస్తుంది. ఆ సమావేశానికి ముందే మీరు “ఆ సమావేశం వలన పెద్దగా ఉపయోగం లేదు. నేనెందుకు ఆ వ్యక్తిని కలవాలి? దీనివలన నా సమయం వృధా అవుతుంది” అని భావిస్తారు. కాబట్టి మనకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయంలో ధ్యానం స్పష్టతనిస్తుంది.

కాబట్టి స్నేహితులారా మరియు ప్రియమైన పెద్దలారా! దయచేసి ధ్యానం చేయండి. ముఖ్యంగా మీకు సమయం లేనప్పుడే, తప్పక ధ్యానం చేయండి.‌ అలాగే ధ్యానం మీకు సమయాన్ని ఎలా అందిస్తుందో చూడండి.