భగవంతునితో అనుబంధం ప్రేమతో ముడిపడి ఉండాలి.
ప్రశ్న: ప్రణామ్స్ మాస్టర్!! ప్రారంభంలో ఇష్టదేవత పై ధ్యానిస్తూ, క్రమేణా నిరాకార పరబ్రహ్మము పై ధ్యానించాలని శ్రీరామకృష్ణ పరమహంస బోధించేవారు. మన హార్ట్ ఫుల్ నెస్ విధానంలో ధ్యానం, రూప రహితంగా, హృదయంలో దివ్యజ్యోతి ఉందనే భావన మాత్రమే. నేను నిత్యం పూజ, ధ్యానం, సంధ్యావందనం ఇత్యాదులు చేస్తాను. ఈ రెండు వైరుధ్యాల మధ్యా నేనెలా ముందుకు వెళ్లాలో సూచించగలరు?
దాజీ: నా జీవిత పర్యంతం, శ్రీ రామకృష్ణ పరమహంసని గొప్పగా ఆరాధించేవాణ్ణి. నిజానికి ఆయన వల్లే ఆధ్యాత్మికతలో ఎంతో ప్రభావితమయ్యాను. నా మొదటి ధ్యానంలోనే, ఆయన దర్శనమయ్యి నేను ఎంచుకున్న మార్గాన్నే అనుసరించమని ప్రోత్సహించారు. వారి దీవెన ఫలితమే, షాజహాన్ పూర్ లోని శ్రీరామచంద్రజీ (బాబూజీ మహరాజ్)ని దర్శించడం జరిగింది. వారే ఇప్పుడు నా శ్రీరామకృష్ణులు.
పరమహంస ప్రారంభంలో కాళీమాత భక్తులు. వారు బోధించిన విషయాలలో ఎక్కువ భాగం వారి సాధన ప్రారంభదశలోనివి.
వారి ప్రయాణం కూడా భిన్నమైనదే. తోతాపురిని కలిసిన తర్వాతే వారి ప్రయాణం తీరు మారింది. తోతాపురి శ్రీ రామకృష్ణ పరమహంసని కలిసినప్పుడు ‘నీవు కాళీతో సమయం వృధా చేస్తున్నా’వన్నారు. రామకృష్ణులు ఆశ్చర్యంతో ‘అదేమిటి’? అన్నారు. ఒక బొమ్మ తో ఆడుకున్నట్లుగా నీవు ఆమెతో ఉన్నావు, ఇది నీకు శ్రేయస్కరం కాదు అంటూ, గంగ ఒడ్డున ఉన్న గాజు పెంకుతో తోతాపురి శ్రీరామకృష్ణుల నుదుటిపై గాయం చేసి, దానిపై ధ్యానించమని చెప్పారు.
ప్రారంభంలో సాధకునికి సాకార ధ్యానం సహజమే. కానీ గురువు లభించాకా, ఆయన దేనిపై ధ్యానించమంటే, మనకు అదే శ్రేయస్కరం. రూపం విషయానికొస్తే పరిమితులెన్నో ఉన్నాయి. నేను ఇంతకుముందు ప్రశ్నకు జవాబు చెప్పినట్లుగా, భగవంతుడు ఎలా ఉంటాడో మనకు నిజానికి తెలియదు కాబట్టి, నిజాయితీగా ‘మీరు ఎలా ఉంటారో నాకు తెలియదని’ మనం వారి ముందు ఒప్పుకొని తీరాలి.
ఉదాహరణకు నేను ప్రాఫెట్ మొహమ్మద్ రూపం గురించి ఆలోచించాననుకోండి. వారి రూపం నాకు తెలుసా? భగవాన్ శ్రీకృష్ణుని నిజరూపం మనకు తెలుసా? లేదు కదా! ఇప్పుడు ఒక విషయం గమనించండి. వారి వారి జీవిత కాలంలో సైతం, వారిద్దరికీ రూపం ఉన్నప్పటికీ, ఆ రోజుల్లో వారినెంతమంది అర్థం చేసుకున్నారు? వారి వల్ల ఎంతమంది అప్పట్లో ప్రయోజనం పొందారు? శ్రీకృష్ణుని ముఖ్య స్నేహితుడైన అర్జునుడు సైతం వారి నిజరూపాన్ని తెలుసుకోలేక పోయాడు కదా! మనమిప్పుడు ఎవరో రూపొందించిన వారి చిత్రంపై, వారి విగ్రహంపై ధ్యానిద్దామంటే సబబేనా? ఇటువంటి ఊహల వల్ల ఎలా ప్రయోజనం పొందుతాం?
ఆచారాలు పాటించినప్పుడు ఎంతోకొంత ఓదార్పు ఉంటుంది. తప్పులేదు…కానీ అప్పటి పరిస్థితుల్లో… సాధారణంగా మనం తల వంచి ప్రణమిల్లుతాం, దీపం వెలిగిస్తాం, అగరువత్తులు వెలిగించి, శ్లోకాలు పఠించడం ఇలాంటివన్నీ చేస్తాం. ఇవన్నీ పాటించకపోతే మనకు ఏదోలా, తప్పుగా అనిపిస్తుంది. అది భగవంతుని పై ప్రేమ కాదు గానీ, ఈ ఆచారాలు పాటించనందువల్ల ఏదైనా చెడు జరుగుతుందని అనిపిస్తుంది. ఆయనకి నమస్కరించినప్పుడు కూడా, మనకు మంచి జరగాలనే. ఎప్పుడూ మనం ఆయనతో బేరమాడుతూనే ఉంటాం. కోరికలు తీరడం కోసమో లేదా ఇబ్బందులు తొలగించమనో. చివరికి చనిపోయినప్పుడు కూడా నరకాన్ని తప్పించి స్వర్గాన్ని చేరుకోవాలనే. ఈ ఆచార వ్యవహారాలన్నిటి ఉద్దేశ్యమూ ఇదే!!
భగవంతునితో మన అనుబంధం కేవలం ఆయనపై ప్రేమతోనే, ప్రేమగానే ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన నుంచి ఏదో పొందాలని కాదు. మన భౌతిక జీవనంలోని అనుబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునేవే. నీవు నాకిది చెయ్యి. నేను నీకది చేస్తాను. నువ్వు నాకు అది చెయ్యకపోతే నీకు ఇబ్బంది కలుగుతుంది. కానీ భగవంతునికి అన్నీ తెలుసు. మనం ఏమీ చెప్పకపోయినా, మన పూజ లోని, ఆరాధన లోని ఆంతర్యం ఆయన కనిపెట్టగలరు. అది రూప సహితమైనా, రహితమైనా, మనం ఎంత స్వార్ధపరులమో వారికి తెలుసు. కాబట్టి మొదటగా మన అన్వేషణలో మనం ప్రామాణికంగా ఉండాలి. ఆ క్రమంలో మీరు వారి నిజమైన రూపాన్ని కనుగొనేట్లయితే, ఆ రూపం ఏదో నాకు చెప్పండి.