తామరాకు వంటి స్థితి
మీతో ఇప్పుడు నేను పంచుకోవాలనుకుంటున్న మూడవ చిట్కా కిదే సరైన తరుణం. భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చిన మూడవ చిట్కాను పూర్తిగా గుర్తు చేసుకోలేక పోతున్నా. ఇది తామరాకు వంటి స్థితి గురించి, ఆయన గొప్పగా వర్ణించారు అలాగే ఎంతో వ్యాఖ్యానం కూడా చేశారు. బురద నిండిన సరస్సులో ఉన్నప్పటికీ, తామరాకు ఎటువంటి ముద్రలను ఏర్పరుచుకోదు.
దీన్ని మనం ఎలా గ్రహించాలి? ఈ సందేశం కూడా సంస్కారాల గురించే. ఇది సంస్కారాలు ఎలా ఏర్పడతాయో సూచిస్తుంది. అలాగే వాటినెలా నిర్మూలించుకోవాలో, అసలు అవి ఏర్పడకుండా ఎలా నిరోధించాలో తెలుపుతోంది.
భగవద్గీతలో దీని గురించి క్లుప్తంగా వివరించారు. శ్రీకృష్ణ పరమాత్మ కర్మ ఫలాన్ని భగవంతునికెలా సమర్పించాలో అక్కడ ప్రస్తావించారు. అది ఎంతో కష్టం. మనం పని చేసేటప్పుడు జీతం లేదా ఆదాయం ఆశిస్తాం. నేను ముంబై చేరుకోవాలంటే టికెట్ కొని దాని వైపుగా ప్రయత్నించాలి. కాబట్టి భగవానుడు అప్పుడిచ్చిన సందేశానికీ, ఈరోజు మనం అర్థం చేసుకునే దానికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.
ఆ రోజుల్లో కర్మ, శ్రమ అనే మాటల అర్థంలో ఎంతో తేడా ఉంది. శ్రమ లేదా భౌతిక దేహంతో మనం శ్రమిస్తూ పని చేసినప్పుడు, కొంత ఫలితాన్ని ఆశిస్తాం. మామిడి మొక్క నాటినప్పుడు మామిడి పండ్లను ఆశిస్తాం. మొక్కను నాటి, దాని నుండి ఏమీ ఆశించక పోవడం మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి అప్పట్లో కర్మకు అర్థం వేరుగా ఉండేది.
శ్రీకృష్ణుడి ప్రకారం బ్రహ్మ విద్య పొందుటకు మనం చేసేదంతా కర్మ కిందకే వస్తుంది. అలాగే కర్మను ఆచరించినప్పుడు, ఫలితంపై దృష్టి పెట్టకూడదు. నా భక్తినీ, బ్రహ్మవిద్య పొందుటకు నా ప్రయత్నాలన్నీ భగవంతునికి అర్పించవలసి ఉంటుంది. వారి దర్శనం లభింపచేయడం, అలాగే బ్రహ్మవిద్యను నాకు అందించడం అనేదంతా వారి చేతుల్లోనే ఉంది. వారి నుండి మీరు ఒక హక్కులా కోరకూడదు. అయితే ఈ భౌతిక ప్రపంచంలో నేను పనిచేసినప్పుడు, నేను ప్రతిఫలం కొంత ఆశించవచ్చు.
కాబట్టి కర్మ, శ్రమ అనే వాటి గురించి, వాటి వైవిధ్యత గురించి అవగాహన ఏర్పరుచుకోండి. ప్రతీ కొన్ని సంవత్సరాలకి, కొన్ని పదాల అర్థాలు మారిపోతుంటాయి. 1960ల ముందు గే అనే పదానికి అర్థం గురించి నేను తరచూ చెబుతూ ఉంటాను. అప్పట్లో, గే లా ఉన్నానంటే సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నానని. అయితే ఈ రోజుల్లో దీని అర్థం పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఎన్నో శతాబ్దాలుగా, వేల సంవత్సరాలు అయినందువల్ల, కర్మ అనే పదం అర్థం కూడా పూర్తిగా మారిపోయింది.
కాబట్టి భౌతిక స్థాయిలో పని చేసినప్పుడు, ఆ పని తాలూకు ఫలితం మన మనసులో అప్పటికే ఉంటుంది. అదే నేను ధ్యానించినప్పుడు, నిర్మలీకరణ చేసుకున్నప్పుడు, ఇలాంటి అన్నిటికీ బాబూజీ మహరాజ్ నుంచి హక్కుగా లయావస్థ కోరకూడదు. మనకి ఇవ్వాలో లేదో అది ఆయన ఇష్టం. తామరాకు వంటి స్థితికి ఎలా చేరగలగడం? నిరంతరస్మరణే దానికి మార్గం.
