ప్రశ్న: ఇతరుల నుండి మెప్పు, అంగీకారం ఆశించే బలహీనతల నుండి ఎలా బయట పడాలనేదే నా ప్రశ్న? వీటి వల్ల మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు స్రవించే హార్మోన్లు డోపమైన్ లాంటివి విడుదలవుతాయి. మనం అలాంటి ప్రశంసలే అన్ని చోట్ల కోరుకుంటాం కూడా. దాని కోసం మన ప్రవర్తనని, విలువలను కూడా మార్చుకుంటాం. మనం మన హార్మోన్లకు బానిసవ్వకుండా ధ్యానం మనల్ని బలమైన వ్యక్తిత్వం కలవారిలా ఎలా తీర్చిదిద్దుతుంది?
Q: How to get over external validations? The release of Dopamine triggers our behaviour pattern and we become addicted to such validations and some times change our values also. What is your opinion on this? How meditation helps in becoming a stronger individual.
దాజీ: మన ప్రియతముల నుంచి ధ్రువీకరణ లేదా ఒప్పుకోలు అనేది మనం సరైన దారిలో ప్రయాణించేటప్పుడు మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అదే మనం తప్పు దారిలో నడిచేటప్పుడు, ఒప్పుకోలనేది లేనప్పుడు, అప్పుడు మనలో గందరగోళం మొదలవుతుంది. మా నాన్నగారు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. నేనేం చేసినా ఆయన లేదు, కాదు, వద్దు అంటున్నారు. అలాగే ప్రొఫెసర్ల నుంచి ప్రోత్సాహం ఉండదు. దగ్గర స్నేహితులు కొన్నిసార్లు అంగీకరించరు. ఆ పరిస్థితుల్లో డోపమైన్ లెవల్స్ పడిపోతుంటాయి. ‘నాకు వీళ్ళ అంగీకారం అవసరం లేదు, నాకు నేనే తేల్చుకుంటా’ అనిపిస్తుంది.
శక్తి నాశనము కాదని, అది తన రూపాన్ని మార్చుకుంటుందనే విషయమై నిన్న మేము చర్చించుకున్నాం. వేడిమి నుంచి చల్లదనం లోకి, అలాగే వేడిమి నుంచి విద్యుత్ రూపంలోకి, విద్యుత్తు నుంచి ఇంకో రూపంలోకి… అలా ఎయిర్ కండిషనర్ కి కనెక్ట్ చేస్తే అది చల్లదనాన్నిస్తుంది. అదే హీటర్ ద్వారా, వేడి గాలులు..
అలాగే డోపమైన్ ద్వారా ప్రభావితమైన భావోద్వేగ శక్తి కూడా… నా హృదయ స్థితిని అనుసరించి ఎన్నో విధాలుగా ప్రకటితమవుతుంది. ఉదాహరణకి నా సంస్కారాలు, పూర్వ స్థితిని అనుసరించి లేదా నా గత ముద్రల ప్రభావంతో… నాకు కుక్కలంటే భయం అనుకోండి… కుక్క మొరిగినా, ఊళ పెట్టినా నా వెన్నులో చలి మొదలవుతుంది. నాలో డోపమైన్ పడిపోతుంది. అదే కుక్కల గురించి నాకు సరియైన అవగాహన ఉంటే… లేదా నేను జంతు ప్రేమికుడినయితే ఎటువంటి భయం చేయకపోగా ఎంతో సంతోషంగా ఉంటుంది.
కనుక నా హృదయస్థితి ఈ డోపమైన్, సెరొటోనిన్ లాంటి హార్మోనుల స్రావాల్ని నియంత్రిస్తుంది. అందమైన అమ్మాయిని చూసినప్పుడు, ఉదాహరణకి, అబ్బాయిలు వారి హార్మోన్లను నియంత్రించుకోలేరు. అప్పుడు ఏం జరుగుతుంది? తప్పు నిర్ణయం తీసుకుంటారు. నియంత్రణ అనేది మీ చేతుల్లోనే, మన కుటుంబ శిక్షణ పైన, అలాగే స్నేహితులు, వాతావరణ ప్రభావం పైన కూడా ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ఈ శిక్షణ అంతాకూడా మనం సకారాత్మకంగా లేదా నకారాత్మకంగా ప్రతిస్పందించేలా పురికొల్పుతుంది. కనక మన ప్రియతముల ధ్రువీకరణ, మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు మనల్ని ప్రోత్సహిస్తుంది…
హృదయం, మనసు ఒకే విషయంపై అంగీకారానికి రావడమనేది అద్భుతంగా ఉంటుంది. అదే మనం తప్పు పనులు చేసి, అనారోగ్యకర ఒప్పుకోలు ఆశిస్తే, అది తప్పు.
