ప్రేరణ అనే శీర్షికతో హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజీ రచించిన ‘ ద విజ్డం బ్రిడ్జి “ అనే పుస్తకంలోని భాగాలు హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాసపత్రికలో ధారావాహిక గా ప్రచురించడం జరుగుతోంది..ఈ పత్రిక ఫిబ్రవరి 23 సంచికలో “అవునండీ ఇప్పటికీ ఒక శిశువును పెంచాలంటే ఊరంతా ఆసరమే “ అనే ఉపశీర్షికతో ప్రచురించించిన రెండవ భాగంలోని ముఖ్యాంశాలు ఈ వీడియోలో మీకు సమర్పిస్తున్నాం.
అదొక చిన్న పల్లెటూరు. ఊరంతటికీ ఒకే ఒక మెయిన్ రోడ్డూ, దానికి రెండుపక్కలా సాదా సీదా ఇళ్ళూ కనిపిస్తున్నాయి. మహా అయితే ఓ 50 ఇళ్ళు ఉంటాయేమో. రాత్రి పొద్దుపోయిన మూలాన బాగా చీకటిగా ఉంది. ఎక్కడా వీధి దీపాలు లేవు. ఊరికి కరెంటు కూడా ఉన్నట్లు లేదు. ఊరు మాటుమణిగింది. ఏ ఇంట్లో నుంచీ టీవీ శబ్దం కానీ , రేడియో శబ్దం కానీ వినబడడం లేదు.
కరెంటే లేదంటున్నారు, టీవీ శబ్దం ఎలా వినిపిస్తున్దండీ, విడ్డూరం కాక పోతేను. అవును కదా నిజమే. అందుకే అలాంటి శబ్దాలేమీ విన బడడం లేదు. అయితే ఒక ఇంటి ఆవరణలో మాత్రం అరుగు మీద జనం కనిపిస్తున్నారు. చిన్నా, పెద్దా ,ఆడా, మగా అందరూ ఒక చోట సమావేశం అయ్యారు. పైన చూరు నుంచి ఒక కిరోసిన్ లాంతరు వేలాడుతోంది. బాగా చురుగ్గా కనిపిస్తున్న ఒక కుర్రవాడు, ఎదో లావుపాటి పుస్తకం చదువుతూ ఉంటే, అందరూ తలలు ఊపుతూ వింటున్నారు. బహుశా భారతం కామోసు.
ఇదంతా వింటుంటే ఏదో పాత సినిమాలో సీన్ లాగా అనిపిస్తోంది కదూ. కానీ ఇది సుమారు 60 ఏళ్ల క్రితం నిజంగానే ప్రతి రోజూ రాత్రిళ్ళు ఒక గ్రామం లో కనిపించే దృశ్యం.
మనం ఇందాకా చెప్పుకున్న ఆ ఊరు పేరు కల్లా. అది గుజరాత్ రాష్ట్రం లో ఉంది. భారతం చదివి వినిపిస్తున్న ఆ కుర్రవాడి పేరు కమలేశ్ పటేల్. ఇప్పుడు అందరూ ప్రేమగా దాజీ అని పిలిచే హార్ట్ ఫుల్ నెస్ మార్గ దర్శి.
ఆయన తను రచించిన, ద విజ్డం బ్రిడ్జి అనే పుస్తకంలో, దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో వాతావరణం ఎలా ఉండేదో, ఆత్మీయత, పరస్పర సంఘీభావం , స్వచ్చమైన గాలీ, నీరు , సహజమైన పంటలు లభించే, ఆ రోజుల్లో చిన్న పిల్లలు, స్వేచ్చగా, మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఎదిగారో, నేటి సమాజంలో పెరుగుతున్న పిల్లలు ఏం కోల్పోతున్నారో పోల్చి చెప్పేందుకు ఆయన తన బాల్యాన్ని, తను పెరిగిన వాతావరణాన్ని ఈ అధ్యాయంలో వివరించారు.
గత కాలంలో పాఠశాల ప్రారంభం అయ్యే సమయం ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి. పిల్లలందరూ గుంపులు గుంపులుగా, భుజం మీద పుస్తకాల సంచీ వేసుకుని, ఉత్సాహంగా కబుర్లు చెబుతూ స్కూలుకు వెళతారు. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి ఆందోళన భయం మచ్చుకైనా కనబడవు.. ఇక స్కూలు వదిలి పెట్టే టైం అయితే అది మరింత కోలాహలంగా ఉంటుంది, హటాత్తుగా స్వేచ్చ లభించినట్లుగా, పిల్లలు అరుపులు కేరింతలతో ఇళ్ళ వైపు పరుగెడుతూ కనిపిస్తారు. ఆ తరువాత సాయంత్రం అంతా ఆటలు.
