యూట్యూబ్ పోస్ట్ యొక్క ట్రాన్స్క్రిప్టు
హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాస పత్రికలో ప్రచురితమయ్యే వ్యాసాలలోని ఆసక్తికర అంశాలను అందజేసే వీడియోలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకో బోతున్నాయి. ఇంతవరకూ అనుసరించిన విధానానికి భిన్నంగా, ఈ మాసం నుంచీ, హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి, దాజీ, క్రొత్తగా ప్రారంభించిన వ్యాస పరంపర లోని ప్రధానాంశాలను ప్రేక్షకులకు సరళమైన భాషలో అందజేయాలని సంకల్పించడం జరిగింది. ఈ వ్యాసాల లోని విషయాలు అందరూ నిత్యజీవితంలో అనుసరించ దగినవేకాక ఆలోచింప జేసేవి కూడా. మా ప్రయత్నం ఆశించిన ప్రయోజనాన్ని ఫలితాన్ని ఇవ్వాలని మా ఆకాంక్ష..
దాజీ గారి కొత్త వ్యాస పరంపర శీర్షిక “ అపూర్వమైన ఆరంభం “. ఇందులో మొదటి వ్యాసం నూతన సంవత్సరం గురించే కావడం ఒక విశేషం అయితే , ఈ అంశం గురించిన విశ్లేషణ మనల్ని విస్తుపోయేలా చేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
నూతన సంవత్సరం అట్టహాసంగా వేడుకలతో ప్రారంభం అవుతుంది. మనం ఎన్నో తీర్మానాలు కూడా చేస్తాం. బరువు తగ్గించుకోవాలనీ ,సిగరెట్ త్రాగడం మానేయ్యాలనీ ఇంకా ఎన్నో. అయితే నెల తిరక్కుండానే ఈ ఆలోచనలన్నీ ఆవిరై పోతాయి. మళ్ళీ షరా మామూలే. అయితే మన మంచికోసం ,మనమే చేసుకున్న ఈ తీర్మానాలు ఎందుకు వీగిపోతున్నాయి? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే, మనం ఎంతో నిశ్చయంతో తీసుకున్న ఒక నిర్ణయాన్ని కొనసాగించ లేక పోవడానికి కారణం దాని గురించి మరిచిపోవడమో లేదా మధ్యలో ఎక్కడో వదిలేయ్యడమో అని. మరి అలా ఎందుకు జరుగుతుంది అంటే, దాని మీద ఆసక్తి లేక పోవడమే కారణమట.
అందుకని మనం చెయ్యల్సింది ఏమిటి? మనకి బాగా ఆసక్తి ఉన్న అంశం తీసుకుని అలాంటి దాని మీద ఒక తీర్మానం చెయ్యాలి. ఎప్పుడైతే ఆసక్తి ఉందొ పట్టుదల దానంతట అదే వస్తుంది. ఆ పని చెయ్యడానికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఇష్టంగా చేసే పని కష్టం అనిపించదు. అందుకని కొత్త సంవత్సరం కోసం చేసే తీర్మానాలు , ఎదో సిగరెట్ మానేయడం లాంటి వాటి కోసం కాకుండా , అంతకంటే చాలా ముఖ్యమైనదీ, అది జీవితంలో ఒక మరిచిపోలేని విషయం అన్నంత ప్రాధాన్యం ఉన్నదాన్ని తీసుకోవాలి. అప్పుడే దాన్ని ఎలాగేనా సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది.
చాలామంది “ ఆ , ఇది నా వల్ల ఎక్కడ అవుతుంది. నాకంత శక్తి లేదు అనుకుంటారు.” కాని నిజం ఏమిటంటే, మనలో శక్తి ఉంది. మనందరికీ శక్తి ఆ మూలం నుంచి వస్తుంది. శక్తికి అక్కడ కొదవ లేదు. మనం చెయ్యవలసినదల్లా ఆ శక్తిని గ్రహించే మార్గాన్ని కనిపెట్టడమే. స్వామి వివేకానంద ఏమన్నారంటే, ఒకే ఒక్క ఆలోచన తీసుకో, అదే నీ జీవితం, అదే నీ కల, అదే నీ సర్వస్వం అవ్వాలి. ఆ ఆలోచన నీ నరనరాల్లోనూ జీర్ణించుకు పోవాలి. అప్పుడు విజయం తప్పకుండా లభిస్తుంది అని.
సరే, శక్తి ఎక్కడ లభిస్తుందో తెలుకున్నాం. అంత మహత్తరమైన ఒక లక్ష్యం సాదించడానికి ప్రేరణ కూడా అవసరమే. అయితే ప్రేరణ కోసం అక్కడా, ఇక్కడా వెతక నవసరం లేదు. భగవద్గీతలో అది పుష్కలంగా లభిస్తుంది. గాంధీ, అరవిందో లాంటి ఎందఱో మహానుభావులు దాని నుంచి ప్రేరణ పొందారు. ముఖ్యంగా వినోబా రచించిన గీతా ప్రవచనాలు చదివితే అది మరింత సరళంగా సునాయాసంగా అర్ధం చేసుకో గలుగుతాం.
ప్రేరణ నిచ్చే భగవద్గీతలోని కొన్ని అంశాలు :
ఒక ఇంగ్లీష్ రచయిత మనం ఆలోచనా విధానం, వృద్ది పరమైనది అయి ఉండాలి అంటాడు. అంటే మనం మన శక్తి యుక్తుల్ని కాలంతో పాటు పెంచుకోగలం అనే ధోరణి అన్నమాట. అదే అర్ధాని స్పురించే విషయమే భగవద్గీతలోశ్రీ కృష్ణుడు , నీ దృష్టిని ఫలితం మీద కాక ప్రయత్నం మీద పెట్టు అని అర్జునుడికి చెబుతాడు. గీతలో ఆణిముత్యాల వంటి సూచనలు ఇంకా ఎన్నో ఉన్నాయి.సంతృప్తి, సమదృష్టి, వినయం, ఫలాపేక్ష లేని కర్మ ,మొదలైనవి.
చివరిగా ఎ కొత్త విషయమైనా మొదలు పెట్టె టప్పుడు దాని బీజం మనసులోనే ఉంటుంది. ఆ మనసుని లోబర్చుకుంటే దాని పైన ఆధిపత్యం సాధించవచ్చు. దానికి ఏకైక సాధనం , ధ్యానం. ధ్యానం ద్వారా పైన చెప్పిన సంతృప్తి, వినయం మొదలైన వాటిని అలవరచుకోవడం సులభం అవుతుంది. హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సాధన ప్రయత్నించండి. ఆ విషయం మీకే తెలుస్తుంది. నమస్తే.