జూన్ 21 – ప్రేరణ పొందండి (2వ భాగం)
స్వామీ వివేకానందులు “నీవు విపరీతమైన కష్టాలలో కూరుకుపోయి ఉన్నప్పటికీ ఎటువంటి కానుకలు ఎవరినుండీ స్వీకరించక పోవడమే అపరిగ్రహ” అన్నారు. అలా స్వీకరించినపుడు ఆ యిచ్చిన వ్యక్తితో మీ హృదయానికి అనుబంధం ఏర్పడి కృతజ్ఞతాబద్ధునిగా చేస్తుంది. ఇచ్చినవాని ప్రకంపనలు మనకు చేరుతాయి. మనం స్వాతంత్ర్యం కోల్పోతాం.
స్వాధీనం – సంబంధం
సంబంధం కలిగి వుండడానికి, మన స్వాధీనంలో ఉండడానికి గల తేడాలను (గనుక) పరిశీలిస్తే మనం ఒక అవగాహన ఏర్పరచుకోవచ్చు.
మీ చిన్నప్పుడు మీ అమ్మగారు మీకు ప్రతిరోజూ ప్రేమతో వండిపెట్టడాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే మీరు మీ స్నేహితుని ఇంటికి భోజనానికి వెళ్ళి ధన్యవాదాలు తెలిపిన సమయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. మీరు అదే కృతజ్ఞతను అమ్మగారికి తెలియజేశారా? వర్షం పడుతుంది, మీకు ఎవరింటివద్దో తడవకుండా కాస్త ఆశ్రయం దొరికిందని ఊహించండి. మీరు ఆ ఇంటి వారికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతిరోజూ ఇచ్చిన ఆశ్రయానికి కృతజ్ఞతలు చెప్పారా? లేదు, మనం చెప్పలేదు. అవి హక్కుగా మనకు చెందినవే అనుకున్నాం. మనం అందరం కలిసి ఉన్నాం, ఒకటే అని భావించాం. చెందడం లేదా సంబంధం కలిగి ఉండడం అన్నది మనలను దగ్గరకు చేరుస్తుంది. ఇది స్వాధీనతా వైఖరికి పూర్తిగా భిన్నమైనది. ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం ఉంటుంది ఇక్కడ.
తిరిగి మనం స్వామి వివేకానందులవారి ఉద్ఘాటనకు వస్తే, ప్రేమ, పరస్పర సంబంధం ఉన్నచోట, ఇచ్చి పుచ్చుకోవడం కానీ, స్వాధీనంలో ఉంచుకోవడం గానీ ఉండదు. (నాదేదయితే ఉందో అది) నాదంతా మీకుకూడా చెందుతుంది. నిజం చెప్పాలంటే ఇది నాదీ, అది మీది అనే భావం ఇక ఎంతమాత్రం ఉండదు.
దాని ఫలితంగా, అంతరంగంలోని హృదయ ఉదారత పెంపొంది, మనం ఇతరులకు ప్రథమ స్థానాన్ని కల్పిస్తాము. మన ఆలోచనలు, చర్యలు ఎంతమాత్రమూ మన వ్యక్తిగత కోరికలమీద ఆధారపడి ఉండవు. మన ప్రవర్తనలో సహజ సిద్ధమైన జాగ్రత్త వహించాలన్న మర్యాద పెంపొందుతుంది. మనుషులు, ప్రదేశాలు, విషయాలపట్ల ఉండే ఆకర్షణలకు, వికర్షణలకు మనం ఇక ఎంతమాత్రమూ లోనుకాము.
స్వతః సిధ్ధంగా ఏర్పడిన, ఎటువంటి అనుబంధంలేని స్వతంత్ర స్థితి మనలో వృధ్ధి చెందగా, మన జీవనాన్ని భక్తితో కొనసాగిస్తాం, అన్నింటినీ సర్వసామాన్యంగా ప్రేమిస్తాం.
ఒక కథ
ప్రాచీన కాలానికి చెందిన ఎందరో చక్రవర్తుల చరిత్రలు మనకు అపరిగ్రహ గురించి అమితంగా బోధించగలవు. వారిలో ఒకరు జనక మహారాజు. జనకుని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది. అపరిగ్రహ అనే ఈ లక్షణానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది.
ఒక యువసాధకునికి అతడి గురువు మరింత ఆధ్యాత్మిక శిక్షణ కోసం జనక మహారాజు దగ్గరకు వెళ్ళమని సూచిస్తాడు. ఆ గురువుగారు ‘నాయనా, నేను ప్రపంచాన్ని త్యజించినవాడిని, ప్రపంచ వ్యవహారాలేవీ నాకు తెలియవు. అందుచేత నీవు ఇంకా ముందుకు కొనసాగాలంటే, లోక వ్యవహారాలన్నీ తెలిసిన గురువు దగ్గరకు వెళ్ళాలి. ఇకముందు నీకు శిక్షణ అతడివద్దనుండి లభిస్తుంది” అన్నాడు.