స్వీయ ప్రేమ విషయానికొస్తే ప్రజలు స్వీయ ప్రేమకి, స్వార్థానికి మధ్య పొరపడుతుంటారు. నిన్ను నీవు ప్రేమించడం స్వార్ధం కానేరదు. ఎంతోమంది ఆత్మ గురించి ప్రశ్నిస్తూంటారు. అసలు ఆత్మ, భగవంతుడు ఉన్నారా అని? మీరు దాన్ని జీవ, ఆత్మ అని ఏ పేరుతో పిలిచినా ఇబ్బంది లేదు. నిజానికి నేను ముందుకు వెళ్లడానికి, నాలో ఒక ప్రాణశక్తి, నేను పుట్టినప్పటి నుంచీ ఉండి అది కొనసాగుతూనే ఉంది. ఏదైతే నాలో ఉండి నన్ను నడిపిస్తోందో ఆ అస్తిత్వానికి నేను కృతజ్ఞతతో ఉండాలి. దాన్ని ప్రేమించాలి. ఆ అస్తిత్వం నాలో లేకుండా నేను ప్రశ్నించలేను, అలాగే వినిపించుకోలేను కూడా!
ఆ అస్తిత్వం ఇవాళ రాత్రికి మన శరీరం నుండి విడివడి, గుడ్ బై చెప్పి మన నుంచి నిష్క్రమిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. రామ్ రామ్ అయిపోతుంది. గుజరాత్ లో, రాజ్ కోటలో ఇలాగే అంటారు కదా! కాబట్టి ఈ అస్తిత్వాన్ని మనం ప్రేమించాలి. అంతేగాని అనవసరపు విషయాల పైన మనం ధ్యాస ఉంచకూడదు. మనం ఎక్కువగా ఉపయోగంలేని విషయాలపై తల పగలగొట్టుకుంటూంటాం.
నాకు ఈ జీవితాన్నిచ్చిన ఆ భగవంతుడు ద్వారకలో లేడు. ఏ అస్తిత్వం అయితే నాకు ప్రాణం ఇచ్చిందో, అది కాశీ లోనో, మక్కా లోనో లేదా జెరూసలెం లోనో లేదు. అది నాలోనే ఉంది. ధ్యానం ద్వారా మనం దాన్ని మరింతగా అనుభూతి చెందుతాం.
సరైన మార్గంలో ఉన్నప్పుడు, ఆ అస్తిత్వమే మన ఆత్మ వికాసానికి తోడ్పడుతుందనే అవగాహన ఏర్పడినప్పుడు, మనలో శాంతి వర్షిస్తుంది. నా స్వీయ వికాసానికి ధ్యానిస్తున్నాననే భావనతో ధ్యానించినపుడు నాకు ప్రాణాధారమైన నా అస్తిత్వాన్ని ప్రేమిస్తున్నట్లు, కాపాడుకుంటున్నట్లు.
మనం ఎంతో కృపని, సంతృప్తిని అలాగే ప్రేమని ధ్యానంలో పొందుతాం. ఇంకోరకంగా చెప్పాలంటే… మన ఆత్మ వికాసానికి తోడ్పడని ఏదైనా తప్పు పని చేసినప్పుడు, మనం ప్రశాంతతని కోల్పోతాం. నిర్లక్ష్యంగా, చిరాకుతో, దీనంగా మిగిలిపోతాం. భౌతిక ప్రపంచంలో విజయవంతమైనా అంతరంగంలో నిస్తేజంగా ఉండిపోతాం… ఎందుకంటే మనం మన అంతరంగ అస్తిత్వ ప్రణాళికతో సహకరించ లేదు కనుక… ఆత్మ యొక్క ప్రణాళికలు ధ్యానంలోనే మనకు అవగతమవుతాయి. మీకు స్పష్టంగానే జవాబిచ్చాననుకుంటున్నాను. అర్థం కాక పోతే మళ్ళీ అడగవచ్చు. థాంక్యూ.