మన మనస్సులో, హృదయంలో లయావస్థ పై దృష్టిని కేంద్రీకరించి, పని చేసే ముందే జాగ్రత్తగా జ్ఞానంతో ఆలోచిస్తూ, చారీజీ మహరాజ్ ఉద్దేశించిన జీవనశైలిని పాటిస్తూ.. మీ చర్యలలో ఏమైనా కుటిలత్వం గమనిస్తే వదిలేస్తూ, ఆ విధంగా సంస్కారాల్ని నిరోధించాలి.
గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు కర్మల గురించి తద్వారా కలిగే ఫలితాల గురించే వివరించారు. సహజ మార్గంలో దానికన్నా ఎక్కువే చెప్పబడింది. నీ అకర్మల గురించి కూడా నీవు చింతించ వలెనని సహజమార్గం అంటోంది. చదవాల్సిన సమయంలో చదవకపోవడం, తల్లిని చూసుకోవాల్సిన టైం లో నిర్లక్ష్యం చేసి, ఆమె మరణిస్తే…ఇలా చేయాల్సిన పనులు చేయకపోవడం… ఇవన్నీ మీకు గుర్తుండి మీలో అపరాధ భావనను కలిగిస్తాయి.
సంస్కారాల కన్నా ఈ అపరాధ భావనలే తీవ్రమైన ముద్రలను ఏర్పరుస్తాయి. రోజూ సాయంత్రం నిర్మలీకరణ లో మీరు రోజువారీ సంస్కారాలను పోగొట్టుకోవచ్చు. అలాగే ప్రిసెప్టర్లు, మాస్టర్ గత సంస్కారాలను క్లీన్ చేస్తారు కానీ అపరాధభావనని భగవంతుడు కూడా తొలగించలేరు. చెయ్యాల్సిన పనులను తెలిసీ ఉద్దేశ్యపూర్వకంగా చేయకపోతే, వాటికి మనమే బాధ్యులం. మరి వీటినెలా శుద్ధి చేసుకోవాలి?
కాబట్టి కొన్ని విషయాలను,అంచెలంచెలుగా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. మీరు ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, మీరు నిజమైన అభ్యాసీ అనిపించుకుంటారు. .
దయచేసి ఈ సందేశాలన్నీ, నేనిచ్చిన మూడు చిట్కాలనూ బాగా చదివినప్పుడు, సంస్కారాలను ఎలా నిర్మూలించుకోవాలో, అసలు సంస్కారాలనే ఏర్పరచుకోకుండా ఎలా జీవించాలో, తద్వారా అంతరంగ అభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకుంటారు.
‘నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా’ అని తరచుగా ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇంగ్లీష్ లో ఐదు ‘సి’ లను గుర్తు పెట్టుకోవాలి. మీరు మొదటి చక్రాన్ని దాటినప్పుడు, హృదయం సంతృప్తితో (Contentment) నిండిపోతుంది. రెండవ చక్రం లో ఆత్మ శాంతి (Calmness), దయ (Compassion) అనేది మూడో చక్రం దగ్గర, నాలుగో చక్రం వద్ద ధైర్యం (Courage), ఐదో చక్రం వద్ద పూర్తి స్పష్టత (Clarity) పొందుతాం. కనుక సంతృప్తి, ఆత్మ శాంతి, దయ, ధైర్యం ఇవన్నీ మీ హృదయంలో ఉండి స్పష్టమైన మనసు తో మీరు పనులు చేస్తున్నప్పుడు, మీరు పురోభివృద్ధి చెందుతున్నట్లే. ఏ ఒక్క ‘సి’ అయినా లోపిస్తే, మనం ఈ ప్రపంచంలో ఇంకా ముక్తి కై కొట్టుమిట్టాడుతున్నట్లు.
అలాగే హిందీలో 5 ‘ఎస్’ లు. సంతోషం, శాంతి, స్నేహం, సాహసం, స్పష్టత… ఇవన్నీ సులభంగా గుర్తు పెట్టుకోవడానికి తెలుసుకోదగ్గ అంశాలుగా చర్చించడానికి, మాట్లాడుకోవడానికి పనికొస్తాయి. ఇంగ్లీషులో అయితే 5 ‘సి’ లు హిందీలో 5 ‘ఎస్’ లు … ఈ 5 విషయాలు సంతోషం, శాంతి, స్నేహం, సాహసం, స్పష్టత మరింత ఉన్నతంగా ఎదగడానికి ఆవశ్యకం.