వాళ్ళు అటూ ఇటూ పోకుండా తాతలు, అమ్మమ్మలు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారు. అవసరమయితే, అంటే, అల్లరి చిల్లర వేషాలు వేస్తె గదమాయిస్తారు. ఈ విషయంలో ఎవరూ ఎవరినీ తప్పు పట్టరు. ఇంట్లో ఉన్న వయో వృద్ధుల వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. వాళ్ళు పిల్లలకి పురాణాలలోని కథలు, స్థానికంగా ప్రచారంలో ఉన్న గాథలూ, క్రమశిక్షణకి సంబంధించిన విషయాలూ, పాటలు, పద్యాలూ ,వాళ్ళ అనుభవంలోని సంఘటనలూ, అలా ఎన్నో విషయాలు కూర్చో బెట్టి చెప్పేవారు. తద్వారా, పిల్లలకి స్కూల్లో టీచర్లు చెప్పే దానికన్నా పెద్ద వాళ్ళ ద్వారా వేర్వేరు విషయాలు ఇంటివద్ద నేర్చుకోడానికి అవకాశం ఉండేది.. అంతే కాక, పసి వయసులో నేర్చుకున్న విషయాలు మనసుకి బాగా హత్తుకు పోతాయి కూడా.
వయసు మళ్ళిన పెద్దలు ఇంట్లో తలిదండ్రులికి ఎన్నో విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారు. అందువలన తలిదండ్రులకి ఇంటి పని భారంగా అనిపించదు. మరో రకంగా చెప్పాలంటే ఇంటి పని ఒక సమిష్టి బాధ్యత అన్నమాట. ఒకరికి ఒకరు తోడు ఉన్నారు అన్న భరోసా, ఎంత కష్టమైన పనినైనా సులభంగా ఆనందంగా చెయ్యగలిగే శక్తిని ఇస్తుంది.
అయితే అప్పటి వాతావరణం అంతా ‘ఉటోపియా’ లా ఉండేదా. అంటే లేదనే చెప్పాలి. ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉండడం చేత ఒక చిన్నఇంట్లోనే కుటుంబంలోని వారందరూ సద్దుకునే వారు. ఇంట్లోని వస్తువులన్నీ, టూత్ పేస్టు తో సహా, అందరూ ఉమ్మడిగా వాడుకునేవారు. ఆరోగ్య సంరక్షణ వసతులు నామ మాత్రం. అందువలన ఎక్కువ మంది రోగాల బారిన బడి చనిపోయేవారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ మరణాల సంఖ్య ఎక్కువ గా ఉండేది.
నేటి కాలంలో మనం ఈ సమస్యలని అధిగమించాం. కానీ, తలిదండ్రులు పిల్లల నుండి అధికంగా ఆశించడం వలన వారి మీద ఒత్తిడి పెరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం వలన తలిదండ్రులకి పిల్లల పెంపకమే భారంగా మారింది. వారికి మానసిక స్తైర్యానిచ్చే బోధనలకు అవకాశమే లేకుండా పోయింది. తమ సంతానం ప్రత్యేకతలు కలవారుగా నిలవాలని తలిదండ్రులు కోరుకోవడంలో తప్పు లేదు. కాని అది వారిపై మనకు తెలియని ఒక ఒత్తిడి పెంచుతుంది. తాము అన్ని రంగాల్లోనూ ఉత్తమ స్థాయికి చేరుకోవడం ద్వారానే తల్లిదండ్రుల మెప్పు పొందగలం అనే ఆలోచనా ధోరణి పిల్లల్లో మొదలైంది. అలా స్వయంగా, లేక, పెద్దలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేక పొతే ఏమవుతుందో అనే అభద్రతా భావం మొదలైంది. అది మానసిక సమస్యలకు కారణం అవుతోంది.
పూర్వంలో లాగ గ్రామం మొత్తం కలసి ఉండే పరిస్తితి ఇప్పుడు లేదు.కలసి ఉండడం అంటే భౌతికంగా కాదు. హృదయాల మధ్య ఐక్యత. అది మనం ప్రేమించే వారి మధ్యన అనుభూతి చెందే ఒక భావన.
ఉమ్మడికుటుంబ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నిద్దాం. మన చిన్నారులకు ఎదిగే వయసులో తగినంత ప్రేమ , స్వేచ్చ మానసిక వికాసం లభించేందుకు కృషి చేద్దాం. వారి సర్వతో ముఖాభివృద్దికి మనవంతు ప్రయత్నం చేద్దాం.
ద విజ్డం బ్రిడ్జి పుస్తకం చదవండి. ఈ అంశం గురించి మరింత వివరంగా చదివి తెలుసుకోండి.
దీని తరువాతి భాగం మార్చి 23 సంచికలో వెలువడుతుంది.
నమస్తే.
ఇవన్నీ పిల్లలు విద్యావంతులుగానే కాక, ఒక సమగ్రమైన వ్యక్తిగా ఎదగ డానికి అనువైన పూర్తీ వాతావరణం గ్రామాల్లో లభిస్తుంది. నైతిక ప్రవర్తన , మానసిక స్థైర్యం , ఎంతో కొంత ఆధ్యాత్మిక విచారణ , వారిలో నెలకోనేవి. భవిష్యత్తులో ఎలాంటి క్లిష్ట సందర్భాలనైనా ఎదుర్కుని తిరిగి నిలదొక్కుకునే శక్తిని వారిలో నింపేవి