ప్రశ్న: నేను ఈ మధ్యనే ధ్యానం చేయడం ప్రారంభించాను. చక్కటి ప్రశాంతతను అనుభూతి చెందుతున్నాను. కానీ బాహ్యంగా కలిగే చిన్న ప్రేరేపణలకే దాన్ని కోల్పోతున్నాను. ఆ స్థితిని నిరంతరం కలిగి ఉండడానికి నేను ఏం చేయాలి?
Q: I have recently started meditating and feeling calmness within. However, losing it due to simple external stimuli. In order to retain the state continuously, what shall I do?
దాజీ: నాకు కూడా ఈ ప్రత్యేక సమస్య, ఒక అరగంట సేపు ధ్యానం చేసిన తర్వాత ఉండేది. మనం చాలా శ్రేష్టమైన స్థితిని పొందుతాం. అమితమైన ప్రశాంతతను అనుభూతి చెందుతాం. అతి ప్రశాంతమైన ఆ స్థితిలో లయమై పోతాం. ధ్యానం పూర్తి చేసిన తర్వాత టీ, కాఫీ లేదా ఏదైనా ఫలహారం చేస్తారు. టీవీ చూస్తూ ఉంటారు కూడా. చూసిన తర్వాత మీరు అప్పటికే పొందిన ఆ అనుసంధానాన్ని, ఆ ప్రశాంతమైన అనుభూతిని మీరు చేజార్చుకుంటారు. ‘ఓహ్!, ఇప్పుడే నేను కలిగి ఉన్న ఆ స్థితికి ఏమైంది’? మీ వద్ద నుండి వెన్నను ఎవరో దొంగిలించినట్టుగా అనిపిస్తుంది. కానీ మీనుంచి ఎవ్వరూ దాన్ని దొంగిలించలేదు… మీరే పోగొట్టుకున్నారు.
బాబూజీ మహరాజ్ ఆధ్యాత్మిక స్థితిని నిలుపుకోవడం గురించి ఇచ్చినటువంటి ఒక చక్కటి ఉదాహరణను మీకు చెప్తాను. కాంక్రీట్ వేసినప్పుడు, అది స్థిరపడే వరకు నీళ్లు చల్లుతూ క్యూరింగ్ చేస్తుంటారు. కొత్తగా వేయబడిన ఆ కాంక్రీట్ వాడడం వెంటనే మొదలుపెట్టరు. లేదంటే వివిధ రకాల ముద్రలు దానిపై కనిపిస్తాయి. కొంతమంది యువకులు దానిపై ‘ఐ లవ్ మౌనిక’, ‘ఐ లవ్ సో, సో’ అని రాస్తుంటారు. ఆ ముద్రలు ఎప్పటికీ అలాగే నిలిచిపోయి ఉంటాయి. కుక్కల అడుగులు, ఆవులు నడవడం, కొంతమంది ఆడవారి హై హీల్స్ ముద్రలు, వీటన్నిటినీ మీరు చూస్తూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని చూపుతుంది. వారు ఎంత తీరిక లేకుండా ఆలోచిస్తున్నారో. వారి ఆలోచనలు ముందుగానే నిండి ఉండి, తమ చుట్టూ ఉన్న వాస్తవికతపై శ్రద్ధ చూపకుండా వేరే విషయాలన్నింటినీ ఆలోచిస్తూ ఉంటారు.
కాబట్టి బాబూజీ మహరాజ్ చెప్పినట్టుగా కాంక్రీట్ ను వెంటనే వాడకుండా, స్థిరపడనిచ్చి, రెండు మూడు రోజుల తర్వాత దాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఆధ్యాత్మిక స్థితి కూడా. మనం ధ్యానం చేస్తున్నప్పుడు బహుకరించబడిన ఆధ్యాత్మిక స్థితి కోసం మీరు ధ్యానానికి సిద్ధపడి, ఎన్నో గంటలు ధ్యానంలో గడుపుతారు. దాన్ని వెంటనే ఎందుకు పోగొట్టుకోవాలి? ఒక అరగంట ధ్యానం తర్వాత వెంటనే స్ప్రింగ్ లాగా లేచి, నా ధ్యానం పూర్తయిందని ఆలోచిస్తుంటారు. అప్పుడు మీ ఆధ్యాత్మిక స్థితి కూడా పూర్తవుతుంది. ధ్యానం పూర్తయిన తర్వాత మృదువుగా కళ్ళు తెరిచి, చాలా నెమ్మదిగా ఆ అంతరంగిక స్థితిని నిలుపుకోవడానికి ప్రయత్నించండి. దానితో ఏకమై ఉండడానికి ప్రయత్నించండి. అది ఎలాంటి అనుభూతినిస్తుందో చూడడానికి ప్రయత్నించండి. దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లినట్లయితే మీరు ప్రకంపనాలను ఎక్కడ అనుభూతి చెందారో చూడండి. ధ్యానం ప్రారంభించిన మొదట్లో మనం (ఛాతి భాగాన్ని చూపుతూ) ఒక చదరపు అడుగు స్థలం పై శ్రద్ధ పెడతాము, అంతే! దానిని నాలుగు భాగాలుగా విభజించండి. దిగువ ఎడమ భాగం, ఎగువ ఎడమ భాగం, దిగువ కుడి భాగం అలాగే ఎగువ కుడి భాగం అంతే! మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, ఎక్కడ ఆ ప్రకంపనలను అనుభూతి చెందారో చూడండి. ఎక్కడ తేలికదనాన్ని లేదా భారత్వాన్ని అనుభూతి చెందారో