సాధక విద్యార్థి గందరగోళ పరిస్థితిలో పడి ఈ విధంగా ఆలోచిస్తాడు. “ఈ మహారాజు, జ్ఞానోదయమైన వ్యక్తి అయితే అతడు ఎందుకు రాజమహలులో ఐశ్వర్యం, భోగ, భాగ్యాల మధ్య నివసిస్తున్నాడు? అతడు ఒక గంభీరమైన ఆధ్యాత్మిక సాధకుడే అయితే అతడు తప్పక తన వద్దనున్న భోగ భాగ్యాలమీద ఎటువంటి ఆసక్తి కనపరచకుండా ఉండేవాడు.” కానీ తన గురువుగారు అతడి వద్దకు వెళ్ళమని గట్టిగా సూచించారు కాబట్టి విదేహ సామ్రాజ్య అంతఃపురానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
సాయంత్రానికి అక్కడికి చేరుకుంటాడు. జనక మహారాజు అతడ్ని రాజాస్థానానికి ఆహ్వానిస్తాడు. అక్కడ అందరూ ఆనందంలో తేలియాడుతుంటారు, అతి చనువుగా ప్రవర్తిస్తుండడం చూస్తాడు, వెంటనే అక్కడినుండి వెళ్లిపోవాలని అనిపిస్తుంది సాధకునికి. జనక మహారాజు అతడిని రాత్రికి అక్కడే ఉండి ఉదయమే బయలుదేరి వెళ్ళమంటాడు. ఆవిధంగా సాధకునితో నేరుగా మాట్లాడే అవకాశం తనకు దొరుకుతుందని, అతడు ఎందుకు వచ్చాడో తెలుసుకోగలనని జనకుడు అంటాడు. యువ సాధకుడు సరే అనుకుంటాడు. అతడికి చక్కటి ఆతిథ్యం లభించింది, స్నానం చేసి, భోజనం చేశాడు. ఒక అద్భుతమైన శయన మందిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడినుండి సరస్సు, అందమైన అడవులు కనిపిస్తున్నాయి. అతడు అలసిపోయి ఉన్నాడు కాబట్టి తొందరగా నిద్రకు ఉపక్రమిద్దామనుకొని ఆ అద్భుతమైన పాన్పు మీద పడుకోగానే అతడికి సరిగ్గా తన తల ఉన్నచోట పైన ఒక కత్తి సన్నని దారానికి వ్రేళ్ళాడుతూ కన్పించింది. అంతే! ఇక రాత్రంతా అతడు పడుకోలేకపోయాడు. అందమైన ఆ శయన మందిరము, పడక, రమణీయమైన దృశ్యాలు ఏవీ అతడికి ఆనందాన్ని ఇవ్వలేక పోయాయి. తన దృష్టి అంతా ఆ కత్తి మీదే ఉండిపోయింది.
ఆ మరునాడు జనక మహారాజు “మీరు బాగా నిద్ర పోయారా”? అని అడిగాడు. యవకుడు “ఓ మహారాజా! ఆ కత్తి నా తలమీద వేలాడుతూ ఉండగా నేనెలా నిద్రపోగలను” అని సమాధానం ఇచ్చాడు. మహారాజు నవ్వుతూ, “మీరు అత్యంత సుందరమైన పడక గదిలో, విలాసవంతమైన పడక ఉన్నప్పటికీ ఎందుకు నిద్రించలేక పోయారు” అని అడిగాడు. “మహారాజా! ఆ కత్తి వలన నేను నా పరిసరాలమీద దృష్టి సారించలేకపోయాను. ఇదివరకెన్నడూ నేనింతగా భయపడలేదు” అన్నాడు. అప్పుడు రాజు “ఇంకాస్సేపు నాతో ఇక్కడే ఉండు, నేను ఈ సుందరమైన అంతఃపురంలో ఉండవచ్చు, కానీ మృత్యువు అనే ఖడ్గం ఎల్లవేళలా నాతల మీద వ్రేలాడుతూ ఉంటుంది. దానికి కట్టిన దారం నీ పరుపుమీద రాత్రి వ్రేళ్ళాడిన కత్తికి ఉన్న దారంకన్నా చాలా సన్నది. ఏక్షణమైనా నేను చనిపోవచ్చు. ప్రపంచంలో ఆ విధంగా ఎలా జీవించాలో నీవు నేర్చుకోవాలనుకుంటున్నావా?” అన్నాడు.
ఇక్కడ జనక మహారాజు చెప్పదలచుకున్నది ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో జీవనం యొక్క స్వభావం తాత్కాలికం, ఏ క్షణమైనా నశించవచ్చు అనే ఎరుక కలిగి ఉంటే, దేన్నీ మన స్వాధీనంలో ఉంచుకోవాలన్న ఆలోచన కలుగదు. మృత్యువు దేన్నీ మనతోపాటు తీసుకువెళ్లనివ్వదుకదా! నిజం చెప్పాలంటే స్వాధీనతాభావమే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మన దృష్టి ఉండాల్సింది అంతరంగంలోనికే కాని బాహ్యరంగం వైపు కాదు. మనం ధనికులమైనా, నిరుపేదలమైనా, పుట్టుక, జీవనం, మృత్యువు అనే ఈ సహజమైన కాలచక్రం యొక్క అవగాహన, ఇంకా భౌతిక రంగానికి అతీతమైన అస్తిత్వం గురించిన అవగాహన ఉన్నప్పుడు, మనం స్వాధీనతా భావం నుండి విముక్తులమౌతాము.