చూడండి. సాధారణంగా అది మొదట్లో ఏదో ఒక ప్రాంతంలో ఉంటుంది. తేలికదనం లేదా భారత్వం, ఎక్కడ ప్రకంపనాలను అనుభూతి చెందారో ఈ రెండు విషయాలపై శ్రద్ధ పెట్టండి. తర్వాత మీరు ఈ ప్రకంపనాలను గుర్తించడం ప్రారంభించినప్పుడు, అవి సవ్యదిశలో ఉన్నాయా లేదా అపసవ్యదిశలో ఉన్నాయా అని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు చాలా ఆలోచనలు వచ్చాయా, పరవాలేదు. కానీ మీరు వాటిని తిరిగి గుర్తు తెచ్చుకోగలుగుతున్నారా అనేది ముఖ్యం. తరచుగా మనకు ధ్యానంలో ఆలోచనలు వస్తుంటాయి. కానీ ధ్యానానంతరం ఎవరైనా మీరు దేని గురించి ఆలోచించారని అడిగినప్పుడు, ‘ఓ! నాకు తెలియదు, నేను గుర్తు తెచ్చుకోలేక పోతున్నాను’ అంటారు. అది ధ్యానం యొక్క సౌందర్యం. మనసు ఎక్కడో ఉంటుంది. మీ చైతన్యము మరెక్కడో ఉంటుంది. ఫలితం ఇంకోలా వస్తుంది. అందుకని ధ్యానం జరుగుతుండగా సంభవించిన విషయమేదైనా పర్వాలేదు. ధ్యానానంతరం అది శ్రేష్ఠంగా, తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ స్థితిని కొన్ని నిమిషాల పాటు భద్రపరచుకుని, దానితో ఏకం కావడానికి ప్రయత్నించండి.
గుడ్డివారిని స్పర్శ ద్వారా గుర్తించమని నేర్పుతున్నారు. అది బ్రెయిలీ భాష. ఆధ్యాత్మిక భాష విషయానికి వస్తే మనం కూడా గుడ్డివాళ్ళమే. కానీ మనం ఆ ఆధ్యాత్మిక ప్రగతిని, ఆధ్యాత్మిక పదజాలాన్ని మన అనుభూతులతో అనుసంధానిస్తాం. ప్రతీసారి ఆ అనుభూతి భిన్నంగా ఉంటుంది. తిరిగి అదే అనుభూతి కలిగినప్పుడు మనం ‘ఈ అనుభూతిని ఇంతకుముందు పొందాను. కానీ అప్పుడది చాలా గాఢంగా ఉంది. ఇప్పుడు ఎంతో తేలికగా ఉంది’ అంటాం. అంటే కొన్ని వైవిధ్యాలు ఉంటాయి అక్కడ. మీరు ఎంత సునిశితత్వాన్ని కలిగి ఉంటే అంతగా ఆ స్థితిని చదవగలరు, చూడగలరు. మీరు ఎలాంటి అనుభూతిని పొందారు, ఎంతసేపు స్థిరంగా ఉండగలిగారు, ఏ సమయంలో స్థిరంగా ఉండగలిగారు వంటి ప్రాథమిక విషయాలను ఒకసారి మీ డైరీలో వ్రాయడం మొదలెడితే మీరు మరెంతగానో గమనించ గలుగుతారు. ఆ జ్ఞానాన్ని ధ్యాన సమయంలో కూడా కలిగివున్నప్పుడు, ధ్యానం పూర్తయిన తర్వాత మీరెంతో ఛార్జ్ చేయబడ్డ అనుభూతి చెందుతారు. మీరు పొందిన అనుభూతి పట్ల ఎంతో ఆసక్తిని నిశితంగా కలిగిఉంటారు. ఇప్పుడు ఒక సంకల్పాన్ని అంటే ఒక సూచనను చేసుకుందాం. ధ్యానం చేసిన తర్వాత నా అంతరంగ స్థితిని చదివి, ఇప్పుడు నాకు ఉన్నటువంటి స్థితిని నేను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాను. దాని అర్థాన్ని చూద్దాం… ధ్యానం చేసిన తర్వాత ఫలహారం చేస్తారు, ఆఫీస్ కు వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, ఆ మధ్యలో మీరు బాత్ రూమ్ కి వెళ్తారు లేదా మీ టేబుల్ వద్ద కొంత సమయాన్ని ఏమీ చేయకుండా గడుపుతారు. మీ కళ్ళను 30 లేదా 20 సెకండ్లు మూసుకుని మీరు ఇంతకుముందు పొందిన స్థితిని తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ పనిలో మార్పు జరిగిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు మాస్టర్ తో అనుసంధానం లో ఉంచుకోండి. అప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. మీరు మాస్టర్ తో అనుసంధానంలో ఉన్నప్పుడు మీ అంతరంగ స్థితిని, మీ ఆధ్యాత్మిక స్థితిలోని మార్పులను గమనించండి. మీరు ప్రాణాహుతిని స్వీకరిస్తున్నారా? లేదా క్లీనింగ్ జరుగుతోందా? ఇవన్నీ మీ ఆసక్తి పై ఆధారపడి ఉంటాయి. ప్రాణాహుతి ప్రసరించని చోటును గాని, క్షణాన్ని గాని మీరు కనుగొనలేరు. ఎందుకంటే అది ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది.